ఇది... చెరగని మేకప్‌! - Sunday Magazine
close

ఇది... చెరగని మేకప్‌!

గులాబీ రంగు పెదవులు... తీరైన కనుబొమలు... కాటుక అద్దిన కనులు... అందరికీ ఉండవు. కానీ ‘ఉంటే బాగుంటుంది కదా’ అనుకోని అతివలు ఉండరు. ఈ కోరికను తీర్చేందుకు వచ్చిందే ‘పర్మినెంట్‌, సెమి పర్మినెంట్‌ టాటూ మేకప్‌’.

మేకప్‌... ఎవరి అందాన్నైనా రెట్టింపు చేస్తుంది. మామూలుగా యావరేజ్‌ అనిపించే అమ్మాయిల్నైనా మేకప్‌తో చూపు తిప్పుకోనివ్వని అందగత్తెల్ని చేసేస్తుంటారు బ్యుటీషియన్లు. అందుకే, ప్రపంచ సుందరులైనా బయటికి వస్తే కాస్తో కూస్తో మేకప్‌ ఉండాల్సిందే. కానీ మామూలు మేకప్‌లు- ఎంత ఖరీదైనవైనా- కొన్ని గంటల్లోనే చెరిగిపోతాయి. పైగా అందరికీ రోజూ మేకప్‌ వేసుకునే తీరిక ఉండదు. కాబట్టి, చాలామంది ప్రత్యేక సందర్భాల్లోనూ పార్టీలకు వెళ్లేటప్పుడే వేసుకుంటుంటారు. ఇకపోతే, కొందరికి కనుబొమలు బాగా పలుచగా ఉంటాయి. దాంతో ఐ బ్రో పెన్సిల్‌తో అవి ఒత్తుగానూ, ఒంపు తిరిగి అందంగా కనిపించేలానూ తీర్చిదిద్దుతారు. మరికొందరికి పెదవులు, మరీ నల్లగా ఉండొచ్చు. అలాంటప్పుడు లిప్‌ లైనర్‌తో పెదవుల్ని తీరైన రూపంలోకి మార్చి, కోరిన రంగు లిప్‌స్టిక్కుతో వాటిని అందంగా మార్చుతారు. కానీ బ్యూటీ పార్లర్‌లోలా అందంగా వేసుకోవడం అందరికీ రాకపోవచ్చు. దీనికి పరిష్కారంగా ప్రాచుర్యంలోకి వచ్చిందే ‘పర్మినెంట్‌, సెమి పర్మినెంట్‌ టాటూ మేకప్‌’.

పచ్చబొట్టే మేకప్‌

పర్మినెంట్‌ మేకప్‌... ఇదో రకం పచ్చబొట్టు స్టైల్‌. అవును, మామూలుగా ఫ్యాషన్‌ కోసం పచ్చబొట్లను ఒంటి మీద రకరకాల డిజైన్లలో వేయించుకుంటారు కదా... అలాగే కనుబొమలు ఒత్తుగా తీరైన ఆకృతిలో కనిపించేలా వెంట్రుకలను పోలినట్లు నలుపు రంగుతో కనుబొమల దగ్గర టాటూ వేస్తారు. దీన్నే మైక్రో బ్లేడింగ్‌ అంటారు. ఇక, పెదవులు గులాబీ రంగులో కావాలంటే ఆ రంగు పచ్చబొట్టుని పెదవుల మీద వేస్తారు. అంతేకాదు, పచ్చబొట్టునే లిప్‌ లైనర్‌గా వేసి మన ముఖాకృతికి తగ్గట్లు పెదవుల రూపాన్నీ మార్చుతారు. ఇలాగే కనురెప్పల పైన ఐలైనర్‌ పెట్టుకున్నట్లు కూడా టాటూ వేయించుకోవచ్చు. ఇవేకాదు, ముఖం మీద మచ్చలు కనిపించకుండా చర్మం రంగు ఉండే టాటూతో మేకప్‌ వేస్తారు. ఇక, ‘భవిష్యత్తులో వేరే రంగు లిప్‌స్టిక్‌ వేయించుకోవాలనుకుంటే పచ్చబొట్టు పోదుగా... అనే సందేహమూ అక్కర్లేదు. ఎందుకంటే... చర్మ తత్వాన్ని బట్టి సెమి పర్మినెంట్‌ మేకప్‌ ఏడాది, ఏడాదిన్నర మాత్రమే ఉంటుంది. పర్మినెంట్‌ మేకప్‌ అయితే రెండున్నరేళ్ల వరకూ ఉంటుంది. కాబట్టి, ఆ తర్వాత మళ్లీ కోరినట్లు చేయించుకోవచ్చు’ అంటారు హైదరాబాద్‌లోని హెచ్‌కే పర్మినెంట్‌ మేకప్‌ క్లినిక్‌ నిర్వాహకురాలు హర్షిత. ఇది మేకప్‌లా కాకుండా సహజమైన అందమే అన్నట్లు ఉంటుంది కాబట్టి, రంగులు చెరిగిపోతున్న సమయంలోనూ పిచ్చిగా ఏం కనిపించదు. తెలుగు రాష్ట్రాలతో పాటు, దేశవ్యాప్తంగానూ ఈ చికిత్సను చేసే బ్యూటీపార్లర్లు ఉన్నాయి. అయితే, దేనికైనా మంచీ చెడూ ఉంటుందన్నట్లూ ఈ మేకప్‌ గురించి పూర్తిగా తెలుసుకున్న తర్వాత నిపుణుల దగ్గర మాత్రమే వేయించుకోవాలి సుమా.


ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న