ఆ కారణం చూపి.. కాలేజీ నుంచి తీసేశారు! - Sunday Magazine
close

ఆ కారణం చూపి.. కాలేజీ నుంచి తీసేశారు!

భగభగా గుండెను మండించి... సలసలా రక్తాన్ని మరిగించి... జలజలా కన్నీటిని ఉబికించి... ఇలా మనలో ఎన్నో ఉద్వేగాలు రాజేస్తుంది ‘జై భీమ్‌’ సినిమా. తెరపైన చూస్తున్న మనకే ఇలా ఉంటే... చిన్నతల్లి కుటుంబంపైన జరిగిన దురాగతాన్ని నేరుగా విని దాన్ని లోకానికి చాటిన వ్యక్తి మానసిక స్థితి ఎలా ఉండాలి? తెరపైన సూర్య పోషించిన ఆ రియల్‌హీరో పాత్ర జస్టిస్‌ కె.చంద్రుది. లాయర్‌గా ఉన్నప్పుడు ఒక్క రూపాయి ఫీజు తీసుకోకుండా ఆయన ఛేదించిన వందలాది కేసుల్లో చిన్నతల్లిది ఒక్కటి మాత్రమే. ఈ విశిష్ట న్యాయపోరాట యోధుడి ప్రస్థానం ఆయన మాటల్లోనే...

హ తెలిసేనాటికే నాకు అమ్మ లేదు. అనారోగ్యంతో చనిపోయిందని చెప్పేవారు. అమ్మ కన్నుమూసేనాటికి నాకు ఐదున్నరేళ్లయితే... తమ్ముడు పాలు తాగుతున్నాడంటారు. ఇంట్లో నాకన్నా ముందు ఇద్దరన్నయ్యలూ, ఓ అక్కయ్యా ఉన్నారు. మా ఐదుగురు పిల్లల ఆలనా పాలనా చూసుకోవడానికైనా రెండో పెళ్ళి చేసుకుని తీరాలని పెద్దవాళ్లు ఎంత పోరినా మా నాన్న ఎవరి మాటా వినలేదు.

‘నా పిల్లల్ని నేనొక్కణ్నే పెంచుతా!’ అని భీష్మించుకుని తనే మాకు అన్నీ అయ్యాడు. ఇంటిని శుభ్రం చేయడం నుంచీ వంటావార్పూ దాకా అన్నీ తానే చేసేవాడు. మా చదువుల కోసమే తన రైల్వే క్లర్క్‌ ఉద్యోగాన్ని... శ్రీరంగం నుంచి చెన్నైకి బదిలీ చేయించుకున్నారు. మేం అక్కడికి వెళ్లిన రోజుల్లో ఇండియా-చైనా యుద్ధం జరుగుతుండటంతో నిత్యావసర వస్తువులకి తీవ్రకొరత ఉండేది. ఉప్పూపప్పూ బియ్యం కిరోసిన్‌... అన్నింటికీ రేషన్‌ దుకాణాలే దిక్కు. అదీ అక్కడ రోజువారీ కోటాకిందే ఇస్తారు... కనీసం వారానికి సరిపడా సరకులు తీసుకోవడానికీ వీల్లేదు. ఆ దుకాణాలు తెరిచేది పదిగంటలకేకానీ జనం మొత్తం ఉదయం నాలుగున్నర గంటలకే వెళ్లి ‘క్యూ’లో నిల్చునేవారు. మా ఇంట్లో రోజూ అలా రేషన్‌ షాపుకి వెళ్లి సరకులు తెచ్చే బాధ్యత నాది! ఉదయం నాలుగు గంటలకే లేచి రేషన్‌ కోసం వెళ్లి... పదిన్నరకి ఇంటికొచ్చి మళ్లీ బడికి వెళ్లేవాణ్ణి. అప్పటి నుంచీ ఈరోజు దాకా ఆరునూరైనా నాలుగున్నరకి మేల్కోవడం నా జీవితంలో భాగమైపోయింది. మేం చెన్నై వచ్చాక మా అక్కయ్య పెళ్ళైంది. అన్నయ్యలిద్దరూ చదువు కోసం బయటి రాష్ట్రాలకి వెళ్లిపోయారు. నాన్నా, నేనూ, తమ్ముడూ మాత్రమే ఇంట్లో ఉండేవాళ్లం. అప్పట్నుంచీ వంటావార్పూ చేసే బాధ్యత నాదైంది. ఇంటిపనుల బాధ్యత స్త్రీలది మాత్రమే కాదన్న భావన నాలో అప్పుడు ఏర్పడ్డదే! నా జీవితనేపథ్యంలోని ఈ అంశాన్ని చూచాయగా స్పృశించాలనే... ‘జైభీమ్‌’లో సూర్య దోసె వేస్తున్నట్టు చూపించారు!

విద్యార్థి పోరాటాల్లో...
చిన్నప్పుడు మా నాన్న నాకు చందమామ బాలమిత్రల్లాంటివేవీ కొనిపెట్టలేదు. నేరుగా పత్రికలు చదవడం అలవాటుచేశారు. దాంతో తొమ్మిదో తరగతికి వచ్చేనాటికల్లా రాజకీయాంశాలకి చెందిన పుస్తకాల్ని చదవడం అలవాటు చేసుకున్నాను. సెలవురోజులన్నీ దాదాపు లైబ్రరీల్లోనే గడిపేసేవాణ్ణి. తమిళనాడులో హిందీ వ్యతిరేక ఆందోళనలు మొదలైనప్పుడు... నేనూ అందులో భాగమైపోయాను. ఆ తర్వాత వామపక్షపార్టీల తీరు నచ్చి ఎస్‌ఎఫ్‌ఐలో సభ్యుణ్ణయ్యాను. అలా విద్యార్థి సంఘాల్లో చురుగ్గా ఉంటూనే ఇంటర్‌ ముగించాను. అప్పట్లో నాకు మెడిసిన్‌ చదవాలని ఉండేది కానీ... ఎంబీబీఎస్‌ అవకాశం అన్నది అప్పట్లో సామాజికంగానూ ఆర్థికంగానూ ఉన్నతస్థాయిలో ఉన్నవాళ్ల పిల్లలకే దక్కేది. సో... నాకు సీటు రాలేదు. దాంతో బీఎస్సీ బోటనీలో చేరాను. ఈలోపు నాన్న గుండెపోటుతో చనిపోయారు. తమ్ముణ్ణి బంధువులు తీసుకెళ్లడంతో చెన్నైలో ఒంటరిగా మిగిలిపోయాను. పగలూరాత్రీ అని లేకుండా విద్యార్థి రాజకీయాల్లోనే తలమునకలయ్యాను. ప్రతి అక్రమాన్నీ ప్రశ్నించడం అలవర్చుకున్నాను. ఇవన్నీ మా కాలేజీ యాజమాన్యానికి నచ్చక డిగ్రీ రెండో ఏడాది నన్ను కాలేజీ నుంచి డిస్మిస్‌ చేసేశారు!  

అరెస్టు తర్వాత లా!
కాలేజీ నుంచి డిస్మిస్‌ చేశాక... మరో విద్యాసంస్థలో చేరి ఎలాగోలా డిగ్రీ ముగించాను. నిజానికి, ఆ తర్వాత నేను చదివిందే అసలైన విద్య... ఏ విశ్వవిద్యాలయమూ నేర్పించలేని పాఠాల్ని ఆ దశలోనే నేర్చుకున్నాను. ఎస్‌ఎఫ్‌ఐ, సీపీఎం శాఖలున్న ప్రతి పల్లెకీ వెళ్లడం మొదలుపెట్టాను. కార్మికులు, కర్షకులు, వృత్తిపనులవాళ్లూ అందర్నీ కలవడం... కొన్నాళ్లపాటు వాళ్లతో ఉండి వాళ్ల కష్టసుఖాలని చూడటం... వాళ్ల కోసం పోరాడటం... ఇదీ వరస. ఈ ప్రయాణాలప్పుడు బస్సుల్లో కాక లారీల్లోనే వెళ్లేవాణ్ణి. చిన్నపాటి ఖర్చుల కోసం కూలి పనులూ చేసేవాణ్ణి. అప్పట్లోనే ఓ సంఘటన జరిగింది. నాటి తమిళనాడు ముఖ్యమంత్రికి అన్నామలై వర్సిటీవాళ్లు గౌరవ డాక్టరేట్‌ అందించారు. అదో ఫక్తు రాజకీయ డాక్టరేట్‌... వర్సిటీ సెనెట్‌ ఒప్పుదల లేకుండానే జరిగింది. ఎస్‌ఎఫ్‌ఐలో భాగంగా ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మేం ఆందోళన చేస్తున్నప్పుడు జరిగిన... పోలీసుల లాఠీ ఛార్జిలో ఓ విద్యార్థి చనిపోయాడు. దాంతో మా నిరసనల్ని మరింత ఉద్ధృతం చేస్తే... నన్ను అరెస్టు చేశారు. కానీ మా ఒత్తిడి ఫలించి దీనిపైన కమిషన్‌ వేశారు. దాని బాధ్యతలు ఓ జూనియర్‌ జడ్జికి ఇచ్చారు... దానర్థం అదో కంటితుడుపు కమిషన్‌ అనేగా! జైలు నుంచి బయటకొచ్చిన నేను ఆ కమిషన్‌ విచారణకి హాజరయ్యాను. న్యాయవాదులందరూ కిమ్మనకుండా ఉంటే నేను మాత్రం  నా వాదనల్ని తార్కికంగా వివరిస్తూ పిటిషన్‌ వేశాను. దాన్ని చూసిన ఆ జడ్జి ఏమనుకున్నాడో ఏమో నావైపు సూటిగా చూసి ‘నువ్వు లా చదువు... మంచి వకీలవుతావ్‌!’ అని చెప్పారు. ఆయన కోపంగా అన్నాడో... వేళాకోళమాడాడో తెలియదు. కానీ, నా జీవితంలో అదే పెద్ద మలుపైంది.... ఆ తర్వాతి వారమే లా కాలేజీలో చేరాను.

ఒక్కరోజూ మిస్‌ చేయలా!
కాలేజీలో చేరాక ఒక్క రోజూ గైర్హాజరీ లేకుండా వెళ్లాను. మంచి మార్కులతో న్యాయవాదపట్టా పుచ్చుకున్నాను. ఆ రోజే- నా సేవలు నిర్భాగ్యుల కోసమని నిర్ణయించు కున్నాను. అది ఎమర్జెన్సీ కాలం. మీసా చట్టం కింద కేంద్రం ఏ కారణమూ చూపకుండా అరెస్టు చేస్తున్నవాళ్లకి న్యాయసేవల్ని అందించడం మొదలుపెట్టాను. వాళ్ల కోసం ఏర్పాటుచేసిన కమిషన్‌ ముందు... ఏకైక జూనియర్‌ లాయర్‌గా హాజరయ్యాను. ఆ తర్వాతి నుంచి సీపీఎం కార్యకర్తల కోసం హాజరుకావడం మొదలుపెట్టాను. కాకపోతే, శ్రీలంక తమిళుల విషయంలో ఆ పార్టీ కాంగ్రెస్‌కి వంతపాడటం నచ్చక బాహాటంగానే విమర్శించాను. దాంతో పార్టీ నన్ను బహిష్కరించింది. నా సామాజిక జీవితానికి ఓనమాలు నేర్పిన సంస్థ... నన్నలా వెలివేయడంతో ఒంటరిగానే నా ప్రయాణాన్ని కొనసాగించాను. పార్టీలకతీతంగా ఉపాధ్యాయులూ, కార్మికులూ, కర్షకులూ, రైతు కూలీల్ని ఎన్నో తప్పుడు కేసుల నుంచి విడిపించడం మొదలుపెట్టాను. పూటకింత తిండిలేని వాళ్లని ఫీజు ఇవ్వమని ఎలా అడగను?! అందుకే వాళ్ల నుంచి రూపాయి కూడా తీసుకునేవాణ్ణి కాదు. అలా సీనియర్‌ న్యాయవాదిగా మంచి గుర్తింపు సాధించాను. నా న్యాయవిద్యకి ఇలా చక్కటి సార్థకత దొరుకుతోందని ఆకాశంలో తేలిపోతున్న ఆ రోజుల్లోనే... ‘పార్వతి’ నన్ను నేలకి దించింది. నేను అప్పటిదాకా దృష్టిసారించని ఓ అణగారిన వర్గం అటు సమాజపరంగా, ఇటు ప్రభుత్వపరంగా హింసకి బలవుతోందన్న నిజాన్ని నా కళ్ళకు కట్టించింది. ఆ పార్వతే... జై భీమ్‌లోని చిన్నతల్లి పాత్రకి మూలం!  

సూట్‌కేసు నిండుగా డబ్బు తెచ్చారు!
నేనో సమావేశం కోసం తమిళనాడులోని నైవేలికి వెళ్లి బస్సు కోసం ఎదురుచూస్తుండగా పార్వతి తన పాపతో వచ్చింది. ‘నా భర్త వారం నుంచీ కనిపించడంలేదు సార్‌! పోలీసులు స్టేషన్‌లో ఆయన్ని విపరీతంగా కొట్టడం చూశాను. మళ్లీ వెళితే ‘తప్పించుకుని వెళ్లిపోయాడు’ అంటున్నారు!’ అంటూ భోరుమంది. ఆమె దైన్యం చూసి ఓ పక్క కన్నీళ్లు... మరో పక్క కోపమే కాదు... అన్నెంపున్నెం ఎరగని అభాగ్యులను హింసిస్తున్న ఈ సమాజంలో నేనూ భాగమైనందుకు అపరాధభావమూ నన్ను చుట్టుముట్టింది. ఆ ఉద్వేగంతోనే ఆమె చేత ‘హెబియస్‌ కార్పస్‌’ పిటిషన్‌ వేయించాను. ఆ తర్వాత జరిగినవన్నీ చిత్రంలో యథాతథంగా తీసుకురాగలిగారు కానీ అందులో చూపించని విషయాలూ ఎన్నో ఉన్నాయి. సినిమాలో చూపినట్టు పార్వతిని మాత్రమే కాదు... నన్నూ ప్రలోభపెట్టాలనుకున్నారు పోలీసులు. పార్వతి భర్త లాకప్‌డెత్‌కి కారణమైన ఎస్సై నా ఆఫీసుకొచ్చి ‘కాపాడండయ్యా!’ అంటూ కాళ్లపైన పడ్డాడు. సూట్‌కేసునిండా డబ్బుని నా ముందుపెట్టాడు. రోజుకి మూడురూపాయలు కూడా సంపాదించని పార్వతి లక్షలరూపాయల్ని కాదంటే నేనేమనాలి? వెంటనే జడ్జి దగ్గరకెళ్లి ఫిర్యాదు చేశాను. ఆయన అప్పటికప్పుడు రాష్ట్రడీజీపీని రప్పించి... గట్టిగా మందలించారు. ఏదేమైతేనేం... ఈ కేసు తర్వాతే లాకప్‌డెత్‌ బాధితులకి ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వడం... బాధ్యులైన పోలీసులపైన కఠిన చర్యలు తీసుకోవడం మొదలైంది.

తీవ్రవాదుల లాయర్‌నట!
సీనియర్‌ న్యాయవాదిగా మంచి గుర్తింపు ఉన్న నన్ను న్యాయమూర్తిగా ప్రయత్నించమని జస్టిస్‌ కృష్ణయ్యర్‌ సూచించారు. నేను దరఖాస్తు చేస్తే ‘ఈయన తీవ్రవాదుల కోసం హాజరయ్యే వ్యక్తి!’ అంటూ తమిళనాడు ప్రభుత్వం మోకాలడ్డింది. చివరికి సుప్రీం కోర్టు జోక్యం చేసుకుని ‘న్యాయవాదిగా ఎవరికోసం హాజరైనా తప్పులేదు. అది న్యాయమూర్తి పదవికి అడ్డుకాదంటూ’ చరిత్రాత్మక తీర్పునిచ్చింది. అలా 2006లో న్యాయమూర్తినయ్యాను. ప్రభుత్వం అందించే గన్‌మెన్‌నీ వద్దనేశాను. నా కోర్టులో- జడ్జిల్ని ‘మి లార్డ్‌’ అని పిలిచే బ్రిటిష్‌కాలం నాటి గౌరవసంబోదనను నిషేధించాను. సాక్షుల్ని బోనులో నిలబెట్టడం కాకుండా కూర్చోబెట్టి మాట్లాడించే పద్ధతిని పరిచయం చేశాను. తల్లిదండ్రులతోపాటూ చిన్నపిల్లలూ వస్తే వాళ్లకి ఆడుకునే స్వేచ్ఛ కల్పించాను (జైభీమ్‌లో దీని రిఫరెన్స్‌ ఉంది). ఆఫీసుకి అరగంట ముందుగా రావడం... ప్రతిరోజూ మూడుగంటలు అదనంగా పనిచేయడం అలవాటు నాకు. ఆదివారాల్లో కూడా డిక్టేషన్స్‌ ఇస్తుండేవాణ్ణి. దాంతో కేసుల్లో వాయిదాల్లేకుండా... నేరుగా తీర్పు ఇవ్వసాగాను. అలా ఏడేళ్లలో 96 వేల కేసుల్ని చూడగలిగాను. ముఖ్యంగా లాకప్‌డెత్‌ కేసుల్లో కేవలం వారంలోనే తీర్పులివ్వడం ప్రారంభించాను. అంతేకాదు, పదవి చేపట్టిన మొదటిరోజునే నా ఆస్తుల వివరాలని వెల్లడించాను. ఇక చివరి రోజు నా కోసం వీడ్కోలు పార్టీలేవీ వద్దనీ... ప్రభుత్వ వాహనం కూడా అక్కర్లేదనీ... లోకల్‌ రైల్లోనే ఇంటికి వెళ్లాను!

సినిమా వచ్చిందిలా...
జై భీమ్‌ దర్శకుడు జ్ఞానవేల్‌... జర్నలిస్టుగా ఉన్నప్పటి నుంచీ నాకు తెలుసు. ఓసారి నాతోపాటూ నైవేలిలో జరిగిన ఓ పుస్తక ప్రదర్శనకి వచ్చిన తనకి... అక్కడేతొలిసారి పార్వతిని చూసిన విషయం చెప్పాను. మూడేళ్లకిందట దాన్నే సినిమాగా తీస్తానని ముందుకొచ్చాడు. ఇందులోని నా పాత్రని సూర్య చేస్తున్నాడనగానే చాలా ఆనందమేసింది! ఒకప్పటి నా జులపాల జుట్టు, గెడ్డమున్న ఆహార్యాన్నే కాదు... నా బాడీ లాంగ్వేజ్‌నీ తెరపైకి తీసుకురాగలిగారాయన. అన్నట్టు... సినిమా విడుదలైన కొన్నాళ్లకి అసలైన పార్వతిని ఓ ఛానెల్‌ ఇంటర్వ్యూ చేసింది. దాన్ని చూసిన ఓ ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ నాకు ఫోన్‌ చేసి ‘సార్‌! ఆమెకి నెలనెలా పదివేల రూపాయలు ఇద్దామనుకుంటున్నాను... కాంటాక్ట్‌ ఇస్తారా!’ అన్నాడు. జైబీమ్‌ సినిమాలో పోలీసువాళ్లని ఎంత పెద్ద విలన్‌లుగా చూపించాం కదా! అయినా సరే... అదే శాఖకి చెందిన ఓ వ్యక్తి ఆమెకి జీవితాంతం సాయపడతానని ముందుకు వస్తాననడం విని... అతనికి మనసులోనే సెల్యూట్‌ చేశాను!


ప్రేమ వివాహమే!

సినిమాలో సూర్య పాత్రలాగే నేను నలభైఏళ్లదాకా ఒంటరిజీవితమే గడిపాను. ఉపాధ్యాయుల కోసం న్యాయవాదిగా వెళ్తున్నప్పుడు... కాలేజీ ప్రొఫెసర్‌గా చేస్తున్న భారతితో పరిచయమైంది. ప్రేమించి పెళ్ళిచేసుకున్నాం. మాది కులాంతర వివాహమే. మాకు కీర్తి అని ఓ అమ్మాయి... దంతవైద్యురాలిగా చేస్తోంది.

Advertisement


ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న