close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఐదొందలతో అమెరికా వెళ్లా!

ఐదొందలతో అమెరికా వెళ్లా!

దివి మురళీ కృష్ణ ప్రసాద్‌... దేశంలోని సంపన్నుల జాబితాను తిరగేస్తే 45వ స్థానంలో ఈ పేరు కనిపిస్తుంది. విలువలతో వ్యాపారాన్ని నడిపించే వాళ్ల చిట్టాను తయారు చేస్తే ఆ పేరు మొదటి వరసలోనే ఉంటుంది! ‘దివీస్‌ లెబొరేటరీస్‌’ ప్రస్తుత మార్కెట్‌ విలువ సుమారు 30వేల కోట్ల రూపాయలు. ఆ సంపదను సృష్టించడానికి పట్టిన సమయం సరిగ్గా పాతికేళ్లు. ఆ ప్రయాణంలో అడుగడుగునా కష్టానికే తప్ప అదృష్టానికి చోటు లేదంటారు ఆయన. ఇంకా ఏం చెబుతున్నారంటే...
పల్లెటూరు, ఉమ్మడి కుటుంబం, ఆర్థిక ఇబ్బందులు, చదువులో వెనకబడటం... చాలామందికి ఉండే అతి సాధారణ నేపథ్యమే నాది కూడా. కానీ ఎప్పటికీ అలా ఉండిపోకూడదన్న కోరికే ఇప్పుడిక్కడిదాకా తీసుకొచ్చింది. కృష్ణాజిల్లా మచిలీపట్నం దగ్గర్లో ఉన్న మంతెన మా వూరు. నాన్న సత్యనారాయణగారు జిల్లా పరిషత్‌ సెక్రటరీగా పనిచేసేవారు. ఎలా ఉండాలీ, ఏం చేయాలీ అని ఆయన ఎప్పుడూ మాకు చెప్పలేదు. ఆయన నమ్మి ఆచరించిన పద్ధతులే మాకు జీవిత పాఠాలు నేర్పాయి. పెళ్లయి పిల్లలు పుట్టిన చాలా కాలానికి నాన్న కలకత్తా వెళ్లి డిగ్రీ పూర్తిచేశారు. మా వూళ్లొ అంతవరకూ చదువుకున్న మొదటి వ్యక్తి నాన్నే. అమ్మానాన్నకు మొత్తం పదమూడు మంది సంతానం. అందులో ఆఖరివాణ్ని నేనే. నాకు ముందు ఎనిమిది మంది అన్నయ్యలూ నలుగురు అక్కలూ. పెద్ద కుటుంబం కాబట్టి అందరం కష్టపడితేనే ఇల్లు గడిచేది. ఇంటికి కావల్సిన కూరగాయలన్నీ మా పెరట్లోనే పండించేవాళ్లం. పశువులకు ఒంట్లో బాలేకపోతే మా స్కూలు ముందు నుంచే వాటిని ఆస్పత్రికి తీసుకెళ్లేవాణ్ని. కష్టపడటం వూహ తెలిసినప్పట్నుంచీ అలవాటు కాబట్టి ఏమాత్రం నామోషీగా అనిపించేది కాదు.

ఇంటర్‌ ఫెయిల్‌
మచిలీపట్నంలోని హిందూ హైస్కూల్‌లోనే నేను చదువుకున్నా. చదువులో నేను చాలా మామూలు విద్యార్థిని. ఇంటర్‌లో ఫెయిలయ్యా కూడా. అలాంటప్పుడు జీవితంలో ఎదుగుతానని ఎవరైనా ఎలా అనుకుంటారు? ఇంట్లోవాళ్లకూ అదే అనిపించిందో ఏమో, అక్కడుంటే లాభం లేదని మణిపాల్‌లో ఇంజినీరింగ్‌ చదువుతున్న అన్నయ్య దగ్గరకి నన్ను పంపించారు. అదే నా జీవితానికి టర్నింగ్‌ పాయింట్‌. మణిపాల్‌ యూనివర్సిటీలో ఫార్మసీలో చేరా. అక్కడ మలేషియా సింగపూర్‌ లాంటి దేశాల నుంచి వచ్చిన చాలా మంది ధనవంతుల పిల్లలు చదివేవారు. డబ్బు సంపాదనలో ఉండే నొప్పి వాళ్లకు తెలీదు. చాలా విచ్చలవిడిగా ఖర్చుపెట్టేవారు. కానీ నా పరిస్థితి వేరు. నాకొచ్చే ప్రతి రూపాయి ఎక్కడిదో, పన్నెండు మందిని చదివించిన నాన్న, పదమూడో వాణ్నైన నాకు డబ్బు పంపడానికి ఎంత కష్టపడుతున్నారో తెలుసు. ఆ ఆలోచనే కనువిప్పు కలిగించింది. కష్టపడి చదివేందుకు నాకు స్ఫూర్తినిచ్చింది. ఫస్టియర్‌లో ఫెయిలైన నేను సెకండియర్‌లో సాధారణ మార్కులతో, తరవాత ఫస్‌క్లాస్‌, డిస్టింక్షన్‌లతో పాసయ్యా. బీ ఫార్మసీ పూర్తయ్యేనాటికి యూనివర్సిటీ ఫస్టొచ్చి గోల్డ్‌ మెడల్‌ అందుకున్నా. తరవాత ఎంఫార్మసీలో కూడా గోల్డ్‌ మెడల్‌ సాధించి ఉత్తమ విద్యార్థిగా యూనివర్సిటీ నుంచి బయట అడుగుపెట్టా. పీజీ అయ్యాక ఉద్యోగం వెతుక్కుంటూ హైదరాబాద్‌ వచ్చా. వార్నర్‌ హిందుస్తాన్‌ సంస్థలో ఉద్యోగిగా 250రూపాయల జీతానికి నా కెరీర్‌ మొదలైంది.

జీతం నాలుగున్నర లక్షలు!
ఆ రోజుల్లో అమెరికాలో ఫార్మసిస్టులకు చాలా డిమాండ్‌ ఉండేది. దాదాపు దరఖాస్తు చేసుకున్న ఫార్మసిస్టులందరికీ అమెరికా వీసా వచ్చేది. నేను కూడా చెన్నైలో స్నేహితులతో కలిసి వీసాకు ప్రయత్నించా. గోల్డ్‌ మెడలిస్ట్‌ను కాబట్టి చిన్న ఇంటర్వ్యూ చేసి వీసాతో పాటు అక్కడే స్థిరపడటానికి గ్రీన్‌ కార్డు కూడా ఇచ్చారు. కానీ ఆ తరవాత అమెరికా వెళ్లడానికి నాకు తొమ్మిది నెలలు పట్టింది. ఆ మధ్యలో ‘యూనిలాయిడ్స్‌’ అనే కంపెనీలో ఉద్యోగం వచ్చింది. డాక్టర్‌.అంజిరెడ్డి దాని డైరెక్టర్లలో ఒకరు. అక్కడ నా జీతం వెయ్యిరూపాయలు. అప్పటి ధరలకు అది మంచి జీతమే అయినా అన్ని అవసరాలకూ సరిపోయేది కాదు. అప్పటికే పెళ్లయింది, ఒక బాబు ఉన్నాడు. అలాంటప్పుడు ఉద్యోగం వదిలేసి అమెరికాకు వెళ్లడం కొద్దిగా రిస్కే. కానీ జీవితం అక్కడే ఆగిపోవడం కూడా నాకిష్టం లేదు. అందుకే ధైర్యం చేసి 1976-77ప్రాంతంలో జేబులో కేవలం 7డాలర్ల(ప్రస్తుతం సుమారు రూ.500)తో అమెరికాలోని న్యూయార్క్‌ నగరంలో అడుగుపెట్టా. అప్పట్లో ఫారిన్‌ ఎక్స్‌ఛేంజ్‌ కింద అంతే ఇచ్చేవారు. టెక్సాస్‌లోని శాన్‌ఆంటోనియోలో కెమిస్ట్‌గా ఓ కంపెనీలో ఉద్యోగంలో చేరా. తరవాత కొన్నాళ్లకు కాస్మొటెక్స్‌ రసాయనాల తయారీ ప్లాంట్‌కు సూపరింటెండెంట్‌గా వెళ్లా. ఒక్కో మెట్టూ ఎక్కుతూ ఓ సంస్థకు వైస్‌ ప్రెసిడెంట్‌, డైరెక్టర్‌ హోదాకు చేరుకున్నా. అప్పట్లోనే నా జీతం 65వేల డాలర్లు(సుమారు నాలుగున్నర లక్షలు). ఓ రోజు ఫ్యాక్టరీ నుంచి కారు నడుపుకుంటూ ఇంటికొస్తుంటే ఉన్నట్టుండీ ఓ ఆలోచన.. ‘అంత పెద్ద కుటుంబాన్ని వదిలిపెట్టి నేనిక్కడ ఎవరికోసం పనిచేస్తున్నా’ అని. ఇంటికెళ్లగానే ‘అందర్నీ మిస్సవుతున్నా, భారత్‌ వెళ్లిపోవాలనిపిస్తోంది’ అని నా భార్యకు చెప్పా. తను ఏమంటుందో అనుకున్నా. కానీ ఒక్కమాట కూడా అడ్డుచెప్పకుండా ‘అలాగే వెళ్లిపోదాం’ అంది. నిర్ణయం తీసుకున్న రెండు నెలల్లో అక్కడ అన్నీ చక్కబెట్టుకుని భారత్‌కు వచ్చేశా.

అంజిరెడ్డితో కలిసి...
భారత్‌కు వచ్చాక ఏం చేయాలో తెలీదు. చేతిలో పెద్దగా డబ్బు కూడా లేదు. కానీ అమెరికాలో కెమిస్ట్రీలో సంపాదించిన అపార మేధస్సు మాత్రం ఉంది. అదే నా పెట్టుబడి. దాంతోనే ఓ చిన్న రసాయన ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలనుకున్నా. కానీ ‘రెడ్డీస్‌ ల్యాబ్స్‌’ అంజిరెడ్డి పిలిచి ‘మనం ఎందుకు ఓ పెద్ద కంపెనీని మొదలుపెట్టకూడదూ’ అన్నారు. అలాగే చేద్దామని దాదాపు పతనమైపోయిన ‘కెమినార్‌’ అనే సంస్థను కొని దానిపైన పన్నెండు లక్షలు పెట్టుబడి పెట్టాం. కేవలం ఆరుగురు ఉద్యోగులతో దాని నడక మొదలైంది. ‘ఆయన అమెరికా నుంచి వచ్చాడట, ఐడీపీఎల్‌లాగా ఆ కంపెనీ పెద్దదవుతుందట’ అంటూ రకరకాల కామెంట్లు వచ్చాయి. కానీ వాటిని పట్టించుకోకుండా ధైర్యంగా ముందుకెళ్లాం. కెమిస్ట్రీ మా బలం. ‘సర్వైవల్‌ ఆఫ్‌ ది ఫిట్టెస్ట్‌’ మేము నమ్మిన సిద్ధాంతం. మేము రసాయనాలు తయారు చేయడం మొదలుపెట్టాక క్రమంగా రాష్ట్రంలో, తరవాత దేశంలో లీడర్లుగా ఎదిగాం. అమెరికాకు ఎగుమతులు మొదలుపెట్టాం. ఉత్పత్తుల పరిమాణం పెంచాల్సిన అవసరం ఏర్పడింది. దాంతో మిర్యాలగూడ, వైజాగ్‌లలో మరో రెండు ప్లాంట్లు ఏర్పాటు చేశాం. 1990నాటికి కొన్ని కోట్ల రూపాయల కంపెనీగా అది ఎదిగింది. అప్పుడూ నాకు ఒకటే ఆలోచన ‘నేనెందుకు సొంతంగా సంస్థను మొదలుపెట్టకూడదూ’ అని. అంతే... 1990లో ‘కెమినార్‌’ నుంచి బయటికొచ్చి సనత్‌నగర్‌లో ‘దివీస్‌ రీసెర్చ్‌ సెంటర్‌’ పేరుతో రసాయన పరిశోధనాశాలను ఏర్పాటు చేశా.

మేమే నంబర్‌ వన్‌
నాలుగేళ్లపాటు పరిశోధనా విభాగంలోనే పనిచేశాం. ఆ తరవాత సొంతంగా మందుల తయారీ మొదలుపెట్టాలని నిర్ణయించుకున్నాం. దానికోసం బ్యాంకు నుంచి కొంత రుణం తీసుకున్నా. నా సొంత డబ్బు కూడా కలిపి మొత్తం 25మిలియన్‌ డాలర్లతో(ప్రస్తుతం 160కోట్లు) చౌటుప్పల్‌లో 500ఎకరాల్లో ‘దివీస్‌ ల్యాబ్స్‌’ను ఏర్పాటుచేశా. మా సొంత పరిశోధనాశాలలో అభివృద్ధి చేసిన కొన్ని మందులను అక్కడ తయారు చేసేవాళ్లం. ఆ సమయంలో మేము తయారు చేయడం మొదలుపెట్టిన మందుల విభాగంలో ఇప్పుడు ప్రపంచంలో మాదే అగ్రస్థానం. ఎప్పటికప్పుడు వాటిని అభివృద్ధి చేసుకుంటూ రావడమే అందుకు కారణం. వంద మంది ఉద్యోగులతో మొదలైన కంపెనీ క్రమంగా పది వేల మందికి చేరింది. 2002లో ఉత్పత్తులు పెంచాల్సిన అవసరం ఏర్పడినప్పుడు వైజాగ్‌ దగ్గర్లోని చిప్పాడలో మరో ప్లాంట్‌ను ఏర్పాటు చేశాం. ప్రపంచంలోనే అతిపెద్ద ‘ఏపీఐ’ (యాక్టివ్‌ ఫార్మాస్యూటికల్‌ ఇంగ్రీడియంట్‌) మందుల తయారీ ప్లాంట్‌గా దానికి పేరుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సెజ్‌ హోదా పొందిన మొదటి సంస్థ కూడా మాదే. వైజాగ్‌లో ప్లాంట్‌ పెట్టాక వెనక్కు తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ప్రతి సంవత్సరం 20శాతానికి పైగా అభివృద్ధి సాధిస్తూ వస్తోంది. మా రంగంలో ఎక్కువ శాతం లాభాలు అర్జిస్తోన్న కంపెనీగానూ మాకు గుర్తింపు ఉంది.

ఇంకొంత
అమ్మానాన్నా నేర్పిన విలువలే ఓ మామూలు వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన నన్ను ఈ స్థానంలో నిలబెట్టాయి. వాళ్ల రుణం తీర్చుకునే ప్రయత్నంలో భాగంగా చౌటుప్పల్‌ హైవే దగ్గర అమ్మకూ, వైజాగ్‌లో మా వ్యవసాయ క్షేత్రంలో నాన్నకూ గుళ్లు కట్టించా. ఏటా ఓ రోజు అక్కడ అభిషేకం చేయిస్తాం.
* మా అన్నయ్యలూ, అక్కలూ, వాళ్ల పిల్లలూ అందరం కలిపి మా కుటుంబ సభ్యుల సంఖ్య 170. వాళ్లలో చాలామంది వేర్వేరు దేశాల్లో రకరకాల హోదాల్లో పనిచేస్తున్నారు. కొంతమంది నా కంపెనీలోనే ఉద్యోగాల్లో ఉన్నారు. అందరం ఏటా రెండు సార్లు కచ్చితంగా కలుస్తాం. నాలుగైదు రోజులు సరదాగా గడుపుతాం.
* మా అబ్బాయి కిరణ్‌ మా సంసక్థు డైరెక్టర్‌గా ఉన్నాడు. అమ్మాయి నీలిమ గ్లాస్గో యూనివర్సిటీ నుంచి ఎమ్మెస్‌ ఫైనాన్స్‌ ఖీ బ్యాంకింగ్‌ పూర్తిచేసి ప్రస్తుతం దివీస్‌లో చీఫ్‌ కంట్రోలర్‌ బాధ్యతలు నిర్వహిస్తోంది. నా భార్య పేరు స్వర్ణలత. అమ్మాయి, అబ్బాయి సాధారణ ఉద్యోగుల్లా పొద్దున్నే ఆఫీసుకొచ్చి సాయంత్రం దాకా పనిచేస్తారు.
* వ్యవసాయం, పచ్చదనం నాకు చాలా ఇష్టం. నేను సొంతంగా మామిడి, జీడి, కొబ్బరి తోటలను పండిస్తున్నాను. వారాంతాల్లో నా వ్యవసాయ క్షేత్రంలోనే పనిచేస్తూ కనిపిస్తా. మా ఫ్యాక్టరీల్లో 50 నుంచి 70శాతం వరకూ పచ్చదనమే ఉంటుంది. మేం నాటిన సుమారు ఐదు లక్షల చెట్లు దాదాపు పది-పదిహేనేళ్ల నుంచి ఫ్యాక్టరీ ఆవరణలో పెరుగుతున్నాయి.
* మానసిక, శారీరక ఆరోగ్యం కోసం యోగా చేస్తా. అదే నా భార్యకూ, పిల్లలకూ, ఉద్యోగులకూ అలవాటైంది. ఉద్యోగుల కోసం యోగా సెంటర్‌ కూడా నిర్మిస్తున్నాం.
* నాకు బాగా సంతృప్తినిచ్చిన పనుల్లో సంస్థ నిర్వహిస్తోన్న సేవాకార్యక్రమాలు ఒకటి. గ్రామాల్లో మంచి నీటికోసం యూవీ ప్లాంట్లూ, స్కూళ్లూ, అంధుల పాఠశాలలూ, ఉపాధి శిక్షణా కేంద్రాలూ... ఇలా అనేక విభాగాలకు 20ఏళ్లగా లాభాల్లో కొంత కేటాయిస్తున్నాం.
* నేను కెమినార్‌లో ఉద్యోగం మానేసినప్పుడు నాతో పాటు 125మంది ఉద్యోగం మానేశారు. వాళ్లలో చాలామంది సొంతంగా వ్యాపారాలు మొదలుపెట్టారు. సంస్థలో వాళ్లంతా నన్ను అనుసరించి, తరవాత నేను లేకుండా పనిచేయలేమని నిర్ణయించుకున్నారు. కింది సిబ్బందిపైన అలాంటి ప్రభావం చూపించగలగడం నా అదృష్టం.
* మీకు నైపుణ్యం ఉన్న విభాగంలోనే వ్యాపారం మొదలుపెట్టండీ, లక్ష్యాన్ని చేరుకునేవరకూ శ్రమించండీ, నేర్చుకునే ప్రక్రియను ఎప్పుడూ ఆపకండీ... ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు నా అనుభవంతో చెప్పే మాట ఇది.

ఉద్యోగులకూ వాటా
280కోట్లు... గత ఏడాది మేం కట్టిన ఆదాయపన్ను. నేను వ్యక్తిగతంగా సుమారు 30కోట్లు పన్ను కట్టా. ప్రస్తుతం మార్కెట్లో మా సంస్థ విలువ 30,000 కోట్ల రూపాయల పైమాటే. అందులో 52శాతం, అంటే సుమారు 15వేల కోట్లు నా వ్యక్తిగతం. ఈ సంపద ఒక్క రాత్రిలో వూడిపడలేదు. పాతికేళ్ల కష్టానికి సాక్ష్యాలే ఈ అంకెలు. 1994లో ఒకేఒక్కసారి బ్యాంకు నుంచి రుణం తీసుకున్నా. ఆ తరవాత ఎప్పుడూ బయటివాళ్లని డబ్బులడగాల్సిన పరిస్థితి రాలేదు. సంస్థ పాటిస్తోన్న వ్యక్తిగత, ఆర్థిక క్రమశిక్షణే అందుకు కారణం. మా ఉద్యోగుల్లో సుమారు మూడు వేల మంది పది పదిహేనేళ్ల నుంచి మాతో కలిసున్న వాళ్లే. వాళ్లకు సంస్థను వదిలి వెళ్లడానికి ఒక్క కారణం కూడా కనిపించకుండా నడిపిస్తున్నా. కొందరు ఉద్యోగులకు మా షేర్లలో వాటాలూ ఉన్నాయి.
నా కాళ్లూ, ఆలోచనలూ ఎప్పుడూ భూమ్మీదే ఉంటాయి. నా విజయానికి అదే పెద్ద కారణం అనిపిస్తుంది. అమెరికా వెళ్లినప్పుడు బతకడానికి కష్టపడ్డా. బారత్‌కు వచ్చినప్పుడు మనుగడ కోసం కష్టపడ్డా. కంపెనీ పెట్టినప్పుడు దాన్ని నిలబెట్టడానికీ, నన్ను నేను నిరూపించుకోవడానికీ కష్టపడ్డా. జీవితంలో ప్రతి నిమిషం ఆ కష్టమే నన్ను నడిపించింది. ఎవరో ఒకసారి అడిగారు ‘మీరు రిటైర్‌ అయ్యాక కంపెనీ పరిస్థితి ఏంటీ’ అని. పనిచేయడం నాకెంతో ఇష్టమైన వ్యాపకం. ఉద్యోగాలకు రిటైర్‌మెంట్‌ ఉంటుంది కానీ ఇష్టాలకూ, వ్యాపకాలకూ కాదు కదా..!

- శరత్‌ కుమార్‌ బెహరా

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.