close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
సత్యా చెప్పిన సత్యాలు...

సత్యా చెప్పిన సత్యాలు...

సత్యా నాదెళ్ల... మైక్రోసాఫ్ట్‌ సీయీవోగా భారతీయుల ప్రతిభాపాటవాలను ప్రపంచానికి చాటిచెప్పిన టెక్‌ నిపుణుడు. ఒక భర్తగా, తండ్రిగా, సీయీవోగా తన అనుభవాలూ, ఆలోచనలకు ‘హిట్‌ రిఫ్రెష్‌’ పేరుతో అక్షర రూపమిచ్చారాయన. ‘కొత్త ఆలోచనలు నన్ను ఉత్తేజపరుస్తాయి’, ‘సహానుభూతి నన్ను కర్తవ్యంవైపు నడిపిస్తుంది’... అని చెప్పే సత్య, ‘హిట్‌ రిఫ్రెష్‌’లో పంచుకున్న అంశాల్లో కొన్ని...

హానుభూతి లేకపోవడంవల్ల మైక్రోసాఫ్ట్‌లో చేరే అవకాశం నాకు కొద్దిలో దూరమయ్యేది అంటే నమ్మగలరా. ఆరోజు- ఉద్యోగం కోసం వెళ్లినపుడు- ఇంజినీరింగ్‌ నిపుణులు నా శక్తి సామర్థ్యాలూ తెలివితేటలకు సంబంధించి ఇంటర్వ్యూ చేశారు. తర్వాత మరో మేనేజర్‌ రిచర్డ్‌ టేట్‌ భావోద్వేగాలకు సంబంధించిన ఒక సరళమైన ప్రశ్న వేశారు.

‘మీరు దారిలో వెళ్తున్నపుడు ఒక బిడ్డ రోడ్డు మీద ఉందనుకోండి. ఆ బిడ్డ గుక్కపట్టి ఏడుస్తోంది. మీరేం చేస్తారు?’ అని అడిగారు.

‘911(అత్యవసర సేవలు)కి ఫోన్‌ చేస్తాను’ వెంటనే చెప్పేశాను.

రిచర్డ్‌ నా భుజంపైన చేయి వేసి... ‘కొంచెమైనా సహానుభూతి ఉండాలి. ఒక బిడ్డ ఎవరూ లేకుండా రోడ్డు మీద ఏడుస్తూ ఉంటే, బిడ్డని ఎత్తుకోవాలి’ అన్నారు.

నాకు ఆరోజు ఉద్యోగం వచ్చింది. కానీ రిచర్డ్‌ మాటలు ఈరోజుకీ గుర్తున్నాయి. సహానుభూతిని వ్యక్తిగతంగా తెలుసుకుంటానని అప్పుడు తెలియలేదు. మా మొదటి బిడ్డ జైన్‌ పుట్టిన తర్వాత అది అనుభవమైంది. నా భార్య అనూ గర్భవతి అయిన 36వ వారంలో బిడ్డ పొట్టలో కదలడం లేదని ఒకరోజు రాత్రి గుర్తించడంతో స్థానిక ఆసుపత్రి అత్యవసర విభాగానికి వెళ్లాం. పరీక్ష చేసిన తర్వాత వైద్యులు సిజేరియన్‌ చేశారు. మూడు పౌండ్ల బరువుతో జైన్‌ పుట్టాడు, కానీ వాడు ఏడవలేదు. ఆ క్షణం నుంచీ మా జీవితాలు ఎంతలా మారిపోతాయో అప్పుడు తెలియలేదు. గర్భంలో వూపిరందక సెరిబ్రల్‌ పాల్సీ తీవ్రమైనందువల్ల జైన్‌ చక్రాల కుర్చీలో, ఎప్పటికీ మా పైన ఆధారపడి ఉంటాడని తర్వాత తెలిసింది. మాకు ఎందుకిలా జరిగిందీ అని కుమిలిపోయాను. అయితే ‘మనకు జరిగిన దాని గురించి బాధపడడం కాదు, జైన్‌కు ఏం జరిగిందో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు తన పట్ల సహానుభూతి పెంచుకో’ అని చెప్పింది అనూ. ఆ తర్వాత నుంచీ నేను చేపట్టిన ప్రతి అంశంలోనూ సహానుభూతి కోణాన్ని చూస్తాను. ప్రవేశపెట్టే ఉత్పత్తులూ, ప్రవేశించే నూతన మార్కెట్లూ, ఉద్యోగులూ, వినియోగదారులూ, పనిచేసే భాగస్వాములూ... అన్నిటిలో, అందరిలో.

అమ్మానాన్నా... జీవిత పాఠాలు!
మా నాన్న మార్క్సిస్టు భావాలున్న ప్రభుత్వోద్యోగి. అమ్మ సంస్కృత పండితురాలు. నాన్న నుంచి మేధాపరమైన ఉత్సుకత, చరిత్రపైన అభిమానంతోపాటు ఇంకెన్నో నేర్చుకున్నాను. కానీ నేనెప్పుడూ అమ్మ కొడుకునే. నేను సంతోషంగా, ఆత్మవిశ్వాసంతో, ఏ చీకూ చింతా లేకుండా జీవించడానికి ఆమె ఎంతో శ్రద్ధ తీసుకునేది. కాలేజీలో ప్రాచీనభాష, సాహిత్యం, భారతీయ తాత్వికతల్ని బోధిస్తూనే, ఇంటిని సంతోష నిలయంగా ఉంచేది. నాన్న ఐఏఎస్‌ అధికారి. నాన్న బదిలీల కారణంగా చిన్నపుడు చాలా వూళ్లు తిరిగాను. ఎక్కడున్నా అమ్మ తన అధ్యాపక వృత్తిని కొనసాగిస్తూ ఇంటి బాధ్యతలు చూసుకునేది. నాకు ఆరేళ్లపుడు అయిదు నెలల వయసున్న నా చెల్లి మరణించింది. ఇది నామీదా, నా కుటుంబంమీదా తీవ్ర ప్రభావాన్ని చూపింది. ఆ తర్వాత అమ్మ ఉద్యోగం వదిలేసింది. అందరిలానే ఆమె కూడా జీవితంలో అన్నీ కావాలనుకుంది. అన్నిటికీ అర్హత ఉన్న మనిషి కూడా. కానీ పరిస్థితులు తనకు అనుకూలించలేదనిపిస్తుంది. అప్పట్లో ఐఏఎస్‌ల పిల్లల్లో విపరీతమైన పోటీ ఉండేది. నా తోటి విద్యార్థుల తల్లిదండ్రులు మంచి మార్కులూ, ర్యాంకుల కోసం వారిపై ఒత్తిడి పెట్టేవారు. కానీ నేను అలాంటి ఒత్తిడిని ఎప్పుడూ ఎదుర్కోలేదు. పిల్లాడిగా క్రికెట్‌ తప్ప మరి దేనిమీదా అంత శ్రద్ధ పెట్టేవాణ్ని కాదు. ఒకసారి నాన్న కార్ల్‌మార్క్స్‌ పోస్టర్‌ను నా గదిలో గోడకి అంటించారు. దానికి ప్రతిగా అమ్మ భారతీయులు సర్వసుఖ సంతోషాలకూ ఆలవాలమని విశ్వసించే లక్ష్మీదేవి పోస్టర్‌ను పెట్టింది. నాన్న నాలో మేధావిని చూడాలనుకుంటే, అమ్మ దేన్నీ మూర్ఖంగా పట్టుకుని వేలాడకుండా సంతోషంగా ఉండమంది. నేను మాత్రం నా అభిమాన క్రికెట్‌ హీరోల్లో ఒకడైన ఎం.ఎల్‌.జయసింహ పోస్టర్‌ ఉంటే చాలనుకున్నా. నాన్నకున్న మేధాశక్తి, అమ్మ నాకోసం కోరుకున్న సంతులిత జీవితం... రెండూ నన్ను ప్రభావితం చేశాయి. అంతేకాదు, ఈరోజుకీ నాకు క్రికెట్‌ అంటే ఇష్టం.

క్రికెట్‌ కలలు!
నేను శ్రీకాకుళం, తిరుపతి, ముస్సోరి, దిల్లీ, హైదరాబాద్‌లలో చదువుకున్నాను. అన్ని చోట్ల తిరగడంవల్ల కొత్త పరిస్థితులకు త్వరగా అలవాటు పడిపోయేవాణ్ని. నాకు పదేళ్లు వచ్చేసరికి మేము వూళ్లు తిరగడం మానేశాం. నన్ను హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూల్లో చేర్పించారు. భారతదేశంలోని అన్ని రాష్ట్రాల విద్యార్థులూ అక్కడ ఉండేవారు. హెచ్‌పీఎస్‌ బోర్డింగ్‌ స్కూల్లో చేరడం నా జీవితంలో చాలా మంచి అనుభవం. అక్కడ నలంద(బ్లూస్‌) హౌస్‌లో ఉండేవాణ్ని. నేనున్న హాస్టల్‌లో వివిధ ఆర్థిక స్థితిగతులకు చెందిన పిల్లలుండేవారు. ఎందుకంటే గిరిజన కుటుంబాలకు చెందిన పిల్లలు ప్రభుత్వ స్కాలర్‌షిప్‌లతో అక్కడ చదివేవారు. ఇంకా ఎందరో ప్రముఖుల పిల్లలూ అక్కడ చదువుకున్నారు. ప్లస్‌టూ తర్వాత హైదరాబాద్‌లోనే ఏదైనా కాలేజీలో డిగ్రీలో చేరి క్రికెటర్‌గా కొనసాగి, తరువాత ఏదైనా బ్యాంకులో పనిచేయాలనేది అప్పట్లో నా కల. దానికి అమ్మ నుంచి మద్దతు ఉండేది. నాన్న మాత్రం ‘నువ్వు హైదరాబాద్‌ వదిలిపెట్టాలి. లేకపోతే నిన్ను నువ్వు నాశనం చేసుకుంటావు’ అనేవారు. అప్పట్లో అది మంచి సలహానే కానీ, ఇప్పటి హైదరాబాద్‌ పూర్తిగా వేరు!

ఐఐటీలో సీటు రాలేదు
నాన్న చెప్పింది నిజం... నా కెరీర్‌ విషయంలో అంత నిశ్చింతగా లేను. క్రికెట్‌ అంటే నాకు అభిమానం, కానీ కంప్యూటర్స్‌ కూడా ఇష్టమే. నాకు పదిహేనేళ్ల వయసులో నాన్న బ్యాంకాక్‌ నుంచి కంప్యూటర్‌ తెచ్చారు. అది నన్ను సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరింగ్‌ గురించి ఆలోచించేలా స్ఫూర్తినిచ్చింది. నాకు ఐఐటీలో సీటు రాలేదు. ఎప్పుడూ ఏ పరీక్షా ఫెయిలవని నాన్నకి నేను ఫెయిలవడం ఆందోళనగాకన్నా వినోదంగా అనిపించింది. కానీ అదృష్టవశాత్తూ నాకు మెస్రాలోని బిట్స్‌లో మెకానికల్‌ ఇంజినీరింగ్‌లో, మణిపాల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీలో ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌లో సీట్లు వచ్చాయి. కంప్యూటర్స్‌కీ, సాఫ్ట్‌వేర్‌కీ దగ్గరగా ఉంటుందని ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌ను ఎంచుకుని మణిపాల్‌ వెళ్లాను. కాలేజీలో నా స్నేహితులంతా ధైర్యసాహసాలూ, చొరవా, అభ్యుదయకాంక్షా కలిగి ఉండేవారు. వాళ్ల నుంచి చాలా నేర్చుకున్నాను. తర్వాత కాలిఫోర్నియాలో మణిపాల్‌లోని నా సహ విద్యార్థులు ఎనిమిది మందితో కలిసి అద్దె ఇంట్లో ఉండేవాణ్ని! మణిపాల్‌ వెళ్లాక క్రమంగా నా మనసులో క్రికెట్‌ స్థానాన్ని కంప్యూటర్లు ఆక్రమించాయి.

అమెరికా ప్రయాణం
ఇంజినీరింగ్‌ పూర్తయిన తర్వాత బొంబాయిలో పేరొందిన ‘ఇండస్ట్రియల్‌ ఇంజినీరింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌’లో చేరే అవకాశం వచ్చింది. మరోవైపు అమెరికాలో కొన్ని కాలేజీలకూ దరఖాస్తు చేశాను. ఆరోజుల్లో విద్యార్థి వీసా దైవాధీనం. నిజం చెప్పొద్దూ... అది రాకుంటే బావుణ్ననుకున్నాను. కానీ విధి తను అనుకున్నది చేస్తుంది. నాకు వీసా వచ్చింది. ఎన్నో ఆలోచనల తర్వాత మిల్వాకీలో విస్కాన్సిన్‌ యూనివర్సిటీలో కంప్యూటర్‌ సైన్స్‌లో మాస్టర్స్‌ డిగ్రీలో చేరాను. మిల్వాకీ నాకో భూలోక స్వర్గంలా అనిపించింది. అక్కడ కంప్యూటర్‌సైన్స్‌లో తేలికైన అంశాలు కాకుండా క్లిష్టమైన సమస్యలు పరిష్కరించండంటూ మమ్మల్ని ప్రొఫెసర్లు ప్రోత్సహించేవారు. నేను అక్కడికి వెళ్లింది వేసవిలో. తర్వాత చలికాలం. అప్పట్లో నాకు పొగతాగే అలవాటు ఉండేది. పొగతాగేవాళ్లు గది బయటే తాగి రావాలి. భారతీయ విద్యార్థులు ఆ చలిని తట్టుకోలేకపోయేవారు. అందుకని నాతోపాటు నా భారతీయ మిత్రులంతా పొగతాగడం మానేశారు. మాస్టర్స్‌ తర్వాత సన్‌ మైక్రో సిస్టమ్స్‌లో రెండేళ్లు పనిచేశాను. తర్వాత ఎంబీఏ చేసి ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకింగ్‌కు మారిపోవాలనుకున్నాను. షికాగో యూనివర్సిటీలో రెగ్యులర్‌ ఎంబీఏలో చేరిపోయాను కూడా. కానీ మరోవైపు మైక్రోసాఫ్ట్‌లో చేరడానికి చేస్తున్న ప్రయత్నం ఫలించింది. వాళ్లు తక్షణమే చేరిపోమన్నారు. నా రెగ్యులర్‌ ఎంబీఏని వారాంతాల్లో వచ్చి చేసేలా మార్చుకున్నాను. ఎవ్వరికీ చెప్పకుండానే వారాంతాల్లో షికాగోకి వెళ్తూ రెండేళ్లలో ఎంబీఏ పూర్తి చేశాను.

గ్రీన్‌కార్డు వదులుకున్నా!
మైక్రోసాఫ్ట్‌లో చేరేముందు 1992లో ఇండియా వెళ్లినపుడు అనూ, నేనూ పెళ్లి చేసుకోవాలనుకున్నాం. అనూ నాకు చిన్ననాటి నుంచి తెలుసు. వాళ్ల నాన్నగారూ, మా నాన్నా సివిల్‌ సర్వీసులో ఒకేసారి చేరారు. మా కుటుంబాల మధ్యా స్నేహం ఉంది. ఇద్దరం ఒకే స్కూల్లో, కాలేజీలో చదువుకున్నాం. అమెరికా వచ్చాక తనతో మాట్లాడలేదు. అప్పటికి అనూ మణిపాల్‌లో ఆర్కిటెక్చర్‌ చివరి సంవత్సరం చదువుతూ దిల్లీలో ఇంటర్న్‌షిప్‌ చేస్తోంది. ఇద్దరం వివిధ సందర్భాల్లో కలిసి మాట్లాడుకున్నాం. పుస్తకాల దుకాణాలకీ, నాటకాలు చూడ్డానికీ, షాపింగ్‌కీ వెళ్లాం. అప్పుడే ఇద్దరం ప్రేమలో పడ్డాం. పెళ్లి చేసుకుందామనుకున్నాం. ఇద్దరి ఇళ్లల్లోనూ ఒప్పుకోవడంతో ఆ ఏడాది డిసెంబరులోనే మా వివాహం జరిగింది. గ్రీన్‌కార్డు ఉన్న వ్యక్తి జీవిత భాగస్వామిగా అనూ అమెరికాకి రావడానికి అయిదేళ్లు పట్టొచ్చని మైక్రోసాఫ్ట్‌లోని ఇమిగ్రేషన్‌ లాయర్‌ చెబితే, నేను ఇండియా వెళ్లిపోవాలనుకున్నాను. అయితే, మరో లాయర్‌ ‘మీరు గ్రీన్‌కార్డు ఇచ్చేసి, తాత్కాలిక ఉద్యోగిగా హెచ్‌1బికి వెళ్లొచ్చు’ అన్నారు. వెంటనే దిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయానికి వెళ్లి, గ్రీన్‌కార్డు వెనక్కి ఇచ్చేసి హెచ్‌1బికి దరఖాస్తు చేసుకున్నాను. తర్వాత అనూ సియాటెల్‌లో నా దగ్గరికి వచ్చేసింది. గ్రీన్‌కార్డు వదిలేసిన వ్యక్తిగా ఆఫీసులో నా గురించి చాన్నాళ్లు మాట్లాడుకునేవారు.

క్రికెట్‌... నాయకత్వ పాఠాలు
హెచ్‌పీఎస్‌ సీనియర్‌ జట్టు తరఫున క్రికెట్‌ ఆడాను. ఈ టీమ్‌ ‘హైదరాబాద్‌ ఏ లీగ్స్‌’లో ఆడేది. ‘ఏ లీగ్స్‌’లో ఆడే జట్లలో స్కూల్‌ టీమ్‌ మాదొక్కటే. రంజీ ఆటగాళ్లు ఈ లీగ్స్‌లో ఆడేవారు. అందువల్ల తీవ్రమైన పోటీ ఉండేది. నా వరకూ క్రికెట్‌ అంటే ఇతివృత్తంలో ఉపకథలతో ఉండే రష్యన్‌ నవల. రకరకాలుగా మలుపులు తిరుగుతూ చివరికి ప్రతిభ కలిగిన ఒక బ్యాటింగ్‌, లేకపోతే నేర్పుగా విసిరిన మూడు బంతులూ ఆటతీరునే మార్చేస్తాయి. నా క్రికెట్‌ జీవితంలో మూడు మర్చిపోలేని అనుభవాలున్నాయి. వాటిలో వ్యాపార, నాయకత్వ సూత్రాలున్నాయి. సీయీవోగా నేను వాటిని ఈరోజుకీ ఉపయోగిస్తాను. స్కూల్‌ క్రికెట్‌ ఆడే రోజుల్లో ఓసారి మేం ఆస్ట్రేలియా జూనియర్‌ జట్టుతో మ్యాచ్‌ ఆడాం. వారిది బలమైన జట్టు అన్న భావనతో మేం చూడటాన్ని మా పీఈటీ గమనించారు. వాస్తవానికి మేం వాళ్లని చూసి కొద్దిగా భయపడ్డాం. మా మేనేజర్‌ అయిన ఉపాధ్యాయుడు మరింత దూకుడుగా ఆడమని కెప్టెన్‌పైన అరుస్తున్నాడు. నేను అప్పుడు బ్యాట్స్‌మెన్‌కి దగ్గరగా ఫీల్డింగ్‌ చేస్తున్నాను. ఆ ప్లేస్‌ ఇబ్బందిగా అనిపించింది. మా మేనేజర్‌ నింపిన స్ఫూర్తితో మేం కొద్దిసేపట్లోనే పుంజుకుని మంచి పోటీనిచ్చాం. ‘పోటీదారుని ఎప్పుడూ గౌరవించాలి. కానీ, వాళ్లని చూసి భయపడిపోకూడద’ని అప్పుడు తెలుసుకున్నాను. మా జట్టులో ఓ మంచి నైపుణ్యంగల బౌలర్‌ ఉండేవాడు. ఏదో కారణంవల్ల ఓసారి మా కెప్టెన్‌ అతడికి కాకుండా వేరే బౌలర్‌కి బంతి ఇచ్చాడు. ఆ ఓవర్లో బ్యాట్స్‌మెన్‌ బంతిని గాల్లోకి లేపాడు. మొదట చెప్పిన బౌలర్‌కి దగ్గరగా బంతి వెళ్లింది. అతడు మాత్రం జేబుల్లో చేతులు పెట్టుకుని తనకేమీ పట్టనట్టు నిల్చుండిపోయాడు. అతనో అగ్రశ్రేణి ఆటగాడు. మేం నమ్మలేనట్టుగా చూస్తుండిపోయాం. ఒక పాఠం... ఎంత తెలివైన వారైనాగాని టీమ్‌కి ప్రాధాన్యం ఇవ్వకపోతే మొత్తం జట్టుని నాశనం చేస్తారు. ఇంకోసారి ఓ మ్యాచ్‌లో ప్రత్యర్థి నా ఆఫ్‌స్పిన్‌ బౌలింగ్‌ను చిత్తు చిత్తు చేశాడు. నా ఓవర్‌ అయిపోయిన తర్వాత మా కెప్టెన్‌ బౌలింగ్‌కి వచ్చాడు. నిజానికి అతడు బౌలర్‌గా కన్నా బ్యాట్స్‌మేన్‌గా బాగా ఆడతాడు. ఆ ఓవర్లో వికెట్‌ పడగొట్టాడు. తర్వాత తాను బౌలింగ్‌ను కొనసాగించవచ్చు కానీ, ఆ వెంటనే బంతిని నాకు ఇచ్చి బౌలింగ్‌ చేయమన్నాడు. నేను ఏడువికెట్లు పడగొట్టాను. నేను ఆత్మవిశ్వాసం పోకుండా ఆడాలని అతనలా చేశాడని అర్థమైంది. నాయకత్వం అంటే అదే. ప్రతి ఒక్కరిలో ఉన్న ప్రతిభనీ బైటకు తీసుకురాగలగాలి. అది చాలా సూక్ష్మమైన, ముఖ్యమైన నాయకత్వ పాఠం.

సీయీవోగా నియామకం...
ఇరవయ్యేళ్లపాటు ఇంజినీరుగా, మైక్రోసాఫ్ట్‌లో నాయకుడిగా- నేను సీయీవో అన్వేషణ గురించి ఆత్రుతగా కన్నా, ఎక్కువ తాత్వికంగా ఉన్నాను. ఎన్నో వూహాగానాలున్నా వాటిని పట్టించుకోలేదు. బోర్డు ప్రతిభగల వారిని ఎంపిక చేస్తుందని నా అభిప్రాయం. ఒకవేళ అది నన్నే అయితే మంచిదే. వేరెవరినైనా నియమించినా వారితో పనిచేయడం కూడా నాకు సంతోషమే. సీయీవో అన్వేషణకు నేతృత్వం వహిస్తున్న స్వతంత్ర డైరెక్టర్‌ జాన్‌ థాంప్సన్‌ 2014 జనవరి 24న మాట్లాడ్డానికి సమయం కోరుతూ ఇ-మెయిల్‌ పంపారు. ఆ రోజు సాయంత్రం జాన్‌ నాకు ఫోన్‌ చేశారు. అప్పుడు నేను చేతిలో ఉన్న క్రికెట్‌ బంతితో ఆడుతున్నాను. ఆఫీసులో స్పీకర్‌ ఫోన్లో మాట్లాడేటపుడు సాధారణంగా ఆ పనే చేస్తుంటాను. అప్పుడాయన నేనే మైక్రోసాఫ్ట్‌ సీయీవోననే వార్త చెప్పారు. ఆయన మాటలు అర్థం కావడానికి రెండు మూడు నిమిషాలు పట్టింది.

పోటీదారులతో భాగస్వామ్యం
నేను సీయీవోగా బాధ్యతలు చేపట్టే సమయానికి మూడు నెలల్లో ప్రపంచవ్యాప్తంగా ఏడు కోట్ల పీసీలు అమ్ముడైతే, 35 కోట్ల స్మార్ట్‌ఫోన్లు అమ్ముడయ్యాయి. భవిష్యత్తు కూడా ఇలానే ఉంటుందని అర్థమవుతోంది. ఇది మైక్రోసాఫ్ట్‌కు దుర్వార్త. ఎందుకంటే పీసీలు అమ్ముడైతేనే మైక్రోసాఫ్ట్‌కు రాయల్టీ వస్తుంది. సీయీవో అయిన కొత్తల్లోనే ఓ సదస్సులో నా చేతిలో ఐఫోన్‌ చూడగానే ఆడిటోరియంలోని అందరూ నిశ్చేష్టులయ్యారు, గుసగుసలు మొదలయ్యాయి. అవి ఆగిపోగానే... ‘ఇది విశిష్టమైన ఐఫోన్‌. నేను దీన్ని ‘ఐఫోన్‌ ప్రో’ అనాలనుకుంటున్నాను. ఎదుకంటే దీన్లో మైక్రోసాఫ్ట్‌ సాఫ్ట్‌వేర్‌, అప్లికేషన్లు ఉన్నాయి’ అన్నాను. నా వెనక పెద్ద తెరమీద ఫోన్‌ క్లోజప్‌ కనిపించింది. దాన్లో ఆప్‌ ఐకాన్లు కనిపిస్తున్నాయి. ఐఫోన్‌ వెర్షన్లు అయిన మైక్రోసాఫ్ట్‌ క్లాసిక్స్‌ ఔట్‌లుక్‌, స్కైప్‌, వర్డ్‌, ఎక్సెల్‌, పవర్‌ పాయింట్‌ ఇంకా మొబైల్‌ అప్లికేషన్లు డైనమిక్స్‌, వన్‌ నోట్‌, వన్‌ డ్రైవ్‌, స్వే, పవర్‌ బీఐ... ప్రేక్షకులంతా ఒకటే చప్పట్లు. మా పోటీదార్లలో ఒకటైన ఆపిల్‌ ఐఫోన్లో మైక్రోసాఫ్ట్‌ సాఫ్ట్‌వేర్‌ను ప్రదర్శించి చూపడం వారికి ఆశ్చర్యాన్నీ, పునరుత్తేజాన్నీ కలిగించింది. ఈరోజు నాకున్న అత్యంత ప్రధాన లక్ష్యాల్లో ఒకటి, మా వందకోట్ల వినియోగదార్లు ఏ ఫోన్‌ను, ఏ ప్లాట్‌ఫామ్‌ను వాడుతున్నా వారి అవసరాలు తీరాలన్నదే. అప్పుడే మేం ఎదుగుతూ ఉండగలం. అలా చేయాలంటే కొన్నిసార్లు పాత శత్రువులతో సంధి చేసుకోవాలి. కొత్త భాగస్వామ్యాలు ఏర్పరచుకోవాలి. మేం ఆపిల్‌తోనే కాదు, గూగుల్‌, ఫేస్‌బుక్‌ లాంటి ఎన్నో పోటీ సంస్థలతోనూ కలిసి పనిచేస్తున్నాం. ఇది మా ఎదుగుదలకు ఎంతో అవసరం.

కొన్ని విషయాలపైన నాకు స్పష్టత ఉండాలనీ, అలా ఉంటేనే సమర్థంగా నాయకత్వం వహించగలననీ నాకు తెలుసు. నాకే కాదు, మైక్రోసాఫ్ట్‌లో పనిచేసే ప్రతి ఒక్కరి మనసులోనూ ఈ స్పష్టత ఉండాల్సిందే. ‘ఈ సంస్థ ఎందుకుంది?’. ‘ఇక్కడ నేనెందుకున్నాను?’... ఈ ప్రశ్నలను ఏ సంస్థలో పనిచేస్తున్న వారైనా అప్పుడప్పుడూ తమకు తాము వేసుకోవాలి. ఇంకా చెప్పాలంటే ప్రతి వ్యక్తీ, ప్రతి సంస్థా, సమాజం కూడా ఎప్పటికప్పుడు ఈ ప్రశ్నలు వేసుకుంటూ సమాధానాలిచ్చుకుంటూ రిఫ్రెష్‌ అవుతుండాలి.


ఆ నవ్వు చాలు

 

సత్యా తండ్రి బి.ఎన్‌.యుగంధర్‌, తల్లి ప్రభావతి.

* మానవీయ కోణంలేని సాంకేతికతకు అర్థం లేదంటారు సత్య. వీళ్లబ్బాయి జైన్‌కి సంగీతం ఇష్టం. వీల్‌ఛైర్‌కు ఉండే సెన్సర్‌ని నొక్కడంద్వారా తనకు నచ్చిన సంగీతాన్ని వినగలడు. మనుషుల్ని గుర్తించి వారి భావోద్వేగాల్ని అంచనావేసే మైక్రోసాఫ్ట్‌ ఆప్‌ ’సీయిగ్‌ ఏఐ’నీ వినియోగిస్తున్నాడు.

* ‘జైన్‌ దగ్గర ఉన్నంతసేపూ ఎంతో ఆనందంగా ఉంటుంది. నన్ను చూడగానే జైన్‌ నోరారా నవ్వుతాడు. అది చూడగానే మనసంతా ఆనందంతో నిండిపోతుంది. ఇక ఆరోజంతా ఎంతో సంతోషంగా ఉంటుంది’ అంటారు సత్య.

* ఆర్కిటెక్ట్‌గా పనిచేసిన అనుపమ... జైన్‌ కోసం కెరీర్‌ను వదులుకున్నారు.

* సత్యా, అనుపమలకు అబ్బాయితోపాటు, ఇద్దరు అమ్మాయిలున్నారు. ఇంట్లో పిల్లలచేత సత్యానే హోమ్‌వర్క్‌ చేయిస్తారు. వారాంతాల్లో వాళ్లని తీసుకొని బయటకు వెళ్తారు. పిల్లలు ఎంత సమయం కంప్యూటర్‌పైన గడుపుతున్నారో తెలుసుకుంటారు.

* 1992లో మైక్రోసాఫ్ట్‌లో చేరి టెక్నికల్‌ మార్కెటింగ్‌ మేనేజర్‌ హోదాలో పనిచేశారు. మొదట్నుంచీ సర్వీసెస్‌ విభాగంలో ఉన్న సత్యాకు మాజీ సీయీవో స్టీవ్‌ బామర్‌ సర్చింజిన్‌ ‘బింగ్‌’ బాధ్యతలు అప్పగించారు. సీయీవోగా ఎంపికైన సమయానికి ఆ విభాగానికి నాయకత్వం వహిస్తున్నారు.

* ఫౌండేషన్‌’ కార్యక్రమాల్లో పాల్గొనడానికి రోజువారీ బాధ్యతల్ని తగ్గించుకున్న బిల్‌గేట్స్‌ని తరచూ విధులకు హాజరయ్యేలా ఒప్పించారు సత్య. ‘బిల్‌ ఒక గొప్ప ప్రోత్సాహక శక్తి. కొత్త ఉత్పత్తుల గురించి మంచి అభిప్రాయం చెబుతారు’ అంటారు.

* ఆన్‌లైన్లో తరచూ కొత్త కోర్సులు నేర్చుకుంటారు. ఆఫీసు క్యాబిన్లో డజన్ల కొద్దీ పుస్తకాలు ఉంటాయి. పుస్తకాలు చదవడంలో సత్యాపైన అనూ ప్రభావం ఉంది. ఆమె ఏదైనా మంచి పుస్తకాన్ని చదివినపుడు- దాన్ని చదవమంటూ సత్యానూ ప్రోత్సహించేవారు. అలా సత్యాకూ పుస్తక పఠనం అలవాటైంది.

* సీయీవోగా వృత్తి నిపుణులకు ఉపయోగపడే ‘లింక్డిన్‌’నూ, విద్యారంగంలో పనిచేస్తున్న ‘మైన్‌క్రాఫ్ట్‌’ సంస్థనూ కొనుగోలు చేశారు.

* మైక్రోసాఫ్ట్‌ సీయీవోగా సత్యా బాధ్యతలు చేపట్టాక సంస్థ మార్కెట్‌ విలువ రూ.15లక్షల కోట్లు పెరిగింది.

* ‘హిట్‌ రిఫ్రెష్‌’ అమ్మకాల ద్వారా వచ్చే లాభాలను మైక్రోసాఫ్ట్‌ ఫౌండేషన్‌కు అందిస్తారు.


 

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.