close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
సినిమా కోసం వాచ్‌మ్యాన్‌గా చేరా..!

సినిమా కోసం వాచ్‌మ్యాన్‌గా చేరా..!

పాండిరాజ్‌... మన తెలుగు ప్రేక్షకులకి అంతగా తెలియని దర్శకుడు. రెండేళ్లకిందట ‘మేము’, ‘కథాకళి’, ఈమధ్య ‘చినబాబు’ తప్ప ఆయన సినిమాలు తెలుగులోకి పెద్దగా డబ్‌ కాలేదు. కాకపోతే సినిమా ప్రేక్షకులుగా కన్నా, సగటు మనుషులుగా ఆయన జీవితం నుంచి మనం వినాల్సినవి ఎన్నో ఉన్నాయి. వాచ్‌మ్యాన్‌గా జీవితం ప్రారంభించి జాతీయ అవార్డు స్థాయికి ఎదిగిన ఆ దర్శకుడి ప్రస్థానంలో మనం విప్పుకోవాల్సిన వ్యక్తిత్వ వికాస పాఠాలూ కనిపిస్తాయ్‌. ఆ ప్రయాణం ఆయన మాటల్లోనే...

లక్ష్యం... ఈ పదానికి అర్థమేంటో చాలారోజుల దాకా నాకు తెలియదు. నిజం చెప్పాలంటే దానికి అర్థం తెలియకుండానే, చాలా చిన్నవయసులోనే నా లక్ష్యసాధనలో తలమునకలైపోయాన్నేను. ఏమిటా లక్ష్యం...
ఏ రకంగానైనా సినిమా ప్రపంచంలోకి రావాలి అన్నది. తమిళనాడులో పుదుక్కోట్టై జిల్లాలోని ఓ కుగ్రామం మాది. నాన్న సన్నకారు రైతు. మా ఇంట్లో నన్ను సినిమాలు చూడనిచ్చేవారు కాదు. ఊర్లో వేడుకలప్పుడు అద్దెకు తెచ్చి వీడియోలు వేసేవారు. ముందు ఓ భక్తి చిత్రం, తర్వాత ఎంజీఆర్‌ సినిమా, తర్వాత శివాజీగణేశన్‌... ఇలా ఉండేది ఆ వేసే క్రమం. నాన్న నన్ను అక్కడికీ వెళ్లనిచ్చేవాడు కాదు. ఎంతో మారాం చేస్తే... నాతోపాటూ వచ్చి ఆయనా వచ్చి కూర్చుని భక్తిచిత్రం చూసేవాడు. అది కాగానే ‘రే.. నిద్రొస్తోంది రా!’ అని బరబరా లాక్కెళ్లిపోయేవాడు.ఎంజీఆర్‌, శివాజీ గణేశన్‌ల సినిమాలు చూడలేదనే బాధా, కోపం నాలో అలాగే ఉండేవి. తర్వాతి రోజు బడిలో నా ఫ్రెండ్సంతా ఆ సినిమా కథలు చెప్పుకుంటూ ఉంటే ఉడుక్కునేవాణ్ణి. బహుశా... నాకు అందనందువల్లే సినిమాలపై విపరీతమైన మోహం కలిగిందనుకుంటా. పదో తరగతికి రాగానే ఇంట్లోవాళ్లకి తెలియకుండా సినిమాలు చూడటం మొదలుపెట్టా. ఆ పత్రికలు చదవడం ప్రారంభించా. నేనూ దర్శకుణ్ణి కావాలనే కల అప్పుడే బలంగా నాటుకుంది. చిన్నగా కథలూ, కవితలూ రాయడం ప్రారంభించా. ఇంటర్‌ పూర్తికాగానే, ఇంటి ఆర్థిక పరిస్థితి కారణంగా ఓ మెడికల్‌ దుకాణంలో పనికి కుదిర్చారు. అక్కడ అయిష్టంగానే పనిచేస్తూ వచ్చాను... కానీ ఇంతలో కామెర్లు వచ్చి మంచానపడ్డాను. కోలుకున్నాక మెడికల్‌ షాపుకి వెళ్లలేనని చెప్పేశాను. ‘మరేం చేస్తావ్‌రా!’ అని అడిగితే ‘సినిమాల్లోకి వెళతా నాన్నా...’ అని చెప్పా.

గమ్యం... ఎంతో దూరంలో!
నా మాటలు విని ‘నువ్వేమైనా అందగాడిననుకుంటున్నావా? కాకిలా ఉంటావ్‌.. నీకు సినిమాలేంటి?’ అని పెద్దగా కేకలేశాడు నాన్న. నేను దర్శకుణ్ణి అవుతానని చెప్పినా ఆయనకి అర్థంకాలేదు. చివరికి మా అన్నయ్య కల్పించుకుని ఒప్పించాడు. అలా చెన్నై బస్సెక్కాను. అక్కడో స్నేహితుడి రూమ్‌లో ఉంటూ సినిమాల కోసం ప్రయత్నించాలన్నది ప్లాన్‌. నేను బస్సు దిగేటప్పటికి సాయంత్రమైంది. జోరున వర్షం పడుతోంది. నాకోసం వస్తానన్న స్నేహితుడు రాలేదు. వర్షంలో తడిసి అతని అడ్రెస్‌ కూడా పోగొట్టుకున్నా. ఆ రాత్రంతా అక్కడే ఉన్నా. తెల్లారి చాయ్‌ తాగి... నా స్నేహితుడి అడ్రెస్‌ని చూచాయగా గుర్తుకు తెచ్చుకుని వెళ్లాను. వాడో లాడ్జిలో నలుగురితోపాటు ఓ గదిలో ఉన్నాడు. వాళ్లతోపాటూ నేనూ ఉండటానికి వీల్లేదన్నాడు మేనేజర్‌ కరాఖండిగా. ముందుగా డబ్బులిస్తేనే ఉండమన్నాడు. నా దగ్గరకానీ, నా ఫ్రెండ్‌ వద్దకానీ అంత సొమ్ములేదు. ‘కనీసం ఏదైనా ఉద్యోగం సాధించుకు రా... జీతం వచ్చాక ఇద్దువుకానీ!’ అన్నారు. సరేనని అప్పటికప్పుడు ఉద్యోగవేటలో పడ్డా. నేరుగా ఏవీఎం స్టూడియోకి వెళ్లా... వాళ్లేదో నాకు తాంబూలమిచ్చి రమ్మన్నట్టు! లోపలికి వెళ్లనివ్వలేదు. అక్కడి వాచ్‌మ్యాన్‌తో నా పరిస్థితి చెప్పి ‘నాకిక్కడ ఏ ఉద్యోగం ఇచ్చినా ఫర్వాలేదు’ అని చెప్పా. ఆయన కాస్త మనసు కరిగి... వాచ్‌మ్యాన్‌గానే రమ్మన్నారు. ఏవీఎం స్టూడియోలో వాచ్‌మ్యాన్‌ పని కూడా అద్భుతమనిపించింది. ‘రోజూ ఎంతమంది స్టార్‌లని చూడొచ్చో కదా!’ అనుకున్నా.

‘దండాలుసార్‌..’
స్టూడియోలోనే నాకో దోమలగది ఇచ్చారు. అలాంటి బాధలన్నీ పట్టించుకునేవాణ్ణి కాదు. దర్శకుడిగా మారే  ప్రయాణంలో ఇవన్నీ మజిలీలని అనుకునేవాణ్ణి. స్టూడియోకి కమల్‌హాసన్‌, రజనీకాంత్‌, భారతీరాజా, భాగ్యరాజా వంటివాళ్లు వచ్చినప్పుడు చాలా ఉత్సాహంగా ‘దండాలు సార్‌...’  అని ఎదురెళ్లేవాణ్ణి. కానీ ఉద్యోగులెవరూ నటుల దగ్గర అవకాశాల కోసం అడగకూడదని స్టూడియోలో నిబంధనలు ఉండేవి. అయినా ఎంతకాలమని నోరుకట్టుకుని ఉంటాం...! ఒకసారి భాగ్యరాజాగారు వస్తే నేనే వెళ్లి ఆయన కారు తలుపు తీసి... ‘మీ దగ్గర ఆఫీస్‌బాయ్‌గా చేస్తాను..’ అని అడిగేశాను. వారం తిరగకుండానే ఉద్యోగానికి రమ్మన్నారాయన. ఆయన అప్పట్లో ‘భాగ్య’ అనే పత్రిక నడుపుతుండేవారు. అందులోనే నాకు ఉద్యోగం. ఆఫీసుబాయ్‌గానే చేరినా రెండో నెల నుంచీ కథలూ, వ్యాసాలు రాసి ఎడిటర్‌కి ఇస్తుండేవాణ్ణి. ఒకరోజు అవి భాగ్యరాజా కంటపడ్డాయి. ‘నువ్వు ఆఫీస్‌బాయ్‌గా చేయాల్సినవాడివి కాదు... సబ్‌ ఎడిటర్‌గా ఉండు!’ అన్నారు. నా ప్రతిభకి దొరికిన తొలి గుర్తింపు అది!

వచ్చినట్టే వచ్చి...
మెల్లగా భాగ్యరాజా నాకు చాలా సన్నిహితులయ్యారు. ఎక్కడికెళ్లినా నన్నూ వెంటపెట్టుకుని వెళ్లేవారు. ఆయనకు ఓ రోజు నా సినిమా కోరిక చెప్పా. ‘మంచిదే.. కానీ ఇప్పుడు ప్రస్తుతం నా దగ్గర సినిమాల్లేవు. మిగతా దర్శకులకి నేను సిఫార్సు చేయొచ్చుకానీ నాపైన గౌరవంతో నీకు ఎప్పుడూ నిన్నేమీ అనరు.... నువ్వూ పని నేర్చుకోలేవు. కాబట్టి... నీ అంతట నువ్వే ప్రయత్నించు...’ అని చెప్పారు. నాకు అదే నిజం అనిపించింది. ‘ఆటోగ్రాఫ్‌’(తెలుగులో మై ఆటోగ్రాఫ్‌ స్వీట్‌మెమెరీస్‌’కి మూలం) సినిమా తీసిన దర్శకుడు చేరన్‌ వద్ద చేరాను. కాకపోతే నేను పనిచేసిన ఆ సినిమా అర్ధాంతరంగానే ఆగిపోయింది. అప్పటికే నేను ఊరి నుంచి వచ్చి రెండేళ్లైపోయింది. అదలా ఉంటే నేను ఇక్కడ వాచ్‌మ్యాన్‌గా, ఆఫీస్‌బాయ్‌గా పనిచేస్తున్నాననే విషయం ఎవరో మా అమ్మానాన్నలకి చెప్పేశారు! నాన్న కోపంతో ఊగిపోతూ తిట్లపురాణం ఎత్తుకున్నారు. ‘చేసింది చాలు.. వచ్చేయ్‌’ అంటున్నారాయన. కానీ ఈలోపు చేరన్‌ మరో సినిమా తీస్తూ నాకూ అవకాశం ఇచ్చారు. ఆ విషయం చెప్పి... ‘ఈ సినిమా టైటిల్‌ కార్డులో నా పేరు కూడా వస్తుంది చూస్కోండి!’ అని చెప్పా. అప్పటికి శాంతించారు.

కానీ...
ఆ సినిమాకి నాతోపాటు సింబుదేవన్‌(హింసరాజు 23వ పులికేశి దర్శకుడు) కూడా సహాయకుడిగా చేరాడు. తీరా షూటింగ్‌ మొదలయ్యేటప్పటికి ‘మీకు సహాయకులు ఎక్కువయ్యారు... తగ్గించుకోండి!’అన్నారట నిర్మాతలు. దాంతో నన్ను చేరన్‌ తీసేశారు. ఉసూరుమనిపించింది.

ఏడాదిపాటు మళ్లీ పాత్రికేయుడిగానే ఉండిపోయాను. చేరన్‌ మళ్లీ పిలిచి ‘పాండవర్‌ భూమి’ అనే సినిమాకి అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా చేయమన్నారు. ‘ఈసారి నా గ్రహచారం ఎలా ఉంటుందో...’ అనుకుని భయంభయంగానే చేశాను. ఎట్టకేలకి ఆ సినిమా పూర్తయింది. రిలీజ్‌కి ముందురోజే ఊరెళ్లిపోయి నా స్నేహితులూ, బంధువులూ, ముఖ్యంగా అమ్మానాన్నలందరికీ నా పేరు టైటిల్‌ కార్డులో వస్తుంది చూడండి... అని చెప్పి థియేటర్‌కి తీసుకెళ్లా. కానీ ఆ సినిమాలో నాలాంటి సహాయ దర్శకుల పేర్లన్నీ చిత్రం చివర ఎండింగ్‌ కార్డులో పెట్టారు. గ్రామీణ ప్రాంతంలోని థియేటర్‌లలో ఎండింగ్‌ కార్డులన్నీ చూపకుండానే తెర మూసేస్తారు కదా....! దాంతో నేను చెప్పేవన్నీ అబద్ధాలని అందరూ నవ్వారు. ‘వాచ్‌మ్యాన్‌లు దర్శకులు ఎలాగవుతారమ్మా!’ అంటూ వెక్కిరించారు. ఆ బాధతో మళ్లీ వెళ్లి మరింత కసిగా పనిచేశా. దాదాపు మూడేళ్లు ఆరు సినిమాలకి పనిచేశాక నేనూ దర్శకుణ్ణికాగలననే ధైర్యం వచ్చింది.

నా జీవితమే...
చిన్నప్పుడు బడిలో నాకు ఎదురైన అనుభవాలతో రాసుకున్న కథ అది. నేను ఊహించినట్టే నిర్మాతలెవ్వరూ ముందుకు రాలేదు. వెతగ్గా వెతగ్గా సుబ్రమణ్యపురం(తెలుగులో ‘అనంతపురం’ పేరుతో డబ్‌ అయింది) దర్శకుడు శశికుమార్‌ దొరికారు. కథ వినిపించగానే తానే నిర్మాతగా ఉంటానన్నారు! అలా దర్శకుడినైపోయాను. సినిమా రిలీజై కమర్షియల్‌గానూ హిట్టయ్యింది. నాకు ఉత్తమ స్క్రీన్‌ప్లే, సంభాషణల రచయితగానే కాకుండా... సినిమాకి మరో రెండు జాతీయ అవార్డులొచ్చాయి. ఆ ఏడాదే హైదరాబాద్‌లో జరిగిన అంతర్జాతీయ బాలల చిత్రోత్సవంలో నన్ను ఉత్తమ దర్శకుడిగానూ సత్కరించారు. రెండో సినిమా నాటి ముఖ్యమంత్రి కరుణానిధి మనవడు అరుళ్‌నిధితో చేయమని చెప్పారు. అదీ హిట్టే. ఈలోపు నాకు పెళ్లైంది. మా పెద్దవాడికి ఎనిమిదేళ్లు ఇప్పుడు. వాడు చాలా అల్లరిచేసేవాడు. ‘మీవాడిలో హైపరాక్టివిటీ సమస్య ఉందేమో చూడండి..’ అన్నారు డాక్టర్లు. చిన్నప్పుడు నేనూ అంతే. కానీ నన్నెవరూ వైద్యుల దగ్గరకి వెళ్లమని చెప్పలేదు... దాన్నో పెద్ద సమస్యగా చూడలేదు... కానీ వీడిపై మాత్రం ఎందుకు ఇలాంటి ముద్రలు వేస్తున్నారని బాధపడేవాణ్ణి. ఈ ప్రశ్నతోనే ‘మేము’ కథ రాసుకున్నాను. నా కథ గురించి తెలిసి నటుడు సూర్యనే నిర్మించి, నటిస్తానన్నాడు. అది కూడా పెద్ద హిట్టే. అది చూసి తెలుగు దర్శకుల్లో చాలామంది నాకు ఫోన్‌ చేసి ప్రశంసిస్తుంటారు. ఇప్పటిదాకా ఎనిమిది సినిమాలు తీశాను. నిర్మాతలకి లాభం చేకూర్చాలనే వంకతో హింస, సెక్స్‌ చూపించేవేవీ నేను తీయలేదు. నా పల్లె జీవితం నుంచే కథలు సృష్టించడం నాకు అలవాటు. ‘చినబాబు’ కూడా అలాంటిదే! ఇందులో కనిపించే ఏడుగురు అక్కల ముద్దుల తమ్ముడూ, యువరైతుల తెలివితేటలూ, వాళ్ల ఆత్మగౌరవం... ఇవన్నీ మా ఊర్లో నేను చూసినవే!

నాన్న కోసం నాగలిపట్టా...

నాన్న నా విజయాలేవీ చూడకుండానే చనిపోయాడు. నేను పనికిరాకుండా పోయాననే బాధతోనే కనుమూశాడు. నేను ఏ సంక్రాంతికో ఊరెళ్లినప్పుడల్లా ‘సినిమాలు మనకు పనికిరావురా... అయ్యా!’ అని నచ్చచెప్పేవాడు. నా ఫ్రెండ్స్‌ వద్దకెళ్లి ‘మీరైనా కాస్త చెప్పండయ్యా...!’ అని ప్రాథేయపడేవాడు. నేను సహాయదర్శకుడిగా పనిచేసిన ‘పాండవర్‌ భూమి’ చిత్రం విడుదలప్పుడే అమ్మ అనారోగ్యంతో చనిపోయింది. ఒంటరిగా మిగిలిన నాన్న కొన్నాళ్లకే మతిస్థిమితం తప్పాడు. నన్ను కూడా గుర్తుపట్టలేక ‘నువ్వెవరు బాబూ!’ అనేవాడు. ఓరోజు ఎటో తప్పిపోయాడు. అన్నయ్య ఫోన్‌చేస్తే హుటాహుటిన బయల్దేరి వెళ్లి చుట్టుపక్కల ఊళ్లలో వెతకడం మొదలుపెట్టా. చివరికి... ఓ టీకొట్టుదగ్గర కనిపించాడు. తనలో తాను మాట్లాడుకుంటూ వెళ్తున్న ఆయన్ని భిక్షగాడనుకుని ఎవరో టీ, బన్నూ కొనిచ్చారట. మేం ఎదురుగా వెళ్లి నిల్చున్నా మమ్మల్ని గుర్తుపట్టలా. ఆయన్ని చూసి అక్కడే భోరున ఏడ్చేశా. అప్పట్నుంచీ నాన్నని అన్నయ్యే చూసుకోవడం మొదలుపెట్టాడు. నా తొలి సినిమా షూటింగ్‌ రోజుల్లోనే నాన్న ఆరోగ్యం విషమించింది. ఇంటర్వెల్‌ సీన్‌లు తీస్తున్నప్పుడు... ఆయన పోయారని కబురొచ్చింది. విషయం తెలిసి మా చిత్రం యూనిట్‌, నటులూ అందరూ తరలి వచ్చారు. మా ఇంటికలా యాక్టర్లు కార్లలో వచ్చినప్పుడుకానీ మా ఊరివాళ్లు... నేను సినిమా దర్శకుణ్ణని నమ్మలేదు. ఆ రకంగా నాన్న చనిపోతూ నాకు మంచే చేశారు! నాన్నకి వ్యవసాయమంటే ప్రేమే కాదు... పిచ్చి కూడా. నేనూ రైతుని కావాలనే కల ఆయనకి ఉండేది. అందుకే నాకు కాస్త డబ్బొచ్చాక మా ఇంటి వెనకున్న పెద్ద స్థలం కొని వ్యవసాయం చేస్తున్నా. కెమెరా తిప్పిన చేతులతోనే నాగలి పడుతున్నా. ఆ రకంగానైనా నాన్న ఆత్మశాంతిస్తుందనే చిన్న ఆశ నాది! 

- తలారి ఉదయ్‌కుమార్‌, న్యూస్‌టుడే, చెన్నై

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.