close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
అలాంటి కథలెప్పుడూ ఫెయిలవ్వవు

అలాంటి కథలెప్పుడూ ఫెయిలవ్వవు

సినిమా అంటే నిశ్చల గోదారి పైన ప్రయాణంలా హాయిగా ఉండాలి. చూస్తుంటే తెలుగింటి ఆవకాయ తిన్నంత కమ్మగా అనిపించాలి. ప్రతి ఫ్రేమూ పల్లెటూరి ఆడపడుచులా అందంగా కనిపించాలి. శ్రీకాంత్‌ అడ్డాల సినిమాలు అచ్చు అలానే ఉంటాయి. తొలి సినిమాతో కుర్రాళ్లకు ‘కొత్త బంగారు లోకం’ చూపించాడు. రెండో సినిమాతో మహేష్‌, వెంకటేష్‌ల అరుదైన కలయికను తెరపైకి తీసుకొచ్చాడు. ముచ్చటగా మూడో సినిమాతో వరుణ్‌ తేజ్‌ను ముకుందుడిగా పరిచయం చేశాడు. దిల్లీ ఐఐటీలో చదివిన అతడు ఇంత అందమైన సినిమాలు ఎలా తీస్తున్నాడో తెలుసుకుందామా...
పోరాటాన్ని ఇష్టపడాలి కానీ గమ్యాన్నీ అవకాశాల్నీ కాదు’... దిల్లీ ఐఐటీలో ఉన్నప్పుడు చదివిన ఈ చిన్న వాక్యం నా జీవితంపైన బలంగా ముద్ర వేసింది. నా గమ్యం వేరేదో ఉంది, తెలుసుకోమని గుర్తు చేసింది. మధ్య తరగతి కుటుంబాల్లో పెరిగిన ప్రతి ఒక్కరికీ రెండు సంఘర్షణలుంటాయి. ఒకటి ‘జీవితంలో ఎవరూ వూహించని స్థాయికి చేరుకోవాలి’ అని ప్రోత్సహిస్తే, మరోటి ‘నీ పరిస్థితి ఇదీ, నేలమీద ఉండి ఆలోచించు’ అని గుర్తు చేస్తుంటుంది. నా కుటుంబ పరిస్థితుల వల్ల ఎప్పుడూ ‘మంచి చదువూ, కాలేజీ, ఉద్యోగం’... వీటి వరకే ఆలోచనలు పరిమితమయ్యేవి. చిన్నప్పట్నుంచీ దృష్టి అంతా చదువు పైనే పెట్టా. తణుకులో బీఎస్సీ పూర్తి చేశా. ఆ తరవాత ఎట్మాస్ఫిరిక్‌ ఫిజిక్స్‌లో పీజీ చేశా. ప్రవేశ పరీక్షలో అర్హత సాధించి దిల్లీ ఐఐటీలో పీహెచ్‌డీలో చేరా. అంతా సాఫీగా జరుగుతున్న సమయంలో ఓ చిన్న ఆలోచన సినిమాల వైపు నడిపించింది. దాని గురించి చెప్పాలంటే ఒక్కసారి నా నేపథ్యాన్ని గుర్తుచేసుకోవాలి.

మా వూరే ప్రేరణ
మాది పశ్చిమ గోదావరిలోని రేలంగి గ్రామం. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’లో చూపించిందంతా మా వూరే. మా వూరిని చూస్తుంటే ఓ మినీ భారత దేశంలా అనిపిస్తుంది. రకరకాల మనుషులుంటారు. భిన్నమైన సంస్కృతులు కనిపిస్తాయి. షేక్‌ వెంకటేశం, షేక్‌ శ్రీనివాస్‌ లాంటి పేర్లున్నవాళ్లు చాలామంది ఉంటారు. ఇలా చాలా విషయాల్లో మా వూరే నాకు ప్రేరణగా నిలుస్తుంది. మా కుటుంబమూ ‘సిరిమల్లె’ కుటుంబమే. నేనూ, అన్నయ్య, చెల్లి. నాన్న అడ్డాల మెంటారావు దేవాదాయ దర్మాదాయ శాఖలో ఈవోగా చేసి రిటైరయ్యారు. వూళ్లొ ప్రతి సంవత్సరం గ్రంథాలయ వారోత్సవాలు జరుగుతాయి. వాటిలో భాగంగా కచ్చితంగా ఏదో ఒక సాంస్కృతిక పోటీలో పాల్గొనేవాణ్ని. చిన్నప్పట్నుంచీ మనసుకు నచ్చిన మాటలూ, అనుభూతులూ, అనుభవాలూ, ఆలోచనలూ... ఇలా అన్నీ ఓ పుస్తకంలో రాసుకోవడం అలవాటు. అది ఓ అద్దంలా నన్ను నాకు చూపిస్తుంది. రేడియో కార్యక్రమాలంటే చెవి కోసుకునేవాణ్ని. దూరదర్శన్‌ నాకు ఎన్నో విషయాల్లో మార్గదర్శిగా నిలిచింది. వీటన్నింటి ప్రభావమే తెలీకుండా నన్ను సినిమాల వైపు నడిపించిందని అనిపిస్తుంది.

సాగరసంగమం 62వసారి...
చిన్నప్పుడు ఓ సంఘటన నాకు బాగా గుర్తు... ఐదో తరగతిలో ఉన్నప్పుడు ఓ రోజు మధ్యాహ్నం మా నాన్న హఠాత్తుగా స్కూలుకొచ్చి నన్ను ఇంటికి తీసుకెళ్లారు. విషయమేంటంటే... అప్పుడు టీవీలో సాగరసంగమం సినిమా వస్తోంది. అంత మంచి సినిమాను నాకు చూపించాలనే ఆ పని చేశారు. ఆ సినిమా నాకు విపరీతంగా నచ్చేసింది. ఈ మధ్యే 62వసారి ఆ సినిమా చూశా. తెలుగు దేశం పార్టీ పెట్టినప్పుడు మా వూళ్లొ నాన్న చాలా క్రియాశీలకంగా పార్టీకోసం పనిచేసేవారు. దాని వల్ల చుట్టుపక్కల వూళ్లలో నాన్నకు చాలా పేరొచ్చింది. ఎన్టీఆర్‌గారితో నేరుగా మాట్లాడేంత చనువూ ఏర్పడింది. కానీ ఇంట్లో ఆర్థిక సమస్యలు తీర్చడానికి అవేవీ ఉపయోగపడలేదు. ఆ సమయంలో మమ్మల్ని పెంచడానికి అమ్మ పడిన కష్టం మాటల్లో చెప్పలేను. చాలా సందర్భాల్లో అమ్మమ్మ వాళ్ల ఇంటినుంచి సరకులు తీసుకొచ్చేవాణ్ని. లేమిలోనే అనుబంధాలు దృఢపడతాయన్న విషయం చిన్నప్పుడే అర్థమైంది.

పీహెచ్‌డీ ఆపేశా
నాన్న డబ్బుల విషయంలో ఎన్ని ఇబ్బందులు పడ్డా, మా చదువుల విషయంలో మాత్రం రాజీపడలేదు. టెన్త్‌ వరకూ మాకు నిక్కర్లే. ఇంటర్‌లో ప్యాంట్లు వేసుకెళ్లాలి. కానీ నాకు ప్యాంట్లు లేవు. దాంతో ఓ వారం రోజులు నిక్కరుతోనే కాలేజీకి వెళ్లా. అందరూ అదోలా చూస్తుంటే నాకు కాస్త ఇబ్బందిగా అనిపించేది. దాంతో ఓ మూడు రోజులు కాలేజీ మానేసి గొడవ చేసి బట్టలు కుట్టించుకుని వెళ్లిన విషయం గుర్తొస్తే ఇప్పటికీ నవ్వొస్తుంది. డిగ్రీ, పీజీ పూర్తయ్యాక ఎంట్రెన్సు రాసి దిల్లీ ఐఐటీలో పీహెచ్‌డీ చేయడానికి సీటు సంపాదించా. అక్కడ ప్రొఫెసర్‌ యూసీ మొహంతి అనే అద్భుతమైన గురువు దొరికారు. మంచి కాలేజీ, మంచి వాతావరణం... ఇక జీవితంలో స్థిరపడొచ్చు అనుకుంటున్నా. కానీ ఏదో మూల చిన్న అసంతృప్తి. అప్పుడే ‘పోరాటాన్ని ఇష్టపడాలి, గమ్యాన్నీ అవకాశాల్నీ కాదు’ అని ఎక్కడో చదివిన వాక్యం నాపైన చాలా ప్రభావం చూపింది. రాసే అలవాటు బాగా ఉండటంతో సినీరంగంలో రాణించగలనని నమ్మకం కలిగింది. సినిమాల్లోకి వెళ్తే చాలా పోరాడాల్సి ఉంటుందని తెలుసు. కానీ ఆ పోరాటాన్ని ఇష్టపడటానికి సిద్ధపడే ఐఐటీ మధ్యలో ఉండగానే హైదరాబాద్‌ బయల్దేరా.

తొలిచిత్రం ఠాగూర్‌
హైదరాబాద్‌లో మా బాబాయ్‌ మద్దాల గాలేశ్వరరావు సీఏగా పనిచేస్తున్నారు. ఆయన దగ్గరికి వచ్చి సినిమాల్లో పనిచేయాలని ఉందనీ, సాయం చేయమనీ అడిగా. ‘ముందు మీ నాన్నకు ఫోన్‌ చేసి విషయం చెప్పు. నీకు ఎంత ధైర్యం ఉందో చూస్తా’ అన్నారు. వెంటనే నాన్నకు ఫోన్‌ చేసి నా నిర్ణయాన్ని చెప్పా. నాన్న చాలా ఆశ్చర్యపడ్డారు. ‘జాగ్రత్త, ఏ నిర్ణయం తీసుకున్నా దాని ఫలితాన్ని అనుభవించాల్సింది నువ్వేనని గుర్తుపెట్టుకో’ అన్నారు. మా బాబాయ్‌ ఓ సినిమా షేర్‌ ఆఫీసుకు కన్సల్టెంట్‌గా ఉండేవారు. అక్కడికి ‘సింధూరపువ్వు’ కృష్ణారెడ్డి వచ్చేవారు. ఆయన తమ్ముడే ‘ఠాగూర్‌’ నిర్మాత మధు. కృష్ణారెడ్డిని కలిస్తే నన్ను మధు దగ్గరికి పంపించారు. అప్పుడే ‘ఠాగూర్‌’ సినిమా షూటింగ్‌ మొదలవుతోంది. నా ఆసక్తిని చూసి ఆ సినిమాకు అప్రెంటీస్‌గా తీసుకున్నారు. అలా సరైన సమయంలో తీసుకున్న ఓ నిర్ణయం ద్వారా సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టగలిగా.

‘ఆర్య’కు అసిస్టెంట్‌ డైరెక్టర్‌
తొలి సినిమాతోనే చిరంజీవి, వివి.వినాయక్‌ లాంటి పెద్ద స్థాయి వ్యక్తులతో పనిచేసే అవకాశం దొరికింది. నిజానికి మొదటి రెండునెలలూ నేను సెట్‌ లోపలికి వెళ్లలేదు. మిగతా అసిస్టెంట్‌ డైరెక్టర్లు బయటి పనులే అప్పగించేవారు. నన్నపనేని రవీంద్రబాబు అనే అసిస్టెంట్‌ డైరెక్టర్‌ నన్ను అన్ని విషయాల్లో గైడ్‌ చేశారు. ‘ఎంటెక్‌ చదివావు. ఇక్కడ లైట్‌ బాయ్‌ నుంచి అన్ని పనులూ చేయాలి ఆలోచించుకో’ అనేవారు. కో-డైరెక్టర్‌ తన్నేరావుకు నా పనితీరు చాలా నచ్చింది. ఆయన ‘ఠాగూర్‌’ తరవాత ‘ఆర్య’ సినిమాకు పనిచేస్తే, దిల్‌ రాజుకు చెప్పి నాకు అవకాశం ఇప్పించారు. అలా ‘ఆర్య’కూ అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేశా.

రూ.9వేలు అడ్వాన్సు
దర్శకుడిని కావాలన్న ఓ పక్కా లక్ష్యంతో పరిశ్రమలోకి వచ్చా. ఓ మంచి సందర్భం చూసి దిల్‌రాజుకు నా దగ్గర ఉన్న లైన్‌ చెప్పా. ఆయనకు అది బాగా నచ్చి ‘వెంటనే చేస్తావా’ అని అడిగారు. కానీ కాస్త టైం తీసుకుంటానని చెప్పా. సినిమా పరిశ్రమ పుట్టిపెరిగింది చెన్నైలో కాబట్టి అక్కడ కొన్నాళ్లు పనిచేయాలని అనిపించింది. అప్పుడే మధు ‘గజని’ని తెలుగులోకి అనువదిస్తున్నారు. దానికి సంబంధించిన డబ్బింగ్‌ పనులను నాకే అప్పగించారు. అలా ఏడాది పాటు చెన్నైలో ఉన్నా. తరవాత ‘బొమ్మరిల్లు’ సినిమాకు కూడా అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేశా. ఆ తరవాత ‘కొత్త బంగారు లోకం’ ప్రాజెక్టు కోసం పనిచేయడం మొదలుపెట్టా. కథ మొత్తం ఓకే అయ్యాక రాజు తొమ్మిది వేల రూపాయలు అడ్వాన్స్‌ ఇచ్చారు. ఆ సినిమాతో రావు రమేష్‌కు చాలా పేరొచ్చింది. నిజానికి ఆయనతో నాకు ముందు పరిచయం లేదు. నా సినిమాలో ఫిజిక్స్‌ లెక్చరర్‌ పాత్ర కోసం ఓ మంచి నటుడి కోసం చూస్తున్నా. ఆ విషయం తెలిసి ఆయనే అప్పటికప్పుడు అన్నవరంలో ఉన్న నా దగ్గరికి బయల్దేరి వచ్చారు. ఆయన్ని చూడగానే పాత్రకు పర్‌ఫెక్ట్‌ అనిపించింది. నేను వూహించిన దానికంటే అద్భుతంగా చేశారు. నా తరవాతి రెండు సినిమాల్లోనూ చాలా కీలక పాత్రలను ఆయన పోషించారు.

ఫిజిక్స్‌తో పాట!
ఫిజిక్స్‌ అంటే నాకు చాలా ఇష్టం. అందుకే ‘కొత్త బంగారు లోకం’లో ఫిజిక్స్‌లోని పదాలతో ‘కళాశాలలో...’ పాట కూడా రాశా. ‘ముకుంద’లో కూడా ఫిజిక్స్‌లోని పదాలతో బోలెడు డైలాగులుంటాయి. నిజానికి తొలిసినిమా తరవాత వెంటనే ‘ముకుంద’ ప్రారంభం కావాల్సి ఉంది. కానీ రకరకాల కారణాల వల్ల అది వాయిదా పడింది. ఈలోపు వెంకటేష్‌ పిలిపించి ‘నేను సినిమా చేస్తా, ఏదైనా కథ ఉంటే చెప్పు’ అన్నారు. ‘దేశానికి మంచి సామరస్యమైన కుటుంబాన్ని ఇవ్వడం కంటే గొప్ప విషయం ఏముంటుంది’ అని నేను డైరీలో రాసుకున్న లైన్‌ను కథగా తీస్తే బావుంటుందన్నా. ఆయనకీ నచ్చింది. కాకపోతే దానికోసం మరో పెద్ద నటుడు కావాలి. అప్పుడే దిల్‌ రాజుకు వెంకటేష్‌ సినిమా చేస్తానన్నారనే విషయం చెప్పా. రాజుకీ కథ నచ్చి ఆయనే నేరుగా రంగంలోకి దిగారు. మహేష్‌ అయితే బావుంటుంది అనుకున్నాం. కేవలం పదిహేను నిమిషాలు కథ చెప్పగానే మహేష్‌ ఓకే అన్నారు. అలా ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ మొదలైంది. ‘సీతమ్మ వాకిలి’ అంటే భారత దేశం. ‘సిరిమల్లె చెట్టు’ అంటే మంచి మనుషులున్న కుటుంబాలు. ఆ అర్థాన్ని చెప్పేందుకే ఆ పేరు పెట్టాం.

నచ్చుతాయన్న నమ్మకంతోనే...
నా తొలి రెండు చిత్రాలకూ మధ్య నాలుగేళ్ల విరామం ఉంది. దానికి రకరకాల కారణాలున్నాయి. ‘సీతమ్మ వాకిట్లో...’ సినిమా కోసం చాలా రీసెర్చ్‌ చేశా. చిన్నచిన్న అంశాల దగ్గర కూడా జాగ్రత్త తీసుకున్నా. కొన్నాళ్లు నా భార్య ఆరోగ్యం పాడైంది. తను పూర్తిగా కోలుకున్నాకే మళ్లీ సినిమా చేద్దామని నిర్ణయించుకున్నా. ఆలస్యానికి అదో కారణం. అ తరవాత మళ్లీ ‘ముకుంద’ ప్రాజెక్టుపైన పనిచేయడం మొదలుపెట్టా. మహేష్‌, వెంకటేష్‌, నాగబాబుగారి అబ్బాయి... ఇలాంటి వాళ్లతో సినిమాలంటే కచ్చితంగా బోలెడు అంచనాలుంటాయి. కానీ మంచి నైతిక విలువలతో ఉన్న కథల్లో ఎవరైనా ఒదిగిపోతారు, ప్రేక్షకులూ ఆదరిస్తారన్న నమ్మకం ఉంది. నా సినిమాల విషయంలో అది నిజమైంది కూడా.

‘మనదైన సినిమా మన నుంచి అద్భుతంగా రావాలి’... నేను పెట్టుకున్న నియమం ఇది. ఎవరో తీశారని ఫాలో అవడం కాకుండా సొంతంగా ఏ పనైనా చేయాలనుకుంటా. ఎన్ని సినిమాలు చేసినా, అన్నింట్లోనూ నైతిక అంశాలకే ప్రాధాన్యమిస్తూ ముందుకెళ్తా. అలాంటి కథలెప్పుడూ ఫెయిలవ్వవని నా నమ్మకం.

ఇంకొంత...
2011లో నాదీ జూ.ఎన్టీఆర్‌దీ ఒకే రోజు పెళ్లి జరిగింది. నా భార్య పేరు రాగసుధ. మా అత్తయ్యగారి అమ్మాయే. పాప పేరు ఆనంద వల్లి.

సినిమా స్నేహితులు చాలా తక్కువ. ఎక్కడికెళ్లినా చిన్నప్పటి స్నేహితులతోనే. వాళ్ల దగ్గర ఓ సాంత్వన, ఓ జీవితం కనిపిస్తాయి. చాలా సింపుల్‌గా ఉండటానికి ఇష్టపడతా. సినిమా ప్రయత్నాలు మొదలుపెట్టిన నాటి నుంచీ ఇప్పటివరకూ ఒకే ఇంట్లో ఉంటున్నా. ఎస్‌ఆర్‌ నగర్‌లో ఉమేష్‌ చంద్ర విగ్రహం పక్క గోడ, ఇప్పటికీ నాకెంతో ఇష్టమైన ప్రదేశం. స్నేహితులతో చర్చల్లో కొన్ని వందల గంటలు అక్కడ గడిపా.

‘ఆర్య’ సినిమా చేస్తున్నప్పుడు ఆర్ట్‌ వర్క్‌ చేసే ఓ అబ్బాయికి చేయి కాలింది. దాంతో మంటలు వెలిగించడానికి వాడే తాళ్లకు గ్రీజు నేను రాయాల్సి వచ్చింది. హీరో డాన్స్‌ చేస్తుంటే పక్కనుంచి నీళ్లు కూడా కొడుతుండాలి. రాత్రి మూడున్నర దాకా షూటింగ్‌ జరిగింది. అలసిపోయి పక్కన పడుకోడానికి వెళ్లినప్పుడు ‘హాయిగా చదువుకోక మనకి అవసరమా ఈ సినిమాలు’ అని ఒకే ఒక్కసారి అనిపించింది. మళ్లీ ఆ భావన రాలేదు.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.