close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
లారా ఫోన్‌ చేశాడు..!

లారా ఫోన్‌ చేశాడు..!

సినీ రంగుల ప్రపంచంలో ఒక్క ఛాన్స్‌... ఒకే ఒక్క ఛాన్స్‌ ప్లీజ్‌... అంటూ ఒక్క అవకాశం కోసం ఎంతమందిని అడగాలో, ఎన్ని అవమానాలు భరించాలో, ఎంత జీవితాన్ని కోల్పోవాలో బయటివాళ్లు ఏ మాత్రం ఊహించలేరు. ‘అ!’ సినిమాతో ఆ అవకాశాన్ని కొట్టేయకముందు ప్రశాంత్‌ వర్మ అలాంటి అనుభవాల్నే ఎదుర్కొన్నాడు. షార్ట్‌ఫిల్ములతో సరదాగా మొదలుపెట్టిన తన కెరీర్‌కు ‘అ!’ సినిమా ఓ కొత్త బాట వేసిందనడంలో ఎలాంటి సందేహంలేదు. అయితే ఈ ప్రయాణంలో ప్రశాంత్‌ పడ్డ కష్టమెంతో, ఆ విజయం విలువెంతో, దాని వెనకున్న సవాళ్లేమిటో తన మాటల్లోనే.. నలో చాలామంది తమ ఆసక్తిని బట్టి కెరీర్‌లో అడుగులు వేస్తారు. కానీ నా విషయంలో ఇది పూర్తిగా భిన్నం. ఎందుకంటే మ్యూజిక్‌ డైరెక్టర్‌ శ్రవణ్‌ (‘మళ్లీ రావే’ ఫేమ్‌) తమ్ముడు ఇంజినీరింగ్‌లో నా క్లాస్‌మేట్‌, ఫ్రెండ్‌ కూడా. అలా శ్రవణ్‌ కూడా నాకు ఫ్రెండ్‌ అయ్యాడు. తన దగ్గరున్న ఆలోచనలతో కొన్ని మ్యూజిక్‌ ఆల్బమ్స్‌ రూపొందించాలనుకున్నాడు. శ్రవణ్‌కి సహాయం చేస్తూ నేనూ వాటిపైన ఆసక్తి పెంచుకున్నా. ఆల్బమ్స్‌ తయారుచేయడానికి కెమెరా, ఎడిటింగ్‌, స్క్రిప్ట్‌... ఇలా అనేక విభాగాల్లో స్టాఫ్‌ అవసరమయ్యే వారు. వారందరినీ పెట్టుకునేందుకు తగినంత డబ్బు లేకపోవడంతో కథలు రాయడం నుంచి ఎడిటింగ్‌ వరకు అన్ని విభాగాల్లో ఆన్‌లైన్‌ శిక్షణ తీసుకుని నేనే సొంతంగా అవన్నీ చేయడం ప్రారంభించా. క్రమంగా వాటిమీద పట్టు సాధించా. స్నేహితుడి కోసం సరదాగా చేసిన ఈ చిన్న చిన్న ప్రయత్నాలే ఇప్పుడు నాకు పెద్ద విజయాన్ని తెచ్చిపెట్టాయి.
మొదటి అడుగులు...
షార్ట్‌ఫిల్ములతో మొదలైన నా కెరీర్‌ ఎన్నో మలుపులు తిరుగుతూ చివరికి నేనో పూర్తి స్థాయి దర్శకుడిగా మారేలా చేసింది. చిన్నప్పటి నుంచీ సినిమాలు చూస్తూనే పెరిగినా ఈ పరిశ్రమలోకి రావాలని మాత్రం ఎప్పుడూ అనుకోలేదు. అయితే మ్యూజిక్‌ ఆల్బమ్‌లకు స్క్రిప్ట్‌ రాసే క్రమంలో నేను చూసిన, నా మనసుకు హత్తుకున్న కొన్ని అంశాలకు సంబంధించి షార్ట్‌ఫిల్ములు తీయాలన్న ఆలోచన మొదలైంది. ఏది చేసినా రొటీన్‌కి భిన్నంగా చేయడం నాకు అలవాటు. అందుకే ‘డైలాగ్‌ ఇన్‌ ది డార్క్‌’, ‘సైలెంట్‌ మెలొడీ’ లాంటి విభిన్న కథలతో షార్ట్‌ ఫిల్ములు తీశా. వాటికి చాలా మంచి స్పందన వచ్చింది. అదే సమయంలో యాడ్స్‌ విల్లే పేరుతో కొన్ని యాడ్‌ ఫిల్ములు కూడా తీశా. మొదటి నుంచీ నేను చేసే ప్రతి పనిలోనూ అందరినీ ‘అ!’ అనిపించాలనుకునేవాడిని. అందుకే అలాంటి కథనే సిద్ధం చేసుకుని వెండితెర మీద నా అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకున్నా.

పనైపోయిందనుకున్నా...
నేను చేసిన షార్ట్‌ఫిల్ములను ఇండస్ట్రీలో చాలా మందికి చూపించా. అందరూ మెచ్చుకున్నారు కానీ సినిమా అవకాశాలు మాత్రం ఎవ్వరూ ఇవ్వలేదు. ప్రయత్నాలయితే ఆపకుండా చేస్తూనే ఉన్నా. చూస్తుండగానే ఎనిమిదేళ్లు గడిచిపోయాయి. ఈ సమయంలోనే ఎన్నో అవమానాలను ఎదుర్కోవాల్సి వచ్చింది. సినిమా కథలతో నిర్మాతల దగ్గరకు వెళ్లడం, వారి నుంచి పిలుపు రాకపోవడం. మరికొన్ని సందర్భాల్లో అన్నీ ఓకే అవ్వడం చివరికి చిన్న చిన్న కారణాలతో సినిమా ఆగిపోవడం... ఇలా ఒకటా రెండా, సుమారు నలభై సినిమాలు మొదలైనట్లే అనిపించినా కొబ్బరికాయ కొట్టేంతవరకూ కూడా రాకుండా ఆగిపోయాయి. డైరెక్టుగా డైరెక్టరైపోదామనుకున్న నా ఆశలకు నీళ్లు వదిలేశా. అసిస్టెంట్‌ డైరెక్టరుగా అనుభవం సంపాదించి, అప్పుడు దర్శకత్వం వైపు వద్దామని ఒక డైరెక్టరు దగ్గర చేరా. లొకేషన్లు చూడమని చెప్పడంతో రెండు రోజులపాటు బైక్‌మీద తిరిగిన చోట తిరగకుండా తిరిగా. తీరా మూడో రోజు ఆయన దగ్గరకు వెళ్లేసరికి మొహంమీదే నువ్విక రావద్దని చెప్పి పంపేశాడు. అయినా బాధపడకుండా ఆవకాశం కోసం ప్రయత్నిస్తూనే ఉన్నా. మరో డైరెక్టర్‌ అయితే ఏకంగా తన వ్యక్తిగత పనులు చేయమంటూ ఆర్డర్‌ వేశాడు. కన్నీళ్లు ఆగలేదు... వెంటనే సెట్లో ఎవరికీ చెప్పకుండా ఇంటికొచ్చేశా. ఇలా ఎన్నో అవమానాలూ, సంఘటనలూ నాలో మరింత కసిని పెంచాయి.
గుర్తించింది లారానే!
చిన్నప్పటి నుంచీ క్రికెట్‌ అంటే చాలా ఇష్టం. ఊళ్లో, కాలేజీలో చాలా మ్యాచ్‌లు ఆడా. అయితే, సినిమాలపైన పిచ్చి పెరిగిన తర్వాత ఒక్క మ్యాచ్‌ చూసేలోపు అయిదు సినిమాలు చూడొచ్చు. అందుకే అప్పటి నుంచి క్రికెట్‌ ఆడటమేకాదు, చూడటం కూడా మానేశా. అయితే, అనుకోకుండా ఒక రోజు వెస్టిండీస్‌ క్రికెట్‌ దిగ్గజం బ్రియన్‌ లారా నుంచి ఫోన్‌ వస్తే షాకయ్యా. నా షార్ట్‌ఫిల్మ్‌ చూశానని చెబుతూ మెచ్చుకుంటూ ఉంటే... ఆ విషయం అర్థమవడానికే చాలా సమయం పట్టింది. థ్యాంక్స్‌ చెప్పడానికి మాటలు తడబడ్డాయి. ఫోన్‌ చేసినందుకే ఆనందపడుతుంటే తనమీద ఒక షార్ట్‌ఫిల్మ్‌ తీయమని అడిగేసరికి ఎగిరిగంతేశా. వెంటనే ఫ్లైట్‌ ఎక్కేశా. స్క్రిప్ట్‌ కూడా ఫ్లైట్‌లోనే రాశా. ‘నాట్‌ అవుట్‌’ పేరుతో ఆయనమీద ఒక షార్ట్‌ఫిల్మ్‌ డైరెక్ట్‌ చేశా. ఆ ప్రయాణం ఎప్పటికీ మర్చిపోలేని మధురానుభూతి. ఒకసారి షూటింగ్‌ సమయంలోనే సరదాగా లారాతో క్రికెట్‌ ఆడా. లారాను మొదటి బంతికే బౌల్డ్‌ చేశా. ఆ విషయాన్ని ఎప్పుడు తలుచుకున్నా ఆశ్చర్యమేస్తుంది. లారాని అవుట్‌ చేసిన వీడియో, నేను బెస్ట్‌ డైరెక్టర్‌ అంటూ లారా స్వయంగా రాసి బహుమతిగా ఇచ్చిన బ్యాట్‌... ఇవే మా నాన్నగారికి అక్కడి నుంచి నేను తీసుకొచ్చిన కానుకలు.
అందరూ నిర్మాతలే...
నేను సినిమాను డైరెక్ట్‌ చేస్తే నన్ను డైరెక్ట్‌ చేసింది మాత్రం నానీనే. షార్ట్‌ఫిల్ముకి మంచి రెస్పాన్స్‌ వచ్చినా సినిమా అవకాశాలు రాలేదు. ఈ గ్యాప్‌లోనే చాలా యాడ్లు కూడా చేశా. టీవీల్లో, థియేటర్లలో కనిపించే చాలా సైబర్‌క్రైమ్‌ యాడ్లు నేను చేసినవే. అలాగే ఒక ఛానల్‌ ప్రమోషన్‌ కోసం తమన్నాతో కొన్ని యాడ్లు తీశా. అవన్నీ మంచి పేరునే తెచ్చిపెట్టినా దర్శకుడిగా మారే ఛాన్సుని ఇవ్వలేకపోయాయి. దాంతో తీవ్ర నిరాశకు గురయ్యా. పైగా ఊర్లో స్నేహితులూ తెలిసినవారందరి దగ్గరా నేను డైరెక్టర్‌ అయ్యి హిట్‌ సినిమా తీశాకే మళ్లీ వస్తానంటూ ఛాలెంజ్‌ కూడా చేసేశా. ఇక లాభం లేదనుకుని ఒక రోజు సినిమా స్క్రిప్ట్‌ రాయడం మొదలు పెట్టా. అలా రాసుకున్నదే ‘అ!’. నేనూ నా స్నేహితుడూ కలిసి ఏదో రకంగా ఈ సినిమా తీసేద్దామని నిర్ణయించుకున్నాం. కథలో భాగంగా చేపకు వాయిస్‌ ఓవర్‌ చెప్పమని అడగడానికి హీరో నానీ దగ్గరకు వెళ్లా. అదే నా సినిమాని మరో మలుపు తిప్పింది. వాయిస్‌ ఓవర్‌ ఇస్తే చాలు అని నానీని కలిస్తే... కథ విని డబ్బులు కూడా పెట్టి నిర్మాతగా ఉంటానన్నారు. అప్పటికే మిగతా పాత్రల కోసం నిత్యామేనన్‌, రవితేజ, ఈషా రెబ్బా, రెజీనాలను కలిసి నటించమని అడిగా. వారందరికీ ఆ కథ నచ్చింది. నటించడమే కాదు, అంతా నిర్మాతలుగా కూడా ఉంటామన్నారు. ఒక దశలో మొత్తం అందర్నీ నిర్మాతలుగా పెట్టి సినిమా తీసేద్దామనుకున్నా. కానీ నానీ సినిమా, దాని ప్రమోషన్‌, డిస్ట్రిబ్యూషన్‌ లాంటి అంశాలపై నన్ను డైరెక్ట్‌ చేయడంతో నానీయే నిర్మాతగా మొత్తం సినిమా రూపొందించా. సినిమాకి ‘అ!’ టైటిల్‌ కూడా క్షణాల్లో ఓకే అయ్యింది. నేను ‘అ!’ అనే టైటిల్‌ అనుకున్నా కానీ, నానీ ఏమంటారో అని భయపడ్డాను. కానీ, వినగానే చిటికెలో ‘బాగుంది ఇదే ఫిక్స్‌ చేసేద్దాం’ అనేశారు. నన్నో శత్రువులా...
నా వ్యక్తిగత విషయాలు చెప్పనేలేదు కదా. మాది పశ్చిమగోదావరి. పుట్టింది భీమవరం, పెరిగింది పాలకొల్లు. తొమ్మిదో తరగతి వరకూ పాలకొల్లులో, ఆ తర్వాత నుంచి ఇంజినీరింగ్‌ వరకూ హైదరాబాద్‌లో చదువుకున్నా. చదువేకాదు ఆటపాటల్లోనూ ఎప్పుడూ నేను ముందే. ఏ పోటీ పెట్టినా మొదటి బహుమతి నాదే. నేను రెండో తరగతి వరకూ ఇంగ్లిష్‌ మీడియంలో చదివా. కానీ మానాన్నగారికి ఉన్న భాషాభిమానంతో నన్ను పాలకొల్లులోని శిశుమందిర్‌లో చేర్పించారు. హైదరాబాద్‌ వచ్చాక ఇక్కడ కూడా శిశుమందిర్‌లోనే జాయిన్‌ చేశారు. నేను స్కూల్లో చేరిన కొత్తలో నా మాటా, యాసా చూసి అందరూ నవ్వేవాళ్లు. కాస్త ఇబ్బందిగా అనిపించేది. అయితే పరీక్షల్లో ఎప్పుడూ నేనే ఫస్టు. దాంతో టీచర్‌ పిల్లలందరితో ప్రశాంత్‌ని చూసి నేర్చుకోమనేవారు. ఫలితంగా వాళ్లందరికీ నేనో శత్రువునైపోయా. వాళ్లతో స్నేహం ఏర్పడటానికి నాకు చాలా సమయమే పట్టింది. ఆ స్కూల్లో చదివింది ఒక్క ఏడాదే అయినా పదేళ్లు చదివినవారికి ఇచ్చే బెస్ట్‌ స్టూడెంట్‌ అవార్డుకి నన్ను ఎంపిక చేయడం ఎప్పటికీ మర్చిపోలేని జ్ఞాపకం.

మరి కొంత...

నాన్న పెన్మెత్స నారాయణ రాజు సివిల్‌ కాంట్రాక్టర్‌. ఆయనకు తెలుగు భాషంటే విపరీతమైన ప్రేమ. అమ్మ పేరు కనకదుర్గ, ప్రభుత్వ పాఠశాలలో టీచర్‌. నేను ఉద్యోగంలో స్థిరపడితే తను ఉద్యోగం మానేయాలని అనుకుంది. కానీ ఇప్పటివరకూ అది జరగలేదు.
అదే నన్ను అన్నింటి కంటే ఎక్కువ బాధపెడుతున్న అంశం. కాకపోతే వీలైనంత త్వరలో ఆ రోజు వస్తుందన్నది నా నమ్మకం. ఇకపోతే చెల్లి సమీర. స్క్రిప్ట్‌ విల్‌ స్టూడియో పేరుతో విభిన్న సినిమా కథలు తయారుచేసే స్టూడియోను నిర్వహిస్తోంది.
* నాకు చిన్నప్పటి నుంచీ ఎంతో ఇష్టమైన హీరో చిరంజీవిగారు. ఆయన దగ్గరకు కథ చెప్పడానికి వెళ్లా. ‘బాగుంది... కథ చెప్పడంలో నాకు నచ్చిన అయిదుగురిలో నువ్వొకడివి’ అన్నారు మెచ్చుకోలుగా.
* నచ్చిన హీరోలంటే ఇప్పుడున్న ప్రతి ఒక్కరూ ఇష్టమే. కానీ, నాగచైతన్య, రెజీనాల వ్యక్తిత్వం ఎక్కువ నచ్చుతుంది.
* త్వరలో నానీ హీరోగా సినిమా తీయాలనుకుంటున్నా.
* ‘అ!’ సినిమాకి మంచి స్పందన రావడంతో నా ఛాలెంజ్‌ నెరవేరింది. పాలకొల్లు వెళ్లి స్నేహితులనూ ఊరి వాళ్లనూ కలవడం మర్చిపోలేని అనుభూతి.
* హైదరాబాద్‌ రాగానే బ్యాడ్మింటన్‌ నేర్చుకున్నా. అదే అకాడమీకి పీవీ సింధు కూడా వచ్చేది. ఒకవేళ నేను బ్యాడ్మింటన్‌లోనే కొనసాగి ఉండి ఉంటే సింధూ నాకు జూనియర్‌ తెలుసా.
* ఎప్పుడైనా ఒక సినిమా నుంచి ఇంకో సినిమా తీయకూడదనేది నేను నమ్ముతా. అందుకే సంఘటనలూ, సంఘర్షణలే సినిమాలుగా తీయాలని అనుకుంటున్నా.
* ఇప్పటివరకూ 50 యాడ్‌ ఫిల్ములూ, 10 మ్యూజిక్‌ వీడియోలూ, 5 షార్ట్‌ఫిల్ములూ తీశాను. భవిష్యత్తులో మంచి డైరెక్టర్‌ అనిపించుకోవడం ఒక్కటే లక్ష్యం.

- దంతుర్తి లక్ష్మీప్రసన్న

AWEteam

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.