నల్ల ఉప్పు తిందాం..! - Sunday Magazine
close

నల్ల ఉప్పు తిందాం..!

‘ఉప్పు కప్పురంబు నొక్క పోలికనుండు.. చూడ చూడ రుచుల జాడవేరు..’ ఈ వేమన పద్యాన్ని మార్చి చదువుకోవాలిక. ఎందుకంటే ఇంతకాలం తెల్లని ఉప్పు మాత్రమే మనకు తెలుసు. ఇప్పుడు అందులోనూ అనేక రంగులుంటాయనీ వాటిల్లో నల్లనిది మరీ మంచిదనీ చెబుతున్నారు.

నిన్నమొన్న వచ్చిన హిమాలయన్‌ పింక్‌ సాల్ట్‌ ఇంకా పూర్తిగా అందరికీ చేరనే లేదు. ఇంతలోనే ఈ నల్లని ఉప్పేమిటా అనిపిస్తోంది కదూ. పింక్‌ సాల్ట్‌ మాదిరిగానే ఇదీ హిమాలయాల్లోని ఉప్పు గనుల నుంచి తవ్వి తీసినదే. అయితే హేలైట్‌ రూపంలో దొరికే ఈ రాళ్లను బాబుల్‌ చెట్టు బెరడు, ఉసిరి... ఇలా రకరకాల గింజలు, మూలికలు వంటి వాటిని జోడించి కొలిమిలో కాల్చి చల్లారుస్తారు. దాంతో అది గోధుమ, గులాబీ నుంచి నలుపురంగులోకి మారుతుంది. దీన్ని హిమాలయన్‌ బ్లాక్‌ సాల్ట్‌, సులేమణి నమక్‌... అంటూ రకరకాలుగా పిలుస్తారు. నిజానికి ఇది పూర్వం నుంచీ వాడుకలో ఉంది. కాలా నమక్‌ పేరుతో ఆయుర్వేద వైద్యంలో ఔషధంగా దీన్ని వాడేవారు. చాట్‌మసాలా, చట్నీలూ, సలాడ్‌లూ, రైతాల తయారీలోనూ దీన్ని వేస్తుంటారు. పండ్ల మీద చల్లుకునీ తింటారు. ఇందులోని ఔషధ గుణాల కారణంగా ఇప్పుడు దీన్ని సాధారణ టేబుల్‌ సాల్ట్‌కి బదులుగా వాడుతున్నారు.

అగ్నిపర్వతాల్లోని రాళ్లనుంచి తవ్వి తీసిన మరో రకం ఉప్పు కూడా ఉంది. దీన్ని లావా బ్లాక్‌ సాల్ట్‌ అంటారు. ప్రత్యేకంగా కాల్చి చేసినదైనా లావా రాళ్ల నుంచి వచ్చినదైనా రెండింటిలోనూ సల్ఫర్‌ ఉండటం వల్ల ఈ బ్లాక్‌ సాల్ట్‌కి ఓ ప్రత్యేకమైన రుచీ వాసనా ఉంటుంది. దాంతో ఆహారపదార్థాల రుచీ వాసనా పెరుగుతుంది. మామూలు ఉప్పుతో పోలిస్తే ఇందులో సోడియం శాతం తక్కువ.
అయితే ఈమధ్య కొన్ని ప్రాంతాల్లో నీళ్లమడుగుల్లో తయారైన ఉప్పుకే ఐరన్‌ సల్ఫైడ్‌, సోడియం బై సల్ఫైట్‌, రంగు కోసం కాస్త బొగ్గునీ కలిపి కూడా బ్లాక్‌ సాల్ట్‌ తయారుచేస్తున్నారు. కానీ సహజంగా తవ్విన నల్లఉప్పులో కాల్షియం, మెగ్నీషియం వంటి మూలకాలూ కలుస్తాయి. అందుకే అది ఆరోగ్యానికి మంచిది అంటారు ఆయుర్వేద వైద్యులు. ఈ ఉప్పు శరీరాన్ని చల్లబరుస్తుందట. ఇది జుట్టుకీ చర్మానికీ  మంచిదని సబ్బులూ టూత్‌పేస్టుల తయారీలోనూ వాడుతుంటారు.

ఆరోగ్యానికీ...
నల్ల ఉప్పు కాలేయంలో పైత్య రస ఉత్పత్తిని పెంచి గుండె మంట, నొప్పి రాకుండా కాపాడుతుందట. కడుపులో గ్యాస్‌ పెరిగి తేపుల్లాంటివి వస్తుంటే చిటికెడు నల్ల ఉప్పు నోట్లో వేసుకున్నా కాస్త నీళ్లలో కలిపి తాగినా తగ్గుతాయట.
* పొట్టలో విటమిన్ల శోషణను పెంచడంతోపాటు జీర్ణక్రియనీ మెరుగు చేస్తుందీ బ్లాక్‌ సాల్ట్‌. అజీర్తి సమస్యల్నీ తగ్గిస్తుంది.
* రోజుకి ఆరు గ్రా. అంటే- టీస్పూను కన్నా ఉప్పు వాడొద్దు అంటారు. బీపీ ఉన్నవాళ్లకైతే 3.75 గ్రా. కన్నా తక్కువే వాడాలి. కాబట్టి అదేదో బ్లాక్‌సాల్ట్‌ వాడితే గ్లూకోజ్‌ శాతం, బీపీ అదుపులో ఉంటాయి.
* నల్ల ఉప్పు కలిపిన నీళ్లతో స్నానం చేస్తే ఎగ్జిమా, స్కాబీస్‌... వంటి చర్మ సమస్యలూ తగ్గుతాయి. నల్ల ఉప్పులోని పొటాషియం కండరాల సంకోచాన్నీ తగ్గిస్తుంది. ముఖ్యంగా రుమటాయిడ్‌ ఆర్థ్రయిటిస్‌కి ఈ నల్ల ఉప్పు వల్ల ఫలితం ఉంటుంది. శుభ్రమైన బట్ట తీసుకుని దానికి వేడి చేసిన నల్ల ఉప్పుని అద్ది, నొప్పి ఉన్న చోట ఆ ఉప్పు బట్టను ఐదునిమిషాలపాటు పెట్టి నొక్కితే వాపు, మంట తగ్గుతాయి. ఇలా కొన్ని రోజులపాటు చేయాలి.
* టాన్సిల్సూ సైనసైటిస్‌తో బాధపడేవాళ్లు గోరువెచ్చని నీళ్లల్లో కాస్ల బ్లాక్‌సాల్ట్‌ కలిపి పుక్కిలించడం వల్ల ఫలితం ఉంటుంది. ఇది మెలటోనిన్‌ని ఉత్తేజితం చేయడం ద్వారా నిద్రపట్టేలా చేస్తుందట.
* గోరువెచ్చని నీళ్లలో నిమ్మరసం, కాస్త ఉప్పు వేసి పరగడుపున తాగితే బరువు తగ్గే అవకాశమూ లేకపోలేదు. అయితే మూత్రపిండాల వ్యాధులూ, బీపీ, గుండె సమస్యలున్నవాళ్లు అది ఏ రకమైనప్పటికీ మొత్తమ్మీద ఉప్పు వాడకాన్ని తగ్గించాలన్నది మర్చిపోకూడదు.

Advertisement


ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న