close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
బ్యాడ్మింటన్‌లో స్టేట్‌ ఛాంపియన్‌ని..!

బ్యాడ్మింటన్‌లో స్టేట్‌ ఛాంపియన్‌ని..!

అందం ఉంది, వెనక సూపర్‌స్టార్‌ కృష్ణ కుటుంబం ఉంది, అతడికేం... అనుకుంటారందరు. కానీ అతడిని నటుడిగా నిలబెట్టింది అవి కాదు. అంతకు మించిన సామర్థ్యం, తపన! టాలీవుడ్‌లో హీరోగా ఉన్న అతడు... బాలీవుడ్‌లో విలన్‌గానూ చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. యువ హీరోల్లో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న ఆ నటుడు సుధీర్‌బాబు. తన జీవితంలోకి సినిమాలు ఎలా వచ్చాయో, తనను ఎలా మార్చాయో చెబుతున్నాడిలా..!

నా చిన్నపుడు విజయవాడలో ఉండేవాళ్లం. ఓసారి ఇంట్లో ఓ బ్లాక్‌ అండ్‌ వైట్‌ ఫొటో కనిపించింది. దాన్లో అమ్మ బ్యాడ్మింటన్‌ రాకెట్‌నీ, కప్పుల్నీ పట్టుకుని ఉంది. అమ్మ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌ అని అర్థమైంది. నాకపుడు ఎనిమిదేళ్లుంటాయి. ఆ ఫొటో స్ఫూర్తితో నేనూ రాకెట్‌ పట్టి ఫ్రెండ్స్‌తో ఆడటం మొదలుపెట్టాను. బాగా ఆడుతుండటంతో స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా(శాయ్‌) స్కాలర్‌షిప్‌కి ఎంపికయ్యాను. అప్పట్నుంచి కొన్నాళ్లు శాయ్‌ హాస్టల్‌లో ఉంటూ బ్యాడ్మింటన్‌ నేర్చుకునేవాణ్ని. ఇంజినీరింగ్‌ బెంగళూరులో చేశాను. అక్కడ ప్రకాశ్‌ పదుకునే అకాడమీలో ప్రాక్టీసు కొనసాగించాను. ఆ సమయంలోనే పుల్లెల గోపీచంద్‌ అక్కడ శిక్షణ తీసుకునేవారు. అప్పటికే మాకు పరిచయం ఉంది. అకాడమీలో మేమిద్దరమే తెలుగువాళ్లం. అక్కడ కలిసి ప్రాక్టీస్‌ చేసేవాళ్లం. డబుల్స్‌ కూడా ఆడేవాళ్లం. బైక్‌పైన తిరిగేవాళ్లం. అలా మంచి ఫ్రెండ్స్‌ అయ్యాం. నేను ఆంధ్రప్రదేశ్‌ జూనియర్‌ విభాగంలో స్టేట్‌ ఛాంపియన్‌, తను మెన్స్‌ విభాగంలో ఛాంపియన్‌. కర్ణాటక తరఫునా ఆడాను. ఇప్పుడు మెరుగైన వైద్య సదుపాయాలూ, స్పాన్సర్‌షిప్‌లూ వస్తున్నాయి కానీ అప్పటి పరిస్థితి వేరు. ఏదైనా గాయమైతే కెరీర్‌ అంతటితో ముగిసిపోయే ప్రమాదం ఉండేది. ఇంట్లో ఇవన్నీ చర్చించాక బ్యాడ్మింటన్‌ వదులుకున్నాను. కానీ నా వ్యక్తిత్వ నిర్మాణంలో బ్యాడ్మింటన్‌ది కీలక పాత్ర. ఫిట్‌నెస్‌, ఫోకస్‌, డిటర్మినేషన్‌, ఏకాగ్రతా, లక్ష్యఛేదనా నేనక్కడ నేర్చుకున్నాను. సినిమాల్లోకి వచ్చాక అవన్నీ ఉపయోగపడ్డాయి.

సినిమాల్లోకి ఇలా...
విజయవాడలో వినోదం అంటే సినిమానే. కానీ సినిమాల్లోకి వెళ్తానంటే మాత్రం మనల్ని తేడాగా చూసేవారు. సినిమా లక్ష్యం ఉన్నా కూడా దాచుకోవాల్సిందే. నాదీ అదే పరిస్థితి. నా పెళ్లి తర్వాత ‘ఏమాయ చేసావె’ నిర్మాత మంజుల గారు ఆ సినిమాలో సమంత అన్నయ్య క్యారెక్టర్‌ చేయమని అడిగారు. సినిమా కోరిక ఇలా తీరుతుందిలే అని చేస్తానన్నాను. మొదట్రోజు పేజీ డైలాగులు రాసిచ్చారు. అవి మలయాళంలో చెప్పాలి. రోజంతా ప్రాక్టీసు చేశాను. కానీ షాట్‌ టైమ్‌ వచ్చేసరికి డైలాగ్‌ వస్తే ఎక్స్‌ప్రెషన్‌ వచ్చేది కాదు, ఎక్స్‌ప్రెషన్‌ వస్తే డైలాగు వచ్చేది కాదు. దర్శకుడు ఇంగ్లిష్‌ పదాలు వాడినా ఫర్వాలేదన్నారు. మొత్తానికి అది పూర్తిచేశాను. ఇంటికి వెళ్లాకా, నిద్రలోనూ డైలాగులు గుర్తు తెచ్చుకునేవాణ్ని. చాలారోజులు సినిమా అనుభవాలే గుర్తొచ్చేవి. నటనమీద ఉన్న ఆసక్తి అప్పుడే అర్థమై, సినిమాల్లో ప్రయత్నిద్దామనుకున్నా. ఇంట్లో తెలియకుండా ఏడాదిపాటు దానికి సంబంధించిన నైపుణ్యాలు నేర్చుకున్నాను. నేను చేస్తున్న వ్యాపారాన్ని లీజ్‌కి ఇవ్వడంతో నాకు టైమ్‌ కూడా దొరికింది. రమాకాంత్‌గారని ఓ శిక్షకుడి సాయంతో ప్రాక్టీసు మొదలుపెట్టాను. రోజుకో తెలుగు నవల ఇచ్చి అందులో ఒక పేజీ మడత పెట్టేవారు. అటూ ఇటూ అయిదేసి పేజీలు చదివి నాకిచ్చిన పేజీలోని క్యారెక్టర్‌ని పెర్‌ఫార్మ్‌ చేయాలి. దాదాపు ఏడాదిపాటు రోజూ అలా చేశాను. పొద్దున్నా, సాయంత్రం జిమ్‌, మార్షల్‌ ఆర్ట్స్‌ ప్రాక్టీసు చేసేవాణ్ని. తర్వాత నా స్కిల్స్‌తో వీడియో ప్రొఫైల్‌ తయారుచేసి నా భార్య ప్రియకి చూపించాను. మొదట నమ్మలేదు. సడన్‌గా సినిమాలేంటని కంగారుపడి కృష్ణగారితో మాట్లాడింది. ఆయనకి వీడియోలు చూపించాను. నా ఆసక్తి చూసి ఆయన చేయమనే ప్రోత్సహించారు.

విలన్‌ పాత్రతో గుర్తింపు
నా యాక్టింగ్‌, ఫైటింగ్‌ స్కిల్స్‌ ఉన్న వీడియోలు పట్టుకుని చాలామందిని కలిశాను. ఎవరూ వెంటనే అవకాశం ఇవ్వలేదు. అపుడు దర్శకుడు సత్య పరిచయమయ్యాడు. ఓ తమిళ సినిమా ఉంది రీమేక్‌ చేద్దామన్నారు. అదే ఎస్‌.ఎమ్‌.ఎస్‌. దానికి బడ్జెట్‌ కూడా సమకూర్చాను. మొత్తానికి ఆ సినిమా విడుదలైంది. హీరోగా తెరమీద నన్ను చూసుకుని ఎంతో హ్యాపీగా ఫీలయ్యాను. కానీ ఆ సినిమావల్ల ఆర్థికంగా నష్టం వచ్చింది. దాన్నుంచి బయటపడ్డానికి రెండేళ్లు పట్టింది. ఎస్‌.ఎమ్‌.ఎస్‌. అనుభవంతో ప్రేక్షకులు ముందు మనలోని హీరోని కాకుండా నటుణ్ని చూస్తారని అర్థమైంది. దర్శకుడు మారుతి కొన్ని కథలు చెప్పినపుడు కమర్షియల్‌ సినిమా కాకుండా కాన్సెప్ట్‌ బేస్డ్‌గా ఉన్న సినిమా ఎంచుకున్నాను. అదే ‘ప్రేమకథా చిత్రమ్‌’. అనుకున్నట్టే ఆ సినిమాతో మంచి గుర్తింపు వచ్చింది. తర్వాత ‘ఆడు మగాడ్రా బుజ్జి’ చేశాను. అనుకున్నంతగా ఆడలేదు. ఆ తర్వాత వచ్చిన మూడు సినిమాలు ఓ మాదిరిగా ఆడాయి. నా కెరీర్‌ తెలుగు సినిమాల వల్ల కాకుండా హిందీ సినిమా ‘భాగీ’ ద్వారా మారిందని చెప్పాలి. ఓ పెద్ద నిర్మాణ సంస్థ నాకు అవకాశం ఇచ్చేసరికి ‘వీడిలో ఏదో టాలెంట్‌ ఉంద’ని మనవాళ్లకీ అర్థమైంది. హీరో పాత్రలు ఇవ్వని గుర్తింపు భాగీలోని విలన్‌ పాత్ర ఇచ్చింది. ఎస్‌.ఎమ్‌.ఎస్‌. చివర్లో ఆ సినిమా కోసం చేసిన కొన్ని మార్షల్‌ ఆర్ట్స్‌ క్లిప్స్‌ని చూపించాను. అది చూసే భాగీకి పిలిచారు. ఆ సినిమా ఇచ్చిన స్ఫూర్తితో ‘శమంతకమణి’లో చిన్న నిడివి ఉన్న పాత్ర అయినా చేశాను. అది చూసి ‘సమ్మోహనం’లో ఇంద్రగంటి మోహన్‌ కృష్ణ అవకాశం ఇచ్చారు. నా కెరీర్‌లో ఇదో మంచి హిట్‌. నిజానికి ఇంద్రగంటితో నా మొదటి సినిమా చేయాల్సి ఉంది. కానీ కొన్ని కారణాలవల్ల ఆ సినిమా పట్టాలెక్కలేదు. మంచి డైరెక్టర్‌తో పరిచయ చిత్రం మిస్సయిపోయిందన్న బాధ నన్ను చాన్నాళ్లు వెంటాడింది. ఆ కథే తర్వాత ‘ఊహలు గుసగుసలాడే’గా వచ్చింది.

లవ్‌ కమ్‌ అరేంజ్డ్‌...
జూబ్లీహిల్స్‌లో మా ఇంటికి దగ్గర్లోనే హీరో కృష్ణగారి ఇల్లు. వాళ్ల చిన్నమ్మాయి ప్రియకూ, నాకూ  పెళ్లి చేద్దామన్న ఆలోచనతో ఓసారి కలిసి మాట్లాడమని ఇద్దరి ఇంట్లోనూ చెబితే ఓ రెస్టరెంట్‌లో కూర్చుని మాట్లాడుకున్నాం. నిజానికి అప్పటికి మేం పెళ్లికి సిద్ధంగా లేం. తన బొటనవేలికి ఉంగరం పెట్టుకుంది. ‘ఏంటండీ కొత్త స్టైలా’ అన్నాను. ‘లేదండీ, ఒకప్పుడు లావుగా ఉండేదాన్ని. ఈ ఉంగరం చిటికెన వేలికి ఉండేది. ఇప్పుడు తగ్గాను అందుకే బొటనవేలికి పెడుతున్నాను’ అంది. బరువు తగ్గడంలో ఆమె అంకితభావం, తపనా నాకు బాగా నచ్చాయి. కానీ పెళ్లి గురించి మేమేం మాట్లాడుకోలేదు. ఇంట్లో అడిగితే ఆ ఆలోచన లేదని చెప్పాం. కానీ ఆ పరిచయంతో అప్పుడప్పుడూ మాట్లాడుకునేవాళ్లం. ఇద్దరికీ ఇంట్లో వేరే సంబంధాలు చూసేవాళ్లు. ఆ విషయాల్నీ చెప్పుకునేవాళ్లం. చివరకి మాదే మంచి జోడీ అనుకుని ఇంట్లో చెప్పాం. అలా మాది లవ్‌ కమ్‌ ఎరేంజ్డ్‌ మ్యారేజ్‌. పరిచయం తర్వాత రెండేళ్లకు మాకు పెళ్లయింది. దాదాపు సినిమాలన్నీ రిలీజ్‌ రోజే చూసేస్తాం. ప్రతిసారీ తను సినిమాని సరిగ్గా అంచనా వేస్తుంది. వాళ్ల నాన్నా అన్నయ్యల సినిమాల్ని చూసి ఆ స్కిల్‌ వచ్చుంటుంది. నా సినిమా స్క్రిప్టుల్నీ తనకి వినిపిస్తాను.

మహేష్‌ అభిమానిని...
నేను మొదట్నుంచీ మహేష్‌ అభిమానిని. పెళ్లికి ముందు ఫ్రెండ్స్‌తో కలిసి ఒక ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ నడిపేవాణ్ని. అప్పుడే కృష్ణగారినీ, మహేష్‌నీ ఒకట్రెండుసార్లు కలిశాను. ఇప్పుడు కుటుంబ సభ్యుడినే అయినా నాలోని అభిమాని కొనసాగుతూనే ఉన్నాడు. మహేష్‌తో మాట్లాడేటపుడు అవేవీ బయటకి కనిపించకుండా చూసుకుంటాను. సినిమాల్లోకి వస్తున్నానన్న విషయాన్ని మహేష్‌తో నమ్రత చెబితే ఓసారి కలవమన్నాడు. అప్పుడు ‘దూకుడు’ సెట్స్‌లో ఉన్నాడు. ‘సినిమాలు చాలా కష్టం. కుటుంబానికి దూరమవ్వాలి. అదృష్టం కూడా ఉండాలి...’ ఇలా చాలా చెప్పాలనుకున్నాడట. కానీ, నేను వెళ్తూనే నా వీడియోలు చూపించేసరికి సర్‌ప్రైజ్‌ అయ్యాడు. అప్పటికే ఎస్‌.ఎమ్‌.ఎస్‌. కథ అనుకున్నాం. ఆ స్క్రిప్టు చూపించాను. వెంటనే శ్రీనువైట్ల గారికి చూపించాడు. ఆయన కొన్ని సలహాలు ఇచ్చారు. ఆ తర్వాత నుంచి మాత్రం తనని ఎలాంటి హెల్ప్‌ అడగలేదు. వృత్తిలో ఎవరికాళ్లమీద వాళ్లు నిలబడాలనేది మహేష్‌ ఉద్దేశం. నాకా విషయం మొదట్నుంచీ తెలుసు. పిలిస్తే నా ఆడియో ఫంక్షన్‌లకి వస్తాడు. సినిమా బావుంటే బావుందని చెబుతాడు. అంతకు మించి కలగజేసుకోడు. మొదట్లో ఫిట్‌నెస్‌ గురించి సలహాలు అడిగేవాడు. ఇప్పుడు తనకీ మంచి నాలెడ్జ్‌ ఉంది. ఇప్పుడు కలిస్తే ఎక్కువగా సినిమాల గురించి మాట్లాడతాం.

నిర్మాతగా రాబోతున్నా...
యూవీ క్రియేషన్స్‌ వంశీ, మరో ఫ్రెండ్‌ విజయ్‌, నేనూ ఫిల్మ్‌ డిస్ట్రిబ్యూషన్‌ కూడా చేసేవాళ్లం. ప్రభాస్‌ మాకు మంచి స్నేహితుడు. ప్రభాస్‌ చెప్పడంతో దిల్‌రాజు మాకు ‘ఆర్య’ సినిమా డిస్ట్రిబ్యూషన్‌  అవకాశం ఇచ్చారు. తర్వాత ‘నువ్వొస్తానంటే
నేనొద్దంటానా’, ‘బొమ్మరిల్లు’, ‘భద్ర’... ఇలా ఆరేడు సినిమాలకు పనిచేశాను. డిస్ట్రిబ్యూటర్‌గా ఒక్క రూపాయీ పోగొట్టుకోలేదు. హీరో అయ్యాక కూడా నా సినిమాల నిర్మాణంలోనూ భాగంగా ఉండేవాణ్ని. కథ నచ్చిన తర్వాత కొన్నిసార్లు నిర్మాతకోసం వెతకాల్సి వచ్చేది. మంచి కథ ఉంటే సొంతంగా నిర్మిద్దామన్న ఉద్దేశంతో ‘సుధీర్‌బాబు ప్రొడక్షన్స్‌’ని స్థాపించాను. నా తర్వాత సినిమా ‘నన్ను దోచుకుందువటే’... సొంత బ్యానర్‌నుంచే వస్తోంది. నేను కథని మొదట ప్రేక్షకుడి కోణంలోంచే చూస్తాను. తర్వాతే హీరోగా, నిర్మాతగా ఆలోచిస్తాను. ప్రేక్షకుడి నాడి తెలిస్తేనే విజయం దక్కుతుంది.

ఆ సినిమా అదృష్టమే!

నాన్న పోసాని నాగేశ్వరరావు... ఎరువుల  వ్యాపారం చేసే పీఎన్‌ఆర్‌ గ్రూప్‌ వ్యవస్థాపకుడు. అమ్మ రాణి... గృహిణి. 
* మాకిద్దరు పిల్లలు. చరిత్‌ మానస్‌, దర్శన్‌.  భలే భలే మగాడివోయ్‌లో నాని, విన్నర్‌లో తేజూ 
చిన్నప్పటి పాత్రల్ని చేసింది మా పెద్దోడే. చిన్నోడు కొత్తగా వస్తోన్న ‘గూఢచారి’లో చేస్తున్నాడు. 
* ఫిట్‌నెస్‌కు ప్రాధాన్యం ఇస్తాను. పంచదార, పాలు తీసుకోను. ప్రతి మూడు గంటలకీ కొద్దిగా తింటాను. రోజూ 45 నిమిషాలైనా వ్యాయామం చేస్తాను. 
* దాదాపు రోజూ కృష్ణ గారిని కలుస్తాను. కుటుంబం గురించి చాలా జాగ్రత్త తీసుకుంటారు. ఆయనో న్యూస్‌ ఛానెల్‌. సినిమాలతోపాటు ప్రతి విషయం గురించీ ఆయన క్షుణ్ణంగా తెలుసుకుంటారు. ఈ వయసులోనూ రోజూ ఫ్యాన్స్‌తో మాట్లాడతారు. 
* గోపీచంద్‌ జీవిత కథ ఆధారంగా రానున్న సినిమాలో గోపీ పాత్ర పోషిస్తున్నాను. బాలీవుడ్‌లో ఓ స్టార్‌ హీరో ఈ కథ చేయాలనుకున్నాడు. కానీ ఆట గురించి పూర్తిగా తెలిసిన నేను చేస్తేనే బావుంటుందని గోపీ చెప్పాడు. నిజంగా ఇది నాకు దక్కిన అదృష్టం. దానికి పూర్తి న్యాయం చేయడానికి ప్రయత్నిస్తాను!

- సుంకరి చంద్రశేఖర్‌
ఫొటోలు: జయకృష్ణ

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.