close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
అనుక్షణం అమ్మే గుర్తొస్తోంది..!

అనుక్షణం అమ్మే గుర్తొస్తోంది..!

ధడక్‌... హీరోయిన్‌గా జాన్వీకపూర్‌కి తొలిచిత్రం. ఆ సినిమాలో హీరో కూడా పరిశ్రమకు కొత్తే. అయినా సినిమా రూ.వందకోట్ల మార్కుని దాటి సూపర్‌ హిట్‌ అవడం విశేషం. ఆ విజయంలో చాలా భాగం జాన్వీకపూర్‌కే దక్కుతుందని చెప్పొచ్చు. సూపర్‌స్టార్‌ శ్రీదేవి కూతురుగా తనకున్న ఫాలోయింగ్‌ అలాంటిది మరి. జాన్వీ సినిమాల్లోకి వస్తుందన్న వార్తే ఆమెను సెలెబ్రిటీని చేసేసింది. తొలి చిత్రం షూటింగ్‌ మొదలయ్యాకా వార్తల్లో లేని రోజు లేదు. మధ్యలో తల్లి మరణం తీరని దుఃఖాన్ని మిగిల్చినా బాధని గుండెల్లో దాచుకుని సినిమాను పూర్తిచేసింది.  ప్రస్తుతం కరణ్‌ జోహార్‌ దర్శకత్వంలో తీయబోతున్న చారిత్రక చిత్రం ‘తఖ్త్‌’లోనూ చోటు సంపాదించిన జాన్వీ మనసు పొరల్లోకి తొంగి చూస్తే...

ల్లిదండ్రులు వాళ్లు పడ్డ ఇబ్బందులు పిల్లలు పడకూడదనుకుంటారు. నేను ఎక్కువ కష్టపడలేనన్నది అమ్మ అభిప్రాయం. అందుకే, సినిమాల్లోకి వస్తానన్నపుడు నువ్వు అంత కష్టపడలేవేమో ఫ్యాషన్‌ డిజైనింగ్‌ కోర్సులేవైనా చెయ్యొచ్చుగా అని సర్దిచెప్పడానికి ప్రయత్నించింది. కానీ నా ఆలోచన ఒకటే... శ్రీదేవీ బోనీకపూర్‌ల కూతుర్ని అని నేను ఇప్పుడు గొప్పగా ఎలా చెప్పుకోగలుగుతున్నానో నన్ను చూసి వాళ్లు కూడా అలాగే గర్వపడేలా చెయ్యాలి అని. దానికోసం సినిమాల్లోకే రావాలనుకోవడానికి కారణం నటన పైన నాకున్న ఇష్టమే. నిజానికి చదువైపోయాక విదేశాల్లో ఫ్యాషన్‌ డిజైనింగ్‌, కళలు, నటనకు సంబంధించిన కోర్సులు నేర్చుకోవాలనుకున్నా. అలా మొదట లాస్‌ఏంజెలస్‌లో యాక్టింగ్‌ కోర్సులో చేరా. అది నేర్చుకుంటున్నపుడే తెలిసింది...
నా గమ్యం అదేనని. తర్వాత అమ్మకూడా అడ్డు చెప్పలేదు. ఈ స్థాయి గుర్తింపు రావాలంటే మిగిలినవాళ్లు చాలా కష్టపడాలనీ అమ్మానాన్నల వల్ల నాకది సులభంగా దక్కిందనీ తెలుసు. దీన్ని నిలబెట్టుకోవడానికి ఎంత కష్టపడాలో అంతా పడతా. ధడక్‌ సినిమా షూటింగ్‌ మొదటి రోజు అంతమంది కొత్తవాళ్ల మధ్య నటించడానికి నేను ఏమాత్రం భయపడలేదు కానీ అమ్మ సెట్‌లోకి వచ్చిందంటే మాత్రం టెన్షన్‌ వచ్చేసేది. ఎందుకంటే ‘నువ్వు సరిగా చెయ్యడంలేదు’ అన్నమాట తనతో అనిపించుకోకూడదన్నది నా పట్టుదల. ‘నటన నీ మెదడులో నుంచి కాదు, హృదయంలో నుంచి రావాలి. అప్పుడే అది సహజంగా ఉంటుంది. కష్టపడకుండా ఏదీ దక్కదు. ఎంత బాగా చెయ్యగలవో అంతా చెయ్యి’... తొలిసారి షూటింగ్‌కి వెళ్లేముందు అమ్మ నాకు చెప్పింది ఇదే. తను ఎప్పుడూ నాతోనే ఉంటుంది కదా అనుకుందేమో మరీ ఎక్కువగా సలహాలు ఇచ్చేది కాదు. ‘ధడక్‌’ రషెస్‌ చూశాక మాత్రం సినిమా రెండోభాగంలో సహజంగా కనిపిస్తేనే బాగుంటుందంటూ మేకప్‌ వేసుకోవద్దని చెప్పింది. 

మరువలేని జ్ఞాపకాలు
అమ్మ, నన్నూ చెల్లినీ ప్రాణంగా చూసుకునేది. నేనైతే నిద్రలేస్తూనే అమ్మను పిలిచేదాన్ని, కళ్లు తెరవగానే తననే చూడాలి మరి. నేనలా లేవగానే ‘అమ్మకావాలి’ అని పిలుస్తుంటే ‘కోకో ఉంది కావాలా’... అంటూ చెల్లి నన్ను వెక్కిరించేది. కోకో తన కుక్కపిల్ల. అమ్మకు నేను ఎక్కువ క్లోజ్‌. చెల్లి నాన్నతో క్లోజ్‌గా ఉంటుంది. అందుకే, చెల్లీ నాన్నా కలసి నన్నూ అమ్మనూ ఆట పట్టిస్తుండేవారు. రోజూ ఉదయం అందరం హాల్లో కూర్చుని కబుర్లు చెప్పుకునేవాళ్లం. అమ్మకు ఉదయమే పండ్లరసం తాగడం అలవాటు. ఓ పదిరకాల జ్యూసులు ఎప్పుడూ రెడీగా ఉండేవి. నాన్నని కూడా తనలా జ్యూస్‌ తాగమనేది. ఆయన ససేమిరా అనేవారు. దాంతో చిన్నసైజు గొడవ అయ్యేది. మమ్మల్నే కాదు, నాన్నను కూడా చిన్న పిల్లాడిలానే చూసుకునేది. ముగ్గురికీ దగ్గరుండి కడుపునిండా పెట్టేది. తినకపోతే తినిపించేది. ఎప్పుడూ ఫిట్‌గా ఉండాలంటూ, రోజూ వ్యాయామం చెయ్యమని మాత్రం పట్టుబడుతుండేది. తనెప్పుడూ వ్యాయామాన్ని అశ్రద్ధ చేసేది కాదు. ఆరోగ్యం విషయంలో చాలా పక్కాగా ఉండేది.

 నాన్నకూ మాకూ సీఫుడ్‌ అంటే చాలా ఇష్టం. అందుకే, అమ్మే స్వయంగా మార్కెట్‌కి వెళ్లి తాజా చేపల్ని తెచ్చి వండేది. అదంతా చూసి, నాన్నేమో ‘నువ్వు చిన్న చిన్న పనుల్లోనే ఎక్కువ ఆనందం పొందుతావు’ అంటుండేవారు. నిజానికి బయటి మార్కెట్‌కి వెళ్లడం అమ్మలాంటి సెలెబ్రిటీలకు కాస్త ఇబ్బందైన పనే. అయినా మాకోసం ఏ పనైనా ఇష్టంగానే చేసేది. మందారాలూ ఉసిరీ వేసి ఇంటి దగ్గరే నూనె కాచేది. మూడు రోజులకోసారి ఆ నూనెను తలకు పట్టించి మాకు బాగా మసాజ్‌ చేసేది. మేం బయటికి వెళ్తుంటే బట్టలూ వాటికి మ్యాచింగ్‌ యాక్సెసరీస్‌ తీసివ్వడం... లాంటివి చేసి చాలా సంతోషపడేది. నా విషయానికొస్తే నిద్రపోవాలన్నా అమ్మ పక్కనుండి జోకొట్టాలన్నట్లు ఉండేదాన్ని. తను దుబాయికి వెళ్లే ముందురోజు రాత్రి కూడా ‘నిద్ర పట్టడం లేదు నీ ఒళ్లో పడుకుంటా. జోకొట్టు అని అడిగా’. తను బట్టలు సర్దుకుని కాస్త ఆలస్యంగా నా గదికి వచ్చింది. ఆ సమయానికి నేను సగం నిద్రలోకి వెళ్లిపోయా. అయినా నాతల మీద తను నిమరడం తెలుస్తూనే ఉంది. అప్పుడు తెలీదు అమ్మ చేతి స్పర్శ మళ్లీ దొరకదని. ఆ జ్ఞాపకాలు ఎప్పటికీ మరచిపోలేనివీ తిరిగి పొందలేనివీ.

అమ్మ ఉన్నంతకాలం నాకోసం నేనెప్పుడూ ఆలోచించుకోలేదు. అంతా అమ్మ చూసుకుంటుందనే ధైర్యంతో ఉండేదాన్ని. హఠాత్తుగా అమ్మ దూరమవడంతో ఆ లోటు భరించలేకపోతున్నా. ప్రతిక్షణం తనే గుర్తొస్తోంది. తను ఇక ఎప్పటికీ రాదు అన్న విషయాన్ని మనసు ఇప్పటికీ అంగీకరించడంలేదు. బాధను దిగమింగుకునే ప్రయత్నం చేస్తున్నా. ‘ఎవరైనా మంచి మనిషి అయినపుడే మంచి కళాకారులు కాగలరు. మానవత్వం, కృతజ్ఞతలే మనల్ని జీవితంలో ఎదిగేలా చేస్తాయి’ అంటుండేది అమ్మ. ఆ మాటల్ని ఎప్పటికీ మర్చిపోను. నటిగా మంచి పేరు తెచ్చుకోవాలి, అమ్మ పేరు నిలబెట్టాలన్న ఆలోచనల్లోనే ప్రస్తుతం అమ్మను వెతుక్కుంటున్నా.

ఇంకొన్ని...

మ్మకు పెయింటింగ్‌ హాబీ అయితే, నాకు కవితలు రాయడం ఇష్టం.
* చెల్లి ఖుషీ నేనూ కలసి గడపడానికి ఇప్పుడు ఎక్కువ సమయం దొరకడంలేదు. అదే కాస్త కష్టంగా ఉంది. పేరుకి చెల్లి కానీ అక్కలా సలహాలిస్తుంటుంది. అమ్మ చనిపోయాక అప్పుడప్పుడూ తనే నాకు అమ్మ కూడా అవుతోంది. అలా అని నాదగ్గర మారాం చెయ్యడమూ ఆపదు. ఏ విషయమైనా తన మాటే నెగ్గాలి.
* స్కూల్లో నా హాజరు 30శాతం ఉంటే గొప్ప అన్నట్లు ఉండేది. ఎందుకంటే అమ్మానాన్నలు ఎక్కడికి వెళ్తే అక్కడికి నేనూ వాళ్ల వెంట వెళ్లి పోతుండేదాన్ని. అందుకే, చరిత్ర, ఇంగ్లిష్‌లలో తప్ప మిగిలిన వాటిలో పాస్‌ మార్కులే వచ్చేవి.
* అమ్మకు షాపింగ్‌ చెయ్యడం అంటే చాలా ఇష్టం. తనకూ నాకూ చెల్లికీ ఒకరి బట్టలు ఒకరికి సరిపోయేవి. ముగ్గురికీ బాగా తయారవడం ఇష్టం. అందుకే, మేం షాపింగ్‌కి వెళ్తుంటే నాన్న ‘త్రీ విమెన్‌ ఆన్‌ ఎ మిషన్‌’ అనేవారు. ఇక, మేమేదైనా పార్టీలకు బయల్దేరితే నాన్నే మొదటి ఫొటోగ్రాఫర్‌ అయిపోయేవారు. ఫొటోలు తీసి మాకు చూపించేవారు.
* అమ్మ సినిమాలు నేను మహా అయితే అయిదారు చూసుంటాను అంతే. ఎందుకంటే సినిమాలో తను బాధపడుతున్నా, ఎవరైనా తనని బాధపెట్టేలా ప్రవర్తించినా- అదంతా నటన అని తెలిసినా నేను చూడలేను. ‘ఇంగ్లిష్‌ వింగ్లిష్‌’ చూస్తున్నపుడు కూడా అందులో అమ్మకు కూతురుగా చేసిన అమ్మాయి తనతో హేళనగా మాట్లాడుతుంటే చూడలేకపోయాను. ‘సద్మా’ సినిమా అయితే నచ్చింది, ఎందుకంటే అందులో అమ్మను చూసి కమల్‌హాసనే ఏడుస్తారు కానీ అమ్మ బాధపడదు కదా. ‘మామ్‌’ షూటింగ్‌కి వెళ్లినపుడు సెట్స్‌లో అమ్మ నటనను చూశాకే తనెంత గొప్పనటో అర్థమైంది.

అచ్చం నాలానే...

‘మా చిన్నమ్మాయి ఖుషీ తన పనులు తను చేసుకోగలదు. ఎలాంటి నిర్ణయమైనా సొంతంగా తీసుకోగలదు. కానీ పెద్దమ్మాయి జానూకి మాత్రం ఎప్పుడూ నేను వెంట ఉండాల్సిందే. బహుశా తనకు నా లక్షణాలే వచ్చినట్లున్నాయి. చిన్నపుడు నేను కూడా అంతే, అన్నిటికీ వెనక అమ్మ ఉండాల్సిందే. తనేం చెప్తే అది బుద్ధిగా వినేదాన్ని. ఓసారి అమ్మ పక్కింటివాళ్లతో మాట్లాడుతూ నన్ను గోడమీద కూర్చోబెట్టింది. ఇంతలో స్టవ్‌మీద ఏదో పెట్టినట్లు గుర్తొచ్చి ‘ఇప్పుడే వస్తా కూర్చో’... అని లోపలికి వెళ్లింది. పనిలో పడి మర్చిపోయి రెండు గంటల తర్వాత నాకోసం చూస్తే నేను ఆ గోడమీద అలానే కూర్చుని ఉన్నానట. ‘అయ్యో నన్నెందుకు పిలవలేదు’ అని అడిగితే  ‘నువ్వు ఇక్కడే కూర్చోమన్నావుగా’ అన్నానట. ఖుషీ కూడా బుద్ధిమంతురాలే కానీ నాలా అంతసేపు గోడమీద కూర్చునే టైపు కాదు. కానీ జానూ అయితే... నా టైపే’... ఇవి ఓ సందర్భంలో పెద్ద కూతురు జాన్వీ గురించి శ్రీదేవి చెప్పిన మాటలు.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.