ఎక్కిళ్లు ఆగిపోవాలంటే... - Sunday Magazine
close

ఎక్కిళ్లు ఆగిపోవాలంటే...

క్కిళ్లు ఎవరికైనా కొద్దిసేపు వచ్చి ఆగిపోతాయి. కానీ కొంతమందికి తరచూ వస్తూ ఇబ్బంది పెడతాయి. ఓ పట్టాన ఆగవు. అలాంటివాళ్ల కోసమే శాన్‌ ఆంటానియోలోని టెక్సాస్‌ యూనివర్సిటీకి చెందిన నిపుణులు ఫోర్స్‌డ్‌ ఇన్‌స్పిరేటరీ సక్షన్‌ అండ్‌ స్వాలో టూల్‌(ఫిస్ట్‌)అన్న పేరుతో  ఎల్‌ ఆకారంలోని స్ట్రాను రూపొందించారు. దీన్ని ఎక్కిళ్లు వస్తున్నవాళ్లలో పరీక్షించి చూడగా- 92 శాతం మందికి వెంటనే తగ్గాయట. ఇది ఎలా పనిచేస్తుందీ అంటే- చిన్న ట్యూబ్‌లా ఉన్న దీనికి అడుగున చిన్నదీ పెద్దదీ రెండు రంధ్రాలు ఉంటాయి. దానికి అమర్చిన లిడ్‌ని జరపడం ద్వారా పిల్లలకోసం చిన్నదీ పెద్దవాళ్లకోసం పెద్ద రంధ్రాన్ని తెరుచుకునేలా చేయాలి. తరవాత స్ట్రాను గ్లాసులో ఉంచి పై భాగాన్ని నోట్లో పెట్టుకుని బలంగా పీల్చగానే నీళ్లు ఒక్కసారిగా లోపలకు వెళతాయి. ఆ వేగానికి ఎక్కిళ్లకు కారణమైన ఫ్రెనిక్‌, వేగస్‌ నాడులు స్పందించడంతో అవి ఆగిపోతాయి. ఎందుకంటే ఈ రెండు నాడులు బిగుసుకోవడం వల్లే ఊపిరితిత్తుల అడుగున ఉన్న డయాఫ్రమ్‌ కండరం సంకోచం చెంది, స్వరపేటిక పైన మూతలా ఉండే ఎపిగ్లాటిస్‌ను మూసుకునేలా చేస్తుంది. దాంతో లోపలినుంచి వచ్చే గాలి స్వరపేటికకి తగిలి హిక్‌ అనే శబ్దంతో ఎక్కిళ్లు వస్తుంటాయి. ఈ స్ట్రాతో నీళ్లను పీల్చగానే ఆ వేగానికి బిగుసుకున్న నాడులు స్పందించడంతో డయాఫ్రమ్‌ మళ్లీ యథాస్థితికి వస్తుంది. దాంతో ఎపిగ్లాటిస్‌ తెరుచుకుని గాలి మార్గం సుగమం
కావడంతో ఎక్కిళ్లు ఆగిపోతాయి.


ఒత్తిడితో జుట్టు తెల్లబడుతుందా?

యసుతోపాటు జుట్టు తెల్లబడటం సహజం. అయితే తీవ్రమైన ఒత్తిడి, ఆందోళనలవల్ల కూడా జుట్టు తెల్లబడుతుంది అంటుంటారు. అయితే ఏ రకంగా తెల్లబడినా అది తిరిగి నల్లబడటం అనేది ఉండదనే ఇంతవరకూ చెబుతూ వచ్చారు. కానీ మొదటిసారిగా జుట్టు తెల్లబడడానికీ ఒత్తిడికీ సంబంధం ఉందని తేల్చడమే కాదు, అలా తెల్లబడిన జుట్టు తిరిగి నల్లబడనూ వచ్చు అంటున్నారు కొలంబియా విశ్వవిద్యాలయ నిపుణులు. కుదుళ్లలోని మూలకణాల్లోని మార్పులవల్లే జుట్టు తెల్లబడుతుంది కాబట్టి మళ్లీ నల్లబడే ప్రసక్తే లేదు అను
కున్నారు. అయితే కొత్తగా చేసిన పరిశోధనలో- కొంతమందిని ఎంపికచేసి వాళ్లను ఒత్తిడికి గురిచేసి రంగు మారిన కొన్ని వెంట్రుకల్ని గుర్తించారట. తరవాత కొన్నాళ్లకు అదే వ్యక్తుల్ని సెలవుమీద హాయిగా గడిపి రమ్మని పంపించి, రంగు మారిన వెంట్రుకల్ని పరిశీలించగా- ప్రొటీన్లలోనూ రంగులోనూ మార్పు కనిపించిందట. వృద్ధాప్యంలో వచ్చే తెల్లజుట్టు మళ్లీ నల్లబడదు. కానీ 30-50 మధ్య నెరిసే జుట్టుకి ఒత్తిడే కారణమైతే అది తగ్గగానే తిరిగి నల్లబడనూ వచ్చు అంటున్నారు సదరు పరిశోధకులు.


కొవిడ్‌తో కంటి లోపాలు!

కొవిడ్‌ సమయంలో పిల్లలూ పెద్దలూ అందరికీ స్క్రీన్‌ చూడటం బాగా పెరిగింది. చదువు, ఉద్యోగం, షాపింగ్‌... కారణమేదయినా గానీ ఫోన్లూ టీవీలూ ల్యాప్‌టాప్‌ల వాడకంతోపాటు టీవీ చూసే సమయమూ పెరిగింది. దాంతో కంటి లోపాలు బాగా ఎక్కువయ్యాయట. అంతకుముందు 1.0 ఉన్న దృష్టిదోషం కాస్తా ఏడాదిలో రెట్టింపు అయినట్లు అనేక పరిశోధనల్లో తేలింది. ముఖ్యంగా కరోనా పాండమిక్‌ పుణ్యమా అని పిల్లల్లో మయోపియా పెరిగినట్లు గుర్తించారు. చైనాలో చేసిన ఓ అధ్యయనంలో 6-13
సంవత్సరాల్లోపు పిల్లల్లో 2015 - 2019 మధ్య కాలంతో పోలిస్తే గత ఏడాదిలో ఏకంగా మూడు రెట్లు మయోపియా కేసులు పెరిగాయట. కాలేజ్‌ ఆఫ్‌ ఆప్టోమెట్రిస్టిస్‌ బ్రిటన్‌లో చేసిన అధ్యయనంలోనూ 2020లో దృష్టిలోపాల కేసులు 22 శాతం పెరిగినట్లు తేలింది. కొవిడ్‌ను పక్కన పెడితే, మామూలుగానే మరో ముప్ఫై సంవత్సరాలకు ప్రపంచంలోని సగం మందికి పైగా మయోపియా బాధితులే ఉండొచ్చనేది ప్రపంచ ఆరోగ్యసంస్థ అంచనా. కాబట్టి సాధ్యమైనంత వరకూ పిల్లలకి స్క్రీన్‌ టైమ్‌ తగ్గించాలని చెబుతున్నారు.


మాస్క్‌ ఎలా పెడుతున్నారు?

చాలామంది మాస్క్‌ని ముక్కుకిందకో గడ్డం కిందకో పెట్టుకుంటారు. ఇది చాలా ప్రమాదకరం. ఇంకొందరు ముక్కు పైకి పెట్టినట్టే పెట్టి దాన్ని వదులుగా ఉంచుతున్నారు. ఇలా పెడితే అది ఎన్‌-95 మాస్క్‌ అయినా ఎలాంటి ఉపయోగమూ ఉండదు అంటున్నారు  సిన్‌సినాటీ యూనివర్సిటీ పరిశోధకులు. ఇందుకోసం వీళ్లు మూడు రకాల సైజులున్న ఎన్‌-95 మాస్క్‌లను తీసుకుని బొమ్మ తలలకి అమర్చి త్రీడీ కంప్యూటర్‌ డిజైన్‌ ద్వారా వదులుగా ఉన్న ప్రదేశం నుంచి గాలి ఏ మేరకు వెళుతుందా అని పరిశీలించారట. అందులో బిగుతుగా ఉన్న మాస్క్‌తో పోలిస్తే వదులుగా పెట్టిన మాస్క్‌ల నుంచి గాలి రేణువులు 30 నుంచి 95 శాతం వరకూ లోపలికీ బయటకీ రవాణా అవుతున్నట్లు గుర్తించారు. దీనివల్ల పెట్టుకున్నవాళ్లకీ లేదూ వాళ్ల వల్ల చుట్టుపక్కలవాళ్లకీ కూడా ఇన్ఫెక్షన్‌ సోకే ప్రమాదం ఎక్కువేనని హెచ్చరిస్తున్నారు సదరు పరిశోధకులు.

Advertisement


ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న