ఆల్జీమర్స్‌రాకుండా..! - Sunday Magazine
close

ఆల్జీమర్స్‌రాకుండా..!

న్యుపరంగా ఆల్జీమర్స్‌, డిమెన్షియా... వంటివి వచ్చే అవకాశం ఉన్నప్పటికీ ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవరచుకుంటే ఎనభయ్యేళ్ల వయసులోనూఆలోచనాశక్తి తగ్గదనీ మతిమరపు కూడా రాదనీ పేర్కొంటున్నారు చైనాలోని డ్యూక్‌ కున్‌షన్‌యూనివర్సిటీ నిపుణులు. ఎపిఓఇ అనే జన్యువు వల్ల చాలామంది వృద్ధాప్యంలో ఆల్జీమర్స్‌కి గురవుతున్నారని గతకాలపు పరిశోధనల్లోనే స్పష్టమైంది. అలాగే ధూమపానం కూడా వృద్ధాప్యంలో మెదడుమీద ప్రభావాన్ని కనబరుస్తుందని గ్రహించారు. అయితే ఆల్జీమర్స్‌కి కారణమైన ఏపీఓఈ జన్యువు ఆరోగ్యకరమైన జీవనశైలి ఉన్నవాళ్ల మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుందనేది ఇంతవరకూ తెలియలేదు. అందుకే ఈ శాస్త్రబృందం ఈ జన్యువు ఉన్న సుమారు ఆరు వేలమంది వృద్ధుల్ని ఎంపికచేసి వాళ్ల జీవనశైలినీ మెదడు పనితీరునీ గమనించారట. అందులో అనారోగ్యకరమైన జీవనశైలి ఉన్నవాళ్లతో పోలిస్తే, సమతులాహారంతో శారీరకంగానూ మానసికంగానూ ఆరోగ్యంగా జీవించే వాళ్లలో మతిమరపు తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. అంతేకాదు, తామింకా చిన్న వాళ్లమే, వయసు మీదపడలేదు అనుకుంటూ హుషారుగా ఉండేవాళ్లలో ఒత్తిడి,ఇన్‌ఫ్లమేషన్‌... వంటి సమస్యలు కూడా తక్కువగా ఉన్నాయట. అలా కాకుండా తమకు వయసైపోయిందనీ ఏ పనీ చేయలేమనీ అనుకునేవాళ్లలో నిజంగానే ఆలోచనాశక్తి పోవడమే కాదు, త్వరగానూ మృతి చెందుతున్నారని గుర్తించారు. కాబట్టి ఆరోగ్యకరమైన అలవాట్లతోపాటు వృద్ధాప్యం వయసుకేగానీ మనసుకి కాదు అని నమ్మేవాళ్లు ఎలాంటి మతిమరపూ లేకుండా చివరి వరకూ చురుగ్గా ఉంటారన్నమాట.

బీపీ కూడా తగ్గుతుందా?!

‘కొండనాలుక్కి మందేస్తే ఉన్న నాలుక ఊడింద’నేది ఓ సామెత. కానీ ఒక జబ్బుని తగ్గించుకోగలిగితే రెండో జబ్బూ తగ్గిపోతుంది అనేది తాజా పరిశోధన. మధుమేహాన్ని తగ్గించుకునేందుకు సరైన ఆహారాన్ని తీసుకుంటూ బరువు తగ్గితే ఆ వ్యాధితోపాటు బీపీ కూడా తగ్గుతుంది అంటున్నారు గ్లాస్‌గో, న్యూ కాజెల్‌ విశ్వవిద్యాలయ పరిశోధకులు. ఇందుకోసం వీళ్లు అధిక బరువు ఉన్న మధుమేహ రోగులకి పన్నెండు వారాలపాటు తక్కువ క్యాలరీలు ఉండే సూపులూ షేక్‌లతో కూడిన పోషకాహారాన్ని ఇచ్చారట. దాంతో వాళ్లు దాదాపు 15 కిలోలు బరువు తగ్గడమే కాదు, డయాబెటిస్‌, అధిక రక్తపోటు కూడా అదుపులోకి వచ్చిందట. ఆ తరవాతా వాళ్లు బరువు పెరగకుండా పోషకాహారాన్ని తీసుకుంటే దాదాపు రెండేళ్లపాటు ట్యాబ్లెట్‌ అవసరం రాలేదట. దీన్నిబట్టి సరైన ఆహారం తీసుకుంటూ బరువుని నియంత్రించుకోగలిగితే షుగర్‌, బీపీలూ తగ్గుతాయనీ వాటికి జీవితకాలం మందులు మింగాల్సిన అవసరం ఉండదనీ అంటున్నారు.

ఆటతో ఆహారానికి నియంత్రణ!

జంక్‌ ఫుడ్‌ ఇష్టంగా తినేవాళ్లు ఓ పట్టాన క్రేవింగ్‌ను ఆపుకోలేరు. దాంతో వాళ్లు బరువు తగ్గడం కూడా కష్టమే. కానీ బ్రెయిన్‌ ఫుడ్‌ ట్రెయినింగ్‌ ఆప్‌ ద్వారా ఆ పని చేయవచ్చు అంటున్నారు యూనివర్సిటీ ఆఫ్‌ ఎక్సెటెర్‌, హెల్సింకీకి చెందిన నిపుణులు. వీళ్లు సంయుక్తంగా రూపొందించిన ఈ ఆప్‌లోని ఆహారపదార్థాలమీద ఆకుపచ్చ, ఎరుపు రంగులతో తినాలి, వద్దు అంటూ మార్క్‌ చేస్తూ ఆడటం వల్ల క్రమంగా ఆరోగ్యకరమైన ఆహారం తినడం పెరిగి, అనారోగ్యకరమైన వాటిని తినడం తగ్గుతుందని వివరిస్తున్నారు. ఇందుకోసం వీళ్లు సుమారు 1200 మంది జంక్‌ ఫుడీలను ఎంపికచేసి రోజుకి ఒక్కసారయినా నాలుగు నిమిషాలపాటు ఈ ఫుడ్‌ గేమ్‌ ఆడేలా చేశారట. దాంతో వారానికి నాలుగుసార్లు జంక్‌ ఫుడ్‌ తినేవాళ్లు కాస్తా ఒక్కసారి మాత్రమే తీసుకున్నారట. అంటే- ఈ ఆట అనేది ఒకరకంగా ఆహారపదార్థాల బొమ్మలతో మెదడుకి శిక్షణనివ్వడమే అనీ, మనకు తెలియకుండానే దానిమీద ప్రభావం కనబరుస్తుందనీ, ప్రయోగపూర్వకంగా దీన్ని వాడుతున్నవాళ్లలో క్రేవింగ్‌ తగ్గి, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం పెరిగిందనీ చెబుతున్నారు సదరు నిపుణులు.

క్యాన్సర్‌ని పసిగట్టేస్తుంది!

కొన్ని కేసుల్లో ముఖ్యంగా క్లోమ, అండాశయ క్యాన్సర్‌ పరీక్షల్లో క్యాన్సర్‌ ఉందో లేదో తెలుసుకోవడం కష్టమవుతుంటుంది. వ్యాధిని గుర్తించేందుకు స్కానింగులూ ల్యాప్రోస్కోపీ బయాప్సీ కొలనోస్కోపీ... ఇలా రకరకాల పరీక్షలు చేసినప్పటికీ కొన్నిసార్లు అది క్యాన్సర్‌కు సంబంధించిన కణితా లేదా హానిరహిత బెనైన్‌ ట్యూమరా అన్నది కచ్చితంగా గుర్తించలేక పోతున్నారు. అందుకే యూనివర్సిటీ ఆఫ్‌ పెన్సిల్వేనియాకి చెందిన పరిశోధకులు ఎలక్ట్రానిక్‌ నోస్‌ని రూపొందించారు. ఇది రక్త నమూనాల నుంచి వెలువడే వోలటైల్‌ వాయువుల వాసనని పసిగట్టి క్యాన్సర్‌ను గుర్తిస్తుందట. ఈ విషయాన్ని ప్రయోగపూర్వకంగా పరిశీలించినప్పుడు- నూటికి 95 శాతం ఫలితాలు కచ్చితంగా వచ్చాయట. అదీ కేవలం 20 నిమిషాల్లోనే ఫలితం వస్తుందట. పైగా ప్రాథమిక దశలో ఉన్న క్యాన్సర్లనీ ఇది పసిగడుతుంది. కాబట్టి త్వరలోనే దీన్ని వాడుకలోకి తీసుకొస్తే, వెంటనే చికిత్స ప్రారంభించడం ద్వారా వ్యాధిని నివారించవచ్చు అంటూ వివరిస్తున్నారు సదరు పరిశోధకులు.

Tags :

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న