‘ఆముక్తమాల్యద’ను రాసింది ఇక్కడే! - Sunday Magazine
close

‘ఆముక్తమాల్యద’ను రాసింది ఇక్కడే!

అనేక నామాలతో భక్తుల పూజల్ని అందుకునే నారాయణుడు... కృష్ణాజిల్లాలోని శ్రీకాకుళం గ్రామంలో శ్రీకాకుళేశ్వరుడిగా, ఆంధ్ర మహావిష్ణువుగా, ఆంధ్ర నాయకుడిగా కొలువై దర్శనమిస్తున్నాడు. స్వామి ఆదేశంతోనే శ్రీకృష్ణదేవరాయలు ఈ పుణ్యక్షేత్రంలో ఆముక్తమాల్యదను రచించినట్లుగా ప్రతీతి. ఈ ఆలయ దర్శనం సర్వ శుభాలనూ కలిగించే వైకుంఠధామమనీ అంటారు.

విత్ర కృష్ణానదీ తీరంలో కనిపించే శ్రీకాకుళేశ్వర స్వామి ఆలయం... 108 వైష్ణవ పుణ్య క్షేత్రాల్లో 57వ క్షేత్రంగా ప్రసిద్ధి పొందింది. ఆంధ్ర మహావిష్ణువుగా, ఆంధ్ర నాయకుడిగా భక్తుల పూజల్ని అందుకుంటున్న ఈ స్వామిని దర్శించుకోవాలంటే కృష్ణా జిల్లా ఘంటసాల మండలంలోని శ్రీకాకుళం గ్రామానికి వెళ్లాలి. ఇక్కడ వెలసిన స్వామికి మీసాలు ఉండటం ఓ ప్రత్యేకత. 

స్థలపురాణం

‘ఆంధ్ర కౌముది’ గ్రంథం ప్రకారం మహావిష్ణువు, ఈ ప్రాంతంలోనే సుచంద్రుడనే రాజు కుమారునిగా జన్మించి ఆంధ్ర మహావిష్ణువు పేరున రాజ్యాన్ని స్థాపించాడట. అప్పటినుంచే స్వామిని శ్రీకాకుళేశ్వరుడిగా కొలుస్తున్నారట. మరో కథ ప్రకారం... భూలోకంలో నానాటికీ పెరిగిపోతున్న పాపాలను నివారించాలనే ఉద్దేశంతో బ్రహ్మ ఇతర దేవతలతో కలిసి ఈ ప్రాంతంలో మహావిష్ణువు అనుగ్రహం కోసం తపస్సు చేశాడట. ఆ తపస్సుకు మెచ్చి స్వామి ప్రత్యక్షమవ్వడంతో బ్రహ్మతోపాటూ ఇతర దేవతలంతా ఇక్కడే ఉండిపొమ్మంటూ వేడుకున్నారట. అలా క్రీస్తు పూర్వం మూడో శతాబ్దానికి ముందే స్వామిని ఆంధ్రమహావిష్ణువుగా పూజించడం మొదలుపెట్టారట. అయితే కొన్నాళ్లకు స్వామి విగ్రహం మాయమైంది. ఓసారి కళింగను పాలించే అంగపాలుని ప్రధాన మంత్రి నరసింహ వర్మ కాంచీపురానికి బయలుదేరి... మార్గమధ్యంలో ఈ ఆలయానికి చేరుకున్నాడు. ఇక్కడి క్షేత్ర మహత్యం గురించి తెలుసుకున్న ఆ మంత్రి ఎలాగైనా స్వామి విగ్రహాన్ని వెతికి పునఃప్రతిష్టించాలని సంకల్పించుకున్నాడు. ఎంత వెతికినా దొరక్కపోవడంతో స్వామిని ధ్యానించడం మొదలుపెట్టాడు. దాంతో స్వామి అతనికి కలలో కనిపించి ఓ బ్రాహ్మణుడి ఇంటి ఆవరణలో మరుగున పడి ఉన్నట్లుగా తన ఉనికిని తెలియజేశాడట. స్వామి చెప్పినట్లుగా మంత్రి ఆ ప్రదేశానికి వెళ్లి తవ్వి చూడగా విగ్రహం కనిపించడంతో ఆలయంలో ప్రతిష్టించాడట. అప్పటినుంచీ ఈ ఆలయం గురించి అందరికీ తెలిసిందని అంటారు. తరువాత ఎందరో రాజులు ఈ ఆలయాన్ని దర్శించుకున్నారనీ.. ముఖ్యంగా శ్రీకృష్ణదేవరాయలు ఆముక్తమాల్యదను ఇక్కడే రచించాడనీ చెబుతారు. శ్రీకృష్ణదేవరాయలు తన రాజ్యవిస్తరణలో భాగంగా ఇక్కడకు వచ్చి స్వామిని దర్శించుకొని ఆ రాత్రికి ఆలయంలోనే నిద్రించాడట. అప్పుడు స్వామి కలలో కనిపించి గ్రంథ రచన చేయమని ఆదేశించడంతో మరుసటి రోజే దేవరాయలు ఆలయ ప్రాంగణంలో 16 స్తంభాల మండపంలో కూర్చుని ఆముక్తమాల్యదను రాయడం మొదలు పెట్టాడట. దాంతో ఆ మండపానికి ఆముక్తమాల్యద మండపమనే పేరు వచ్చింది. కొన్నాళ్లకు ఆ మండపాన్ని పునర్నిర్మించి దాని మధ్యలో శ్రీకృష్ణదేవరాయలు ఆముక్తమాల్యద రచిస్తున్నట్లు విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ ఆలయానికి చల్లపల్లి జమీందారులైన యార్లగడ్డ వంశీకులు ఆనువంశిక ధర్మకర్తలుగా వ్యవహరిస్తున్నారు.

కన్నుల పండుగ్గా తిరునాళ్లు

ఈ స్వామి గురించి ఎందరో కవులు తమ గ్రంథాల్లో ప్రస్తావించడం విశేషం. ముఖ్యంగా నారాయణతీర్థులు రాసిన శ్రీకృష్ణలీలా తరంగిణిలో స్వామి గురించి వర్ణిస్తే, శ్రీనాథ మహాకవి తన క్రీడాభిరామంలో శ్రీకాకుళ క్షేత్రం, అక్కడ నిర్వహించే తిరునాళ్ల వైభవం గురించి ప్రస్తావించాడు. చల్లపల్లి జమీందారు ఆస్థాన కవి కాసుల పురుషోత్తముడు ఆంధ్రనాయక శతకంలో స్వామి మహత్యాన్ని తెలియజేయడం విశేషం. ఈ ఆలయంలో ఏటా వైశాఖ మాసంలో రాజ్యలక్ష్మీ సమేత శ్రీకాకుళేశ్వరస్వామికి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. అలాగే ఇక్కడ జరిపే తిరునాళ్లూ, వైకుంఠ ఏకాదశినాడు చేసే ప్రత్యేక పూజలూ చూసేందుకు రెండూ కళ్లూ చాలవంటారు. 

ఎలా చేరుకోవచ్చు

ఈ ఆలయం కృష్ణాజిల్లా ఘంటసాల మండలంలోని శ్రీకాకుళం అనే గ్రామంలో ఉంది. విజయవాడ వరకూ విమానం, రైలు, బస్సు ద్వారా చేరుకుంటే అక్కడి నుంచి కరకట్ట మీదుగా వెళ్తే శ్రీకాకుళం 40 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అదే పామర్రు మీదుగా వెళ్తే కొడాలికి వచ్చి అక్కడి నుంచి ఆలయానికి వెళ్లాలి. ఈ ప్రాంతాల నుంచి ఆలయానికి వెళ్లేందుకు ప్రైవేటు వాహనాలు ఉంటాయి.

- ముత్తా నారాయణరావు, ఈనాడు, అమరావతి
- చిత్రాలు: సీహెచ్‌.జగన్మోహన రావు, న్యూస్‌టుడే, ఘంటసాల


ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న