close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
నాన్న కలని నేను నిజం చేశా!

నాన్న కలని నేను నిజం చేశా!

విజయ్‌ దేవరకొండ... హీరోగా చేసిన సినిమాలు మూడంటే మూడే. కానీ యువతలో సంపాదించుకున్న క్రేజ్‌ మాత్రం ఎన్నో హిట్‌ సినిమాలకు సరిపోయేంత. అతడి తొలి సినిమా ‘పెళ్లి చూపులు’ చిన్న సినిమాగా వచ్చి ఉత్తమ తెలుగు చిత్రంగా జాతీయ అవార్డుకి ఎంపికవగా, తాజా చిత్రం అర్జున్‌ రెడ్డి... ఓపక్క థియేటర్లలో కాసుల వర్షాన్ని కురిపిస్తూ మరోపక్క సోషల్‌ మీడియాను వేడెక్కిస్తూ సంచలనం సృష్టిస్తోంది. మధ్యతరగతి కుటుంబంలో పుట్టి హీరోగా ఎదిగిన విజయ్‌ తన గురించి చెబుతున్న కొన్ని విశేషాలు...

ర్జున్‌ రెడ్డి సినిమా షూటింగ్‌ అయిపోయాక హిట్‌ అవుతుందనే నమ్మకం కలిగింది. కానీ ప్రీమియర్‌కి వెళ్లేసరికే బాగా టెన్షన్‌ పడ్డా. సినిమా చూడకుండా థియేటర్లో మిగిలినవాళ్లను చూస్తుండిపోయా. అందరూ అరుస్తుంటే హీరో వెనక ఉన్నాడు కాబట్టే అరుస్తున్నారేమో అనుకున్నా. కానీ మూడుగంటల సినిమా అయిపోయి పేర్లు పడుతున్నా వాళ్ల అరుపులు ఆగలేదు. అప్పుడర్థమైంది వాళ్లకి కథ నచ్చిందీ అని. ఆ రాత్రి పార్టీ చేసుకున్నాం. తెల్లారి ఆలస్యంగా లేచా. ఫోన్‌ తీసి చూస్తే వందలకొద్దీ మెసేజ్‌లూ ట్వీట్లూ. ఒక్కొక్కటీ చదువుతుంటే నాకు కన్నీళ్లు ఆగలేదు. వాటినే అంటారేమో ఆనంద భాష్పాలని. నాన్నైతే ‘నేను హైదరాబాద్‌ వచ్చి ఇన్ని కష్టాలు పడినదానికి నువ్వో అర్థం కల్పించావురా’ అన్నారు. నిజమేనేమో, నేను సినిమాల్లోకి రావడానికి బహుశా పునాది నాన్నకు సినిమాలమీద ఉన్న ఇష్టంతోనే పడిందేమో.

నాన్న నటుడవ్వాలనుకున్నారు
మాది నాగర్‌ కర్నూల్‌ జిల్లాలోని అచ్చంపేట్‌ గ్రామం. నాన్న గోవర్ధన్‌ రావు, అమ్మ మాధవి. నాన్నకు సినిమాలమీద ఉన్న ఇష్టంతో నేను పుట్టకముందే హైదరాబాద్‌ వచ్చేశారు. నటుడు అవ్వాలనుకున్నారు కానీ అది సాధ్యం కాక దర్శకత్వం వైపు వచ్చారు. దూరదర్శన్‌తో మొదలుపెట్టి దాదాపు అన్ని ఛానెళ్లలోనూ ఆయన డైరెక్ట్‌ చేసిన సీరియళ్లు వచ్చాయి. నేను పుట్టింది హైదరాబాద్‌లోనే. నాకో తమ్ముడు. ప్రస్తుతం అమెరికాలో ఉద్యోగం చేస్తున్నాడు. చిన్నపుడు మేం వనస్థలిపురం, దిల్‌సుఖ్‌ నగర్‌, నల్లకుంట... ఇలా చాలా చోట్ల ఉన్నాం. అమ్మానాన్నా సత్యసాయి బాబా భక్తులు. అందుకే ఆరేళ్ల వయసులోనే నన్ను పుట్టపర్తిలోని ‘శ్రీ సత్యసాయి హయ్యర్‌ సెకండరీ స్కూల్‌’లో చేర్పించేశారు. అక్కడ ఏడాదికి రెండు నెలలు మాత్రమే సెలవులుండేవి. స్కూల్లో చదువుకి ఫీజులేం ఉండవు. హాస్టల్లో ఉండడానికి ఏడాదికి ఆరువేలు కడితే సరిపోయేది. చదువుకూడా బాగా చెబుతారు. కానీ సీట్‌ రావడానికే చాలా కష్టపడాలి. ఫస్ట్‌ క్లాస్‌ నుంచీ టెన్త్‌ వరకూ అక్కడే చదివా. మా స్కూల్లో అన్ని రాష్ట్రాల విద్యార్థులూ ఉండేవారు. అందుకే, ఒక్కో భాష మాట్లాడేవాళ్లు ఒక్కో గ్రూప్‌ పెట్టేస్తారేమో అని... అందర్నీ కచ్చితంగా ఇంగ్లిష్‌లోనే మాట్లాడమనేవారు. ఇంకేముందీ, ఒకటో తరగతిలో సెలవులకి ఇంటికొచ్చేసరికే నేను తెలుగు మర్చిపోయా. ఉప్పల్‌లోని లిటిల్‌ ఫ్లవర్‌ జూనియర్‌ కాలేజీలో ఇంటర్‌ చదువుతున్నపుడే మళ్లీ తెలుగు మాట్లాడ్డం అలవాటైంది. అక్కడ చేరాక కాలేజీ బస్సులో వెళ్లేటపుడు నేను పాష్‌ ఇంగ్లిష్‌లో మాట్లాడుతుంటే మిగిలినవాళ్లు ‘ఏందిరా స్టైల్‌ కొడుతున్నావ్‌..? తెలుగులో మాట్లాడొచ్చుగా, బలుపా...’ అని ర్యాగింగ్‌ చెయ్యడం మొదలుపెట్టారు. వాళ్లనుంచి తప్పించుకోవడానికి నేను ఐశ్వర్యారాయ్‌ మాతృభాషను నా మాతృభాషగా మార్చేసుకున్నా. ఎలా అంటే... నాకు తెలుగు రాదనీ ఇంట్లో తుళు మాట్లాడతాం అనీ చెప్పేశా. తమిళొ కన్నడనో అన్నాననుకోండి... మాట్లాడమంటే దొరికిపోతా. తుళు అంటే ఎవరికీ తెలీదు కాబట్టి వదిలేస్తారన్నది నా ప్లాన్‌. తర్వాత ఫ్రెండ్స్‌తో మాట్లాడుతూ తెలుగు నేర్చుకున్నా.

చిన్నపుడు సినిమా వూసులేదు
చిన్నపుడు పెద్దవాళ్లు ఏమవుతావు... అని అడగ్గానే ఓ రోజు డాక్టర్‌ అనీ ఇంకోరోజు పోలీస్‌, బస్‌ డ్రైవర్‌, హీరో... ఇలా ఏవేవో అంటుంటాం. నేనూ అలాగే చెప్పేవాడిని. కానీ నాకు అసలు క్లారిటీ వచ్చింది భద్రుకా కాలేజీలో డిగ్రీ చదువుతున్నపుడే. అంతకు ముందు మా స్కూలూ హాస్టలూ పచ్చటి కొండల మధ్య ఉండేవి. చూడ్డానికీ ఉండడానిక్కూడా చాలా బాగుండేది ఆ వాతావరణం. అలాంటి చోటు నుంచి వచ్చి హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ చూస్తే భయం వేసేసేది. కార్లూ బస్సుల పొగ అస్సలు పడేది కాదు. ఇంటర్‌కి కాలేజీ బస్సులో వెళ్లాను కాబట్టి ఎలాగో నడిచిపోయింది. కానీ డిగ్రీకి కొత్తపేట నుంచి కాచీగూడ సిటీ బస్సులు పట్టుకుని కాలేజీకి వెళ్లా్లల్సొచ్చేది. పైగా బస్సుల మీద నంబర్లను చూసుకుని వెళ్లాలంటే నాకు పెద్ద పజిల్‌లా ఉండేది. దానికి తోడు, తోసుకుని తోసుకుని ఎక్కాలీ వేలాడుతూ నిలబడాలీ దిగాలీ. కాలేజీకి వెళ్లడమంటే రోజూ యుద్ధానికి వెళ్తున్నట్లే అనిపించేది. దాంతో ఏదో వంక చెప్పి డుమ్మా కొట్టేసి మా ఫ్రెండ్స్‌ నోట్సు తీసుకుని ఇంట్లోనే చదివేవాడిని. మరీ రాని సబ్జెక్టులైతే ట్యూషన్‌ పెట్టించుకునేవాణ్ని. ఆశ్చర్యం ఏంటంటే... అలా చదివిన నేను ఫస్ట్‌ ఇయర్‌లో టాపర్‌ని. ఫ్రెండ్స్‌ ‘నువ్వేరా టాపర్‌’ అని చెబితే షాక్‌ అయ్యి, వెళ్లి మార్కులు చూసుకుంటే నాకూ ఇంకో అమ్మాయికే ఎక్కువ వచ్చాయి. అందరూ టాపర్‌ టాపర్‌ అంటుంటే... ఆ ఆనందంతో తర్వాత కొన్ని రోజులు కాలేజీకి వెళ్లా. నేను బాగా చదవడానికి కారణం పరీక్షలంటే అస్సలిష్టం లేకపోవడమే. ఫెయిల్‌ అయితే, సప్లిమెంట్లూ బ్యాక్‌లాగ్‌లూ నావల్లకాదు అనిపించేది. ఒక్కసారే రాసి పాసైపోతే బెటర్‌ అనుకునేవాణ్ని. అయితే, కాలేజీకి వెళ్లకపోతే ఫస్ట్‌ ఇయర్‌ ఇంట్లో వూరుకున్నారు కానీ సెకండ్‌ ఇయర్‌ పూర్తయ్యేసరికి పరిస్థితి మారిపోయింది. మాది మధ్యతరగతి కుటుంబం... అమ్మానాన్నా నెలంతా కష్టపడి సంపాదించేది తమ్ముడినీ నన్నూ చదివించడానికీ మా ఖర్చులకే సరిపోయేది. నెలాఖరు కొచ్చేసరికి డబ్బులుండేవి కావు. అయినా ఉన్నంతలో మంచి కాలేజీలో చదివించాలనీ మేం అడిగినవన్నీ ఇవ్వాలనీ అనుకునేవారు. అలాంటిది నేను కాలేజీకి వెళ్లకుండా ఇంట్లో కూర్చుని టీవీ చూస్తుంటే... నాన్నకు బాగా కోపం వచ్చేసేది. ఓరోజు... ‘మేమింత కష్టపడి డబ్బులు కట్టి చదివిస్తుంటే నువ్వు ఇంట్లో కూర్చుని సమయాన్నీ డబ్బునీ వృథా చేస్తున్నావు... అసలు నీకేమవ్వాలనుంది... వంటోడివి అవుతావా హోటల్‌ మేనేజ్‌మెంట్‌లో చేర్పిస్తా... లేదంటే వూళ్లొ పొలాలున్నాయి పోయి పొలం దున్నుకో... సినిమాలంటే ఇష్టమైతే వెళ్లి అసిస్టెంట్‌ డైరెక్టర్‌గానో ఇంకోపనో చేసుకో... అంతేకానీ వూరికే టీవీ చూస్తూ కూర్చోవడం కాదు’ అని తిట్టేశారు. దాంతో నేను కోపంగా యాక్టింగ్‌ అంటే ఇష్టం అది నేర్పించండి అని ఏదో నోటికొచ్చింది అనేశా. ఆ తరవాతే సినిమాల్లోకి వెళ్లాలన్న కోరిక బలంగా ఏర్పడింది.

పిచ్చోడైతే మాకే సంబంధం లేదన్నారు
నటన నేర్చుకుంటూనే కాలేజీకెళ్తానని డీల్‌ కుదుర్చుకోవడంతో నాన్న నన్ను హిమాయత్‌ నగర్‌లోని సూత్రధార్‌ యాక్టింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌కి తీసుకెళ్లారు. అక్కడ అప్లికేషన్‌ నింపేటపుడు నిబంధనల్లో ఒకవేళ మీ అబ్బాయికి మతిస్థిమితం తప్పితే మాకు సంబంధం లేదు... అని ఓ పాయింట్‌ రాసుంది. అది చూసి మా అమ్మ కంగారుపడి... ఎందుకులేరా వేరే చోట చేరుదువుగాన్లే వచ్చేయ్‌ అంది. నాన్నేమో నీకు ఈ ఇన్‌స్టిట్యూటే కరెక్ట్‌ అని చేర్పించేశారు. మొదట్లో అక్కడ ఉండలేనేమో అనుకున్నా. కానీ తరవాత అలవాటైపోయింది. ఇన్‌స్టిట్యూట్‌లో చేరిన మూడు నెలలకు స్టేజ్‌ షోలు చెయ్యడం మొదలుపెట్టా. కొన్ని షోలు చేశాక సినిమా ప్రయత్నాల్లో ఉండగానే డిగ్రీ అయిపోయింది. దాంతో ఇంట్లోవాళ్లు ఎంబీయే చదివాక సినిమాలు చేసుకుందువుగానిలే అని ఒత్తిడి చెయ్యడం మొదలు పెట్టారు. పెద్దమ్మ కూతురేమో ‘బ్యాంకు ఉద్యోగాలకోసం నోటిఫికేషన్‌ పడింది. నేను ఫీజు కడతా, రాయి’ అని అప్లికేషన్‌ తీసుకొచ్చేసింది. అప్పుడు... కలలు కంటాం కానీ అవన్నీ నిజం కావేమో. నేనిక యాక్టర్‌ని ఎప్పటికీ కాలేనేమో అని చాలా బాధపడ్డా. అదృష్టం కొద్దీ... అదే సమయంలో శేఖర్‌ కమ్ముల ‘లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌’ సినిమా మొదలుపెట్టారు. కొత్తవాళ్లతో సినిమా తీస్తున్నారని తెలిసి వెంటనే ఫొటోలు పంపించా. పదిహేను రోజుల వరకూ వాళ్లనుంచి ఏ సమాధానమూ రాలేదు. అప్పట్లో అమ్మ నడిపే కార్పొరేట్‌ ట్రెయినింగ్‌ ఎడ్యుకేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌లో శేఖర్‌ కమ్ముల గారి సినిమాలో తల్లి పాత్ర చేసిన ఒకావిడ ట్రెయినర్‌గా పనిచేసేది. ఆవిడ ద్వారా ఆఫీసు అడ్రస్‌ కనుక్కుని అక్కడికెళ్లిపోయా. వాళ్లు నన్ను ఆడిషన్‌ చేసి ఓ పాత్ర ఇచ్చారు. తర్వాత దాదాపు ఏడాదిన్నరపాటు మంచి అవకాశం వస్తుందేమో అని ఎదురుచూస్తూ గడిపా. ఇక లాభం లేదనుకుని దర్శకత్వంలో అదృష్టం పరీక్షించుకుందాం అని కొన్ని స్క్రిప్టులు రాసుకున్నా. ఓ షార్ట్‌ ఫిల్మ్‌ కూడా తీశా. అప్పుడే ‘లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌’కి అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేస్తూ నాకు క్లోజ్‌ అయిన నాగ్‌ అశ్విన్‌ ఫోన్‌ చేశాడు. ‘నేనో సినిమా తీస్తున్నా, ఓ పాత్రకు నువు ఆడిషన్‌కి రావాలి’ అన్నాడు. అదే ‘ఎవడే సుబ్రమణ్యం’. అందులో నేను చేసిన రిషి పాత్రకు మంచి పేరొచ్చింది. ఇంకేముందీ... ఈసారి ప్రొడ్యూసర్లు నా ఇంటి ముందు క్యూ కట్టేస్తారనుకున్నా. అలాంటివన్నీ సినిమాల్లోనే జరుగుతాయి. కాకపోతే అప్పుడొకరూ అప్పుడొకరూ ఫోన్‌ చెయ్యడం మొదలుపెట్టారు. పెళ్లి చూపులు, ద్వారక, అర్జున్‌ రెడ్డి... అప్పుడు ఒప్పుకున్న కథలే. ‘పెళ్లి చూపులు’ విడుదలయ్యాక తెలిసింది సోలో హీరోగా చేస్తే ఎంత స్పందన వస్తుందో. ఆ రోజు నా ఫోన్‌ మోగడం ఆగలేదు. ఇక, అర్జున్‌ రెడ్డికి వచ్చిన స్పందన అయితే... చెబితే నమ్మరు. ఇప్పుడున్న నా ఫోన్‌ కొన్ని రోజులముందే కొన్నా. కెపాసిటీ 6జీబీ ర్యామ్‌. చాలా ఫాస్ట్‌. అలాంటి ఫోన్‌ సినిమా రిలీజ్‌ రోజు వచ్చిన మెసేజ్‌లూ మిస్డ్‌కాల్సూ ట్వీట్లతో స్ట్రక్‌ అయిపోయింది. ఫార్మాట్‌ చేస్తే కానీ పనిచెయ్యలేదు.

కాలేజీలో ప్రేమకథలు
కాలేజీలో అందరిలానే నాకూ ప్రేమకథలున్నాయి. టెన్త్‌ వరకూ బాయ్స్‌ హాస్టల్‌ కాబట్టి ఇంటర్మీడియట్‌లో అమ్మాయిలతో మాట్లాడాలంటేనే భయమేసేది. డిగ్రీలోకొచ్చేసరికి మా క్లాస్‌ నుంచి సూపర్‌ సీనియర్స్‌, తర్వాత జూనియర్స్‌ వరకూ ఏ అమ్మాయితో మాట్లాడాలనిపించినా వెళ్లి మాట్లాడేసేవాణ్ని. ఆ వయసులో మనం ఎవర్నైనా ఇష్టపడటం, మనల్ని ఎవరైనా ఇష్టపడటం అదంతా సాధారణమేగా. అది టీనేజ్‌. ఆ ఫేజ్‌లో అలానే ఉండాలి. వయసుని బట్టీ, హార్మోనుల్ని బట్టీ ఏవో చేస్తుంటాం. కానీ ఎంత అల్లరిగా తిరిగినా చదువునీ భవిష్యత్తునీ మర్చిపోకూడదు. నేను సినిమాల్లోకి రావాలనుకున్నాక అంత పట్టుదలతో ప్రయత్నించానంటే అది అమ్మానాన్నల వల్లే. వాళ్లు నాకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చేవారు. అది చెయ్యి... ఇది చెయ్యి అని ఎప్పుడూ ఫోర్స్‌ చెయ్యలా. కానీ ఏదైనా చేస్తానని మొదలు పెట్టి మాత్రం మధ్యలో ఆపకు అనేవారు. అలాంటి తల్లిదండ్రులు దొరకడం నిజంగా నా అదృష్టం. అమ్మానాన్నా అంత అండగా నిలబడ్డారు కాబట్టే ఈరోజు ఇక్కడివరకూ రాగలిగా.

- యార్లగడ్డ మధులత

ఇంకొంత...

చిన్నప్పుడు నేను చాలా బొద్దుగా ఉండేవాడిని. టెన్త్‌ క్లాస్‌, ఇంటర్‌లో నా బరువు దాదాపు 90 కిలోలు. దాంతో నాకే ఇబ్బందిగా అనిపించి బరువు తగ్గించుకోవడానికి తైక్వాండోలో చేరిపోయా. దెబ్బకి పదీ పదిహేను కిలోలు తగ్గా. అప్పట్నుంచీ అదే బరువు ఉండేలా చూసుకుంటున్నా. తినే విషయంలో నేను పెద్దగా నియమాలేం పెట్టుకోను. బాగా తింటా. అయినా ఫిట్‌గా ఉండడానికి కారణం ఏంటంటే రోజూ జిమ్‌కి వెళ్లడం, ఆటలు బాగా ఆడటమే. వీకెండ్స్‌లో స్కూల్‌ ఫ్రెండ్స్‌తో కలసి వాలీబాల్‌, బ్యాడ్మింటన్‌, క్రికెట్‌... ఇలా ఏదో ఒకటి ఆడుతూనే ఉంటాం.

* నా హీరోయిన్లలో రీతూ తెలుగు చాలా బాగా మాట్లాడుతుంది. తనలో అది నాకు బాగా నచ్చుతుంది. తనతో పనిచెయ్యడం చాలా సులభం. షాలినీ బాగా తెలివిగల అమ్మాయి. నేనేం చేసినా అర్థం చేసుకుని వెంటనే స్పందించి నటించేసేది.

* పెళ్లి చూపులు చూసి చాలామంది ఫోన్‌ చేసి మంచి సినిమా, థ్యాంక్యూ... అన్నారు. కానీ అర్జున్‌ రెడ్డి తర్వాత ఎంతోమంది నేనోసారి మిమ్మల్ని హగ్‌చేసుకుని కిస్‌ ఇవ్వొచ్చా... అనడం మొదలుపెట్టారు. ఈ సినిమాకు నాకొచ్చిన బెస్ట్‌ కాంప్లిమెంట్‌ ఏంటంటే... ‘తెలుగు సినిమా చరిత్రలో నువ్వూ మీ డైరెక్టరూ పేరు రాసేసుకున్నారు’ అని కొందరు చెప్పడం.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.