ఒంటిరెబ్బ వెల్లుల్లిని చూశారా? - Sunday Magazine
close

ఒంటిరెబ్బ వెల్లుల్లిని చూశారా?

కరోనా వచ్చిన వాళ్లలోనూ వచ్చి తగ్గిన తరవాత కూడా చాలామందిలో ఆక్సిజన్‌ స్థాయులు తగ్గిపోయి శ్వాస ఇబ్బందిగా అనిపిస్తుంటుంది. రోగనిరోధకశక్తీ తగ్గుతుంది. ఈ సమస్యలకి చక్కని మెడిసిన్‌ సోలో గార్లిక్‌ అంటున్నారు పోషక నిపుణులు. అవునండీ... అచ్చం ఉల్లిపాయ మాదిరిగానే ఒకటే రెబ్బ ఉన్న వెల్లుల్లిపాయా ఉంది మరి. ఆ కథేంటో తెలుసుకోవాలంటే...

ల్లిపాయ లేకుండా కూర వండనట్లే చాలామంది వెల్లుల్లి లేకుండా తాలింపు పెట్టరు. రోటిపచ్చళ్లలో సాంబారులో కూరల్లో వెల్లుల్లి పోపు పెడితే ఆ రుచే వేరు. మసాలా వంటకాల్లో అల్లంవెల్లుల్లి జోడీ ఉండాల్సిందే. అయితే రెబ్బల్లా ఉండే వెల్లుల్లే మనకు తెలుసు. ఉల్లిపాయల్లాంటి ఒంటి రెబ్బ వెల్లుల్లి పెద్దగా పరిచయం లేదు. కానీ ‘సోలో బతుకే సో బెటరూ’ అన్నట్లు... ఈ ఒంటి రెబ్బ వెల్లుల్లి సాధారణ వెల్లుల్లి కన్నా ఏడు రెట్లు మంచిది. ఇది ఫ్లూ వైరస్‌ల్నీ బ్యాక్టీరియా వ్యాధుల్నీ సమర్థంగా తగ్గిస్తుందట. ఇందులోని ఫైటో కెమికల్స్‌ వైరస్‌లూ బ్యాక్టీరియా వ్యాధుల నివారణకీ తోడ్పడతాయి. అందుకే దీన్ని కొన్ని ప్రాంతాల్లో మందుగా వాడుతుంటారు. వీటిని నలుపు రంగులోకి మారేలా చేసీ వాడతారు. సాధారణ వెల్లుల్లితో పోలిస్తే ఘాటు తక్కువ, పైగా తొక్క తేలికగా వస్తుంది.

ఒంటి రెబ్బతో గోధుమ రంగులో ఉండే వెల్లుల్లి హిమాలయాల్లోనూ, తెలుపుమీద ఊదా చారలతో అచ్చం ఉల్లిపాయలా ఉండే రకం చైనాలోనూ ఎక్కువగా పండుతుంది. అయితే ఉల్లిపాయలా ఉండే రెండో రకం వెల్లుల్లి మనదగ్గర మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌లోనూ సాగు చేస్తున్నారు. హిమాలయాల్లో పండే రకాన్ని కశ్మీరీ లేదా స్నో గార్లిక్‌ అనీ అంటారు. సోలో గార్లిక్‌లో మరికొన్ని రకాల్ని ఐరోపా, దక్షిణ అమెరికా దేశాల్లోనూ పండిస్తున్నారు.

తినొచ్చు తాగొచ్చు!

మామూలు వెల్లుల్లి కన్నా సోలో రకం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందట. ముఖ్యంగా కశ్మీరీ వెల్లుల్లి కొలెస్ట్రాల్‌ని సమర్థంగా తగ్గిస్తుంది. వీటిని ఉదయాన్నే ఖాళీ కడుపుతో మూడు లేదా నాలుగు పాయలు తిని రెండు గ్లాసుల చల్లని నీళ్లు తాగితే అనేక వ్యాధులకి  మందులా పనిచేస్తుందట. లేదూ వీటిని కొద్దిగా దంచి, నీళ్లలో నానబెట్టి తాగినా మంచిదే.

* స్నో గ్లార్లిక్‌లో బి1, బి6, సి విటమిన్లూ కాపర్‌, మాంగనీస్‌, సెలీనియం, ఫాస్ఫరస్‌, కాల్షియం.. వంటి మూలకాలూ సమృద్ధిగా ఉంటాయి. ముఖ్యంగా ఇందులోని అలిసిన్‌ అనే శక్తిమంతమైన పదార్థం దగ్గూ జలుబూ జ్వరాల్ని 50 శాతం వరకూ తగ్గిస్తుంది. ఈ అలిసిన్‌ విటమిన్‌-బి, థైమీన్‌లతో కలిసి క్లోమగ్రంథిని ప్రభావితం చేసి ఇన్సులిన్‌ ఉత్పత్తయ్యేలా చేస్తుంది. దాంతో రక్తంలో చక్కెర నిల్వలు అదుపులో ఉంటాయి.

* సోలో గార్లిక్‌లో 17 రకాల అమైనో ఆమ్లాలూ సల్ఫ్యూరిక్‌ పదార్థాలూ 200 ఎంజైమ్‌లూ ఉంటాయి. అవన్నీ కలిసి గుండె పనితీరుకి దోహదపడతాయి. హృద్రోగులు వరసగా నాలుగు రోజులపాటు తింటే పన్నెండు శాతం చెడు కొలెస్ట్రాల్‌ తగ్గుతుంది. క్రమం తప్పక తినేవాళ్లలో రక్తం గడ్డకట్టడం 83 శాతం వరకూ తగ్గుతుందనేది ఓ పరిశీలన.

* ఖాళీ కడుపుతో తినడం వల్ల ఇందులోని పదార్థాలు జఠర రసాలతో కలిసి కొన్ని వాయువుల్ని విడుదల చేస్తాయి. కాబట్టి ఆస్తమా రోగులకి దీన్ని మందుగా ఇచ్చినా ఫలితం ఉంటుంది. కుంచించుకు పోయిన రక్తనాళాలను వెడల్పు చేయడం ద్వారా బీపీని నియంత్రణలో ఉంచుతుంది.

* సాధారణంగానే వెల్లుల్లిలో ఉండే ఆర్గానో సల్ఫర్‌ క్యాన్సర్‌ కణాలతో పోరాడుతుంది. అందుకే వెల్లుల్లిని క్రమం తప్పక తినేవాళ్లలో 66 శాతం క్యాన్సర్‌ వచ్చే అవకాశం తక్కువని నార్త్‌ కరోలినా యూనివర్సిటీ నిపుణులు పేర్కొంటున్నారు.

* పొట్టలోని నులిపురుగులూ కాలేయ, పిత్తాశయ సమస్యలూ మగవాళ్లలో సంతానలోపాలూ, హార్మోన్లలోని అసమతౌల్యమూ... వంటి అనేకానేక సమస్యలకు ఇది మందులా పనిచేస్తుందట.

* వెల్లుల్లి ఏదయినా క్యాన్సర్‌ వ్యాధుల్ని దూరంగా ఉంచుతుంది. అయితే ఒంటి రెబ్బ వెల్లుల్లి రకం పొట్ట, పేగు క్యాన్సర్ల నివారణకు బాగా తోడ్పడుతుంది.

* ఇందులోని ఆర్గానో సల్ఫైడ్‌ కాలేయంలోని టాక్సిన్లను తొలగిస్తుంది.

* గర్భధారణ సమయంలో వచ్చే అనేక సమస్యల్ని ఇది సమర్థంగా తగ్గిస్తుందట.

* దెబ్బతిన్న మెదడు కణాలను బాగుచేయడమే కాదు, ఇది జ్ఞాపకశక్తినీ పెంచుతుంది. ఇందులోని సల్ఫర్‌ కణాల్లోని లోపలి పొరను బాగుచేయడంతోపాటు కండరాల్లో సాగేగుణాన్నీ పెంచుతుంది. ఇలా ఎన్నో ఉపయోగాలున్నాయి కాబట్టే ఈమధ్య దీన్ని అనేకచోట్ల సాగుచేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

Advertisement


ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న