నాలుగు రోజులే పని ఉంటే... - Sunday Magazine
close

నాలుగు రోజులే పని ఉంటే...

పని వేళలు ఎంత తగ్గితే ఉత్పత్తి అంత ఎక్కువ అంటున్నారు ఐస్‌ల్యాండ్‌ పరిశోధకులు. చాలాచోట్ల ఉన్నట్లే అక్కడా వారానికి ఐదు పని దినాలే. రోజుకి ఎనిమిది గంటల చొప్పున మొత్తం 40 పని గంటలు ఉండేవి. అయితే వాటిని నాలుగు రోజులూ 36 గంటలకు తగ్గించడం వల్ల ఉద్యోగులు వేగంగా పనిచేయడమే కాదు, అంతకుముందుకన్నా సమర్థంగా పనిచేయడంతోపాటు ఉత్పత్తి శాతమూ పెరిగిందట. కార్యాలయాలూ స్కూళ్లూ ఆసుపత్రులూ రక్షణ విభాగాల్లో ఈ విధానాన్ని అమలు చేసినప్పడు- అన్నిచోట్లా గతంలోకన్నా మంచి ఫలితాలే వచ్చాయట. కొన్నిచోట్ల మాత్రం ఎలాంటి మార్పూ లేదు. అంటే- తగ్గలేదు, పెరగలేదు. కానీ ఉద్యోగులు మాత్రం ఆనందంగా ఆరోగ్యంగా కనిపించారట. పైగా నాలుగు రోజులూ విధిగా చేయాలన్న నిబంధన లేకపోవడంతో కొందరు ఎక్కువ సమయం పనిచేసి మూడున్నర రోజుల్లోనే తమ పనిని ముగించగా, మరికొందరు రోజు విడిచి రోజు సెలవు తీసుకున్నారట. షిప్టుల వారీగా పనిచేసే ఉద్యోగులకి అవసరం మేరకు వెసులుబాటు కల్పించారట. ఉదాహరణకు పోలీసు విభాగంలో ఒక వారం ఎక్కువ, మరో వారం తక్కువ గంటలు పనిచేస్తామన్నారట. దాంతో అక్కడా మంచి ఫలితాలే కనిపించాయట. మొత్తమ్మీద తక్కువ పనిగంటల వల్ల అటు సంస్థలకీ ఇటు ఉద్యోగులకీ కూడా లాభమే అన్నది వాళ్ల అధ్యయనాల సారాంశం.


నిద్ర తగ్గిందా?

వారంరోజులపాటు వరసగా రోజూ ఆరుగంటలకన్నా తక్కువగా నిద్రపోతే ఆరోగ్యంమీద ఒక్కసారిగా ప్రభావం చూపించకపోవచ్చు. కానీ దాని ఫలితం చాలానే ఉంటుంది అంటున్నారు దక్షిణ ఫ్లోరిడా విశ్వవిద్యాలయ పరిశోధకులు. వరసగా మూడు రోజులపాటు నిద్ర తగ్గితేనే మానసిక, శారీరక ఆరోగ్యం రెండూ దెబ్బతింటాయనేది వాళ్ల తాజా పరిశీలన. మధ్య వయసులో ఇది మరీ అవసరం అంటున్నారు. ఇందుకోసం వీళ్లు రెండు వేలమంది మధ్య వయస్కుల్ని ఎంపికచేసి, తక్కువ నిద్రపోయేలా చేసి శారీరక, మానసిక ఆరోగ్యాన్ని
పరిశీలించగా- వాళ్లలో కోపం, చికాకు... వంటివి ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. అదేసమయంలో నొప్పులు, శ్వాసకోశ, జీర్ణకోశ వ్యవస్థలో లోపాలూ తలెత్తాయట. అంతేకాదు, రోజుకి 20 నిమిషాల నిద్ర తగ్గినా అది వాళ్ల పనితీరుమీదా పడుతుందట. కాబట్టి ఎవరికైనా ఆరు గంటలకన్నా ఎక్కువ నిద్ర అవసరం అంటున్నారు.


చెవులకీ లెన్స్‌ వస్తున్నాయి!

పెద్దవయసులో వినికిడి సమస్యలు సహజం. అందుకోసం ఇప్పుడు చాలామంది హియరింగ్‌ మెషీన్‌ను వాడుతున్నారనేది తెలిసిందే. ఈ రకమైన హియరింగ్‌ ఎయిడ్స్‌లో ఉన్న స్పీకర్ల నుంచి శబ్దం చెవిలోని కర్ణభేరికి చేరుతుంది. అయితే జర్మనీకి చెందిన వైబ్రోసోనిక్‌ అనే స్టార్టప్‌ కంపెనీ సరికొత్త హియరింగ్‌ కాంటాక్స్‌ లెన్స్‌ను రూపొందించింది. ఇప్పటివరకూ ఉన్నవాటికి భిన్నంగా వీటిల్లోని మైక్రో లౌడ్‌ స్పీకర్‌ నేరుగా కర్ణభేరికి ఆనుకుని ఉంటుందట. దాంతో వాళ్లకి ఎలాంటి ఇబ్బందీ లేకుండా వినిపిస్తుంది అంటున్నారు. వాటిల్లో అతి
సూక్ష్మమైన శబ్దాలూ దీని ద్వారా వినబడతాయట. పైగా ఇందులో అమర్చే మైక్రో లౌడ్‌ స్పీకర్‌ని ఎవరి ఇయర్‌ డ్రమ్‌ను బట్టి వాళ్లకి అనుగుణంగా డిజైన్‌ చేసి, చెవిలో అమరుస్తారట. దీనికోసం ప్రత్యేకమైన సర్జరీ అవసరం లేదనీ, పైగా దీనివల్ల చెవిలోపల మిషన్‌ ఉన్నట్లు కూడా ఎవరికీ తెలియదనీ అంటున్నారు ఉత్పత్తిదారులు.


గుండె జబ్బులకు చేపనూనె!

ఫ్యాటీ ఆమ్లాలు అనేక ఆరోగ్య సమస్యల్ని నివారిస్తాయి. అందుకే హృద్రోగాల నివారణకి చేప నూనె సప్లిమెంట్లను వాడమని సూచిస్తుంటారు. అయితే వీటిల్లో ఒక ప్రత్యేకమైన ఫ్యాటీ ఆమ్లం మాత్రమే గుండె ఆరోగ్యానికి ఎక్కువ మేలు చేస్తుందని చెబుతున్నాయి తాజా అధ్యయనాలు. సాధారణంగా మూడు రకాల ఫ్యాటీ ఆమ్లాలు ఆరోగ్యంలో కీలక పాత్ర వహిస్తున్నాయి. ఆల్ఫా-లినోలిక్‌ ఆమ్లం మొక్కలకు సంబంధించిన ఆహారంలో దొరికితే, ఈకోసాపెంటానోయిక్‌ ఆమ్లం(ఈపీఏ), డోకోసాహెక్సానోయిక్‌ (డీహెచ్‌ఏ) ఆమ్లాలు చేప నూనె సప్లిమెంట్లలో లభ్యమవుతాయి. చాలావరకూ ఈపీఏ, డీహెచ్‌ఏ రెండింటినీ మేళవించిన సప్లిమెంట్లను హృద్రోగులకి వైద్యులు ఇస్తుంటారు. కానీ ఇవి హృద్రోగాల్ని తగ్గించడంలో విఫలమైనట్లు కొన్ని అధ్యయనాల్లో తేలింది. ఇందుకోసం వీళ్లు వెయ్యి మందిని పదేళ్లపాటు పరిశీలిస్తూ వచ్చారట. అదే కేవలం ఈపీఏ సప్లిమెంట్లను వాడిన వాళ్లలో మెరుగైన ఫలితాలు కనిపించాయట. అంటే- ఫ్యాటీ ఆమ్లాల్లో దేని పనితీరు దానిదేననీ, కాబట్టి హృద్రోగులకు ఈపీఏ ఒక్కటే సిఫార్సు చేయాలనీ చెబుతున్నారు.

Tags :

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న