close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
‘హీరో’ పోలీస్‌!

‘హీరో’ పోలీస్‌!

ప్రభుత్వోద్యోగం రాగానే జీవితంలో స్థిరపడిపోయినట్లు భావిస్తారు కొందరు. ఆ ఉద్యోగంతోనే సమాజం పట్ల తమ బాధ్యతలు పెరిగాయని గుర్తించి మరింత చైతన్యంతో నడచుకుంటారు మరికొందరు. హైదరాబాద్‌లోని రాచకొండ పోలీస్‌ కమిషనర్‌ మహేశ్‌ మురళీధర్‌ భగవత్‌ రెండో రకానికి చెందుతారు. ఐపీఎస్‌ అధికారిగా ఆయన ఎక్కడ, ఏ పదవిలో ఉన్నా తనదైన ముద్ర చూపడమే కాదు, అందుకు గాను అంతర్జాతీయ స్థాయిలోనూ గుర్తింపు పొందారు. విధి నిర్వహణలో ‘హీరో’ అనిపించుకున్నారు.

హిళలు, పిల్లల అక్రమ తరలింపు మన సమాజాన్ని పట్టిపీడిస్తున్న రుగ్మత. స్వేచ్ఛను హరిస్తూ మహిళల జీవించే హక్కును కాలరాస్తున్న ఈ ఆధునిక బానిసత్వానికి ఏ దేశమూ మినహాయింపు కాదు. ప్రపంచవ్యాప్తంగా ఒక వ్యవస్థీకృత నేరంగా వేళ్లూనుకున్న ఈ సమస్యను నిర్మూలించడానికి వివిధ మార్గాల్లో కృషిచేస్తున్న వ్యక్తులకు అమెరికా ప్రభుత్వం ఏటా హీరో పేరుతో అవార్డులిచ్చి సత్కరిస్తోంది. అక్రమ రవాణా సమస్య మీద వేర్వేరు దేశాల్లో పనిచేస్తున్న 8మందికి ఈ ఏడాది జూన్‌ చివరివారంలో వాషింగ్టన్‌ డీసీలో ఈ అవార్డులు ప్రకటించారు. వారిలో పోలీస్‌ శాఖ నుంచీ, మనదేశం నుంచీ ఎంపికైన వారు ఒక్కరే ఉండగా ఆ ఒక్కరూ తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఐపీఎస్‌ అధికారి మహేశ్‌ మురళీధర్‌ భగవత్‌ కావడం విశేషం. గతంలోనూ పలుసార్లు ఇలాంటి అవార్డులు అందుకున్న మహేశ్‌ భగవత్‌ని అభినందించిన ‘ఈనాడు ఆదివారం’తో ఆయన తన కెరీర్‌ విశేషాలను ఇలా పంచుకున్నారు...

నిబద్ధతకు లభించిన గుర్తింపు
‘ఇది నా ఒక్కడి విజయం కాదు. మా పోలీసు శాఖ కృషికి లభించిన గుర్తింపు. నాకన్నా ముందు గతంలో ఈ అవార్డును 2005లో దిల్లీ కమిషనర్‌ అమోద్‌ కాంత్‌, 2009లో అప్పటి ఐజీ ఉమాపతి, ప్రజ్వల సంస్థ నిర్వాహకురాలు సునీతాకృష్ణన్‌, బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు కృషిచేస్తున్న కైలాశ్‌ సత్యార్థి అందుకున్నారు. వారి సరసన నేనూ చేరడం సంతోషం కలిగించింది. దాదాపు దశాబ్దకాలంగా నిబద్ధతతో కొనసాగిస్తున్న ఉద్యమమిది. ఎంత దారుణమైన పరిస్థితి అంటే... గ్లోబల్‌ స్లేవరీ ఇండెక్స్‌ నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా అక్రమరవాణాకి గురవుతున్నవారిలో 40శాతం భారతీయులే. 2004లో మొదటిసారి ఈ సమస్య నా దృష్టికి వచ్చినప్పటినుంచీ ఎక్కడికి వెళ్లినా ఇది నాకు ప్రథమ ప్రాధాన్యంగా మారింది. అమ్మాయిల్ని తరలించడానికి ఏకంగా పాఠశాల బస్సుల్ని ఉపయోగించడం చూసి నిజంగా ఎంత దిగ్భ్రాంతికి గురయ్యానో. సైబరాబాద్‌ డీసీపీగా పనిచేస్తున్నప్పుడు జరిగిందా సంఘటన. రాయదుర్గం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ఒక ఫార్మ్‌ హౌస్‌లో పార్టీ జరుగుతోందనీ ముంబయి, కోల్‌కతా లాంటి ప్రాంతాలనుంచీ అమ్మాయిల్ని తీసుకొచ్చి సిటీలో హోటళ్లలో ఉంచి స్కూలుబస్సులో పార్టీకోసం ఫార్మ్‌హౌస్‌కి తరలిస్తున్నారనీ సమాచారం అందింది. అప్పుడు నైట్‌ డ్యూటీలో ఉన్నాను. వెంటనే సిబ్బందితో రెయిడ్‌ చేసి వాళ్లను పట్టుకున్నాం. తీగ లాగితే డొంకంతా కదిలినట్లు పెద్ద ఎత్తున సాగుతున్న ఆ ముఠా వ్యవహారమంతా బయటపడింది. చాలామంది అమ్మాయిల్ని వారి బారినుంచి కాపాడి ఇళ్లకు పంపించాం. అప్పటినుంచీ ఈ సమస్యపై పరిశోధన కొనసాగించా.

తర్వాత నల్గొండ ఎస్పీగా చేసేటప్పుడు యాదగిరిగుట్టలో దొమ్మరి మహిళలు పలువురు వేశ్యావృత్తిలో ఉన్నట్లు తెలిసింది. ఆ వృత్తి మాన్పించి వారికి పునరావాసం కల్పించేందుకు జిల్లా కలెక్టరు విజయానంద్‌తో కలిసి ‘ఆసరా’ అనే ప్రాజెక్టును ప్రారంభించాం. ఇతర ప్రభుత్వాధికారులూ, ప్రజ్వల సంస్థతో కలిసి పనిచేసి 90 శాతం సమస్యను నిర్మూలించాం. ఆ ప్రాజెక్టుకి కూడా అంతర్జాతీయ స్థాయి అవార్డులు వచ్చాయి. అంతకు ముందు ఆదిలాబాద్‌లో చేసిన కమ్యూనిటీ పోలీసింగ్‌ విధానానికి కూడా అవార్డు వచ్చింది. అప్పుడు రాష్ట్రపతి కలాం నన్ను పిలిపించి మాట్లాడారు. ఆయన అభినందించడం నాకు మంచి జ్ఞాపకం. ఏలూరులో పనిచేసేటప్పుడు అక్కడ పలు గ్రామాల్లోనూ వందల ఏళ్లుగా పాతుకుపోయిన దురాచారాన్ని రూపుమాపడానికి శాయశక్తులా కృషిచేశాను. మన చట్టాల్లో రెడ్‌ లైట్‌ ఏరియా అనే దానికి అనుమతి లేదు. అలాంటి వాటిపై చర్యలు తీసుకునే అధికారం ఆర్డీవో స్థాయి అధికారికీ, కమిషనర్‌కీ ఉంటుంది. పెద్దాపురం, రావులపాలెం, తాడేపల్లిగూడెంలలో ఉన్న పలు వేశ్యాగృహాలను మూసేయించాం. అక్కడినుంచి దుబాయ్‌, సింగపూర్‌, మలేసియాలకు పంపించిన అమ్మాయిలను కూడా రక్షించాం. ఈ ఉద్యోగం వల్లనే వారిని కాపాడగలుగుతున్నానని ఆనందంగా ఉంటుంది.

ఉపాధ్యాయుల కుటుంబం
మాది మహారాష్ట్రలోని అహ్మద్‌ నగర్‌ జిల్లా షిర్డీ దగ్గర ఒక చిన్న గ్రామం. నా చదువు అక్కడి ప్రభుత్వ పాఠశాలలో మరాఠీ మాధ్యమంలోనే సాగింది. మా అమ్మానాన్నా ప్రభుత్వ ఉపాధ్యాయులు. అక్క, చెల్లెళ్లిద్దరు, వారి భర్తలూ... మా ఇంట్లో అందరూ ఉపాధ్యాయులే. నేనే టీచింగ్‌ వైపు వెళ్లలేదు. బాగా చదువుకుని ఆర్థికంగా ఎవరి కాళ్లమీద వాళ్లు నిలబడాలన్నది నాన్న అభిమతం. అమ్మానాన్నలు చదువుకోమని చెప్పేవారే కానీ ఏం చదవాలని ఎప్పుడూ చెప్పలేదు. ఇంజినీరింగ్‌ పూర్తి చేసేవరకూ నాకు సివిల్‌ సర్వీసెస్‌ గురించి ఎలాంటి అవగాహనా ఆలోచనా లేవు. ఇంజినీరింగ్‌ అయ్యేసరికి ప్రభుత్వ ఉద్యోగాలు లేవు. దాంతో కొంతకాలం ఖాళీగా ఉంటే అప్పుడు నన్నూ టీచరుగా పనిచేయమన్నారు నాన్న. కానీ నా మనసు ఇంకెక్కడో ఉంది. ఏం చేయాలన్నదానిపై స్పష్టత లేకపోయినా చెయ్యాల్సింది వేరే ఏదో ఉందనిపించేది. కాలేజీలో ఉండగానే వాటర్‌షెడ్‌ అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రాజెక్టు వర్క్‌ చేశాను. కొంతమంది ఇంజినీర్లం ఒక బృందంగా ఏర్పడి దీని గురించి అధ్యయనం చేసేవాళ్లం. అన్నాహజారే సొంత గ్రామం రాలెగావ్‌ సిద్ధి వెళ్లి వాళ్లు అనుసరిస్తున్న విధానాలను పరిశీలించాం. నర్మదా బచావో ఉద్యమకారులతో కలిసి సర్దార్‌ సరోవర్‌ ప్రాజెక్టు కింద ముంపునకు గురవుతున్న ఒక ఆదివాసీ గ్రామానికి తగిన పరిహారం ఇప్పించడానికి మూడు రోజులు నిరాహార దీక్ష చేశాను. మూఢ నమ్మకాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న నరేంద్ర దభోల్కర్‌ తదితరులతో కలిసి గ్రామాల్లో శాస్త్రీయ దృక్పథంపై అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపట్టేవాళ్లం. బహుశా ప్రజలతో కలిసి పనిచేయడానికి ఆ వయసులోనే పునాది పడిందనుకుంటాను.

ఉన్నతోద్యోగంతోనే సాధ్యమని...
పుణెలో ఉన్న ఓ ఎన్జీవోలో ప్రాజెక్టు ఆఫీసరుగా రెండున్నరేళ్లు పనిచేశాను. ఆ సమయంలో ప్రభుత్వం, ఉన్నతాధికారులు, గ్రామస్థాయిలో పనులు జరిగే తీరు... వీటన్నిటి గురించి అవగాహన ఏర్పడింది. ప్రభుత్వంలో ఉన్నత స్థాయి ఉద్యోగంలో ఉంటే చాలామంది సిబ్బంది ఉంటారు, నిధులు అందుబాటులో ఉంటాయి. ప్రజలకోసం బాగా పనిచేయవచ్చు. ఆ ఆలోచన సివిల్‌ సర్వీసెస్‌లో చేరాలన్న ఆకాంక్షకు ప్రేరణ అయింది. అక్కడ పనిచేస్తూనే చదవడమూ మొదలెట్టాను. రెండో యత్నంలో 1995లో ఐపీఎస్‌ వచ్చింది. ఐఏఎస్‌ కావాలని మరోసారి ప్రయత్నించాను కానీ రాకపోవడంతో 1996లో ఐపీఎస్‌లో చేరాను. శిక్షణ అయ్యాక మణిపూర్‌ కేడర్‌లో చేరి ఇంఫాల్‌ వెళ్లాను. అక్కడ పనిచేస్తుండగా 1999లో పెళ్లైంది. నా భార్య సునీత అప్పుడు ఏపీ కేడర్‌ ఫారెస్ట్‌ సర్వీస్‌లో ఉంది. అందుకని నేను కూడా ఇక్కడికి బదిలీ చేయించుకున్నాను. మణిపూర్‌లో ఉండగానే మణిపురీ నేర్చుకున్నా. ఇక్కడికి వచ్చాక తెలుగు కూడా నేర్చేసుకున్నాను.

రెండేళ్ల క్రితమే ఉస్మానియా యూనివర్శిటీనుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందాను. మా ఉద్యోగానికి చట్టాల గురించి తెలిసి ఉండడం అవసరం, అందుకే లా చదివాను. విమెన్‌ ప్రొటెక్షన్‌ సెల్‌ బాధ్యతలు నిర్వహించేటప్పుడు మరోసారి అక్రమ రవాణా సమస్యపై కృషిచేసే అవకాశం వచ్చింది. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ, ఐరాసలో డ్రగ్స్‌, ట్రాఫికింగ్‌ సమస్యలపై పనిచేస్తున్న విభాగం... వీరంతా కలిసి ఒక ప్రాజెక్టు ప్రారంభించారు. దానికి నేను బాధ్యుణ్ని. ఆ ప్రాజెక్టు కింద రాష్ట్రం నుంచి మహిళలను వివిధ నగరాలకు తరలించిన కేసులన్నీ పరిశోధించాం. నా ఆధ్వర్యంలో బృందాలుగా ఆయా నగరాలకు వెళ్లి వేశ్యాగృహాల మీద దాడులు జరిపి వందలాది యువతుల్ని విడిపించాం. అప్పుడే ట్రాఫికింగ్‌ సమస్య మీద కొన్ని పుస్తకాలు కూడా రాశాను.

ప్రజాదర్బారుతో ప్రజలకు చేరువగా..
2016 నుంచి రాచకొండ కమిషనర్‌గా ఉన్నాను. ఈ ఏడాదిలో వందలాది బాలకార్మికులను రక్షించాం. యాభై వేశ్యాగృహాలను మూసేయించాం. వాటిల్లో కొన్ని లాడ్జిలు కూడా ఉన్నాయి. ఈ తరహా నేరాలకు పాల్పడుతున్న 150 మందిని అరెస్టు చేశాం. ఆన్‌లైన్‌ సెక్స్‌ రాకెట్స్‌ని ఛేదించాం. కొంతకాలంగా ప్రజాదర్బార్‌ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. వారంలో ఒక్కో రోజు ఒక్కో ప్రాంతంలో ఇది నిర్వహిస్తున్నాం. దీనికి మంచి స్పందన వస్తోంది. ఆ మధ్య ఒక వృద్ధుడు తన స్థలాన్ని మరెవరో ఆక్రమించుకున్నారని ఫిర్యాదు చేశాడు. ఇన్వెస్టిగేట్‌ చేయిస్తే అలాంటివి చాలా కేసులు బయటకు వచ్చాయి. నిందితులను అరెస్టు చేయడంతో అలా తప్పుడు రిజిస్ట్రేషన్లు చేయించుకున్న పలువురు భయపడి తమంతట తామే రిజిస్ట్రేషన్లను క్యాన్సిల్‌ చేయించుకున్నట్లు తెలిసింది. కమిషనరేట్‌ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు పోలీసు కానిస్టేబుల్‌ ఉద్యోగానికి శిక్షణ కూడా ఇస్తున్నాం. మొత్తం 1250 మంది మూణ్ణెళ్ల శిక్షణ పొందుతున్నారు. ఈ మధ్యే ‘షి ఫర్‌ హర్‌’ అనే పేరుతో మరో కార్యక్రమం మొదలుపెట్టాం. ఒక్కో కళాశాల నుంచీ కొందరు అమ్మాయిల్ని ఎంపిక చేసి వివిధ విభాగాలకు చెందిన నిపుణులతో శిక్షణ ఇప్పించాం. వారంతా ఆయా కళాశాలల్లో తోటి అమ్మాయిలకు ఏవైనా సమస్యలు ఎదురైనప్పుడు అండగా నిలబడతారు. అవసరమైతే షి టీమ్‌ల సహాయం తీసుకుంటారు. ఒకరకంగా వీరు షి టీమ్‌లకూ, బాధితులకూ మధ్య వారధిగా పనిచేస్తారన్న మాట. దీనికి కూడా మంచి స్పందన వస్తోంది.

84 మంది విజయం సాధించారు
సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షలు రాసేవారికి మార్గదర్శకత్వం వహిస్తున్నాను. ఇటీవల విడుదలైన ఫలితాల్లో నా దగ్గర శిక్షణ పొందిన 84 మంది విజయం సాధించారు. ఇంటర్వ్యూ దశకు వచ్చినవారికి నేను సలహాలూ, సూచనలూ ఇచ్చేవాణ్ని. ఇకముందు రాత పరీక్ష దశనుంచీ శిక్షణ ఇద్దామనుకుంటున్నాను. నాకు లభించే కొద్దిపాటి ఖాళీ సమయాన్ని దీనికోసమే వినియోగిస్తున్నా. ఈ పరీక్షలకు వెళ్లదలచుకున్నవారికి నేను చెప్పేది ఒకటే... ప్రభుత్వ సర్వీసు అంటే అధికారం, డబ్బూ ఉంటాయని చేరవద్దు. ప్రజల పట్ల బాధ్యత వహించడానికీ, సమాజానికి సేవ చేయడానికీ చేరాలి.

మరికొన్ని...
మాది పెద్దలు కుదిర్చిన పెళ్లే. సునీత మరాఠీ అమ్మాయే.
* మాకు సాంస్కృతిక కార్యక్రమాలంటే ఇష్టం. తీరిక ఉంటే రవీంద్రభారతికి వెళ్తా.
* ఆదివారం పూర్తిగా కుటుంబసభ్యులతో గడుపుతాను.
* హిందీ, మరాఠీ సినిమాలు చూస్తాం. తెలుగు సినిమాలు చూడలేదు.
* మాకిద్దరు అమ్మాయిలు. పెద్దమ్మాయి ఇంటర్‌ అయిపోయింది. చిన్నమ్మాయి 9వ తరగతిలో ఉంది.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.