close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
పుట్టగానే చంపేయమన్నారు!

పుట్టగానే చంపేయమన్నారు!

‘అమెరికాలో వంటవాడి మనవడు అధ్యక్షుడు అవ్వగలడు, భారత్‌లో టీ అమ్మిన వ్యక్తి ప్రధాని కాగలడు’ అని మొన్నీమధ్య ఒబామా అన్న మాటలు గుర్తున్నాయి కదా! కానీ స్మృతి ఇరానీ గురించి తెలిసుంటే ‘హోటల్లో కప్పులు కడిగిన అమ్మాయి క్యాబినెట్‌ మంత్రిగా మారగలదు’ అని కచ్చితంగా ఆమె గురించీ ప్రస్తావించి ఉండేవారేమో. దిల్లీ వీధుల్లో తిరుగుతూ సౌందర్య ఉత్పత్తులు అమ్మిన దశనుంచి అత్యంత పిన్న వయసు కేంద్ర మంత్రిగా ఎదిగే వరకూ స్మృతి వేసిన ప్రతి అడుగూ ఓ కొత్త చరిత్రకు పునాది.
2004లో ఓ రోజు... ‘పార్లమెంటు ఎన్నికల్లో ఓటమికి బాధ్యత వహిస్తూ నరేంద్ర మోదీ రాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలి. అప్పటివరకూ నేను ఆమరణ నిరాహార దీక్ష చేస్తా’ అంటూ స్మృతి ఇరానీ రోœ్డేక్కింది. సరిగ్గా పదేళ్ల తరవాత, 2014లో ఓ రోజు... ‘స్మృతి ఇరానీ నా చిన్న చెల్లెలు. ప్రధాన మంత్రి చెల్లెలి గురించి కొంతైనా తెలుసుకోవాల్సిన అవసరం అందరికీ ఉంది’ అంటూ మోదీ ప్రకటించారు. ఆయన అలా స్పందించడానికి కారణం ప్రియాంకా గాంధీ. స్మృతి ఇరానీ గురించి మీడియా ప్రస్తావించినప్పుడు ‘ఎవరావిడ? అలాంటి ఓ వ్యక్తి ఉన్నట్లు కూడా నాకు తెలీదు’ అని ప్రియాంకా గాంధీ చెప్పారు. దానికి జవాబుగా స్మృతిని తన చిన్న చెల్లెలుగా మోదీ పేర్కొన్నారు. ఒకప్పుడు తాను రాజీనామా చేయాలని దీక్ష చేసిన వ్యక్తినే తన చెల్లెలుగా పరిచయం చేయడానికి కారణం స్మృతి వ్యక్తిత్వమే. దేశ ప్రధానినే కాదు సామాన్య ప్రజానీకాన్ని కూడా ప్రభావితం చేసే శక్తి ఆమెది. ఆమె ఎక్కడ మొదలైందో తెలుసుకుంటే కసి ఉంటే ఓ మనిషి ఎక్కడిదాకా వెళ్లొచ్చో ఇట్టే తెలిసిపోతుంది.

బాల్యం పశువుల పాకలో
దక్షిణ దిల్లీ శివార్లలో ఓ పశువుల కొట్టం. దానికి ఆనుకునే ఓ రెండు గదుల పూరిల్లు. స్మృతి జీవితం మొదలైంది అందులోనే. స్మృతి తండ్రి ఓ పంజాబీ. ఓ బెంగాలీ అమ్మాయిని అతడు ప్రేమించాడు. రెండు వైపుల వాళ్లూ వారి ప్రేమను ఒప్పుకోలేదు. దాంతో బయటికొచ్చి పెళ్లి చేసుకొని ఇద్దరూ కొత్త జీవితం ప్రారంభించారు. చేతిలో చిల్లిగవ్వ లేకపోవడంతో ఓ పశువుల కొట్టాన్ని చూసుకునే పనిలో చేరి అక్కడే ఉండేవారు. కొన్నాళ్లకు వాళ్లకు స్మృతి పుట్టింది. ‘అమ్మాయి ఇంటికి భారం, చంపేయండి’ అని వాళ్లమ్మకి ఎవరో సలహా ఇచ్చారట. అయినా ఆమె దానికి ఒప్పుకోలేదు. ఆ తరవాత ఆవిడకు మళ్లీ ఇద్దరు ఆడపిల్లలు పుట్టారు. అసలే పేదరికం, దానికి తోడు ముగ్గురు ఆడపిల్లల్లోనూ పెద్ద... దాంతో చిన్న వయసులోనే స్మృతికి కుటుంబ భారం పంచుకోక తప్పలేదు. పదోతరగతిలో ఉన్నప్పుడే చిన్నచిన్న ఉద్యోగాలూ చేస్తుండేది. అరవై శాతానికి పైగా మార్కులతో టెన్త్‌, ఇంటర్‌ పాసైనా ఆపైన చదువుకోవడానికి కుటుంబ పరిస్థితి సహకరించలేదు. దాంతో కాలేజీ మానేసి దూరవిద్యలో చదవడం మొదలుపెట్టింది.

రహస్యంగా ‘మిస్‌ఇండియా’కి...
అమ్మానాన్నా ఇద్దరూ పనికి వెళ్తుండటంతో ఇంటిపనులన్నీ స్మృతి చేసేది.పదహారేళ్ల వయసులో ఇప్పుడు తన కార్యాలయం ఉన్న దిల్లీ జన్‌పథ్‌ వీధుల్లోనే రోజుకు రెండు వందల రూపాయల జీతానికి సౌందర్య సాధనాలను మార్కెటింగ్‌ చేసే ఉద్యోగం చేసేది. అందంగా ఉంటుంది కాబట్టి మిస్‌ ఇండియా పోటీలకు ప్రయత్నించమని స్నేహితురాలు స్మృతికి సలహా ఇచ్చింది. దాంతో ఎవరికీ తెలీకుండా తన ఫొటోలతో పోటీలకు అప్లికేషన్‌ పంపించింది. ఆశ్చర్యకరంగా వడపోతల తరవాత మిగిలిన అప్లికేషన్లలో ఆమెకూ చోటు దక్కింది. తరవాతి దశ పోటీల్లో పాల్గొనాలంటే ముంబై వెళ్లాలి. దాంతో ఇంట్లో విషయం చెప్పక తప్పలేదు. స్మృతి నిర్ణయానికి తల్లిదండ్రులు ఆశ్చర్యపోయారు. ముంబై వెళ్లాలంటే రెండు లక్షల రూపాయలు కావాలి. తండ్రి దగ్గర డబ్బు లేదు. దాంతో ఎక్కడైనా అప్పు తెచ్చిమ్మనీ, ఆ డబ్బు తాను చెల్లిస్తాననీ ప్రమాణం చేసింది. అలా అప్పుగా తీసుకున్న డబ్బుతో ముంబై రైలెక్కింది.

మెక్‌ డొనాల్డ్స్‌లో ఉద్యోగం
పోటీలో ఉన్న వేరే అమ్మాయిల్లా స్మృతికి మోడలింగ్‌ గురువులూ, వ్యక్తిగత డిజైనర్లూ లేరు. తనకు తానే మేకప్‌ వేసుకోవాలి. తనను తానే ప్రోత్సహించుకోవాలి. అవసరం, పేదరికం ఆమెకు అన్ని పాఠాలూ నేర్పించాయి. పోటీల్లో అందరి అంచనాలనూ తలకిందులు చేస్తూ ‘ఫైనల్‌ ఫైవ్‌’కు చేరుకుంది. దురదృష్టవశాత్తూ త్రుటిలో మిస్‌ ఇండియా కిరీటం చేజారినా, ఆ పోటీల ద్వారా కొండంత ఆత్మవిశ్వాసాన్ని కూడగట్టుకుంది. పోటీల నుంచి బయటకు రాగానే స్మృతికి కళ్లముందు రెండు లక్షల రూపాయల అప్పు కనిపించింది. దాన్ని ఎలాగైనా తీర్చేయాలని రకరకాల ఉద్యోగాలకు ప్రయత్నించేది. ముంబైలోనే ఉంటూ మోడలింగ్‌లో అవకాశాల కోసం ప్రయత్నిస్తానని చెబితే తండ్రి ఒప్పుకోలేదు. ‘మోసపోతావు, ఇంటికొచ్చి హాయిగా పెళ్లి చేసుకో’ అంటూ నచ్చజెప్పాడు. కానీ ‘నా జీవితం మీ నిర్ణయాల వల్ల కంటే నా నిర్ణయాల వల్ల పాడైతే సంతృప్తిగా ఉంటుంది’ అని చెప్పి ముంబైలోనే ఉండిపోయింది. జెట్‌ ఎయిర్‌వేస్‌లో ఎయిర్‌ హోస్టెస్‌ ఉద్యోగానికి ప్రయత్నిస్తే, తనతోపాటూ దరఖాస్తు చేసుకున్న చెల్లెలికి ఉద్యోగం వచ్చింది కానీ స్మృతికి రాలేదు. వేరే దారిలేక బతుకు తెరువు కోసం బాంద్రాలోని మెక్‌.డొనాల్డ్స్‌లో ఉద్యోగానికి చేరింది. టేబుళ్లూ, ఫ్లోర్లూ శుభ్రంచేయడం దగ్గర్నుంచి ఆర్డర్లను సప్లై చేయడం వరకూ అన్ని పనులూ చేసింది. ఓ పక్క పనిచేస్తూనే స్టూడియోల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతూ అవకాశాల కోసం ప్రయత్నించేది.

ఆ అవార్డు ఐదుసార్లు...
అవకాశాలు ఆలస్యమయ్యే కొద్దీ స్మృతిలో పట్టుదల పెరుగుతూ వచ్చింది. కొన్ని నెలల ఎదురుచూపుల తరవాత ఓ శానిటరీ న్యాప్‌కిన్‌ల ప్రకటనలో కనిపించే అవకాశం ఆమెకు లభించింది. దాని ద్వారా టీవీలో ఓ రెండు సినిమా కార్యక్రమాలకు యాంకరింగ్‌ చేసే ఛాన్స్‌ దొరికింది. ఆ తరవాత ‘వూ.. లలలా’ అనే కార్యక్రమంలో వరుస ఎపిసోడ్లలో కనిపించింది. వాటిని చూసిన శోభా కపూర్‌, స్మృతిని తన కూతురు ఏక్తా కపూర్‌కు పరిచయం చేసింది. స్మృతి జీవితాన్ని మలుపు తిప్పింది ఆ పరిచయమే. ‘క్యోకీ సాస్‌ బీ కభీ బహూ థీ’ సీరియల్‌ ఆడిషన్లకు రమ్మని ఏక్తా స్మృతిని పిలవడం, అందులో తులసి పాత్రకు స్మృతి ఎంపికవడం చకచకా జరిగిపోయాయి. ఇక ఆ తరవాత అంతా చరిత్రే. బుల్లితెర ప్రస్థానంలో ఆ సీరియల్‌ ఒక సంచలనం. తులసి విరాని పాత్రలో ఒదిగిపోయిన స్మృతి ప్రతి ఇంటికీ పరిచయమైంది. ‘కోడలంటే ఇలా ఉండాలి’ అనిపించేలా ఆ పాత్రతో పేరుతెచ్చుకుంది. ఎనిమిదేళ్లపాటూ తులసిగా కనిపించి బుల్లితెరపైన తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. టీవీ నటులకు అత్యుత్తమ అవార్డుగా భావించే ‘ఇండియన్‌ టెలివిజన్‌ అకాడమీ అవార్డు’ను వరసగా ఐదుసార్లు అందుకున్న ఏకైక వ్యక్తి స్మృతి ఇరానీనే.

బాధ్యతలన్నీ పాతికేళ్లకే...
బుల్లితెర రామాయణంలో సీత పాత్రతో పాటూ మరెన్నో కార్యక్రమాల్లో స్మృతి నటించింది. సొంతంగా ‘ఉగ్రాన్య ప్రొడక్షన్స్‌’ పేరుతో ఓ నిర్మాణ సంస్థను నెలకొల్పి టీవీ సీరియల్స్‌ను నిర్మించింది. తనకంటే వయసులో చాలా పెద్దవాడైన చిన్ననాటి స్నేహితుడు జుబిన్‌ ఇరానీ అనే పార్శీని పెళ్లిచేసుకొని స్మృతి మల్హోత్రా కాస్తా స్మృతి ఇరానీగా మారింది. సీరియల్‌లో స్టార్‌ స్టేటస్‌, సొంత నిర్మాణ సంస్థ, పెళ్లి... ఇవన్నీ జరిగేనాటికి స్మృతి వయసు పాతికేళ్లే. ‘ఇంత చిన్న వయసులో ఇన్ని బాధ్యతలు అవసరమా’ అని అడిగితే ‘పాతికేళ్లకే జీవిత కాలానికి సరిపడా కష్టాలు చూశాను, కాబట్టి ఎన్ని బాధ్యతలనైనా మోయగలను’ అని చెప్పేది స్మృతి. చిన్నితెర నటి, నిర్మాతగా ఉన్నత స్థాయిలో ఉన్నప్పుడే రాజకీయాలపైన ఇష్టంతో ఆ రంగంలోకీ అడుగుపెట్టింది స్మృతి.

మిసెస్‌ ఫైర్‌బ్రాండ్‌
స్మృతి కుటుంబానికి రాజకీయాలు కొత్తకాదు. ఆమె తాతయ్య ఆరెస్సెస్‌లో పనిచేసేవారు.తల్లి జన్‌సంఘ్‌లో కార్యకర్తగా ఉండేది. స్మృతి కూడా చిన్నప్పట్నుంచే ఆరెస్సెస్‌లో సభ్యురాలు. ఆ ఇష్టంతోనే 2003లో బీజేపీలో చేరింది. 2004 ఎన్నికల్లో దిల్లీ చాంద్‌నీ చౌక్‌ నుంచి కాంగ్రెస్‌ నేత కపిల్‌ సిబల్‌కు పోటీగా బరిలోకి దిగింది. ఆ ఎన్నికల్లో ఓడిపోయినా గతంలో ఎప్పుడూ లేని విధంగా బీజేపీకి ఓటుబ్యాంకును సంపాదించిపెట్టింది. ఆ ప్రతిభకు మెచ్చి ఆమెను బీజేపీ మహారాష్ట్ర యూత్‌ వింగ్‌కు ఉపాధ్యక్షురాలిగా నియమించారు. కొన్నాళ్లకు బీజేపీ జాతీయ కార్యదర్శిగా, బీజేపీ మహిళా విభాగానికి అధ్యక్షురాలిగా ఎదిగింది. ఈ ప్రయాణంలో ప్రజల తరఫున ఆమె సాగించిన పోరాటాలు ఎన్నో. అత్యాచార బాధితులూ, మహిళా సమస్యల కోసం చేసిన పోరాటంలో అరెస్టయిన సందర్భాలూ ఉన్నాయి. తన వాగ్ధాటితో ప్రత్యర్థులను ఇరకాటంలో పడేసి ‘మిసెస్‌ ఫైర్‌బ్రాండ్‌’గానూ పేరుతెచ్చుకుంది.

మోదీ క్యాబినెట్‌కు...
‘నేను రాజీనామా చేసేవరకూ ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని స్మృతి ప్రకటించినప్పుడు ఆమెకు నా పైన కోపం కంటే పార్టీ పైన ఉన్న ప్రేమే ఎక్కువగా కనిపించింది’ అంటారు మోదీ. సమస్యలను పరిష్కరించడంలో దిట్టగా పేరున్న స్మృతి తన కష్టపడేతత్వంతో పార్టీలో అంచెలంచెలుగా ఎదిగింది. బీజేపీ గోవా విభాగానికి రాజకీయ సలహాదారుగానూ పనిచేసింది. 2011లో రాజ్యసభ సభ్యురాలిగా ఎన్నికై తొలిసారి పార్లమెంటులో అడుగుపెట్టింది. ఇప్పుడు మోదీ క్యాబినెట్‌లో మానవ వనరుల అభివృద్ధిశాఖ మంత్రిగా ఎంపికై అందరినీ ఆశ్చర్యపరచింది. పెద్దగా చదువుకోని మహిళకు అంత ఉన్నత పదవి ఏంటని ప్రత్యర్థులు విమర్శిస్తే ‘పెద్దగా చదువుకోలేదు కాబట్టే నాకు దాని విలువ తెలుసు. అవకాశాలు రాకపోతే కలిగే బాధను అనుభవించా. కాబట్టి విద్యార్థుల సమస్యలను నేను పరిష్కరించగలను. ఇంతకు ముందు ఈ పదవిలో ఐఐటీ, పీహెచ్‌డీ లాంటి ఉన్నత చదువులు చదివిన వాళ్లు పనిచేశారు. వాళ్ల పనితీరును చూశాక నేను పీహెచ్‌డీ చదవందే మంచిదైంది’ అంటూ విమర్శలను పదునైన మాటలతో తిప్పికొట్టింది.

చిన్నప్పట్నుంచీ స్మృతి ఇంట్లోవాళ్లు వద్దన్న పనులే చేసింది. కానీ అన్ని విషయాల్లోనూ విజయం సాధించింది. ‘ఎవరో చెప్పారని కాదు, మీ మనసుకి నచ్చింది చేయండి. వచ్చే ఫలితాలకు మీరే బాధ్యత తీసుకోండి. ఇంత ఉన్నత స్థానానికి చేరుకోగలనని మా ఇంట్లో వాళ్లు ఎప్పుడూ వూహించలేదు. కానీ నేను వూహించా. దాన్ని సాధించా. పశువుల పాకలో పెరిగి, వీధివీధి తిరిగే ఉద్యోగం చేసిన అమ్మాయి కేంద్రమంత్రి కాగలిగినప్పుడు, పట్టుదల ఉంటే సామాన్యులూ ఏదైనా సాధించగలరు. ఓసారి ప్రయత్నించి చూడండి’ అన్నది యువతకు స్మృతి ఇరానీ చెప్పే మాట. మరి ప్రయత్నిస్తారా..!

ఇంకొంత
స్మృతికి ఇద్దరు పిల్లలు. అబ్బాయి జోహ్ర్‌. అమ్మాయి జోయిష్‌. మంత్రి అయ్యాక కూడా అందరు తల్లుల్లానే పిల్లలను స్కూల్లో చేర్పించడానికి తానూ ఇంటర్వ్యూ ఎదుర్కొంది. ‘నా జీవితంలో అదే *కష్టమైన ఇంటర్వ్యూ’ అంటుంది స్మృతి.
ఉన్నత చదువులు చదవకపోయినా స్మృతికి ఆరు భాషల్లో ప్రావీణ్యం ఉంది. ఆంగ్లంలో అనర్గళంగా మాట్లాడుతుంది. పంజాబీ, బెంగాలీ, అస్సామీ, మరాఠీ భాషలూ వచ్చు.
ఆమిర్‌ఖాన్‌కు ఆమె అభిమాని. ‘ఖయామత్‌ సే ఖయామత్‌ తక్‌’ సినిమాని యాభైసార్లు చూసిందట. ‘మీ వల్ల నాకు చాలా డబ్బులు ఖర్చయ్యాయి’ అని ఆమిర్‌ను కలిస్తే చెప్పాలని అనుకునేదట. కానీ చాలాసార్లు అతడిని కలిసినా మొహమాటంతో చెప్పలేకపోయింది. వేరే వాళ్ల ద్వారా విషయం తెలుసుకున్న ఆమిర్‌, తన తరవాతి సినిమాల
టికెట్లను ఫ్రీగా పంపిస్తానని మాటిచ్చాడు.
జర్నలిస్టు కావాలని స్మృతికి కోరికగా ఉండేది. ఓసారి ఇంటర్వ్యూకి వెళ్తే ఆమెకు ఎలాంటి నైపుణ్యాలూ లేవని తిరస్కరించారట. అప్పట్నుంచీ మళ్లీ మరో అవకాశం కోసం ఆమె ప్రయత్నించలేదు.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.