close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఇరవై ఏళ్ల కల ఇది..!

ఇరవై ఏళ్ల కల ఇది..! 

ఓ చక్కటి భవనాన్ని కట్టిన ఆర్కిటెక్ట్‌ మన చేయిపట్టుకుని నడిపిస్తూ... ఆ భవంతిలోని ప్రతి భాగం నిర్మాణం వెనకా తనపై ప్రభావం చూపిన విషయాలేమిటో ఆర్ద్రంగా చెబుతూ ఉంటే ఎలా ఉంటుంది! దర్శకుడిగా మారిన ‘అందాల’ హీరో రాహుల్‌ రవీంద్రన్‌ ‘చి.ల.సౌ’ సినిమా గురించి వివరిస్తున్నా అలాగే అనిపిస్తుంది. తన చిననాటి కలల నుంచి గాయని చిన్మయితో ప్రేమదాకా ఎన్నో అంశాలు ఈ చిత్రంలో ఉన్నాయనే రాహుల్‌ ఓ రకంగా ఈ చిత్రం తన జీవితానికో సెల్ఫీ అంటాడు. ఆ సెల్ఫీకి మాటల రూపమిస్తే...చి.ల.సౌ విడుదలకు ముందు ఏర్పాటుచేసిన స్క్రీనింగ్‌కి చెన్నై నుంచి అమ్మానాన్నలొచ్చారు. చిత్రం చూశాక అమ్మ నా చేయిపట్టుకుని ఉద్వేగంతో ‘చాలా గర్వంగా ఉందిరానాన్నా! ఎక్కడా అసభ్యకరమైన విషయాల్లేవు. స్త్రీలని చాలా గొప్పగా చూపించావ్‌రా!’ అంది. అక్కడైతే దాచుకున్నాకానీ... నాకూ కన్నీళ్లాగలేదు ఆ రోజు! ఓ రకంగా ‘చి.ల.సౌ’ స్త్రీల చిత్రమని గర్వంగా చెప్పుకుంటాన్నేను. ఓ స్త్రీని కేవలం ఓ తండ్రికి కూతురిగా, భర్తకి భార్యగా, కొడుక్కి తల్లిగా మాత్రమే చూసే సమాజం మనది. అలాంటిచోట... ఆ చట్రాల్ని దాటి తనకంటూ ఓ గుర్తింపునీ, గౌరవాన్నీ సాధించగల స్త్రీలందరికీ నా చిత్రం అంకితం చేస్తున్నాను. ఓ రకంగా ఈ చిత్రం ఇలా రావడం వెనక మా అమ్మ, నా చిన్నూ(చిన్మయి), నా స్నేహితులూ ఇలా ఎందరి ప్రభావమో ఉంది.
దర్శకుడినయ్యా..!
నాకప్పుడు మూడేళ్లుండొచ్చు. అప్పట్లో మేం కొంతకాలం కోల్‌కతాలో ఉన్నాం. అక్కడున్న తమిళ సాహితీ సంఘం తరపున ఓ పెద్ద సభ ఏర్పాటుచేశారట. అందులో భాగంగా చిన్నపిల్లల కోసం పోటీలూ పెట్టారట. సుమారు 350 మందితో నిండిన సభలో నేను వేదికనెక్కి రామాయణాన్ని చిన్నపాటి కథగా చెప్పేశానట... నాకే మొదటి ప్రైజూ వచ్చిందట. ఈ ‘అట’లు ఎందుకంటే నాకా దృశ్యాలు లీలగానే గుర్తున్నాయి. అమ్మే నాకు పదేపదే ఆ విషయాలని చెప్పి ‘నీలో మంచి స్టోరీ టెల్లర్‌ ఉన్నాడ్రోయ్‌!’ అంటుండేది. ఆ మాట అంటూనే అమ్మ నా చేత పుస్తకాలు చదివించింది. రామాయణ, మహా భారతాలని ఆయా పాత్రలుగానే మారిపోతూ అమ్మ అభినయించి చూపేది! ఆమె వల్లే పుస్తకాలు స్నేహితులై కథలు రాయడం మొదలుపెట్టా.
ఎనిమిదో తరగతిలోనే...
చెన్నైలో మాది అళ్వార్‌పేట అనే ప్రాంతం. అక్కడో మూల మణిరత్నం ఇల్లు, మరోమూల కమల్‌హాసన్‌ ఇల్లూ ఉండేవి. ఆ ఇద్దరూ కలిసి చేసిన ‘నాయకుడు’ సినిమా ఆ ప్రాంతంలో ఉంటున్న మా అందరిలోనూ సినిమా కలల్ని రేపింది. నేనైతే ఎనిమిదో తరగతిలోనే దర్శకుడిగా మారిపోవాలని నిశ్చయించేసుకున్నాను. కాకపోతే సినిమాల ప్రయత్నాల్లో పడి... డబ్బుల్లేక అమ్మానాన్నల్ని ఇబ్బంది పెట్టకూడదని అనుకున్నా. అందుకే డిగ్రీ అయ్యాక అహ్మదాబాద్‌లోని మైకా సంస్థలో ఎంబీఏలో చేరాను. అదయ్యాక మార్కెటింగ్‌లో మరో ఏడాది పీజీ కోర్సు చేశాను. మూడు నాలుగేళ్లు ఎక్కడో చోట మంచి ఉద్యోగం చేసి... వచ్చిన డబ్బుతో ఏడాదిపాటు సినిమాల కోసం ప్రయత్నించాలన్నది నా ఆలోచన. ముంబయిలోని ఓ ఎఫ్‌ఎం ఛానెల్‌లో చీఫ్‌ మార్కెటింగ్‌ హెడ్‌గా ఉద్యోగం వచ్చింది. చేయడం మొదలుపెట్టాను. అప్పుడే అనుకోని అవకాశమొకటి తలుపుతట్టింది.
ప్రకటనల్లో నేను...
ముంబయిలోని ఓ రెస్టారెంట్‌లో ఓ రోజు మా క్లయింట్‌తో లంచ్‌-మీటింగ్‌లో ఉన్నాను. అప్పుడొకతను వచ్చి ‘సార్‌! మేమొక యాడ్‌ చేస్తున్నాం. మీలాంటి కార్పొరేట్‌ లుక్‌ ఉన్నవాళ్లే కావాలి మాకు. ఆడిషన్స్‌కి రాగలరా!’ అన్నాడు. ఎలాగూ దర్శకత్వం చేయాలనే ఆలోచన ఉందికాబట్టి... సరే అన్నాను. ఆ కార్పొరేట్‌ ప్రకటనకి ప్రముఖ హిందీ దర్శకుడు ‘ఖోస్లాకా గోస్లా’ ఫేమ్‌ దిబాకర్‌ బెనర్జీ దర్శకుడు! ఆ యాడ్‌ తర్వాతే ఓ మస్కిటో రెపెల్లెంట్‌ సంస్థ కోసం తెలుగు యాడ్‌ చేశాను. అలాంటివెన్నో యాడ్‌లు చేశాక... చేతిలో నేను ఆశించినంత డబ్బు సమకూరింది. వెంటనే ఉద్యోగానికి రాజీనామా చేసి ముంబయి నుంచి చెన్నై వచ్చేశాను. సహాయదర్శకులుగా అవకాశం ఇస్తారేమోనని మణిరత్నం, గౌతమ్‌ మేనన్‌ల ఆఫీసుల దగ్గర పడిగాపులు కాయడం మొదలుపెట్టాను. వాళ్లు పట్టించుకోలేదు. విసిగి వేసారి ప్రయత్నాలన్నీ మానుకుని... ఇంకేం చేద్దామా అని ఆలోచిస్తున్నంతలో దర్శకుడు రవివర్మన్‌ ఆఫీసు నుంచి ఓ ఫోన్‌ వచ్చింది.
తెలుగింటివాణ్ణయ్యాను...
దర్శకుడి ఆఫీసుకి వెళ్లగానే చేతిలో డైలాగ్‌ షీట్‌ పెట్టి మంచి ఎక్స్‌ప్రెషన్స్‌తో చెప్పమన్నారు. చెప్పి... మెల్లగా అడిగాను ‘అవునండీ! ఇక్కడ అసిస్టెంట్‌ డైరెక్టర్‌లకీ ఆడిషన్స్‌ ఉంటాయా!’ అని. ‘అసిస్టెంట్‌ డైరెక్టర్‌వని ఎవరు చెప్పారోయ్‌. నువ్వే హీరోవి!’ అన్నారు. కళ్లు తిరిగాయి నాకు. ‘అదెలా?’ అని అడిగితే... నేను ఇదివరకు నటించిన యాడ్‌ ఏదో చూసి హీరోగా సెలెక్ట్‌ చేసినట్లు చెప్పారు. దర్శకుడిగా మారడానికి ఇదీ ఓ దారి కావొచ్చు... అని చేరిపోయా. ‘మాస్కోవిల్‌ కావేరీ’ అనే ఆ సినిమా హిట్టుకాకున్నా ‘విన్‌మీన్గల్‌’ అనే సినిమా అవకాశం తెచ్చింది. ఇందులో నాది సెరిబ్రల్‌ పాల్సీ సమస్య ఉన్నవాడి పాత్ర! బాగా పేరొచ్చింది. అది చూసి ‘అందాల రాక్షసి’కి హనూ రాఘవపూడి పిలిచారు. ఆ సినిమా హిట్టుతో తెలుగు ఇండస్ట్రీ నన్ను తమవాణ్ణి చేసుకుంది. హైదరాబాద్‌లోనే ఇల్లు తీసుకున్నాను.
అలా నెరవేరింది..
‘శ్రీమంతుడు’, ‘టైగర్‌’ వంటివాట్లో సపోర్టింగ్‌ రోల్‌, ‘అలా ఎలా’లాంటి వాటిల్లో హీరోగా చేస్తూ వస్తున్నాను. ఈ అనుభవం చాలనుకున్నాకే... దర్శకుడిగా నా కలలకి బూజు దులిపాను. అప్పటికే నా దగ్గర రెండు, మూడు కథలున్నాయి. ఎందులోనూ నేను చేయాలనుకోలేదు! ‘నేనే హీరోగా చేస్తానంటే నిర్మాతలెవ్వరూ సీరియస్‌గా తీసుకోరు... నా కెరీర్‌ని బూస్ట్‌ చేసుకోవడానికే డైరెక్షన్‌ చేస్తున్నానని అనుకుంటారేమో’ అనిపించింది. అప్పుడే ఓ ఫంక్షన్‌లో కలిసిన సుశాంత్‌కి నా దగ్గరున్న రెండు కథలు చెప్పాను. ప్రేమ కథకి ఓటేశాడు. అతని ద్వారా సిరుని సినీ కార్పొరేషన్‌ నిర్మాతలు ముందుకొచ్చారు. షూటింగ్‌ మొదలుపెట్టిన 32 రోజుల్లో సినిమా పూర్తిచేశాను! సుమారు 20 ఏళ్లకిందట దర్శకుణ్ణి కావాలనే నా కలని అలా నెరవేర్చుకున్నాను. అమ్మ చిన్నప్పుడే నన్నో స్టోరీ టెల్లర్‌ని చేయకపోయుంటే ఇవాళ ‘చి.ల.సౌ’ సినిమానే లేదు కదా మరి! ఈ సినిమా ఇలా రావడానికి స్ఫూర్తిగా ఉన్న మిగతావాళ్ల గురించీ చెబుతా...
ఆ అమ్మాయి...
‘చి.ల.సౌ’ సినిమాలో బైపోలార్‌ మానసిక సమస్యకి చాలా కీలకస్థానం ఉంది! అహ్మదాబాద్‌లో ఎంబీఏ చేస్తున్నప్పుడు వారానికోసారి ఓ టెలిఫోన్‌ బూత్‌కి వెళ్లి ఎస్టీడీ చేస్తుండేవాణ్ణి. అప్పుడోసారి ఒకమ్మాయి తమిళంలో ఫోన్‌లో మాట్లాడుతూ కనిపించింది. ‘అరె! మన ఊరమ్మాయే!’ అనుకుని తనని ఆసక్తిగా గమనించడం మొదలుపెట్టా. ఓ రోజు ఆ అమ్మాయి పెద్దగా తనలో తాను మాట్లాడుకుంటూ... పరుగులాంటి నడకతో రోడ్డుపైన వెళ్లడం గమనించా. తన మానసిక పరిస్థితి బాగా లేదని అర్థమైంది. చూస్తుండగానే వాళ్ల బంధువులొచ్చి తనని ఇంటికి బలవంతంగా లాక్కెళ్లారు. వాళ్ల ముఖాల్లో బాధ... చుట్టుపక్కల ఉన్నవాళ్లేమో ఆ అమ్మాయిని చూసి పిచ్చిదంటూ నవ్వడం నన్ను కదిలించేసింది. ఆ అమ్మాయికి బైపోలార్‌ సమస్య ఉందని తెలిసింది. నేనో సినిమా అంటూ తీస్తే ఈ సమస్య గురించి చెప్పాలని అప్పుడే నిర్ణయించుకున్నాను.
ఇది ‘మా’ కథే...
ఈ సినిమాలోలాగే నా స్నేహితుడికి 27 ఏళ్లప్పుడు పెళ్ళి చేసుకుని తీరాలనే ఒత్తిడి వచ్చింది. వాడూ ఐదేళ్ల తర్వాతేనని మొండికేసినా ఎన్నో పెళ్లి చూపులకి వెళుతుండేవాడు. మొత్తానికి ఓ పెళ్లి సంబంధం ఖాయమైంది. దానికి ముందు ఇంకో సంబంధం చూసి... వద్దనుకున్నాడు. ఆ పెళ్లి చూపులు కాస్త మోడర్న్‌గానే జరిగాయి. ఒకవేళ ఆ పెళ్లిచూపులే సక్సెస్‌ అయి ఉంటే ఎలా ఉండేది... అనే ఆలోచనతోనే ఈ కథ పుట్టింది. ఈ సినిమాలో హీరో 27 ఏళ్లవాడైనా... ప్రపంచాన్ని అంతగా చూడని కుర్రాడు. హీరోయిన్‌కి పాతికేళ్లే అయినా... ఆమెకి 35 ఏళ్ల పరిణతి ఉండాలనుకున్నాను. నాన్న లేకుండా ఒంటరిగా మిగిలిన తల్లితో పదమూడేళ్లకే కుటుంబ భారాన్ని మోసే అమ్మాయిగా తీర్చిదిద్దాను. ఈ కథ రాసుకున్న కొన్నేళ్లకి అలాంటమ్మాయే నా జీవిత భాగస్వామి అవుతుందని ఊహించనేలేదు!
చిన్నూ నేనూ...!
నేను సినిమాల్లోకి వచ్చేసరికే చిన్మయి గాయనిగా పెద్ద స్టార్‌! మణిరత్నం ‘అమృత’ సినిమాలో పాడేటప్పడు పదిహేనేళ్లే. అప్పటి నుంచే గాయనిగా, డబ్బింగ్‌ ఆర్టిస్టుగా చేస్తుండేది. మాటల్లోనూ ఎంతో పరిణతి, ఆత్మగౌరవం, గాంభీర్యం ఉండేవి ఆ అమ్మాయిలో. మా అత్తయ్య పద్మాసిని ఒంటరితల్లిగానే తననలా తీర్చిదిద్దింది. ‘అందాల రాక్షసి’లో లావణ్యకి తనే డబ్బింగ్‌ చెప్పింది. ఆ సినిమా స్క్రీనింగ్‌కి తనూ వచ్చింది. మా అమ్మకి గాయకులంటే పిచ్చి గౌరవం. ఆ రోజు చిన్మయిని చూసి ‘ఎంత చక్కగా పాడతావో తల్లీ...’ అంటూ అభిమానం కురిపించేసింది. పనిలో పనిగా నన్నూ పరిచయం చేసింది. అదే మా పెళ్లికి నాందిగా మారింది!
సామ్‌... నా స్నేహితురాలు!
నా తొలిచిత్రం ‘మాస్కోవిల్‌ కావేరీ’ అని చెప్పాగదా... సమంతకీ అదే తొలి సినిమా. అప్పటి నుంచే తను నాకు మంచి స్నేహితురాలిగా ఉంటోంది. ‘చి.ల.సౌ’ సినిమా పూర్తయిందని చెబితే ‘నువ్వెలా తీశావో భయంగా ఉంది! ఏమాత్రం తేడా వచ్చినా డైరెక్టర్‌గానే కాదు హీరోగానూ అవకాశాలు పోతాయి. ఆ సినిమా నాకోసారి చూపించు...’ అంది. చూశాక ‘సూపర్బ్‌!’ అని మెచ్చుకోవడమే కాదు ఆ సినిమా గురించి ‘చై’(నాగచైతన్య)కీ చెప్పింది. తను చూసి వాళ్ల నాన్నతో చెప్పాడు. ఆ రకంగా నాగార్జునగారు అన్నపూర్ణ సంస్థ, మనం ఎంటర్‌ప్రైజెస్‌ ద్వారా సమర్పకులుగా ఉండటానికి ఒప్పుకున్నారు! అంతేకాదు... చి.ల.సౌ రిలీజుకి ముందే ఆ సంస్థ తరపున మరో సినిమాకి దర్శకత్వం వహించాలని చెప్పారు. సో... థ్యాంక్స్‌ టు సమంతా!!

ఆరునెలలు మాట్లాడుకోలేదు...

తొలి పరిచయం తర్వాత మా మధ్య కొన్ని ట్విటర్‌ సంభాషణలు నడిచాయి. మూడునెలల తర్వాత మీతో డేట్‌ చేయాలనుకుంటున్నాను అని చెప్పాను. ‘డేటింగ్‌’ అని వద్దు, ఫ్రెండ్లీగా కలుద్దాం!’ అంది. నేనేమో ‘నేను మీ ఫ్రెండ్‌ జోన్‌లో ఉండిపోవాలనుకోవడం లేదు..!’ అని చెప్పా. ఒప్పుకుంది. మాటలూ మనసులూ కలిశాయి అనుకునేంతలో... నేను హైదరాబాద్‌కి మకాం మార్చాను. ఆ దూరం మా మధ్య అంతరాన్ని పెంచింది. ఆరునెలలపాటు మాటలుకాదుకదా కనీసం ఒక్క మెసేజ్‌కూడా లేదు. ఓసారి ఓ సినిమా డబ్బింగ్‌ కోసం హైదరాబాద్‌ వస్తున్నట్టు తన ట్విటర్‌లో పెట్టింది. అది చూసి చాలా బాధతో ‘హైదరాబాద్‌ వస్తూ కనీసం మాటైనా నాతో చెప్పొచ్చుకదా! అంత దూరమైపోయానా... ఇక అంతేనా!’ అని మెసేజ్‌ పంపాను. ‘దానికి స్పందిస్తే సరి... లేకపోతే అదే ఆఖరు’ అనుకున్నా. నా అదృష్టం బావుండి రిప్లై ఇచ్చింది. ఇంతకాలం ఎందుకు మాట్లాడలేదని అడిగితే ‘నువ్వు మాట్లాడలేదు... సో నీకు వేరే ఆలోచనలున్నాయేమో అనిపించింది. అలాంటప్పుడు డిస్టర్బ్‌ చేయడం ఎందుకు అనుకున్నా!’ అంది. అందులో నిష్టూరం కనపడలేదు... నిజాయతీ తప్ప. తనలో నాకు నచ్చిన విషయం అదే... తన గురించి కాకుండా ఎదుటివాళ్ల గురించే పట్టించుకుంటూ ఉంటుంది. ఆ రోజు నుంచీ మా బంధం గట్టిపడింది. పెళ్లి చేసుకోవాలనుకుని ఇంట్లోవాళ్లకి చెబితే ఎగిరిగంతేశారు. అలా మీ తెలుగింటి అల్లుడినైపోయాను!

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.