close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
నాన్న పేరు నిలబెడతా!

నాన్న పేరు నిలబెడతా!

తండ్రికి తగ్గ తనయుడు... ఈ మాట కల్వకుంట్ల తారక రామారావుకు అతికినట్లు సరిపోతుంది. తెరాసలో సాధారణ కార్యకర్తలా రాజకీయాల్లోకి అడుగుపెట్టాడు. పద్మవ్యూహాల్లాంటి సమస్యలను దాటుకుంటూ ప్రజల మనసు గెలుచుకున్నాడు. పాశుపతాస్త్రం లాంటి వేగంతో పాలనలో దూసుకెళ్తున్నాడు. ‘ఐకాన్‌ ఆఫ్‌ ద ఇయర్‌’గా అవార్డులు అందుకున్నా, ఐటీ పంచాయతీరాజ్‌ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నా, ‘కేసీఆర్‌ తనయుడు’ అన్న గుర్తింపు ముందు ఎన్నైనా తక్కువే అంటున్నాడు. ‘పేరు ప్రతిష్ఠలే కాదు బరువు బాధ్యతలూ వారసత్వంగానే వస్తాయి’ అని చెప్పే కేటీఆర్‌ తాను నడిచొచ్చిన దారిలోని మలుపులూ, గెలుపుల గురించి ఇలా చెబుతున్నాడు...

కె. చంద్రశేఖర్‌ రావు... నా వెనకున్న ఈ పేరు వల్ల రాజకీయాల్లోకి సులువుగా వచ్చానేమో కానీ, పదేళ్ల క్రితం ఓ కార్యకర్తగా రాజకీయ జీవితాన్ని మొదలుపెట్టి ఇక్కడి దాకా రావడానికి మాత్రం చాలా కష్టపడ్డా. నిజానికి ఎన్నికలూ, ప్రచారాలూ, ఎమ్మెల్యే పదవులూ, మంత్రిగా బాధ్యతల్లాంటివి నేను కల్లో కూడా వూహించలేదు. ఉద్యమంలోకి వచ్చాక కూడా వాటిని ఎప్పుడూ ఆశించలేదు. నేను పుట్టింది సిద్ధిపేటలో అయినా కరీంనగర్‌, హైదరాబాద్‌లలోనే ఎక్కువగా పెరిగా. నాన్నకు తొమ్మిదిమంది అక్కచెల్లెళ్లూ, ఒక అన్నయ్య. నేను పుట్టకముందు నుంచే ఆయన రాజకీయాల్లో బిజీగా ఉండేవారు. దాంతో మా కుటుంబానికి సంబంధించిన బాధ్యతలన్నీ అమ్మమీదే పడ్డాయి. మాకు సరిగా సమయం కేటాయించలేక ఎక్కడ మా చదువు పాడైపోతుందోనని నాన్న నన్ను హైదరాబాద్‌ బోర్డింగ్‌ స్కూళ్లలోనే చదివించారు. పదో తరగతికి వచ్చేసరికి ఏడు స్కూళ్లు మారా. చదువులో టాపర్‌ని కాకపోయినా మంచి మార్కులే వచ్చేవి. అల్లరి కూడా తక్కువే. దాంతో నాన్నకు నన్ను కొట్టడం కాదు కదా, కనీసం చేయెత్తే సందర్భం కూడా ఎప్పుడూ రాలేదు. ఇతర సబ్జెక్టులతో పోలిస్తే లెక్కల్లో నేను కాస్త వెనకపడేవాణ్ని. పదో తరగతిలో ఉన్నప్పుడు భవిష్యత్తులో ఇంక ఆ సబ్జెక్టు జోలికి వెళ్లకూడదని నిర్ణయించుకున్నా. కానీ నాన్నకు నేరుగా ఆ విషయం చెప్పలేక ఓ రోజు అబిడ్స్‌ వెళ్లి హెచ్‌ఈసీ, సీఈసీకి సంబంధించిన పుస్తకాలను తీసుకొచ్చి నా షెల్ఫ్‌లో, నాన్న పుస్తకాల షెల్ఫ్‌లో పెట్టా. అలా నా మనసులో మాట అర్థమై ఆ విషయంలో నాన్న ఒత్తిడి చేయలేదు.

అంతా అమ్మ ప్రభావమే
నాన్న ఓసారి పని ఒత్తిడిలో పడిపోయి హాస్టల్‌ ఫీజు కట్టడం మరచిపోయారు. దానివల్ల అందరూ సెలవులకు ఇళ్లకెళ్లిపోయినా, నేను మాత్రం రెండ్రోజులు హాస్టల్లోనే ఉండాల్సొచ్చింది. ఆయనెందుకు అంత బిజీగా ఉండేవారో చిన్నప్పుడు అర్థమయ్యేది కాదు. నాన్నతో మాట్లాడటానికి ఎక్కువ సమయం కూడా దొరికేది కాదు. దాంతో తెలీకుండానే అమ్మకు చాలా దగ్గరయ్యా. ఒక్కోసారి తనను చూస్తే నాకు చాలా ఆశ్చర్యమేస్తుంది. మేమందరం రాజకీయాల్లో ఉన్నా, నాన్న రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా అమ్మ స్వభావంలో ఏమాత్రం మార్పులేదు. ఇప్పటికీ ఇంటికెళ్లేసరికి వంట గదిలో ఏదో ఒక పనిచేస్తూ కనిపిస్తుంది. తనతోనే ఎక్కువ సమయం గడపడంతో ఆ ప్రభావం నా పైన బాగా పడింది. ఎంత బిజీగా ఉన్నా చదువు విషయంలో మాత్రం నాన్న చాలా స్ట్రిక్ట్‌గా ఉండేవారు. ‘నీకు నేను ఆస్తులు ఇవ్వలేకపోవచ్చు. కానీ ఎంతవరకు కావాలంటే అంతదాకా చదివిస్తా. నీకు తెలివితేటలుంటే రాణిస్తావు. ఏదీ లేకపోతే మా నాన్న నాకిచ్చిన పదెకరాల పొలాన్ని నీకిస్తా, దున్నుకొని వ్యవసాయం చేసుకో’ అనేవారు. కానీ ఆ అవసరం రానీయకుండా బాగానే చదివేవాణ్ని. గుంటూరు విజ్ఞాన్‌లో ఇంటర్‌ చదివా. తరవాత హైదరాబాద్‌ వచ్చి మెడిసిన్‌ ఎంట్రెన్స్‌ రాశా. మంచి ర్యాంకే వచ్చినా, అప్పుడున్న పరిస్థితులకు ఇక్కడ సీటు రాలేదు కర్ణాటకలోని ఓ మెడికల్‌ కాలేజీలో సీటొచ్చింది. కానీ నాన్నకు అది ఇష్టం లేదు. ‘డాక్టర్‌గా స్థిరపడాలంటే కనీసం 33ఏళ్లొస్తాయి. ఆ వృత్తిలో జీవితాంతం ఒత్తిడిని భరించాలి. దాని బదులు సివిల్స్‌మీద దృష్టిపెట్టు’ అన్నారు. అమ్మకు నన్ను డాక్టర్‌గా చూడాలని ఉండేది, కానీ కుదరలేదు. నాన్నకు సివిల్‌ సర్వెంట్‌గా చూడాలని ఉండేది, కానీ నాకది అంతగా ఇష్టముండేది కాదు. అందుకే రెండూ కాదని నిజాం కాలేజీలో మైక్రోబయాలజీ డిగ్రీలో చేరా.

రెండు పీజీలు...
డిగ్రీ తరవాత పుణె యూనివర్సిటీలో బయోటెక్నాలజీలో ఎమ్మెస్సీ పూర్తిచేశా. ఓరోజు నాన్న పిలిచి దిల్లీలో జేఎన్‌యూకి వెళ్లి సివిల్స్‌కి సన్నద్ధం అవమన్నారు. నేను కొన్నిరోజులు అక్కడికెళ్లి యూనివర్సిటీ వాతావరణాన్ని చూసొస్తానని చెప్పా. దిల్లీలో నాన్న స్నేహితుడి ఇంట్లో ఉంటూ రోజూ యూనివర్సిటీకి వెళ్లేవాణ్ని. అక్కడ చాలామంది కుర్రాళ్లు బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా పుస్తకాల్లోనే మునిగిపోతూ సివిల్‌ సర్వీసెస్‌కు సన్నద్ధమవుతూ కనిపించారు. సామాన్యుల సమస్యలేంటో ప్రత్యక్షంగా తెలుసుకోకుండా, కేవలం పుస్తక జ్ఞానంతో చదువు పూర్తిచేసి ప్రజలను పాలించడానికి రావడం నాకెందుకో నచ్చలేదు. అక్కడ యూనివర్సిటీ గోడల మీద ‘వెన్‌ పాలిటిక్స్‌ డిసైడ్స్‌ యువర్‌ ఫ్యూచర్‌, యు డిసైడ్‌ వాట్‌ యువర్‌ ఫ్యూచర్‌ పాలిటిక్స్‌ షుడ్‌ బి’ అన్న కొటేషన్‌ నన్ను బాగా ఆకర్షించింది. నిద్రలేచాక వాడే టూత్‌ బ్రష్‌ నుంచి పడుకునే ముందు చదువుకునే పుస్తకం వరకూ ప్రతి అంశం రాజకీయాలతో ముడిపడిందే. అలాంటప్పుడు రాజకీయాలకు దూరంగా ఉండటం కరెక్టు కాదని చెప్పే ఆ సూక్తి నాపైన బలంగా ముద్రవేసింది. తిరిగి హైదరాబాద్‌ వచ్చి సివిల్స్‌ రాయలేనని నాన్నకు చెప్పి, ఎంబీయేలో చేరడానికి అమెరికా వెళ్లా. సిటీ యూనివర్సిటీ ఆఫ్‌ న్యూయార్క్‌ నుంచి మేనేజ్‌మెంట్‌ అండ్‌ ఈ-కామర్స్‌లో ఎంబీఏ పూర్తిచేశా. అక్కడే ‘ఇంట్రా’ అనే సంస్థలో ఉద్యోగంలో చేరా.

పదేళ్లు అమెరికాలో...
ఆరేళ్ల పాటు అమెరికాలో పనిచేశాక ఓరోజు మేనేజ్‌మెంట్‌ పిలిచి దక్షిణాసియాలో సంస్థను విస్తరించే బాధ్యతను నాకు అప్పగించింది. ఎగిరి గంతేసి మరీ ఒప్పుకున్నా. అప్పటికే అమెరికా వెళ్లి దాదాపు పదేళ్లయింది. భారత్‌కు వెళ్లిపోదామని ఆలోచిస్తున్న సమయంలో అవకాశం వెతుక్కుంటూ వచ్చింది. అలా 2004లో హైదరాబాద్‌ వచ్చి అక్కడ ఒక శాఖతో పాటు, ముంబై, బంగ్లాదేశ్‌ రాజధాని ఢాకాలో సంస్థకు మరో రెండు శాఖలను ఏర్పాటు చేశాం. నేనొచ్చిన కొత్తల్లోనే తెలంగాణ ఉద్యమం వేడెక్కుతోంది. రెండేళ్లపాటు హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తూనే, పార్టీ తరఫున పనిచేసేవాణ్ని. 2006లో నాన్న కరీంనగర్‌ ఉప ఎన్నికల్లో పోటీచేసినప్పుడు అది పార్టీకీ, నాన్నకూ జీవన్మరణ సమస్యలా మారింది. నాన్న గెలిస్తేనే పార్టీకీ, ఉద్యమానికీ భవిష్యత్తు. యువత ఉద్యమంలో భాగం కావాలని నాన్న పిలుపునిస్తోన్న సమయంలో నేను అంటీముట్టనట్లు ఉండటం కరెక్టు కాదనిపించింది. అందుకే ఆ ఎన్నికల సమయంలో ఆఫీసులో మూడు నెలలు సెలవు కావాలని అడిగా. వాళ్లు ఒప్పుకోలేదు. దాంతో ఏమాత్రం ఆలోచించకుండా ఉద్యోగానికి రాజీనామా చేసి పార్టీకోసం పనిచేయడం మొదలుపెట్టా. రాజీనామా విషయం ముందే నాన్నకు తెలిస్తే ఒప్పుకోరని ఆయన గెలిచాకే ఆ విషయం చెప్పా. ‘నువ్వు పార్టీకోసం పనిచేస్తానంటే నేను ప్రోత్సహించనూ, అలాగని వద్దనీ చెప్పను. అందరితో పాటే నువ్వు కూడా. ఏం చేయాలో నువ్వే నిర్ణయించుకో’ అన్నారు.

సొంతకష్టంతో విజయం
పార్టీలోకి వచ్చిన కొత్తల్లో ఎమ్మెల్యే అవ్వాలనో, మంత్రిగా మారాలనో, ఏదో ఒక ప్రాంతంపైన పట్టుపెంచుకోవాలనో అనుకోలేదు. పార్టీ ఏ ప్రాంతంలో కాస్త బలహీనంగా ఉందో అక్కడ బాగా పనిచేయాలని నిర్ణయించుకున్నా. అలా ఏడాదిన్నర పాటు మహబూబ్‌నగర్‌ వెళ్లి అక్కడ రకరకాల కార్యక్రమాలు నిర్వహిస్తూ, పార్టీలో చేరికల్ని ప్రోత్సహిస్తూ టీఆర్‌ఎస్‌ను బలోపేతం చేసే ప్రయత్నం చేశా. 2009 ఎన్నికల్లో తొలిసారి సిరిసిల్ల ఎమ్మెల్యే బరిలో దిగా. తొలిప్రయత్నంలో స్వల్ప మెజారిటీతోనే విజయం దక్కింది. కేసీఆర్‌ కొడుకన్న బ్రాండ్‌ ఇమేజ్‌ను పక్కనబెట్టి కష్టపడి పనిచేయడం మొదలుపెట్టా. దాని ఫలితం తరవాతి ఎన్నికల్లో స్పష్టంగా కనిపించింది. అదే స్థానం నుంచి భారీ మెజార్టీతో రెండుసార్లు గెలిచా.

అప్పుడే సంతృప్తి!
తెలంగాణకు తొలి ఐటీ, పంచాయతీరాజ్‌ శాఖల మంత్రిగా బాధ్యతలు అందుకోవడం అదృష్టమైతే, వాటిని సమర్థంగా నిర్వహించడం నా సామర్థ్యానికి పరీక్ష. ఐటీ, పంచాయతీరాజ్‌ రెండు భిన్నమైన శాఖలే. మొదట్నుంచీ ఐటీని అభివృద్ధి చేస్తూనే, దాన్ని పంచాయతీరాజ్‌ శాఖ నిర్వహణలో ఎలా ఉపయోగించుకోవాలన్న దానిపైన దృష్టిపెట్టా. టీహబ్‌, టాస్క్‌, టీఈపీ... ఐటీ శాఖ ఆధ్వర్యంలో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తోన్న వ్యవస్థలివి. టీహబ్‌ ద్వారా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తూ, స్టార్టప్‌ల స్థాపనకు సాయం చేస్తున్నాం. టాస్క్‌ (తెలంగాణ అకాడమీ ఫర్‌ స్కిల్‌ అండ్‌ నాలెడ్జ్‌) ద్వారా వృత్తి విద్యా కళాశాలల్లోని విద్యార్థుల నైపుణ్యం పెంచి పరిశ్రమల అవసరాలకు తగ్గట్లుగా వాళ్లను తయారుచేసే ప్రయత్నం చేస్తున్నాం. మూడోది టీఈపీ (టెక్నాలజీ ఎంట్రప్రెన్యూర్‌షిప్‌ ప్రోగ్రాం). ఐఎస్‌బీతో కలిసి నిర్వహిస్తోన్న ఈ కార్యక్రమం ద్వారా చదువుకుంటూ భవిష్యత్తులో వ్యాపారవేత్తలు కావాలనుకుంటోన్న వాళ్లకు శిక్షణ ఇస్తున్నాం. పూర్తిస్థాయిలో వీటి ఫలితాలు అందితే తెలంగాణలో ఐటీముఖచిత్రమే మారిపోతుందని నా నమ్మకం. రకరకాల పౌరసేవలూ, బీమా, ఆర్థిక సేవలను గ్రామీణ ప్రజలకు ఈ-పంచాయతీల ద్వారా ఇంటి దగ్గరే అందించేందుకు ప్రయత్నిస్తున్నాం. ‘వాటర్‌గ్రిడ్‌’ పథకం ద్వారా ప్రతి ఇంటికీ నల్లాల్లో నీరు సరఫరా చేసే ప్రయత్నం చేస్తున్నాం. తెలంగాణ వ్యాప్తంగా బహిరంగ మలమూత్ర విసర్జన లేకుండా చూసే కార్యక్రమాలూ నిర్వహిస్తున్నాం. వీటన్నింటి ఫలితాలూ వందశాతం అందిన రోజే మంత్రిగా నాకు సంతృప్తి.

ఉద్యమంలో భాగమవ్వాలని రాజకీయాల్లో అడుగుపెట్టాను తప్ప పదవులపైన ఏనాడూ వ్యామోహం పెంచుకోలేదు. ప్రస్తుతం ప్రజలకు దగ్గరగా నా కెరీర్‌లోనే అత్యుత్తమ దశలో ఉన్నా. రాజకీయంగా వేరే కొత్త ఆశలేమీ లేవు. తెలంగాణను సాధించిన వ్యక్తిగా నాన్న పేరు చరిత్రలో నిలిచిపోతుంది. మంచి వ్యూహకర్తగా ఆయనకు పేరుంది. కచ్చితంగా నేను చేసే పనులూ, తీసుకునే నిర్ణయాల ప్రభావం ఆయన పైన ఉంటుంది. అందుకే ఆయన పేరును పెంచకపోయినా ఫర్వాలేదు కానీ చెడగొట్టకుండా చూసుకుంటే నేను విజయం సాధించినట్లే.


అమ్మలాగే శ్రీమతి...
నా భార్య శైలిమ రాజకీయేతర కుటుంబం నుంచి వచ్చినా మా ఇంట్లో చక్కగా ఒదిగిపోయింది. మా అబ్బాయి హిమాన్షు, అమ్మాయి అలేఖ్య. ఒకప్పుడు నాన్న బిజీగా ఉన్నప్పుడు అమ్మ ఎలాంటి బాధ్యతలు నిర్వహించిందో, ప్రస్తుతం నా భార్య అదే పనిచేస్తోంది. నా పనిని పిల్లలకు అర్థమయ్యేలా చెబుతూ నా బదులు కూడా తనే వాళ్లకు పూర్తి సమయం కేటాయిస్తోంది. అందుకే తనంటే నాకు చాలా గౌరవం.

* అందరు అన్నా చెల్లెళ్లలానే నాకూ కవితకూ మధ్య మంచి అనుబంధం ఉంది. రాజకీయంగా నేను మంచి చేసినా, తప్పుచేసినా వెంటనే చెబుతుంది. తను బాగా ధైర్యవంతురాలు. రిస్క్‌ తీసుకునే స్వభావమూ ఎక్కువే. తన విషయంలో నేను కాస్త కేరింగ్‌గా ఉంటాను. ఎప్పుడు ఏదడిగినా కాదనకుండా చేస్తాను.

* ఫలితాలతో కూడిన కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు రిట్జ్‌-సీఎన్‌ఎన్‌ సంస్థలు సంయుక్తంగా ‘ఇన్‌స్పిరేషనల్‌ ఐకాన్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ పురస్కారంతో సత్కరించాయి. అలాంటి పురస్కారాలు ఎన్ని వచ్చినా సమష్టి విజయాలుగానే భావిస్తా తప్ప నేనొక్కడినే ఏదో సాధించానని మాత్రం అనుకోను.

* ‘కేటీఆర్‌కు వాక్చాతుర్యం ఎక్కువ’ అని చాలామంది అంటుంటారు. చిన్నప్పట్నుంచీ నాన్న లాంటి నాయకుడికి దగ్గరగా పెరగడం, పుస్తకాలు చదవడం, ప్రజలకు దగ్గరగా గడపడంతో సందర్భానికి తగ్గట్లు మాట్లాడతానేమో తప్ప దానికోసం ప్రత్యేక కసరత్తేమీ చేయను. అవతలి వాళ్ల స్వభావానికి తగ్గట్లే నా మాటతీరూ ఉంటుంది.

* కాలేజీలో ఉన్నప్పుడు క్రికెట్‌ బాగా ఆడేవాణ్ని. కాలేజీ వేడుకల్లో స్నేహితులతో కలిసి డాన్స్‌ ప్రదర్శనలో కూడా పాల్గొన్నా.

* ఒకప్పుడు భాషతో సంబంధం లేకుండా బావున్న సినిమాలన్నీ చూసేవాణ్ని. ఇప్పుడు మాత్రం సమయం దొరికితే పిల్లలతో గడపడానికే ప్రయత్నిస్తున్నా. రొమాంటిక్‌ కామెడీ తరహా చిత్రాలు ఇష్టం.

- శరత్‌ కుమార్‌ బెహరా

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.