ఆ గాలి... చంపేస్తుంది..! - Sunday Magazine
close

ఆ గాలి... చంపేస్తుంది..!

ఇప్పుడంటే కరోనా భయానికి అందరమూ మాస్కులు ధరిస్తున్నాం కానీ ఈ వైరస్‌ రాకముందు కూడా కొందరు తప్పనిసరిగా మాస్కు ధరించే ఇంట్లోనుంచి బయటకు వచ్చేవారు. వాళ్లు... మన దేశ రాజధానిలో నివసించే పౌరులు. ప్రపంచ ఆరోగ్యసంస్థ ప్రమాణాలకు పది రెట్లు ఎక్కువ కాలుష్యం ఉన్నచోట నివసిస్తున్నప్పుడు ఆమాత్రం జాగ్రత్త పడక తప్పదు కదా. కరోనా వల్ల గత పద్నాలుగు నెలల్లో దేశంలో దాదాపు మూడు లక్షలమంది ప్రాణాలు కోల్పోయారు. కానీ వాయుకాలుష్యం కారణంగా ఏటా పది లక్షల మందికి పైనే చనిపోతున్నారని లాన్సెట్‌ రాసింది. వైరస్‌కి భయపడుతున్నాం కానీ అంతకన్నా భయంకరమైన వాయుకాలుష్యంతో సహజీవనం చేస్తున్నాం. దిల్లీ ఒక్కటే కాదు, ప్రపంచంలోని అత్యంత కలుషిత నగరాలు మొదటి ముప్పైలో 22 మనవే.
పచ్చని చెట్లు వింజామర వీస్తున్నట్లు చల్లని గాలి తెరలు తెరలుగా వస్తుంటే పగలంతా పనిచేసి అలసిన మనిషి ఆరుబయటే హాయిగా నిద్రపోయేవాడు. ఫ్యాన్లూ ఏసీలూ ఎరగని రోజులే కాదు, గాలిలో ఎలాంటి విషాలూ లేని రోజులవి!
ఇప్పుడు కూడా కిటికీలు తీస్తే గాలి రివ్వుమంటూ లోపలికి దూసుకొస్తుంది. కాకపోతే తనతోపాటు ఇంకా చాలా మోసుకొస్తుంది.దుమ్మూధూళీ అని మనం అనుకుంటాం కానీ అందులో కొన్ని వందల
విషవాయువులూ రసాయనాలూ కలిసిపోయి గాలికే భారమవుతున్నాయి. పల్లెలు పట్టణాలుగా పట్టణాలు నగరాలుగా మారే క్రమంలో మనిషి సాధించిన ప్రగతి తాలూకు ఆనవాళ్లన్నీ కంటికి కనిపించని అణువులుగా మారి, గాలి ద్వారా మనలోకి దూరి సృష్టిస్తున్న కల్లోలం ఇంతాఅంతా కాదు. దీనికే శాస్త్రవేత్తలు ‘వాయుకాలుష్యం’ అని పేరు పెట్టారు.


గాలి... కాలుష్యాల సంగమం

స్వచ్ఛమైన గాలిలో ఆక్సిజన్‌, నైట్రోజన్‌తో పాటు చాలా కొద్దిమొత్తంలో కార్బన్‌ డైఆక్సైడ్‌, మీథేన్‌, ఓజోన్‌, నీటిఆవిరి లాంటివన్నీ కలిసి ఉంటాయి. కానీ ఇప్పుడు మనచుట్టూ ఉండే గాలిలో సల్ఫర్‌ డైఆక్సైడ్‌, నైట్రోజన్‌ డైఆక్సైడ్‌, కార్బన్‌ మోనాక్సైడ్‌, పార్టిక్యులేట్‌ మ్యాటర్‌ లాంటివెన్నో ఉంటున్నాయి. ఇవన్నీ కలవడానికి కారణం- మన జీవన విధానమే. 50శాతానికి పైగా పరిశ్రమల నుంచి, 27 శాతం వాహనాల నుంచి, 17 శాతం పంటలూ చెత్తాలాంటివి తగలబెట్టడం వల్ల, మరో 7 శాతం కట్టెల పొయ్యి, ఎరువుల వాడకం, భవన నిర్మాణాలు, బట్టీల్లో ఇటుక కాల్చడం, గనుల తవ్వకం, బొగ్గు వాడకం... లాంటి వాటివల్ల వస్తోంది. ఈ చర్యల వల్ల విషవాయువులు, మసి, దుమ్ములాంటివి గాలిలో కలుస్తాయి. అలా గాలిలో కలిసిన ఇవన్నీ కంటికి కనిపించని చిన్న చిన్న కణాలుగా తయారవుతున్నాయి. శ్వాస ద్వారా శరీరం లోపలికి ప్రవేశిస్తున్నాయి. ఆరోగ్యానికే ఎసరు పెడుతున్నాయి.


ఇలా కొలుస్తారు..!

మనం పీల్చే గాలి స్వచ్ఛమైనదా కలుషితమైనదా అని తెలుసుకోవటానికి రకరకాల పరికరాలను తయారుచేశారు శాస్త్రవేత్తలు. వాటి ఆధారంగా గాలి నాణ్యతను ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. మనం ఊపిరి తీసుకున్నప్పుడు గాలితో పాటు లోపలికి వెళ్లే సూక్ష్మకణాల్లాంటి ‘పార్టిక్యులేట్‌ మ్యాటర్‌’ (పీఎం)తోనే ఇబ్బందులన్నీ. మనిషి వెంట్రుక మందంలో ముప్పయ్యో వంతుకన్నా చిన్నగా, రెండున్నర మైక్రాన్లకన్నా తక్కువ ఉండేవాటిని పీఎం2.5 అని వ్యవహరిస్తారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం ఘనపు మీటరు పరిమాణపు గాలిలో 10 మైక్రోగ్రాముల వరకూ మాత్రమే ఈ పీఎం2.5 ఉండవచ్చు. అంతకన్నా పెరిగితే కాలుష్యం కిందే లెక్క. గత ఏడాది దిల్లీలో దీని సగటు 84.1. ఏడాది సగటు 90కన్నా ఎక్కువ నమోదవగా వరసగా మూడేళ్లు ప్రపంచంలో మొదటి స్థానంలో ఉంది దిల్లీ. పీఎం2.5తో పాటు భూవాతావరణంలో ఓజోన్‌, కార్బన్‌ మోనాక్సైడ్‌, సల్ఫర్‌ డైఆక్సైడ్‌, నైట్రోజన్‌ డైఆక్సైడ్‌ల స్థాయులను కూడా లెక్కించి గాలి నాణ్యతని అంచనా వేస్తారు. సున్నా నుంచి 500 వరకు ఉండే ఈ స్కేలులో 50లోపల ఉంటే బాగున్నట్లు. వంద వరకూ పర్వాలేదు. అది దాటిందంటే కాస్త బలహీనంగా ఉండేవారికి సమస్యలు
మొదలవుతాయి. అక్కడినుంచి ప్రమాదం స్థాయి పెరుగుతూ పోతుంది. దిల్లీలో 2016 నవంబరులో అత్యధికంగా 999 నమోదైంది.


గాలికీ గుండెకీ కరోనాకీ... లింకు

ఒకప్పుడు క్షయవ్యాధి సోకినవారిని కొండప్రాంతాల్లో బస చేయించేవారు. అక్కడ వీచే స్వచ్ఛమైన గాలి వల్ల ఊపిరితిత్తులు నెమ్మదిగా కోలుకుంటాయని. రాను రాను నగరాలూ పట్టణాలూ అని లేకుండా అన్నిచోట్లా గాలి నాణ్యత తగ్గడాన్నీ దాని ప్రభావం ఆరోగ్యం మీద పడటాన్నీ గుర్తించారు శాస్త్రవేత్తలు. ప్రపంచంలోని అత్యంత కలుషిత నగరాల్లో ఒకటిగా నిలుస్తున్న దిల్లీలో ఆరోగ్యానికి ప్రమాదం ఏ స్థాయిలో ఉందో చెప్పడానికి వారో పోలిక వాడారు. దిల్లీలో మామూలుగా గాలి పీల్చుకుంటే చాలు రోజుకి 44 సిగరెట్లు తాగడంతో సమానం అని. పొగతాగడం కాదు, శ్వాస తీసుకోవటమే ఆరోగ్యానికి హానికరంగా మారుతోందన్న మాట. ఇక ఆ గాలిలో ఉండే పీఎం2.5 వల్ల శ్వాససంబంధ వ్యాధులే కాక గుండె పనితీరూ దెబ్బతింటోంది. బ్రసెల్స్‌కి చెందిన కార్డియాలజిస్టు డాక్టర్‌ జీన్‌ ఫ్రాంకోస్‌ 16 వేలమందితో ఒక పరిశోధన చేశారు. వారిని బృందాలుగా విడదీసి శుభ్రమైన గాలి, వివిధ కలుషితాలతో ఉన్న గాలి... పీల్చుకున్నవారిని పరిశీలించారు. గుండెజబ్బులకు కొలెస్ట్రాల్‌, వ్యాయామం లాంటివాటితో ఎలాగైతే నేరుగా సంబంధం ఉందో అలాగే గాలిలోని కాలుష్యాలతోనూ సంబంధం ఉందని ఆయన నిరూపించారు.
హార్వర్డ్‌ పబ్లిక్‌ హెల్త్‌ ప్రొఫెసర్‌ అయిన ఫ్రాన్సెస్కా డొమినిసి 2000 సంవత్సరం నుంచి కొన్ని కోట్లమంది అమెరికన్ల డేటాను సేకరించారు. వారి ఆరోగ్య వివరాలతోపాటు నివసించే ప్రాంతాల్లో కాలుష్యం స్థాయుల్నీ నమోదుచేశారు. దాదాపు 17ఏళ్లపాటు సేకరించిన డేటా ఆధారంగా ఆమె రూపొందించిన నివేదిక వాయుకాలుష్యం వల్ల మన ఊహకందని వ్యాధులెన్నో వస్తున్నాయని పేర్కొంది. కిడ్నీ ఫెయిల్యూర్‌, రక్తం విషతుల్యమై శరీర భాగాలన్నిటికీ వ్యాపించడం లాంటి కేసులు కాలుష్యం పెరిగిన ప్రతిసారీ
ఆస్పత్రుల్లో నమోదైనట్లు నిదర్శనలు చూపించింది. అంతేకాదు, ఈ కాలుష్యం వల్ల వ్యాధినిరోధక శక్తి తగ్గుతోందని గమనించిన ఆమె దాని ప్రభావం వల్ల కరోనా మరణాలు పెరిగే అవకాశం ఉందనీ భావించారు. ఆ దిశగానూ అధ్యయనం చేసి వాయుకాలుష్యమే లేకపోతే అమెరికాలో 15 శాతం, దక్షిణాసియాలో 27 శాతం కరోనా మరణాలను తగ్గించగలిగేవాళ్లమని తేల్చిచెప్పారు.


ఆరోగ్యం... హారతి కర్పూరం

నిండా నలభయ్యేళ్లన్నా లేనివారికి హార్ట్‌ ఎటాక్‌లూ పాతికేళ్ల వారికి క్యాన్సర్లూ వస్తున్న సంగతి తరచూ చూస్తూనే ఉన్నాం. ఆ జబ్బులకు కారణాలేవీ వారిలో కనపడకపోయినా అలా ఎందుకొస్తున్నాయన్న ప్రశ్న వైద్యులను ఎప్పటినుంచో వేధిస్తోంది. ఆ అకాల మరణాలకు కాలుష్యం తప్ప మరో కారణమేదీ లేదని ఇప్పుడు తేల్చిచెబుతున్నారు వైద్యులందరూ. లేత గులాబీరంగులో ఉన్న ఆరోగ్యకరమైన ఊపిరితిత్తుల్ని చూసి ఎన్నేళ్లయిందో... అంటారు దిల్లీలో లంగ్‌కేర్‌ ఫౌండేషన్‌ని నిర్వహిస్తున్న డాక్టర్‌
అరవింద్‌ కుమార్‌. గుండె శస్త్రచికిత్సల్లో నిపుణుడైన ఆయన వాయుకాలుష్యం గురించి ప్రజల్లో చైతన్యం తేవడానికి కృషి చేస్తున్నారు. గాలి ద్వారా శరీరంలోకి వెళ్లే పీఎం2.5 కణాలు రక్తంలో తేలిగ్గా కలిసిపోతాయి. వాటిల్లోనూ అత్యంత సూక్ష్మమైనవి గుండె, మెదడు, ప్లాసెంటాలలోకి చొచ్చుకుని పోయి పలురకాల సమస్యలకు కారణమవుతున్నాయట. వీటివల్ల...
* మెదడు పనితీరు మందగిస్తుంది. జ్ఞాపకశక్తి తగ్గి ఆల్జీమర్స్‌ లాంటి వ్యాధులు వస్తాయి.
* నాడీ వ్యవస్థ దెబ్బతిని పార్కిన్‌సన్స్‌ వంటి సమస్యలు రావచ్చు.
* గుండెకు సంబంధించి కరోనరీ ఆర్టెరీ డిసీజ్‌, హార్ట్‌ ఎటాక్‌, స్ట్రోక్‌, రక్తం గడ్డకట్టడం లాంటివి జరుగుతాయి.
* శ్వాసవ్యవస్థ దెబ్బతిని క్రానిక్‌ అబ్‌స్ట్రక్టివ్‌ పల్మనరీ డిసీజ్‌(సీఓపీడీ), ఆస్థమా, ఊపిరితిత్తుల క్యాన్సర్‌ లాంటి జబ్బులు వస్తున్నాయి.
* మూత్రపిండాల పనితీరు పూర్తిగా విఫలమవుతోంది.
* సంతాన సాఫల్యత తగ్గడం, గర్భస్రావాలు, నెలలు నిండకుండానే కాన్పులు, పిల్లలు తక్కువ బరువుతో పుట్టడం... జరుగుతోంది.
మొదటినుంచి అనుకుంటున్నట్లుగా కాలుష్యం ఒక స్థాయి వరకూ పర్వాలేదన్నది కూడా ఒట్టిమాటేననీ ఎంత తక్కువ కాలుష్యం ఉన్నా దాని ప్రభావం ఆరోగ్యం మీద పడుతోందనీ పలు పరిశోధనలు తేల్చి చెప్పాయి. యూనివర్సిటీ ఆఫ్‌ ఇల్లినాయ్‌కి చెందిన పల్మనరీ మెడిసిన్‌ ప్రొఫెసర్‌ డీన్‌ ష్రాఫ్‌నాగెల్‌ ఇప్పటివరకూ జరిపిన అధ్యయనాలన్నిటినీ క్రోడీకరించి వెలువరించిన నివేదిక ప్రకారం మనుషులకు వస్తున్న సమస్త రోగాలకూ కాలుష్యంతో సంబంధం ఉంది. ఆఖరికి పిల్లల్లో ఎదుగుదల లోపాలకు కూడా.


నష్టం... నష్టం...

జ్వరమో జలుబో వస్తే ఓ వారం సెలవు పెడతాం. డాక్టరుకు చూపించుకుని మందులు వాడి, తగ్గాక పనులు చేసుకుంటాం. సెలవూ డాక్టరు ఫీజూ మందుల ఖర్చూ మాత్రమే మనకు తెలిసిన నష్టం. తీవ్ర అనారోగ్యమైతే ప్రాణనష్టం జరగొచ్చు. కానీ నిజానికి అనారోగ్యానికి చాలా కోణాలున్నాయి. దానివల్ల ఆస్పత్రులూ వైద్యసిబ్బందిపైన భారం పెరుగుతుంది. కార్యాలయాల్లో పనీ కర్మాగారాల్లో ఉత్పత్తీ తగ్గుతాయి. మొత్తంగా దేశ ఆర్థికవ్యవస్థకే నష్టం వాటిల్లుతుంది.
బెంగళూరులో దీనిపై ఒక పరిశోధన జరిగింది. సాధారణంగా వాయుకాలుష్యం ప్రభావం శీతాకాలంలో ఎక్కువగా ఉంటుంది. అందుకని ఒక ఏడాది నవంబరు, డిసెంబరు, జనవరి నెలల్లో అక్కడి వైట్‌ఫీల్డ్‌ ప్రాంతంలోని కార్యాలయాల్లో మిగతా నెలలకన్నా ఉద్యోగుల హాజరు 12 శాతం తక్కువ నమోదైంది. పీఎం2.5 స్థాయి పది పాయింట్లు పెరిగినప్పుడల్లా ఉద్యోగుల హాజరు 4శాతం తగ్గుతున్నట్లు గుర్తించారు. ఇక, దేశవ్యాప్తంగా దీని ప్రభావం చూస్తే...
* గత ఏడాది లాన్సెట్‌ ప్రచురించిన నివేదిక ప్రకారం- 2019లో మనదేశంలో వాయుకాలుష్యం వల్ల 16లక్షల మంది మరణించారు. అంటే మొత్తం మరణాల్లో దాదాపు 18శాతం. అందరూ 70ఏళ్ల లోపువాళ్లే. దీనివల్ల ఆర్థిక వ్యవస్థకి రెండు లక్షల 70 వేల కోట్ల నష్టం వాటిల్లింది.
* ఇండియన్‌ స్టాటిస్టికల్‌ ఇన్‌స్టిట్యూట్‌ అధ్యయనం ప్రకారం వాయుకాలుష్యమే లేకపోతే దేశానికి ఏడాదికి 20నుంచి 30వేల కోట్ల ఆదాయం పెరిగేది. అంతేకాదు, ప్రజల సగటు ఆయుర్దాయమూ ఏడాదిన్నరకన్నా ఎక్కువే పెరిగేదట.


ప్రమాదకర నగరాలివే!

స్విట్జర్లాండ్‌కి చెందిన ఐక్యూఎయిర్‌ అనే సంస్థ ఏటా ప్రపంచ వాయు నాణ్యత నివేదికని వెలువరిస్తుంటుంది. ఆయా ప్రాంతాల్లోని పీఎం2.5 సగటు స్థాయుల్ని పరిగణనలోకి తీసుకునే ఈ నివేదిక ప్రకారం వాయుకాలుష్యంలో మొదటి 15 నగరాల్లో ఒక్కటి మాత్రమే చైనాలో ఉంది. మిగిలిన వాటిల్లో 9 మనదేశంలోనూ 5 పాకిస్థాన్‌లోనూ ఉన్నాయి. ఈ నగరాల్లో ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాల కన్నా సగటున 500శాతం ఎక్కువ కాలుష్యం నమోదవుతోంది.


తగ్గించవచ్చు!

కెనడా, న్యూజిలాండ్‌, ఫిన్లాండ్‌ లాంటి దేశాల్లో అయితే ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాలను బట్టి చూస్తే వాయు కాలుష్యం దాదాపు సున్నా. ప్రజారోగ్య పరిరక్షణకీ పర్యావరణ సంరక్షణకీ పలు కోణాల్లో అవి చేపడుతున్న చర్యలే అందుకు కారణం. ఇక సమస్య తీవ్రంగా ఉన్నా దాన్ని తగ్గించుకోవటానికి పలు దేశాలు విధానాలను మార్చుకుంటున్నాయి, సాంకేతికత సాయం తీసుకుంటున్నాయి.
* పరిశ్రమల మీద ఆంక్షలు విధించి డీజిల్‌ వాహనాలని కట్టడి చేయడమే కాక కాలుష్యాలను తగ్గించే రకరకాల ఫిల్టర్ల వాడకాన్ని తప్పనిసరి చేయడంతో జపాన్‌లో కాలుష్యం 52 నుంచి 7శాతానికి తగ్గింది.
* యూరప్‌ దేశాలన్నీ కలిసికట్టుగానూ విడివిడిగానూ కాలుష్యాలను తగ్గించడానికి ఒక క్రమపద్ధతిలో పనిచేశాయి. ఓజోన్‌, బ్యుటాడియెన్‌ మీద ఇంగ్లాండ్‌, నైట్రేట్స్‌, సల్ఫేట్స్‌ మీద జర్మనీ,  నైట్రోజన్‌, పీఎం10 స్థాయుల మీద ఆస్ట్రియా... కృషిచేయగా మొత్తంగా ఖండం అంతటా పీఎం2.5 సురక్షిత స్థాయికి వచ్చేసింది.
* చైనా ప్రత్యామ్నాయ వనరుల మీద దృష్టి పెట్టింది. సౌరవిద్యుత్‌ మీద ప్రపంచం పెడుతున్న ఖర్చులో దాదాపు సగం వాటా ఈ దేశానిదే. భవనాల్లో మొక్కలు పెంచి వర్టికల్‌ ఫారెస్టులుగా తీర్చిదిద్దింది. ఆ మొక్కలు ఏడాదికి 25 టన్నుల కార్బన్‌ డైఆక్సైడ్‌ని పీల్చుకుని రోజుకు 60కిలోల ప్రాణవాయువుని ఇస్తాయట. ప్రపంచంలోనే అతి పెద్ద స్మాగ్‌ టవర్‌ని కూడా నిర్మించింది చైనా. ఈ టవర్‌ రోజుకు 75మిలియన్‌ క్యూబిక్‌ మీటర్ల గాలిని శుభ్రం చేస్తుంది.
* కార్ల వాడకాన్ని తగ్గించడానికి ప్రజారవాణాని ఉచితం చేసింది ఫ్రాన్స్‌. కోపెన్‌హాగన్‌ అయితే ‘సైకిల్‌ సిటీ’గా మారిపోయింది. స్విట్జర్లాండ్‌లోని జ్యురిచ్‌ నగరంలో రోజులో ఏ సమయంలో చూసినా పరిమిత సంఖ్యకు మించి కార్లు రోడ్డు మీద ఉండటానికి వీల్లేదు. కాలుష్యానికి సంబంధించిన కేసుల్ని పరిష్కరించడానికి పెరు దేశం ప్రత్యేకంగా ఎన్విరాన్‌మెంటల్‌ కోర్టు పెడితే టునీషియా ‘గ్రీన్‌ పోలీస్‌’
అనే ప్రత్యేక దళాన్నే నియమించింది.


మరణాలు లక్షల్లో...

ఏటా ప్రపంచవ్యాప్తంగా సంభవించే మరణాల్లో వాయుకాలుష్యానిది నాలుగో స్థానం. గుండెపోటు, పొగాకు వాడకం, ఆహార సమస్యల తర్వాత స్థానం దీనిదే. 2019లో వివిధ దేశాల్లో వాయుకాలుష్యం వల్ల సంభవించిన మరణాల సంఖ్య.


దక్షిణాదీ తక్కువ కాదు..!

ఎయిర్‌క్వాలిటీ ఇండెక్స్‌లో ఉత్తరాది నగరాలన్నీ ఎప్పుడూ 200లకు అటూఇటూగానే ఉంటున్నాయి. అలాగని దక్షిణాది నగరాలేం వెనకబడలేదు. సెంటర్‌ ఫర్‌ సైన్స్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంట్‌ గత ఏడాది దేశంలోని 21 నగరాల్లో వాయుకాలుష్యం పరిస్థితులపై అధ్యయనం చేయగా దక్షిణాది రాష్ట్రాల పరిస్థితీ అంత గొప్పగా ఏమీ లేదని తేలింది. మామూలు సమయంలో ఒక మోస్తరుగా ఉన్నా శీతాకాలంలో కాలుష్యం ఎన్నో రెట్లు పెరుగుతోంది.
* లాక్‌డౌన్‌ రెండు నెలలూ నగరాలన్నీ శుభ్రంగా ఉన్నప్పటికీ అక్టోబరుకల్లా సగటు కన్నా హైదరాబాదులో ఏడురెట్లు, కోచిలో ఐదు రెట్లు, బెంగళూరులో మూడు రెట్లు కాలుష్యం పెరిగింది. విశాఖపట్నంతో సహా ఏపీలోని ప్రధాన పట్టణాలన్నిటిలోనూ పీఎం2.5 సగటు వందకి పైనే ఉంది.
* దక్షిణాది రాష్ట్రాల్లో వాయు కాలుష్యానికి ప్రధాన కారణం వాహనాలు.
* కర్ణాటక ఆరోగ్యపరంగా ఎక్కువ సమస్యలను ఎదుర్కొంటోంది.
* దక్షిణాన కర్ణాటకలోని మైసూరు, ఉత్తరాన మధ్యప్రదేశ్‌లోని సాత్నా... వాయుకాలుష్యం లేని నగరాలుగా నమోదయ్యాయి.


వాయు కాలుష్యానికి ఒకటీ రెండూ కాదు- పల్లెల్లో కట్టెల పొయ్యి నుంచి పట్టణాల్లో వాహనాల వరకూ... వీధి చివర చెత్త తగలబెట్టడం నుంచి కొండల్లో గనుల తవ్వకం వరకూ... ఎన్నో కారణాలు. వాటన్నిటి వెనకాల ఉన్న ప్రభుత్వాలు కావచ్చు, సంస్థలు కావచ్చు, వ్యక్తులు కావచ్చు... ఎవరు బాధ్యతారహితంగా ప్రవర్తించినా దాని ఫలితం మొత్తం సమాజం అనుభవించాల్సి వస్తుంది. అందుకే, తప్పెవరిదైనా ఎక్కడ జరుగుతున్నా... ఆపడం అందరి అవసరం. అప్పుడే మనమూ బాగుంటాం... మన బిడ్డలూ బాగుంటారు..!


Tags :

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న