close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
సినిమా..నా పదహారేళ్ల కల!

సినిమా..నా పదహారేళ్ల కల!

నాయకుడు... బలంగా ఉండాలి, గంభీరంగా కనిపించాలి. ప్రత్యర్థుల్ని మాటలతో, చూపులతో భయపెట్టాలి. మరి ప్రతినాయకుడు... పైన చెప్పిన లక్షణాల్ని అంతకంటే ఎక్కువ మోతాదులో కలిగి ఉండాలి. ఈ లక్షణాల్ని సొంతం చేసుకున్న నటుడు సంపత్‌. తన నటనతో దక్షిణాదిలో అన్ని భాషల్లోనూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సంపత్‌, తన సినిమా ప్రస్థానం గురించి చెబుతున్నారిలా...
ఈరోజు తెరపైన మీకు కనిపించడానికి నా జీవితంలో జరిగిన ఒక ముఖ్య సంఘటనే కారణం. నేనప్పుడు బెంగళూరులోనే ఉండేవాణ్ని. కన్నడలో రెండు సినిమాల్లో చేశాను. ఓరోజు కన్నడ దర్శకుడు నాగన్నగారిని ఏదో పనిమీద కలిశాను. అప్పుడే నాకు ఇంటి నుంచి ఫోన్‌ వస్తే తమిళంలో మాట్లాడాను. ‘మీకు తమిళం వచ్చా’ అనడిగారాయన. మాది బెంగళూరులో స్థిరపడిన తమిళ కుటుంబమని చెప్పాను. అయిదు నిమిషాల తర్వాత ఎవరికో ఫోన్‌ చేసి.... ‘మీరు ఎనిమిది నెలలుగా వెతుకుతున్న విలన్‌ నా ఎదురుగానే ఉన్నాడనిపిస్తోంది. ఈయన్ని చెన్నై పంపిస్తా చూడండి’ అని చెప్పారు. కట్‌చేస్తే... మర్నాడు ఉదయం చెన్నైలో టెస్ట్‌ షూట్‌ చేసి ఆ పాత్రకు నన్ను ఎంపిక చేశారు. హీరో విజయ్‌కాంత్‌ గారి సినిమా అది. ఆ సినిమా కథ పల్లెటూరి నేపథ్యంలోది. ‘మీకు లుంగీ కట్టడం వస్తుందా’ అనడిగారు దర్శకుడు. వచ్చని చెప్పాను. నేను మదురై యాసలో మాట్లాడాలి. షూటింగ్‌ ప్రారంభానికి మూడు నెలల ముందు నుంచి చెన్నైలో నాతోపాటు అసిస్టెంట్‌ డైరెక్టర్‌ ఉండి ఆ యాస నాకు వచ్చేలా చేశాడు. ఆ మూణ్నెళ్లూ ఎక్కడికైనా లుంగీతోనే వెళ్లేవాణ్ని. నా పాత్ర చెప్పులు కూడా వేసుకోదు. అది అలవాటు అవ్వడానికి మూణ్నెళ్లు చెప్పులు లేకుండానే తిరిగాను. షూటింగ్‌ బాగా జరిగింది. విజయకాంత్‌ నన్నే డబ్బింగ్‌ చెప్పమన్నారు. ఆ సినిమా ‘నెరంజ మనసు’. భారీ అంచనాలతో విడుదలైంది(2004). ఆరోజు సాయంత్రం నాగన్న ఫోన్‌చేసి ‘విజయకాంత్‌ కెరీర్‌లో ఈ సినిమానే బిగ్గెస్ట్‌ ఫ్లాప్‌’ అన్నారు. సరే అనుకొని, ముందుకు వెళ్లిపోయా. గొప్ప విషయం ఏంటంటే, నాకు ఆ సినిమాతో అనుకున్న బ్రేక్‌ రాలేదని చెప్పి వేరే నిర్మాతతో మాట్లాడి మరో సినిమాలో నాకో పాత్ర ఇప్పించారు విజయ్‌కాంత్‌.

ప్రభు స్నేహం
‘నెరంజ మనసు’లో దర్శకుడు వెంకట్‌ ప్రభూ, నేనూ అన్నదమ్ములుగా నటించాం. అప్పుడే మామధ్య స్నేహం చిగురించింది. ఆ తర్వాత నేను కొన్ని సినిమాల్లో నటించాను. 2007లో వచ్చిన తన మొదటి సినిమా ‘చెన్నై 28’తో సంచలనం సృష్టించాడు ప్రభు. దాంట్లో నాకొక కీలక పాత్ర ఇచ్చాడు. అతడి రెండో సినిమా ‘సరోజ’. అందులో విలన్‌గా చేశా. అది నా పాత్ర చుట్టూ తిరిగే కథ. విలన్‌కీ ప్రేమ, భావోద్వేగాలు ఉంటాయని చూపించారందులో. నాకో పాట కూడా ఉంది. ఆ పాట చెన్నైతోపాటు సింగపూర్‌, మలేషియాల్లోనూ పబ్‌లలో ఇప్పటికీ వినిపిస్తుంటుంది. దాంతో నాకొక స్టయిలున్న విలన్‌గా గుర్తింపు వచ్చింది. ప్రభు మూడో సినిమా ‘గోవా’లో స్వలింగ సంపర్కుడి పాత్రలో చేశాను. ఈ పాత్రకూ ప్రశంసలు వచ్చాయి. దాంతో విలన్‌గానే కాకుండా ఏ పాత్రనైనా చేయగలనన్న గుర్తింపు వచ్చింది. విశాల్‌ సినిమా ‘తామరభరణి’లో విలన్‌గా చేశాను. తెలుగులో ‘భరణి’ పేరుతో వచ్చిందా సినిమా. అందులో నాది పూర్తిస్థాయి విలన్‌ పాత్ర.

బ్రేక్‌ ఇచ్చింది... ‘మిర్చి’
తెలుగులో ‘పంజా’ చేసేనాటికి తమిళంలో ముఫ్ఫైకిపైగా సినిమాల్లో చేశాను. ఆ మధ్యలో మలయాళం, కన్నడ సినిమాల్లోనూ నటించాను. ‘పంజా’ దర్శకుడు విష్ణువర్ధన్‌ ఫోన్‌ చేసి టాలీవుడ్‌లో ఒక పాత్ర ఉందని చెప్పారు. నిజానికి తెలుగులో మంచి ఆరంభం ఉండాలనుకునేవాణ్ని. ఎందుకంటే తమిళంలో నాకో గుర్తింపు ఉంది. ఇక్కడ మళ్లీ చిన్న పాత్రలతో ప్రారంభించకూడదనుకున్నాను. పవన్‌ కల్యాణ్‌ సినిమా అని అంగీకరించాను. తర్వాత ‘సింహా’లో ఓ పాత్రకోసం బోయపాటి శ్రీను అడిగారు. కొన్ని కారణాలవల్ల వద్దనుకున్నాను. తర్వాత ఆయనే ‘దమ్ము’లో ఒక దమ్మున్న పాత్ర ఇచ్చారు. తెలుగులో నాకు మంచి గుర్తింపు వచ్చింది మాత్రం ‘మిర్చి’తోనే. కల్యాణ్‌రామ్‌ సినిమా ‘ఓం త్రీడీ’ దర్శకుడు సునీల్‌రెడ్డి నా తమిళ సినిమాలు చూసి నాకు అందులో ఒక కీలక పాత్ర ఇచ్చారు. ఆ సమయంలోనే కొరటాల శివ ‘మిర్చి’ మొదలుపెట్టారు. అప్పుడు శివగారికి నా గురించి చెప్పారు సునీల్‌. శివ పిలిచి కథ వినిపించారు. నచ్చింది. మిర్చి, ఓం... రెండూ సమాంతరంగా చేశాను. ‘నువ్వు చేస్తున్న పాత్రల్ని నేను బయట నిజంగా చూశాను. ఇందులో అతిశయంలేదు. మీ సామర్థ్యంపైన నాకు సందేహంలేదు. మీ గాంభీర్యాన్ని చివరివరకూ కొనసాగించండి’ అని చెప్పారు శివ. నేనలానే చేశాను. నేననుకున్న దానికంటే పెద్ద హిట్‌ అయ్యిందా సినిమా. మిర్చి నిర్మాత వంశీ కొన్నాళ్ల తర్వాత ఫోన్‌ చేసి ‘ఒక కొత్త కథ ఉంది. దాన్లో కమిషనర్‌ పాత్రకు మీరైతే సరిపోతారని నాకు అనిపించింది. కథ వినండ’ని చెప్పి దర్శకుడు సుజిత్‌ని పంపారు. అదే ‘రన్‌ రాజా రన్‌’. ఆ పాత్రలో చాలా వేరియేషన్స్‌ ఉన్నాయి. అందులో నా పాత్రకు గ్రేహెయిర్‌ పెట్టడం, మైఖేల్‌ జాక్సన్‌ స్టెప్పులాంటి కొన్నింటిని చేద్దామని సుజిత్‌కి చెబితే... చాలా హ్యాపీగా ఫీలయ్యాడు. బ్రహ్మాండమైన హిట్‌ అది. ఆ తర్వాత తెలుగులో ‘పవర్‌’, ‘లౌక్యం’, సన్నాఫ్‌ సత్యమూర్తిలలో చేశాను.

అన్నయ్య దొరికాడు
ఓరోజు కొరటాల శివ ఫోన్‌ చేసి శ్రీమంతుడు కథ చెప్పి ఆ సినిమాలో ఎలాగైనా చేయాలన్నారు. ‘ఇంత మంచి సినిమాలో అవకాశం వస్తే ఎందుకు వదులుకుంటాను... షూటింగ్‌ ఎప్పుడో చెబితే వచ్చేస్తా’నన్నా. అయితే నన్ను మిర్చిలో చూపినట్టే మళ్లీ చూపొద్దని అడిగాను. ‘మీకొక కొత్త స్టయిల్‌ నా మైండ్‌లో ఉంది’ అని చెప్పారు శివ. చెప్పినట్టే శ్రీమంతుడులో కొత్తగా చూపించారు నన్ను. తెరపైన చూస్తే సినిమా ఒక రేంజ్‌లో వచ్చింది. మహేష్‌ చాలా ప్రొఫెషనల్‌ నటుడు. తనతో పోటీగా నటించే వారుంటే ఎంతో సంతోషిస్తారు. పర్‌ఫెక్షన్‌కి టైమ్‌ ఇస్తారు. దానివల్లే ఈ సినిమా గొప్పగా వచ్చింది. ‘శ్రీమంతుడు’ షూటింగ్‌ సమయంలో ఆయన సెట్స్‌లో వేసే పంచ్‌లకు పడిపడి నవ్వుకునేవాళ్లం. ‘శ్రీమంతుడు’ని మా అమ్మాయి తమిళంలో చూసి బ్యాంకాక్‌లో ఉన్న నాకు ఫోన్‌ చేసింది. తనకిపుడు పదహారేళ్లు... మహేష్‌ తనకు బాగా నచ్చారట. ‘ఆయనతో పెళ్లి చేస్తావా’అని అడిగింది. నేను నవ్వు ఆపుకోలేకపోయాను. సినిమాలో మహేష్‌ని కొట్టినందుకు నాపైన కోప్పడింది కూడా. ‘యూ ఆర్‌ బ్యాడ్‌’ అంది. అది సినిమా అని చెప్పినా ‘మహేష్‌ని ఎవరూ కొట్టకూడదంతే’ అంది కోపంగా. మహేష్‌ అభిమానుల్లో 80 శాతం అమ్మాయిలే ఉంటారనుకుంటా. ‘శ్రీమంతుడు’వల్ల నాకు రాజేంద్రప్రసాద్‌గారి రూపంలో ఓ అన్నయ్య దొరికారు. మా ఇద్దరి మధ్యా ఎంతో అన్యోన్యత ఏర్పడింది.

నాన్నది నెల్లూరు
సినిమాల్లోకి రాకముందు నుంచీ నాకు తెలుగుతో అనుబంధం ఉంది. మాది తమిళ కుటుంబమే అయినా, నాన్న పుట్టి పెరిగింది నెల్లూరులో. తెలుగు మీడియంలోనే చదువుకున్నారు. ఆయన చనిపోయే వరకూ తెలుగు పుస్తకాలు చదివేవారు. నాన్న ఆర్మీలో డాక్టర్‌గా పనిచేశారు. నేను పుట్టింది లక్నోలో. ఉత్తరాదిలో చాన్నాళ్లు ఉన్నాం. ఆర్మీ స్కూల్లో చదివాను. నాన్న రిటైరయ్యాక మేం బెంగళూరులో స్థిరపడ్డాం. నా హైస్కూల్‌, కాలేజీ చదువులు బెంగళూరులోనే. చదువు తర్వాత అక్కడే కొందరు స్నేహితులతో కలిసి వాణిజ్య ప్రకటనల సంస్థను ప్రారంభించాను. నేను సినిమాల్లోకి రావడానికి కారణం అమితాబ్‌ బచ్చన్‌ ‘దీవార్‌’ సినిమా అని చెప్పాలి. అందులో బిగ్‌బీ పాత్ర ప్రభావం నాపైన బాగా పడింది. ఆ సినిమా వచ్చినపుడు నాకు 16 ఏళ్లుంటాయి. అది చూశాకే సినిమాల్లోకి వెళ్లాలనే ఆలోచన మొదలైంది. అలాగే బాలీవుడ్‌ నటుడు ‘ప్రాణ్‌’ నటన నన్ను ఆకట్టుకునేది. ఆర్మీ వాతావరణంలో పెరిగిన నేను సినిమాల్లోకి వెళ్తానంటే అమ్మ ఎంత మాత్రం అంగీకరించలేదు. ఎక్కడా కుదురుకోలేని వాళ్లే సినిమాల్లోకి వెళ్తారనేది అమ్మ అభిప్రాయం. చదువు, ఉద్యోగం, పెళ్లి, కుటుంబం... ఇదే మన రూటని చెప్పేది. ఇంట్లో చెప్పినట్టే చదువుకొని ఉద్యోగమూ, వ్యాపారమూ చేశాను, పెళ్లిచేసుకొని, ఒక పాప పుట్టాక 32 ఏళ్ల తర్వాత కూడా నాకు సినిమాలమీద ఆసక్తి పోలేదు. చివరికి ‘అమ్మా నువ్వు ఏం చేయమన్నావో అది చేశాను. ఇప్పుడు నాకు కావాల్సింది కూడా నన్ను చేసుకోనివ్వు’ అని ఒప్పించాను. కన్నడ దర్శకురాలు కవితా లంకేష్‌ దర్శకత్వంలో ‘బింబా’ అనే ఆర్ట్‌ ఫిల్మ్‌లో మొదట నటించాను. ఆ సినిమా ఆడిషన్లకి నా స్నేహితుడు వెళ్లాడు. వాడు ఎంపిక కాలేదు. దర్శకురాలు చెబుతున్న పాత్రకు నేను సరిపోవచ్చని వాడికి అనిపించి నాతో చెప్పాడు. తర్వాత నేను వెళ్తే ఎంపికచేశారు. ఆమె తీసిన కమర్షియల్‌ సినిమా ‘ప్రీతి ప్రేమ ప్రణయ’లోనూ చేశాను. ఈ సినిమాకి జాతీయ అవార్డు రావడంతో నాకు గుర్తింపు వచ్చింది. అందులో హీరోయిన్‌ తండ్రి పాత్ర చేశాను.

కొన్ని నియమాలున్నాయి...
ఇప్పటివరకూ కన్నడ, తమిళం, తెలుగు, మలయాళ భాషల్లో అరవైకిపైగా సినిమాల్లో చేశాను. మలయాళంలో మోహన్‌లాల్‌గారితో చేశాను. నాకు డబ్బింగ్‌ వేరేవాళ్లు చెబితే నచ్చదు. అందువల్ల మలయాళ సినిమాలు వదులుకుంటున్నా. నాకు తమిళం, తెలుగు, కన్నడ, హిందీ, ఇంగ్లిష్‌ వచ్చు. మరాఠీ కూడా అర్థమవుతుంది. ‘మిర్చి’ నుంచీ తెలుగులో డబ్బింగ్‌ చెప్పుకోవడం మొదలుపెట్టాను. దర్శకుడు శివ ఈ విషయంలో చాలా హ్యాపీగా ఫీలయ్యారు. ‘రఘువరన్‌’ గారితో ‘బీమా’ అనే తమిళ సినిమాలో కలిసి నటించాను. మేం పది రోజులు కలిసి పనిచేశాం. ఆయన వంతు షూటింగ్‌ అయిపోయిన తర్వాత కూడా ఒకరోజు సెట్స్‌కి వచ్చి నాతో మాట్లాడారు. ‘నువ్వు అందుకుంటావో లేదో తెలియదు కానీ పరిశ్రమ నీకు మంచి అవకాశాలు ఇస్తుంది. నువ్విక్కడ నిలదొక్కుకోవాలనుకుంటే మాత్రం కొన్ని నియమాలు పాటించాలి’ అన్నారు. ‘తామర భరిణి’లో నాజర్‌ గారితోనూ పరిచయం ఏర్పడింది. ఆయన కూడా అలాగే చెప్పారు. ‘అర్ధరాత్రి దాటాక జరిగే పార్టీలకు వెళ్లకు, రోజూ వ్యాయామం చెయ్యి, ఆహారం ఒక పద్ధతిలో తీసుకో, బాగా తిన్నా కూడా బాగా వర్కవుట్‌ చెయ్యి, తెల్లవారి షూటింగ్‌కి వచ్చే సమయానికి పూర్తి ఉత్సాహంతో ఉండు, పుకార్లలో ఉండకు’ అని చెప్పారు. అవన్నీ ఫాలో అవుతాను. నాకు నేనుగా కొన్ని నియమాలు పెట్టుకున్నాను కూడా. గర్భవతుల్ని కొట్టడం, బాలికల్ని లైంగికంగా వేధించడం లాంటి సీన్లు చేయను.

హీరోగా చేయను కానీ...
సరోజ సినిమా తర్వాత హీరోగా చేయమని చాలామంది అడిగారు. నాకు మొదట్నుంచీ క్యారెక్టర్‌ ఆర్టిస్టు అవ్వడమే ఇష్టం. రఘువరన్‌, నాజర్‌, ప్రకాష్‌రాజ్‌లను చూడండి... వాళ్లకి ఏ ప్రాత ఇచ్చినా దానికి జీవం పోస్తారు. హీరోయిజం చూపించేలా కాకుండా దృశ్యంలాంటి సినిమా వస్తే మాత్రం హీరోగా చేయడానికి సిద్ధం. ప్రస్తుతం చెన్నైలోనే ఉంటున్నాను. సినిమాల్లోకి రాకముందే విడాకులు తీసుకున్నాను. పాప నాలుగేళ్ల నుంచి నా దగ్గర ఉంటోంది. పాపకోసమని మళ్లీ పెళ్లిచేసుకోలేదు. ప్రస్తుతం అమ్మాయి బెంగళూరులో చదువుతోంది. ఖాళీ దొరికితే బెంగళూరు వెళ్లి వస్తాను. అక్కడ 20 ఏళ్లు ఉన్నాను. మళ్లీ మా అమ్మాయివల్ల అక్కడికి వెళ్తున్నాను. బెంగళూరులోని ఎమ్టీఆర్‌ రెస్టారెంట్‌లో కూర్చొని క్రికెట్‌ గురించి చర్చించడం అప్పట్లో నాకెంతో ఇష్టమైన కాలక్షేపం.
ప్రస్తుతం కమల్‌హాసన్‌తో ఓ సినిమా చేశాను. అది తమిళంతోపాటు తెలుగులోనూ వస్తోంది. తెలుగులో నాగార్జున, రామ్‌చరణ్‌, నానీల సినిమాల్లో చేస్తున్నాను. ఇవి పూర్తయ్యాక కాస్త విరామం తీసుకుంటాను. భారమయ్యేంతలా పనిచేయడం ఇష్టం ఉండదు నాకు.

- సుంకరి చంద్రశేఖర్‌

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.