close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
‘నేను.. శైలజ...’కు నా కథే స్ఫూర్తి!

‘నేను.. శైలజ...’కు నా కథే స్ఫూర్తి!

కలలు, కళలూ... రెండూ ఒకటే. మనల్ని ఒక్క క్షణం కూడా కుదురుగా కూర్చోనివ్వవు. ఏదో చేసేద్దాం, మనమేంటో చూపిద్దాం అంటూ పోరెడుతుంటాయి. దర్శకుడు కిషోర్‌ తిరుమలని కూడా కలలు పరిగెట్టించాయి. అందుకే తిరుమలలో రైలెక్కి హైదరాబాద్‌లో వాలిపోయాడు. ‘నేను శైలజ’, ‘ఉన్నది ఒకటే జిందగీ’ చిత్రాలతో ఆకట్టుకున్న కిషోర్‌ అంతరంగానికి అక్షర రూపమిది.

‘‘శ్రీనివాసా గోవిందా శ్రీవెంకటేశా గోవిందా
భక్తవత్సలా గోవిందా భాగవతప్రియా గోవిందా

ఇలా ప్రతీరోజూ భగవన్నామ స్మరణతోనే నాకు తెల్లారేది. కొండమీది దేవుడికే కాదు, అక్కడే నివాసం ఉంటున్న మాలాంటి వందల కుటుంబాలకూ అదే మేల్కొలుపు గీతం. నాన్న తిరుమల తిరుపతి దేవస్థానంలో ఓ చిరుద్యోగి, జీతం తక్కువ. దానికి తోడు చుట్టాల్లో ఎవరు తిరుపతికి వచ్చినా వాళ్ల విడిది మా ఇల్లే. అయినా సరే, అమ్మ ఆదిలక్ష్మి చాలా చాకచక్యంతో ఇంటి బాధ్యతను నెరవేర్చేది. నాన్న, అమ్మ, తమ్ముడు సతీష్‌... అందరిలోనూ పాజిటివ్‌ ఎనర్జీ కనిపించేది. కష్టాలూ, కన్నీళ్లూ పరిచయమే గానీ, వాటిని తేలిగ్గా తీసుకునే ధైర్యం కూడా ఉండేది.

నాటకాలు...నటన
పదో తరగతి వరకూ నా చదువంతా తిరుమల కొండపైనే. క్లాసులో నేనే ఫస్ట్‌. ఆట పాటలు, నాటకాలు.. అన్నింట్లోనూ చేయి తిరిగినవాణ్ణే. ‘అనుకరణ’ విద్య అంటే నాకు మహా ఇష్టం. నా స్నేహితుల్నీ, పాఠాలు చెప్పే ఉపాధ్యాయుల్నీ అనుకరించేవాణ్ని. సోషల్‌ మాస్టారు శ్రీధర్‌రాజు గార్ని అయితే డిటో దించేసేవాణ్ణి.

‘కిషోర్‌గాడు మిమ్మల్ని ఇమిటేట్‌ చేస్తున్నాడు’ అంటూ స్నేహితులు ఈ వార్తని ఆయన వరకూ మోసుకెళ్లిపోయారు కూడా.

మాస్టారేం కోప్పడిపోలేదు. ‘ఏంట్రా.. నాలా నటిస్తున్నావట... ఏదీ చేసి చూపించు’ అంటూ ఆసక్తిగా అడిగి మరీ నాతో ఇమిటేషన్‌ చేయించుకునేవారు.

‘కిషోర్‌ భలే చేశాడండీ’ అంటూ మిగిలిన మాస్టార్లందరికీ చెప్పేవారు. నాలో ఓ నటుడున్నాడన్న సంగతి అప్పుడే బయటపడింది. ఆ ప్రశంసలే నాటకాల వైపు అడుగులు వేసేలా చేశాయి. కాలేజీ రోజుల్లో ‘సినిమా పిచ్చోళ్ళు’ అనే నాటకంలో నటించాను. అందులో నాది నిర్మాత వేషం. అది నాకు మంచి పేరు తీసుకొచ్చింది. నాటకం పూర్తయిన తరవాత కొట్టిన చప్పట్లు... ఇప్పటికీ నా చెవుల్లో మార్మోగుతుంటాయి.

నటన తర్వాత నాకు వాలీబాల్‌ అంటే ప్రాణం. జిల్లా స్థాయి పోటీల్లో పాల్గొన్నాను కూడా. రాజు అని నా మిత్రుడికి పియానో వచ్చు. తను ట్యూన్‌ చేస్తే, నేను దానికి పదాలు జత చేసేవాణ్ణి. అలా ఆరో తరగతిలోనే తొలి పాట రాసేశా. ఇంటర్మీడియెట్‌ తిరుపతిలో చదివాను. ఎప్పుడైతే కొండ దిగానో అప్పుడే నా చదువులు కొండెక్కాయి. దానికి కారణం... సినిమా.

కాలేజీ ఎదురుగా ఓ థియేటర్‌ ఉండేది. పుస్తకాలూ, పాఠాలూ, కాలేజీ అమ్మాయిలకంటే థియేటరే అందంగా కనిపించేది. ‘లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌’ అంటారే, అలా తొలిచూపులోనే సినిమాలతో ప్రేమ మొదలైంది. ఓ సినిమా చూడ్డం... దాని గురించి స్నేహితులతో చర్చించడం అదో దినచర్య అయిపోయింది! పాతికేసి సార్లు చూసిన సినిమాలూ ఉన్నాయి. ‘నిన్నే పెళ్లాడతా’ అయితే 53సార్లు చూశా. తమిళం మాట్లాడటమే కాదు, చదవడం, రాయడమూ వచ్చు. దాంతో తమిళ సినిమాల్నీ బాగా ఆస్వాదించేవాణ్ని. తర్వాత హిందీ కూడా నేర్చుకున్నాను. దాంతో నా సినిమా పిచ్చి మరింత ముదిరింది. చదవడం పూర్తిగా తగ్గింది. మరీ అత్తెసరు మార్కులు వచ్చేవి కావు గానీ, డిగ్రీ చూపించి ఉద్యోగం సంపాదించే స్థాయిలో మాత్రం చదువు సాగేది కాదు. కాలేజీలో అల్లరి చాలా తక్కువ. ఎందుకంటే నేనసలు క్లాసులో ఉంటేనే కదా.

ఫెయిల్యూర్‌ లవ్‌స్టోరీ
కాలేజీ రోజుల్లో ఓ అమ్మాయిని చాలా నిజాయతీగా ప్రేమించా. ఐదేళ్లు మా ప్రేమకథ నడిచింది. కానీ ఆ అమ్మాయి ఇంట్లోవాళ్లకీ, మా ఇంట్లోవాళ్లకీ ఈ పెళ్లి ఇష్టం లేదు. ‘మనం పెళ్లి చేసుకొని వాళ్లని బాధపెట్టడం ఎందుకు’ అనుకొని, ఇద్దరం ఓ అభిప్రాయానికి వచ్చి ఇష్టపూర్వకంగా విడిపోయాం. అయినా కుర్రతనం కదా, నేను చేయి దాటిపోతానేమోనని ఇంట్లో నాకు పెళ్లి చేసేశారు. అప్పటికి నా వయసు 22 ఏళ్లే. జీవితం అంటే ఏంటో తెలీదు. జీతం అందుకొనే స్థాయీ కాదు. అయినా ఏదో మొండి ధైర్యం. నా వెంట కుటుంబం, కొండపైన వెంకటేశుడూ ఉన్నాడన్న ధీమా. పైగా తను మా మేనమామ కూతురే. పేరు అజంత. నా గురించి బాగా తెలుసు. తనదీ మా అమ్మ మనస్తత్వమే. ‘నువ్వు తప్పకుండా వృద్ధిలోకి వస్తావు’ అని చెప్పేది. అయితే బతకడానికి నమ్మకం సరిపోదు. పైకం కూడా కావాలి. పైగా మాకు పాప పుట్టింది. దాంతో బాధ్యతలు పెరిగాయి.

ఓ కార్ల షోరూంలో పనికి చేరా. జీతం రూ.4500. కొన్నాళ్లు ఓ హోటల్‌ బాధ్యతలూ చూసుకొన్నా. జేబులో ఎంత డబ్బుంటే దాంతోనే సంతృప్తి. కాకపోతే.. లోపలున్న కలలు మాత్రం ఎదురుతిరుగుతుండేవి. అవి నిజమయ్యే రోజులూ వస్తాయని నా నమ్మకం. ఆ బాధ్యతా శ్రీనివాసుడే తీసుకున్నాడు.

ఓరోజు టీవీ సీరియల్స్‌ దర్శకుడు ఒకరు తిరుమల దర్శనానికి వచ్చారు. పక్కనే నేనూ ఉండి, ఆయనకు కావల్సిన ఏర్పాట్లు చూసుకున్నా. మాటల మధ్యలో ‘ఏం చేద్దామనుకుంటున్నావ్‌’ అని ఆరా తీశారు. నా మనసులోని మాట చెప్పా.

‘త్వరలో ఓ సీరియల్‌ మొదలెడుతున్నా. నువ్వూ వచ్చేయ్‌’ అన్నారాయన.

రెండు నెలలకే హైదరాబాద్‌ నుంచి కబురొచ్చింది. ‘సీరియల్‌ మొదలైపోతోంది.. బయల్దేరు’ అని. పనిచేయబోయేది టీవీకే అయినా నాలో ఉత్సాహం ఉరకలెత్తింది. ‘టీవీ నుంచి ఇక సినిమాలకే’ అనుకొని హైదరాబాద్‌ రైలెక్కేశా. ఇక్కడకు వస్తే గానీ అసలు విషయం అర్థం కాలేదు. పొద్దుట ఏడింటికి వేళ్తే, ఇంటికి వచ్చేసరికి అర్ధరాత్రి దాటేది.

కృష్ణానగర్‌లో చిన్న రూమ్‌. ఇద్దరు పడుకుంటే మూడోవాడికి చోటుండేది కాదు. కానీ అదే నాకు రాజమహల్‌లా కనిపించేది. ఆ గదిలో కూర్చుంటే బోల్డంత పాజిటివ్‌ ఎనర్జీ వచ్చేసేది. కృష్ణానగర్‌లో కలలు కంటూ దిగిపోయే నాలాంటి కుర్రాళ్ల కథలు వింటుంటే ‘అందరిదీ నా కథేనా’ అనిపించేది.

‘దర్శకుడివి కావాలంటే ముందు రచయితగా పేరు తెచ్చుకోవాలి’ అని సలహా ఇచ్చారెవరో. అదీ నిజమే. ఎందుకంటే అప్పటి ట్రెండ్‌ కూడా అలానే ఉంది. రచయితలుగా నిరూపించుకొన్నవాళ్లు సులభంగా దర్శకులైపోతున్నారనిపించింది. అందుకే నేనూ పెన్ను పట్టా. ముందుగా రచయిత బీవీఎస్‌ రవి దగ్గర చేరా. ఆయనతో చేసిన ప్రయాణం, ఆ అనుభవం ఓ విధంగా నా జీవితాన్ని మార్చింది. ఏదైనా ఓ ఐడియా చెబితే.. ‘భలే ఉందే’ అని మెచ్చుకునేవారు. కొరటాల శివగారి దగ్గర కూడా కొన్నాళ్లు పనిచేశా. ఆ అనుభవం దర్శకుడిగా మారిన తరవాత చాలా ఉపయోగపడింది. వారితోపాటు కథాచర్చల్లో పాల్గొనడంవల్ల ఏ విషయం గురించి ఎంత లోతుగా ఆలోచిస్తున్నారో అర్థమయ్యేవి.

నేను.. నా కూతురు...
కథానాయకుడు మంచు మనోజ్‌కి నేనంటే బాగా గురి. ‘నేను మీకు తెలుసా’ తెలుగు, తమిళ భాషల్లో తీశారు. నాకు తమిళం వచ్చు కదా, ఆ సినిమాకి ఉపయోగపడతానని నన్నూ టీమ్‌లోకి తీసుకున్నారు. అందులో ఓ పాట కూడా రాశా. తమిళ నిర్మాతలూ, అక్కడి పరిశ్రమతో కాస్త పరిచయం ఏర్పడింది. నా కథల్ని అక్కడి నిర్మాతలకు వినిపించేవాణ్ణి. అలా దర్శకుడిగా ఓ తమిళ చిత్రం చేసే అవకాశం వచ్చింది. అది అంతగా ఆడలేదు. కానీ ఓ సినిమాను తెరకెక్కించడంలో ఉండే సాదక బాధకాలు బాగా అర్థమయ్యాయి. ‘సెకండ్‌ హ్యాండ్‌’ అనే కథ బీవీఎస్‌ రవిగారికి వినిపించా. ‘ఐడియా చాలా బాగుంది, మనమే చేద్దాం’ అన్నారాయన. మరో మిత్రుడితో కలసి కేవలం యాభై లక్షల్లోనే ఆ సినిమా పూర్తి చేశాం. విడుదలకు ముందే అది రవితేజ గారికి చూపించాం. ‘డైలాగులు బాగా రాశావ్‌. నా సినిమాకి పనిచేస్తావా’ అని అడిగారు. అలా ‘పవర్‌’కి మాటలు రాసే అవకాశం వచ్చింది. హైదరాబాద్‌ వచ్చి, సినిమా హడావుడిలో పడిపోయి కుటుంబానికి దూరంగా ఉండేవాణ్ణి. మా అమ్మాయి సంధ్య ఎదుగుదలను సరిగా చూసే అవకాశం రాలేదు. తండ్రీ కూతుళ్ల మధ్య గ్యాప్‌ పెరగడానికి అది చాలు. ఒకరిపై ఒకరికి ప్రేమ ఉన్నా, దాన్ని వ్యక్తపరిచే అవకాశం లేనపుడు వారిమధ్య భావోద్వేగాలు ఎలా ఉంటాయో చెప్పాలనిపించింది. దీన్ని ఇతివృత్తంగా తీసుకొని ఓ కథ రాసుకున్నా. ఓసారి నిర్మాత మల్టీడైమన్షన్‌ వాసుగారు పిలిచారు. ‘ఏదైనా కథ ఉంటే చెప్పు చేద్దాం’ అన్నారు. నా దగ్గరున్న తండ్రీ కూతుళ్ల కథ చెప్పా. ‘ఇలాంటి కథల కోసమే స్రవంతి రవికిషోర్‌ ఎదురు చూస్తున్నారు. నువ్వు ఆయన్ని కలు’ అన్నారాయన. రవికిషోర్‌ గారికి కథ వినిపిస్తే... ‘ఇది నా కథలానే ఉంది. చెన్నైలో నా కుటుంబాన్ని వదిలి హైదరాబాద్‌ వచ్చా. నాకూ ఆ ఎమోషన్స్‌ తెలుసు’ అన్నారు. అదే రోజు సాయంత్రం రామ్‌ కథ విని ‘బాగుంది.. చేసేద్దాం’ అని గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. అలా ‘నేను.. శైలజ...’ మొదలైంది. విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. మా ఇంట్లోవాళ్లు, మరీ ముఖ్యంగా నా స్నేహితులు చాలా సంతోషపడ్డారు. తమ్ముడు సతీష్‌, నా ప్రాణ స్నేహితుడు శ్రీనివాస్‌ అయితే నాలుగు రోజులపాటు ఒక్క షో కూడా మిస్సవకుండా చూశారు.

వెంకీతో సినిమా
ఆ తరవాత వెంకటేష్‌గారి నుంచి పిలుపు. ‘ఆడాళ్లూ మీకు జోహార్లు’ అనే కథ అనుకున్నాం. సినిమా మొదలవ్వాల్సిందే. కాకపోతే కథ విషయంలో నేనే సంతృప్తి పడలేదు. అందుకే ఆ కథని పక్కన పెట్టేశా. ఎప్పటికైనా అదే కథని వెంకటేష్‌తో చేస్తా.‘నేను.. శైలజ...’ సమయంలోనే ‘మనం మరో సినిమా చేద్దాం’ అనేవారు రామ్‌. ‘హైపర్‌’ షూటింగ్‌లో భాగంగా రామ్‌ విశాఖపట్నం వెళ్లినప్పుడు నేనూ అక్కడే ఓ కథ చెప్పా. అదే.. ‘ఉన్నది ఒకటే జిందగీ’. మా నమ్మకానికి తగ్గట్టూ ఇదీ మంచి హిట్‌ అయింది. ప్రస్తుతం వెంకటేష్‌, నాని.. వీళ్లతో సినిమాలు చేయడానికి సిద్ధం అవుతున్నా. ఇంటిల్లిపాదీ చూసేలా సినిమాలు చేయడమే నా లక్ష్యం. విజయాలూ, అపజయాలూ వస్తుంటాయి, పోతుంటాయి. వాటిని చూసి మనం మారకూడదన్నది నా సిద్దాంతం. మనసు కుదురుగా లేకపోతే ఒక్కసారి ఆ వెంకటేశ్వరుడ్ని తలచుకుంటా.. అంతే మళ్లీ ఉత్సాహం ఉరకలెత్తుతుంది.’’

- అన్వర్‌

‘రాజా’ ది గ్రేట్‌ 

ళయరాజా పాటలంటే ప్రాణం. ఆయన పాట వినందే ఒక్క రోజు కూడా గడవదు. కథ రాసుకోవడం, సన్నివేశాల్ని సృష్టించుకోవడం వెనుక కూడా సంగీతానిది కీలకమైన పాత్ర. ఓ రొమాంటిక్‌ సన్నివేశం రాయాలనుకొంటే, దానికి తగిన సంగీతం వింటా. స్క్రిప్టు రాస్తున్నప్పుడే ‘ఇక్కడ ఇలాంటి బీజీయమ్‌ రావాలి’ అని పక్కన నోట్‌ చేసుకుంటా.

* ‘‘పెళ్లయ్యాక కూతుర్ని వేరే ఇంటికి పంపించేయాలి అనే సంప్రదాయం ఎవరు కనిపెట్టారో గానీ, వాళ్లకు మాత్రం కచ్చితంగా కూతురు ఉండి ఉండదు’’ అనే డైలాగ్‌ ‘నేను శైలజ’లో ఉంది. ఈ సన్నివేశాన్ని తెరకెక్కించిన తరవాత ఛాయాగ్రహకుడు సమీర్‌ కంటతడి పెట్టుకున్నారు. ఎందుకంటే ఆయనకూ ఓ కూతురు ఉంది. సినిమాకి తొలి ప్రేక్షకుడు కెమెరామెన్‌. ఆయన నుంచి అలాంటి స్పందన చూశాక, ఆ సినిమా హిట్టవుతుందన్న భరోసా కలిగింది.

* శ్రీనివాస్‌ నా బెస్ట్‌ ఫ్రెండ్‌. మా అబ్బాయికి తన పేరే పెట్టా. పైగా అది నా ఇష్ట దైవం వెంకటేశ్వరుడి పేరు కూడా కదా.

* రాజ్‌కుమార్‌ హిరాణీ అంటే ఇష్టం. ‘మున్నాభాయ్‌ ఎంబీబీఎస్‌’ చూసి ఆశ్చర్యపోయా. మానవ సంబంధాల్ని ఇంత గొప్పగా చూపించొచ్చా అనిపించింది. ‘త్రీ ఇడియట్స్‌’ అయితే ఓ క్లాసిక్‌. ‘దంగల్‌’ చూస్తే ఓ పుస్తకం చదువుతున్నట్టు అనిపిస్తుంది.

* యండమూరి రచనలు నచ్చుతాయి. విశ్వనాథ్‌, బాపు నా అభిమాన దర్శకులు. జంధ్యాల శైలి బాగా ఇష్టం. ముళ్లపూడి వారి చమత్కారం మరెవ్వరికీ రాదు.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.