close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
కోహ్లీ లేకుంటే నేను లేను!

కోహ్లీ లేకుంటే నేను లేను!

నాలుగు ఓవర్లూ ఆరు వికెట్లూ 25 పరుగులూ... టీ20 క్రికెట్‌లో భారత్‌ తరఫున బౌలింగ్‌లో అత్యుత్తమ గణాంకాలివే. పదేళ్ల నుంచీ టీమ్‌ ఇండియా పొట్టి క్రికెట్‌ ఆడుతున్నా ఈ గణాంకాలు నమోదైంది ఈ ఏడాదే. ఈ రికార్డుని సాధించిన ఆటగాడు యుజ్వేంద్ర చాహల్‌. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో స్పెషలిస్టు బౌలర్‌గా గుర్తింపు తెచ్చుకుంటున్న చాహల్‌ అక్కడ వరకూ చేరడానికి సాగించిన ప్రయాణమిది...
 

చాహల్‌ సొంతూరు హరియాణాలోని జీంద్‌. తండ్రి కేకే చాహల్‌ న్యాయవాది. చదువుకునే రోజుల్లో యూనివర్సిటీ క్రికెట్‌ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. రోజూ ఉదయాన్నే మైదానానికి వెళ్తూ  తనతోపాటు చిన్నారి చాహల్‌ను తీసుకువెళ్తుంటే అక్కడ పిల్లలతో క్రికెట్‌ ఆడేవాడు. ఇంట్లో ఖాళీగా ఉన్నపుడు కొడుక్కి చెస్‌ కూడా నేర్పించాడు కేకే. అలా నేర్చుకున్న కొద్ది నెలలకే తండ్రిని ఓడించేంతవాడయ్యాడు జూనియర్‌ చాహల్‌. దాంతో కొడుకుని చెస్‌ పోటీలవైపు తీసుకువెళ్లాడు తండ్రి. అలా ఏడేళ్ల వయసు నుంచీ రెండు ఆటల్లోనూ ప్రవేశం ఏర్పడింది. పదేళ్లకే హరియాణా జట్టు తరఫున అండర్‌-14 క్రికెట్‌ ఆడిన చాహల్‌, మరోవైపు అండర్‌-12 చదరంగం విభాగంలో జాతీయ ఛాంపియన్‌ అయ్యాడు. చదరంగంలో కేరళలో జరిగిన ఆసియా, గ్రీస్‌లో జరిగిన వరల్డ్‌ యూత్‌ ఛాంపియప్‌షిప్‌లలో భారత్‌కు ప్రాతినిధ్యం వహించాడు. కొడుకు రెండు క్రీడల్లో రాణిస్తుండటంతో అతడి చదువు గురించి సీనియర్‌ చాహల్‌ ఎన్నడూ ఆందోళన చెందలేదు. చెస్‌... క్రికెట్‌... ఏదో ఒకటి మాత్రమే ఎంచుకోవాల్సిన రోజు చాహల్‌కి రానే వచ్చింది. ఆ సమయంలో క్రికెట్‌కే ఓటేశాడు. ‘భారత క్రికెట్‌ జట్టు 2002లో ఛాంపియన్స్‌ ట్రోఫీ గెలిచింది. 2003 ప్రపంచకప్‌లో ఫైనల్స్‌కి వెళ్లింది. ఆ విజయాలు నన్ను క్రికెట్‌వైపు మళ్లించాయి’ అని చెబుతాడు చాహల్‌. ‘చదరంగంలో ముందుకు వెళ్లాలంటే అంతర్జాతీయ శిక్షణ అవసరం. దానికి లక్షల్లో ఖర్చవుతుంది. కానీ ఆ సమయంలో స్పాన్సర్లు ఎవరూ ముందుకు రాలేదు. అందుకే యజ్జూ చెస్‌ కాదు క్రికెట్‌ అన్నపుడు నేనూ ప్రోత్సహించాను’ అంటూ ఆరోజుల్ని గుర్తు చేసుకుంటారు కేకే. అంతేకాదు, కొడుకు క్రికెట్‌ ప్రాక్టీసుకు వీలుగా తన పొలంలోనే పిచ్‌ తయారుచేయించాడు.

ముంబయి గుర్తించింది...
క్రికెట్‌పైనే గురిపెట్టిన చాహల్‌ తర్వాత రాష్ట్ర జట్టు తరఫున అండర్‌-16, 17, 19, 22... ఆడుతూ వచ్చాడు. 2009 నుంచి ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌ ఆడుతూ వచ్చిన చాహల్‌కి 2011లో రంజీల్లో ఆడే అవకాశం దక్కింది. కెరీర్‌ కోసం హరియాణాలోని చిన్న పట్టణం అయిన జీంద్‌ను వదిలి దిల్లీలో ఎక్కువగా ఉండేవాడు. అక్కడ డీడీసీఏ(దిల్లీ డిస్ట్రిక్ట్‌ క్రికెట్‌ అసోసియేషన్‌) నిర్వహించే లీగ్‌లలో ఎయిర్‌ ఇండియా తరఫున ఆడేవాడు. హరియాణా క్రికెట్‌ సంఘం కార్యదర్శి అనిరుధ్‌ చౌదరి ఆ సమయంలో చాహల్‌ను ‘ముంబయి ఇండియన్స్‌’ నిర్వహిస్తున్న ఎంపిక కార్యక్రమంలో పాల్గొనమని పంపారు. ‘హరియాణా తరఫున అండర్‌-18 ఆడుతున్న సమయంలో అనిరుధ్‌ సర్‌, కోచ్‌ అశ్వినీ సర్‌ నన్ను ముంబయి పంపారు. అక్కడ నెట్స్‌లో చాలాసేపు బౌలింగ్‌ చేసినపుడు ముంబయి ఇండియన్స్‌ కోచ్‌ రాబిన్‌ సింగ్‌ నా లెగ్‌ స్పిన్‌ని మెచ్చుకున్నారు’ అంటాడు చాహల్‌. ఆ తర్వాత ముంబయిలో జరిగిన ‘డీవీ పాటిల్‌ టీ20’ టోర్నీలో చూపిన ప్రదర్శన ముంబయి ఐపీఎల్‌ జట్టుకి చాహల్‌ ఎంపికయ్యేలా చేసింది. ‘ఏదో ఒకరోజు ఐపీఎల్‌లో ఆడతానని మూడేళ్లుగా అనుకుంటున్నాను. కానీ పిలుపు వచ్చినపుడు మాత్రం ఎంతో ఆశ్చర్యం కలిగింది’ అంటాడీ యువ క్రికెటర్‌.

ఐపీఎల్‌ అనుభవం
ముంబయి తరఫున మూడు(2011, 12, 13) ఐపీఎల్‌ సీజన్లలో పాల్గొన్నప్పటికీ చాహల్‌ ఆడింది కేవలం ఏడు మ్యాచ్‌లే. కానీ పోలార్డ్‌, హర్భజన్‌, సచిన్‌ లాంటి దిగ్గజ ఆటగాళ్లతో డ్రెస్సింగ్‌ రూమ్‌ పంచుకున్నాడు. కుంబ్లే కూడా అక్కడ మెంటార్‌గా ఉండటంతో బౌలింగ్‌ను మెరుగుపర్చుకునే అవకాశమూ దక్కింది. 2013 ‘ఛాంపియన్స్‌ లీగ్‌ టీ20’లో ముంబయి తరఫున ఆడిన చాహల్‌ ఫైనల్లో రెండు వికెట్లు తీసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. తమ నుంచి కప్‌ను ఎగరేసుకుపోయిన ఆ స్పిన్నర్‌ను ‘రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు’ జట్టు తర్వాత ఏడాది ఐపీఎల్‌ వేలంలో కొంది. ఎంపికైతే జరిగింది కానీ, బెంగళూరు జట్టులో మురళీధరన్‌, విటోరీలాంటి అంతర్జాతీయ స్పిన్నర్లు ఉండటంతో 2014 సీజన్లో చాహల్‌కు ఆడే అవకాశం పెద్దగా రాలేదు. జట్టులో ఉండి తుది 11 మందిలో లేకపోవడంకంటే ఇబ్బందికరమైన పరిస్థితి మరోటి ఉండదనే చెప్పాలి. కానీ నిరీక్షణ అతడికి కొత్తేమీ కాదు. 2009 నుంచీ హరియాణా జట్టుకి ఆడుతున్నప్పటికీ ఇప్పటివరకూ కేవలం 27 ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌లే ఆడాడు. కారణం హరియాణా కెప్టెన్‌ అమిత్‌ మిశ్రా, మరో సీనియర్‌ జయంత్‌ యాదవ్‌ కూడా లెగ్‌ స్పిన్నర్లు. దాంతో తుది జట్టులో అవకాశం వచ్చేది కాదు. 2015లో జరిగిన ఐపీఎల్‌ సీజన్‌-8 మొత్తం ఆడే అవకాశం చాహల్‌కి వచ్చింది. ఆ సీజన్లో అద్భుతంగా రాణించి 23 వికెట్లు పడగొట్టాడు. కానీ టీమ్‌ ఇండియాలో చోటు దక్కలేదు. కారణం అతడి టాలెంట్‌ని గుర్తించకపోవడంకాదు, అప్పటికే జట్టులో ఉన్న స్పిన్నర్లు అశ్విన్‌, జడేజా, అమిత్‌ మిశ్రా స్థిరంగా రాణిస్తుండటం. తర్వాత 2016 ఐపీఎల్‌లో 21 వికెట్లు తీసి ఆ సీజన్లో అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా నిలిచాడు. ఈ సీజన్లో ఆ జట్టు ఫైనల్స్‌కూ వెళ్లింది. కానీ కోహ్లీ, డివిలియర్స్‌ బ్యాటింగ్‌ విన్యాసాల మధ్యన చాహల్‌ బౌలింగ్‌కి రావాల్సినంత గుర్తింపు రాలేదు. కానీ సెలెక్టర్లు గుర్తించి జింబాబ్వే పర్యటనకు ఎంపికచేశారు.

టీమ్‌ ఇండియా పిలుపు
2016 జూన్లో సీనియర్లకి విశ్రాంతి ఇచ్చి జింబాబ్వే పర్యటనకు కొత్త కుర్రాళ్లని ఎంపికచేసినపుడు చాహల్‌కి మొదటిసారి టీం ఇండియాలో చోటు దక్కింది. రెండో మ్యాచ్‌లో మూడు వికెట్లు తీసి ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అవార్డు అందుకున్నాడు. మూడు వన్డేల్లో ఆరు వికెట్లు తీశాడు. టీ20ల్లోనూ ఆ జట్టుపైనే అరంగేట్రం చేశాడు. ధోనీ కెప్టెన్సీలో ఆడటం ఎలా ఉంటుందోనని మొదట భయపడ్డాడట చాహల్‌. ‘అతణ్ని కలవక ముందు ఎలా ఉంటాడోనన్న భయం ఉండేది. కానీ ధోనీ చాలా సింపుల్‌ మనిషి. అతణ్ని ఏ విషయమైనా అడగొచ్చు. ఆ పర్యటన తర్వాత నుంచీ మైదానంలో ధోనీని ఒక స్నేహితుడిలా చూస్తాను’ అంటాడు చాహల్‌. జింబాబ్వే పర్యటన తర్వాత కూడా చాహల్‌కు ఎక్కువగా అవకాశాలు రాలేదు. కానీ 2017 మాత్రం అతడి కెరీర్‌ను మార్చింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇంగ్లాండ్‌తో జరిగిన టీ20లో నాలుగు ఓవర్లలో 25 పరుగులిచ్చి ఆరు వికెట్లు తీశాడు. మరో ఆటగాడికైతే ఆ ప్రదర్శనతో కనీసం ఏడాదిపాటు జట్టులో కొనసాగే అవకాశం వస్తుంది. కానీ మళ్లీ సీనియర్‌ ఆటగాళ్లు వచ్చేశారు. దాంతో తర్వాత రెండు సిరీస్‌లలో చాహల్‌కు స్థానం దొరకలేదు. ఆ సమయంలో ఇండియా ‘ఎ’ తరఫున దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లాడు. అఫ్ఘనిస్థాన్‌ కూడా ఆడిన ఆ ముక్కోణపు టోర్నీలో నాలుగు మ్యాచుల్లో ఆరు వికెట్లు తీశాడు. ముఖ్యంగా పొదుపైన బౌలింగ్‌ చేసి కోచ్‌ ద్రవిడ్‌ ప్రశంసలు పొందాడు. మన జట్టు ఆ కప్‌ గెల్చుకుంది కూడా. ఆ టూర్‌ తనలో ఆత్మస్థైర్యాన్ని పెంచిందని చెప్పే చాహల్‌... తర్వాత శ్రీలంకలో జరిగిన వన్డే సిరీస్‌కు ఎంపికయ్యాడు. ‘ఐపీఎల్‌-10లో నాతోపాటు మా జట్టు ప్రదర్శన ఏమంత బాగాలేదు. కానీ నా బౌలింగ్‌పైన నాకు విశ్వాసం ఉంది. అందుకే ‘ఇండియా ఎ’లో చోటుకోసం చాలా కష్టపడ్డాను. అక్కడ మంచి ప్రదర్శన ఇస్తే టీమ్‌ ఇండియాలో చోటు దొరుకుతుందని నాకు తెలుసు’ అని చెప్పే చాహల్‌, శ్రీలంక పర్యటన అనంతరం ఆటగాళ్లందరూ ఇళ్లకు చేరుకుంటే, తను మాత్రం బెంగళూరులోని ‘నేషనల్‌ క్రికెట్‌ అకాడమీ’కి చేరుకున్నాడు. ఆ విషయాన్నే అడిగితే, ‘శిక్షణకు విరామం ఉండకూడదన్నది నా ఉద్దేశం. ముఖ్యంగా స్పిన్‌ బౌలింగ్‌కి జట్టులో చాలా పోటీ ఉంది. వెనకపడితే వెనకే. అందుకే ఎన్‌సీఏలో శిక్షణకు వెళ్లి నరేంద్ర హిర్వాణీ దగ్గర సూచనలు తీసుకున్నాను’ అంటాడు. ఆ తర్వాత నుంచీ భారత్‌ ఆడుతున్న ప్రతి వన్డే, టీ20 సిరీస్‌లోనూ చాహల్‌ ఉంటున్నాడు

కోహ్లీ చలవే
‘ఒకప్పుడు నా గురించి కొందరికే తెలుసు. ఇప్పుడు దేశమంతా నా గురించి మాట్లాడుతోంది. నేను ఆర్‌సీబీలో చేరాక విరాట్‌ ఇచ్చిన ప్రోత్సాహంవల్లనే ఈ మార్పు వచ్చింది’ అంటాడు చాహల్‌. ఐపీఎల్‌లో రెండు వరుస సీజన్లలో జట్టు నుంచి అత్యధిక వికెట్లు తీసి కోహ్లీకి నమ్మదగిన బంటుగా నిలిచాడు. 2019 ప్రపంచకప్‌ ఇంగ్లాండ్‌లో జరగనుంది. అక్కడి ఫ్లాట్‌ పిచ్‌లమీద ఫింగర్‌ స్పిన్నర్లకంటే రిస్ట్‌ స్పిన్నర్లు రాణిస్తారన్న ఉద్దేశంతో రిస్ట్‌ స్పిన్నర్ల కోసం జట్టు వెతుకుతోంది. ఆ దశలో చాహల్‌ దొరకడం టీమ్‌ ఇండియాకి కలిసొచ్చే అంశం. ‘బ్యాట్స్‌మెన్‌ భారీ షాట్‌ కొట్టినా కూడా. అటాకింగ్‌ చేయడానికి భయపడను. కోహ్లీది కూడా అదే స్వభావం. సిక్స్‌ కొట్టినా ‘డోంట్‌ వర్రీ, బీ కామ్‌’ అని చెబుతాడు. టీ20ల్లో నాలుగు ఓవర్లలో 30 పరుగులు ఇచ్చినా కీలకమైనవి మూడు వికెట్లయినా తీయాలనేది మా ప్లాన్‌’ అంటాడు చాహల్‌. ‘ఐపీఎల్‌లో కూడా చాహల్‌ని వికెట్‌లు తీసేందుకు ఉపయోగించేవాణ్ని. మొదటి ఓవర్‌ వేయమన్నా, మధ్య ఓవర్లలో బౌలింగ్‌ చేయమన్నా ఎప్పుడూ నో చెప్పడు. అలాంటి ఆటగాడు ఉండటం జట్టుకి చాలా అవసరం’ అంటాడు కోహ్లీ.

చెస్‌ ప్లస్‌ క్రికెట్‌
చదరంగం ఆటగాడు ఎప్పుడూ ప్రత్యర్థికంటే ఒక ఎత్తు ముందుండాలి. అదే శైలిని క్రికెట్‌లోనూ కొనసాగిస్తున్నాడు చాహల్‌. ‘నాలోని చదరంగం ఆటగాడు ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ని ఔట్‌ చేయడానికి మంచి ప్రణాళికలు వేసేలా చేస్తాడు. ఎప్పుడూ బ్యాట్స్‌మెన్‌కంటే ఒక ఎత్తు ముందు వేసేందుకు ప్రయత్నిస్తాను. బ్యాట్స్‌మెన్‌ ఎదురుదాడికి దిగితే, నేను కాస్త తగ్గుతా. చదరంగం ఆడిన నేపథ్యంవల్ల సహనం బాగా అబ్బింది. క్రికెటర్‌కీ అది చాలా అవసరం. ముఖ్యంగా టీ20 బౌలర్‌కి’ అని చెప్పే చాహల్‌ ఇప్పటికీ వీలున్నపుడు ఆన్‌లైన్లో చెస్‌ ఆడుతుంటాడు. చదరంగ వ్యూహాలను క్రికెట్‌ మైదానంలోనూ అవలంబించే చాహల్‌ భారత క్రికెట్‌లో మరింత ఎత్తుకు వెళ్తాడనడంలో సందేహం లేదు!

ఇంకొంత  

సిగ్గరి... ‘నేను ఫ్రెండ్స్‌ మధ్య ఉంటే ఎక్కువగానే మాట్లాడతాను. కానీ అమ్మాయిల్ని చూస్తే మాత్రం నోట మాట రాదు. నాకు అమ్మాయిలంటే సిగ్గు. కొన్నాళ్ల పరిచయం తర్వాత మాత్రం మాట్లాడగలను’ అని చెప్పే చాహల్‌ ఇప్పటికే ఓ అమ్మాయితో డేటింగ్‌లో ఉన్నాడని వినికిడి.
* పార్టీలన్నా, డీజేలన్నా ముందుంటాడు.
* సునీతాదేవీ, కేకే చాహల్‌ల మూడో సంతానం యుజ్వేంద్ర. యజ్జూకి ఇద్దరు అక్కలున్నారు. యజ్జూ సంపాదనతో దిల్లీ, గుడ్‌గావ్‌లలో రెండు ఇళ్లు కొన్నప్పటికీ అతడి కుటుంబం జీంద్‌లోని తమ పాత ఇంట్లోనే ఉంటోంది.
* ఫుట్‌బాల్‌ అభిమాని కూడా, రియల్‌ మాడ్రిడ్‌ ఫుట్‌బాల్‌ క్లబ్‌ ఫ్యాన్‌.
* చెస్‌లో విశ్వనాథన్‌ ఆనంద్‌ అభిమాని. క్రికెట్‌లో షాహిద్‌ అఫ్రిది, షేన్‌వార్న్‌ల బౌలింగ్‌ని బాగా పరిశీలిస్తూ నేర్చుకుంటానంటాడు. ముఖ్యంగా వార్న్‌ తన ఆదర్శ క్రికెటర్‌ అని చెబుతాడు. ఐపీఎల్‌ సమయంలో వార్న్‌ను కలిసి ఆటోగ్రాఫ్‌తోపాటు సలహాలూ తీసుకున్నాడు.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.