close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఓలా... అతడి కల!

ఓలా... అతడి కల!

సత్య నాదెళ్ల, విరాట్‌ కోహ్లి, దీపికా పదుకునే, భావిష్‌ అగర్వాల్‌... టైమ్‌ మ్యాగజైన్‌ ఈ ఏడాది ప్రకటించిన ప్రపంచ-100 అత్యంత ప్రభావశీల వ్యక్తుల్లోని భారతీయులు. ఇక్కడున్న మొదటి మూడు పేర్లు అందరికీ సుపరిచితమే. నాలుగో పేరు మాత్రం కొందరికే తెలుసు. కానీ అతడు ప్రారంభించిన కంపెనీ మాత్రం ఎందరికో తెలుసు. ఆ కంపెనీ క్యాబ్‌ రైడింగ్‌ సేవలు అందించే ‘ఓలా’. భారతీయ అంకుర వ్యవస్థలో ఓ సంచలనమైన 32 ఏళ్ల భావిష్‌ అగర్వాల్‌ కథ ఇది!భావిష్‌ పుట్టి పెరిగింది పంజాబ్‌లోని లూధియానాలో. అతడి తల్లిదండ్రులు వైద్యులు. 2004-ఐఐటీ ప్రవేశ పరీక్షలో 23వ ర్యాంకు సాధించిన భావిష్‌... కంప్యూటర్‌ సైన్స్‌ విద్యార్థిగా ఐఐటీ-బొంబాయిలో అడుగుపెట్టాడు. ‘నీకింకా మంచి ర్యాంకు రావాల్సింది... అన్న నాన్న మాటలు నాకింకా గుర్తే’ అంటాడతడు. భావిష్‌కి ఐఐటీ వాతావరణం అద్భుతమనిపించిందట. ఐఐటీ విద్యార్థులకు సహచరులే బలమనీ, ఆ వాతావరణం నేర్చుకోవడానికి గొప్ప అవకాశమనీ చెబుతాడు అతడు. ఓలా సహ వ్యవస్థాపకుడైన అంకిత్‌ భాటీతో భావిష్‌కు ఇక్కడే పరిచయం ఏర్పడింది. ‘మేం ఎదురెదురు గదుల్లో ఉండేవాళ్లం. మొదటి రోజునుంచీ మాట్లాడుకునేవాళ్లం. ఇద్దరం భవిష్యత్తులో కలిసి వ్యాపారం చేయాలనుకున్నాం. అక్కడ ఉన్నపుడే బయట సంస్థలకూ కోడింగ్‌, వెబ్‌సైట్‌ డిజైనింగ్‌ చేసేవాళ్లం’ అని ఆరోజుల్ని గుర్తుచేసుకుంటాడు భావిష్‌.
రెండేళ్లు చాలు...
బీటెక్‌ పూర్తిచేశాక మైక్రోసాఫ్ట్‌ బెంగళూరు కేంద్రంలో అసిస్టెంట్‌ రీసెర్చర్‌గా చేరాడు భావిష్‌. పనిచేస్తున్నాడు కానీ సొంతంగా ఏదైనా చేయాలన్న ఆలోచనవల్ల అక్కడ ఉండలేకపోయేవాడు. తరచూ వ్యాపార ఆలోచనల్ని అంకిత్‌తో చర్చించేవాడు. ఆ సమయంలోనే ఓసారి వారాంతంలో పర్యటనకు వెళ్లినపుడు క్యాబ్‌ డ్రైవర్‌ గమ్యం చేర్చకుండా మధ్యలోనే విడిచి పెట్టాడట. అది తన ఒక్కడి అనుభవం మాత్రమే కాదనీ, చాలామందికి ఎదురయ్యేదేననీ తెలుసుకుని క్యాబ్‌ సర్వీసుకు సంబంధించి కంపెనీ పెట్టాలనుకున్నాడు. ‘నాన్నతో నా ఆలోచన చెబితే... ట్రావెల్‌ ఏజెన్సీ పెడతావా’ అన్నారు. రెండేళ్లు సమయం ఇవ్వండి. అప్పటికి వ్యాపారంలో బాగా నిలదొక్కుకోలేకపోతే తిరిగి ఉద్యోగంలో చేరతానని చెప్పాను. అందుకు అయిష్టంగానే అంగీకరించారు’ అని గుర్తుచేసుకుంటాడు భావిష్‌.
ఫెయిల్యూర్‌ నుంచి...
భావిష్‌ మైక్రోసాఫ్ట్‌లో పనిచేసిన సమయంలో అంకిత్‌ ఐఐటీలోనే ఎంటెక్‌ పూర్తిచేశాడు. తర్వాత ఇద్దరూ 2010లో ముంబయిలో ‘ఓలాట్రిప్‌డాట్‌కామ్‌’ని ప్రారంభించారు. విమాన సేవలకు మేక్‌మైట్రిప్‌ ఉన్నట్లు క్యాబ్‌ బుకింగ్‌ సేవల విభాగంలో తాము ఉండాలనేది వీరి లక్ష్యం. ముంబయి పరిసరాల్లో పర్యటనలకి వాహన సదుపాయంతోపాటు, హోటల్‌ గదులు బుక్‌ చేసే సేవల్ని మొదలుపెట్టారు. కానీ అది అనుకున్నంతగా సక్సెస్‌ కాలేదు. అప్పుడే బయటకంటే నగరాల్లోనే రవాణా సమస్య ఎక్కువగా ఉన్నట్టు వాళ్లకి అర్థమైంది. నగరాల్లో కొందరు కారు డ్రైవర్లు పనిలేక ఖాళీగా ఉంటే, ఇంకొందరు వినియోగదారుల నుంచి డబ్బుని దారుణంగా పిండుకోవడం వాళ్లు చూశారు. అందుకే కార్ల యజమానుల్ని, వినియోగదారులతో అనుసంధానించి డిమాండ్‌-సప్లై మధ్యనున్న సమస్యని పరిష్కరించాలనుకున్నారు. ప్రారంభించిన ఆరు నెలలకే ఓలాట్రిప్స్‌ని ఓలాక్యాబ్స్‌గా మార్చి సేవలు మొదలుపెట్టారు. అదే నేటి ఓలా. ఫోన్‌తో పాటుగా వెబ్‌సైట్‌, ఆప్‌ద్వారానూ సేవలు అందించారు. కంపెనీ ప్రారంభించిన సమయానికి వీరి దగ్గర పెద్దగా డబ్బులేదు. అంకిత్‌ అప్పటికి జాబ్‌ కూడా చేయలేదు. భావిష్‌ దగ్గర తను ఉద్యోగం చేస్తూ దాచుకున్న మొత్తం రూ.4 లక్షలు ఉండేది. దాన్నే పెట్టుబడిగా ఉపయోగించారు. ఒక సింగిల్‌ బెడ్‌రూమ్‌ అపార్ట్‌మెంట్‌లో ఆఫీసు ప్రారంభించారు.  పగటిపూట డ్రైవర్లతో సంప్రదింపులకు, రాత్రిపూట వ్యాపార వ్యూహాలకు అదే కేంద్రం. కోడింగ్‌, సాంకేతిక విషయాలు అంకిత్‌ చూస్తుంటే, భావిష్‌ వాటికితోడు పెట్టుబడుల కోసం తిరిగేవాడు. ‘వాళ్లు వ్యాపార నమూనా గురించి ప్రశ్నించేవాళ్లు. ‘ఆర్గ్‌ స్ట్రక్చర్‌’ పంపండి అని ఒక ఏంజెల్‌ ఇన్వెస్టర్‌ అడిగారు. నాకు ఆయన అన్న మాట అర్థం కాలేదు. అయినా వ్యాపార ఆలోచన, అమలు బాగా ఉంటే, పెట్టుబడులు వస్తాయని నమ్మకంగా ఉండేవాళ్లం’ అంటాడు భావిష్‌.
మెలమెల్లగా...
ఓలా సేవల్ని 2011 జనవరిలో ప్రారంభించారు. మొదటి వంద రైడ్‌లు రావడానికి ఏడాదిన్నర పట్టింది. 2012లో దిల్లీ, బెంగళూరులకు విస్తరించారు. స్థిరమైన ఆదాయం వస్తుండటంతో క్యాబ్‌ డ్రైవర్లు పెద్దమొత్తంలో ఓలాతో పనిచేయడం మొదలుపెట్టారు. వినియోగదారులకూ అది లాభసాటి బేరంగా ఉండేది. ఆ తర్వాత క్రమంగా పెరుగుదల బాగా కనిపించింది. 2013 మధ్యకి వచ్చేసరికి రోజుకి 2000 రైడ్‌లు వచ్చేవి. తర్వాత మిగతా నగరాలకు విస్తరించుకుంటూ పోయారు. వినియోగదారులకు ఆప్‌లో సౌలభ్యం ఉందని అర్థమవడంతో ఆప్‌పైనే పూర్తిగా దృష్టిపెట్టారు. ఇంటర్నెట్‌ స్పీడ్‌ తక్కువ ఉన్నా కూడా ఆప్‌ పనిచేసేలా డిజైన్‌ చేశారు. ఆప్‌ వినియోగం చాలా సులభంగా ఉండేలా చూసుకున్నారు. ధర చౌక, వినియోగం సులభం... అన్న ప్రచారం వచ్చాక సొంత కార్లు ఉన్నవాళ్లూ ఇటువైపు అడుగేశారు.
ఓలాలో ఇప్పటివరకూ వివిధ సంస్థలు రూ.15వేల కోట్లు పెట్టుబడి పెట్టాయి.
అన్నింటికంటే కూడా మొదటి రౌండ్‌లో రూ.34 లక్షలు ఫండింగ్‌ సంపాదించడానికే తాను ఎక్కువ కష్టపడాల్సి వచ్చిందంటాడు భావిష్‌. ఓలా ప్రారంభంలో పెట్టుబడి పెట్టినవాళ్లలో మైక్రోసాఫ్ట్‌లో భావిష్‌ మేనేజర్‌ ఒకరు. తర్వాత షాది డాట్‌కామ్‌ వ్యవస్థాపకుడు అనుపమ్‌ మిత్తల్‌, స్నాప్‌డీల్‌ వ్యవస్థాపకుడు కునాల్‌ బాహల్‌, వెంచర్‌ క్యాపిటలిస్ట్‌ రెహాన్‌ యార్‌ ఖాన్‌, రతన్‌ టాటా లాంటివారు  పెట్టుబడులు పెట్టారు. ఆపైన ప్రపంచస్థాయి సంస్థలైన సాఫ్ట్‌బ్యాంక్‌, టైగర్‌ మేనేజ్‌మెంట్‌, టెన్సెంట్‌... ఇవన్నీ వచ్చాయి. డబ్బుకంటే కూడా ఆయా వ్యక్తులతో కలిసి పనిచేయడంవల్ల లాభం ఉంటుందనుకుంటేనే చేతులు కలిపేవాళ్లు. స్వల్పకాల లాభాల్ని ఆశించేవాళ్లని కాకుండా దీర్ఘకాలం కొనసాగాలనుకునేవాళ్లని ఎంచుకున్నారు.ఉబర్‌తో పోటీ...
భావిష్‌ ఓలాట్రిప్‌ ప్రారంభించిన సంవత్సరం 2010. మార్కెట్‌ పరంగా చూసుకుంటే అది సరైన సమయం కాదు. అప్పటికి ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మందగమనం ఉంది. కానీ ఆ పరిస్థితులే కంపెనీకి బలమైన పునాది పడేలా చేశాయి. ఓలా మార్కెట్‌లో వేగంగా దూసుకెళ్తోన్న సమయంలో అంతర్జాతీయ కంపెనీ ఉబర్‌ 2013 ద్వితీయార్థంలో భారత్‌లో అడుగుపెట్టింది. డబ్బు, టెక్నాలజీ, అనుభవం... ఏ విధంగా చూసుకున్నా ఓలాకంటే ఒకడుగు ముందే ఉండేది ఉబర్‌. కానీ భారత్‌ గురించి  భారతీయులకంటే ఎవరికి బాగా తెలుస్తుంది. ‘చంటి గాడు లోకల్‌’ అని నిర్భయంగా ముందడుగు వేశాడు భావిష్‌. ఉబర్‌ జోరుకు అడ్డుకట్ట వేస్తూ ‘ఓలా ఆటో’ని తెచ్చారు. స్వల్ప వ్యవధిలోనే అక్కడ మంచి మార్కెట్‌ సంపాదించింది ఓలా. ఇప్పటికీ సంస్థ ఆదాయంలో 15 శాతం ఈ విభాగం నుంచి వస్తోంది. మెరుగైన ఉద్యోగుల కోసం కంపెనీ ప్రధాన కార్యాలయాన్ని బెంగళూరుకి మార్చారు. ‘విదేశీ కంపెనీలు పెద్ద మొత్తంలో డబ్బు జల్లాలని చూస్తాయి. అయితే మనం దేశీయ అవసరాలకు తగ్గట్టు కొత్త ఉత్పత్తుల్ని తీసుకొచ్చి ఇక్కడ లాభాల్ని సంపాదించగలిగే స్థాయిలో ఉన్నామని వాళ్లకి క్రమంగా అర్థమవుతుంది’ అంటారు భావిష్‌. స్థానిక ట్యాక్సీల్ని బుక్‌ చేసుకునేలా ముంబయిలో ‘ఓలా కాలీ-పీలీ’, కోల్‌కతాలో ‘ఓలా ఎల్లో క్యాబ్స్‌’ పేరుతో సేవలు మొదలుపెట్టారు. ఇంకా ఓలా షటిల్‌, బైక్‌, రెంటల్‌, ఔట్‌స్టేషన్‌, ఇ-రిక్షా, పెడల్‌, ఎలక్ట్రిక్‌... ఇలా ఎన్నో విభాగాల్నీ తెచ్చింది ఓలా. ప్రస్తుతం ఓలా కింద పది లక్షల వాహనాలు ఉన్నాయి. భారత్‌లో ఉబర్‌ 31 నగరాల్లో ఉంటే, ఓలా 110కిపైగా నగరాల్లో ఉంది. సగంకంటే ఎక్కువ మార్కెట్‌ ఓలాకే ఉంది. ఓలా ఇంట గెలవడమే కాకుండా ఈ ఏడాది ప్రారంభంలో
ఆస్ట్రేలియాలోనూ సేవలు ప్రారంభించింది. అక్కడ ఉబర్‌తో పోటీ పడుతోంది. భారతీయ ఈ కామర్స్‌ కంపెనీ విదేశాల్లో అడుగుపెట్టడం ఇదే మొదటిసారి. తర్వాత బంగ్లాదేశ్‌, శ్రీలంకలకూ వెళ్లాలని చూస్తోంది.
సొంత కంపెనీ...
ఎలక్ట్రిక్‌ వాహనాల్ని తెచ్చేందుకు ప్రభుత్వం, వాహన తయారీ సంస్థలతో కలిసి పనిచేస్తోంది ఓలా. నాగ్‌పూర్‌లో 200 ఎలక్ట్రిక్‌ వాహనాల్ని నడుపుతోంది. ‘ఓలా సైనిక్‌’... మాజీ సైనిక ఉద్యోగులకు డ్రైవర్లుగా ఉపాధి కల్పించేందుకు 2015లో ప్రవేశపెట్టిన కార్యక్రమం... ఇలా ‘భారత్‌’ కూడా తన కంపెనీలో ఉండేలా చూసుకున్నాడు భావిష్‌. ఫ్లిప్‌కార్ట్‌ మాదిరిగా సంస్థ వ్యవస్థాపకుల చేతుల్లోంచి జారిపోకుండా ప్రణాళికాబద్ధంగా అడుగులు వేస్తున్నాడు. సంస్థలో ఏ ఒక్క కంపెనీకీ ఎక్కువ వాటా లేకుండా ప్రతిసారీ కొత్త పెట్టుబడిదారులకు వాటా వచ్చేలా చేశాడు. గతేడాది సాఫ్ట్‌బ్యాంక్‌ తన వాటా పెంచుకోవాలని చూసినా అగర్వాల్‌ అందుకు అంగీకరించలేదు. సాఫ్ట్‌బ్యాంక్‌కి ఓలాతోపాటు ఉబర్‌లో పెట్టుబడులు ఉన్నాయి. రెంటినీ కలిపే ప్రతిపాదనను కొన్నాళ్ల కిందట ఆ సంస్థ తెచ్చింది. భావిష్‌ మాత్రం ఓలా తమ సొంత కంపెనీగానే ఉండాలనుకున్నారు. ప్రస్తుతం ఓలా విలువ రూ.26వేల కోట్లని అంచనా.
వంద కోట్ల ప్రజల రవాణా అవసరాల్ని తీర్చడమే ధ్యేయంగా రోజూ పని ప్రారంభిస్తానని చెప్పే భావిష్‌కు సొంత కారు లేదు. తనలానే అందరూ సొంత కార్లు కొనకుండా చూడాలనేది భావిష్‌ లక్ష్యాల్లో ఒకటి. ‘నాకు సొంత కారు లేదు. కానీ ఓలాలో మినీ, మైక్రో ఎస్‌యూవీ, లగ్జరీ... ఇలా నచ్చిన కారు ఉపయోగించుకునే అవకాశం ఉంది. పార్కింగ్‌, మెయింట్‌నెన్స్‌ లాంటి తలనొప్పులూ ఉండవు’ అనే భావిష్‌ మాటే, భవిష్యవాణి అవుతుందేమో!


పది కిలోలు తగ్గాడు...

ఓలా బ్రాండ్‌ పేరు మాత్రమే. వీరి కంపెనీ పేరు ఏఎన్‌ఐ టెక్నాలజీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌.
* కంపెనీ యజమానిగా తన ఆరోగ్యం కూడా ముఖ్యమేనంటాడు భావిష్‌. ఆరోగ్యంగా ఉండటం కోసం ఏడాదిపాటు స్వీట్లు తినడం మానేశాడు. దాంతో పది కిలోలు తగ్గాడు. ఇప్పటికీ పూర్తిగా కాకపోయినా చాలావరకూ స్వీట్లు తినడు.
* కంపెనీ ప్రారంభించినపుడు పోగొట్టుకోడానికి ఏం లేదనే ధైర్యం ఉండేదట. అప్పటికి పెళ్లికాలేదు, పెద్దగా డబ్బూ ఖర్చుచేయడంలేదు... ఇంకెందుకు భయం అంటాడు.
* పెట్టుబడులకు వెళ్లినపుడు... ఎక్కువ డబ్బు ఇచ్చేవారిని కాకుండా, ఎక్కువ నమ్మకం చూపేవాళ్లని ఎంచుకోవాలంటాడు. పెట్టుబడిదారులతో వ్యక్తిగతంగా మంచి
రిలేషన్‌ ఉండాలి, అప్పుడే అన్ని సమయాల్లోనూ వాళ్లతో ఒకేలా ఉండగలమంటాడు.
* భావిష్‌ శ్రీమతి రాజలక్ష్మి. ఆరేళ్లు డేటింగ్‌లో, అయిదేళ్లుగా వైవాహిక బంధంలో ఉన్నారు. ‘నెలలో 20 రోజులు పర్యటనల్లోనే ఉన్నప్పటికీ ఏరోజూ నేను పక్కన లేనని ఫిర్యాదు చేయదు. అంతలా అర్థం చేసుకుంటుంది’ అంటాడు భావిష్‌. బెంగళూరు ఓలా ఆఫీసు ఇంటీరియర్‌ డిజైన్‌లో ఆమె పాత్ర కూడా ఉంది. ‘ఐఐటీ రోజుల్లో, ఓలా ప్రారంభంలో తనే కాఫీకి డబ్బులు ఇచ్చేది. అప్పట్లో ఆఫీసు పనులకి తన కారునే వాడుకునేవాణ్ని. ఇదంతా తను నాపైన పెట్టిన పెట్టుబడిగా భావించేవాణ్ని’ అంటాడు భావిష్‌.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.