తాతగారి మీద సినిమా తీస్తా..! - Sunday Magazine
close
తాతగారి మీద సినిమా తీస్తా..!

త్రిపురనేని సాయిచంద్‌... పాతతరం సినిమా పెద్దలందరికీ ‘గోపీచంద్‌గారబ్బాయి’! నిన్నటితరం స్టార్లకి ప్రియమైన ‘సాయి’. నేటితరంవాళ్లకి ‘సాయి మావయ్య’! సినిమారంగంతో ఇంతదగ్గరి సంబంధాలున్నా... తానే హీరో అయినా... ఏకంగా పాతికేళ్లపాటు ఆయన సినిమాలకి ఎందుకు దూరమైనట్టు? అంత విరామం తర్వాత కూడా ‘ఫిదా’, ‘సైరా’, ‘ఉప్పెన’, తాజాగా ‘చెక్‌’లలో చక్కటి నటనతో ఆకట్టుకోవడం ఆయనకెలా సాధ్యమైనట్టు? వీటికి జవాబు చెప్పే క్రమంలో తన జీవితాన్ని సింహావలోకనం చేసుకున్నారు సాయిచంద్‌...
నాకప్పుడు ఆరేళ్లు... ఊహ తెలియని వయసే అయినా ఆ రోజు జరిగిన సంఘటనలన్నీ స్పష్టంగా గుర్తున్నాయి. హైదరాబాద్‌ నారాయణగూడ దీపక్‌ మహల్‌ థియేటర్‌ దగ్గరున్న పార్కులో ఉండేది నేనూ మా చిన్నక్కా ఆడుకుంటూ ఉన్నాం. కాస్త చీకటి పడుతూ ఉండగా... మా పనిమనిషి పరుగెత్తుకుంటూ వచ్చి ‘మీ నాన్న చచ్చిపోయిండు’ అంది ఏడుస్తూ! చచ్చిపోవడం అంటే నాకేమీ తెలియకపోయినా... అక్కతోపాటు బిక్కమొహం వేసుకుని పనిమనిషి వెంట నడిచాను. ఇంటి ముందు నాన్న భౌతికకాయం చుట్టూ చేరి అందరూ ఏడుస్తూ ఉన్నారు. నేను అక్కడికి వెళ్లగానే ‘సాయీ... నాన్న ఇక లేడురా!’ అని అమ్మ గుండె పగిలేలా ఏడ్చింది. ఆ రోజు పగిలిన అమ్మ గుండె నాలుగేళ్ల తర్వాత శాశ్వతంగా ఆగిపోయింది! ఇది జరిగింది బెజవాడలో. మా పెద్దక్కయ్య పెళ్లి చేశారక్కడ. ఆ పనులతో అమ్మ బాగా నీరసంగా కనిపించింది. పెళ్ళికి వచ్చిన డాక్టర్‌లు ‘ఆసుపత్రిలో చేరండి... ఓసారి పరీక్షలు చేద్దాం!’ అనంటే ‘పనులున్నాయండీ... రెండు మూడ్రోజుల్లో చేరతా’ అని చెప్పిందమ్మ. ఆ రోజు రాత్రి అమ్మ పైనే చేయేసి నిద్రపోయాను. అర్ధరాత్రి హఠాత్తుగా మెలకువ వచ్చింది నాకు... అమ్మ బాగా మూలుగుతూ ఉంది. నేను తాతయ్యని లేపాను. ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు ఆ అర్ధరాత్రిపూట రిక్షాలు కూడా లేవు. పిన్నివాళ్లింట్లో కారు ఉందికానీ... వాళ్లు దూరంలో ఎక్కడో ఉంటారు. దాంతో ఆయన ఊతకర్రతో నడుచుకుంటూ పిన్నివాళ్లింటికి వెళ్లారు. కారుతెచ్చి అమ్మని ఆసుపత్రికి తీసుకెళ్లారు. అమ్మని నేను ప్రాణంతో చూడటం అదే ఆఖరు! ఆసుపత్రిలోనే కన్నుమూసిందామె. నాన్న చనిపోయినప్పుడు అంతగా తెలియని దుఃఖం అమ్మ పోయినప్పుడు నన్ను నిలువెల్లా ముంచేసింది. దహన సంస్కారాలు అయిన మరుసటి రోజు అనుకుంటాను... రాత్రి నేనూ అక్కయ్యా నిద్రపోతూ ఉన్నాం. ఎప్పుడో మెలకువ వచ్చి చూస్తే మంచం చివర అమ్మ పడుకుని ఉంది! నా ఆనందానికి అవధుల్లేవు. ఒక్క ఉదుటన వెళ్లి ‘అమ్మా...’ అని చెయ్యేస్తే ఆమె తిరిగి చూసింది. ఆమె... అమ్మ కాదు. మా ఇంటికొచ్చిన బంధువొకామె అమ్మ చీరకట్టుకుని అలా పడుకుంది! నా ఆనందం ఒక్కసారిగా ఆవిరైపోయింది... మంచంపైన కూర్చుని భోరుమన్నాను!...అమ్మా, నాన్నల మరణాలని ఇప్పుడు తలచుకున్నా పచ్చిపుండులా సలుపుతుంటుంది. కానీ ఇప్పుడు ఆలోచిస్తే ఆ తీరని ఆవేదనే నా వ్యక్తిత్వాన్ని రూపుదిద్దిందనిపిస్తోంది.
తాతయ్యే సర్వం...
నాన్న ఉన్నప్పుడే కాదు చనిపోయాక కూడా హైదరాబాద్‌లోని మా ఇంటికి ఎందరో సినీ ప్రముఖులూ, ప్రసిద్ధ రచయితలూ వస్తుండేవారు. ‘త్రిపురనేని గోపీచంద్‌- కథాచక్రవర్తి, నవలా సామ్రాట్‌, నిత్య సత్యాన్వేషి, అద్భుతమైన దర్శకుడు’ అని చెబుతుండేవారు. దాంతో నాన్న గురించి మరింతగా తెలుసుకోవాలని ఆయన రచనల్ని చదవడం మొదలుపెట్టాను.
అమ్మానాన్నలకి మేం ఐదుగురం... నేనే చివరివాణ్ణి. నేను పుట్టినప్పుడు నాన్న వయసు 46 ఏళ్లు. అప్పటికే తన తండ్రి కవిరాజు త్రిపురనేని రామస్వామి చౌదరిగారి నాస్తికవాదాన్ని వీడి... ఆస్తికత్వంవైపు చూస్తున్న ఆయన్ని నా పుట్టుక పూర్తిస్థాయి భక్తుణ్ణి చేసిందని చెబుతారు. నేను పుట్టడం తోనే ఏడవకపోవడంతో... అందరూ ఇక బతకననే అనుకున్నారట. అప్పుడు నాన్న ఇంట్లోని షిరిడీ సాయి పటం ముందుకెళ్లి ‘వీణ్ణి కాపాడితే... నీపేరే పెట్టుకుంటా!’ అని వేడుకున్నారట. ఆయన దేవుని మందిరం నుంచి బయటకొస్తుండగా నేను ఏడ్చానని చెబుతారు. దాంతో నాన్న నాకు తాతయ్య పేరూ, షిరిడీ సాయి పేరూ కలిసొచ్చేలా ‘రామకృష్ణ సాయిబాబా’ అనిపెట్టారట. నాన్న అలా భక్తిమార్గాన్ని పట్టినా దేవుణ్ణి ప్రశ్నించడం మాత్రం మానలేదన డానికి ఆయన రచనలే సాక్ష్యం. టీనేజీలోకి అడుగుపెట్టేలోపే ఆ రచనలన్నీ చదివేశాను. తల్లిదండ్రులిద్దర్నీ కోల్పోయిన మాకు మా నారయ్య తాత (అమ్మావాళ్ల నాన్న) అన్నీ తానయ్యారు. ఆయనే నన్ను రేడియో అన్నయ్య-అక్కయ్యల ఆంధ్ర బాలానందం సంఘంలో చేర్చారు. అక్కడ నేను బాలనటుణ్ణయ్యాను. ‘ఈజీ ఛైర్‌’ అనే నాటకం వేస్తే అందులో అతికష్టమైన ‘భూతవైద్యుడి’ పాత్ర పోషించి బాలభవన్‌ పోటీల్లో ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్నాను. ఆ తర్వాత దర్శకుడు సీఎస్‌ రావు ‘సతీ అరుంధతీ’ చిత్రంలో ఓ వేషమిచ్చారు. ఆ సినిమా పూర్తయ్యాక వేసవి సెలవులకని మా మావయ్య పాతూరు నాగభూషణం ఇంటికెళ్లాను. అక్కడ గోరాగారి గురుకుల బడి ‘వాసవ్య’(వాస్తవికత, సంఘదృష్టి, వ్యక్తిత్వం అని!)ని చూసి అక్కడే చదువుతానని పట్టుబట్టి మరీ చేరాను. ఆ బడి నిర్వాహకురాలిగా ఉన్న గోరాగారి కోడలు హేమలతా లవణంగారే నాన్న పేరు కలిసొచ్చేలా ‘సాయిచంద్‌’ అని నాకు కొత్తగా నామకరణం చేశారు. తాతయ్య స్వాతంత్య్ర పోరాటం కోసం రాసిన‘వీరగంధముఁ దెచ్చినారము...’ పాటని నాకు రాగయుక్తం పాడటం నేర్పారు. ఆ పాటని బడిలో నాచేతేపాడిస్తున్నప్పుడు... తాతయ్యని తలచుకుని ఉప్పొంగిపోయేవాణ్ణి. గోరాగారు నన్నందరికీ ‘కవిరాజుగారి మనవడండీ!’ అనే పరిచయం చేస్తుండేవారు. అలాంటి ఎన్నో తీపి జ్ఞాపకాలతో అక్కడ మెట్రిక్‌ ముగించాను. అక్కణ్నుంచి వస్తూ ఒకటే అనుకున్నాను ‘నాకు జన్మనిచ్చిన తండ్రి, ఆయనకి జన్మనిచ్చిన తాతయ్య కీర్తికి భంగం కలగకుండా నేను జీవించాలీ’ అని!

‘మాభూమి’తో మళ్లీ...
మా పెద్దన్నయ్య రమేశ్‌ డాక్టర్‌. అయినా ‘గోపీచంద్‌ ఆర్ట్స్‌’ పేరుతో నాటకాలు వేసేవాడు... తానూ రాసేవాడు! అంతేకాదు, జ్యోత్స్న అనే పత్రికనూ నడిపేవాడు. అలా అన్నయ్య దగ్గరకి వస్తూ ఉన్నచిత్రకారులు చంద్ర, వైకుంఠం, దర్శకుడుబి.నర్సింగరావులు నాకూ మంచిమిత్రులయ్యారు. అప్పట్లోనే బి.నర్సింగరావు తన మిత్రుడు రవీంద్రనాథ్‌తో కలిసి తెలంగాణ రైతాంగ పోరాటం ఆధారంగా ‘మా భూమి’ కథని సిద్ధం చేసుకున్నాడు. దర్శకుడిగా గౌతమ్‌ ఘోష్‌ని ఎంచుకున్నారు. రవీంద్రనాథ్‌ తమ్ముడు నారాయణరావునే ముందు కథానాయకుడిగా అనుకున్నారు. మృణాల్‌సేన్‌ తీసిన ‘ఒక ఊరి కథ’లో తనే హీరో. కాకపోతే, ఆ సినిమా అవార్డు కార్యక్రమం కోసం చెక్‌ రిపబ్లిక్‌ దేశానికెళ్లిన నారాయణరావు అక్కడ తన పాస్‌పోర్టు పోగొట్టు కోవడంతో వెంటనే తిరిగి రాలేకపోయాడు. ఈలోపు ఇక్కడ అనుకున్న షెడ్యూల్‌ ప్రకారం షూటింగ్‌ పూర్తిచేయాలని కొత్తవాళ్ల కోసం వెతుకులాట మొదలుపెట్టారు. ఎందర్ని చూసినా దర్శకుడు గౌతమ్‌ ఘోష్‌కి నచ్చలేదట. అప్పుడప్పుడూ మా ఇంటికి వస్తుండే ఆర్టిస్టు వైకుంఠం... నా పేరుని సూచించాడట. దాంతో నర్సింగరావు నాకు కబురు చేశాడు. నన్ను చూడగానే గౌతమ్‌ ‘షర్ట్‌ విప్పుతావా!’ అన్నాడు. నాకు చిరాకేసి... ‘ఎందుకు?’ అన్నాను. నర్సింగరావు ఎంతో నచ్చచెప్పాకే విప్పాను. నన్ను తేరిపార చూసిన గౌతమ్‌ కాసేపు తన గదిలోకి వెళ్లి... మళ్లీ వచ్చి ‘యూ ఆర్‌ మై హీరో’ అన్నాడు. అప్పట్లో ఫక్తు కాలేజీ కుర్రాడిగా చాలా స్టైలిష్‌గా ఉండే నేను- ఒకనాటి తెలంగాణ రైతుబిడ్డగా కనిపించడం సాధ్యమేనా అనిపించి భయపడ్డాను. కానీ గౌతమ్‌ ఘోష్‌ నన్ను నేను ‘రామయ్య’ పాత్రగా మలచుకోవడానికి ఎంతో సాయపడ్డాడు. ఆ సినిమా కోసం రెండేళ్లు శ్రమించాను. రిలీజయ్యాక ఒక్క మన రాష్ట్రంలోనే కాదు, దేేశవిదేశాల నుంచి ప్రశంసలు అందుకున్నాను. ఆ సినిమా కమర్షియల్‌గానూ హిట్టు కావడంతో నన్ను ‘మంచుపల్లకి’ చిత్రం హీరోల్లో ఒకరిగా ఎంచుకున్నారు. చిరంజీవి అందులో ప్రధాన హీరో! డ్యాన్సు రాని నాకు స్టెప్పులు నేర్పింది కూడా తనే! రైతు సమస్యలపైన నాన్న రచనలూ, సంఘ సంస్కరణపైన తాత వాదనలూ చదువుతూ పెరిగినందు వల్లనేమో ఆ తర్వాత కమర్షియల్‌సినిమాల హీరోగా చేయడానికి మనస్కరించలేదు. ప్రజాసమస్యల్ని స్పృశించిన ‘ఈ చరిత్ర ఏ సిరాతో!’, ‘ఈ చదువులు మాకొద్దు’ వంటి సినిమాలే చేశాను. ఓ దశలో అది కూడా రొటీన్‌గానే అనిపించింది. దూరదర్శన్‌ అప్పుడప్పుడే స్పాన్సర్డ్‌ ప్రోగ్రామ్‌ల పేరుతో నాణ్యమైన కార్యక్రమాలని నిర్మించడం మొదలుపెట్టింది. అప్పుడే కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అందుకున్న నాన్న నవల ‘పండిత పరమేశ్వరశాస్త్రి వీలునామా’ని టెలి-ఫిల్మ్‌గా తీయాలనిపించింది. ఆ ప్రతిపాదనతో దూరదర్శన్‌ని సంప్రదిస్తే వెంటనే ఓకే చెప్పారు కానీ అప్పట్లో తెలుగు సినిమా ‘టాకీ’కి 60 ఏళ్ల సందర్భంగా దాని కోసం ఓ డాక్యు-సిరీస్‌ చేసిపెట్టమని అడిగారు. దానికోసం తొలిసారి దర్శకుణ్ణయ్యాను!
ఆణిముత్యాలవి..
ఎల్వీప్రసాద్‌తో మొదలుపెట్టి నాటి సినీప్రముఖుల్ని ఇంటర్వ్యూ చేసి... తెలుగు సినిమా చరిత్రని వివరిస్తూ నేను చేసిన ‘సినిమా-సినిమా’ అనే కార్యక్రమం అద్భుతమైన ఆదరణ పొందింది. ఇండియన్‌ మార్కెటింగ్‌ రిసెర్చ్‌ బ్యూరో సర్వేలో టాప్‌-రేటెడ్‌ కార్యక్రమంగా నిలిచింది. అది పూర్తికాగానే నాన్నగారి నవలని టెలి-ఫిల్మ్‌గా తీశాను. ‘గోపీచంద్‌-ఏ హంబుల్‌ కొలాసస్‌’ పేరుతో డాక్యుమెంటరీ కూడా నిర్మించాను. అక్కడితో ఆగలేదు, నాన్నగారి కథల్ని హిందీలో ‘గోపిచంద్‌ కీ అమర్‌ కహాఁనియా’ పేరుతో సీరియల్‌గా తీశాను. అప్పట్లో ఈటీవీ కోసం పాత తెలుగు చిత్రాలపైన ఓ కార్యక్రమం చేసిపెట్టమన్నారు సుమన్‌గారు. అలా 52 వారాలపాటు చేసిన ‘ఆణిముత్యాలు’ కార్యక్రమం కూడా మంచి ప్రశంసలు అందుకుంది. ఆ తర్వాత పూర్తిగా డాక్యుమెంటరీలూ, టెలిఫిల్మ్‌లపైనే దృష్టిపెట్టాను. చూస్తుండగానే పాతికేళ్లు గడిచిపోయాయి...
‘ఫిదా’ కోసం...
అది నా 60వ పుట్టినరోజు. ఉదయం నుంచీ నాకొచ్చిన మెసేజ్‌లలో దర్శకుడు శేఖర్‌ కమ్ములదీ ఉంది... ‘తెలంగాణ బేస్డ్‌గా ఓ సినిమా తీస్తున్నాం. తండ్రి పాత్ర చేస్తారా!’ అని అడిగారాయన. ‘నో’ చెబుదామనే అనుకున్నాను కానీ... ‘పుట్టినరోజున వచ్చిన మెసేజ్‌ కదా!’ అనిపించి వెళ్లి ఆయన్ని కలిశాను. వెళ్లాక ఆయన చెప్పిన కథ నచ్చి మళ్లీ మేకప్‌ వేసుకున్నాను. ‘ఫిదా’ హిట్టుతో చిరంజీవి, ‘ఎలాగూ మళ్లీ వచ్చావుగదా... ‘సైరాలోనూ చెయ్‌’ అన్నారు. ఆ తర్వాత నాకు వైవిధ్యంగా అనిపించిన ‘ఉప్పెన’లోనూ, ‘చెక్‌’లోనూ నటించాను. నిజానికి ఇప్పుడొస్తున్న కొత్తతరహా సినిమాల్ని చూస్తుంటే నాకెంతో ఉత్సాహంగా ఉంది. ఆ ఉత్సాహంతోనే తాతగారు రామస్వామి చౌదరిపైన బయోపిక్‌ తీయడానికి ప్లాన్‌ చేస్తున్నాను. తెలుగుజాతి గర్వించే గొప్ప సినిమా అవుతుందది!


అందుకే పెళ్లిచేసుకోలా...

అమ్మ చనిపోయిన బాధ నన్ను చాలా రోజులు వెన్నాడింది. చిన్నప్పుడు ‘సతీ అరుంధతి’ సినిమాలో నటించానని చెప్పాను కదా అందులో జమునగారిని చూసి ‘అమ్మా! నన్ను విడిచి వెళ్లి పోతున్నావా!’ అనే డైలాగ్‌ చెప్పాలి. అది చెప్పేటప్పుడు నిజంగానే ఉద్వేగానికి గురై ఆమె చేతులపైన పడి భోరు మన్నాను! ‘మంచుపల్లకి’లో నాది తల్లి లేకుండా తండ్రిపెంపకంలో పెరిగిన యువకుడి పాత్ర. ఓ సీన్‌లో తండ్రిపైన కోపంతో బయటకొచ్చి బైకుమీద హీరోయిన్‌ సుహాసిని ఇంటిచుట్టూ రౌండ్స్‌ కొడుతూ ఉంటాను. అప్పుడు సుహాసిని వచ్చి ఆపితే ‘అమ్మ గుర్తు కొస్తోంది గీతా!’ అని చెప్పే సీన్‌ ఉంటుంది. అప్పుడూ అంతే, నిజంగానే కన్నీళ్లు పెట్టేశాను. ఈ బాధని మరచి పోవాలనేమో నాపైన ఏ కాస్త ఆత్మీయత చూపిన స్త్రీనైనా అమ్మా అక్కా చెల్లీ అంటూ వరసలు కలిపేస్తుంటాను.ఆత్మీయతలు కలబోస్తుంటాను. మహిళల్ని ఆ రకంగా తప్ప మరోలా చూడలేక పోవడం వల్లనేమో నేను పెళ్ళిచేసుకోలేదు! మా అక్కయ్య ఉమ్మడికుటుంబంలో నేనూ భాగం కావడం వల్ల ఆమె పిల్లలూ, మనవరాళ్ల ముచ్చట్లతో నన్నెప్పుడూ ఒంటరితనం పీడించలేదు!

Advertisement

Tags :

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న