close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఆట మళ్లీ మొదలైంది!

ఆట మళ్లీ మొదలైంది! 

ఆటగాడు, వ్యాఖ్యాత, మేనేజర్‌, డైరెక్టర్‌, కోచ్‌... క్రికెట్‌కు సంబంధించి ఇన్ని రకాల బాధ్యతల్ని మరెవరూ నిర్వర్తించి ఉండరేమో! దీన్నిబట్టి అతడు క్రికెటర్‌ మాత్రమే కాదు, క్రికెట్‌ ప్రేమికుడని అర్థమవుతోంది కదా. ఆ క్రికెట్‌ ప్రేమికుడు మరెవరో కాదు, భారతజట్టు హెడ్‌ కోచ్‌ రవిశాస్త్రి. క్రికెట్‌తో అతడి ప్రస్థానమిది...

వి తండ్రి డాక్టర్‌, తల్లి హిస్టరీ ప్రొఫెసర్‌. కర్ణాటక నుంచి వెళ్లి ముంబయిలో స్థిరపడిన కుటుంబం వీరిది. రవి పుట్టి పెరిగింది ముంబయిలోనే. తన బాల్యం చాలా అద్భుతంగా గడిచిందంటాడు రవి. ‘ఏ విషయంలోనూ అమ్మానాన్న నామీద ఒత్తిడి పెట్టలేదు. నన్ను ఏదో గొప్పవాణ్ని చేసేయాలని వారెప్పుడూ అనుకోలేదు. నా ఇష్టాన్ని గమనించి క్రీడలవైపు ప్రోత్సహించారు. నేను వారి సలహాల్ని పాటించేవాణ్ని. కానీ, అంతిమంగా నాకు నచ్చిందే చేసేవాణ్ని’ అని తన బాల్యాన్ని గుర్తుచేసుకుంటాడు రవి.

అండర్‌-19 కెప్టెన్‌
రవి చదివిన డాన్‌ బాస్కో స్కూల్లో బీపీ దేశాయ్‌ క్రికెట్‌ కోచ్‌. రవిని క్రికెట్‌వైపు ప్రోత్సహించింది ఆయనే. ఆ స్కూల్‌ క్రికెట్‌ జట్టుకు నాయకత్వం వహించిన రవి, డిగ్రీ రెండో సంవత్సరంలో ఉండగానే ముంబయి రంజీ జట్టులో స్థానం సంపాదించాడు. అప్పటికి ఆ జట్టులో గవాస్కర్‌, వెంగ్‌సర్కార్‌, సందీప్‌ పాటిల్‌ లాంటి హేమాహేమీలు ఆడుతున్నారు. రవి అంతకు ముందే అండర్‌-19 జట్టుకి ఎంపికయ్యాడు. ఆ జట్టుకి నాయకత్వం వహించాడు కూడా. రవి కెప్టెన్సీలో భారత జట్టు ఇంగ్లాండ్‌, జింబాబ్వే పర్యటనలకు వెళ్లింది. ‘1979-80 సీజన్లో శ్రీలంకతో నా మొదటి అండర్‌-19 మ్యాచ్‌ ఆడాను. జట్టులోనే, కాదు ప్రత్యర్థి జట్టు ఆటగాళ్ల మధ్యా స్నేహపూర్వక వాతావరణం ఉండేది. ఆ పర్యటనలో లంక ఆటగాడు రణతుంగ కూడా ఆడాడు. జింబాబ్వే, ఇంగ్లాండ్‌ పర్యటనల్నీ బాగా ఎంజాయ్‌ చేశా’ అంటాడు రవి.

సెక్యూరిటీ గార్డ్‌ చెప్పాడు...
1981 మార్చిలో టీమ్‌ ఇండియాకు ఎంపికయ్యాడు రవి. నిజానికి జట్టులోకి ఎంపికైన సంగతి హోటల్‌ సెక్యూరిటీ గార్డు చెబితేగానీ రవికి తెలియలేదట. ‘కాన్పూర్‌లో రంజీ మ్యాచ్‌ ఆడుతున్నాను. ఆ మ్యాచ్‌లో నా బ్యాటింగ్‌ ప్రదర్శన పేలవంగా ఉంది. రెండు ఇన్నింగ్స్‌లోనూ డకౌట్‌ అయ్యాను. మర్నాడు ఉదయం పేపర్‌ కొనడానికని బయటకు వెళ్లాను. అక్కడ సెక్యూరిటీ గార్డ్‌ నాకు శుభాకాంక్షలు చెబుతున్నాడు. ఎందుకని అడిగితే భారతజట్టులోకి నన్ను తీసుకున్నట్టు రేడియోలో విన్నానని చెప్పాడు. ఆ వార్త అతడి ద్వారానే నాకు మొదట తెలిసింది. న్యూజిలాండ్‌ పర్యటనలో ఉన్న జట్టు నుంచి గాయం కారణంగా దిలీప్‌ దోషీ వైదొలగడంతో అతడి స్థానంలో నన్ను ఎంపికచేశారు. మర్నాడు సాయంత్రానికి వెల్లింగ్‌టన్‌లో ఉన్నాను’ అని ఆ రోజుల్ని గుర్తుచేసుకుంటాడురవి. గవాస్కర్‌ అప్పుడు కెప్టెన్‌. బౌలర్‌గా జట్టులోకి వచ్చిన రవి... మొదటి మ్యాచ్‌లోనే ఆరు వికెట్లు తీశాడు. రెండో ఇన్నింగ్స్‌లో నాలుగు వరుస బంతుల్లో మూడు వికెట్లు తీయడంతోపాటు, మొదటి ఇన్నింగ్స్‌లోనూ మూడు వికెట్లు తీశాడు. ‘ఆ సిరీస్‌లో మొత్తం 15 వికెట్లు తీశాను. విదేశాల్లో ఓ స్పిన్నర్‌ వికెట్లు తీయడం చాలా కష్టం. ఆ శుభారంభం నాలో ఆత్మవిశ్వాసాన్ని నింపింది’ అంటాడు. కెరీర్‌ తొలి మ్యాచ్‌లో పదో నంబర్‌ బ్యాట్స్‌మన్‌గా బరిలోకి దిగిన రవి, ఏడాది తర్వాత మొదటిసారి ఓపెనర్‌ అయ్యాడు. ఇంగ్లాండ్‌పైన 1982 జులైలో ఓపెనింగ్‌ బ్యాట్స్‌మన్‌గా దిగాడు. తర్వాత పాకిస్థాన్‌తో ఓ మ్యాచ్‌లో ఓపెనర్‌గా వెళ్లి ఇమ్రాన్‌ఖాన్‌, సర్ఫరాజ్‌ నవాజ్‌ లాంటి మేటి బౌలర్లని సమర్థంగా ఎదుర్కొని సెంచరీ చేశాడు. ‘నేను రూమ్‌లో మరో ఆటగాడితో కలిసి బీరు తాగుతున్నా. కెప్టెన్‌ గవాస్కర్‌ వచ్చి ‘రేపటి మ్యాచ్‌లో నువ్వు ఓపెనింగ్‌ చెయ్యాలి’ అన్నాడు. ‘తప్పకుండా’ అన్నాను. మొదట్నుంచీ బ్యాట్స్‌మన్‌గా ఎలాంటి సవాలునైనా స్వీకరించడానికి నేను సిద్ధంగా ఉండేవాణ్ని. ‘నైట్‌వాచ్‌మెన్‌’గా పంపమని కెప్టెన్‌ని అడిగేవాణ్ని. ఆ అయిదు, పదినిమిషాలు నిలబడితే మర్నాడు మంచి స్కోర్‌ చేసేందుకు అవకాశం ఉంటుందని నా ఆలోచన’ అని చెబుతాడు రవి. 1983 ప్రపంచకప్‌ గెల్చిన భారతజట్టులో రవి కీలక ఆటగాడు. 1984-85 సీజన్లో అయితే అటు బంతితో, ఇటు బ్యాట్‌తో అంతర్జాతీయ మ్యాచ్‌లలో మెరుపులు మెరిపించాడు. ఆ సీజన్లో ఆస్ట్రేలియా పర్యటనలో ఛాంపియన్‌ ఆఫ్‌ ది ఛాంపియన్స్‌(మ్యాన్‌ ఆఫ్‌ ద సిరీస్‌)గా ‘ఆడి’ కారు గెల్చుకున్నాడు.

ఓవర్లో ఆరు సిక్సులు
ఒక ఓవర్లో ఆరు సిక్సర్లు కొట్టిన అరుదైన రికార్డుని రవిశాస్త్రి 1985లో బరోడాతో జరిగిన ఓ రంజీ మ్యాచ్‌లో సాధించాడు. అప్పటికి ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో రవికంటే ముందు గ్యారీ సోబర్స్‌కి మాత్రమే ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు కొట్టిన రికార్డు ఉంది. బరోడా స్పిన్నర్‌ తిలక్‌ రాజ్‌ ఓవర్లో రవి ఈ రికార్డుని సమం చేశాడు. ఆ మ్యాచ్‌లో 123 బంతుల్లో డబుల్‌ సెంచరీ చేసి ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లోనే అత్యంత వేగవంతమైన డబుల్‌ సెంచరీ రికార్డునీ నెలకొల్పాడు రవి. 30 ఏళ్ల తర్వాత గతేడాదే ఇంగ్లాండ్‌ ఆటగాడు అన్యూరిన్‌ డొనాల్డ్‌ ఈ రికార్డుని సమం చేయగలిగాడు.

30 ఏళ్లకే రిటైర్మెంట్‌
ముంబయి రంజీ జట్టు కెప్టెన్‌గా దిలీప్‌ వెంగ్‌సర్కార్‌, గవాస్కర్‌, సందీప్‌ పాటిల్‌, అన్షుమన్‌ గైక్వాడ్‌లకు కెప్టెన్సీ చేశాడు రవి. అదీ పాతికేళ్ల వయసులో. తర్వాత 1987-88 సీజన్లో విండీస్‌తో జరిగిన చెన్నై టెస్టులో భారత్‌కు నాయకత్వం వహించి జట్టుని గెలిపించాడు. 1992లో ఆస్ట్రేలియాపైన వారి గడ్డమీదే రెండు సెంచరీలు చేసిన రవి కెరీర్‌లో పైపైకి వెళ్తున్న దశలో మోకాలి గాయం కారణంగా జట్టుకి దూరమయ్యాడు. తర్వాత కొన్ని నెలలకు దక్షిణాఫ్రికా పర్యటనకు ఎంపికయ్యాడు. కానీ మళ్లీ గాయం తిరగబెట్టడంతో జాతీయ జట్టుకి దూరమయ్యాడు. 1992 డిసెంబరులో ఆఖరి అంతర్జాతీయ మ్యాచ్‌ ఆడాడు. ‘నేను అప్పటికి కెరీర్‌లో ఉన్నత దశలో ఉన్నాననే చెప్పాలి. గాయాలు కాకుంటే మరో నాలుగైదేళ్లు ఆడేవాణ్ని. నా బ్యాట్‌ నుంచి ఇంకెన్నో అద్భుతమైన ఇన్నింగ్స్‌ వచ్చేవి. కానీ మోకాలికి వరుసగా రెండు తీవ్రమైన గాయాలయ్యాయి. అవి దీర్ఘకాల సమస్యగా మారాయి. పూర్తి ఫిట్‌నెస్‌తో ఆడలేనని అర్థమైంది. దాంతో ఇష్టంలేకపోయినా ఆటకు దూరంగా ఉండాల్సి వచ్చింది’ అంటాడు రవి. సిడ్నీలో ఆస్ట్రేలియాపైన చేసిన డబుల్‌ సెంచరీ కంటే వెస్టిండీస్‌పైన బార్బడోస్‌లో చేసిన సెంచరీ తన కెరీర్‌లోనే అత్యుత్తమమైన ఇన్నింగ్స్‌ అని చెబుతాడు. భారత్‌ ఆ మ్యాచ్‌లో ఓడిపోయింది. ప్రధాన బ్యాట్స్‌మెన్‌ ఒక్కొక్కరూ పెవిలియన్‌కు వస్తున్నా మాల్కమ్‌ మార్షల్‌, ఐయాన్‌ బిషప్‌, వాల్ష్‌, అంబ్రోస్‌లకు ఎదురు నిలిచి సెంచరీ(107) చేశాడు రవి.

వ్యాఖ్యాతగా కెరీర్‌
1993 ద్వితీయార్థంలో మళ్లీ మైదానంలోకి అడుగుపెట్టాడు రవి. ఈసారి అతడి కెప్టెన్సీలో ముంబయి జట్టు 1994 రంజీ ట్రోఫీని గెలిచింది. ఓ పక్క మోకాలి గాయం బాగా ఇబ్బంది పెడుతున్నా తనలోని క్రికెటర్‌ని కొన్నాళ్లు దేశవాళీ మ్యాచ్‌లలో అయినా కొనసాగించాలనుకున్నాడు. ఆ సమయంలో ‘వ్యాఖ్యానం చెబుతారా’ అంటూ ఓ టీవీ ఛానెల్‌ నుంచి పిలుపొస్తే... ప్రయత్నిద్దామనుకున్నాడు. వ్యాఖ్యాతగా వెళ్లొచ్చాక అదే ఏడాది క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించాడు. దానికి బోర్డులో చాలామంది ఆశ్చర్యపోయారు. ఎందుకంటే కొన్ని నెలల కిందటే రంజీ ట్రోఫీ గెలిపించాడు. ‘కానీ నేను వ్యాఖ్యానాన్ని సీరియస్‌గా తీసుకోవాలనుకున్నాను. మొదటిరోజునుంచే నాకది సరైన వేదిక అనిపించింది’ అని చెబుతాడు రవి. అలా 11 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్‌కు అధికారిక ముగింపు పలికాడు. ‘క్రికెటర్‌గా కెరీర్‌ ప్రారంభంలో బీబీసీ, ఏబీసీ రేడియోలలో క్రికెట్‌ వ్యాఖ్యానం వినేవాణ్ని. అది నాకు బాగా ఉపయోగపడింది. క్రికెటర్‌, క్రికెట్‌ వ్యాఖ్యానం రెంటిలోనూ క్రమశిక్షణ అవసరం. రెంటిలోనూ ఆటపైన వంద శాతం దృష్టి పెట్టాల్సి ఉంటుంది. చాలా లోతుగా తెలుసుకోవాల్సి ఉంటుంది. వ్యాఖ్యానం ఆటకు దూరం కాకుండా నాకు దక్కిన అవకాశం అనిపించి అటువైపు వెళ్లాను’ అంటాడు. వ్యాఖ్యాతగా ఏటా 150 రోజులపాటు లైవ్‌లో, 300 రోజులు ప్రయాణాల్లో ఉంటానంటాడు రవి. ఇండియా ఆడిన మ్యాచ్‌లకే కాకుండా ఆస్ట్రేలియా-ఇంగ్లాండ్‌, ఆస్ట్రేలియా-దక్షిణాఫ్రికా సిరీస్‌లకూ వ్యాఖ్యానం చేశాడు.

జట్టుతో మూడోసారి
2007 ప్రపంచకప్‌లో మొదటి దశలోనే బంగ్లాదేశ్‌తో ఓడి బయటకు వచ్చింది భారతజట్టు. అభిమానుల్లో ఆవేశం, ఆటగాళ్లలో నైరాశ్యం. ఆ దశలో మన క్రికెటర్లలో ఆత్మస్థైర్యాన్ని నింపడానికి మేనేజర్‌గా రమ్మంటూ రవిని బీసీసీఐ పిలిస్తే వెంటనే ముందుకొచ్చాడు. 2014లో వరుస ఓటములతో సతమతమవుతోంది టీమ్‌ ఇండియా. కోచ్‌ డంకన్‌ ఫ్లెచర్‌ సహా సహాయ సిబ్బంది నిస్సహాయులైన వేళ టీమ్‌ డైరక్టర్‌గా ఉండమంటూ మరోసారి పిలుపు. ఈసారి జట్టుతో కలిసి వారిలో నూతనోత్తేజాన్ని తెచ్చాడు. 2017... నాటకీయ పరిణామాల మధ్య హెడ్‌ కోచ్‌ కుంబ్లే నిష్క్రమణ. ఈసారి హెడ్‌కోచ్‌గా బాధ్యతలు తీసుకోవాలని రవికి ఆహ్వానం. నిజానికి గతేడాది తనను కోచ్‌గా ఎంపికచేయకపోవడంతో నిరాశ చెందానని రవి బహిరంగంగానే చెప్పాడు. కానీ, క్రికెట్‌ సలహా సంఘం పిలిచినపుడు అవన్నీ ఆలోచించకుండా ముందుకు వచ్చాడు. ‘జట్టుతో కలిసి కొన్నాళ్లు మంచి క్రికెట్‌ జర్నీ చేశాను. ఆ సమయంలో మన టీమ్‌ టెస్టుల్లో నంబర్‌వన్‌ అయింది. మరోసారి బాధ్యత నాపైన ఉంది అనిపించింది’ అంటాడు రవి. ‘జట్టుకి కెప్టెనే అసలైన సారథి. కెప్టెన్‌ తర్వాతే కోచ్‌’ అని అభిప్రాయపడతాడు రవి. ఆటగాళ్లలో ఒకడిలా కలిసి పనిచేసే నైజమతడిది.

కెప్టెన్సీ అందుకే రాలేదు
‘వర్క్‌ హార్డ్‌, పార్టీ హార్డర్‌’ అనే స్వభావం రవిది. ‘నైట్‌క్లబ్‌లూ, బార్లకి ఎంతగా వెళ్లేవాడినో, మ్యాచ్‌ల సందర్భంగా అంతే కఠినంగా శ్రమించేవాణ్ని. నాకున్న క్రేజ్‌ని ఎప్పుడూ ఇబ్బందిగా భావించలేదు. ఆ సమయాన్ని ఎంతో ఆస్వాదించా’ అంటాడు. ‘వంద పరుగులు చేసినా సున్నాకే ఔటయినా మైదానం వరకే ఆ ఫీలింగ్‌. తర్వాత రూమ్‌లో ఉండటం నాకు నచ్చదు. ఏ దేశం వెళ్లినా అక్కడ ఎంజాయ్‌ చేసేవాణ్ని’ అంటాడు. ఈడెన్‌ గార్డెన్స్‌ కామెంటరీ బాక్స్‌లో ఏసీ లేకపోతే. ‘ప్రపంచంలోనే చెత్త కామెంటరీ బాక్స్‌’అని ఆ విషయాన్ని లైవ్‌లోనే చెప్పాడు. ‘నేను మొదట్లో అందరిలానే ఉండేవాణ్ని. కొత్త మనుషుల్ని చూడటం, కొత్త సంస్కృతుల్ని తెలుసుకోవడం లాంటివి నన్ను మార్చాయి. జీవితంలో ఆనందాన్ని భాగం చేసుకున్నాను. ఏదైనా దక్కాల్సింది దక్కకపోతే, నేను ప్రశ్నించేవాణ్ని’ అని చెబుతాడు. ఈ స్వభావంవల్లనే తనకు టీమ్‌ ఇండియా కెప్టెన్సీ రాకపోయుంటుందని అభిప్రాయపడతాడు.

ఇంకొంత 

పూర్తిపేరు రవిశంకర్‌ జయధృత శాస్త్రి. తల్లిదండ్రులది మంగళూరు దగ్గర కర్వార్‌. రవికి కన్నడం బాగా అర్థమవుతుంది కానీ మాట్లాడటం కొద్దిగానే వస్తుంది.
* జీవితంలో ఏకైక హీరో తన తండ్రి అనీ, తొమ్మిదేళ్ల కిందట ఆయన చనిపోయినపుడు ఎంతో కుంగిపోయాననీ చెబుతాడు.
* భార్య రీతూ. 1990లో వీరికి పెళ్లయింది. పెళ్లయిన 18ఏళ్లకి ఓ పాప పుట్టింది. పేరు అలేక. ఏడేళ్లనుంచే అలేక కామెంటరీ చెప్పడం మొదలుపెట్టిందట.
* ధోనీ హెలికాప్టర్‌ షాట్‌లా అప్పట్లో రవిశాస్త్రి చపాతి షాట్‌ ప్రఖ్యాతి.
* ఖాళీ దొరికితే గోల్ఫ్‌ ఆడతాడు. సొంతూరులోని విష్ణుమూర్తి ఆలయాన్నీ, తిరుపతి, గురువాయూర్‌ లాంటి పుణ్యక్షేత్రాలనూ దర్శిస్తుంటాడు.
* లెఫ్టార్మ్‌ స్పిన్నర్‌, రైట్‌ ఆర్మ్‌ బ్యాట్స్‌మన్‌.
* 80 టెస్టుల్లో 3830 పరుగులు చేసి, 151 వికెట్లు తీశాడు.
* 150 వన్డేల్లో 3108 పరుగులు చేసి, 129 వికెట్లు తీశాడు.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.