close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
నాకు శక్తినిచ్చే టానిక్కులవే..!

నాకు శక్తినిచ్చే టానిక్కులవే..!

  ‘పరుగాపక పయనించడం...’ అంటే లక్ష్యం చేరేవరకూ అవిశ్రాంతంగా ముందుకెళ్లడం మాత్రమే కాదంటారు మధుకర్‌ గంగాడి. ఓ లక్ష్యాన్ని చేరుకున్నాక, మనల్ని ఉత్తేజపరిచే మరో గమ్యంవైపు అంతే ఉత్సాహంగా వెళ్లగలగడమేనని చెబుతారు. ఆ ఉత్తేజమే మనల్ని నిత్య విజయసాధకులుగా నిలుపుతుందంటారు. మన నగరాల్లో వీధీవీధీ విస్తరిస్తున్న ‘మెడ్‌ప్లస్‌’ మందుల దుకాణాల వ్యవస్థాపకుడాయన. దక్షిణాదిలోనే అతిపెద్ద మందుల దుకాణాల హారంగా దాన్ని నిలుపుతూనే కస్టమ్‌ఫర్నిష్‌డాట్‌కామ్‌, బ్యాచ్‌ట్యాగ్‌డాట్‌కామ్‌ అనే రెండు సరికొత్త సంస్థలనీ ప్రారంభించారు. విభిన్న వ్యాపారాల్లో తన పరుగుల గురించి ఇలా నెమరేసుకున్నారు..
 

చిన్నప్పటి నుంచీ నాకు చదవడమంటే మహా ఇష్టం. పాఠ్యపుస్తకాలకి సమానంగా కథలూ, నవలలూ, మేగజైన్స్‌.. ఇలా వేటినీ వదిలేవాణ్ణి కాను. బహుశా, నేనో వ్యాపారవేత్తని కావాలనే ఆశకి బీజం వాటి ద్వారానే నాలో పడిందని ఇప్పుడు అనిపిస్తోంది. మా అమ్మానాన్నలది నల్గొండ జిల్లా తిరుమలగిరి దగ్గర చిన్నపల్లెటూరైనా, నేనూ అన్నయ్యా చెల్లెలూ పుట్టిపెరిగింది మాత్రం హైదరాబాద్‌లోనే. నాన్న ఇక్కడి ఆర్టీసీ డిపో మేనేజర్‌గా చేశారు. ఇంటికి జాతీయ అంతర్జాతీయ పత్రికలూ, పుస్తకాలన్నీ వస్తుండేవి. వాటిలో చిన్నప్పుడెప్పుడో చదివిన గొప్ప బిజినెస్‌మ్యాన్‌ల ఇంటర్వ్యూలో, వాళ్లని తిరుగులేని విజేతలుగా చూపించే కథలో నవలలో నేనూ వ్యాపారం చేయాలనే విత్తనాన్ని నాలో నాటి ఉండొచ్చు. కానీ ఆ ఆశ నాలో ఉందనే విషయం కూడా నేను మరచిపోయాను. ఐఏఎస్‌ కావాలని కొంతకాలం కలలుకన్నాను. ఇంజినీరింగ్‌ చేద్దామనీ అనుకున్నాను. అప్పటికే మా అన్నయ్య సివిల్‌ ఇంజినీరింగ్‌ చదువుతున్నాడు కాబట్టి డాక్టర్‌నైతే మంచిదన్నాడు నాన్న. అలాగేనని బైపీసీ తీసుకుని ఇంటర్‌ పాసై కర్నూలు మెడికల్‌ కాలేజీలో ఎంబీబీఎస్‌లో చేరాను. చేరిన ఏడాదికే ఆ రంగానికి నేను సరిపోనని అర్థమైపోయింది!

ఆ రెండు పుస్తకాల ప్రభావం..
నన్ను వెతుక్కుంటూ వచ్చే ఒకరిద్దరు రోగులకి మాత్రమే సేవలందించే వైద్యరంగంలో నేను ఉండలేను అనిపించింది. నేనే వందలాదిమందికి చేరువై వాళ్లకి కావాల్సింది ఇవ్వగలిగే రంగమైతేనే నా స్వభావానికి సరిపోతుందనుకున్నా. అది నాకు ఎప్పటికప్పుడు సవాలు విసురుతూ, నన్ను ఎప్పుడూ పరుగెత్తించేవిధంగా ఉండాలని కోరుకున్నా. అందుకు సొంత వ్యాపారమే కరెక్టనిపించింది. అప్పట్లో నేను చదివిన అయాన్‌రాండ్‌ ‘ఫౌంటెయిన్‌ హెడ్‌’, ‘అట్లాస్‌ ష్రగ్గుడ్‌’ నవలలు నాపైన ఎంతో ప్రభావం చూపించాయి. ‘ప్రపంచం నీ గురించి ఏమనుకున్నా ఫర్వాలేదు, నీకు మంచి అనిపించిందే చెయ్‌. నలుగురికోసం కాకుండా నీ ఉన్నత ఆశయాల కోసమే బతుకు..’ అని చెబుతాయవి. అవి నా దృక్పథాన్ని మార్చాయి. అప్పటికే ఎంబీబీఎస్‌ ఫైనల్‌ పరీక్షలూ రాసినా.. డాక్టర్‌గా ప్రాక్టీస్‌ చేయకూడదని నిశ్చయించుకున్నాను. ‘హౌస్‌ సర్జన్‌’గా వెళ్లనేలేదు. ఇంట్లో చెబితే అమ్మానాన్నా చాలా కోప్పడ్డారు. ఎంతైనా అయాన్‌రాండ్‌ పాఠకుణ్ణి కదా.. అవన్నీ పట్టించుకోలేదు! వ్యాపారం చేయాలనే నా లక్ష్యంవైపే గురిపెట్టాను.

తొలి పరుగు..
అప్పట్లో న్యూ ఉడ్‌ అని కొత్తరకం కలప మార్కెట్‌లోకి వచ్చింది. ఇప్పుడు మనం చూస్తున్న ఎండీఎఫ్‌ రకం కొయ్యలకి అది తాతలాంటిది. దిల్లీ వెళ్లి ఆ సంస్థ వాళ్లతో మాట్లాడి హైదరాబాద్‌కి డీలర్‌గా ఉంటానన్నాను. వాళ్లూ ఒప్పుకున్నారు. పెట్టుబడి కోసం లక్షరూపాయలు కావాల్సొచ్చి నాన్నను అడిగా. అసలే నేను ఎంబీబీఎస్‌ పూర్తిచేయలేదనే కోపంతో ఉన్న ఆయన వ్యాపారాలేవీ వద్దని గట్టిగా మందలించారు. నేనూ పట్టువీడలేదు. చివరికి ఏమనుకున్నారో ఏమో డీలర్‌షిప్‌కి కావాల్సిన లక్షరూపాయలు ఇచ్చేశారు! ఆ డబ్బుతోనే నా వ్యాపార ప్రస్థానం మొదలైంది. వీయూ ఉడ్‌ నుంచి ప్లై వుడ్‌, ఇతర కలప వ్యాపారాలూ చేసేదాకా ఎదిగాను. అప్పట్లో లండన్‌లో చెక్కలకి సంబంధించి కొన్ని కొత్త యంత్రాలు వచ్చాయి. వాటిని భారతదేశానికి తీసుకురావాలని ఆ నగరానికి వెళ్లాను. అప్పుడే.. అక్కడే తొలిసారి ‘ఐటీ పరిశ్రమ’ నాకు పరిచయమైంది.

రెండోది..
1997 ప్రాంతం... లండన్‌లో ఒరాకిల్‌ సంస్థ తెచ్చిన కొత్త బిజినెస్‌ సాఫ్ట్‌వేర్‌పై పట్టున్న సిబ్బంది కోసం అక్కడి ఐటీ సంస్థలు ఎదురుచూస్తున్నాయి. మనదేశంలో అప్పటికే సాఫ్ట్‌వేర్‌ విద్య వేగం పుంజుకుంటోంది. ఇక్కడి యువతని ఎంపిక చేసి లండన్‌లో ఉన్న సంస్థలకి పంపితే ఎలా ఉంటుందనే ఆలోచన వచ్చింది. వెంటనే ఓ లండన్‌ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నాను. హైదరాబాద్‌ వచ్చి కలప బిజినెస్‌తోపాటూ దానిపైనా దృష్టిపెట్టాను. ఒకట్రెండు బ్యాచ్‌లని పంపించాను. వాళ్లకి కావాల్సిన వీసాలు ఇప్పించే బాధ్యత కూడా నాదే. కానీ తర్వాత్తర్వాత లండన్‌కి వెళ్తామని హామీ ఇచ్చిన సిబ్బంది అమెరికాయే మేలని అటువెళ్లిపోయేవారు! నేను ఎదుర్కొన్న పెద్ద సవాలు అది. స్థిమితంగా ఆలోచిస్తే.. సాఫ్ట్‌వేర్‌ రంగంలో గొప్ప ఆవిష్కరణలు జరుగుతున్న అమెరికావైపే యువత మొగ్గడంలో తప్పులేదనిపించింది. అక్కడి సంస్థలతోనే వ్యాపారం చేయాలని అటు వెళ్లాను. భారత్‌ నుంచి బ్యాచ్‌లని పంపించాను. అక్కడే
‘ఇన్‌సింక్‌’ అనే ఐటీ సంస్థలో భాగస్వామిగా చేరాను. ఆరేళ్లు గడిచాయి. ఓ వ్యాపారిగా మరింత పెద్దగా ఎదగాలనుకున్నాను. ఆ ఎదుగుదలకి పెట్టుబడి కావాలి. నన్ను నమ్మి అంత పెట్టుబడి పెట్టాలంటే అందుకు తగ్గ విద్యార్హతలూ చూపించాలి. అందుకే అమెరికాలోని ప్రముఖ బిజినెస్‌ స్కూల్‌ వార్టన్‌లో ఎంబీఏ చదవడానికని చేరాను. పదిహేనేళ్ల తర్వాత మళ్లీ విద్యార్థిగా మారాను!

ఆ మూడోదే మలుపు...
ఎంబీఏలో మూడో సెమిస్టర్‌ కోసం ఓ థీసిస్‌ రాయాల్సి వచ్చింది. భారతదేశంలోని ఒకటిరెండు పెద్ద ఆసుపత్రుల సంస్థలు తప్ప మిగతా 85 శాతం ప్రైవేటు నర్సింగ్‌హోమ్‌లన్నీ 30లోపు పడకలున్నవే. వాటికి నాణ్యమైన బెడ్డులూ, ఇతర సర్జికల్‌ వస్తువులూ, మందులన్నీ తక్కువ ధరకి అందించేలా గ్రూప్‌ పర్చేజింగ్‌ ఆర్గనైజేషన్‌ పేరుతో కొత్త రకం వ్యాపారం చేయొచ్చంటూ ఓ వ్యాపార ప్రణాళిక రాశాను. ఆ థీసిస్‌ కోసం సమాచారాన్ని సేకరిస్తున్నప్పుడే.. ప్రపంచంలో ఉన్న నకిలీ ఔషధాల్లో 30 శాతం మనదేశంలోనే తయారవుతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ఒకటి కనిపించింది. విదేశాలకి ఎగుమతి చేసేవాటిల్లోనే ఇంత నకిలీలుంటే ఇక దేశీయంగా అమ్మేవాటిల్లో ఇంకెంత ఉంటుందీ.. అనే ప్రశ్న నన్ను నిలవనీయలేదు. దాన్ని అడ్డుకునేలా నాణ్యమైన మందులు తక్కువ ధరకి సామాన్యులకి అందేలా చేయాలనుకున్నాను. అందుకోసం నేను రాసిన ప్రణాళిక.. నా ఎంబీఏ కోర్సులో నాలుగో సెమిస్టర్‌కి థీÅసిస్‌గా మారింది. దాన్ని అందరూ మెచ్చుకోవడంతో 2005లో భారత్‌కి వచ్చి దాన్నే వ్యాపారంగా మలిచాను. నేనూ, నా మిత్రులూ కలిసి 1.25కోట్ల రూపాయల పెట్టుబడితో దాన్ని మొదలుపెట్టాం. మొదట ‘ఔషధి’ అనే పేరుపెట్టాం. ఆరునెలలకే దాన్ని మెడ్‌ప్లస్‌గా మార్చాం!

నిషేధించాలన్నారు..
మా దగ్గర మందులు కొన్నవాళ్లందరికీ పదిశాతం రాయితీలు ఇవ్వడం ప్రారంభించాం. మనదేశంలో ఇలాంటి ప్రయోగం ఇదివరకెవ్వరూ చేయలేదు. ఇక్కడో విషయం చెప్పాలి. వినియోగదారులుగా మందుల కోసం మనం ఖర్చుపెట్టే డబ్బులో చాలాభాగం డిస్ట్రిబ్యూటర్‌లకీ, దాన్ని అమ్మే రిటైల్‌ షాపులవాళ్లకే పోతుంది. ఆ డిస్ట్రిబ్యూషన్‌ పనుల్నీ, రీటైల్‌ షాపుల్నీ మా చేతుల్లోకి తీసుకుని.. ఆ రకంగా మేం ఆ ఖర్చులన్నీ లేకుండా చేసుకున్నాం. మాపైన తగ్గిన భారాన్నే వినియోగదారులకి రాయితీగా అందిస్తున్నామంతే! ముందు హైదరాబాద్‌లోని నారాయణగూడలో మా గిడ్డంగితోపాటు షాపునీ ప్రారంభించాం. వరసగా అన్ని ప్రాంతాలకీ విస్తరించాం. హైదరాబాద్‌లో వందషాపులకి చేరుకున్నాక దక్షిణాదిలోని ఇతర రాష్ట్రాల్లోకి అడుగుపెట్టాం. ఆ రాష్ట్రాల్లోనే కాదు.. తెలుగుప్రాంతాల్లోనూ మా పదిశాతం రాయితీని అప్పటికే ఉన్న వ్యాపారులు తీవ్రంగా వ్యతిరేకించారు. మా సంస్థని నిషేధించాలంటూ ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చేలా ఆందోళనలు చేశారు. నేను మాత్రం నా వ్యాపారం వల్ల ప్రజలకి లాభం తప్ప నష్టం లేదని మనసావాచా నమ్మాను. అదే గెలిచింది. మేమే కాదు.. మాకు ముందు ఇక్కడ చెయిన్‌ మందుల షాపుల్ని ప్రారంభించిన సంస్థలూ రాయితీలు ఇవ్వడం ప్రారంభించాయి. నేను ఆశించినట్టే వినియోగదారులు లాభపడుతున్నారు. ఒకటిన్నర కోటితో ప్రారంభించిన మా సంస్థ విలువ ఇప్పుడు రెండువేల కోట్ల రూపాయలు!

నాలుగూ.. ఐదు!
మెడ్‌ప్లస్‌.. దక్షిణాదిన నంబర్‌ వన్‌ రిటైల్‌ మెడిసిన్‌ బ్రాండ్‌. దేశంలో మాది రెండోస్థానం. మాకు దేశవ్యాప్తంగా 1400 షాపులున్నాయి. మాకంటే కాస్త ముందంజలో ఉన్న సంస్థకి రెండువేల షాపులున్నాయి. దాన్ని అధిగమించాలని కాదుకానీ.. మా విస్తరణలో భాగంగా దేశవ్యాప్తంగా త్వరలోనే పదివేల షాపులు ఏర్పాటుచేయబోతున్నాం. ఓవైపు ఈ పనుల్లో ఉంటూనే నేను ఫర్నిచర్‌ రంగం మీదా దృష్టిపెట్టాను. ఎవరో డిజైన్‌ చేసినవి తీసుకోవడం కాదు.. మనకు మనమే ఆన్‌లైన్‌లో డిజైన్‌ చేసుకుని మన అభిరుచి మేరకే వాటిని తయారుచేయించే కొత్త ట్రెండ్‌కి తెరతీయాలనుకున్నాను. అలా ‘కస్టమ్‌ఫర్నిష్‌డాట్‌కామ్‌’ సంస్థని ప్రారంభించాను. దేశంలో ఈ తరహా సంస్థ ఇదొక్కటే కాబట్టి.. ప్రజలు చక్కగా ఆదరించారు. పత్రికల్లో ఫ్యాక్టరీ ధరలకే అమ్ముతున్నాం అని ప్రకటనలు చూసుంటారు. అవి ఏ కొన్ని ఉత్పత్తులకో పరిమితమవుతాయి. కానీ చెప్పుల నుంచి దుస్తుల దాకా అన్నింటినీ ఇలాగే భారీ మొత్తంలో కొని తక్కువధరకి అమ్మితే ఎలా ఉంటుందనే ఆలోచనతో ఇటీవల బ్యాచ్‌ట్యాగ్‌డాట్‌కామ్‌ను ప్రారంభించాను. అంచనాకిమించి ఆదరణ సాధించుకుందీ సంస్థ. ‘మూడు వ్యాపారాల్లోనూ మీరు అనుకున్నవి సాధిస్తున్నారు.. తర్వాతేమిటీ?’ అని అడుగుతున్నారు చాలామంది. నిజానికి ‘బ్యాచ్‌ట్యాగ్‌’ ఎన్నో వ్యాపారాల కలగూరగంప. దాంట్లో విజయం సాధిస్తే చాలావాటిలో గెలుపు అందుకున్నట్టేనని భావిస్తున్నా.

యువతకోసం.. సేవాదృక్పథంతో!

దేశంలో ఎన్నో కొత్త కంపెనీలు వస్తున్నాయి. వాళ్లకి వేలాదిమంది సిబ్బంది అవసరముంది. మరోవైపు.. నిరుద్యోగ యువకుల సంఖ్యా ఎక్కువగానే ఉంది. దీనిక్కారణం మన కంపెనీలు కేవలం ఏవో కొన్ని విద్యాసంస్థల నుంచి మాత్రమే నాణ్యమైన సిబ్బంది దొరుకుతారని గుడ్డిగా నమ్మడమే. అలాంటి ఎంపిక సరికాదని కొద్దిరోజుల్లోనే తెలుస్తున్నా కంపెనీలకి ప్రతి విద్యార్థినీ కూలంకషంగా పరిశీలించే సమయం ఉండదుకాబట్టి ఇలా చేస్తుంటారు. అలాకాకుండా, కాలేజీల నుంచి మెరుగైన సిబ్బందిని ఎంపిక చేసుకోగలిగేలా ఓ పరీక్ష నిర్వహిస్తే ఎలా ఉంటుంది... కాలేజీలకున్న మంచి పేరుతో సంబంధంలేకుండా అన్ని విద్యాసంస్థల్లోని విద్యార్థులకీ ఒకేరకం నాణ్యతతో ఈ పరీక్షని నిర్వహిస్తాం... ఆ సమాధానపత్రాలను కంపెనీలకి అందిస్తే వాళ్లే మెరుగైనవాళ్లని ఎంపికచేసుకుంటారు కదా... అన్నది నా ఆలోచన. మా సంస్థ సామాజిక సేవల్లో(సీఎస్‌ఆర్‌) భాగంగా విద్యార్థుల్లోని నైపుణ్యాలన్నింటినీ బయటపెట్టే ఇలాంటి పరీక్షలు నిర్వహించాలనుకుంటున్నాం. ముందు సాఫ్ట్‌వేర్‌ రంగం నుంచే మొదలుపెడతాం. ఇందుకోసం ప్రభుత్వాలతోనూ మాట్లాడుతున్నాను!

అవన్నీ నాకు శక్తికేంద్రాలే!

క్కరే ఇన్ని సంస్థలని ఎలా నడపగలుగుతున్నారు.. అంటారా! ఏ సంస్థ కూడా ఒక్కర్ని నమ్ముకుని నడవదు. మెడ్‌ప్లస్‌ విజయంలో నా కాలేజీ స్నేహితులు డాక్టర్‌ భాస్కర్‌రెడ్డి, డాక్టర్‌ సురేంద్రలాంటివాళ్లు దాదాపు సహవ్యవస్థాపకులుగానే వ్యవహరిస్తున్నారు. పదివేల మంది సిబ్బంది అహర్నిశలూ శ్రమిస్తున్నారు. ఇలా ప్రతి వ్యాపారంలోనూ నాకంటూ మంచి బృందం దొరకడంవల్లే ఇన్ని విజయాలు సాధ్యమవుతున్నాయి. నా సంస్థల కోసం ప్రతిరోజూ పన్నెండుగంటలు పనిచేస్తాను. ప్రతి క్షణం ప్రయోజనకరంగా ఉండాలని మాత్రమే కోరుకుంటాను. ఆరోగ్యానికి వ్యాయామం, మానసిక శక్తికి పుస్తకాలూ, ప్రశాంతతకి నా కుటుంబం.. ఇవే నా పరుగుకి శక్తినిచ్చే టానిక్కులు!

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.