కురింజి పూలు పూశాయోచ్‌..!    - Sunday Magazine
close

కురింజి పూలు పూశాయోచ్‌..!   

ర్ణాటకలోని కొడగు జిల్లా మందల్‌పట్టీ, కోటె బెట్టా కొండల్ని చూడ్డానికి ఈమధ్య పర్యటకులు బారులు కట్టారు. హెలీట్యాక్సీలెక్కి మరీ అక్కడి ప్రకృతి దృశ్యాల్ని చూస్తున్నారు. ‘అంత అద్భుతం అక్కడ ఏం జరిగిందబ్బా’ అనుకుంటున్నారా... ఇప్పుడు ఆ ప్రాంతమంతా ఎటుచూసినా విరబూసిన నీలకురింజి పూలతో పర్పుల్‌ తివాచీ పరిచినట్టు ఎంతో అందంగా మారిపోయింది. చాలా ప్రాంతాల్లో రుతువుల్ని బట్టి ఇలా పూలు పూస్తూనే ఉంటాయిగానీ ఈ కురింజి పూలు మాత్రం సరిగ్గా పన్నెండేళ్లకోసారే పూస్తాయి. వీటి పరాగసంపర్కానికి ఎక్కువ సమయం అవసరమవడంతో ఈ పూలు పుష్కరకాలానికోసారి పూస్తాయట. పశ్చిమ కనుమల్లో అక్కడక్కడ కనిపించే ఈ అరుదైన అద్భుతం చూడ్డానికి సందర్శకులు ఎక్కడెక్కడి నుంచో వస్తుంటారు.


ఇవి చెరిగిపోని ఆటోగ్రాఫ్స్‌!

క్కడున్న ఫొటో చూసి ‘ఇదేంటీ ఆటోగ్రాఫ్స్‌ ఒంటిమీద రాయించుకున్నాడు’ అనుకుంటున్నారా... అసలు విషయం ఏమిటంటే అవి పెన్నుతో రాసినవి కావు, టాటూ ఆటోగ్రాఫ్స్‌. నిజమండీ బాబూ.. ఫ్లోరిడాకు చెందిన ఫంకీ మటాస్‌ అనే టాటూ ఆర్టిస్టు ఏదైనా కొత్తగా చేయాలనుకున్నాడట. ప్రియమైన వారి గుర్తులు ఎప్పటికీ నిలిచిపోవాలనే ఆలోచనతో వీపుమీద ఆటోగ్రాఫ్స్‌ని తీసుకోవడం మొదలుపెట్టాడు. సన్నిహితుల ఆటోగ్రాఫ్స్‌తో పాటూ సెలబ్రిటీల దగ్గరికీ వెళుతూ పెన్నుతో సంతకాల్ని చేయించు కుంటున్నాడు. ఆ తర్వాత టాటూ మిషన్‌తో వాటిని చెరిగిపోని పచ్చబొట్టు ఆటోగ్రాఫ్స్‌గా మార్చుకుంటున్నాడు. ఇప్పటివరకు 225కి పైగా టాటూ ఆటోగ్రాఫ్స్‌ చేయించుకున్న ఫంకీ గిన్నిస్‌ రికార్డు కూడా కొట్టాడు.


తలమీద హుక్స్‌ పెట్టించుకున్నాడు..!

కొందరు కొత్తదనం కోసం జుట్టుకు రంగేసుకుంటారు. మరి కొంతమంది విభిన్నమైన హెయిర్‌కట్స్‌ ఫాలో అవుతుంటారు. కానీ డ్యాన్‌ సుర్‌ అనే మెక్సికన్‌ ర్యాపర్‌ మాత్రం ఏకంగా బంగారు గొలుసుల్నే జుట్టుగా మార్చుకున్నాడు. పుత్తడి మీద ప్రేమతో ఒంటినిండా నగలు దిగేసుకోవడం... బంగారు పళ్లు పెట్టించుకోవడమే కాకుండా అందరిలో ప్రత్యేకంగా కనిపించాలనే కోరికతో ఇతగాడు తల మీద ఆపరేషన్‌ ద్వారా హుక్స్‌ని అమర్చుకున్నాడు. వాటికే రకరకాల గోల్డ్‌ చెయిన్స్‌ను వెంట్రుకల్లా వేలాడేసుకున్నాడు. ఈ వింత హెయిర్‌స్టైల్‌తో కనిపిస్తూ సుర్‌ సోషల్‌ మీడియాలో పెట్టిన వీడియో, ఫొటోలూ ఇప్పుడు నెట్టింట్లో వైరల్‌ అయిపోయాయి. వాటిని చూసినవాళ్లంతా ‘బాబోయ్‌ ఇదేం వెర్రిరా బాబూ!’ అంటూ ఆశ్చర్యపోతూ తెగ కామెంట్లు చేస్తున్నారు.


అక్కడ... అమ్మాయిలకో భాష, అబ్బాయిలకో భాష!

నైజీరియాలో ఉబాంగ్‌ అనే తెగకి చెందిన ఓ ఊరుంది. అక్కడికెళ్లి ‘చెట్టును ఏమంటారు’ అని అడిగారనుకోండి. ‘కిట్చి’ అని అబ్బాయిలూ, ‘ఓకేవెంగ్‌’ అని అమ్మాయిలూ జవాబు ఇచ్చేస్తారు. ఆ రెండు సమాధానాలూ సరైనవే. ‘మరి ఇద్దరూ వేరు వేరుగా ఎందుకు చెప్పారు’ అంటారా... ఎందుకంటే ఆ ఊళ్లో ఆడవాళ్లకీ, మగవాళ్లకీ ప్రత్యేకమైన భాషలుంటాయి. వెంటనే ‘మరి ఇద్దరూ మాట్లాడుకోవాలంటే ఎలా’ అనే సందేహం వచ్చే ఉంటుంది కదూ. చిన్నతనంలో ఇంట్లో పెద్దవాళ్ల దగ్గర్నుంచి రెండు భాషలూ నేర్చుకుంటారు. కానీ పదేళ్ల వయసు నుంచి కచ్చితంగా ఎవరి భాష వాళ్లే మాట్లాడతారట. ఈ వింత సంప్రదాయాన్ని దేవుడిచ్చిన వరంగా భావిస్తూ ఇప్పటికీ పాటిస్తున్నారు ఈ ఊరి వాళ్లంతా.


ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న