ప్రపంచాన్ని చూసొద్దాం రండి! - Sunday Magazine
close

ప్రపంచాన్ని చూసొద్దాం రండి!

కొత్త ప్రదేశాల్ని చూడటం, కొత్త సంస్కృతుల్ని తెలుసుకోవడమంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. కానీ పర్యటనలు ఖర్చుతో కూడిన వ్యవహారం. సమయంతో పాటు ప్రణాళికా అవసరం. అయితే కొందరికి ప్రపంచాన్ని చూసిరావాలన్న తపన ముందు మిగిలినవన్నీ చిన్నబోతాయి. అలా పర్యటిస్తూనే ఆ విశేషాల్ని యూట్యూబ్‌ ద్వారా పంచుకుంటున్నారీ తెలుగు యువకులు!

తక్కువ బడ్జెట్‌లో ప్రయాణమా...

దివేలతో మున్నార్‌-అలెప్పీ, రూ.15వేలతో మనాలీ, రూ.40 వేలతో దుబాయి... ‘తెలుగు ట్రావెలర్‌’ యూట్యూబ్‌ ఛానెల్లో కనిపించే వీడియోల శీర్షికలు ఇవి. హైదరాబాద్‌కు చెందిన రాజిరెడ్డికి కొత్త ప్రదేశాలు చూడటమంటే ఇష్టం. ఓ పక్క ఉద్యోగం చేస్తూనే వారాంతాల్లో కొత్త ప్రదేశాలు చుట్టొచ్చేవాడు. ఆ విషయాల్ని స్నేహితులతో పంచుకునేవాడు. అలాంటపుడు చాలామంది బడ్జెట్‌ ఎంత అయింది, ఏ హోటల్‌లో దిగాలి, ఎలా వెళ్తే బావుంటుంది... లాంటి ప్రశ్నలు ఎక్కువగా అడిగేవారట. ఈ ప్రశ్నలు అందరికీ వస్తాయి కాబట్టి, ఆ సందేహాలను తీర్చేలా తాను వెళ్లే ప్రదేశాల విశేషాల్ని చూపిస్తూ యూట్యూబ్‌లో పెడితే బావుంటందనుకున్నాడు రాజిరెడ్డి. తరచూ భారత్‌లోని వివిధ ప్రాంతాలకూ అప్పుడప్పుడూ విదేశాలకూ వెళ్తూ ఆ వీడియోల్ని పెడుతుంటాడు. అతడు చేసిన వీడియోల్లో కశ్మీర్‌, కులూ, మనాలీ, లేహ్‌, సిక్కిం, లోనోవాలా, గోవా, లక్షద్వీప్‌, కేరళ, గోకర్ణ, అరకు, అనంతగిరి యానాం, ఊటీ... ఇలా అన్ని ప్రాంతాలూ కనిపిస్తాయి. వీటితోపాటు యూఏఈ, రష్యా, మలేషియా, థాయిలాండ్‌ లాంటి విదేశీ యాత్రల వివరాలూ ఉంటాయి. ఏ ప్రాంతానికి వెళ్లినా పొదుపుగా ఎలా ఉండొచ్చు లాంటి విషయాల్ని ఈ వీడియోల్లో పంచుకుంటాడు. వచ్చే అయిదేళ్లలో ప్రపంచం మొత్తం చుట్టేసి ఆ వివరాల్ని తెలుగువాళ్లతో పంచుకుంటానంటాడు రాజిరెడ్డి.

మోటోవ్లాగ్‌ సన్నీ...

తెలుగులో మోటో వ్లాగర్స్‌ తక్కువే. తెలుగు మోటో వ్లాగర్‌ అని చెప్పగానే గుర్తొచ్చే పేరు ‘బయ్యా సన్నీ యాదవ్‌’. సూర్యాపేట్‌కు చెందిన ఈ కుర్రాడు తనకు ఎంతో ఇష్టమైన బైక్‌ రైడింగ్‌నే వృత్తిగా చేసుకుని కొత్త ప్రదేశాలకు వెళ్లొస్తూ ఆ విశేషాల్ని వీడియోల ద్వారా యూట్యూబ్‌ ఛానెల్‌(బయ్యా సన్నీ యాదవ్‌)లో పంచుకుంటాడు. హిందీలో మోటో వ్లాగర్స్‌ని చూశాక తనకీ ఆలోచన వచ్చిందని చెప్పే సన్నీ... కేవలం మూడేళ్లలో పది లక్షల సబ్‌స్క్రైబర్లను సంపాదించాడు. ఓసారి కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకూ బైక్‌ మీద ట్రిప్‌ వేశాడు సన్నీ. ఈ మధ్యనే ఈశాన్య రాష్ట్రాల్ని చుట్టొచ్చాడు. పాకిస్థాన్‌, బంగ్లా, మయన్మార్‌, భూటాన్‌ సరిహద్దులవరకూ వెళ్లొచ్చాడు. నేపాల్‌లోనూ పర్యటించాడు. బైక్‌ రైడింగ్‌ అంటే, ఆసక్తి ఉండి సుదూరాలు వెళ్లడానికి సందేహించేవారిలో స్ఫూర్తినింపేందుకే తానీ సాహసం చేస్తానని చెబుతాడు సన్నీ. ఓవైపు పర్యటనల్ని ఆస్వాదిస్తూనే మరోవైపు ఆయా ప్రదేశాల విశేషాల్నీ, అక్కడికి వెళ్లడానికి అవసరమైన అనుమతులూ, అక్కడ ఉండే పరిమితుల గురించి పంచుకుంటాడు. లద్దాఖ్‌ పర్యటనను తాను జీవితంలో మర్చిపోలే నంటాడు సన్నీ. ఆ పర్యటన అతడికే కాదు, వీక్షకులకీ బాగా నచ్చింది. అందుకే ఆ పర్యటనకు సంబంధించిన వీడియోలకు 10-20 లక్షల వరకూ వ్యూస్‌ వచ్చాయి. ఎక్కువగా స్నేహితుల్ని వెంట తీసుకుని పర్యటనలకు వెళ్తుంటాడు. ప్రారంభంలో కబడ్డీ ఆటగాడిగా తాను సంపాదించిన మొత్తంతో పర్యటనలకు వెళ్లేవాడినని, ఇప్పుడిప్పుడే యూట్యూబ్‌తో వచ్చే ఆదాయంతో పర్యటనలు చేయగలుగుతున్నాననీ చెప్పే సన్నీ... బైక్‌మీద లండన్‌ వెళ్లడం తన లక్ష్యమని చెబుతాడు.

చీకటి ఖండం తెలుగులోకి...

తెనాలికి చెందిన ఉమా ప్రసాద్‌ కొన్నేళ్ల కిందట ఆఫ్రికాలోని మాలీలో ఒక ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేసేవాడు. పనిచేస్తూనే తానుండే ప్రాంతం గురించి వీడియోలు పెట్టాడు. స్పందన బాగా రావడంతో ఆ దేశంలో వివిధ ప్రాంతాలు తిరుగుతూ ఆ విశేషాల్ని యూట్యూబ్‌(ఉమా తెలుగు ట్రావెలర్‌)లో పెట్టేవాడు. వాటికి పెద్ద సంఖ్యలో వ్యూస్‌ వచ్చేవి. తర్వాత నుంచి కెన్యా, ఉగాండా, జాంబియా, ఇథియోపియా, టాంజానియా... తదితర ఆఫ్రికా దేశాలన్నీ తిరుగుతూ అక్కడి ప్రజల జీవనశైలి గురించి తెలుగులో చెప్పేవాడు. ‘టాంజానియాలోని హడ్జబే తెగ గురించి ఎనిమిది భాగాలుగా వీడియోలు తీశాడు. ఇప్పటికీ స్థిర నివాసం ఏర్పాటుచేసుకోకుండా అడవుల్లో సంచార జీవనం సాగిస్తూ జంతువుల్ని వేటాడి తినే తెగ అది. ఆ వీడియోలు మనవాళ్లకి తెగ నచ్చేశాయి. అక్కడ సఫారీలకు వెళ్లి ఆ వీడియోలూ పెట్టాడు. వందకు పైగా వీడియోల్ని అప్‌లోడ్‌ చేసి పెద్ద మొత్తంలో సబ్‌స్క్రైబర్లను సంపాదించాడు. ప్రపంచాన్ని చుట్టి రావాలనేది ఉమా లక్ష్యం. అందుకే ఉద్యోగాన్ని విడిచిపెట్టి ప్రస్తుతం పూర్తిస్థాయి ట్రావెలర్‌గా మారాడు. ఈ మధ్యనే రష్యా వెళ్లి అక్కడ విశేషాలతో అనేక వీడియోలు తీశాడు.


ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న