close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
నా కోసం అందులో వెతక్కండి!

నా కోసం అందులో వెతక్కండి!

తమిళం నుంచి తెలుగులోకి ఏడాదిలో వందలాది సినిమాలు డబ్‌ అవుతూ ఉంటాయి కదా!2008లో వచ్చిన ‘రక్షకుడు’ (తమిళంలో ‘ధాం ధూం’) అలాంటి చిత్రమే. అందులో కథానాయిక కంగనా రనౌత్‌ స్నేహితురాలిగా నిమిషంపాటు కనిపిస్తుంది సాయిపల్లవి! డైలాగ్‌ కూడా లేని పాత్ర అది. అలాంటమ్మాయి తొమ్మిదేళ్లు తిరగకుండానే దక్షిణాది మొత్తాన్నీ ‘ఫిదా’ చేస్తుందంటే నమ్మగలమా! తన నవ్వూ, జీరగొంతూ స్టార్‌ హీరోలకి సమానమైన మార్కెట్‌ని సొంతం చేసుకున్నాయిప్పుడు. అవి రెండూ మనతో పంచుకున్న సంగతులివి..

‘సాయిపల్లవీ.. అదరగొట్టేశావ్‌ పో! అమెరికాలో ‘బాహుబలి’ తర్వాత ‘ఫిదాకే’ ఎక్కువ కలెక్షన్‌లట. తెలుగు ప్రాంతాల్లో నీ కొత్త సినిమా రిలీజుకి.. ఓ పెద్ద హీరో చిత్రానికి వచ్చినట్టు జనం థియేటర్‌ల ముందు మూగిపోయారట...’ నన్ను కలిసే విలేకర్లు అనేమాట ఇది. ఇక దర్శకులైతే ‘ఈ కథ నీకోసమే రాసుకున్నాం సాయిపల్లవీ! నువ్వు మాత్రమే చేయాలి’ అంటున్నారు. ‘చూస్తుండగానే పెద్ద స్టార్‌వి అయిపోయావే తల్లీ!’ అంటున్నారు స్నేహితులు. నిజానికి ఇవన్నీ నా బుర్రకెక్కట్లేదు. ఈ బాక్సాఫీసు నంబర్‌లూ, ట్రేడ్‌ కలెక్షన్‌ల కబుర్లు నాకు అర్థమయ్యే విషయాలు కావు. అసలు ఈ నంబర్‌లూ, లెక్కలకి భయపడే ఒకప్పుడు మ్యాథ్స్‌ క్లాసులు ఎగ్గొట్టినదాన్ని నేను. ఆ క్లాసులు తప్పించుకునే అవకాశం వస్తుందనే ఆశతోనే తొలిసారి కెమెరా ముందుకొచ్చాను. నేను మెడిసిన్‌ చదవడానికీ ఓ రకంగా అదే కారణం. అలాంటిదాన్ని లెక్కల జోలికి మళ్లీ ఎందుకెళతా చెప్పండి!
నాకు తెలిసిందంతా..
నటిగా నాకు ఏ కాస్త పేరొచ్చినా.. దానిక్కారణం నా దర్శకుల శ్రమ మాత్రమే! నేను షూటింగ్‌కి వెళ్లేటప్పుడు ఓ తెల్లకాగితంలాగే వాళ్ల ముందు వెళ్లి నిల్చుంటాను. నా నుంచి ఆ పాత్రని రూపొందించే బాధ్యత దర్శకులదే. నేను చేసేదంతా స్క్రిప్టు వినడం, నాకు సరిపోతుంది అనుకున్నవాటికి ‘ఓకే’ చెప్పడం, ఆ కథకి నా నటన బలం చేకూర్చేలా జాగ్రత్తపడటం అంతే! ‘మలర్‌’ (మలయాళ ప్రేమమ్‌) నుంచి చిన్ని(నాని ‘ఎంసీఏ’)దాకా అలాగే చేస్తున్నా. చాలా తక్కువ సందర్భాల్లోనే కథ విషయంలో జోక్యం చేసుకుంటా. ఇప్పటిదాకా నేను పనిచేసినవాళ్లందరూ అలాంటి సూచనల్ని పెద్దమనసుతో అర్థంచేసుకున్నవాళ్లే. శేఖర్‌ కమ్ములగారి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఓ దశలో ‘నేను ఆ అబ్బాయి లవ్‌ ప్రపోజల్‌ని అంత ఈజీగా ఒప్పుకుంటే బావోదండీ. ఆ అమ్మాయి పర్సనాలిటీకి సరిపోదు!’ అని చెప్పా. ‘అలాగే చేద్దాం’ అన్నారాయన.  తెలంగాణలోని ప్రతి కుటుంబం నన్ను వాళ్లమ్మాయిగా చూస్తోందంటే కారణం ఆయనే. ‘ఫిదా’కి ముందు నేను తెలుగు మాట్లాడటమే అంతంత మాత్రం. దాదాపు ఆరేడేళ్లకిందట ఈటీవీ ‘ఢీ’ డ్యాన్స్‌ కార్యక్రమం చేస్తున్నప్పుడు ఎదుటివాళ్లు చెప్పేది అర్థం చేసుకునే మేరకు కాస్త నేర్చుకున్నా. ఆ తర్వాత జార్జియాలో మెడిసిన్‌ చదివేటప్పుడు నా క్లాస్‌మేట్స్‌ ఇద్దరు తెలుగమ్మాయిల ద్వారా కొన్ని పదాలు తెలుసుకున్నా. ఆ రెండుసార్లూ తెలుగెంత కష్టమో అనిపించింది. అలాంటి నా చేత ఏకంగా తెలంగాణ యాస మాట్లాడించారు శేఖర్‌. మాట్లాడేటప్పుడు తల ఊపడంలో కాస్త తేడా వచ్చినా సరే, ‘ఇక్కడమ్మాయిలు అలా చేయరండీ!’ అని సవరించేవారాయన. అందువల్లే అచ్చు ‘భానుమతి-హైబ్రిడ్‌ పిల్ల’గా మారగలిగా! పాత్ర ఏదైనా అంతగా నన్ను నేను సరెండర్‌ చేసుకోవడమే నా పని అనుకుంటున్నా. సినిమా రిలీజయ్యాక కలెక్షన్‌ల వివరాలకన్నా  ‘ఫలానా చోట నీ నటన బాగాలేదు!’ అని ఎవరన్నా అంటారేమోననే ఆలోచనే నన్నెక్కువ భయపెడుతుంటుంది.
అమ్మ నాట్యంతోనే..
మాది ఊటీ దగ్గర్లోని కోత్తగిరి. నేను అక్కడికి దగ్గర్లోని కోయంబత్తూరులోనే చదువుకున్నా. మా నాన్న సెందామరై కన్నన్‌ కస్టమ్స్‌ అధికారి. అమ్మ రాధ చక్కగా నాట్యం చేసేది. నేనూ, మా చెల్లెలు పూజా కవలలం. అమ్మవల్ల ఇద్దరం నృత్యంపై ఆసక్తి పెంచుకున్నాం. స్కూల్‌ స్థాయిలోనే నేను రకరకాల నృత్యకార్యక్రమాల్లో పాల్గొన్నా. స్టేజీ ఫియర్‌ అస్సలు ఉండేది కాదు. ఓసారి నా నాట్యం చూసిన ఒక సినిమా ఏజెన్సీవాళ్లు ఓ చిన్నపాత్ర చేయాలని అడిగారు. షూటింగ్‌ రెండురోజులు మాత్రమే ఉంటుందన్నారు. అప్పట్లో నేను ఎనిమిదో తరగతి చదువుతుండేదాన్ని. మ్యాథ్స్‌ క్లాస్‌ అంటే చాలా భయం నాకు. ఈ షూటింగ్‌ వంకతో ఆ క్లాసులు ఎగ్గొట్టొచ్చనే ఆలోచన వచ్చింది. అమ్మతో చెప్పి ఒప్పించా. అలా ‘ధూంధాం’ అనే తమిళ సినిమాలో కంగనా రనౌత్‌ పక్కన కనిపించాను. ఆ తర్వాత ‘కస్తూరి మాన్‌’ అని మరో తమిళ సినిమా. ఈసారి మీరా జాస్మిన్‌కి క్లాస్‌మేట్‌గా! ఆ తర్వాత టీవీ డ్యాన్స్‌ షోలపై దృష్టిపెట్టాను. తమిళంలో స్టార్‌ విజయ్‌ ఛానెల్‌లో ఓ కార్యక్రమంలో, తెలుగులో ఈటీవీ ‘ఢీ’లోనూ అవకాశం వచ్చింది. అవి నన్ను ‘డాన్స్‌’ స్టార్‌గా నిలబెట్టాయి. ఆ షోలు జరుగుతున్నంతకాలం, ఆ తర్వాతా కోయంబత్తూరులో నేనో వీఐపీని అయిపోయాను. ‘టీవీలో డ్యాన్స్‌ చేసే అమ్మాయివి నువ్వే కదా..!’ అంటూ నలుగురూ నన్ను ఆరాధనగా చూడటం కిక్కిచ్చేది. అలాంటి అభినందనల కోసం మరింత కష్టపడేదాన్ని. కథానాయికగానూ చేయమంటూ చాలా అవకాశాలొచ్చాయి. కానీ అమ్మానాన్నలు ససేమిరా అన్నారు. ‘ఏ కథానాయికకైనా ఆరేళ్లకంటే ఎక్కువ ఆదరణ ఉండదు. ఇప్పుడెళతావు సరే.. నీకు క్రేజు తగ్గాక ఏం చేస్తావో చెప్పు!’ అన్నారు. ఆ ప్రశ్నకు నా దగ్గర ఏ సమాధానం లేదు. అందువల్లే వాళ్లు చెప్పినట్టే చదువుపైన దృష్టిపెట్టాను. నేను ఇక్కడుంటే ఎక్కడ మళ్లీ సినిమా ఊసు ఎత్తుతానో అని జార్జియాలో మెడిసిన్‌లో చేర్పించారు.
అది మలుపు..
నాలుగేళ్ల చదువులో సినిమాల గురించి నిజంగానే మరచిపోయా! అప్పుడే డైరెక్టర్‌ ఆల్ఫోన్స్‌ నాకు మెయిల్‌పెట్టారు.. తానో కొత్త సినిమా చేస్తున్నాననీ, అందులో కథానాయికగా చేయాలనీ! మొదట్లో నమ్మలేదు. గూగుల్‌లో అతని గురించి వెతికి, అది ఆకతాయి కాల్‌ కాదని తెలుసుకున్నాకే స్క్రిప్టు చదివా. నాకు చాలా నచ్చింది. నాన్నని అడిగితే ‘సెలవుల్లో మాత్రమే నటించాలి..’ అని షరతు పెట్టారు. అలా మలయాళ ‘ప్రేమమ్‌’ చిత్రంలో నటించాను. అందులో నాది ‘మలర్‌’ అని ఓ తమిళ టీచర్‌ పాత్ర. అది పెద్ద హిట్టు కావడంతో ఆ సినిమాని తమిళనాడు ప్రేక్షకులూ బాగా ఆదరించారు. తర్వాత మరో మలయాళ చిత్రం ‘కలి’లో నటించాను. అది కూడా హిట్టయ్యింది. ఈలోపు నా మెడిసిన్‌ కూడా పూర్తయింది. ఆ తర్వాతే ‘ఫిదా’ అవకాశం వచ్చింది. ఆ షూటింగ్‌కి వెళ్లడానికి ముందే డాక్టర్‌గా ప్రాక్టీస్‌ పెట్టకూడదని నిర్ణయించుకున్నా. ఒకేసారి రెండుపడవల మీద ప్రయాణం చేయడం నా స్వభావానికి సరిపోదు. పైగా వైద్యమంటే మనుషుల ప్రాణాలతో కూడుకున్న విషయం. పూర్తిస్థాయిలో శ్రద్ధపెట్టకుంటే కుదర్దు. అందుకే మెడిసిన్‌ డిగ్రీ తీసుకున్నా నా పేరు ముందు ‘డాక్టర్‌’ అని చేర్చుకోవడం లేదు! తల్లిగా చేస్తున్నా..
నేను తమిళమ్మాయినైనా ఇప్పటిదాకా కథానాయికగా ఆ భాషలో ఒక్క డైరెక్ట్‌ సినిమా కూడా చేయలేదు. ‘ప్రేమమ్‌’ తర్వాత చాలా పెద్ద ప్రాజెక్టులే వచ్చాయి కానీ రకరకాల కారణాల వల్ల చేయలేకపోయా. కణం.. ద్విభాషా చిత్రంతో తొలిసారి ఎంట్రీ ఇస్తున్నా. నాగశౌర్య హీరో. ఆ చిత్రంలో ఆరేళ్ల పాపకి తల్లిగా నటిస్తున్నా! అది విన్నవాళ్లంతా ‘ఎందుకలా చేస్తున్నావ్‌?
నీ కెరీర్‌ ఏం కావాలి?’ అని అడుగుతున్నారు. అవన్నీ నేను పట్టించుకోవడం లేదు. దర్శకుడు ఏఎల్‌ విజయ్‌ చెప్పిన కథ నన్ను కదిలించేసింది. ఎంతో సున్నితమైన అంశం అది. తమిళంలో నా తొలిచిత్రంగా చెప్పుకోవడానికి ఇదే సరైన కథ అనిపించింది. దాంతోపాటూ తెలుగులో ‘అందాల రాక్షసి’ ఫేమ్‌ హను రాఘవపూడి దర్శకత్వంలో ‘పడి పడి లేచే మనసు..’ చిత్రానికి పనిచేస్తున్నాను. ఇవి కాకుండా తమిళంలో మరో రెండు భారీ చిత్రాలున్నాయి. నాకు అప్పుడప్పుడూ అనిపిస్తూ ఉంటుంది. ‘ఏడెనిమిదేళ్లకిందట, టీనేజీలో హీరోయిన్‌ అయి ఉంటే ఇప్పుడు నా పరిస్థితి ఏమిటీ?’ అని. బహుశా.. అప్పట్లో కథానాయికని అయి ఉండొచ్చేమో కానీ ‘ప్రేమమ్‌’, ‘ఫిదా’లాంటి సినిమాలైతే దక్కేవి కావు. ఈ సినిమాలు రూపుదిద్దుకునే కాలం వచ్చేటప్పటికి పరిశ్రమ నుంచి తప్పుకుని ఉండేదాన్నేమో. మలర్‌గానే నా కెరీర్‌ మొదలు కావాలనీ.. భానుమతిగా మీ ప్రేమ అందుకోవాలని.. చిన్నిగా
నవ్వించాలని నాకు రాసిపెట్టి ఉందంతే!

- తలారి ఉదయ్‌కుమార్‌, న్యూస్‌టుడే, చెన్నై

వ్యక్తిగతం..

నటన కాకుండా..
హర్డిల్స్‌ ప్లేయర్‌ని. స్కూల్‌ ఛాంపియన్‌ని కూడా!
దేవుడిపై నమ్మకం ఉందా?
బోల్డంత. నటనలో ఓనమాలు కూడా నేర్చుకోని నేను కథానాయికని కావడం దేవుడి చలవ కాకపోతే ఇంకేమిటీ?
నచ్చిన హీరో..
సూర్య. ఆయనతో ఓ సినిమా చేస్తున్నాను! త్వరలోనే షూటింగ్‌ మొదలవబోతోంది. జీవీకే అని టైటిల్‌ ఖరారు చేశారు. శ్రీరాఘవ దర్శకుడు. తమిళం, తెలుగులో ఒకేసారి వస్తుంది!
నచ్చే వ్యాయామం
పరుగు. కాకపోతే ఢీ కార్యక్రమమప్పుడు తొడ కండరం దెబ్బతినడం వల్ల దానికి దూరమయ్యా. ఐనా ఇష్టం పోలేదు. అందుకే షూటింగ్‌లో పరుగుతీసే అవకాశం వస్తే.. అవసరానికంటే కాస్త వేగంగానే పరుగెత్తి ఆ ఆశ తీర్చుకుంటూ ఉంటా!
సోషల్‌ మీడియాలో..
అటువైపు అస్సలు వెళ్లను. అందులో ఏం రాయాలో ఎలా రాయాలో కూడా నాకు పాలుపోదు. ఒక్కోసారి ‘ఫలానా విషయం నలుగురితో పంచుకోవాలి’ అనిపిస్తుంది. వెంటనే ‘పంచుకోకపోతే ఏమవుతుంది? నువ్వు ఆ విషయం చెప్పకున్నా ప్రపంచానికి ఏ నష్టం లేదుకదా!’ అనే ఆలోచన వచ్చి మానేస్తాను. ఫొటోల విషయంలోనూ ఇంతే. కాబట్టి నా కోసం అందులో వెతక్కండి..!
అతిపెద్ద ఆనందం..
దక్షిణాది ప్రేక్షకులంతా నాపై చూపే ఈ ప్రేమ! నా అతిపెద్ద ఆందోళన కూడా అదే. మంచి కథలు ఎంచుకోలేక, సరిగ్గా నటించక ఆ ప్రేమని కోల్పోతానేమోననే ఆలోచన వేధిస్తూ ఉంటుంది.
భయం..
హారర్‌ సినిమాలంటే చచ్చేంత భయం. జార్జియాలో చదివేటప్పుడు ‘కంజ్యూరింగ్‌’ ఇంగ్లిషు చిత్రాన్ని.. సౌండ్‌ ప్రూఫ్‌తో, హనుమాన్‌ చాలీసా వల్లిస్తూ మరీ చూశా! అలాంటి నేను ‘కణం’ హారర్‌ చిత్రంలో నటించడం ఆశ్చర్యంగానే ఉంది. చూద్దాం.. ఈ అనుభవం నా భయాన్ని పోగొడుతుందేమో!
ఇష్టమైన వ్యాపకాలు..
సీతాకోక చిలుకల్ని పట్టి వదిలేస్తూ ఉంటా. ‘ప్రేమమ్‌’ చిత్రంతో నేర్చుకున్నా ఆ కళని! డ్రైవింగ్‌ అన్నా ఇష్టమే. ఇదివరకు రోడ్డుపై చాలా చాలా స్లోగా వెళుతుండేదాన్ని. ‘ఫిదా’ కోసం ట్రాక్టర్‌, ఫెరారీ నడపడం నేర్చుకున్నాక నా స్పీడు పెరిగింది.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.