close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
నూజివీడు నుంచి ఓక్రిడ్జ్‌ వరకూ...

నూజివీడు నుంచి ఓక్రిడ్జ్‌ వరకూ...

గొప్ప పనులుచేయడానికి గొప్ప ఇంట పుట్టనవసరంలేదు. అతి సామాన్యులు కూడా వాటిని సాధించగలరు. అందుకు నిదర్శనం ఈ ఇద్దరు మిత్రులు. వీళ్లిద్దరూ కలిసి చదువుకున్నారు, కలిసి కలలుగన్నారు. వ్యయప్రయాసలను తట్టుకుని ఆ కలల్ని కలిసే నిజం చేసుకున్నారు. కృష్ణా జిల్లా నూజివీడుకి చెందిన తుమ్మల నాగప్రసాద్‌, యార్లగడ్డ రాజశేఖర్‌... ఓక్రిడ్జ్‌ విజయ ప్రస్థానాన్ని వివరిస్తున్నారిలా...

నాగప్రసాద్‌...
మాది నాలుగున్నర దశాబ్దాల స్నేహం. నూజివీడులో రెండో తరగతి చదువుతున్నప్పుడు మా మధ్య పరిచయం ఏర్పడింది. తర్వాత నేను సాగర్‌ (మధ్యప్రదేశ్‌)లో ఎమ్మెస్సీ మ్యాథ్స్‌ చేశాను. రాజశేఖర్‌ భీమవరంలో ఇంజినీరింగ్‌ చేశారు. పీజీ తర్వాత రెండేళ్లపాటు సివిల్స్‌కి సిద్ధమయ్యాను. అభ్యర్థుల్ని ఆకర్షించడానికి శిక్షణ సంస్థలు వారి దగ్గర చాలా ప్రత్యేకతలున్నట్టు చెబుతాయి. తీరా చేరాక చూస్తే అక్కడవేవీ కనిపించవు. నాకూ అలాంటి అనుభవం ఎదురయ్యేసరికి బాగా డిజప్పాయింట్‌ అయ్యాను. తర్వాత శిక్షణ తీసుకోవడం మానేసి సొంతూరు వచ్చేశాను. మేము ఏం చేసినా అలా ఉండకూడదనుకున్నాం. నాన్న నూజివీడులో స్కూల్‌ నిర్వహించేవారు. నాకూ విద్యారంగం అంటే ఇష్టం. అందుకే రాజశేఖర్‌ నేనూ కాలేజీ పెట్టాలనుకున్నాం.

రాజశేఖర్‌...
ఇంజినీరింగ్‌ తర్వాత మూడేళ్లు కుటుంబ వ్యాపారాన్ని చూసుకున్నాను. ఉన్నత చదువులకోసం కొన్నాళ్లు దూరంగా ఉన్నప్పటికీ నిరంతరం కెరీర్‌ గురించి చర్చించుకునేవాళ్లం. విద్యారంగంలో అడుగుపెట్టాలని నిర్ణయించుకున్నాక మేం కొన్ని విషయాల్లో పక్కాగా ఉండాలని తీర్మానించుకున్నాం. అప్పటికి మా వయసు పాతికేళ్లు. మా అనుభవం, ఆలోచనా పరిధీ సరిపోవు. అందుకే, మాకంటే తెలివైనవాళ్లూ, అనుభవజ్ఞులూ సంస్థలో ఉండాలనుకున్నాం. ఆ రంగంలో అప్పటికి ఉన్నవారికి భిన్నంగా, భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని పనిచేయాలనుకున్నాం.

నాగప్రసాద్‌...
అప్పట్లో విశాఖపట్నంలో పేరున్న రెసిడెన్షియల్‌ జూనియర్‌ కాలేజీలు లేవు. అందుకే అక్కడికి వెళ్లాలనుకున్నాం. వెళ్లేముందు శ్రీకృష్ణవేణి టాలెంట్‌ స్కూల్స్‌ వ్యవస్థాపకుడు చిగురుపాటి వరప్రసాద్‌ గారిని ఆశీస్సుల కోసం కలిశాం. ఆయన మా ఆలోచనని ప్రోత్సహించలేదు. ‘ఇద్దరు వ్యక్తులు కలిసి బిజినెస్‌ చేయడం కష్టం. వ్యాపారంలో నష్టం వచ్చినా, లాభం వచ్చినా ఎవరివల్ల వచ్చిందన్న చర్చ వస్తుంది. విభేదాలు వస్తాయి’ అన్నారు. మేం వెనక్కి తగ్గలేదు కానీ ఆ విషయాన్ని గుర్తుపెట్టుకున్నాం. అలాగే విద్యార్థుల విషయంలో తల్లిదండ్రుల వైపునుంచి పొరపాటున్నా వాళ్ల తప్పుని ఎత్తి చూపకుండా పరిష్కారం గురించి మాత్రమే ఆలోచించాలన్నారు. ఇలా ఆయన చెప్పిన ప్రతి విషయాన్నీ మేం ఈరోజుకీ గుర్తుపెట్టుకుంటాం.

రాజశేఖర్‌
విజ్ఞాన్‌ రత్తయ్యగారు మా ‘వికాస్‌ కాలేజ్‌’ని ప్రారంభించారు. మేం డబ్బులుండి కాలేజీ పెట్టలేదు. మాదైన మార్పు తేగలమన్న నమ్మకంతో అడుగుపెట్టాం. 1993లో మేం కాలేజీ మొదలుపెట్టే సమయానికి ఏడాదంతా ఇంటర్మీడియెట్‌ కోర్సు చెప్పి వేసవిలో ఎంసెట్‌ శిక్షణ ఇచ్చేవారు. అలా కాకుండా ఇంటర్మీడియెట్‌తో పాటే ఎంసెట్‌ కోచింగ్‌ కూడా ఇస్తామని చెప్పాం. దాంతో మొదటి సంవత్సరంలోనే ‘నో అడ్మిషన్స్‌’ బోర్డు పెట్టేశాం. అప్పటికి కాలేజీ నడపడం మాకూ కొత్తే. కానీ నిర్వహణ ఎలా ఉండాలన్నదానిపైన స్పష్టత ఉంది. మంచి విద్యా సంస్థ అంటే అత్యుత్తమ ఉపాధ్యాయులు ఉండాలి. అందుకే ఆ ప్రాంతంలో పేరున్న లెక్చరర్లని ఒప్పించి తీసుకొచ్చాం. మాకు రెట్టింపు వయసున్నవాళ్లు మమ్మల్ని నమ్మేలా చేయడంతో సగం విజయం సాధించాం. ఎలాంటి అహం లేకుండా స్టాఫ్‌రూమ్‌ దగ్గరికి వెళ్లి లెక్చరర్లతో మాట్లాడేవాళ్లం. వాళ్లనుంచి నేర్చుకునే వాళ్లం. ఉదయం ఆరింటి నుంచి రాత్రి 11 గంటల వరకూ కాలేజీ పనిమీదే ఉండేవాళ్లం. మా ఆలోచనలూ, వారి అనుభవం కలవడంతో స్వల్పవ్యవధిలోనే మంచి ఫలితాలు వచ్చాయి.

నాగప్రసాద్‌...
‘వికాస్‌’లో విద్యార్థులంతా రోజులో 14-15 గంటలు చదివేవారు. కానీ అందరి విషయంలో ఫలితాలు ఒకేలా వచ్చేవి కాదు. కారణం, ఎక్కువ మంది పుస్తకంలో ఉన్నది కంఠస్తం చేసేవారు. పుస్తకం దాటి ప్రశ్న వస్తే జవాబివ్వలేకపోయేవారు. స్కూల్‌ వ్యవస్థలో ఉన్న లోపమే అందుకు కారణమని అర్థమైంది. చర్చల్లో ‘ఒక మంచి స్కూల్‌ పెడితే...’ అన్న ఆలోచన వచ్చింది. కానీ  ఆ మంచి స్కూల్‌ ఎలా ఉండాలో మాకు తెలీదు. 1999-2000 ప్రాంతంలో అందుకోసం దేశవిదేశాల్లో వందకుపైగా పాఠశాలల్ని సందర్శించాం. ప్రఖ్యాత డూన్‌ స్కూల్‌కీ వెళ్లాం. ఆ స్కూల్‌ రిటైర్డ్‌ హెడ్‌ మాస్టర్‌ షౌమీ దాస్‌ కన్సల్టెన్సీ సేవలు అందిస్తారని తెలిస్తే వెళ్లి కలిశాం. దాస్‌ కేంబ్రిడ్జిలో చదువుకున్నారు. ఆయన తాతగారే డూన్‌ స్కూల్‌ పెట్టింది. డబ్బు పరంగా మాది పెద్ద స్థాయి కాదు, వయసు పరంగానూ చిన్నవాళ్లమే. కానీ, మా తపన ఆయనకి అర్థమైంది. వైజాగ్‌ వచ్చి చూశాక షౌమీ దాస్‌ మాతో పనిచేయడానికి అంగీకరించారు. అదే మా జీవితంలో టర్నింగ్‌ పాయింట్‌. విద్యా వ్యవస్థపైన మాకున్న అవగాహన చాలా తక్కువ. విద్యార్థుల్ని రోజుకి 15 గంటలు చదివించడమే మాకు తెలుసు. పరిపూర్ణ విద్య అంటే ఏంటో తెలీదు. విద్యారంగం పరంగా మా ప్రతి ఆలోచన వెనకా ఆయన ప్రభావం ఉంటుంది. సాధారణంగా ఆయన మూడేళ్లే గైడెన్స్‌ ఇస్తారు. కానీ మాతో ఇప్పటికీ ప్రయాణిస్తున్నారు. మా విద్యా విభాగానికి ఛైర్మన్‌ ఆయనే. ఇప్పుడాయన వయసు 83. తన ఆఖరి మజిలీ హైదరాబాద్‌ అని నిర్ణయించుకుని గతేడాదే ఇక్కడికి వచ్చారు.

రాజశేఖర్‌
మా ఆలోచనలకు తగ్గ స్కూల్‌ అంటే, ఐబీ(ఇంటర్నేషనల్‌ బకలారియేట్‌) విద్యావిధానం ఉండాలని దాస్‌ సూచించారు. అలాగే స్కూల్‌ నిర్మాణానికి రూ.25 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశాం. రుణం కోసం ఓ బ్యాంకు మేనేజర్‌ని సంప్రదిస్తే ‘స్కూల్‌మీద అంత పెట్టుబడి పెట్టడం, అదీ వైజాగ్‌లో... మంచి ఆలోచన కాదు’ అన్నారు. ఆయన మాటల్లో వాస్తవం ఉందనిపించింది. కానీ మా ప్రయత్నాన్ని ఆపలేదు. అలాంటి స్కూల్‌ను హైదరాబాద్‌లో ప్రారంభిస్తే  మంచిదని కొందరు సలహా ఇచ్చారు. దాంతో హైదరాబాద్‌ వచ్చి గచ్చిబౌలిలో స్థలం కొన్నాం.  స్కూల్‌కి ‘ఓక్రిడ్జ్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌’ అని పేరుపెట్టాం. స్కూల్‌ నిర్మాణం ప్రారంభించే నాటికి మా దగ్గర రూ.2-3 కోట్లు మాత్రమే ఉన్నాయి. చాలా చిన్న బిల్డింగ్‌తో ప్రారంభించి పదేళ్లపాటు విస్తరించుకుంటూ వచ్చాం. రూ.25 కోట్లు అనుకున్నది పూర్తయ్యేసరికి 80 కోట్లయింది.

నాగప్రసాద్‌
2001... ఓక్రిడ్జ్‌ ప్రారంభమైన సంవత్సరం. అదే ఏడాది హైదరాబాద్‌కి ఐఎస్‌బీ, మైక్రోసాఫ్ట్‌ వచ్చాయి. అమెరికా నుంచి తిరిగి వచ్చిన మైక్రోసాఫ్ట్‌ ఉద్యోగులకి మా స్కూల్‌ ఒక వరం. ఎందుకంటే ఐబీ కరికులమ్‌ అప్పటికి మరెక్కడా లేదు. దాంతో విద్యార్థుల తల్లిదండ్రులు కూడా  స్కూల్‌ విషయంలో బాగా ఇన్‌వాల్వ్‌ అవుతూ ప్రోత్సహించేవారు. ఐబీ ప్రతినిధులు వచ్చి విదేశీ టీచర్లు ఉండాలనీ, అప్పుడే భిన్నత్వం ఉంటుందని చెప్పారు. మేం విదేశీ టీచర్లని తెస్తే ఫీజు పది రెట్లు పెరుగుతుంది. టీచింగ్‌ పరంగా మనవాళ్లు ఎవరికీ తక్కువ కాదనీ, ఇండియా అంటేనే భిన్నత్వంలో ఏకత్వమనీ చెప్పి వాళ్లని ఒప్పించగలిగాం. మొదట్లో విదేశీ టీచర్లని పిలిపించి మా టీచర్లకి శిక్షణ ఇప్పించాం. స్కూల్‌ ప్రారంభంలో 1200 మంది విద్యార్థుల్లో... 40 శాతం విదేశీ పాస్‌పోర్ట్‌లు ఉన్నవారే ఉండేవారంటే నమ్మండి. ప్రారంభం నుంచీ ప్రతీ తరగతి గదిలో ఇంటర్నెట్‌ కనెక్షన్‌ పెట్టాం. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మా స్కూల్‌ భవనాన్ని ప్రారంభించడానికి వచ్చి తరగతి గదిలో ఇంటర్నెట్‌ ఉండటాన్ని చూసి ఆశ్చర్యపోయారు.

రాజశేఖర్‌
ఏదైనా సులభంగా దొరికితే దాని విలువ తెలీదు. అందుకే స్కూల్లో ఉన్నదాన్ని లేనివాళ్లతో పంచుకోవడంలో ఉన్న ఆనందం గురించి తెలుసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నాం. ‘స్ఫూర్తి’ అనే కార్యక్రమంద్వారా ఆరో తరగతి ఆపైన చదివే విద్యార్థుల్ని వివిధ సేవాకార్యక్రమాల్లో భాగం చేస్తున్నాం. విద్యార్థుల పరంగానే కాదు సంస్థగానూ మా స్కూల్‌ ఎన్నో అవార్డులు అందుకుంది. ఎకనమిక్‌ టైమ్స్‌ ‘గ్రేట్‌ప్లేస్‌ టు వర్క్‌’ ర్యాంకింగ్స్‌లో 54వ స్థానంలో ఉన్నాం. మా సంస్థలో 1200 మంది మహిళలు పనిచేస్తున్నారు. మొత్తం ఉద్యోగుల్లో 80 శాతం వారే. మహిళలకు అనుకూల పని వాతావరణం ఉన్న సంస్థలకు ఇచ్చే ‘అవతార్‌ వర్కింగ్‌ మదర్‌ ఫ్రెండ్లీ ఆఫీస్‌’ ర్యాంకింగ్స్‌లో టాప్‌-10లో ఉన్నాం.

నాగప్రసాద్‌...
మీనాక్షి కన్‌స్ట్రక్షన్స్‌ ఛైర్మన్‌ దేవినేని సురేష్‌ మా మార్గదర్శుల్లో ఒకరు. ఆయన ప్రోత్సాహంతో ఓక్రిడ్జ్‌ని విస్తరించగలిగాం. ఇప్పుడు హైదరాబాద్‌లో మియాపూర్‌తోపాటు విశాఖపట్నం, బెంగళూరు, మొహాలీల్లోనూ ఓక్రిడ్జ్‌ స్కూల్స్‌ని పెట్టాం. పాతికేళ్ల ఈ మా ప్రయాణం ఏమంత సాఫీగా సాగిపోలేదు. 2004-05లో స్కూల్‌ నిర్వహణ ఖర్చులకీ డబ్బు సరిపోయేది కాదు. ఎంతోకొంతకు అమ్మేసినా కట్టుబట్టలతో బయటపడతాం కదా అనిపించింది. కానీ మనసు అంగీకరించక అన్నివిధాలా ప్రయత్నించి దాన్ని మళ్లీ గాడిలో పెట్టగలిగాం. 2006 తర్వాత మేం వెనుదిరిగిచూడలేదనే చెప్పాలి. హైదరాబాద్‌ ఐటీ హబ్‌గా ఎదుగుతున్నకొద్దీ మేం ఎదుగుతూ వచ్చాం. ఈ ప్రయాణంలో ఎన్నో విషయాలు నేర్చుకున్నాం, నేర్చుకుంటున్నాం. ఆధునిక వ్యాపార విధానాల్ని తెలుసుకోవడానికి 2012లో ఇద్దరం హైదరాబాద్‌లోని ‘ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌’లో ఎగ్జిక్యూటివ్‌ ఎంబీఏ చేశాం. ఈతరంలో చాలామంది వ్యాపారం చేస్తున్నారు. వ్యాపారానికి డబ్బు కాదు, తపన ముఖ్యం. ఎందరు వద్దన్నా, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా మా తపనే మమ్మల్ని ముందుకు నడిపించింది!

- సుంకరి చంద్రశేఖర్‌

ఇంకొన్ని కంపెనీలూ...

వైజాగ్‌ తర్వాత వికాస్‌ కాలేజీల్ని తిరుపతి, రాజమండ్రి, హైదరాబాద్‌కూ విస్తరించాం. 2000-01 నాటికి మా కాలేజీల్లో పదివేల మందికిపైగా విద్యార్థులు ఉండేవారు. కానీ ఆ తర్వాత కొన్ని కారణాలవల్ల అక్కణ్నుంచి తప్పుకున్నాం. ప్రస్తుతం విశాఖలో వికాస్‌ సీబీఎస్‌ఈ బోర్డింగ్‌ స్కూల్‌ మాత్రమే ఉంది. 2009-2010లో వికాస్‌ సంస్థని ‘పీపుల్‌ కంబైన్‌’గా మార్చాం. ఇదే ప్రస్తుతం మా గ్రూపు పేరు. దీన్లో చాలా కంపెనీలున్నాయి. మేం(నాగప్రసాద్‌-ఛైర్మన్‌, రాజశేఖర్‌-ఎండీ) ముందుండి నడిపిస్తున్నా, ఇంకా ఎందరో భాగస్వాములున్నారు. ఎవరైనా విలువైన వ్యాపార ఆలోచనతో వస్తే దాని నిర్వహణ బాధ్యతల్ని వారికే ఇచ్చి పెట్టుబడి పెడుతుంటాం. అలా ప్రారంభించిన వాటిలో ‘యూనివెరైటీడాట్‌కామ్‌’ ఒకటి. విదేశీ విద్యాసంస్థల్లో చేరేందుకు అవసరమైన సమాచారం ఇచ్చే పోర్టల్‌ ఇది. తణుకు, భీమవరంలో వెస్ట్‌ బెర్రీ పేరుతో స్కూల్స్‌ పెట్టాం. తక్కువ ఫీజుతో అక్కడివారికీ మంచి విద్యని అందించే ఉద్దేశంతో వాటిని పెట్టాం. ఓ.ఐ. పేరుతో హైదరాబాద్‌, బెంగళూరులో  ప్లేస్కూల్‌ చెయిన్‌ ప్రారంభించాం. హైదరాబాద్‌-విజయవాడ రహదారి మార్గంలో సూర్యాపేట దగ్గర సెవెన్‌ అనే రెస్టరెంట్‌ పెట్టాం. ఆ దారిలో మంచి టాయిలెట్‌ సదుపాయం ఉండాలనే ఆలోచన దగ్గర మొదలైందే సెవెన్‌.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.