close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
మొదటిరోజు చేతులు వణికాయి!

మొదటిరోజు చేతులు వణికాయి!

ఈ మధ్య కుర్రకారు సినిమా రంగంలోకి దూసుకొస్తున్నారు. వీళ్లకి సినిమా అంటే పిచ్చికాదు, అదో కళ, ఆలోచనలు పంచుకునే మాధ్యమం. అలా సినిమాల్లోకి వచ్చి సినిమాటోగ్రాఫర్‌గా, దర్శకుడిగా రాణిస్తున్నాడు 29 ఏళ్ల కార్తీక్‌ ఘట్టమనేని. కార్తికేయ, ప్రేమమ్‌, నిన్నుకోరి లాంటి సినిమాలకు కెమెరామేన్‌గా పనిచేసిన కార్తీక్‌ ‘సూర్య వర్సెస్‌ సూర్య’కి దర్శకుడు కూడా. తన జీవితంలో సినిమా ఎప్పుడు మొదలైనదీ, ఇప్పుడెలా కొనసాగుతున్నదీ చెబుతున్నాడిలా...

ఇంజినీరింగ్‌ పూర్తయ్యే సమయానికి ప్రతి ఒక్కరికీ ‘నెక్స్ట్‌ ఏంట’న్న ప్రశ్న ఎదురవుతుంది. నాకైతే ఆరు నెలలపాటు ఏం చేయాలో తెలియలేదు. తర్వాత ఇంట్లో చెప్పకుండా పుణెలోని ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో దర్శకత్వ విభాగంలో సీటుకోసం దరఖాస్తు చేశాను. కానీ సీటు రాలేదు. పరీక్ష కోసం ఆ క్యాంపస్‌కీ వెళ్లాను. అది పూర్తిగా సినిమా ప్రపంచం. అక్కడి వారికున్నంత సినిమా పరిజ్ఞానం నాకు లేదనిపించింది. సినిమాకి సంబంధించి సాంకేతిక అంశాలెన్నో తెలుసుకోవాలనుకున్నాను. అలాగని మూడు నాలుగేళ్ల కోర్సులు చేయడానికి ధైర్యం సరిపోలేదు. ఎందుకంటే, సినిమా నాకు ఇష్టమే కానీ దాన్నే కెరీర్‌గా తీసుకుంటే ఇమడగలనా లేదా అన్న సంశయం ఓ పక్క వెంటాడేది. అందుకే ఆరు నెలలపాటు ఏదైనా కోర్సుచేసి ఒక నిర్ణయం తీసుకుందాం అనుకున్నా.

చెన్నైలో శిక్షణ
మొదట్నుంచీ సినిమాల్లో మాటలకంటే కూడా విజువల్స్‌పైన ఎక్కువ దృష్టి పెట్టేవాణ్ని. స్క్రీన్‌మీద అందరూ సైలెంట్‌గా ఉన్నపుడు ఆ రంగులూ, మూడ్స్‌ ఇంకా బాగా భావాల్ని వ్యక్తీకరిస్తాయనిపించేది. అందుకే సినిమాటోగ్రఫీవైపు వెళ్లాలనుకున్నాను. రాజీవ్‌ మేనన్‌... ‘మెరుపు కలలు’, ‘ప్రియురాలు పిలిచింది’ సినిమాల దర్శకుడు; బొంబాయి, గురు, కడలి మొదలైన సినిమాలకు సినిమాటోగ్రాఫర్‌. ఆయన చెన్నైలో ‘మైండ్‌స్క్రీన్‌’ పేరుతో ఫిల్మ్‌ స్కూల్‌ నడుపుతున్నారు. అక్కడ ఆరు నెలల సినిమాటోగ్రఫీ కోర్సులో చేరాను. కెమెరా వర్క్‌ నేర్చుకోవడంతోపాటు, సినిమా నాకు సరిపోతుందా లేదా అని తెలుసుకోవడానికీ అందులో చేరాను. కథని విజువల్స్‌ సాయంతో ఎంత అందంగా చెప్పొచ్చో అక్కడికి వెళ్లాకే తెలిసింది. సినిమా గురించి తెలియని ఎన్నో కోణాల్ని తెలుసుకున్నాను. ఇంజినీరింగ్‌ నేపథ్యం వల్లనేమో కెమెరా వినియోగంలోని చాలా అంశాలు సులభంగా అర్థమయ్యాయి. సినిమాటోగ్రఫీ సృజనాత్మకతతో కూడిన విభాగమే అయినా, అందులో ఫిజిక్స్‌, ఆప్టిక్స్‌, కాంతి లాంటి సాంకేతిక అంశాలుంటాయి. దాంతో లైట్‌ని ఉపయోగించడాన్ని బాగా నేర్చుకున్నాను. అయితే అదంతా గ్రామర్‌ నేర్చుకోవడంలాంటిది. దాంతో ఎలాంటి వాక్యాలూ, వ్యాసాలూ రాస్తామనేది మన ఆలోచనలపైనే ఆధారపడి ఉంటుంది. మైండ్‌స్క్రీన్‌ శిక్షణ తర్వాత సినిమాల్లో కొనసాగాలన్న నిర్ణయానికి వచ్చాను. కానీ నాకు పరిశ్రమలో ఎవరితోనూ పరిచయాలు లేవు. నాకు తెలిసిన విద్యల్లా షార్ట్‌ ఫిల్మ్స్‌ తీయడం... అందులోనే కొనసాగాను. ఇంజినీరింగ్‌ రోజుల్లో వీడియోల ఎడిటింగ్‌ చేసేవాణ్ని. సరదా కోసం వేర్వేరు వీడియోల్ని కలగలిపి కొత్తవి సృష్టించేవాణ్ని. మా ఫ్రెండ్స్‌లో ఎడిటింగ్‌, కెమెరా, యాక్టింగ్‌, డైరెక్షన్‌ ఇలా ఒక్కొక్కరికీ ఒక్కో అంశంలో ఆసక్తి ఉండేది. మేమంతా హాబీగా షార్ట్‌ఫిల్మ్స్‌ తీసేవాళ్లం. తర్వాత ‘పాండ్‌ఫ్రీక్స్‌’ అనే సంస్థను ప్రారంభించాం. దీనిద్వారా దాదాపు 30 షార్ట్‌ఫిల్మ్స్‌ తీశాం. ఫిల్మ్‌స్కూల్‌ నుంచి వచ్చాక ‘ఇన్ఫినిటీ’ పేరుతో 15 నిమిషాలు నిడివి ఉండే షార్ట్‌ఫిల్మ్‌ తీశాను. ఆత్మహత్యా యత్నం నేపథ్యంతో ఉండే ఆ కథలో బాలీవుడ్‌ నటుడు హర్షవర్ధన్‌ రాణె నటించాడు. అందుకని దాన్ని హిందీలోనే తీసి ఇంగ్లిష్‌ సబ్‌టైటిల్స్‌ పెట్టాం. ‘ఇన్ఫినిటీ’ని యూట్యూబ్‌లో అప్‌లోడ్‌ చేశాక దాని గురించి ఎక్కువగా ఆలోచించలేదు. ఒకరోజు బాలీవుడ్‌ నటుడు, దర్శకుడు ఫర్హాన్‌ అక్తర్‌... ‘ఇన్ఫినిటీ షార్ట్‌ఫిల్మ్‌ బాగుంది. బాగా తీశారు’ అని ట్వీట్‌ చేశాడు. నేనెక్కడ, ఫర్హాన్‌ అక్తర్‌ ఎక్కడ... అలాంటి వ్యక్తి మెచ్చుకోవడంతో నాలో ఆత్మవిశ్వాసం పెరిగింది.

సినిమాల్లోకి...
ఇన్ఫినిటీ తర్వాత దర్శకులు చందూ మొండేటి, పవన్‌ సాదినేని పరిచయం అయ్యారు. చందూ, పవన్‌లు తీసిన కొన్ని షార్ట్‌ఫిల్మ్స్‌కు కెమెరామేన్‌గా పనిచేశాను. తర్వాత వాళ్లకి సినిమా అవకాశం వచ్చింది. ఇద్దరూ నన్నే కెమెరామేన్‌గా పెట్టుకున్నారు. వారు తమ కథల్ని నిర్మాతలకూ, హీరోలకూ వినిపించే దశనుంచీ మా ప్రయాణం కలిసే సాగింది. వాళ్ల సినిమా ఓకే అవ్వడం నుంచి షూటింగ్‌ ప్రారంభం వరకూ నేనూ టెన్షన్‌ పడేవాణ్ని. అదంతా ఇప్పుడు మిస్సవుతున్నాను. కార్తికేయ(చందూ), ప్రేమ ఇష్క్‌ కాదల్‌(పవన్‌)... రెండు సినిమాలూ దాదాపు ఒకేసారి మొదలయ్యాయి. అప్పటికి నేనెవరి దగ్గరా అసిస్టెంట్‌గానూ పనిచేయలేదు. ఒక విధంగా ఆ సమయానికి పూర్తిగా సిద్ధంగా లేను. మొదట కార్తికేయ మొదలుపెట్టాం. నాకు ఇప్పటికీ గుర్తు... తనికెళ్ల భరణి గారిపైన తొలి షాట్‌ తీస్తున్నపుడు నా చేతులు వణికాయి. షాట్‌ సరిగ్గా వచ్చిందోలేదోనని కంగారు పడ్డాను. రెండు మూడు రోజులు ఇబ్బందిగా ఫీలయ్యాను. ఆ సమయంలో డైరెక్టర్‌తోపాటు సెట్లో అసిస్టెంట్‌లు బాగా ధైర్యం చెప్పారు. రెండు సినిమాల్లోకీ ‘ప్రేమ ఇష్క్‌ కాదల్‌’ ముందు రిలీజై ఒక మాదిరిగా ఆడింది. ‘కార్తికేయ’ ఒక సస్పెన్స్‌ థ్రిల్లర్‌. అందుకోసమని క్యారెక్టర్లని అండర్‌ ఎక్స్‌పోజ్‌ చేసి కళ్లకింద డార్క్‌నెస్‌ వచ్చేటట్టు చూపిస్తానని చెబితే చందూ సరేనన్నాడు. సరిగ్గా బొమ్మ కూడా కనిపించలేదని రిలీజైన రోజునే ఎవరో అన్నట్టు ఫోన్‌ వస్తే టెన్షన్‌ పడ్డాను. కానీ సాయంత్రానికి సినిమా బాగుందన్న టాక్‌ వచ్చింది. మరీ పాత మెషీన్లున్న థియేటర్లలో మాత్రం బొమ్మ కొద్దిగా మసగ్గా కనిపించింది. కానీ కొత్త థియేటర్లూ, మల్టీప్లెక్స్‌లలో మా ప్రయోగం బాగా పనిచేసింది. ఒక విధంగా ఆ సినిమాకి అసిస్టెంట్‌ డైరెక్టర్‌గానూ పనిచేశాను. అందుకే విజయాన్ని బాగా ఎంజాయ్‌ చేశాను.

దర్శకుడిగా వచ్చా...
‘కార్తికేయ’ షూటింగ్‌ సమయంలో ‘తర్వాత ఏంటి’ అని హీరో నిఖిల్‌ అడిగితే ‘సూర్య వర్సెస్‌ సూర్య’ కథ వినిపించాను. ఎండలో తిరగలేని కారణంగా నైట్‌ కాలేజీలో చదివే ఓ కుర్రాడి కథ అది. కొన్నాళ్ల కిందట హైదరాబాద్‌లో ఓ నైట్‌ కాలేజీకి వెళ్లాను. అక్కడ అన్ని వర్గాలవారూ ఉన్నారు, డబ్బున్న కుర్రాళ్లు తప్ప. వాళ్లకి ఈ కాలేజీల్లో చదవాల్సిన అవసరం ఏ విధంగా వస్తుందని ఆలోచిస్తే, ఎండలో తిరిగే అవకాశంలేని ‘పార్ఫిరియా’ సమస్య గురించి తెలిసింది. ఆ నేపథ్యంలో కథ అల్లుకున్నాను. బడ్జెట్‌ పరిమితుల కారణంగా ఈ సినిమాకి దర్శకుడిగానే కాదు, కెమెరామేన్‌గానూ పనిచేశాను. ఆ అనుభవంతో దర్శకులపైన గౌరవం మరింత పెరిగింది. 2015లో ‘సూర్య వర్సెస్‌ సూర్య’ రిలీజై బాగా ఆడింది. మంచి ప్రయోగమని చాలామంది ప్రశంసించారు. కొన్ని కారణాలవల్ల మేం ఆ సినిమాని అనుకున్న సమయంకంటే ముందే రిలీజ్‌ చేయాల్సి వచ్చింది. ఇప్పుడా సినిమాని చూస్తే ఇంకొంచెం ఏదైనా జోడిస్తే బావుణ్ణనిపిస్తుంది.

సూర్య... తర్వాత ‘ఎక్స్‌ప్రెస్‌ రాజా’ సినిమాకి కెమెరామేన్‌గా పనిచేశాను. మేర్లపాక గాంధీ దర్శకుడు, శర్వానంద్‌ హీరో. మంచి ట్విస్టులతో సరదాగా సాగిపోయే కథ అది. దీనికీ మంచి గుర్తింపు వచ్చింది. తర్వాత చేసిన సినిమా ‘ప్రేమమ్‌’. ఆ షూటింగ్‌ ప్రారంభించిన మొదటిరోజునుంచీ మాపైన సోషల్‌ మీడియాలో వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూనే ఉన్నారు. మలయాళంలో వచ్చిన ప్రేమమ్‌ అప్పటికే బాగా జనాల్లోకి వెళ్లిపోయింది. దాన్ని అందుకోలేమంటూ ఆ వ్యాఖ్యలు. దర్శకుడు చందూ, హీరో నాగచైతన్య మాత్రం అవేవీ పట్టించుకోకుండా ధైర్యంగా ముందడుగు వేశారు. మొదట్లో కొన్ని సీన్లను షూట్‌ చేశాక వాటిని మాతృకతో పోల్చి చూసినపుడు మేం ఇంకా బాగా తీయాలేమో అనిపించేది. పోలికలు వెతుక్కుంటే అయ్యే పనికాదని చివరకు ‘మన శైలిలో మనం తీద్దాం’ అని ఒక నిర్ణయానికి వచ్చాం. కథలో కొన్ని మార్పులూ చేశాం. మొత్తానికి మంచి హిట్‌ అయ్యిందా సినిమా.

అద్భుత అవకాశం
ప్రేమమ్‌ తర్వాత ‘నిన్నుకోరి’కి పనిచేశా. ఇది భావోద్వేగాలతో కూడిన కథ. దర్శకుడు శివ నిర్వాణ చాలా సున్నితమైన అంశాల్ని దీన్లో చూపించాలనుకున్నారు. ఇలాంటి దర్శకులతో పనిచేసినపుడు కథ చెప్పే విధానంలో కొత్తదనం తీసుకురావచ్చు. ఈ సినిమాకి అందరం ఎంతో స్నేహపూర్వక వాతావరణంలో పనిచేశాం. తెరపైన అది బాగా కనిపించింది. దీనికి కెమెరా విషయంలో బాలూ మహీంద్రగారి సినిమాలతో స్ఫూర్తి పొందాను. కథను డామినేట్‌ చేసేలా కెమెరా ఉండకూడదనుకున్నాను. అమెరికాలో షూటింగ్‌ చేసినా అక్కడి అందాల మీదకు పోకుండా, తెరపైన భారతీయత కనిపించాలనుకున్నాం. వీలైనంత క్లోజప్‌లో పాత్రల భావోద్వేగాల్ని చూపించాం. విమానాశ్రయంలో షాట్‌ తీసినా కూడా పాత్రలమీదే దృష్టిపెట్టాం. ఫలానా ప్రాంతానికి వెళ్తున్నారని చెప్పినపుడు మాత్రం చుట్టుపక్కల వాతావరణం చూపాం. పాత్రలు మాట్లాడేటపుడు పూర్తిగా వారిపైనే దృష్టిపెట్టాం. ద్వితీయార్ధంలో అయిదుగురు వ్యక్తులు ఒకే కారులో కలిసి ప్రయాణిస్తారు. అపుడు వారి ఆలోచనలూ భావోద్వేగాలూ వేర్వేరుగా ఉంటాయి. అది తీయడం ఒక సవాలనిపించింది. అమెరికాలో జరిగే ఆఖరి సీన్లో నానీ బాధతో ఇంట్లోనుంచి బయటకు వచ్చేస్తాడు. సహజంగా ఉండటంకోసం 50-60 సెకన్ల ఆ సీన్‌ను ఒకటే షాట్‌లో తీశాం. అది రాత్రి సమయం. లైట్‌ ఎక్కువ వాడకుండా ఎక్కడ వీధి లైట్లున్నాయో చూసుకొని ఆ సహజ వెలుగులోనే షాట్‌ తీశాం. నానీకి కూడా కెమెరాపైన అవగాహన ఉంది. తనూ సలహా ఇచ్చేవాడు. శాన్‌ఫ్రాన్సిస్కోలోని తెలుగువారు ఎక్కువ సపోర్ట్‌ ఇచ్చారు. వాళ్లే ఆర్టిస్ట్‌ల మాదిరిగా, డ్యాన్సర్ల మాదిరిగా కనిపించి సినిమాకి దేశీ ఫీలింగ్‌ తెచ్చారు.

ఇంట్లో అడ్డు చెప్పలే...
ఇంటర్మీడియెట్‌ నారాయణ కాలేజీలో చదివాను. అప్పుడే ఫ్రెండ్స్‌ మధ్య సినిమాలు ఎక్కువగా చర్చకు వచ్చేవి. సినిమా చూశాక నేనైతే ఇలా చేసేవాణ్ని, అలా చేసేవాణ్ని అనుకునేవాళ్లం. కానీ అందులోకి దిగాక ఆ లోతు తెలుస్తోంది. ఫ్లాప్‌, హిట్‌లతో సంబంధంలేకుండా సినిమాకి పనిచేసిన వారిని గౌరవించడం నేర్చుకున్నాను. నాన్న శ్రీనివాస్‌, ఐపీఎస్‌ అధికారి. ప్రస్తుతం కర్నూల్‌ రేంజ్‌ డీఐజీ. ఆయనకు సినిమాలు చూసే అలవాటు లేదు. నా సినిమాలు మాత్రం చూసి అభిప్రాయం చెబుతారు. సినిమాల్లోకి వెళ్తానన్నపుడు అడ్డుచెప్పలేదు. నా మనసుకు నచ్చింది చేయమన్నారు. నా ప్రయత్నాలు ఎంతవరకూ వచ్చాయో అడిగేవారు. అమ్మ శ్యామల. ఎల్‌ఐసీ ఉద్యోగి. నాన్నకి ప్రతి రెండేళ్లకీ బదిలీ అయ్యేది. కడప, ప్రొద్దుటూరు... ఇలా చాలా ప్రాంతాలు తిరిగాను. ఏడో తరగతి నుంచి హైదరాబాద్‌లోనే ఉన్నాను. ఆల్‌ సెయింట్స్‌ స్కూల్లో చదువుకున్నాను. అక్కడ క్రీడలకు బాగా ప్రోత్సాహమిస్తారు. నాకు ఫుట్‌బాల్‌ పిచ్చి. ఆటలు మరీ ఎక్కువైపోతున్నాయని టెన్త్‌లో విజ్ఞాన్‌ స్కూల్లో చేర్పించారు. మొదట్నుంచీ ఫస్ట్‌క్లాస్‌ స్టూడెంట్‌నే. ఇంటర్‌ తర్వాత ఫిల్మ్‌స్కూల్‌కి వెళ్లాలనుకున్నాను. కానీ ధైర్యం సరిపోలేదు. ఇంజినీరింగ్‌ తర్వాత మాత్రం ధైర్యం చేసి చెప్పాను. 2005 నుంచి షార్ట్‌ఫిల్మ్స్‌ తీస్తున్నాం. 2013లో నా మొదటి సినిమా రిలీజైంది. మొదట్లో సినిమా అవకాశం వస్తుందో రాదోనన్న టెన్షన్‌ ఉండేది. ఇప్పుడు మంచి సినిమాల్ని ఎంచుకునే స్వేచ్ఛ వచ్చింది!

ఈసారి ఇంకా భిన్నమైన కథను ఎంచుకొని దర్శకత్వం చేస్తా... దాంతో ‘సూర్య...’కంటే ఎక్కువ మందికి చేరాలనేది నా లక్ష్యం.

ఇంకొంత... 

నా శ్రీమతి సింధు. మాది పెద్దలు కుదిర్చిన పెళ్లి. తను ఇంజినీరింగ్‌, ఎంబీఏ చేసింది. ప్రస్తుతం కుటుంబ వ్యవహారాలు చూసుకుంటోంది. నాకు కొన్నాళ్లు పని ఉండదు. సినిమా మొదలైతే ఖాళీ ఉండదు. ఇవి తను అర్థం చేసుకోగలదు.
* పాండ్‌ఫ్రీక్స్‌ ద్వారా షార్ట్‌ ఫిల్మ్స్‌ని నిర్మించడంతోపాటు వీడియో యాడ్స్‌, సినిమా ట్రైలర్స్‌ చేస్తుంటాం.
* హైదరాబాద్‌లోని ‘ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఏరోనాటికల్‌ ఇంజినీరింగ్‌’ నుంచి కంప్యూటర్‌ సైన్స్‌లో ఇంజినీరింగ్‌ చేశాను.
* ప్రస్తుతం రెండు సినిమాలకు కెమెరామేన్‌గా పనిచేస్తున్నాను.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.