close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
సినిమాల కోసం 70 కిలోలు తగ్గాను!

సినిమాల కోసం 70 కిలోలు తగ్గాను!

‘చిరంజీవి ఇంటి నుంచి వచ్చాడు కదా’ అని మొదటి అవకాశం అతడిని వెతుక్కుంటూ రాలేదు. ‘వెనక మెగా కుటుంబం ఉంది కదా’ అని అతని ప్రయాణం నల్లేరుపై నడకలా సాగలేదు. ఓ కొత్త కుర్రాడు ఎన్ని ఢక్కామొక్కీలు తినాలో అన్నీ తిన్నాడు. తనకు తానే రాటు దేలాడు. పరాజయాల్ని చిరునవ్వుతో స్వీకరించాడు. ఇప్పుడు ‘సుప్రీమ్‌’ హీరో అయ్యాడు...  ఆ కుర్రాడే సాయిధరమ్‌ తేజ్‌. ‘ఇంటిలిజెంట్‌’ అనిపించుకున్న ఈ మెగా హీరో చెప్పుకొచ్చిన సంగతులివి!
నువ్వు నాకు నచ్చావ్‌... సినిమా గుర్తుంది కదా? అందులో వెంకటేష్‌ని ‘నువ్వు ఏమవ్వాలనుకుంటున్నావ్‌’ అని అడిగితే ‘ఐఏఎస్‌.. ఐపీఎస్‌..’ అంటూ ఏవేవో బిల్డప్పులు ఇస్తాడు. నేనూ అదే టైపు. నా ఆలోచనలన్నీ అలానే ఉండేవి. నాన్న ప్రసాద్‌ డాక్టర్‌. అందుకే మొదట్లో డాక్టర్‌ అవ్వాలనుకునేవాణ్ణి. తర్వాత శాస్త్రవేత్త, సైనికుడు, వ్యాపారవేత్త... ఇలా ఏ వృత్తినీ వదల్లేదు. చివరికి ‘ఇవన్నీ మనకు సెట్‌ కావులే’ అనుకుని సినిమాల్లోకి వచ్చేశా. ఇదంతా జరగడం వెనక చాలా కథ నడిచింది.

వెనుక బెంచీనే
నేను పుట్టింది చెన్నైలో. స్కూల్లో చేరకముందు వరకూ నెల్లూరులో పెరిగా. ఆ తరవాత ఏడో తరగతి వరకూ మద్రాస్‌లోనే. ఎనిమిదో తరగతికి హైదరాబాద్‌ వచ్చేశా. ఇక్కడే టెన్త్‌, ఇంటర్‌ ఆపైన డిగ్రీ, ఎంబీఏ పూర్తిచేశా. క్లాసులో ముందు కూర్చోవాలంటే అదో రకమైన ఫోబియా. వెనుక సీట్లో కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ, జోకులు వేసుకుంటూ గడిపేవాణ్ని. ఎన్ని చేసినా పరీక్షల్లో అరవై శాతం మార్కులైతే తెచ్చుకునేవాణ్ని. ఆటల్లో మాత్రం ముందుండేవాణ్ని. క్రికెట్‌, టెన్నిస్‌, టేబుల్‌ టెన్నిస్‌, వాలీబాల్‌, కబడ్డీ... ఇలా అన్నీ ఓ రౌండ్‌ వేసేశా. అమ్మ విజయదుర్గ క్లాసికల్‌ డాన్సర్‌. ఏడో తరగతి వరకూ నేనూ భరతనాట్యం క్లాసులకు వెళ్లేవాణ్ని. అలాగని స్టేజిషోలు ఎప్పుడూ ఇవ్వలేదు. కాలేజీలో ఒకట్రెండు సార్లు స్టేజీపై చిరంజీవిగారి పాటలకు స్టెప్పులు వేశా. నాకు అమ్మ దగ్గర చనువెక్కువ. ఎంత అంటే... ‘అమ్మా... నేనో అమ్మాయిని ప్రేమిస్తున్నా’ అని చెప్పేంత. ‘మొన్న ఒకరు.. ఈరోజు ఇంకొకరా? ముందు నువ్వు స్థిరంగా ఉండు’ అనేది. ఏదైనా సబ్జెక్ట్‌లో తప్పానని చెబితే, ‘సర్లే... ఈసారైనా బాగా చదువు’ అని ప్రోత్సహించేది. నా మౌనాన్ని కూడా కనిపెట్టేది. అందుకే అమ్మకి అబద్ధాలు చెప్పేవాణ్ని కాదు. చదువుకునే రోజుల్లో ‘నేను చిరంజీవి మేనల్లుడిని’ అని ఎప్పుడూ ఎవరితోనూ చెప్పుకునేవాణ్ని కాదు. నా స్నేహితులు కూడా నన్ను తేజ్‌లానే చూసేవారు. కొంతమంది మాత్రం ఆటపట్టించడానికి మావయ్య గురించి నా దగ్గర ఏవేవో మాట్లాడేవారు. సరదాకి అన్నా పోట్లాటకు వెళ్లేవాణ్ని. ఇప్పటికీ మావయ్యలను ఎవరైనా ఏమైనా అంటే సహించలేను.కాకపోతే అంత తీవ్రంగా స్పందించను. ‘ఎవరి ఇష్టం వాళ్లది’ అనుకుంటా.

వేసవి సరదాలు
స్నేహానికి ప్రాణం ఇస్తా. వాళ్లే నాలోకంగా బతుకుతా. సావన్‌, దినేష్‌, ఫణి.. నా చిన్ననాటి మిత్రులు. ముగ్గురూ బాగా స్థిరపడ్డారు. ఇక నా ప్రాణ స్నేహితుడెవరంటే నవీన్‌ పేరు చెబుతా. నరేష్‌ గారి అబ్బాయి. చిన్నప్పట్నుంచీ దోస్తులం. మా ఇద్దరి మధ్య ఎలాంటి దాపరికాలూ ఉండవు. సంగీత దర్శకుడు తమన్‌ నాకు ఓసారి క్రికెట్‌ గ్రౌండ్‌లో పరిచయం అయ్యాడు. ఆ తరవాత మేమిద్దరం కలిసి సినిమాలు చేశాం, చేస్తున్నాం, చేస్తాం. చరణ్‌, బన్నీ, వరుణ్‌ ఇంచుమించుగా ఒకే వయసువాళ్లం. కాబట్టి మేమంతా స్నేహితుల్లా కలిసిపోతాం. చిన్నప్పుడైతే వేసవి వచ్చిందంటే అందరం ఒకే దగ్గర ఉండేవాళ్లం. పెద్ద మావయ్య సినిమాల షూటింగ్‌ ఎక్కడ జరిగినా, మమ్మల్నందరినీ పిలిపించుకునేవారు. సెట్‌లో కాస్త గ్యాప్‌ దొరికినా మాతో ఆడుకునేవారు. మావయ్య సెట్లో డాన్స్‌ చేస్తుంటే మేం బయట ఆ స్టెప్పులు వేయడానికి ట్రై చేసేవాళ్లం. మావయ్యల సినిమాని రిలీజ్‌ రోజు చూసింది చాలా తక్కువ. అప్పట్లో సినిమా ఆలోచనలు పెద్దగా ఉండేవి కాదు. ‘మావయ్య సినిమా బాగుందట. వెళ్దామా’ అని ఎవరైనా అడిగితే అప్పుడు వెళ్లేవాణ్ని. నేను పెద్దగా ఖర్చు చేసే రకం కాదు. ఇంటర్‌ వరకూ నా పాకెట్‌ మనీ వంద రూపాయలే. ఆ తరవాత కూడా ఇంట్లో వాళ్ల దగ్గర్నుంచి తీసుకునేవాణ్ని కాదు. డిగ్రీలో చిన్న చిన్న వ్యాపారాలు చేసేవాణ్ని. ఓసారి దీపావళికి బాణసంచా అమ్మాను. దాంతో బాగా లాభాలొచ్చాయి. రెండేళ్లపాటు ఇంట్లో పాకెట్‌ మనీ అడక్కుండా గడిపేశా.

ఉద్యోగం రెండ్రోజులే...
ఎంబీఏ తర్వాత ‘ఉద్యోగం చేయగలనా లేదా’ అనే సందేహం ఉండేది. ఆఫీసు వాతావరణం అలవాటు కావడానికి స్నేహితుడి కంపెనీలో రెండు రోజులు పనిచేశా. మూడో రోజు జ్వరం వచ్చేసింది. ఉద్యోగాలు నావల్ల కాదనిపించింది. అప్పుడు సినిమాపై దృష్టి పడింది. చిన్నప్పట్నుంచీ ఎలాగూ ఐఏఎస్‌, ఐపీఎస్‌ అనుకునేవాణ్ని కదా... ఆ పాత్రలన్నీ తెరపై వేసుకోవచ్చనిపించింది. వెంటనే అమ్మకి విషయం చెప్పా. ‘నువ్వు ఏదైనా చెయ్‌.. కానీ మావయ్యల పరువు తీసే పని మాత్రం చేయకు’ అంటూ కరాఖండీగా చెప్పేసింది. ముగ్గురు మావయ్యల దగ్గరకూ వెళ్లి నా మనసులోని మాట చెప్పా. ‘గుడ్‌.. క్యారీ ఆన్‌’ అన్నారు. అప్పట్నుంచీ నా అసలు కష్టం మొదలైంది. ఎందుకంటే సరిగ్గా ఆ సమయానికి 134 కిలోలు ఉన్నా. అద్దంలో చూసుకుంటే.. ‘నువ్వేంటి? సినిమాలేంటి?’ అని నిలదీస్తున్నట్టే ఉండేది ఆ రూపం. నిజానికి చిన్నపుడు సన్నగానే ఉండేవాణ్ని. ఏడో తరగతిలో ఉండగా బైక్‌మీద వెళ్తున్నప్పుడు అనుకోకుండా కాలు చక్రాల మధ్య నలిగిపోయింది. ఆరు నెలలు మంచం దిగలేదు. దాంతో బాగా ఒళ్లు వచ్చేసింది. అది వయసుతోపాటూ పెరుగుతూ వచ్చింది.

నాకెప్పుడూ హీరో అవుదామన్న ఆశ లేదు. ఏదో చిన్న చిన్న వేషాలేసుకున్నా ఫర్వాలేదు అనుకునేవాణ్ని. దేనికైనా అర్జెంటుగా ఒళ్లు తగ్గించాలని ఫిక్సయ్యా. కేబీఆర్‌ పార్క్‌ చుట్టూ రోజూ ఉదయం రెండు రౌండ్లు, సాయింత్రం రెండు రౌండ్లు పరుగెత్తేవాణ్ని. నిజానికి నా బరువుకి అలా పరుగెత్తడమంటే సామాన్యమైన విషయం కాదు. కొంతమంది స్నేహితులు ‘బేరియాట్రిక్‌ సర్జరీ చేసుకుని బరువు తగ్గు..’ అని సలహా ఇచ్చారు. కానీ నేను మాత్రం దాన్ని సవాల్‌గా తీసుకున్నా. రెండేళ్లపాటు ఓ మహా యజ్ఞమే నడిచింది. 134 కేజీలనుంచి దాదాపు 70 కేజీలు తగ్గాను. ఆ తరవాత మరీ తగ్గాననిపించి, మరో అయిదు కిలోలు పెరిగా. మొత్తానికి తీరైన శరీరాకృతిని సంపాదించుకున్నా.

రెండో చాప్టర్‌ మొదలైంది...
మావయ్యల పేర్లు చెప్పుకుని అవకాశాలు సంపాదించుకోవడం నాకు ఇష్టం లేదు. అందుకే ఫొటోలు పట్టుకుని ఆఫీసుల చుట్టూ తిరిగా. ఆడిషన్స్‌లో పాల్గొన్నా. ఓ చిన్న సినిమాలో నన్ను హీరోగా తీసుకున్నారు. కానీ సినిమా మొదలయ్యే సమయానికి నా స్థానంలో మరో హీరో వచ్చాడు. నా టాలెంట్‌ చూపించుకోవడానికి నవీన్‌, నేనూ కలిసి ఓ షార్ట్‌ ఫిల్మ్‌ కూడా తీశాం. అది మరీ ఘోరంగా వచ్చింది. తర్వాత పవన్‌ మావయ్య సలహాతో వైజాగ్‌ వెళ్లి సత్యానంద్‌ గారి దగ్గర మూడు నెలలపాటు నటనలో శిక్షణ తీసుకున్నా. ఆపైన ముంబై వెళ్లి అక్కడా ఓ యాక్టింగ్‌ స్కూల్లో ట్రైనింగ్‌ పూర్తి చేశా. ఓ వైపు డాన్సులు, జిమ్నాస్టిక్స్‌ ఇలా ఒక్కొక్కటీ నేర్చుకుంటూ మరోవైపు నా ప్రయత్నాలు నేను చేసుకుంటున్నా. ఓరోజు నేనూ, మంచు మనోజ్‌ క్రికెట్‌ ఆడుకుంటుంటే, వైవిఎస్‌ చౌదరి నన్ను చూశారు. ‘నా సినిమాలో హీరోగా చేస్తావా’ అని అడిగారు. అప్పటికి నేనెవరో ఆయనకు తెలీదు. చివరికి పవన్‌ మావయ్యతో మాట్లాడి ‘రేయ్‌’ సినిమా పట్టాలెక్కించారు.

‘రేయ్‌’ ఓ ప్రహసనం. 2010లో సినిమాకి కొబ్బరికాయ కొట్టారు. 2011లో చిత్రీకరణ మొదలై, 2012లో అర్ధాంతరంగా ఆగిపోయింది. అదే ఏడాది ‘పిల్లా నువ్వు లేని జీవితం’లో నటించే అవకాశం వచ్చింది. ‘పోనీలే..‘రేయ్‌’ ఆగినా ఇది ఉంది కదా’ అని సంతోషపడ్డాను. ఆ సినిమా పూర్తయిపోతోంది అనుకునేలోగా అందులోని కీలక పాత్ర పోషించిన శ్రీహరి గారు చనిపోయారు. రెండు సినిమాలూ ఆగిపోయేసరికి ‘నాకే ఎందుకిలా జరుగుతోంది? నాదేమైనా ఐరెన్‌లెగ్గా’ అని నాపై నాకే అనుమానం వేసింది. చివరికి శ్రీహరిగారిపై చిత్రీకరించిన సన్నివేశాలన్నీ జగపతిబాబుగారితో రీషూట్‌ చేశారు. అలా ‘పిల్లా నువ్వు లేని జీవితం’ నా మొదటి సినిమాగా 2014లో విడుదలైంది. ఆ తరవాత ‘సుబ్రహ్మణ్యం ఫర్‌ సేల్‌’, ‘సుప్రీమ్‌’.. ఇలా మంచి సినిమాలే పడ్డాయి. కొన్ని పరాజయాలూ వెక్కిరించాయి. అయితే ఫెయిల్యూర్‌ని నేను చూసే కోణం వేరు. సాధారణంగా ఓటమి ఎప్పుడూ ఎలా
గెలవాలో నేర్పిస్తూ ఉంటుంది.

ఈ ప్రయాణం మాత్రం చాలా అనుభవాల్ని నేర్పింది. కృష్ణవంశీ, వినాయక్‌లాంటి పెద్ద దర్శకులతో పనిచేసే అవకాశాన్ని ఇచ్చింది. నాకు పెద్ద లక్ష్యాలేం లేవు. తమ్ముడి చదువు బాధ్యతని తీసుకోవాలి, అమ్మని బాగా చూసుకోవాలి... ప్రస్తుతానికి వీటిపైనే నా దృష్టి. సినిమా నటుడు కావడం కొందరికే దక్కే అవకాశం. దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. మనల్ని నమ్మి థియేటర్‌కి వస్తున్న వాళ్లకి కావల్సిన వినోదాన్ని అందించాలంతే.

మొదటి చెక్‌ మావయ్యకిచ్చా

మావయ్యలు లేకపోతే నేను లేను. ఇంటర్‌ వరకూ నాగబాబు మావయ్య చాలా శ్రద్ధ తీసుకునే వారు. బాగా చిన్నపుడు కథల పుస్తకాలు కూడా కొనిచ్చేవారు. ‘అది నేర్చుకో.. ఇది నేర్చుకో’ అని ప్రోత్సహించేవారు. డిగ్రీ సమయంలో పెద్ద మావయ్య ఏ కోర్సు చదివితే మంచిదో సలహాలు ఇచ్చేవారు. చిన మావయ్య సినిమా కెరీర్‌కి ఉపయోగపడే సలహాలిచ్చేవారు.
* నా తొలి పారితోషికం ‘రేయ్‌’కి అందుకున్నా. మొదటి చెక్‌ మాత్రం ‘పిల్లా నువ్వు లేని జీవితం’కి వచ్చింది. చిరంజీవిగారి పుట్టిన రోజున ఆ చెక్‌ తీసుకెళ్లి ఆయన చేతుల్లో పెట్టా. నాకు ఆయన దేవుడు అనుకుని దక్షిణగా ఆ చెక్‌ ఇచ్చా.
* సందీప్‌ కిషన్‌, రెజీనా, రకుల్‌... వీళ్లంతా సన్నిహితులే. సినిమా ఫ్రెండ్స్‌ కాకుండా బయట మాధురి, హరిణి అనే ఇద్దరు ఫ్రెండ్స్‌ ఉన్నారు. నన్నో స్నేహితుడిలా, సోదరుడిలా, అంతకంటే ఎక్కువగా చూసుకుంటారు.
* నేను భోజనప్రియుణ్ని. ముద్దపప్పూ, ఆవకాయా, అప్పడం... నా ఫేవరెట్‌. రోజూ అవే పెట్టినా  తింటా. నాకు గరిటె తిప్పడం కూడా తెలుసు.
* పుస్తకాలు బాగా చదువుతా. ‘మహా భారతం’ నాలుగు వెర్షన్లు చదివేశా. ‘రామాయణం’పైన ఎలాంటి పుస్తకం వచ్చినా చదువుతా.  పవన్‌ మావయ్య ఎక్కువగా ఫిలాసఫీకి సంబంధించిన పుస్తకాలు చదవమంటారు. హిట్లర్‌, అబ్దుల్‌ కలాం ఆత్మకథల్ని చదవమన్నారు.
* ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ నా ఫేవరెట్‌ సినిమా. ‘చంటబ్బాయి’లో మావయ్య కామెడీ టైమింగ్‌ బాగా నచ్చుతుంది. అలాంటి పాత్ర ఒకటి చేయాలని ఉంది.
* ‘ఆపద్బాంధవుడు’లో మావయ్యకి షాక్‌ ట్రీట్‌మెంట్‌ ఇచ్చే సన్నివేశం ఉంటుంది. అది చూసి నిజంగానే అలా చేస్తున్నారేమో అనుకుని థియేటర్లోనే ఏడ్చేశా.
* రవితేజ, ప్రభాస్‌ అంటే చాలా ఇష్టం. ఎన్టీఆర్‌ డాన్సులు బాగుంటాయి. కథానాయికల్లో సమంత అభిమానిని.

- అన్వర్‌
ఫొటోలు: మధు

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.