close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
నెలరోజుల్ని ఒక్క రోజులా చూపించాం!

నెలరోజుల్ని ఒక్క రోజులా చూపించాం!

సినిమాటోగ్రఫీ... దర్శకుడి ఆలోచనలకు రూపునిచ్చే ప్రధానమైన ప్రక్రియ. తెల్లటి కాగితంపైన రంగులతో చేసే మాయ. అందుకే ‘24 ఫ్రేమ్స్‌’లో దీనికీ ఎంతో ప్రాధాన్యం ఉంది. ఈ విభాగంలో అద్భుతంగా రాణిస్తున్నారు తెలుగు యువకుడు పి.జి.వింద. ‘అమీ తుమీ’తో తన ఖాతాలో మరో హిట్‌ చిత్రాన్ని చేర్చుకున్న వింద... కెరీర్‌ గురించి చెబుతున్నాడిలా...

నాగర్‌ కర్నూల్‌ జిల్లాలోని పాలెం మా సొంతూరు. చిన్నప్పట్నుంచీ బొమ్మలు గీయడం అలవాటైంది. సైన్స్‌ బొమ్మలు బాగా వేసేవాణ్ని. బొమ్మలపైన ఇష్టంతో ఆ సబ్జెక్టునే ఎక్కువగా చదివేవాణ్ని. స్కూల్‌ రోజుల్లో జిల్లా స్థాయి పెయింటింగ్‌ పోటీల్లో చాలా బహుమతులు సంపాదించాను. పత్రికల్లో ఎం.ఎఫ్‌.హుస్సేన్‌, సతీష్‌ గుజ్రాల్‌లాంటి ప్రముఖ చిత్రకారుల గురించి చదివి అంతటివాణ్ని అవ్వాలనుకునేవాణ్ని. టెన్త్‌ తర్వాత ముంబయిలోని ‘జేజే స్కూల్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌’, కోల్‌కతాలోని ‘విశ్వభారతి’లలో చేరి పెయింటింగ్‌ కోర్సు చదువుదామని పోస్ట్‌ద్వారా దరఖాస్తులు తెప్పించాను కూడా. కానీ పెయింటింగ్‌ ధనవంతుల హాబీ అనీ, సైన్స్‌లో బాగా మార్కులు వస్తున్నాయి కాబట్టి చదివితే మంచి భవిష్యత్తు ఉంటుందనీ నాన్న చెప్పడంతో మా వూళ్లొనే ఇంటర్మీడియెట్‌ బైపీసీలో చేరాను. తర్వాత కర్నూల్‌లోని సిల్వర్‌ జూబ్లీ కాలేజీలో డిగ్రీ చదివాను. డిగ్రీ తర్వాత పీజీ చేయమన్నారు. ఇంట్లో అలాగే అని చెప్పి హైదరాబాద్‌ వచ్చాను. ఇక్కడి జేఎన్‌టీయూ ఫైన్‌ ఆర్ట్స్‌ కాలేజీలో ఫొటోగ్రఫీ, పెయింటింగ్‌ విభాగాల్లో సీటుకి దరఖాస్తు చేశాను. రెండు విభాగాల్లోనూ సీటు వచ్చింది. ఫొటోగ్రఫీలో చేరాను. తర్వాత ఆ విషయం ఇంట్లో చెప్పాను. అప్పుడు మాత్రం నాన్న నన్ను అర్థం చేసుకున్నారు. కాకపోతే ఫీజులు ఎక్కువగా ఉండేవి. నా ఖర్చులకోసం తెలిసినవాళ్ల దగ్గర హోర్డింగ్స్‌పైన బొమ్మలు వేసేవాణ్ని. అన్నయ్య రామలక్ష్మయ్య కూడా డబ్బు పంపేవాడు.

‘లజ్జ’కు పనిచేశా
మా బ్యాచ్‌ నుంచే ఫొటోగ్రఫీలో సినిమాటోగ్రఫీ సబ్జెక్టునీ ప్రారంభించారు. సినిమాల్లోకి వెళ్లాలన్న ఆలోచన ఏమూలనో ఉండేది. అందుకే ఈ కోర్సులో చేరాను. కోర్సు నాలుగో సంవత్సరంలో ఇంటర్న్‌షిప్‌ ఉంటుంది. దానికోసం ఏం చేయాలన్న సందిగ్ధంలో ఉన్నపుడు ఆర్ట్‌ డైరెక్టర్‌ లక్ష్మణ్‌ ఏలె గుర్తొచ్చారు. జెఎన్‌టీయూలో లక్ష్మణ్‌ నాకు రెండేళ్లు సీనియర్‌. స్కూల్‌ రోజుల్లో ఆయన కూడా నాకు స్ఫూర్తి. కాలేజీలో చేరాక నా పెయింటింగ్‌లూ, నేను తీసిన ఫొటోలూ ఆయనకు చూపించేవాణ్ని. ఆయన్నుంచి మంచి ప్రోత్సాహం ఉండేది. ‘పాతనగరంలో పసివాడు’, ‘భద్రం కొడుకో’ సినిమాలకి ఆయన ఆర్ట్‌ డైరెక్టర్‌, మధు అంబట్‌ సినిమాటోగ్రాఫర్‌. మధుగారితో లక్ష్మణ్‌ నా గురించి మాట్లాడారు. అప్పటికి మధు రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘లజ్జ’ సినిమా షూటింగ్‌ చేస్తున్నారు. మధుని కలిసి నా ఫొటోలూ, పెయింటింగ్స్‌ చూపించాను. ఆయనతోపాటు అక్కడున్న దర్శకుడు రాజ్‌కుమార్‌ సంతోషి, నటీనటులు అజయ్‌ దేవగన్‌, మాధురీదీక్షిత్‌, మనీషా కోయిరాలాలకూ నా వర్క్స్‌ బాగా నచ్చాయి. ఆ సినిమా నుంచే ఆయన దగ్గర ఇంటర్న్‌గా చేరాను. ఆ తర్వాత కూడా బాలీవుడ్‌లో బద్రి, స్వయంవరం సినిమాల హిందీ రీమేక్‌లకూ, కొన్ని ప్రకటనలూ, డాక్యుమెంటరీలకూ అసిస్టెంట్‌గా పనిచేశాను. మధు... ఎనిమిదిసార్లు జాతీయ అవార్డు అందుకున్నారు. సినిమా మూడ్‌, లైటింగ్‌ల మధ్య సంబంధం గురించి ఆయన దగ్గరే తెలుసుకున్నాను. అసిస్టెంట్‌గా ఉన్నపుడు రోజూ లైటింగ్‌ రిపోర్ట్‌ రాసేవాణ్ని. ఒక సీన్‌ని ఏదైనా కారణంతో కొన్నాళ్ల తర్వాత మళ్లీ చేయాల్సి వస్తే దానికి లైటింగ్‌ పరంగా సమాచారం ఉండాలి. దానికోసమని రిపోర్ట్‌ రాయించేవారు. దానివల్ల చాలా విషయాల్ని నేర్చుకునే అవకాశం వచ్చింది. ఇలాంటి విషయాల్ని చాలామంది సీక్రెట్‌గా ఉంచుతారు. కానీ మధు సందేహాలు అడిగినా చెప్పేవారు. ‘లిటిల్‌ బుద్ధ’, ‘ద లాస్ట్‌ ఎంపరర్‌’ల సినిమాటోగ్రాఫర్‌ విక్టోరియా స్టరోరా లాంటి అంతర్జాతీయ సినిమాటోగ్రాఫర్ల నుంచి ఏం నేర్చుకోవచ్చో చెప్పారు.

గ్రహణంతో బోణీ
జేఎన్‌టీయూలో చదివేటపుడు... ‘హైదరాబాద్‌ ఫిల్మ్‌ క్లబ్‌’ ఆధ్వర్యంలో ప్రదర్శించే అంతర్జాతీయ సినిమాలు చూసేవాణ్ని. సినిమా అంటే డాన్స్‌లూ, ఫైట్లూ కాదనీ, దానికి కథ ముఖ్యమనీ, భావోద్వేగాలు అవసరమనీ అప్పట్నుంచే అర్థమైంది. దర్శకుడు ఇంద్రగంటి మోహన్‌ కృష్ణ కూడా ఆ సినిమాల్ని చూడ్డానికి వచ్చేవారు. మిత్రుడు, థియేటర్‌ ఆర్టిస్ట్‌ అల్తాఫ్‌ ద్వారా ఆయన పరిచయమయ్యారు. ఆ సమయంలోనే చలం కథ ‘దోష గుణం’ ఆధారంగా గ్రహణం సినిమా తీసే ప్రయత్నంలో ఉన్నారు మోహన్‌కృష్ణ. దానికి సినిమాటోగ్రాఫర్‌గా అవకాశం ఇచ్చారు. తెలుగులో అదే మొదటి డిజిటల్‌ సినిమా అనుకుంటా. కేవలం ఏడు లక్షల రూపాయల బడ్జెట్‌లో ఆ సినిమా తీశాం. మామూలుగా అయితే ఫిల్మ్‌ రీలు ఖర్చే రూ.20 లక్షలు అవుతుంది. కానీ డిజిటల్‌ వెర్షన్‌ కావడంవల్ల ఏడు లక్షలకే సాధ్యమైంది. లైట్లు వాడకుండా పగటి వెలుగులోనే తీశాం. ఎన్నో జాతీయ, అంతర్జాతీయ ఉత్సవాల్లో ప్రదర్శించాం. చూసిన వాళ్లంతా ప్రశంసించారు. మొదట ‘బ్లాక్‌ అండ్‌ వైట్‌’ సినిమా అనుకున్నారు. తర్వాత డిజిటల్‌లో తీశామని చెబితే ఆశ్చర్యపోయారు. ఆ సినిమాలో కలలు మాత్రమే రంగుల్లో ఉంటాయి. అవీ కొద్ది నిమిషాలు మాత్రమే. గ్రహణం పడ్డపుడు నలుపూ, తెలుపు... ఈ రెండు రంగులే ఉంటాయి. అందుకే ఆ రెండు రంగుల్నే ఎంచుకున్నాం. కథ కూడా కాస్త వెనకటిది కాబట్టి మూడ్‌ కుదిరింది. ఈ సినిమాకి మోహన్‌కృష్ణ ‘ఉత్తమ తొలి చిత్ర దర్శకుడు’ విభాగంలో జాతీయ అవార్డు అందుకున్నారు. గ్రహణం నాకు ఓ మంచి ఆరంభం. ఆ తర్వాత మరో జాతీయ అవార్డు గ్రహీత నీలకంఠగారితో ‘నందనవనం 120కి.మీ’, తర్వాత వంశీ గారితో ‘అనుమానాస్పదం’ చేశాను. నాకు బాగా గుర్తింపూ, పేరు తెచ్చింది మాత్రం ‘అష్టాచమ్మా’. దర్శకుడు మోహన్‌కృష్ణకూ, నాకూ మంచి కమర్షియల్‌ హిట్‌. ఆ సినిమాకి రిహార్సల్స్‌ బాగా చేశాం. కామెడీ జోనర్‌లో వచ్చిన ఆ సినిమాని కోటిన్నర బడ్జెట్‌లోనే తీశారు. అదే ఏడాది ‘వినాయకుడు’ సినిమా చేశాను. జయంత్‌ పరంజపే దర్శకత్వంలో కన్నడలో పునీత్‌ రాజ్‌కుమార్‌ హీరోగా చేసిన ‘నిన్నిందల్‌’ కూడా మంచి హిట్‌. పూరీ గారితో... జ్యోతిలక్ష్మి, లోఫర్‌ సినిమాలకు పనిచేశాను. బద్రీ హిందీ రీమేక్‌ నుంచీ ఆయనతో పరిచయం. నేను చేసిన వాటిలో జ్యోతిలక్ష్మి పూర్తిగా భిన్నమైన కథాంశంతో వచ్చిన సినిమా. ‘లోఫర్‌’ మంచి యాక్షన్‌ సినిమా. పూరీ తనకేం కావాలో చెప్పేసి ఎలా తీసినా నీ ఇష్టమేనంటారు.

జోడీ కుదిరింది
ఇతర దర్శకులతో పనిచేస్తూనే మోహన్‌కృష్ణతో నా ప్రయాణం కొనసాగించాను. ‘అంతకు ముందు ఆ తర్వాత’, ‘బందిపోటు’, ‘జెంటిల్‌మన్‌’ తాజాగా ‘అమీ తుమీ’ ఇలా కొనసాగుతూనే ఉంది మా బంధం. మోహన్‌కృష్ణకు సీన్‌ చిత్రీకరణ పరంగా చాలా క్లారిటీ ఉంటుంది. స్క్రీన్‌ రైటింగ్‌, డైరెక్షన్‌లలో ఆయనకు మంచి పట్టు ఉంది. మేమిద్దరం ప్రపంచస్థాయి సినిమాల గురించి చర్చిస్తాం. మా ఆలోచనలు దాదాపు ఒకేలా ఉంటాయి. ఆయన తీసే కథల్లో మార్పు ఉండటంతో పనిలోనూ కొత్తదనానికి అవకాశం ఉంటుంది. ‘గ్రహణం’ సీరియస్‌గా నడిచే కథ, ‘అష్టాచమ్మా’ కామెడీ, ‘అంతకుముందు ఆతర్వాత’ ఫ్యామిలీ డ్రామా, ‘జెంటిల్‌మన్‌’ థ్రిల్లర్‌ తరహా ఫ్యామిలీ డ్రామా, ‘అమీతుమీ’ వినూత్నమైన కామెడీ. థ్రిల్లర్‌ సినిమాలకు ఉత్సుకత తీసుకురావాలి, హారర్‌లో లైట్‌కు ఎక్కువ ప్రాధాన్యమివ్వాలి, ఫ్యామిలీ సినిమాలు డ్రమెటిక్‌గా ఉండాలి... ఇలా వేర్వేరు జోనర్లలోని సినిమాల్ని వేర్వేరు పద్ధతుల్లో చూపాలి. ‘అమీతుమీ’లో మొదటి పావుగంట తప్పిస్తే మిగతా కథంతా ఒక్కరోజులోనే జరుగుతుంది. మేం దాన్ని 30 రోజులు షూట్‌ చేశాం. తెరపైన మాత్రం ఒక రోజులానే కనిపించాలి. దానికోసం సినిమా మొత్తం లైట్స్‌ అండ్‌ షాడోస్‌ ద్వారా ఒకటే లుక్‌ని మెయిన్‌టైన్‌ చేశాం. మంచి లొకేషన్స్‌ని బాగా చూపించడం కాదు సినిమాటోగ్రఫీ అంటే. హిమాలయాల్ని ఎవరైనా అందంగా చూపిస్తారు. ఏదైనా లేనిది క్రియేట్‌ చేయడమే సినిమాటోగ్రాఫర్‌ పనితనానికి గీటురాయి. మాకు ‘స్టిల్‌ లైఫ్‌’ అని ఒక సబ్జెక్టు ఉంటుంది. శిలలోనూ జీవాన్ని చూపడం దీన్లో నేర్పుతారు. అది నా ఫేవరెట్‌ సబ్జెక్ట్‌.

సినిమాలూ తీస్తాను...
సంగీత దర్శకుడు రాధాకృష్ణన్‌ది మా వూరే. ఇద్దరం మంచి మిత్రులం. స్కూల్‌ రోజుల నుంచీ సినిమా, సాహిత్యాల గురించి చర్చించేవాళ్లం. నేను జేఎన్‌టీయూలో చదువుకునే రోజుల్లో తను సంగీత దర్శకుడిగా ప్రయత్నాలు చేసేవాడు. ఆ సమయంలో ఇద్దరమూ బాగా ఇబ్బందులుపడ్డాం. కొన్నాళ్లు ఒకే రూమ్‌లో ఉన్నాం. ‘ఆనంద్‌’ సినిమాకి రాధాకృష్ణన్‌ సంగీత దర్శకుడిగా ఎంపికయ్యాక శేఖర్‌ కమ్ములతో నాకు పరిచయం ఏర్పడింది. ‘ఆనంద్‌’కి అప్పటికే సినిమాటోగ్రాఫర్‌ని ఎంపికచేయడంతో అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా కొన్నాళ్లు పనిచేశాను. ‘గ్రహణం’ అవకాశం రావడంతో తర్వాత బయటకు వచ్చేశాను. 2010లో ‘లోటస్‌ పాండ్‌’ అనే సినిమా తీశాను. ఇరానీ దర్శకుడు ‘అబ్బాస్‌ కిరిస్తానీ’ సినిమాలు నాకు బాగా ఇష్టం. ఆయన తీసిన ‘వేర్‌ ఈజ్‌ మై ఫ్రెండ్స్‌ హోమ్‌’ స్ఫూర్తితో ఒక కథ రాసుకున్నాను. అదే ‘లోటస్‌ పాండ్‌’. పూరీ వాళ్లబ్బాయి ఆకాశ్‌ దీన్లో నటించాడు. ఇద్దరు స్కూల్‌ విద్యార్థుల చుట్టూ తిరుగుతుందా కథ. హిమాలయాల్లో మానససరోవరంలో పూసే కలువల్ని చూడ్డానికి దేవతలు కూడా వస్తారని పుస్తకాల్లో చదువుకున్న పిల్లలు అక్కడికి వెళ్తారు. ఆ ప్రయాణంలో పుస్తకాల్లో లేని విషయాలు చాలా నేర్చుకుంటారు. గురుకుల్‌ తరహా విద్యావిధానం ఎలా ఉండేదో ఈ 97 నిమిషాల నిడివున్న సినిమాలో చూపించాను. లోటస్‌ పాండ్‌... అనేక జాతీయ, అంతర్జాతీయ బాలల చలనచిత్రాల పోటీలకు వెళ్లింది. అవార్డులూ గెల్చుకుంది. ఆ సినిమా తీయడంద్వారా దర్శకుడికి సినిమాటోగ్రాఫర్‌ నుంచి ఏం కావాలో బాగా అర్థమైంది. బెంగాలీ, తమిళం, మరాఠీలలో సమాజానికి దర్పణంపట్టే సినిమాలు వస్తున్నాయి. విశారనై, కాకముట్టై సినిమాలు ఆ కోవకే చెందుతాయి. సినిమాటోగ్రాఫర్‌గా కమర్షియల్‌ సినిమాలకు పనిచేస్తూనే భవిష్యత్తులో అలాంటి సినిమాలు తీస్తాను. తక్కువ బడ్జెట్‌లోనే మనకథల్ని ప్రపంచానికి చూపిస్తాను.

 


ఇంకొంత

నాన్న గోవింద నారాయణ, అమ్మ చంద్రమ్మ. నాకు ఇద్దరు అన్నయ్యలు, ఒక అక్క. సినిమాల్లోకి రాకముందే నాన్న చనిపోయారు. అమ్మ ప్రస్తుతం నా దగ్గరే ఉంది.
* నా చదువుకోసం మాకున్న పొలం అమ్మేశారు నాన్న. అప్పట్నుంచీ మేం వ్యవసాయం చేయడంలేదు. ఈ మధ్యనే వూళ్లొ కొంత పొలం కొన్నాను. దాన్లో ఆధునిక వ్యవసాయం చేస్తాను.
* శ్రీమతి పేరు హైమావతి. మాకో పాప, పేరు నేత్రి. తనకి పెయింటింగ్‌లో, కూచిపూడిలో శిక్షణ ఇప్పిస్తున్నాను. చాన్నాళ్లకిందటే పెయింటింగ్‌ వదిలేశాను. పాపకి నేర్పడం కోసం మళ్లీ కుంచె పట్టాలి.
* ‘గ్రహణం’కి ముందు మోహన్‌కృష్ణ గారితో కలిసి ‘చలి’, ఆ తర్వాత వేరేవాళ్లతో ‘ఎరేజ్‌’, ‘యాదీ’ షార్ట్‌ ఫిల్మ్స్‌కూ కెమెరామేన్‌గా పనిచేశాను.
* ట్రావెలింగ్‌ బాగా ఇష్టం. యూత్‌ హాస్టల్స్‌ అసోసియేషన్‌ సభ్యుడిగా ఉంటూ చాలా పర్యటనలకు వెళ్లాను. చాలాసార్లు హిమాలయాలకు ట్రెక్కింగ్‌కు వెళ్లాను. ఓ టీవీ ఛానెల్‌కు ట్రావెల్‌ ప్రోగ్రామ్‌ చేస్తూ ఇండియాలో దాదాపు 100 పర్యటక ప్రాంతాల్ని నా కెమెరాతో చిత్రీకరించాను.
* సినిమా రంగంలో, సినిమాటోగ్రఫీలో వస్తోన్న సాంకేతిక మార్పుల గురించి తరచూ అంతర్జాతీయ మ్యాగజీన్లలో చదువుతాను.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.