close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
పాట హిట్టయినా.. పిలుపు రాలేదు!

పాట హిట్టయినా.. పిలుపు రాలేదు!

పాటంటే... అక్షరాలతో ఆడుకునే అందమైన ఆట. మాటలతో చేసే మాయాజాలం. పదాలు  భావాలకు రెక్కలు తొడిగే కొత్త అర్థాలు చెప్పే అనుభవం. అలాంటి పాటతో ప్రయాణం చేస్తున్నయువ గీత రచయిత కృష్ణకాంత్‌. ఈ ఒక్క ఏడాదిలోనే దాదాపు 65 పాటలు రాసేసింది ఈయన కలం. అందుకే వంద పాటల మైలు రాయినీ చాలా త్వరగా అందుకోగలిగారు. ‘అందాల రాక్షసి’, ‘కృష్ణగాడి వీరప్రేమగాథ’, ‘జిల్‌’, ‘లై’, ‘మహానుభావుడు’ చిత్రాల్లో తన గీతాలతో ఆకట్టుకున్న కె.కె (కృష్ణకాంత్‌) కబుర్లు.
 

‘‘మాది సూర్యాపేట. నాన్న వెంకట్రాముడు, అమ్మ పిచ్చమ్మ. మేం నలుగురు అన్నాదమ్ములం. నేనే చిన్నవాడ్ని. మాకో స్టేషనరీ షాపుండేది. మొదట్లో బాగానే నడిచినా, ఆ తరవాత బాగా నష్టాలొచ్చాయి. నాన్నగారి ఆరోగ్యం కూడా పాడైంది. ఆయన దూరమయ్యాక ఇంటి బాధ్యతలు మా పెద్దన్నయ్య శేఖర్‌పైన పడ్డాయి. తనకు వాచ్‌ రిపేరింగ్‌లో మంచి పట్టుంది. చదువు మానేసి ‘శేఖర్‌ టైమ్స్‌’ అనే షాపు పెట్టాడు. మా ఫీజులన్నీ అన్నయ్యే కట్టేవాడు. మా ప్రతీ అవసరం తీర్చేవాడు. అయితే నాలో ఎక్కడో చిన్న గిల్టీ ఫీలింగ్‌. అన్నయ్యకు భారం కాకూడదని హైదరాబాద్‌ వచ్చేశా. ఇక్కడే ఉద్యోగం చేసుకుంటూ, చదువుకున్నా. హైదరాబాద్‌లో డిగ్రీ, ఎంబీఏ పూర్తి చేశా. అప్పట్లో రామోజీ ఫిల్మ్‌సిటీలో హోటెల్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సు పెట్టారు. కష్టపడి పూర్తి చేశా. కానీ ఎక్కడో అసంతృప్తి. నాకు రాయడం అంటే ఇష్టం. సినిమా అంటే మరీ ఇష్టం. మిగిలిన సబ్జెక్టుల మాటేమో గానీ తెలుగు, సంస్కృతంలో 90 శాతానికి ఎప్పుడూ తగ్గలేదు. హిందీలోనూ పట్టుంది. పద్యాలూ, నాటకాలూ అంటే అభిమానం. తెలంగాణలో నాటకాల సంస్కృతి అంతగా ఉండేది కాదు. కానీ టీవీల్లో వస్తే ఆసక్తిగా చూసేవాణ్ణి. పురాణ పాత్రల గురించి అవగాహన పెంచుకున్నా. రామాయణ, మహాభారతాల్లో ఏ చిన్న పాత్ర గురించి అడిగినా చెప్పేసేవాణ్ణి. ఇక సినిమాలంటారా.. తెగ చూసేవాణ్ణి. అప్పట్లో నామీద ‘శివ’ ప్రభావం ఎక్కువగా ఉండేది. సౌండింగ్‌ అంటే ఏమిటి... కెమెరా అంటే ఏమిటి... దర్శకత్వం అంటే ఏమిటి... అనే విషయాలు బాగా తెలిశాయి. సినిమాల్ని చూసే పద్ధతినే పూర్తిగా మార్చేసిందా సినిమా. కృష్ణవంశీ ‘గులాబి’ కూడా నాలో ఆలోచనల్ని రేకెత్తించింది. రెహమాన్‌ పాటలంటే చాలా ఇష్టం. ‘రోజా’, ‘జెంటిల్‌మెన్‌’, ‘ప్రేమికుడు’ పాటల్లోని సౌండింగ్‌ బాగా నచ్చేది. డబ్బింగ్‌ పాటల్లో కొన్ని పదాలు వింటుంటే ఏదో ఇబ్బందిగా అనిపించేది. అందుకోసం తమిళ క్యాసెట్లు కొని, అర్థాలు తెలియకపోయినా ఎంజాయ్‌ చేసేవాణ్ణి. క్యాసెట్లపైన ఉన్న పేర్లు చూస్తూ... తమిళం రాయడం నేర్చుకున్నా. ఎప్పుడో ఒకప్పుడు తెర మీద నా పేరు చూసుకోవాలని ఉండేది. కానీ ఏం అవ్వాలో, అందుకోసం ఏం చేయాలో తెలిసేది కాదు. సినిమా చూసొచ్చాక స్నేహితులతో పిచ్చాపాటీ మాట్లాడేవాణ్ణి. అలా కథలపై అవగాహన ఏర్పడింది. కొన్ని కథల్ని ఊహించి చెప్పేవాణ్ణి. కొన్నాళ్లకు అవే సినిమాలుగా వచ్చేవి. ‘సింహాద్రి’ సినిమా చూడకముందే, ఆ కథని ఊహించి, స్నేహితులకు చెప్పాను. ఆ సినిమా చూసొచ్చాక  ‘నీ కథే కదా ఇది’ అని ఆశ్చర్యపోయారు మా ఫ్రెండ్స్‌. అలా యాదృచ్ఛికంగా నా ఊహలే సినిమాలుగా వచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి.

రాస్తూ... పాడుతూ...
మా ఇంట్లో అందరం ‘ఈనాడు’ అభిమానులం. 1983 నుంచి ఇప్పటి వరకూ మా ఇంటికి ‘ఈనాడు’ వస్తూనే ఉంది. తెలుగు భాషపైన అభిమానం పెరగడానికి ‘ఈనాడు’ పత్రికే ప్రధాన కారణం. సినిమాలు చూడడం, పాటలు వినడం నా ప్రధాన వ్యాపకాలు. ఆడియో క్యాసెట్లు తెగ కొనేవాణ్ణి. అలా దాదాపు 2వేల క్యాసెట్లు సేకరించా.

ఆ క్యాసెట్లతో రికార్డింగ్‌ సెంటర్‌ నిర్వహించేవాడు చిన్న అన్నయ్య. అప్పట్లో కవితలు రాసేవాణ్ణి. పత్రికలకు పంపలేదు గానీ, స్నేహితులకు వినిపించేవాణ్ణి. కొన్నింటిని నేనే ట్యూన్‌ చేసుకుని, పాడుకొని భద్రపరచుకున్నా. అలా రెండొందల పాటల వరకూ ట్యూన్‌ చేసి, సినిమాల్లోకి రాకముందే సిద్ధంగా ఉంచుకున్నా. 2008లో శ్రవణ్‌ అనే స్నేహితుడు పరిచయం అయ్యాడు. తనో సంగీత దర్శకుడు. నా కవితల్ని ట్యూన్‌ చేసి, పాటగా మార్చేవాడు. నాకు రాయడం, తనకు ట్యూన్‌ చేయడం... అలా ఇద్దరి ప్రాక్టీసూ అయిపోయేది. మేమిద్దరం దాదాపు మూడొందల పాటలు రికార్డ్‌ చేశాం. వాటిలో పది పాటలు తీసుకుని, ‘కలయో నిజమో’ అనే ఆల్బమ్‌ చేశాం. బాగా హిట్టయ్యింది. మ్యూజిక్‌ వీడియో రూపొందించాం. అవి యూట్యూబ్‌లో బాగా క్లి¨క్కయ్యాయి. ‘సినిమాకెళ్దాం రండి’ అనే సినిమాకి సంగీత దర్శకుడిగా శ్రవణ్‌కి అవకాశం వచ్చింది. గీత రచయితగా నన్నే ఎంచుకున్నాడు. అన్ని పాటలూ నేనే రాశా. అలా సినిమాల్లోకి అడుగుపెట్టా. ఒక్కో పాటకూ పదివేల రూపాయలు ఇచ్చారు. అయితే సినిమా ఆడలేదు. ఆ సినిమా వచ్చిందో, లేదో కూడా ఎవ్వరికీ గుర్తులేదు. సరిగ్గా అదే సమయంలో హను రాఘవపూడి పరిచయం అయ్యాడు. ‘అందాల రాక్షసి’ సినిమా తెరకెక్కించే పనిలో బిజీగా ఉన్నాడు హను. నా పాటలన్నీ వినిపించా. తనకి బాగా నచ్చి ‘అందాల రాక్షసి’లో అవకాశం ఇచ్చాడు. అలా మా ఇద్దరి మధ్య స్నేహం మొదలైంది.

‘అందాల రాక్షసి’లో నాపాటలకు గుర్తింపు వచ్చినా ఆ సినిమా సరిగా ఆడలేదు. దాంతో రెండేళ్ల పాటు నన్నెవరూ పట్టించుకోలేదు. శ్రవణ్‌ చేసిన సినిమాలే ఆధారమయ్యాయి. ‘ప్రేమ ఇష్క్‌ కాదల్‌’, ‘అలియాస్‌ జానకి’ చిత్రాలకు పాటలు రాశా. ‘జిల్‌’, ‘దోచేయ్‌’లాంటి పెద్ద సినిమాల్లోనూ అవకాశాలొచ్చాయి. కానీ అవీ హిట్‌ అవ్వలేదు. దాంతో నా పాటలెవరికీ చేరలేదు. మళ్లీ హను నుంచే పిలుపొచ్చింది. తన తరువాతి సినిమా ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’లో ‘నువ్వంటే నా నువ్వు’ పాట చాలా పెద్ద హిట్టయ్యింది. సినిమా కూడా బాగా ఆడింది. ‘ఇక నుంచి నా దిశ తిరగడం ఖాయం’ అనుకున్నా. కానీ అదేంటో విచిత్రంగా మంచి హిట్‌ వచ్చినా, నన్నెవరూ పట్టించుకోలేదు. ఆరు నెలల వరకూ కనీసం ‘పాట రాస్తారా’ అంటూ ఒక్క కాల్‌ కూడా రాలేదు.

ఈ దశలో తమన్‌ పరిచయం అయ్యాడు. ఆయన స్వర సారధ్యంలో ‘జవాన్‌’ సినిమా పనులు 2016లోనే ప్రారంభమయ్యాయి. విడుదల ఆలస్యమైంది గానీ, పాటలు బాగా కుదిరాయి. నా పనితనం మీద తమన్‌కి నమ్మకం కలిగింది. వరుసగా తన సినిమాల్లో అవకాశాలిచ్చాడు. ‘మహానుభావుడు’లో టైటిల్‌ సాంగ్‌తో పాటు ‘కిస్‌ మీ’ అనే మంచి రొమాంటిక్‌ గీతం రాశా. రెండింటికీ మంచి పేరొచ్చింది. ఈ ప్రయాణంలో కీరవాణి, రెహమాన్‌, ఇళయరాజా తప్ప మిగిలిన సంగీత దర్శకులందరితోనూ పనిచేసే అవకాశం వచ్చింది. ఒకొక్కరి నుంచి ఒక్కో విషయం నేర్చుకున్నా. తమన్‌ చాలా ఎనర్జిటిక్‌. పోగ్రామింగ్‌లో తనని దాటేవాళ్లు ఇండియాలోనే లేరు. ఆడుతూ, పాడుతూ పనిచేసేస్తాడు. తక్కువ సమయంలో ఎక్కువ పాటలు ఇవ్వడం వల్లేమో... ‘రొటీన్‌’ అనే ముద్ర పడింది. కానీ ఇప్పుడు సౌండింగ్‌ చాలా మార్చేశాడు. మణిశర్మది మరో పద్ధతి. ఆయన బయటికి గంభీరంగా కనిపించినా, నిజానికి చాలా కూల్‌గా ఉంటారు. ‘ఫ్రెంచ్‌ పాటైతే పదాలన్నీ ఫ్రెంచ్‌లోనే ఉంటాయి. ఇంగ్లిష్‌ పాటైతే ఒక్క అన్య పదం కూడా ఉండదు. తెలుగు పాటలో మాత్రం మరో భాష ఎందుకు వినిపించాలి’ అని అడుగుతుంటారు. ఆయన చెప్పేది నిజమే. నేనూ తెలుగు పదాలకే ప్రాధాన్యం ఇస్తా. ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’లో ఒక్క ఆంగ్ల పదం కూడా కనిపించదు. అయితే అమెరికా నేపథ్యంలో కథ నడుస్తున్నప్పుడు.. అక్కడక్కడ కొన్ని ఇంగ్లిష్‌ పదాలు పడినా తప్పులేదు. పాటల్లో పూర్తిగా కవిత్వం ఒలకబోస్తే ఈతరానికి నచ్చకపోవచ్చు. ఇంగ్లిషులోని చాలా పదాలు తెలుగు భాషలో చేరిపోయాయి. అలాంటప్పుడు పూర్తిగా తెలుగులో రాస్తే అర్థం కాని పరిస్థితి వస్తుందేమో అని భయపడుతుంటాం.

బాధించిన క్షణాలు
2017... నాకు చక్కటి గుర్తింపు తీసుకొచ్చింది. ఏకంగా 65 పాటలు రాశా. అందులో చాలా పాటలు హిట్టయ్యాయి. రచయితగా స్థిరపడ్డానన్న భరోసా లభించింది. పారితోషికాల విషయానికొస్తే, మొదట్లో చాలా తక్కువ ఇచ్చేవారు. ఇప్పుడు ఫర్వాలేదనిపించే స్థాయిలో ఉంది. రచయిత అడిగినంత ఎప్పుడూ ఇవ్వరు, నిర్మాతలు అనుకున్నదే ఇస్తారు. గాయకులకూ, సంగీత దర్శకులకూ పారితోషికం ఎంతున్నా, వేదికలపైన పాడేటప్పుడు వాళ్లకు డబ్బులు బాగా వస్తాయి. గీత రచయితలకు వేరే ఆదాయ మార్గాలంటూ ఉండవు. ఐపీఆర్‌ఎస్‌ ద్వారా మా పాట ఎక్కడ, ఏరూపంలో వాడుకున్నా రైట్స్‌ రూపంలో కొంత మొత్తం వస్తుంది గానీ, అదేమంత పెద్ద విషయం కాదు. ‘సినిమా విడుదల అవ్వనివ్వండి.. డబ్బులు అప్పుడు ఇస్తాం’ అనే నిర్మాతలు ఫ్లాప్‌ అయితే ఆ మాట మర్చిపోతారు. మేం అడిగే సాహసం కూడా చేయలేం. రచయితలకు భారీ పారితోషికాలు ఎందుకు ఇవ్వాలి? అనుకుంటారు కొంతమంది నిర్మాతలు. పెన్నూ, పేపర్‌ తప్ప పెద్ద ఖర్చులేముంటాయి అనే అభిప్రాయం వాళ్లది. ఈ ఆలోచనలు మారినప్పుడే మా కష్టానికి తగిన ప్రతిఫలం వస్తుంది.రచయితగా నా ప్రయాణంలో ఒకట్రెండు చేదు అనుభవాలూ ఉన్నాయి. ఈమధ్య ఓ సినిమాకి పాట రాశా. రికార్డింగ్‌ కూడా అయిపోయింది. కానీ సినిమాలోంచి ఆ పాట తీసేశారు. ‘నీ పాట తీసేస్తున్నాం’ అన్న సంగతి మాట వరసకైనా చెప్పలేదు. మరోసారి నాకు ఇచ్చిన పాటే, మరో రచయితకీ ఇచ్చారు. నా పాట నేను రాసిచ్చేశా. ‘బాగుంది’, ‘బాగోలేదు’, ‘మళ్లీ ట్రై చేయండి’ అన్నదయినా చెప్పకుండా అదే పాటని మరొకరితో రాయించడం బాధించింది. రచయితగా ఇప్పుడు బిజీగానే ఉన్నా. త్వరలో ఓ సినిమాకి మాటలు కూడా రాస్తున్నా. అక్షరాలతో నా ప్రయాణం ఇలానే సాగాలనీ, గీత రచయితగా మరింత గుర్తింపు సాధించాలనే తపనతో పనిచేస్తున్నా.’’

ఉద్యోగం చేస్తున్నా... 

నా భార్య పేరు హిమ బిందు. చుట్టాలమ్మాయే. ఓ విధంగా మాది ప్రేమ వివాహం. తను తొమ్మిదో తరగతి చదువుతున్నప్పుడు తొలిసారి చూశా. అప్పుడే ఇష్టం మొదలైంది. ఆ తరవాత ఆరేళ్లకు పెద్దల్ని ఒప్పించి పెళ్లి చేసుకున్నాం. మాకిద్దరు పిల్లలు.. హృది, హృషిత్‌.
* కొన్నాళ్లు ఈటీవీలో గ్రాఫిక్‌ డిజైనర్‌గా పనిచేశా. ఇప్పుడు  ఓ ఛానల్‌లో గ్రాఫిక్స్‌ విభాగంలో చీఫ్‌గా ఉంటున్నా. ఓవైపు పాటలు రాస్తూ బిజీగా ఉన్నా, ఉద్యోగం మాత్రం వదల్లేదు.
* వేటూరి అంటే చాలా ఇష్టం. అందరికీ అర్థమయ్యేలా రాస్తారు. ఎంత పెద్ద భావమైనా సరళంగా చెబుతారు. ‘హే చికితా..’ అన్నా అందులోని ఓ అర్థం ఉంటుంది. కొత్త పదాల్ని సృష్టిస్తారు. 90వ దశకంలో ఆయన రాసిన ప్రతీ పాటా విన్నా. మాస్‌, క్లాస్‌ అనే తేడా లేకుండా ఎలాంటి పాటైనా రాస్తారు. నేను రచయితను అయిన
తరవాత ఆయనపైన మరింత గౌరవం పెరిగింది.
సిరివెన్నెలది మరో శైలి. ఆయన భావాలు గంభీరంగా ఉంటాయి.
ఆ పాట విని ఆనందించడమే కాదు, అర్థాలు తెలుసుకోవాలన్న కుతూహలాన్ని కలిగిస్తాయి.
* ఈతరంలో అందరూ బాగా రాస్తున్నారు. పోటీ కూడా బాగానే ఉంది. ఎక్కడ ఏ మంచి పాట వినిపించినా, ఫోన్‌ చేసి అభినందిస్తుంటా. మిగిలినవాళ్లూ అంతే. భాస్కరభట్ల, శ్రీమణి, కృష్ణ చైతన్య... వీళ్లంతా నాతో బాగా కలిసిపోతారు.
* తెలుగు సాహిత్యంలో చదవదగిన ప్రతీ పుస్తకం తిరగేశా.
దాశరథి, తిలక్‌, కృష్ణశాస్త్రి నా అభిమాన రచయితలు. నవలా పఠనం కూడా ఆసక్తే. వంశీ, యండమూరి పుస్తకాలు అన్నీ చదివా.
* ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’లోని ‘నువ్వంటే నానువ్వు’ కోసం దాదాపు 60 వెర్షన్లు రాశా. ఓ వెర్షన్‌ రికార్డ్‌ చేసి కూడా పక్కన పెట్టేశాం. అంత కష్టపడి రాసిన పాట అదే. అయితే దానికే ఎక్కువ పేరొచ్చింది.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.