close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
అడోబ్‌ని నడిపిస్తున్న హైదరాబాదీ!

అడోబ్‌ని నడిపిస్తున్న హైదరాబాదీ!

సత్య నాదెళ్ల, సుందర్‌ పిచాయ్‌లతోపాటు వినిపించే మరో భారతీయ టెక్‌ సీయీవో పేరు శంతను నారాయణ్‌. ప్రపంచ ప్రఖ్యాత ‘అడోబ్‌’ సంస్థకు దశాబ్దకాలంగా సీయీవోగా ఉన్న శంతను ఈ ఏడాది ఛైర్మన్‌గానూ బాధ్యతలు చేపట్టారు. ఇటీవల అమెరికా ప్రభుత్వం ఆయన్ని ‘గ్రేట్‌ ఇమ్మిగ్రెంట్స్‌’ అవార్డుతో గౌరవించింది. ‘ఇమ్మిగ్రెంట్‌’ నుంచి ‘గ్రేట్‌ ఇమ్మిగ్రెంట్‌’గా శంతను సాగించిన ప్రయాణమిది...

శంతను నారాయణ్‌... పెరిగింది హైదరాబాద్‌లోనే. తల్లి ఇంగ్లిష్‌ టీచర్‌గా పనిచేసేవారు. తండ్రి ఓ ప్లాస్టిక్‌ తయారీ పరిశ్రమను స్థాపించారు. హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూల్లో చదువుకున్న శంతను, ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ‘ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యునికేషన్స్‌’లో ఇంజినీరింగ్‌ చేశారు. ‘తల్లిదండ్రులు చెప్పిందే ఎప్పుడూ కరెక్ట్‌ కాదు, అదే సమయంలో వారు చెప్పింది కొన్నిసార్లు కరెక్టే’ అని చెప్పే శంతనుకి విద్యార్థిగా ఉన్న రోజుల్లో జర్నలిజంపైన ఆసక్తి ఉండేది. కానీ తల్లిదండ్రుల సూచనమేరకు ఇంజినీరింగ్‌ చేశారు. ‘ఆరోజుల్లో బాగా చదివే విద్యార్థులు ఇంజినీరింగ్‌ లేదంటే మెడిసిన్‌- ఈ రెండింటివైపే వెళ్లేవారు. నాకు రక్తం చూస్తే భయం అందుకే మెడిసిన్‌వైపు వెళ్లలేదు’ అని చెబుతారు శంతను. మనదేశం నుంచి వేలమంది తల్లిదండ్రులు తమ పిల్లల ఇంజినీరింగ్‌/మెడిసిన్‌ చదువు పూర్తికాగానే వారిని అమెరికా పంపుతున్నట్లుగానే శంతను తల్లిదండ్రులూ పంపారు. ‘అది తల్లిదండ్రుల కలల్ని నిజం చేయడం, అన్నల అడుగుజాడల్లో నడవడం’ అంటారు శంతను. అప్పటికే శంతను అన్నయ్య అమెరికాలోని సిలికాన్‌ వ్యాలీలో ఓ చిప్‌ తయారీ కంపెనీలో పనిచేసేవారు. మైక్రోప్రాసెసర్స్‌కు సంబంధించిన అంశాలు తనను కంప్యూటర్‌ సైన్స్‌ వైపు వెళ్లేలా చేశాయని చెప్పే శంతను... 1984లో అమెరికా వెళ్లి బౌలింగ్‌ గ్రీన్‌ స్టేట్‌ యూనివర్సిటీ(ఒహైయో)లో కంప్యూటర్స్‌లో మాస్టర్స్‌ చేశారు. తర్వాత ప్రాంగణ నియామకాల్లో తోటివారంతా పేరున్న బహుళజాతి కంపెనీల్లో స్థిరమైన ఉద్యోగాల్లో చేరితే శంతను మాత్రం ‘మెజరెక్స్‌ ఆటోమేషన్‌’ అనే అంకుర సంస్థలో చేరారు. ‘స్టార్టప్‌లో చేరితే నేర్చుకునే అవకాశం బాగా ఉంటుందన్న ఆలోచనతో అందులో చేరాను. నిజంగానే అక్కడ ర్యాపిడ్‌ఫైర్‌ తరహాలో నేర్చుకునే అవకాశం వచ్చింది. ఎక్కువగా ప్రోగ్రామింగ్‌ చేసేవాణ్ని’ అంటారు.

ఆపిల్‌లో ఉద్యోగం...
1989లో ‘ఆపిల్‌’ సంస్థలో చేరి అక్కడ సీనియర్‌ మేనేజ్‌మెంట్‌ స్థాయిలో ఆరేళ్లు పనిచేశారు శంతను. అక్కడ ‘ఆపిల్‌ టాక్‌’ పైన పనిచేసిన ‘గుర్‌శరణ్‌ సింగ్‌ సంధు’ రూపంలో తనకు మంచి మార్గదర్శి దొరికారంటారాయన. ‘ఎదుటివారికే కాదు, మనకు మనం కూడా ఎప్పుడూ సవాళ్లు విసురుకుంటుండాలి’ అన్న సంధూ మాటలు తన కెరీర్‌ నిర్మాణానికి ఎంతో ఉపయోగపడ్డాయని చెబుతారు. కెరీర్‌ ఎదుగుదలకు తనలోని మేనేజర్‌నీ, వ్యాపారినీ మెరుగుపర్చుకోవాలనుకున్న శంతను... ఆపిల్‌లో పనిచేస్తూ వారాంతాల్లో క్లాసులకు హాజరవుతూ కాలిఫోర్నియాలోని ‘హాస్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌’ నుంచి ఎంబీఏ చేశారు. ఆపిల్‌ తర్వాత ‘సిలికాన్‌ గ్రాఫిక్స్‌’ అనే సంస్థలో ‘డెస్క్‌టాప్‌ అండ్‌ కొలాబరేషన్‌ ప్రొడక్ట్స్‌’ డైరెక్టర్‌గా ఏడాదిపాటు పనిచేశారు. 1995 ప్రాంతంలో సిలికాన్‌ వ్యాలీలో ఇంటర్నెట్‌ బూమ్‌ వచ్చింది. పెట్టుబడి సంస్థ ప్రాంగణంలో చెట్టుని వూపినా కంపెనీ పెట్టడానికి డబ్బు వస్తుందన్నట్లు ఉండేది పరిస్థితి. అందరూ ఇంటర్నెట్‌ ఆధారిత అంకుర సంస్థలవైపు అడుగులు వేసేవారు. ఇంటర్నెట్‌లో ఫొటోలు షేర్‌చేసుకునే కంపెనీకి మంచి భవిష్యత్తు ఉంటుందని వూహించి కొద్దిమందితో కలిసి ‘పిక్ట్రా’ పేరుతో 1996లోనే ఒక వెబ్‌సైట్‌ను ప్రారంభించారు శంతను. ఫొటో షేరింగ్‌ కాన్సెప్ట్‌లో వచ్చిన మొదటి వెబ్‌సైట్‌ అది. దీంతోపాటు ఫొటోగ్రఫీ రంగంలో డిజిటల్‌ వైపు వచ్చే కంపెనీలకు అవసరమైన సేవల్నీ అందించేదీ సంస్థ. ‘ఒక సంస్థను ప్రారంభించడం నిజంగా గొప్ప అనుభవం. కానీ పిక్ట్రా ఎదుగుదలకు సకాలంలో నిధులు రాబట్టలేకపోయాం. మా వ్యాపార విధానంలోనూ లోపాలు ఉండటంతో ఆ జర్నీ అనుకున్నంత విజయవంతం కాలేదు. కానీ ఆ అనుభవంతో నేనెంతో నేర్చుకున్నాను. దూరదృష్టితో ఆలోచించడం, వ్యాపారాన్ని భారీస్థాయిలో వూహించడం, అనుకోని అడ్డంకులను అధిగమించడం... లాంటి అంశాలు తెలిశాయి. ఏటికి ఎదురీదడం అనుభవమైంది’ అని చెబుతారు శంతను.

మొదటి ఉద్యోగం తర్వాత శంతనూ ఏ కంపెనీలోనూ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోలేదు. ఎక్కడా ఇంటర్వ్యూకి హాజరుకాలేదు. తెలిసిన వారెవరైనా ఫలానా కంపెనీలో ఆయనకు సరిపోయే ఖాళీ ఉందని చెప్పినపుడు నచ్చితే వెళ్లేవారు. ‘హోదా, డబ్బుకంటే ఇష్టమైన పనికే ఓటు వేశాను. ఎంబీఏ తర్వాత చాలామంది తయారీరంగంలోకి వెళ్తే లాభం ఉంటుందని చెప్పేవారు. నేను మాత్రం నా మనసుకు నచ్చిన సాఫ్ట్‌వేర్‌ రంగంలోనే ఉన్నాను. ఇక్కడ కెరీర్‌ ప్రారంభంలోనే ఎంతో మంది అద్భుతమైన వ్యక్తుల్ని కలిశాను, వారితో పనిచేశాను. ‘మనం మాత్రమే ఏం చేయగలం, ఎంత వరకూ చేరుకోగలం’ లాంటి మాటలు వారి దగ్గర వినిపించవు. ఆపిల్‌లో అయితే ‘మనం ప్రపంచాన్ని మార్చుతున్నాం’ అన్న ఏకైక ఆలోచనతో పనిచేసేవాళ్లం. నేను అభివృద్ధిచేసిన ఉత్పత్తిని కోట్ల మంది వినియోగిస్తారన్న ఆలోచనే గొప్పగా ఉండేది’ అని చెబుతారు శంతను.

అడోబ్‌తో ప్రయాణం
ఫొటోషాప్‌ సాఫ్ట్‌వేర్‌ తయారుచేసిన సంస్థే ‘అడోబ్‌’. ఫొటోషాప్‌... ఒక సాఫ్ట్‌వేర్‌గా కాకుండా ఒక క్రియగా మారిపోయి ప్రజల్లోకి వెళ్లిందంటే కంపెనీ ప్రాధాన్యాన్ని అర్థం చేసుకోవచ్చు. 1982లో ప్రారంభించిన ఈ సంస్థలో 1998లో అడుగుపెట్టారు శంతను. ప్రారంభంలో ‘ఇంజినీరింగ్‌ టెక్నాలజీ గ్రూప్‌’ వైస్‌ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. ‘అడోబ్‌లో పనిచేస్తూ ప్రచురణ రంగంలో, మీడియా రంగంలో మేం తేబోతున్న భారీ మార్పుల్ని చాలా ముందుగానే వూహించాను’ అని చెప్పే శంతను నాయకత్వ నిచ్చెనలో త్వరత్వరగా పైకివెళ్తూ 2005లో కంపెనీ ‘చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌’గా, 2007లో సంస్థ సీయీవోగా బాధ్యతలు చేపట్టారు. రూ.20వేల కోట్లతో ఫ్లాష్‌ను అభివృద్ధి చేసిన ‘మ్యాక్రోమీడియా’ను 2005లో, రూ.11వేల కోట్లతో డిజిటల్‌ మార్కెటింగ్‌లో అద్భుతాలు సృష్టిస్తున్న ‘ఓమ్నీట్రూ’ను 2009లో అడోబ్‌ చేజిక్కించుకోవడంలో శంతనూ కీలకపాత్ర పోషించారు. 2008 వరకూ ఆదాయంలో స్థిరమైన పెరుగుదలతో వచ్చిన అడోబ్‌... ఆర్థిక మాంద్యం కారణంగా 2009లో 18 శాతం క్షీణతను చూసింది. తర్వాత ఏడాది కొంత వరకూ నష్టాల్ని తగ్గించుకొని 2011 నుంచి మళ్లీ లాభాలబాట పట్టింది. 2011లో అడోబ్‌ ఉత్పత్తుల్ని క్లౌడ్‌ ఆధారంగా అందించాలని నిర్ణయించారు శంతను. ఆ సేవల్లో... డాక్యుమెంట్‌ క్లౌడ్‌(డాక్యుమెంట్ల రూపకల్పన, వినియోగం), క్రియేటివ్‌ క్లౌడ్‌(డిజైనింగ్‌ చేసేవారికి), ఎక్స్‌పీరియన్స్‌ క్లౌడ్‌(ఖాతాదారుల ఆన్‌లైన్‌ కదలికల్ని పర్యవేక్షించేందుకు)లు ఉన్నాయి. అడోబ్‌ చరిత్రలోనే అతిపెద్ద మార్పు అది. ‘యథాస్థితిని కొనసాగించడమే మీ వ్యాపార వ్యూహమైతే, అది సరైన వ్యూహం కాదు’ అంటారు శంతను. తన హయాంలో ఎన్నో కొత్త ఉత్పత్తులతో, పాతవాటికి అప్‌డేట్‌లు తెస్తూ మార్కెట్‌ను ప్రపంచవ్యాప్తంగా విస్తరించారు. ఫొటోషాప్‌, ఇలస్ట్రేటర్‌, ప్రీమియర్‌ ప్రో లాంటి ఆప్స్‌ మొబైల్‌లోనూ మంచి ఆదరణ పొందుతున్నాయి. వీరి ‘ప్రీమియర్‌ ప్రో’ టెక్నాలజీద్వారా సినిమాల్ని ఎడిట్‌ చేసుకోవచ్చు. సృజనాత్మక రంగంలో ఉన్నవారిలో 90 శాతం ఫొటోషాప్‌ని వాడుతున్నారంటే దాని ప్రాధాన్యాన్ని అర్థం చేసుకోవచ్చు. ‘ప్రపంచం డిజిటల్‌ వైపు వెళ్లేకొద్దీ మా ప్రగతీ బాగుంటుంది. డెస్క్‌టాప్‌ పబ్లిషింగ్‌, ఎలక్ట్రానిక్‌ డాక్యుమెంట్‌ షేరింగ్‌, వెబ్‌ ఆధారిత కమ్యునికేషన్స్‌లో మేం ఇప్పటికే ముందున్నాం’ అని చెబుతారు శంతను. 2016లో అడోబ్‌ ఆదాయం 22శాతం పెరిగి రూ.40 వేల కోట్లకు చేరింది. దీన్లో క్లౌడ్‌ సేవల నుంచే ఎక్కువ మొత్తం వచ్చింది.

ఛైర్మన్‌గా బాధ్యతలు
స్వతహాగా మృదు స్వభావి అయినా వ్యాపారంలో మాత్రం శంతనూది దూకుడే. 2010లో అడోబ్‌ ఫ్లాష్‌ టెక్నాలజీ వృథా అన్న ఆపిల్‌ వ్యవస్థాపకుడు స్టీవ్‌ జాబ్స్‌ మాటలకు శంతను అంతగా ప్రాధాన్యమివ్వలేదు. మిగతా ఖాతాదారులకు ఫ్లాష్‌ గురించి వివరించి దాన్ని వినియోగించేలా చేసి తన బాట సరైనదేనని నిరూపించారంతే. ఇప్పుడు మైక్రోసాఫ్ట్‌, ఆపిల్‌ కంపెనీలతో ఒక విధంగా పోటీపడుతూనే మరో విధంగా భాగస్వామిగానూ ఉంది అడోబ్‌. కంపెనీ పాలక మండలి ఈ ఫిబ్రవరిలో శంతనుకు సంస్థ ఛైర్మన్‌గా పదోన్నతి కల్పించింది. ‘ఇదో గొప్ప గౌరవం. ఆత్మవిశ్వాసం కలిగి, బృందంతో సహకరిస్తూ పనిచేసే స్వభావం ఉండేవాళ్లని కంపెనీలోకి ఆహ్వానిస్తాను. అలాంటివాళ్లు పోటీతత్వంతో పనిచేసి తమతోపాటు సంస్థనీ అభివృద్ధి చేస్తారు’ అని చెబుతారు శంతను. ఇండియాలో సాఫ్ట్‌వేర్‌ రంగం సాధిస్తున్న ప్రగతిని చూస్తుంటే ముచ్చటేస్తుందని చెప్పే శంతను... భారత్‌లోనూ అడోబ్‌ని విస్తరింపజేస్తామంటారు. అడోబ్‌కు ప్రపంచవ్యాప్తంగా 17వేల మంది ఉద్యోగులుంటే, భారత్‌లో వారి సంఖ్య ఆరువేలు. ప్రస్తుతం బెంగళూరు, నోయిడాలలో కార్యాలయాలున్నాయి. ‘అడోబ్‌ భారతీయ విభాగం సాధారణ పనులు చేయడంలేదు. వారు ఆవిష్కరణలవైపు వెళ్తున్నారు’ అని ఆనందం వ్యక్తంచేసే శంతను, ‘సాంకేతిక రంగంలో ఏదీ శాశ్వతం కాదు, ఎంత గొప్ప ఆవిష్కరణకైనా జీవిత కాలం స్వల్పంగానే ఉంటుంది’ అంటారు. ఈ పోటీ ప్రపంచంలో మిమ్మల్ని ముందుకు నడిపే అంశాలేంటని అడిగితే, ‘నేను అడోబ్‌లో పనిచేస్తున్నానని చెప్పినపుడు ఎదుటివారి ముఖంలో ఒక వెలుగు కనిపిస్తుంది. ఫొటోషాప్‌, ఆక్రోబాట్‌, పీడీఎఫ్‌లు తమ జీవితంలో ఎంతలా భాగమైపోయాయో చెబుతారు. అవన్నీ మానసికంగా ఉల్లాసాన్నిస్తాయి. ఇంకా, ఈరోజు ఏదో నేర్చుకోవాలి, సాధించాలన్న తపనతో నిద్రలేచే మనిషిని నేను’ అని చెబుతారు.

‘నేను ఉస్మానియన్‌నే...’
‘స్కూల్‌ రోజుల్లో స్నేహితులూ, క్రీడలూ, ప్రత్యేక కార్యక్రమాల తర్వాతే చదువుకి సమయం కేటాయించేవాణ్న’ని చెప్పే శంతను, 1981 ఆసియా క్రీడల్లో సెయిలింగ్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించారు. హైదరాబాద్‌లో ఉన్న తల్లిదండ్రుల దగ్గరకు తరచుగా వస్తుంటారు. ‘1980తో పోల్చితే హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ 20రెట్లు పెరిగి ఉంటుంది. అప్పట్లో రోడ్డుపక్కన దొరికే పదార్థాల్ని కొని తినేవాళ్లం. ఇప్పుడా సాహసం చేయలేను’ అని చెబుతారు. తన ఎదుగుదలకు పునాది ఉస్మానియా క్యాంపస్‌లోనే పడిందంటారు. ‘నేను ఎప్పటికీ ఉస్మానియన్‌’నే అంటారు శంతను. ఈయన తండ్రి లక్ష్మీ నారాయణ్‌ కూడా ఇదే కాలేజీ పూర్వ విద్యార్థి. గతేడాది ఓయూ ఇంజినీరింగ్‌ కాలేజీ ప్రపంచ పూర్వవిద్యార్థుల సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై- అమెరికా యూనివర్సిటీలో సీటుకోసం తనకి సిఫార్సు లేఖ రాయడానికి ఓ ప్రొఫెసర్‌ నిరాకరించారనీ, క్లాసులో ఇద్దరు అత్యుత్తమ విద్యార్థులకే ఆ అవకాశమని చెప్పారనీ, అంతటి విలువలూ క్రమశిక్షణ ఉండేవనీ ఆ వేదికపైన గుర్తుచేసుకున్నారు. ఓయూ శతాబ్ది ఉత్సవాలకు హాజరవుతాననీ చెప్పారు.

గోల్ఫ్‌ ఆడాల్సిందే...

ఎం.ఎస్‌.లో తన సహాధ్యాయి రేనీని పెళ్లిచేసుకున్నారు.

* వీరికి ఇద్దరు అబ్బాయిలు... శ్రావణ్‌, అర్జున్‌. ఇద్దరూ టెక్నాలజీ రంగంలో స్థిరపడ్డారు. సాంకేతిక రంగంలో వస్తున్న మార్పుల గురించి శంతను వీరితో తరచూ చర్చిస్తుంటారు.

* ఏడాదిలో 90 రోజులు పర్యటనల్లోనే ఉండే శంతనుకు ఇంట్లో బెడ్‌పైన తప్పించి ఎంత గొప్ప హోటల్‌లో పడుకున్నా నిద్రపోయినట్లుండదట.

* గోల్ఫ్‌, టెన్నిస్‌ ఇష్టం. వారాంతాల్లో గోల్ఫ్‌ కచ్చితంగా ఆడతారు. ‘అడోబ్‌లో లేకుంటే, ప్రొఫెషనల్‌ గోల్ఫర్‌ను అయ్యుండేవాణ్ని’ అంటారు.

* ప్రభుత్వ పాలనలో సాంకేతికత వినియోగంపైన ఒబామా అధ్యక్షుడిగా ఉన్న కాలంలో నియమించిన సలహా మండలిలో సభ్యుడు.

* శంతను పేరున అయిదు పేటెంట్లు ఉన్నాయి.

* నచ్చే పుస్తకం... అయన్‌ ర్యాండ్‌ రాసిన ‘అట్లాస్‌ ష్రగ్‌డ్‌’, నచ్చే సినిమా ‘ది గాడ్‌ ఫాదర్‌’.

* తన సేవలకుగానూ కంపెనీ నుంచి శంతను గతేడాది వివిధ రూపాల్లో పొందిన మొత్తం రూ.130 కోట్లు.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.