close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
వ్యాస్‌గారి అబ్బాయినంటే.. ఎంత గౌరవమో!

వ్యాస్‌గారి అబ్బాయినంటే.. ఎంత గౌరవమో!

 కేఎస్‌ వ్యాస్‌ ఐపీఎస్‌... తెలుగురాష్ట్రాల పోలీసులు గర్వంతో తలెత్తుకునే పేరు! సామాన్యులు కూడా ‘పోలీసంటే అలా ఉండాలి’ అనుకునే పేరు! ఆ ధీరగంభీర వ్యాస్‌లో ప్రపంచానికి తెలియని ఎంతో హాస్యప్రియత్వం, సంగీత పరిజ్ఞానం, కారుణ్యాలు ఉండేవి. ఆయనలోని ప్రపంచానికి తెలియని ఆ సున్నితత్వమంతా మూర్తీభవించినట్టు ఉంటారు వాళ్లబ్బాయి కోట శ్రీవత్స. హైదరాబాద్‌ జాయింట్‌ కలెక్టర్‌ ఆయన! అంతపెద్ద బాధ్యతల్లో ఉంటూనే ఇక్కడి ఆలయాలూ, అనాథాశ్రమాల కోసం శాస్త్రీయ సంగీత కచేరీలు చేస్తుంటారు. ఆ విలక్షణ యువ అధికారి మనోగతం ఇది...నాకప్పుడు తొమ్మిదేళ్లు. నాలుగో తరగతి చదువుతున్నా. సాయంత్రం స్కూల్‌ నుంచి వచ్చిన నన్ను పలకరిస్తూనే వాకింగ్‌కి బయల్దేరారు అమ్మానాన్న. వాళ్లటు వెళ్లగానే నేను ఫ్రెషప్‌ అయి నాన్నమ్మతో మాటల్లో పడ్డాను. అందువల్లనేమో అమ్మానాన్నలు తిరిగొచ్చే సమయం దాటిపోతున్నా గమనించలేదు. తర్వాత చూసుకుని ‘అరె.. ఈరోజు చాలా ఆలస్యమైందే!’ అనుకున్నాం. ఇంతలో మాజీ డీజీపీ జేవీ రాముడు అంకుల్‌ వాళ్లావిడ వచ్చి చెప్పారు ‘నాన్నకి దెబ్బ తగిలింది... ఆసుపత్రికి తీసుకెళ్లారు’ అని. వాకింగ్‌ చేస్తూ పడిపోతే దెబ్బతగలిందేమో అనుకున్నాన్నేను.  కాదు అని ఆ తర్వాతి గంటలోనే తెలిసిపోయింది. టీవీల్లోనూ వార్తలొచ్చాయి. తర్వాతి రోజు రాష్ట్ర, జాతీయ
పత్రికలన్నీ నాన్న హత్య గురించే ప్రధానంగా రాశాయి... వాకింగ్‌కి వెళ్తున్న నాన్నని తుపాకీతో కాల్చారనీ... ‘అతివాదం’పై పోరాటంలో బలైన తొలి ఐపీఎస్‌ అధికారి ఆయనేననీ! కళ్ళనిండానీళ్ళతో స్పష్టాస్పష్టంగానే ఆ రోజు నాన్న భౌతికకాయాన్ని చూశాను. కానీ నాన్నంటే ఆ శరీరం మాత్రమే కాదని ఇప్పుడు... ఈ పాతికేళ్ల తర్వాత తెలుస్తోంది నాకు. ఆయన నేర్పిన విలువలూ, క్రమశిక్షణా, నాకందించిన సంగీత వారసత్వం, ప్రపంచానికి అంతగా తెలియని ఆయన హాస్యప్రియత్వం, సున్నితత్వం... వీటన్నింటికీ సంబంధించిన జ్ఞాపకాలే నాన్నంటే!దాక్కుని వినేవారు!
నాన్నది మెదక్‌ జిల్లా. తాతగారు హెడ్మాస్టర్‌. నాన్న వ్యవసాయంమీద ఆసక్తితో ఆ సబ్జెక్టులో డిగ్రీ, పీజీ చేశారు. పీహెచ్‌డీలో గోల్డ్‌మెడల్‌ అందుకున్నారు! ఆ తర్వాత దేశానికి సేవ చేయాలని ఐపీఎస్‌ అయ్యారు. వెళ్లిన ప్రతిచోటా తనదైన ముద్రవేశారు. ‘విజయవాడ తొలి అర్బన్‌ ఎస్పీగా అక్కడ శాంతిభద్రతల సమస్యకు పరిష్కారం చూపినా... గ్రేహౌండ్స్‌ని స్థాపించినా...హైదరాబాద్‌లో తొలి ట్రాఫిక్‌ పోలీసు వ్యవస్థను ఏర్పాటుచేసినా... అన్నింటా కొత్త చరిత్రకి శ్రీకారంచుట్టారు’ - నాన్న చనిపోయాక ఆయన గురించి నేను విన్న విశేషాలివి. ఇప్పటికీ నేను ఎక్కడికెళ్లినా ఆయన గురించి సీనియర్‌లూ, సహచరులే కాదు... కొత్తగా సర్వీసులో చేరినవాళ్లూ చెబుతుంటే ఆశ్చర్యంగా ఉంటుంది. వ్యాస్‌గారి అబ్బాయినని తెలియగానే నాపట్లా ఎంత గౌరవమో!
ఎంత ఉద్రిక్త వాతావరణంలో పనిచేసినా దాని ప్రభావమేదీ ఇంటిపైన పడకుండా చూసుకునేవారు నాన్న. మాతో ఆడుతూ, పాడుతూనే ఉండేవారు. ఏమాత్రం ఖాళీ ఉన్నా కామెడీ సినిమాలని చాలా ఇష్టంగా చూసేవారు. అన్నింటికన్నా ఉదయం, సాయంత్రం సంగీతం వినేవారు. అవును! నాన్నకి తాతయ్యల కాలం నుంచే బలమైన సంగీతవారసత్వం ఉంది. మా అత్తయ్యలూ సంగీత, నాట్య రంగంలోనే ఉన్నారు. మా అమ్మ అరుణ చెన్నైలో పుట్టిపెరిగింది. శాస్త్రీయ సంగీతం నేర్చుకుంది. నాన్న ఆ వారసత్వాన్ని నాకూ అందించాలనుకున్నారు. చిన్నప్పట్నుంచే ప్రముఖ కర్ణాటక సంగీతగురువు రేవతి రత్నస్వామిగారి దగ్గర చేర్చారు. ఎక్కడికి బదిలీ అయినా అక్కడ మాకు సంగీత శిక్షణ తప్పనిసరి చేశారు. ఎమ్మెస్‌ సుబ్బలక్ష్మీ, ఎమ్మెల్‌ వసంతకుమారి నుంచి నేదునూరి, నూకల చినసత్యనారాయణ దాకా అందరి సంగీతంతోనూ పరిచయం చేయించారు. సంగీతం సులభంగానే వంటబట్టినా చిన్నప్పుడు నాకు స్టేజ్‌ ఫియర్‌ ఎక్కువ. గురువుగారు తప్ప పక్కన ఎవరున్నా పాడేవాణ్ణి కాదు. నాన్నకేమో నా పాట వినాలని కోరిక. కానీ తనను చూస్తే ఎక్కడ నేను పాడడం ఆపేస్తానో అని, ఎదురుగా రాకుండా కర్టెన్‌ చాటున ఉండి వినేవారు. అది చూస్తే ఎంతో నవ్వొచ్చేది. నాన్నకి సంబంధించి నాలో ఉన్న ఓ అద్భుతమైన జ్ఞాపకం అది.చదువుల్లో పడిపోయాను...!
నాన్న చనిపోయాక మా ఉమ్మడి కుటుంబం వాతావరణమంతా నేలకూలిన పక్షిగూడులా మారింది. ఎవరికీ ఏమీ తోచని పరిస్థితుల్లో అమ్మే మొదట తేరుకుంది. నన్ను చదువూ, సంగీతంలో మునిగిపోయేలా చేసింది. ఇంటర్‌ ముగించేసరికే హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూల్లో మంచి గాయకుడిగా పేరుతెచ్చుకున్నా. ఉస్మానియాలో లైఫ్‌సైన్సెస్‌తో డిగ్రీలో చేరాను. బయో కెమిస్ట్రీలో పీజీ చేశాను. మరోవైపు అక్కడ జరిగిన రాష్ట్రస్థాయి సంగీత పోటీలన్నింటా గెలిచాను. పీజీ తర్వాత వైద్య శాస్త్రజ్ఞుడిగా (మెడికల్‌ రీసెర్చి) పరిశోధనలు చేయాలనుకున్నాను. అమెరికాలోని లూసియానా స్టేట్‌ యూనివర్సిటీలో ‘ఎయిడ్స్‌ అండ్‌ క్యాన్సర్‌’ పైన పరిశోధనకు సీటొచ్చి వెళ్లిపోయాను. వెళ్లిన కొన్నాళ్లకే స్కాలర్‌షిప్‌ కూడా సాధించాను. ఇక అమెరికాలో పరిశోధనే నా జీవితం అనుకుంటుండగా... నా కుటుంబం అందించిన సంస్కృతీ సంప్రదాయాలకి దూరమవుతున్నాననే అసంతృప్తి వేధించడం ప్రారంభించింది. ఇది హోమ్‌సిక్‌ కాదు అంతకుమించి. నాన్నని చూస్తూ పెరిగిన నాలో నిక్షిప్తమైన ఏదో భావన... నన్ను భారత్‌వైపు తోసింది. మొదటి సెమిస్టర్‌ రాసి భారత్‌లో వాలిపోయాను. వచ్చిందే తడవుగా సివిల్స్‌ రాశానుకానీ... ఐఏఎస్‌ తప్పిపోయింది. తర్వాత గ్రూప్‌ వన్‌ పరీక్షలు రాసి సెలెక్ట్‌ అయ్యాను. ముందు చిత్తూరు ఆర్డీఓగా వెళ్లాను. తర్వాత తెలంగాణకే వచ్చి... ఇక్కడి వికారాబాద్‌, రంగారెడ్డి జిల్లాల్లో పనిచేశాను. డిప్యుటీ కలెక్టర్‌నయ్యాను. హైదరాబాద్‌  ఆర్టీఓగానూ...మేజిస్ట్రేట్‌గానూ పనిచేశా. గత మార్చిలో హైదరాబాద్‌ జాయింట్‌ కలెక్టర్‌గా అదనపు బాధ్యతలు తీసుకున్నాను.
రంగాలు వేరుకానీ...
హైదరాబాద్‌లోని ధూల్‌పేటలో మంగళ్‌హాట్‌ అనే ప్రాంతం ఉంది. మామూలుగా ఇల్లంటే వంటగది, బెడ్రూము, బాత్రూమ్‌లే ఉంటాయని అనుకుంటాం కదా... అక్కడిళ్లలో వాటితోపాటూ ఓ కెమికల్‌ ల్యాబ్‌లాంటిదీ ఉంటుంది. అలాంటి ల్యాబ్‌లోనే అక్కడ ఇంటింటా గుడుంబా కాస్తారు. ఎన్నో తరాలుగా కొన్ని కుటుంబాలు ఆ వృత్తిలో ఉన్నాయి.
తెలంగాణ సర్కారు, హైదరాబాద్‌ జిల్లా పాలనా యంత్రాంగం తరపున వాళ్లచేత ఆ పని మాన్పించి  పునరావాసం కల్పించే బాధ్యత నాది. ఇప్పటికే కొన్ని వందల కుటుంబాలని గౌరవప్రదమైన చేతివృత్తుల్లోకి తీసుకురాగలిగాను. ఇంతచేస్తున్నా... కొన్ని కుటుంబాలు గుడుంబా తయారీని మానుకోలేకపోతున్నాయి. అలాంటివాళ్లని నుంచి ‘బైండ్‌ ఓవర్‌’ తీసుకుంటాం. అంటే ఏడాదిపాటు గుడుంబా తయారీ చేయమని హామీ తీసుకుంటాం. ఆ హామీ తప్పినవాళ్లకి నేను స్పెషల్‌ ఎగ్జిక్యూటివ్‌ మేజిస్ట్రేటుగా మూడేళ్లవరకూ జైలు శిక్ష విధించవచ్చు. ఓసారి నేనలా బైండ్‌ ఓవర్‌ తీసుకున్న ఓ పెద్దావిడ మళ్లీ సారా కాస్తూ పట్టుబడింది. ఆమెని అరెస్టు చేసి జైల్లో పెట్టమని ఆదేశించాను. మూడురోజులు జైల్లో ఉన్న ఆమె  తర్వాతి రోజు నుంచి ‘అయ్యా... నా కొడుక్కి ఆరోగ్యం బాగాలేదు. ఒక్కసారి చూడాలి!’ అని ఏడవడం మొదలుపెట్టింది. అందులో నిజమేంటో కనుక్కుందామని బయల్దేరితే... ఆమె కొడుక్కి మామూలు అనారోగ్యం కాదు తీవ్రమైన గుండె జబ్బని తేలింది. ఎంత నేరస్థురాలైనా తల్లి కదా... అందుకే ఇంకేమీ ఆలోచించలేదు... మూడేళ్లపాటు శిక్ష అనుభవించాల్సిన ఆమెని అప్పటికప్పుడు జైలు శిక్ష నుంచి తప్పించాను! ప్రభుత్వ యంత్రాంగానికి ఆ క్షమా దృష్టి ఉండాలన్నది నా అభిప్రాయం. ఎప్పుడూ నియమనిబంధనలని మొండిగా కూర్చోకుండా ప్రజలపట్ల ఆ రకమైన సానుభూతి ఉండటమే... ప్రభుత్వ యంత్రాంగం లక్ష్యం కావాలంటాన్నేను. మా నాన్నగారు పనిచేసిన శాఖకీ నేనున్న దానికీ అదే తేడా. నాన్నది ప్రజల్ని ఓ బెత్తంతో నడిపించే ఉపాధ్యాయుడిలా వ్యవహరించాల్సిన శాఖైతే... ఓ స్నేహితుడిలా వాళ్ల బాధలపట్ల సహానుభూతి చూపాల్సిన బాధ్యత మాది. నాన్న తత్వాన్నిబట్టి ఆయన దాన్ని ఎంచుకుంటే... నాతీరుని బట్టి నేను ఇటువైపొచ్చానేమో అనిపిస్తుంది.
పిల్లల కోసమే పాడుతున్నా...
చిన్నప్పుడే నాన్న ప్రేమకి దూరం కావడం వల్లనేమో పసిపిల్లల్ని ఎక్కడ చూసినా నా మనసులోని చిన్నారి నిద్రలేస్తుంటాడు. నేను అధికారిననే విషయం కూడా మరిచిపోయి... వాళ్లతో ఆడుతూ పాడుతూ గడిపేస్తాను. జేసీగా పాఠశాలల బాధ్యతలు చూస్తున్నందువల్ల నెలకి కనీసం రెండుసార్లయినా ఇలా వివిధ బడులకి వెళ్తున్నాను. పిల్లలపైన ఉన్న ఆ మమకారం కారణంగానే అనాథాశ్రమాల విరాళాల కోసం ఉచితంగా సంగీత కచేరీలు చేస్తున్నాను. మా అమ్మ ప్రఖ్యాత సంస్కృత పండితులు పుల్లెల శ్రీరామచంద్రుడిగారి శిష్యురాలు. ఆయనకి అరవైఏళ్ల సత్కారం చేస్తున్నప్పుడు తొలిసారి కచేరీ చేయమని అడిగితే చేశాను. అది చూసి కొన్ని అనాథాశ్రమాలు విరాళాల కోసం కార్యక్రమాలు చేస్తారా అంటే... ఆనందంగా అంగీకరించాను. అప్పటి నుంచి పదేళ్లుగా ఎటువంటి పారితోషికం తీసుకోకుండా హైదరాబాద్‌లోని వివిధ స్వచ్ఛంద సంస్థల కోసం పాడుతున్నాను. నాకంటూ జీతం ఇచ్చే ఉద్యోగం ఉండగా... నా కళని డబ్బు కోసం వినియోగించడం తప్పనే అభిప్రాయం నాది. నా దృష్టిలో సంగీతమంటే... నాన్న నన్ను తన భుజాలపై ఎక్కించుకుని నేను అందుకునేలా చేసిన చిటారుకొమ్మలోని మిఠాయిపొట్లంలాంటిది. ఆ  తేనెపట్టుకి వెలకట్టడం నా వల్ల అయ్యేపనికాదు!

- జె.రాజు

అమ్మది నిండైన వ్యక్తిత్వం...!

గ్రూప్‌ వన్‌ అధికారిగా నేను హైదరాబాద్‌ చుట్టుపక్కలే ఉండాలని కోరుకున్నది అమ్మ కోసమే! అమ్మ ఒంటరిగా ఉంటుందనే ఆందోళన ఇందుకు కారణం కాదు, అమ్మ దగ్గరగా ఉంటే నాకు కలిగే నిశ్చింతే వేరు. గట్టి మనసుకీ, నిండైన వ్యక్తిత్వానికీ, ఆత్మగౌరవానికీ నిలువెత్తు రూపం మా అమ్మే. నాకు ఊహవచ్చాక అమ్మనెప్పుడూ బేలగా చూసిందిలేదు... నాన్న చనిపోయినప్పుడు తప్ప. ఆ దుఃఖాన్ని చదువుతో అధిగమించడానికి ప్రయత్నించింది. సంస్కృతంలో ‘ప్రాథమిక’తో మొదలుపెట్టి... పీహెచ్‌డీ దాకా వెళ్లి బంగారుపతకం సాధించింది. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చదివేటప్పుడు అమ్మ నాతోపాటూ క్యాంపస్‌కి వస్తూ ఉంటే అందరూ కళ్లింతలు చేసి చూసేవారు! అరుణావ్యాస్‌ పేరుతో యాభైకిపైగా పుస్తకాలు రాసింది. విశ్వనాథ సత్యనారాయణ, వాకాటి పాండురంగారావు తదితరుల రచనల్ని ఇంగ్లిషులోకి అనువదించింది. ఇప్పటికీ హైదరాబాద్‌ పోలీసుల పత్రిక ‘సురక్ష’లో నెలనెలా రాస్తుంటుంది. నేనే కాదు అమ్మ కూడా సంగీతానికి దూరం కాకూడదని పదేపదే చెప్పేవారు నాన్న. నాలాగే ఆమె కూడా సంగీతకళని భద్రంగా కాపాడుకుంది.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.