ఆన్‌లైన్‌లో ఆటాపాటా! - Sunday Magazine
close

ఆన్‌లైన్‌లో ఆటాపాటా!

బడులు తెరవలేదు కానీ, విద్యార్థులకు ఆన్‌లైన్‌ క్లాసులు మొదలయ్యాయి. స్కూల్‌ అంటే చదువు మాత్రమే కాదు, అక్కడ ఆటపాటలూ భాగమే. కానీ ఆన్‌లైన్లో వాటికి చోటు లేకుండా పోతోంది. అయితే తమ పిల్లల సమగ్ర వికాసానికి ‘కో కరిక్యులర్‌ యాక్టివిటీస్‌’ కూడా అవసరమని భావిస్తున్న తల్లిదండ్రులు చాలామంది ఉన్నారు. అలాంటి వారికోసమే వచ్చాయి ఈ అంకుర సంస్థలు.


గురుశిష్యుల్ని కలుపుతుంది...

వివిధ కళలకు సంబంధించిన గురువుల్నీ, శిష్యుల్నీ కలిపే వేదిక ప్లేడేట్‌డాట్‌ఇన్‌. 15 ఏళ్లలోపు పిల్లలకు ఇక్కడ టీచర్లు పాఠాలు చెబుతారు. ఈ సంస్థని రెండేళ్ల కిందట ముంబయికి చెందిన అన్నాచెల్లెళ్లు ఆదిత్య, అనఘ రాజాధ్యక్ష ప్రారంభించారు. వీరి తల్లి కూడా టీచర్‌.  పిల్లల చదువుల గురించి వారి తల్లిదండ్రులతో ఆమె ఓపిగ్గా మాట్లాడే తీరు, పిల్లల కోసం తల్లిదండ్రులు పడే తపన చూశాక తాము ఈ సంస్థ పెట్టాలనుకున్నామని చెబుతారు. ఆసక్తులూ, అలవాట్లూ, ఇష్టాలే వ్యక్తిత్వ నిర్మాణంలో కీలకం కాబట్టి... కథక్‌, యోగా, స్టోరీటెల్లింగ్‌, లెగో, కోడింగ్‌... ఇలా 30 అంశాల్లో శిక్షణ ఇవ్వాలనుకుని సంస్థని ప్రారంభించారు. స్టెమ్‌(సైన్స్‌ టెక్నాలజీ ఇంజినీరింగ్‌ మ్యాథ్స్‌) సబ్జెక్టుల్లో ప్రయోగాల విభాగమూ వీరి ప్రత్యేకత. వెబ్‌సైట్‌లోకి వెళ్లి కావాల్సిన అంశం, సమయం ఎంపికచేసుకుని ఆన్‌లైన్‌ క్లాసులకు హాజరుకావొచ్చు. దాదాపు 15 వందల మంది టీచర్లు ఈ వేదికమీద పాఠాలు చెబుతున్నారు. వీరి బృందం ప్రతి నగరం, పట్టణంలోని అత్యుత్తమ గురువుల్ని గుర్తించి వారు ఈ వేదికమీద పాఠాలు చెప్పేలా చూస్తారు. ప్రతి టీచర్‌కీ తల్లిదండ్రులు ఇచ్చే రేటింగ్‌, రివ్యూ వెబ్‌సైట్‌లోనే ఉంటాయి. వాటినిబట్టి గురువుల్నీ, కోర్సుల్నీ ఎంపికచేసుకోవడం సులభం కూడా. ‘మార్కెటింగ్‌, ఫీజు వసూలు లాంటి బోధనేతర పనుల్ని టీచర్లకు తగ్గిస్తే వారు పాఠాలపైన మరింత దృష్టి పెట్టడానికి వీలవుతుంది’ అనేది
ఈ అన్నాచెల్లెళ్ల మాట.


ప్రతిభ ప్రదర్శిస్తారా..?

ది విద్యార్థుల కోసమే ఏర్పాటైన ఆన్‌లైన్‌ వీడియో ప్లాట్‌ఫామ్‌. దీన్లో నైపుణ్యాల్ని వీక్షించడం, నేర్చుకోవడం, ప్రదర్శించడం... ఇలా మూడు రకాలైన అంశాలు ఉంటాయి. విద్యార్థులు ఒక్కరిగా లేదంటే బృందంగా ఏర్పడి తమ నైపుణ్యాల్ని చూపించే వీడియోల్ని దీన్లో పెట్టొచ్చు. సంగీతం, ఫొటోగ్రఫీ, డాన్స్‌, పెయింటింగ్‌, రచన, క్విజ్‌... ఈ విభాగాల్లో 1-12 తరగతుల విద్యార్థులకు తరచూ పోటీలు జరుగుతుంటాయి. ‘విద్యార్థులు తమ ప్రతిభను చూపే వీడియోల్ని ఈ ఆప్‌లో అప్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఈ వీడియోల్ని ఇక్కణ్నుంచి మరే సోషల్‌ మీడియాలోనూ షేర్‌చేసుకునే వీలుండదు. పిల్లలు తమ ఈడు వారి ప్రదర్శనలు చూస్తూ ఆస్వాదిస్తారు, ఆనందిస్తారు, అదే సమయంలో నేర్చుకుంటారు కూడా’ అని చెబుతారు ఎల్‌ఎక్స్‌ఎల్‌ ఐడియాస్‌ వ్యవస్థాపకుడు డాక్టర్‌ సయ్యద్‌ సుల్తాన్‌ అహ్మద్‌. ఈ సంస్థే క్రేయాన్‌ ఆప్‌ని తెచ్చింది. వేలమంది పాఠశాల విద్యార్థులు తమ ప్రతిభను ప్రదర్శించడానికి ఈ వేదికను ఉపయోగించుకుంటున్నారు. గతేడాది ఈ ఆప్‌లో ‘ఇండియా ఇంటర్నేషనల్‌ కిడ్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌’ను నిర్వహించారు. ఆ సమయంలో నెలరోజులపాటు 150కిపైగా పిల్లల సినిమాల్ని దీన్లో ప్రదర్శించారు. అప్పుడే ఫిల్మ్‌ మేకింగ్‌పైనా నిపుణుల వీడియో పాఠాలు పెట్టారు. విద్యార్థుల ప్రతిభను వెలికితీసే ప్రఖ్యాత ‘విజ్‌కిడ్‌’ పోటీల్నీ గతేడాది ఈ వేదికమీద నిర్వహించారు. నగరాలకు మాత్రమే పరిమితమైన విజ్‌కిడ్‌ పోటీల్ని ఆన్‌లైన్‌ ద్వారా పట్టణాలకూ తీసుకువెళ్లగలిగామని చెబుతారు అహ్మద్‌.


ఇష్టాలు తెలుసుకోండి!

దువంటే లెక్కలూ, సైన్సూ, సోషల్‌, కంప్యూటర్స్‌ ఈ సబ్జెక్టులే కాదు, అంతకుమించి పిల్లల ఆలోచనల పరిధిని పెంచేలా ఉండాలి. అవి కో కరిక్యులర్‌ యాక్టివిటీస్‌తోనే సాధ్యం. ఈ అదనపు చదువులు వారిలో సమస్యల్ని పరిష్కరించుకునే సామర్థ్యాన్నీ, సృజనాత్మకతనీ, సామాజిక నైపుణ్యాలనీ పెంచుతాయి. అందుకే ఈ విభాగాల్లోనూ వారికి ఆన్‌లైన్‌ పాఠాలు చెప్పాల్సిన అవసరం ఉందంటారు ఐఐఎమ్‌ కలకత్తా పూర్వవిద్యార్థి అయిన ఆశిష్‌ గుప్తా. అందుకోసమే ‘బేంబినోస్‌డాట్‌లైవ్‌’ పోర్టల్‌ను తెచ్చారు. చిన్నపుడే హాబీలు ఏర్పరచుకునే, ఇష్టాల్ని తెలుసుకునే అవకాశాన్ని పిల్లలకు కల్పించడమే దీని ముఖ్య ఉద్దేశం. పిల్లల్లోని సహజమైన ప్రతిభను వెలికితీసేందుకు ఈ వేదిక ఉపయోగపడుతుంది అంటారు ఆశిష్‌. 4-15 మధ్య వయసున్న పిల్లల్ని దృష్టిలో పెట్టుకుని ప్రారంభించిన ఈ పోర్టల్‌లో డాన్స్‌, ఫిట్‌నెస్‌, వ్యక్తిత్వ వికాసం, పెయింటింగ్‌, త్రీడీ క్విల్లింగ్‌, స్టోన్‌ ఆర్ట్‌, చదరంగం... ఇలా 40 విభాగాల్లో పాఠాలు చెబుతారు. ఇండియాతోపాటు 15కుపైగా దేశాలకు చెందిన పిల్లలూ ఈ వేదికను ఉపయోగించుకుంటున్నారు. పిల్లల జీవనశైలి నైపుణ్యాల విషయంలో తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారనీ, కొందరు పిల్లలు ఒకటికంటే ఎక్కువ నైపుణ్యాల్లో శిక్షణ తీసుకుంటున్నారనీ చెబుతారు ఆశిష్‌. బెంగళూరు కేంద్రంగా పనిచేసే ఈ సంస్థ ఇప్పటివరకూ 15వేల మంది విద్యార్థులకు సేవలు అందించింది.


ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న