close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఇకనుంచి నటనపైనే దృష్టి!

ఇకనుంచి నటనపైనే దృష్టి!

ఎస్‌.జె.సూర్య... మొన్నటివరకూ ఈ పేరు చెప్పగానే వాలి, ఖుషి, నానీ సినిమాల దర్శకుడని స్ఫురించేది. కానీ ఇప్పుడు స్పైడర్‌లో అద్భుత నటనతో అలరించిన ‘భైరవ’ గుర్తొస్తాడు. అద్భుతమైన సినిమాలు తీసిన ఈ దర్శకుడి మనసు నటనవైపు ఎందుకు మళ్లిందని అడిగితే, సినీ రంగంలో తన ప్రస్థానాన్ని చెప్పుకొచ్చాడిలా...

మా స్వస్థలం తిరునెల్వేలి జిల్లాలోని శంకరన్‌కోవిల్‌. ఇంట్లో అందరూ టీచర్లూ, ప్రొఫెసర్లు. నాకు మాత్రం చదువుమీద అంతగా ఆసక్తి కలగలేదు. చిన్నప్పట్నుంచీ సినిమాలు ఎక్కువగా చూడ్డంవల్లనేమో నటుడిగా గుర్తింపు తెచ్చుకోవాలనే కోరిక స్కూల్‌ రోజులనుంచే మొదలైంది. ఇంటర్మీడియట్‌ ఫస్టియర్‌ చదువుతున్న రోజులవి... ‘వెంటనే చెన్నైకి వెళ్లి.. శివాజిగణేశన్‌ గారిని చూడాలి. ఆయనకి నా ప్రత్యేకతల్ని చెప్పాలి. అవి విన్నాక నన్ను కచ్చితంగా హీరోని చేసేస్తారు’... ఇవీ, అప్పట్లో నా ఆలోచనలు. సినిమాల్లోకి ఎలా అడుగుపెట్టాలో కూడా తెలియనితనం. కానీ ‘గొప్ప నటుణ్ని కావాలి!’ అనే ఆశయంతోనే చెన్నైకి వచ్చా. కానీ ఇక్కడ పరిస్థితులు వేరు. సినిమా అవకాశాల కోసం ఎటువెళ్లాలో, ఎవర్ని అడగాలో అర్థంకాక ఎన్నో ఇబ్బందులు పడ్డా. కొన్ని బాలారిష్టాల తరువాత, ఎలాగైతేనేం జూనియర్‌ ఆర్టిస్టుగా చేరా. కానీ అక్కడ నాలుగు రోజులు షూటింగ్‌ ఉంటే... నెల రోజులు ఖాళీ!.. ‘దేవుడా ఏంటీ పరిస్థితి’ అనుకుని బాధపడేవాణ్ని. తిండికీ, రూమ్‌ అద్దెకీ, ఇతర ఖర్చులకీ చాలా కష్టం అయిపోయేది. మరోవైపు ‘అవన్నీ వదిలొచ్చి చదువుకో’మంటూ ఇంట్లోవాళ్ల ఒత్తిడి. నన్ను ప్రొఫెసర్‌గా చూడాలనుకుంటున్న వాళ్లను బాధపెట్టి నా సినిమా లక్ష్యం కోసం డబ్బు అడగాలంటే మనసు ఒప్పేది కాదు. ఒకవేళ ఇంట్లో డబ్బులు తీసుకుని, ప్రయోజకుడిని కాకపోతే, డబ్బు వృథా చేశానన్న ఆలోచన అనుక్షణం వేధిస్తుంది. అందువల్లే ఇంట్లో అడిగేవాణ్ని కాదు. పరిష్కారం ఒకటే... సినిమా అవకాశాలు రావాలి. ఇంకా తీవ్రంగా ప్రయత్నించాలి. కానీ అంతవరకూ బతకాలి కదా! అందుకే ఓ హోటల్‌లో సర్వర్‌గా చేరా. అక్కడ టేబుళ్లు తుడిచే పనిని కూడా బాధపడకుండా చేసేవాణ్ని. ఆ సంపాదనతో ఓ వైపు ఆకలి తీర్చుకుంటూ, మరోవైపు లయోలా కళాశాలలో డిగ్రీలో చేరా. కానీ.. ఏదో వెలితి. ‘ఇలా అయితే ఎప్పటికీ నటుణ్ని కాలేనేమో’ అనుకున్నా. ‘నిత్యం సినిమా ఆలోచనల్లో తలమునకలయ్యే మార్గం ఏంటా’ అని వెతుకుతుండగా... దర్శకత్వ విభాగం గుర్తుకొచ్చింది! వెంటనే అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా మారాలనుకున్నా. అందుకోసం ప్రముఖ దర్శకుల వద్ద ప్రయత్నాలు చేశా. వారి లగేజీలు మోయడం నుంచి ఎన్నెన్నో చేశా. ఏళ్లు గడిచిపోయాయి... నా కల మాత్రం అలాగే ఉండిపోయింది.

అజిత్‌ వల్లే దర్శకుడినయ్యా!
1985లో చెన్నై వచ్చిన నాకు పదేళ్ల ప్రయత్నాల తర్వాత 1995లో ‘ఆశై’ చిత్రంలో వసంత్‌ దగ్గర అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేసే అవకాశం దక్కింది. అందులో అజిత్‌ హీరో. చిరిగిన చొక్కా, పిన్నులతో కుట్టిన చెప్పులు... అప్పట్లో నా పరిస్థితి. ఆ సెట్‌లోనే అజిత్‌ నన్ను చూశారు. ‘ఇతడెవరో చాలా కష్టపడి పనిచేస్తున్నాడే. నేను హీరోగా స్థిరపడ్డాక తప్పకుండా ఓ అవకాశం ఇవ్వాలి’ అనుకున్నారట. దాదాపు నాలుగేళ్ల తర్వాత అజిత్‌ నుంచి పిలుపు వచ్చింది. అప్పుడు ఆయనకు ‘వాలి’ కథ చెప్పా. బాగా నచ్చేసింది. వెంటనే నిర్మాతను చూసుకొని సినిమాను ప్రారంభించేశాం. సిమ్రాన్‌ హీరోయిన్‌. తొలి సినిమా నాకు మరింత ఓర్పునూ, సహనాన్నీ నేర్పింది. ఆర్థిక కారణాలవల్ల ఆ సినిమాను ఏకధాటిగా చిత్రీకరించలేకపోయాం. నిర్మాత కొంత డబ్బు తీసుకొచ్చేవారు. దాంతో పదిరోజుల షూటింగ్‌ జరిగేది. ఆ తర్వాత దాదాపు పది, పదిహేను రోజులు బ్రేక్‌! మళ్లీ కొంత డబ్బు ఇచ్చేవారు. తర్వాత షూటింగ్‌ కొనసాగించేవాళ్లం. ఆ సినిమా షూటింగ్‌ మొత్తం అలాగే కొనసాగింది. ‘తొలి సినిమాకే ఇన్ని కష్టాలేంటి దేవుడా!’ అనుకునేవాణ్ని. కానీ షూటింగ్‌ షెడ్యూళ్ల మధ్య గ్యాప్‌ మంచి పాఠాన్ని నేర్పింది. చిత్రీకరణ లేని సమయంలో ఆ సినిమామీదే ధ్యాసంతా ఉండేది. కథను మళ్లీమళ్లీ మరింత మెరుగ్గా రాసుకునేవాడిని. బహుశా అందుకేనేమో ఆ సినిమా బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. నాకు ఎనలేని గుర్తింపును తీసుకొచ్చింది. తెలుగులోనూ అనువాదమై బాగా ఆడింది. ఆ తర్వాత విజయ్‌ హీరోగా ‘ఖుషి’ చిత్రాన్ని మొదలుపెట్టా. కథానాయిక ఎంపికకు సంబంధించి నిర్మాత ఏ.ఎం.రత్నంతోపాటు హైదరాబాద్‌కు వెళ్లినపుడు... ‘ఈ సినిమాను తెలుగులో కూడా తీద్దాం. కథను పవన్‌కల్యాణ్‌కు వినిపిద్దాం’ అని చెప్పారు రత్నం. అప్పటికి కల్యాణ్‌ గారిది ‘తమ్ముడు’ విడుదలైంది. ‘బద్రి’ చేస్తున్నారు. మేం చెప్పిన కథ విన్నాక తప్పకుండా చేద్దామన్నారు. తమిళంలో విజయ్‌, జ్యోతికలతో ఆ సినిమాను తెరకెక్కించి విడుదల చేశాం. సినిమా భారీ హిట్టయింది. నిజానికి ఆ సినిమా విడుదలైన మొదటి కొద్దిరోజులు మిశ్రమ స్పందన వచ్చింది. దాదాపు అదే సమయంలోనే తెలుగులో చిత్రీకరణ మొదలుపెట్టాలి. ఆ టాక్‌ విన్న తర్వాత కూడా పవన్‌ ఏమాత్రం వెనక్కితగ్గలేదు. ‘సూర్యా, మనం ఈ సినిమాను తప్పకుండా చేస్తున్నాం’ అని చెప్పారంతే. తెలుగులో అది ఎంత పెద్ద హిట్టో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ‘ఖుషి’ కథ అక్కడితో ఆగలేదు. హిందీలో ఫర్దీన్‌ ఖాన్‌, కరీనా కపూర్‌ జంటగా తెరకెక్కించా. అక్కడ కూడా గుర్తింపును తెచ్చిపెట్టింది.

కల నిజమైంది!
దర్శకుడిగా ఎదుగుతున్నప్పటికీ మనసులో మాత్రం నటుణ్ని కాలేకపోతున్నానన్న ఆవేదన వెంటాడేది. ‘నేను అందగాణ్ని కాదు. నా ముఖాన్ని జనం చూస్తారా’... అన్న సందేహం మరోపక్క. అమితాబ్‌ బచ్చన్‌, రజనీకాంత్‌లు కూడా అందం లేదని మొదట తిరస్కరణకు గురైనవాళ్లే కదా... అని గుర్తొచ్చేది. ‘అందం అనేది నటుడికి అడ్డంకి కాదు’ అని నాకు నేను పదిసార్లు చెప్పుకొని హీరోగా నటించాలని డిసైడయ్యా. అప్పుడు రాసుకున్న కథే ‘న్యూ’. ఆ సినిమాకి నిర్మాత, దర్శకుడు, హీరో... నేనే. అదే కథను మరోవైపు తెలుగులో మహేష్‌బాబు హీరోగా తెరకెక్కించా. అదే ‘నాని’. తమిళంలో వూహించని విజయాన్ని తెచ్చిపెట్టింది. వైవిధ్యమైన దర్శక నటుడు అన్న గుర్తింపు లభించింది. ‘ఒక్కడు’ లాంటి బ్లాక్‌బస్టర్‌, ‘నిజం’లాంటి మాస్‌ సినిమాల తర్వాత ‘నాని’ రావడంతో మహేష్‌ని అలాంటి కథలో తెలుగు ప్రేక్షకులు అంగీకరించలేకపోయారు. కానీ మహేష్‌తో సినిమా చేయడం మాత్రం మర్చిపోలేని అనుభవం. నిజానికి ఆ సినిమాను తమిళంలో నిర్మించేటపుడే అన్నింటికీ సిద్ధపడ్డా. అప్పటివరకూ సంపాదించుకున్న డబ్బంతా ఈ సినిమాకే వెచ్చించా. ఒకవేళ సినిమా ఫ్లాప్‌ అయితే మళ్లీ హోటల్లో టేబుళ్లు తుడవడానికైనా రెడీ అనుకునే ఆ ప్రాజెక్టులో దిగా.

‘ఇరైవి’తో కొత్త జన్మ
‘న్యూ’ ఇచ్చిన విజయోత్సాహంతో ‘అన్బే ఆరుయిరే’ (అఆ) చిత్రాన్ని తెరకెక్కించా. ఆ సినిమాకి కూడా హీరో, నిర్మాత, దర్శకుడి పాత్రలు పోషించా. అదీ బాగా ఆడింది. ఈ సినిమాల తర్వాత ఇతర దర్శకుల నుంచి నటించమంటూ పిలుపు రావడం మొదలైంది. ‘తిరుమగన్‌’, ‘వ్యాపారి’, ‘న్యూటనిన్‌ మూడ్రాం విది’ చిత్రాలు నటుడిగా మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. నటుడిగా ప్రయాణం కొనసాగుతున్న తరుణంలో మళ్లీ పవన్‌కల్యాణ్‌ హీరోగా సినిమాను తెరకెక్కించే అవకాశం దక్కింది. అదే ‘కొమరం పులి’. కానీ ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఫలితాన్ని ఇవ్వలేదు. 2010 తర్వాత నటుడిగా అవకాశాలు కాస్త తగ్గాయి. అందుకే మళ్లీ మంచి కథను సిద్ధం చేసుకోవాలనుకున్నా. అప్పుడే ‘ఇసై’ కథ తోచింది. రెండు తరాల సంగీత దర్శకులకు సంబంధించిన కథ ఇది. అందరూ ‘ఇళయరాజా, రెహ్మాన్‌ల కథా?’ అని ప్రశ్నించారు. కానీ అలాంటి కథ కాదు. దాదాపు రెండేళ్ల పాటు శ్రమించి సినిమా రూపొందించాం. దీన్లో నేనే నటించి దర్శకత్వం వహించాను. ప్రేక్షకులు బాగా ఆదరించారు. ఆ సినిమా తర్వాత కార్తీక్‌ సుబ్బురాజ్‌ దర్శకత్వంలో ‘ఇరైవి’ సినిమాలో నటించే అవకాశం దక్కింది. వాస్తవానికి నన్ను దృష్టిలో పెట్టుకునే ‘ఇరైవి’లోని పాత్రను రాసుకున్నారు కార్తీక్‌. ఆ సినిమా నటుడిగా నాకు పునర్జన్మనిచ్చిందనే చెప్పాలి. అందులో నా నటనకు ప్రేక్షకులు మంచి మార్కులేశారు. నాకూ బాగా సంతృప్తినిచ్చింది కూడా. ‘ఎస్‌జే సూర్యకు ఎలాంటి పాత్ర అయినా ఇవ్వొచ్చ’న్న నమ్మకాన్ని కలిగించారు కార్తీక్‌. గతేడాది వచ్చిన ఆ సినిమాను చూసిన తర్వాతనే మురుగదాస్‌ నాకు ‘స్పైడర్‌’ కథ చెప్పారనిపించింది. ‘వాలి’ సినిమా చేసేటప్పుడే మురుగదాస్‌తో పరిచయముంది. అయినప్పటికీ, ఇన్నేళ్ల తర్వాత ‘స్పైడర్‌’లో ‘భైరవుడు’ పాత్రని నాకు ఇవ్వడం ఆనందంగా అనిపించింది. ‘మురుగదాస్‌ ‘స్పైడర్‌’లోని అన్ని పాత్రలకూ ఆప్షన్‌ పెట్టుకున్నారు. కానీ మీ ఒక్క పాత్రకు మాత్రమే ఎలాంటి ఆప్షన్‌ పెట్టలేదు’ అని మహేష్‌ ఓ సారి షూటింగ్‌స్పాట్‌లో నాతో చెప్పినప్పుడు పట్టలేని సంతోషం కలిగింది. సినిమా రిలీజయ్యాకా అంతే మంచి స్పందన వచ్చింది. అలాంటి పాత్ర కోసమే నా కెరీర్‌లో ఇన్ని రోజులు ఎదురుచూశా:

ఆ నలుగురు

అజిత్‌... ఆయన లేకుంటే నాకు కెరీరే లేదన్న విషయం చిత్ర పరిశ్రమలో అందరికీ తెలుసు. నా సినీ జీవితం ఆయన కృప. ఎవరి విషయాల్లోనూ జోక్యం చేసుకోరు. తన పని మాత్రమే చూసుకుంటూ.. తన చుట్టూ ఉన్నవారి సంతోషం కోసం కృషిచేస్తారు. బస్సులో వెళ్లే నాకు ‘వాలి’ తర్వాత ఓ కారును బహుమతిగా ఇచ్చారు. ఆ విషయాన్ని ఎప్పటికీ మర్చిపోలేను.

* ఏఆర్‌ రెహ్మాన్‌... నాకు దక్కిన అపూర్వమైన స్నేహితుడు. నా సినిమాలకో వరం. 24 గంటలూ వృత్తిని మాత్రమే శ్వాసించే వ్యక్తి రెహ్మాన్‌. ఆయన మాటల్లో ఎప్పుడూ నిస్వార్థం తొణికిసలాడుతుంది. ఆయన ప్రోత్సాహంతో ‘ఇసై’ సినిమాకి సంగీత దర్శకుడిగా మారాను కూడా.

* మహేష్‌బాబు... సినిమా కోసం ఎంతో కష్టపడతారు. దర్శకుల మాట తూ.చ. తప్పకుండా పాటించే నటుడు. ‘నాని’తో తొలిసారిగా పరిచయం. అప్పటి నుంచి ఇప్పటి వరకూ ఆయనలోని మంచితనం ఏమాత్రం తగ్గలేదు.

* పవన్‌ కల్యాణ్‌... అద్భుతమైన వ్యక్తి. కొందరు హీరోలకు ఆన్‌స్క్రీన్‌ అభిమానులు ఉంటారు. కానీ పవన్‌కు ఆఫ్‌స్క్రీన్‌లోనూ అభిమానించేవారున్నారు. అభిమానులనేకంటే అనుచరులు అనొచ్చు. ఇందుకు ఆయన మంచితనం, ముక్కుసూటితనమే కారణం. మహేష్‌, పవన్‌లతో సినిమా గెలుపోటములకు సంబంధంలేని స్నేహబంధం ఉంది.

కొంతే సాధించా!
‘స్పైడర్‌’ ఇస్తున్న గుర్తింపు మనసుకు ఎంతో హాయినిస్తోంది. దీపావళికి వస్తున్న విజయ్‌ సినిమా ‘మెర్సల్‌’ (అదిరింది)లో కూడా విలన్‌గా నటించా. ఆ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. ఇలాంటి రెండు పెద్ద బడ్జెట్‌ చిత్రాల్లో దర్శకులు నన్ను నమ్మి కీలకమైన పాత్రలు ఇవ్వడం చాలా గర్వంగా ఉంది. ప్రస్తుతానికి నా ముందున్న లక్ష్యం... నటుడిగా ఇంకా పేరు సాధించాలి. తెలుగు, తమిళం, హిందీ... ఈ మూడు భాషల్లోనూ బిజీ నటుడిగా మారాలి. అయితే ఈ కోరిక నెరవేరొచ్చు..నెరవేరకపోవచ్చు. కానీ ఆ లక్ష్యం దిశగానే అడుగులు వేస్తున్నా. ఆ ప్రయాణంలో ఇప్పటి వరకూ 15-20 శాతం మాత్రమే నడిచాను. ప్రస్తుతానికి దర్శకత్వం గురించి ఆలోచించడం లేదు. అలాగని దర్శకత్వం చేయనని కాదు. ఎప్పుడైనా మళ్లీ మంచి కథ సిద్ధమైతే తప్పకుండా మెగాఫోన్‌ పడతా. అది తెలుగులోనైనా కావొచ్చు! ఎందుకంటే ఇప్పుడు ఇక్కడా నాకు తమిళనాట ఉన్నంత గుర్తింపు వచ్చిందిగా!

- టి.ఉదయ్‌కుమార్‌, న్యూస్‌టుడే, చెన్నై

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.