close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
నాగార్జున కోసం ఆ కథ రాశా

నాగార్జున కోసం ఆ కథ రాశా

కొందరు వ్యక్తులు తమకంటే తాము చేసే పనే నలుగురికీ తెలియాలనుకుంటారు. అవే తమ గురించి మాట్లాడాలనుకుంటారు. అలాంటి వ్యక్తి రామ్మోహన్‌ పరువు. అష్టా చమ్మా, గోల్కొండ హైస్కూల్‌, ఉయ్యాలా జంపాలా సినిమాల నిర్మాత. నానీ, రాజ్‌తరుణ్‌, శ్రీనివాస్‌ అవసరాల, అవికాగోర్‌లను వెండితెరకు పరిచయం చేసింది ఈయనే. నాగార్జున ‘సోగ్గాడే...’కి కథనందించిందీ ఈయనే. రామ్మోహన్‌ సినిమా ప్రస్థానం ఆయన మాటల్లోనే...

నాన్న రోడ్లు, భవనాల శాఖలో ఇంజినీర్‌గా పనిచేసేవారు. ఆయన ఉద్యోగంవల్ల చిన్నపుడు ఏలూరు, వరంగల్‌, కర్నూలు, ఖమ్మంలలో ఉండేవాళ్లం. ఆయనకి చీఫ్‌ ఇంజినీర్‌గా పదోన్నతి రావడంతో నాకు పదేళ్లపుడు హైదరాబాద్‌ వచ్చి అప్పట్నుంచీ ఇక్కడే స్థిరపడ్డాం. రిటైరైన మూడేళ్లకి, నేను టెన్త్‌లో ఉన్నపుడు రోడ్డు ప్రమాదంలో ఆయన చనిపోయారు. అన్నయ్య హరిమోహన్‌ నాకు ఏడాది సీనియర్‌. ఇద్దరమూ క్రికెట్‌ ఆడేవాళ్లం. అన్నయ్య ఫాస్ట్‌బౌలర్‌. 16 ఏళ్లకే హైదరాబాద్‌ తరఫున రంజీ ట్రోఫీ ఆడాడు. నేను లెఫ్ట్‌ ఆర్మ్‌ స్పిన్నర్‌ని. అన్నయ్య ఉస్మానియా యూనివర్సిటీ తరఫునా, నేను ఇంజినీరింగ్‌ చదివేటపుడు జేఎన్‌టీయూ(హైదరాబాద్‌)కీ ఆడేవాళ్లం. ఫైనలియర్‌లో ఇద్దరం యూనివర్సిటీ జట్లకి కెప్టెన్‌లుగానూ చేశాం. నా ఇంజినీరింగ్‌ 1989లో పూర్తయింది. స్నేహితుల్లో చాలామంది అమెరికా వెళ్లారు. నాకు జీఆర్‌ఈలో మంచి స్కోర్‌ వచ్చింది కానీ ఆర్థిక పరమైన ఇబ్బందులవల్ల వెళ్లలేదు. ఐఐఎమ్‌-అహ్మదాబాద్‌లో సీటు వస్తే చేరాను. హాస్టల్లో ఉండటం అదే మొదటిసారి. అక్కడ బహుళ సంస్కృతులతో పరిచయం ఏర్పడింది. ఐఐటీలూ, దిల్లీ స్టీఫెన్స్‌ కాలేజీల్లాంటి ప్రఖ్యాత విద్యా సంస్థల నుంచి వచ్చినవారు క్లాసులో ఉండేవారు. చదువుతోపాటు వ్యక్తిగతంగానూ చాలా విషయాలు నేర్చుకున్నానక్కడ. ఎంబీఏ తర్వాత దిల్లీ వెళ్లి రాన్‌బాక్సీలో పనిచేశాను. అమ్మకు దగ్గరగా ఉండాలనే ఉద్దేశంతో ఏడాది తర్వాత ఉద్యోగం వదిలి హైదరాబాద్‌ వచ్చేసి స్నేహితుడితో కలిసి షేర్‌ బ్రోకింగ్‌ వ్యాపారం మొదలుపెట్టాను. తర్వాత సొంతంగా బంజారాహిల్స్‌లో రెడీమేడ్‌ వస్త్ర దుకాణాన్ని ప్రారంభించాను. అప్పటికి హైదరాబాద్‌లో అంత పెద్ద దుకాణం మరొకటి లేదని చెప్పాలి. సినిమాల్లోకి రావడానికి ఆ దుకాణమే కారణం.

సినిమాల్లోకి అడుగు...
ఓసారి వెంకటేష్‌గారి సినిమా షూటింగ్‌ మా దుకాణంలో తీశారు. ఆ సమయంలో సురేష్‌బాబుగారితో పరిచయమైంది. స్వల్ప వ్యవధిలోనే మంచి స్నేహితులమయ్యాం. ఆయనతో పరిచయానికి ముందు సినిమా రంగం సంక్లిష్టమైనదనే భావనలో ఉండేవాణ్ని. కానీ అక్కడంతా ఒక పద్ధతిగా జరుగుతుందని ఆయన ద్వారా తెలిసింది. స్క్రిప్టుకీ ఒక లెక్క ఉంటుందనీ... నవ్వులూ, ఏడుపులూ ఎన్నేసిసార్లు వచ్చాయో చూసుకొని స్క్రిప్టు సిద్ధం చేసుకోవచ్చని చెప్పేవారాయన. అప్పుడప్పుడూ ఆయన దగ్గరకు వచ్చే సినిమా కథల్ని నాతో చెప్పేవారు. కథా, క్యారెక్టర్లలోని బలాలూ, బలహీనతలపైన నా అభిప్రాయాల్ని చెప్పేవాణ్ని. తర్వాత ఓసారి పిలిచి ‘నా వ్యాపార పరిధి పెరిగింది. ఎంబీఏ చేసిన నీలాంటి వ్యక్తి అవసరం మా సంస్థకి ఉంది. నా దగ్గర కన్సల్టెంట్‌గా ఉండు. నీకు రచనా సామర్థ్యం కూడా ఉంది. కథలు రాస్తుండు’ అన్నారు. అప్పటికి నేను చేస్తున్న వ్యాపారం ఏమంత బాగాలేదు. దాంతో ఆ వ్యాపారం ఆపేసి సురేష్‌గారి దగ్గర చేరిపోయాను. సురేష్‌ ప్రొడక్షన్స్‌కి వచ్చే కథలు వింటూనే స్టూడియో, ప్రొడక్షన్‌, డిస్ట్రిబ్యూషన్‌కు సంబంధించిన వ్యవహారాల్ని చూసుకునేవాణ్ని. ఎంబీఏలకు అప్పట్లో ఎక్కువగా సబ్బులూ, శీతల పానీయాల్లాంటి ఉత్పత్తుల్ని మార్కెటింగ్‌ చేసే పనే ఉండేది. అక్కడ మార్కెటింగ్‌లో పొరపాట్లు జరిగితే సరిదిద్దుకొనే వీలుంటుంది. కానీ ఇక్కడ సినిమా విడుదలయ్యేంతవరకే మనం ఏదైనా చేయగలం. తర్వాత చేయడానికి ఏమీ ఉండదు.

యూటీవీకి వెళ్లా...
‘ప్రేమించుకుందాం... రా!’ నుంచి ‘కలిసుందాం... రా!’ వరకూ 1997-2000 మధ్య సురేష్‌గారి దగ్గర పనిచేశాను. తర్వాత మా ఆవిడకి ముంబయి బదిలీ అయింది. ఆ సమయంలో నేనూ ముంబయి వెళ్లి యూటీవీలో ‘హెడ్‌ ఆఫ్‌ టెలివిజన్‌’గా రెండున్నరేళ్లు పనిచేశాను. దాదాపు 40 సీరియళ్లూ, కార్యక్రమాల్ని పర్యవేక్షించేవాణ్ని. బాలాజీ టెలీ ఫిల్మ్స్‌కి చెందిన ఏక్తా కపూర్‌తో మాకు అప్పుడు తీవ్ర పోటీ ఉండేది. ఆ పోటీని ఎదుర్కోడానికి మా ప్రయత్నాలు మేం చేసేవాళ్లం. అందులో భాగంగా దక్షిణాది సీరియళ్లని అక్కడ పునర్నిర్మించేవాణ్ని. ఏక్తాకి సీరియళ్లకు సంబంధించి కథ, కథనాలపైన మంచి పట్టు ఉంది. ఆమెని చూశాక నేనింకా నేర్చుకోవాల్సింది చాలా ఉందనిపించింది. అందుకు సురేష్‌గారి సహచర్యమే సబబనిపించింది. ఎందుకంటే వరుసగా తొమ్మిది హిట్‌లు ఇచ్చారాయన. మళ్లీ ఆయన్ని అడిగితే వచ్చేయమన్నారు. ఈసారి స్టూడియో కాకుండా పూర్తిగా సినిమాలపైనే దృష్టిపెట్టాను. ‘నువ్వులేక నేను లేను’, ‘నీకు నేను నాకు నువ్వు’, ‘మల్లీశ్వరి’ సినిమాల నిర్మాణ సమయంలో అక్కడ పనిచేశాను. తర్వాత జస్ట్‌ ఎల్లో గంగరాజు గారితో పరిచయం ఏర్పడింది. ఆయనతో కలిసి ఓ ఏడాదిపాటు పనిచేశాను. అక్కడ పనిచేస్తున్న సమయంలో శ్రీని రాజు గారు ‘ప్రైవేట్‌ ఈక్వెటీ ఫండ్‌’ మొదలుపెడితే మూడేళ్లు ఆయనతో కలిసి పనిచేశాను. ఆ సమయంలో కొంత డబ్బు సంపాదించాను.

అష్టాచమ్మాతో మొదలు...
‘సినిమా చేద్దామని ఎప్పట్నుంచో అనుకుంటున్నావు కదా, చేతిలో డబ్బు ఉంది, ప్రయత్నించరాదా’ అని మా ఆవిడ చెప్పింది. నాకైతే మొదట ధైర్యం చాల్లేదు. కొద్దిరోజులు ఆలోచించి ముందడుగు వేశాను. సురేష్‌ ప్రొడక్షన్‌లో ఉన్న సమయంలో దర్శకుడు మోహన్‌కృష్ణ ఒక కథ చెప్పారు. అది నా మనసులో అలా నిలిచిపోయింది. సినిమా చేద్దామనుకున్నాక ఆయనకి ఫోన్‌చేసి, ఆ కథకి కొద్దిగా మార్పులుచేసి తీద్దామని చెప్పాను. అదే ‘అష్టా చమ్మా’. వ్యాపారం చూస్తూనే సినిమా తీసుకోమన్నారు శ్రీని రాజు గారు. ప్రయత్నించాను కానీ కుదరకపోవడంతో బయటకు వచ్చేశాను. స్నేహితుడు దినేష్‌తో కలిసి ‘ఆర్ట్‌బీట్‌ క్యాపిటల్‌’ సంస్థను ప్రారంభించి సినిమాకి శ్రీకారం చుట్టాం. అందులో అవసరాల శ్రీనివాస్‌ చేసిన పాత్రకి నానీనీ, భార్గవి చేసిన పాత్రకి స్వాతినీ ఎంపికచేశాం. తర్వాత నానీ బాగా చేస్తుండటం చూసి లీడ్‌ పాత్రకి మార్చాం. స్వాతిని హీరోయిన్‌గా పెట్టాం. మొదట నానీకి అనుకున్న పాత్రకి తర్వాత అవసరాల శ్రీనివాస్‌ ఎంపికయ్యాడు. అలా మొదటి సినిమాకి ఓ యువ జట్టు తయారైంది. ఆ సినిమా డబ్బుతోపాటు మంచి పేరు తెచ్చింది. తర్వాత మోహన్‌, నేనూ కలిసి పనిచేద్దామనుకొని మంచి కథ కోసం చాన్నాళ్లు వెతికాం. అన్నయ్య ప్రస్తుతం రచయితగా స్థిరపడ్డాడు. ఆయన రాసిన నవల ‘ద మెన్‌ వితిన్‌’ బాగా అమ్ముడైంది. ఆ కథని తెరకెక్కించాలనుకున్నాం. అదే ‘గోల్కొండ హైస్కూల్‌’. ఆ సినిమా షూటింగ్‌ 2010 మార్చిలో మొదలుపెట్టాం. స్కూల్‌ నేపథ్యం కాబట్టి వేసవి సెలవుల్లో ఓ స్కూల్‌లో పూర్తి చేయాలనుకున్నాం. కానీ మేలోనే వర్షాలు మొదలయ్యాయి. దానివల్ల సకాలంలో తీయలేకపోయాం. తర్వాత వారాంతాల్లో నాలుగైదు నెలలు షూటింగ్‌ చేయాల్సి రావడంతో బడ్జెట్‌ పెరిగింది. 2011 సంక్రాంతికి సినిమా విడుదల చేశాం. అప్పుడే ‘అలా మొదలైంది’ వచ్చింది. మేం పోటీలో వెనకబడిపోయాం. కానీ ఆ సినిమా చేసినందుకు ఇప్పటికీ గర్వంగా ఫీలవుతాను.

గోల్కొండ హైస్కూల్‌ సమయంలోనే దర్శకుడు విరించి వర్మ ‘ఉయ్యాలా జంపాలా’ కథ చెప్పారు. మరదలూ, బావా ఒకర్నొకరు ఇష్టపడటం చూస్తుంటాం. కానీ బయటకి చెప్పుకోరు. నాకు నలుగురు అక్కలు. పెద్ద కుటుంబం. ఇలాంటివి చూశాను. అందుకే ఆ కథకి కనెక్ట్‌ అయిపోయాను. ఎప్పుడైనా విరామం దొరికితే షార్ట్‌ఫిల్మ్స్‌ చూస్తుంటాను. ఎం.ఆర్‌. ప్రొడక్షన్స్‌, నైన్‌ ప్రొడక్షన్స్‌... చేసే సినిమాలు చూశాను. అప్పుడే రాజ్‌తరుణ్‌ పరిచయమయ్యాడు. అసిస్టెంట్‌ డైరెక్టర్‌ కావాలనుకుంటున్నట్లు చెబితే ‘ఉయ్యాలా జంపాలా’ బృందంలో చేర్చుకున్నాను. ఆ స్క్రిప్టు మీద పనిచేశాడు. ఆడిషన్స్‌ సమయంలో హీరోయిన్‌ పక్కన తరుణ్‌ నటించేవాడు. బాగా చేస్తున్నాడనిపించి చివరికి అతణ్నే హీరోగా ఒప్పించాం. నా సినిమాలకి నటీనటుల్ని గీతా గారు చూస్తుంటారు. తరుణ్‌కి అప్పటికి 19 ఏళ్లు. ఆ సమయంలో పదహారేళ్ల అవికా గోర్‌ అయితే సరిపోతుందని గీతా అన్నారు. అలా హీరోకంటే తక్కువ వయసుండే అవికాను ఎంపికచేశాం. ‘సన్‌షైన్‌ సినిమాస్‌’ పేరుతో ఒక కొత్త బ్యానర్‌ పెట్టాను. అందులో ఐఐఎమ్‌లో నా బ్యాచ్‌మేట్స్‌, స్నేహితుల్ని వాటాదారులుగా చేర్చి సినిమా తీశాం. తర్వాత అన్నపూర్ణ స్టూడియోస్‌, సురేష్‌ ప్రొడక్షన్స్‌ కూడా సినిమాలో భాగమయ్యాయి. ఆ సినిమా సూపర్‌ హిట్‌.

మూడు సినిమాలతోనే డబ్బు రాక, పోక అనుభవమైంది. అందుకే డబ్బు గురించి ఎక్కువ ఆలోచించకుండా కొత్తదనం ఉండేలా చేయాలని నిర్ణయించుకున్నాను. అప్పుడే ‘తను నేను’ కథ విని కొన్నాను. ఆ రచయితనే డైరెక్షన్‌ చేయమన్నాను కానీ అమెరికా వెళ్లే ప్రయత్నంలో ఉండి చేయలేనన్నాడు. తర్వాత చాలామందిని సంప్రదించాను. కానీ ఎవరూ ముందుకు రాలేదు. రాజ్‌తరుణ్‌ని చేయమంటే అప్పటికే హీరోగా కొన్ని సినిమాలు అంగీకరించడంతో కుదరలేదు. ‘నువ్వే చెయ్యొచ్చు కదా’ అని ఒక మిత్రుడు సలహా ఇచ్చాడు. సురేష్‌బాబు నన్ను తమ కుటుంబ సభ్యుడిలానే చూస్తారు. నా ప్రతి అడుగులోనూ ఆయన సలహా తీసుకుంటాను. ఆయన అభిప్రాయం అడిగితే ప్రయత్నించి చూడమన్నారు. కానీ అనుకున్నంత సక్సెస్‌ రాలేదు.

సోగ్గాడే... అలా పుట్టింది!
ఉయ్యాలా జంపాలా సమయంలోనే నాగార్జునగారితో పరిచయమైంది. ఓరోజు మాటల మధ్య ఆయన కోసం కథ రాయమన్నారు. ఆయన చేసిన ‘హలో బ్రదర్‌’ నాకు బాగా నచ్చుతుంది. డబుల్‌ రోల్‌ బాగా చేస్తారనిపించింది. స్వయంగా పరిచయం ఉంది కాబట్టి స్వభావానికి దగ్గరగా ఉండే కథ రాయాలనుకున్నాను. అదే ‘సోగ్గాడే చిన్ని నాయన’. ఆ సినిమా దర్శకుడు కల్యాణ్‌కృష్ణ గోదావరి ప్రాంతానికి చెందినవాడు కాబట్టి ఆ కథని బాగా తీయగలడని చెప్పి నాగార్జునకి పరిచయం చేశాను. సురేష్‌ ప్రొడక్షన్స్‌లో పనిచేస్తూ స్క్రిప్టు పరంగా పరుచూరి సోదరుల దగ్గర చాలా నేర్చుకున్నాను. అవి ఇప్పుడు నా పనిలో ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. సోగ్గాడే కథనే తీసుకుంటే... రాము సంసారానికి సంబంధించి సమస్య ఉంటుంది. ఆ సమస్య పరిష్కారమయ్యేసరికి కథ పూర్తయిపోతుంది. ‘చిన్న గీత పక్కన పెద్ద గీత గీస్తే ఆ చిన్న గీత కనిపించదు...’ ఓ సందర్భంలో వాళ్లు చెప్పిన మాటిది. రాము సంసారం చిన్న గీత. దాని పక్కన గీసిన పెద్ద గీతే అతడి తండ్రి బంగార్రాజు మరణం. ఆయన్ని ఎవరు చంపారు, ఎందుకు చంపారనేదాని చుట్టూ కథని నడిపించడమే ఆ సినిమా. ఇలాంటివే ఎన్నో విషయాలు వారినుంచి నేర్చుకున్నాను.

ప్రస్తుతం ‘పిట్టగోడ’ అనే సినిమా నిర్మిస్తున్నాను. కొత్త కుర్రాడు అనుదీప్‌ దర్శకుడు. హాస్య ప్రధానంగా నడిచే సినిమా ఇది.

ఇంకొంత

మా ఆవిడ షీలా మేనన్‌. బిజినెస్‌ కన్సల్టెంట్‌గా పనిచేస్తోంది. మాది ప్రేమ వివాహం. మాకు ఇద్దరు పిల్లలు. అమ్మాయి అమెరికాలో అండర్‌ గ్రాడ్యుయేషన్‌ చేస్తోంది. అబ్బాయి ఇక్కడే చదువుతున్నాడు.

* నా సొంత సినిమా చూడకుండానే 2002లో అమ్మ చనిపోవడం బాధగా ఉంటుంది.
* నాని, రాజ్‌ తరుణ్‌, అవసరాల శ్రీనివాస్‌, సుమంత్‌ వీరంతా నా స్నేహితుల్లా ఉంటారు. నందినీరెడ్డి నాకు మంచి ఫ్రెండ్‌.
* ఆఫీసుకి బండి మీద నా కొలీగ్స్‌తో వెళ్లిపోతాను. దార్లో ఎక్కడైనా ఆగి ఛాయ్‌ తాగుతూ సగటు మనిషిని పరిశీలిస్తూ, సగటు మనిషిలా ఉంటాను.
* చాలావరకూ నగరాల్లో పెరిగిన నాకు ఈమధ్య పల్లెటూరు వాతావరణంమీద ఇష్టం పెరిగింది.
* అన్ని వయసుల వారికీ సులభంగా అర్థమవ్వాలనే ఉద్దేశంతో నా సినిమాలకి ‘అష్టా చమ్మా’, ‘ఉయ్యాలా జంపాలా’ లాంటి పేర్లు పెడతాను.
* ఐఐఎమ్‌లో చేరి పాతికేళ్లయిన సందర్భంగా గతేడాది మా బ్యాచ్‌ సభ్యులం సమావేశమయ్యాం. ‘మేమంతా పెద్ద కంపెనీలకు ఎండీలుగా, సీయీవోలుగా ఉండొచ్చు. డబ్బు సంపాదించి ఉండొచ్చు. కానీ నువ్వు మాత్రం భిన్నమైన రంగం ఎంచుకొని రాణిస్తున్నావు, కంగ్రాట్స్‌’ అంటూ వారు మెచ్చుకున్నపుడు సంతోషమనిపించింది.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.