లాకెట్టుకు తలుపు... తలుపు తీస్తే... స్వామి! - Sunday Magazine
close

లాకెట్టుకు తలుపు... తలుపు తీస్తే... స్వామి!

మగువల అందాల్ని మరింత పెంచే ఆభరణాలే, కాస్త థ్రిల్‌నూ పంచేస్తే... చూడగానే ‘అబ్బ ఎంత బాగున్నాయో’ అనిపించడంతో పాటు ‘అరె చిత్రంగా ఉన్నాయే’ అని ఆశ్చర్యపోయేలా ఉంటే... ఆ తాజా ఫ్యాషన్‌ నేటి తరాన్ని ఇట్టే ఆకట్టుకోదూ. ఇదిగో ఈ కొత్తరకం పెండెంట్లు అలాంటి వారికోసమే!

వేడుక ఏదైనా సరే సింపుల్‌గానూ, హుందాగానూ ఉండాలనుకున్నప్పుడు చాలామంది అమ్మాయిలు పెండెంట్‌తో ఉన్న గొలుసుల్ని వేసుకోవడానికే ఎక్కువ మొగ్గు చూపుతుంటారు. అందులోనే కాస్త వెరైటీ రకాల్ని ఎంచుకుని చీరకు తగ్గట్టు సింగారించుకుంటారు. మెరిసే చెక్కుళ్లతో మొదలైన ఆ పెండెంట్‌ అందం... కెంపుల సొంపులతో, ఎనామిల్‌ మెరుపులతో, ముత్యాల ముస్తాబుతో... ఎప్పటికప్పుడు సొగసులద్దుకుంటూ ఆకట్టుకుంటోంది. అంతటితో ఆగిపోకుండా ఇప్పుడు ఒక్క అడుగు ముందుకేసి నయాలుక్‌తో ‘ఓపెన్‌ అండ్‌ షట్‌ పెండెంట్‌’లా వచ్చేసింది. టెంపుల్‌ డిజైన్లలో కనిపిస్తూ ఇటు ట్రెండీగానూ అటు ట్రెడిషనల్‌ టచ్‌తోనూ మెప్పిస్తోంది.   

అసలు వెరైటీ!
తెరిస్తే ఫొటో కనిపించే చిన్న చిన్న లాకెట్లకు చాలా భిన్నంగా, బంగారపు నగల్లోనూ వైవిధ్యం కోరుకునే వారికోసం బెంగళూరుకు చెందిన ‘నవరతన్‌’ వంటి జ్యువెలరీ సంస్థలు ఆలయాల ఆకృతుల్లో, ముచ్చటైన డిజైన్లలో ఈ టెంపుల్‌ పెండెంట్లని రూపుదిద్దుతున్నాయి. వీటిలో కొన్ని అద్భుతమైన చెక్కుళ్లూ, ఎన్నెన్నో నగిషీలతో కూడిన చక్కనైన గోపురాలూ, మూల స్తంభాలూ, దేవతామూర్తులూ, మహాద్వారాలూ... ఇలా అసలైన ఆలయాల నిర్మాణ శైలిలో ఉంటే, ఇంకొన్నేమో రంగురాళ్లు పొదిగిన వయ్యారాల హంసల డిజైన్లలో వస్తున్నాయి. దేనికదే ప్రత్యేకంగా కనిపించే ఈ పెండెంట్‌, ముద్దుగుమ్మల మెడలోని గొలుసుకు వేలాడిందంటే తప్పకుండా అందరి చూపూ తిప్పేసుకుంటుంది. ‘ఈ పెండెంటేదో వెరైటీగా ఉందే’ అని చేతిలో పట్టుకుని తెరిచి చూస్తే... అక్కడుంటుంది అసలు రహస్యం, కళ్లను కట్టిపడేసే అద్భుతం! తెరుచుకున్న ఆ పెండెంట్‌లో దేవీ దేవుళ్లు దర్శనమిస్తారు మరి. గణపతి, లక్ష్మీదేవి, వేంకటేశ్వరస్వామి, శివపార్వతులు, శేషతల్పంపై పడుకున్న రంగనాథ స్వామి... ఇలా ఒక్కో పెండెంట్లో ఒక్కోదేవుడి చిత్రాలు కొలువై ఉంటాయి. ఆ దృశ్యం మనసును హత్తుకుని అవాక్కయ్యేలా చేస్తుంది. ఏ నగ అందచందాల్నైనా చూడగానే చెప్పొచ్చేమో కానీ ఈ పెండెంట్‌ విషయంలో మాత్రం తెరిచి తరచి చూస్తేగానీ చెప్పలేం కదూ!


ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న