ఈ స్కూళ్లు ఆ పిల్లల కోసమే! - Sunday Magazine
close

ఈ స్కూళ్లు ఆ పిల్లల కోసమే!

ఆ స్కూల్‌లో చదువుకోవాలనుకునే పిల్లలకు రెండు అర్హతలు ఉంటే చాలు. ఒకటి - ఆ పిల్లలు నిరుపేదలు అయ్యుండాలి, రెండు - చదువుకోవాలనే కోరిక వాళ్లకు బలంగా ఉండాలి. ఈ రెండూ ఉంటే... స్కూలు యాజమాన్యమే పుస్తకాలూ, యూనిఫాం ఇచ్చి, భోజనం పెట్టి మరీ పాఠాలు చెబుతుంది. ఆ పిల్లల్ని మెరికల్లా తీర్చిదిద్దుతుంది. ఇంత గొప్ప స్కూలు ఎక్కడుందబ్బా అంటారా... ఉంది... అదే సత్యభారతీ పాఠశాల. భారతీ ఫౌండేషన్‌ ప్రారంభించిన సరస్వతీ పీఠం.

ఆ అమ్మాయి పేరు కవిత. డాక్టర్‌ కావాలనుకుంది. కానీ తండ్రి సామాన్య రైతు. దాంతో ఇంట్లో వెచ్చాల ఖర్చులు రాసుకునే పాటి చదువు వచ్చినా చాలనుకుంది. అలాంటి కవిత ఇప్పుడు మెడిసిన్‌ చదివేందుకు సిద్ధమవుతోంది. 

* అతని పేరు చంపారామ్‌. ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రమే. సత్యభారతీ స్కూల్లో చదివిన అతను ఈమధ్యే ఐఐటీ-జేఈఈ పరీక్షలు రాసి ఐఐటీ మద్రాస్‌లో సివిల్‌ ఇంజినీరింగ్‌లో చేరుతున్నాడు.

- వీళ్లే కాదు దేశవ్యాప్తంగా సత్యభారతీ పాఠశాలల్లో చదువుకుంటున్న దాదాపు మూడు లక్షలా యాభైవేలమంది పిల్లల కలలూ ఇలాగే ఉంటాయి. సత్యభారతీ స్కూళ్లు... భారతీ ఎంటర్‌ప్రైజెస్‌ కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్సిబిలిటీలో భాగంగా ప్రారంభించిన భారతీ ఫౌండేషన్‌ ఆధ్యర్యంలో నడుస్తున్నాయి. ‘ఉన్నతంగా కలలు కనండి. వాటిని నిజం చేసుకునేందుకు మీకు మేం అండగా ఉంటాం’ అనే నినాదంతో ప్రారంభమైన ఈ పాఠశాలలు దేశవ్యాప్తంగా పదహారు వందల సంఖ్యలో ఉన్నాయి.

  

ఆడపిల్లలే లక్ష్యంగా...

పేద పిల్లలు... ముఖ్యంగా ఆడపిల్లలు చదువుకోవాలనే ఉద్దేశంతోనే ఈ పాఠశాలల్ని ప్రారంభించామని అంటారు సంస్థ ఛైర్మన్‌ సునీల్‌ భారతీ మిట్టల్‌. ‘ఫౌండేషన్‌ పెట్టిన కొత్తల్లో మేం కొన్ని ఎన్జీఓలతో కలిసి పని చేసినా పిల్లల్ని పూర్తిస్థాయిలో తీర్చిదిద్దాలని 2006లో సత్యభారతీ స్కూళ్లని ప్రారంభించాం. ప్రభుత్వ పాఠశాలలు ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో వాటితోనే కలిసి మా సేవల్ని అందిస్తున్నాం. అలాంటి పాఠశాలల్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయడంతోపాటూ టీచర్లకు అవసరమైన శిక్షణ కూడా అందిస్తాం...’ అని వివరిస్తారు. ఈ స్కూళ్లలో చేరే పిల్లలకు చదువు చెప్పడంతోపాటు మంచి మార్కులు తెచ్చుకునే విద్యార్థులకు ఉపకారవేతనాలూ అందిస్తారు. పిల్లలు ఏ ఆటంకం లేకుండా చదువుకునేలా సంస్థ వాలంటీర్లు తల్లిదండ్రులకు అవగాహనా కార్యక్రమాలను నిర్వహిస్తారు. అయితే ఎంత ప్రయత్నించినా కొంతమంది తల్లి దండ్రులు తమ పిల్లల్ని బడికి పంపేందుకు ఇష్టపడరనీ, వాళ్లు పనిచేస్తే జీవితంలో త్వరగా స్థిరపడొచ్చని వాదిస్తుంటారనీ... అలాంటివారిని ఒప్పించడం సవాలేననీ చెబుతారు సంస్థ వాలంటీర్లు.

పిల్లల్లో మార్పు తెచ్చేందుకే...

చదువుతోపాటూ వేసవిలోనూ పిల్లలు ఖాళీగా ఉండకుండా రకరకాల కార్యక్రమాలు నిర్వహిస్తారు టీచర్లు. కొవిడ్‌ సమయంలో విద్యార్థులు చదువుకు దూరం కాకుండా ఆన్‌లైన్‌ విధానంలో పాఠాలు చెబుతూనే భవిష్యత్తుకు ఉపయోగపడే  ప్రాజెక్టులను రూపొందించారు. వాటిద్వారా పిల్లలు పోస్టర్లను డిజైను చేయడం, వీడియోలు తీయడం, స్లోగన్లు రాయడం... ఇలా ఎన్నో నేర్చుకున్నారని అంటారు టీచర్లు. ‘సంపన్న వర్గాల పిల్లలతో పోలిస్తే నిరుపేద కుటుంబాల నుంచి వచ్చే చిన్నారుల్లో ఆత్మన్యూనత ఉంటుంది. అలాంటి వారిని ధైర్యవంతులుగా తీర్చిదిద్దేందుకు భారతీ ఫౌండేషన్‌ రకరకాల కార్యక్రమాలు నిర్వహిస్తుంటుంది. ఉదాహరణకు తెలంగాణలోని యాభై ప్రభుత్వ పాఠశాలలతో కలిసి పనిచేస్తున్న మా సంస్థ... కరీంనగర్‌ జిల్లాలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులే పంటలు పండించేలా ప్రోత్సహించేందుకు ఓ క్లబ్‌ను ఏర్పాటుచేసింది. ఆ ఊళ్లో ఏ ఒక్క కుటుంబమూ అర్ధాకలితో ఉండకూడదనే లక్ష్యంతో ప్రారంభించిన ఆ ప్రాజెక్టులో భాగంగా పిల్లలే వ్యవసాయం చేసి పంటలు పండించి పేద కుటుంబాలకు పంచారు. అదేవిధంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఓ స్కూల్‌లో కమ్యూనిటీ రేడియో ఏర్పాటు చేయడంతో చిన్నారులు తమకు వచ్చిన పాటలూ, పద్యాలూ వంటివి ప్రదర్శిస్తూ అన్నిరకాలుగా రాణించేందుకు ఆసక్తి చూపించారనీ.. కార్పొరేట్‌ విద్యార్థులకు దీటుగా ఈ పిల్లల్నీ తయారుచేయడమే భారతీ ఫౌండేషన్‌ లక్ష్యమని అంటారు ఆ టీచర్లు. అన్నట్టు... ఈ స్కూళ్లలో నూటికి నూరుశాతం ఉత్తీర్ణత ఉండటం గమనార్హం.

Advertisement


ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న