close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
మా మంచి మాస్టారు

మా మంచి మాస్టారు

చదువంటే ఆయనకు ఇష్టం. పేద విద్యార్థుల్ని చదివించడం ఇంకా ఇష్టం. అందుకోసం నాన్న ఇచ్చిన అరవై ఎకరాల ఆస్తిని కరిగించారు. ప్రభుత్వోద్యోగిగా నెలనెలా వచ్చిన జీతం మొత్తాన్నీ ఖర్చుపెట్టారు. ఆయన సేవల్ని గుర్తించి ఎమ్మెల్సీగా నిలబెడితే ఎన్నికయ్యాక జీతం కింద వస్తున్న రూ.రెండులక్షల్ని కూడా పేద విద్యార్థులకోసమే ఉపయోగిస్తున్నారు. అలా ఇప్పటివరకూ ఏడువేలమందిని ఉన్నత చదువులు చదివించారు రాము సూర్యారావు(ఆరెస్సార్‌) మాస్టారు.

మంచి మార్కులొచ్చి, పేదరికంతో చదువుకోలేకపోతున్నవారికి సాయం చెయ్యడానికి ముందుకొచ్చేవారి గురించి వింటూనే ఉంటాం. కానీ ప్రతిభ ఉన్నా పరిస్థితుల వల్ల మార్కులు తెచ్చుకోలేని పేదలెందరో ఉంటారు. అలాంటి వారి చదువు కోరికనూ తీరుస్తారాయన. తనింట్లోనే పెట్టుకుని తల్లిలా వారికి వండి పెడతారు. తండ్రిలా వారి అవసరాలన్నీ చూసుకుంటారు. ఫీజులు కట్టడంతోపాటు, గురువుగా దగ్గరుండి చదివిస్తారు. మరీ పేదరికంలో ఉన్న విద్యార్థులు ఇంటి దగ్గర అమ్మానాన్నా పడుతున్న కష్టాలను తలుచుకుని చదువుమీద దృష్టి పెట్టలేరు. అందుకే, పెద్దమనసుతో అలాంటి కుటుంబాలకూ నెలనెలా కొంత పంపిస్తారాయన. సొంత కుటుంబ భారాన్ని భార్యకొదిలేసి ఇలా కొన్ని వందల కుటుంబాలను ఆదుకుని, వేల మంది విద్యార్థులకు బంగరు భవితను అందించారు ఆరెస్సార్‌ మాస్టారు. ఆయన దగ్గర చదివిన వారిలో ఐఏఎస్‌లూ ఐపీఎస్‌లూ డాక్టర్లూ ఇంజినీర్లతో పాటు ఎంతోమంది ప్రభుత్వ ఉద్యోగులూ ప్రయివేటు కంపెనీల్లో ఉన్నత స్థానాల్లో పనిచేస్తున్నవారూ ఉన్నారు. ఒక సాధారణ కాలేజీ లెక్చరర్‌కి ఇదంతా ఎలా సాధ్యమైందీ... అని ఆయన్ని అడిగితే పేదవాళ్ల చదువుకోసం ఆయన పడిన ఆరాటం గురించి మనసు విప్పారిలా...

అవును... రెండున్నరేళ్లకిందట ఎమ్మెల్సీగా ఎన్నికయ్యేవరకూ నేను మామూలు ఉపాధ్యాయుడినే. అప్పటికే పదవీ విరమణ కూడా చేశాను. కానీ ఆర్థిక ఇబ్బందుల వల్ల చదువుకోలేకపోతున్న వారిని చూస్తే ఎందుకో మొదట్నుంచీ వూరుకోలేకపోయేవాడిని. పేదరికంలో ఉన్నారు కదా అని ఎవరికైనా మనం ఓ లక్ష రూపాయలు ఇచ్చి ఆదుకున్నామనుకోండి, ఆ లక్ష అయిపోయాక మళ్లీ పేదలుగానే మిగిలిపోతారు. అదే ఆ డబ్బుతో ఓ పేద విద్యార్థిని బాగా చదివిస్తే అతడికి జీవితాన్నిచ్చినట్లే. ఆ చదువుతో ఉద్యోగం సంపాదించుకుంటాడు, జీవితాంతం అతడి కుటుంబం హాయిగా బతుకుతుంది. అందుకే, నా దగ్గరికొచ్చిన పేద విద్యార్థులందర్నీ చదివించడానికి ప్రయత్నిస్తా.

ఇలా మొదలైంది...
మాది పశ్చిమగోదావరి జిల్లా కొయ్యలగూడెం మండలం, పొంగుటూరు. పుట్టిందీ పెరిగిందీ అక్కడే. లెక్చరర్‌గా ఉద్యోగం వచ్చాక ఏలూరులో స్థిరపడ్డా. అమ్మ రత్తాలు, నాన్న పేరయ్య. మాది వ్యవసాయ కుటుంబం. నాన్న అప్పట్లో ఎనభై ఎకరాల ఆసామి. ఇంట్లో ఏ లోటూ ఉండేది కాదు. బాగా చదివేవాణ్ని కాబట్టి ఉపాధ్యాయులు మూడు నుంచి ఆరో తరగతికి వెళ్లే ప్రవేశపరీక్ష రాయించారు. అలా నేరుగా ఆరోతరగతిలో చేరా. అక్క, ఇద్దరు చెల్లెళ్ల మధ్య ఒక్కడే కొడుకుని కావడంతో చాలా గారాబంగా చూసుకునేవారు నాన్న. ఒక్కోసారి పాకెట్‌ మనీగా పదీ పదిహేను రూపాయలు కూడా ఇచ్చేవారు. ఆరోజుల్లో అది ఎక్కువే. మరో పక్కేమో నా స్నేహితులు ఫీజు కట్టడానికి నాలుగు రూపాయలులేక చదువు మానేసేవారు. అప్పుడు నా దగ్గరున్న డబ్బులు ఇచ్చేసి ఫీజు కట్టుకోమనేవాణ్ని. మొదట్లో నాన్నకు తెలిసి మందలించేవారు. అయితే, వూళ్లొ కరణం గారు, తెలిసినవాళ్లు చాలామంది సూర్యారావుది చాలా మంచి మనసయ్యా... అని పొగుడుతుంటే నాన్న కూడా సంతోషపడేవారు. అందరూ మంచి మంచి అంటుంటే నాకూ ఉత్సాహంగా ఉండేది. అలా హైస్కూల్లో ఉండగానే కొంతమంది చదువుకోసం ఫీజులు కట్టా. పై చదువుల కోసం ఏలూరు సీఆర్‌ రెడ్డి కాలేజీలో చేరాకా, యూనివర్సిటీలోనూ ఎవరైనా ఫీజు కట్టలేదని తెలిస్తే నా దగ్గరున్న డబ్బులు ఇచ్చేసేవాడిని. ఓసారి మా తరగతిలో కొందరు ఫీజు కట్టకపోవడంతో హాల్‌టిక్కెట్‌ రాలేదు. సమయానికి నా దగ్గర డబ్బు లేకపోవడంతో ఉంగరాలు తాకట్టు పెట్టేశా.

ఉద్యోగంలో చేరాక...
‘ఆర్థిక ఇబ్బందుల వల్ల చదువు మానొద్దు. అలాంటి వారుంటే నాకు చెప్పండి. ఫీజులు నేను కడతా’ 1973లో లెక్చరర్‌గా ఏలూరు సీఆర్‌రెడ్డి కళాశాల తరగతి గదిలో నేను చెప్పిన తొలి విషయం ఇదే. అలా మొదట్లో ఫీజులు కట్టేవాడిని. కానీ వూళ్ల నుంచి వచ్చేవారు కొందరు వసతికీ, భోజనానికీ అయ్యే ఖర్చులు భరించలేక కూడా చదువు మానేసేవారు. నిజానికి అప్పట్లో సీఆర్‌రెడ్డిలో బీసీ ఎస్సీ ఎస్టీలకు ప్రభుత్వ హాస్టల్‌ ఉండేది. కానీ సరిగా నిర్వహించేవాళ్లు లేక యాజమాన్యం హాస్టల్‌ మూసేద్దామనుకుంది. అది జరిగితే చాలామంది విద్యార్థుల చదువు ఆగిపోయినట్లే. అందుకే, హాస్టల్‌ బాధ్యతను నేను తీసుకుంటా అన్నా. అల్పాహారం, భోజనం రుచిగా అందేలా ఏర్పాటు చెయ్యడంతో హాస్టల్లో ఉండే వారి సంఖ్య 40 నుంచి 1200 మందికి చేరింది. 11 ఏళ్లు జీతం తీసుకోకుండా దాన్ని నిర్వహించా. ఆ తర్వాత నా ఆలోచన ఇలా ఉచిత వసతి, భోజన సౌకర్యాలు అందని ఇతర వర్గాల విద్యార్థుల వైపు మళ్లింది. అలా ఇబ్బంది పడుతున్న వారిని నా ఇంట్లో పెట్టుకుని చదివించడం మొదలు పెట్టా. 1990 నుంచి ఇప్పటికీ అది కొనసాగుతూనే ఉంది. కొన్ని ఇబ్బందుల దృష్ట్యా ఇంట్లో కేవలం మగపిల్లల్నే పెట్టి చదివిస్తున్నా. ఆడ పిల్లలకు ఫీజుల వరకే కడుతున్నా. వసతి సమస్య లేని అబ్బాయిలకూ ఫీజులు కడతా. మా ఇంట్లో కులం, మతం అడగం. ఎవరైనా ఉండొచ్చు. నా దగ్గరకొచ్చిన విద్యార్థులకి ముందు మంచి మార్కులు రాకపోయినా పర్లేదు. కానీ వచ్చాక వాళ్లకి తొంభైశాతం మార్కులు రావడమే నా లక్ష్యం. అందుకే, మీ భోజనం, బట్టలూ, ఫీజులూ అన్నీ నేను చూసుకుంటా. మీరు చదువు మీదే దృష్టి పెట్టండి... అని చెబుతా. ఉదయం అయిదు గంటలకే కుర్రాళ్లను నిద్రలేపేస్తా. కాలేజీలో పొలిటికల్‌ సైన్స్‌, పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌ అంశాలను బోధించేవాడిని. కానీ ఇంగ్లిష్‌లో కూడా బాగా పట్టుంది. నా దగ్గరున్న వారికి ఆయా అంశాల్లో పాఠాలూ బోధిస్తుంటా. ప్రభుత్వ హాస్టళ్లలో సెలవుల్లో ఇంటికి పంపిస్తారు. నేను అప్పుడూ నా దగ్గరే ఉంచుకుని చదివిస్తా. ఇంటికి అన్ని వార్తా పత్రికలనూ వేయించి చదవమంటా. అందుకే, నా స్టూడెంట్స్‌ చాలామందికి చదువు పూర్తయిన వెంటనే ఉద్యోగాలు వచ్చాయి.

ఆర్థిక సమస్యలతో ఇంటిదగ్గర తల్లిదండ్రులు పడే ఇబ్బందులు కూడా పిల్లల చదువు మీద చాలా ప్రభావం చూపిస్తాయి. ప్రస్తుతం మా ఇంట్లో ఉంటున్న తూర్పుగోదావరికి చెందిన రమేష్‌ కుటుంబానికి రెండెకరాల పొలం ఉన్నా అది తాకట్టులో ఉండడంతో తల్లీతండ్రీ కూలికెళ్తున్నారు. అరవైవేలు కడితే పొలాన్ని విడిపించొచ్చని తెలిసి వెంటనే ఆ డబ్బుని ఇచ్చి పంపించాను. గోపాలపురానికి చెందిన ఏడుకొండలు ప్రస్తుతం థాయిలాండ్‌లో ఉన్నాడు. ఆ కుర్రాడు జూనియర్‌ ఇంటర్‌లో చదువు మానేస్తానని నా దగ్గరికి వచ్చాడు. అప్పట్నుంచీ అతను యూనివర్సిటీలో ఎంఎస్సీ చదివేవరకూ ఫీజులు కట్టా. తర్వాత ముంబయిలోనూ చదివాడు. అలా అతడొక్కడికే అయిదారు లక్షలు ఖర్చయింది. చింతలపూడిలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న కుటుంబరావు పదో తరగతి పాసై ఏదైనా ఉద్యోగం ఇప్పించమని వచ్చాడు. అలా కాదని చెప్పి వాళ్ల నాన్నకి పొలం కౌలుకి చేసుకునేందుకు రూ.25వేలు ఇచ్చి, ఆ అబ్బాయికి ఉద్యోగం వచ్చేవరకూ చదివించా. ఇంకో కుర్రాడి అమ్మానాన్నా కూలికి వెళ్తున్నారంటే అతని ఇంటికి నెలకు రూ.1500 ఖర్చులకు పంపించి ఆ అబ్బాయిని డిగ్రీ, ఎంబీయే చదివించాను. ఇలా అవసరమైతే విద్యార్థుల కుటుంబాలకూ సాయం చేస్తా. ఫీజులు మాత్రమే కట్టే విద్యార్థికి సంవత్సరానికి పదీ ఇరవై వేలతో అయిపోతుంది. అన్నీ చూసుకోవాలంటే ఒక్కో విద్యార్థికీ లక్షకు పైగానూ ఖర్చవుతుంది.

అప్పులూ చేశా
పెళ్లినాటికే నేను అప్పులు చేసి వాళ్లకీ వీళ్లకీ సాయం చెయ్యడం, నాన్న వాటిని తీర్చడానికి పొలం అమ్మడం... ఇలా ఆస్తి చాలా కరిగిపోయింది. ఉద్యోగం చేస్తూ కూడా సంపాదించిన ప్రతి రూపాయినీ పేద విద్యార్థులకే ఖర్చుపెట్టేవాణ్ని. అందుకే, నా భార్య విజయలక్ష్మిని ఎంఏ చదివించి నువ్వు నా మీద ఆధారపడకుండా ఉద్యోగం చేసుకో... అని చెప్పా. అప్పట్నుంచీ లెక్చరర్‌గా పనిచేస్తూ ఆమె సంపాదించిన దాంతోనే ఇల్లు గడిచింది. ఇద్దరు కొడుకులు పెద్దవాళ్లైనా నా పద్ధతి మార్చుకోలేకపోయా. దాంతో నాన్న మిగిలిన కొద్ది పొలాన్నీ మనవళ్ల పేరుమీద రాసేశారు. ఎప్పుడైనా నా దగ్గర డబ్బులైపోతే అప్పులు కూడా చేసేవాడిని. రెండు మూడుసార్లు ఇంటినీ తాకట్టు పెట్టా. ఓసారి కాలేజీలో మా పెద్దబ్బాయికి సమయానికి ఫీజు కట్టకపోవడంతో బయటికి పంపిస్తామని నోటీసు పంపించారు. ‘అందరికీ సాయం చేస్తావు. కానీ నా పరిస్థితి ఇలా ఉంది’ అని వాడు కళ్లనీళ్లు పెట్టుకున్నాడు. నాకూ ఏడుపొచ్చింది. అందుకే, అలాంటి అవసరాల కోసం కొంతకాలం ఓ ప్రైవేట్‌ కాలేజీలో ఉదయం సాయంత్రం పనిచేశా. మొదట్లో అప్పుల వాళ్లు ఇంటికి వచ్చి అడుగుతుంటే నా భార్య కూడా చాలా బాధ పడేది. నెమ్మదిగా నా దగ్గర చదువుకున్నవాళ్లు ‘మాస్టారు వల్లే ఈ స్థాయికి వచ్చాం’... అంటుంటే ఆవిడ కూడా సంతోషపడేది. 2007 సంవత్సరం తర్వాత నా గురించి తెలిసినవాళ్లు విరాళాలు ఇవ్వడం మొదలుపెట్టారు. వాటితోనూ పదవీవిరమణ పొందాక పింఛనుగా వచ్చే రూ.యాభైవేలను కూడా పేద విద్యార్థులకే ఉపయోగిస్తున్నా. ప్రస్తుతం మా ఇంట్లో నలభైమంది విద్యార్థులున్నారు.

ఎమ్మెల్సీగా అవకాశం
2014 నవంబర్‌లో కృష్ణా, గుంటూరు, ప్రకాశం, చిత్తూరు, నెల్లూరు జిల్లాల ఎమ్మెల్సీలు... ‘మాస్టారూ మీరు అభ్యర్థిగా నిలబడాల’న్నారు. నా దగ్గరకు వచ్చినవాళ్లకు టీలు ఇప్పించేందుక్కూడా డబ్బులుండవు అన్నా. ‘యూటీఎఫ్‌ వాళ్లు మీ పేరు చెబుతున్నారు మీరెలా అయినా నిలబడాల్సిందే’ అన్నారు. ఇంకా ఎక్కువమందికి సేవ చేసే అవకాశం వస్తుందిలే అని ఒప్పుకున్నా. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల ఉపాధ్యాయుల నియోజకవర్గం కేటగిరీలో వాళ్లే నన్ను అభ్యర్థిగా ప్రకటించేశారు. అంతకుముందు నేను చాలా మామూలు బట్టలు వేసుకునేవాడిని. షేవింగ్‌ కూడా నేనే చేసుకునేవాణ్ని. అలాంటిది వాళ్లు నా చెప్పుల్నీ బట్టల్నీ సైతం మార్చేశారు. నా దగ్గర చదువుకుని ఉపాధ్యాయులుగా మారినవాళ్లూ ఇంకా ఎందరో అండగా నిలబడ్డంతో గెలిచాను. ఎమ్మెల్సీగా వస్తున్న రెండు లక్షల జీతాన్నీ పేద విద్యార్థుల చదువుకే ఖర్చుపెడుతున్నా. ఈమధ్యే ఆరెస్సార్‌ ఫౌండేషన్‌ (ఫోన్‌ నంబరు:9848620051) స్థాపించా. దీనిద్వారా నా దగ్గరికొచ్చినవారందరినీ చదివించాలన్నదే నా లక్ష్యం. కొంతమంది మంత్రులూ సాయం చేస్తామంటున్నారు. నేను ఫీజులు కట్టి చదివించినవారిలో ప్రస్తుతం జార్ఖండ్‌లో డిఐజీ కేడర్‌లో పనిచేస్తున్న సీతారామరాజు, ఇండియన్‌ ఇన్‌ఫర్మేషన్‌ సర్వీస్‌ అధికారి కె.ఆశయ్య... ఇంకా ఉత్తర్‌ప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌లలో పనిచేసే ఐఏఎస్‌ ఆఫీసర్లూ ఎందరో ఉన్నారు. అంతమందికి కాస్తోకూస్తో అండగా నిలవగలిగానన్న తృప్తే నన్ను మరింత ఉత్సాహంగా ఈ దార్లో నడిచేలా చేస్తోంది.

రోగుల సేవలో...

నాకు బాగా తృప్తినిచ్చే మరో విషయం రోగులకు సాయం చెయ్యడం. అందుకే, పదవీ విరమణ తర్వాత ఏలూరు ప్రభుత్వాసుపత్రిలోని రెడ్‌ క్రాస్‌ బ్లడ్‌బ్యాంకులో పనిచెయ్యడం మొదలుపెట్టా. ఉద్యోగం చేసేటపుడు రోజూ ఉదయం లేచి ఇంట్లోని కుర్రాళ్లకు వంట చెయ్యడం, కాలేజీకెళ్లడం, వచ్చాక వాళ్లను చదివించడం ఇదే నిత్యకృత్యంగా ఉండేది. ఇప్పుడు మా పిల్లలిద్దరూ ఉద్యోగాల్లో స్థిరపడటంతో వంటమనిషిని పెట్టి నా భార్య ఆ బాధ్యతలు చూసుకుంటోంది. నేను ఉదయం నాలుగున్నరకి సైకిల్‌మీద ప్రభుత్వాసుపత్రికి చేరుకుంటా. ఎమ్మెల్సీగా ప్రభుత్వ నిధులతో తీసుకున్న కారు ఉంది గానీ బయటి గ్రామాలకు వెళ్లినపుడే దాన్లో వెళ్తా. రోజంతా ఆస్పత్రిలో ఉండి రోగుల్ని పలకరించి, వైద్యులతో మాట్లాడి వారి సమస్యల్ని పరిష్కరించడం, పాత బట్టలు సేకరించి పేద రోగులకు పంచడం చేస్తుంటా. చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వాసుపత్రికి ఛైర్మన్‌గా ఎవరిని నియమించాలనుకున్నప్పుడు చాలామంది నా గురించి చెప్పారట. అలా ఇప్పుడు ఆ కొత్త బాధ్యతనూ స్వీకరించా.

- బొల్లినేని మధులత
ఫొటోలు: సీహెచ్‌. సుబ్బారావు, ఈనాడు, ఏలూరు

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.