కాస్త కొత్తగా ఆలోచించారంతే..! - Sunday Magazine
close
కాస్త కొత్తగా ఆలోచించారంతే..!

ఈ ముగ్గురూ ఏదో రకంగా ప్రభుత్వంతో సంబంధం ఉన్నవాళ్లే... సర్కారు తరపున సేవలందిస్తున్నవాళ్లే. కానీ, అందరిలో ఒకరిగా ఉండిపోకుండా ప్రజల కోసం ఓ అడుగు ముందుకేస్తున్నారు. ఆ ఒక్క అడుగు కొత్తగా ఉండటంతో ప్రజలకి ఇదివరకెన్నడూలేని సేవలందిస్తున్నారు. తపన ఉండాలేకానీ ప్రజలకి సేవ చేయడానికి కొత్తదార్లు వాటికవే తెరుచుకుంటాయని నిరూపిస్తున్నారు.


ఇదో గాంధీగిరీ...

హైదరాబాద్‌లో వీధికుక్కల బెడద ఎక్కువ. వాటి నియంత్రణ బాధ్యతని అక్కడి మహానగర పాలక సంస్థ(జీహెచ్‌ఎంసీ) కొన్ని ప్రైవేటు సంస్థలకి గుత్తకిచ్చింది.  సమస్యేమిటో తెలియదుకానీ... ఆ పనులేవీ సరిగ్గా సాగట్లేదు. కుక్కల కళేబరాలు కుళ్ళి దుర్వాసన కొడుతున్నా ఎక్కడికక్కడే పడి ఉంటాయి. కానీ భాగ్యనగరంలోని హయత్‌నగర్‌ పరిధిలో అలాంటి కళేబరాలు ఉంటే ఒక్క ఫోన్‌ చేస్తే చాలు తానే వెళ్లి తొలగిస్తారు సామ తిరుమలరెడ్డి. ఆయన కార్పొరేటర్‌ మాత్రమే కాదు... పాలకపార్టీ సభ్యుడు కూడా! అయినా సరే అధికారులూ, సిబ్బంది తాను చెప్పింది వినకపోతే ఆ పనులేవో తానే చేస్తుంటాడాయన. మురుగునీటి కాల్వ పూడుకుపోతే డ్రైనేజీలో తానే దిగి పని పూర్తిచేస్తారు. ప్రజామరుగుదొడ్లు కంపుకొడుతున్నాయా... తానే చీపురుకి పనిచెబుతారు. వీధుల్లో చెత్త పేరుకుపోతే స్వయంగా కార్పొరేషన్‌ ట్రైసైకిల్‌తో వెళ్లి శుభ్రం చేస్తారు! ‘ఈ పనుల్ని స్వయంగా నేను చేస్తేనైనా సిబ్బందిలో చలనం వస్తుందని చేస్తున్నా...!’ అని చెబుతారాయన. ఈ గాంధీగిరీకి మంచి ఫలితాలే ఉన్నాయంటున్నారు ఇక్కడి ప్రజలు.


సైనిక కుటుంబాల కోసం...

సాధారణంగా యుద్ధంలో చనిపోయిన సైనికుల కుటుంబాలని భారత సైన్యం కంటికి రెప్పలా చూసుకుంటుంది. పిల్లల చదువు బాధ్యతని ప్రభుత్వమే తీసుకుంటుంది. ఆ కుటుంబం అన్నిరకాలా గౌరవప్రదమైన జీవితం గడిపేలా చూస్తుంది. కాకపోతే యుద్ధంలో కాకుండా ఏ ప్రమాదంలోనో, ఆత్మహత్య చేసుకునో మరణించినవాళ్ల కుటుంబానికి విరమణానంతర పరిహారాలూ, పింఛనూ తప్ప ఇంకేమీ ఉండవు. ఆ పింఛను కూడా యుద్ధంలో చనిపోయినవారికిచ్చే దాంట్లో ముప్పై శాతమే ఉంటుంది. అలాంటి సైనికుల భార్యలు పాచిపనిచేసుకుంటూ బతకడం చూశారట కల్నల్‌ వేంబు శంకర్‌. సైన్యంలో ఉన్నవాడు కాస్తా పదవీ విరమణ చేసి ఆ కుటుంబాల కోసం ‘ప్రాజెక్టు సంబంధ్‌’ని ప్రారంభించారు. ‘ఇలాంటి కుటుంబాలకి సాయం చేయడానికి ఆర్మీలో ప్రత్యేక సహాయ నిధులున్నా... వాటిని అందుకోవడానికి ఎన్నో రాతకోతలూ, లాంఛనాలూ ఉంటాయి. సైనికుల వితంతువుల్లో ఎక్కువమంది నిరక్షరాస్యులే కాబట్టి వాటిని అందుకోలేకపోతున్నారు!’ అని చెబుతున్నారు. మాజీ సైనికుల సంక్షేమాన్ని పర్యవేక్షిస్తున్న ‘డైరెక్టరేట్‌ ఆఫ్‌ ఆర్మీ వెటరెన్స్‌’ తరపున దేశమంతా తిరిగి అలాంటి మహిళలూ, పిల్లల్నీ ఆదుకుంటున్నారు. గత రెండేళ్లలో 30 వేలమంది వివరాలు సేకరించి... 27 వేల కుటుంబాలకి సాయం అందించారట. వాళ్ల వివరాల సేకరణ, ప్రయాణాల కోసం ప్రతినెలా తన పింఛనులో 30 శాతాన్ని కేటాయిస్తున్నారట.


ఆర్టీసీలో ‘హైటెక్‌’ అనౌన్స్‌మెంట్‌..!

నగరాలకి వెళ్లే కొత్తవాళ్లెవరైనా సిటీ బస్సులవిషయంలో గందరగోళపడుతుంటారు. ముఖ్యంగా బస్‌ టెర్మినస్‌లలో తమ ఊరికి వెళ్ళే బస్సుకి బదులుగా, అక్కడి నుంచి వచ్చే బస్సుని ఎక్కే అనుభవం చాలామందికి ఉంటుంది. పొరబాటున అలా ఎక్కినవాళ్లపైనా, పదేపదే తాము దిగాల్సిన స్టాప్‌ల గురించి అడుగుతున్నవాళ్లపైనా డ్రైవర్‌లు చూపే అసహనం అంతాఇంతా కాదు. అలాంటివాళ్ల మధ్య తాను నడిపే బస్సులో సొంత ఖర్చుతో ‘హైటెక్‌’ అనౌన్స్‌మెంటుని ఏర్పాటుచేశారు హైదరాబాద్‌కి చెందిన డ్రైవర్‌ మహ్మద్‌ సర్వర్‌ హుసేన్‌. ఉప్పుగూడ-సికింద్రాబాద్‌ రూటు బస్సు ‘2యు’ని నడుపుతుంటారాయన. బస్సు ఎక్కగానే ‘టీఎస్సార్టీసీ- హైదరాబాద్‌ మీకు స్వాగతం పలుకుతోంది...’ అంటూ మొదలయ్యే అనౌన్స్‌మెంట్‌ ఆ బస్సు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళుతుందో చెబుతుంది. ప్రతి స్టాపు దగ్గరా దాని వివరాలతోపాటూ, రాబోయే స్టాపుకి సంబంధించిన సమాచారమూ అందిస్తుంటుంది. హైదరాబాద్‌ మెట్రోరైళ్లలోని ప్రి-రికార్డెడ్‌ అనౌన్స్‌మెంట్‌ల స్ఫూర్తితోనే తాను దీన్ని ఏర్పాటుచేశానని చెబుతారు సర్వర్‌ హుసేన్‌. ఆయన తన ఆలోచనని ఐటీ రంగంలో ఉన్న వాళ్ళబ్బాయి సాజిద్‌ హుసేన్‌కి చెప్పి దీన్ని తయారుచేయించాడట. తన గళంతోనే ఈ ప్రీ-రికార్డడ్‌ అనౌన్స్‌మెంటుని రూపొందించాడు. ఉప్పుగూడ-సికింద్రాబాద్‌ మధ్య నడిచే ఈ బస్సు ఎక్కువ భాగం హైదరాబాద్‌ పాత బస్తీలోనే ప్రయాణిస్తుంది. ఇక్కడ ఆర్టీసీ బస్సులు ఎక్కేవాళ్లలో చదువురానివాళ్లే ఎక్కువ. వాళ్లకి ఈ అనౌన్స్‌మెంట్‌ ఎంతో ఉపయోగపడుతోందట. బస్సులో దీన్ని ఏర్పాటుచేసిన తర్వాత నెలలోనే రోజుకి రెండువేల రూపాయలదాకా ఆదాయం పెరిగిందని చెబుతున్నారు ఆర్టీసీ అధికారులు. అది తెలిసి టీఎస్సార్టీసీ ఎండీ సునీల్‌శర్మ హుసేన్‌ని ప్రత్యేకంగా అభినందించి గణతంత్ర దినోత్సవం రోజు సన్మానం కూడా చేశారు!

- నారా జగన్మోహన్‌, న్యూస్‌టుడే, కేశవగిరి

Advertisement

Tags :

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న