close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
అబ్బాయిలు అందుకే వెంటపడలేదు!

అబ్బాయిలు అందుకే వెంటపడలేదు!

మధ్యతరగతి అమ్మాయి. కష్టపడి చదువుకుంది. స్కూల్లో, కాలేజీలో తనే టాపర్‌. దేశంలోని అత్యున్నత కాలేజీల్లో ఒకదాంట్లో సీటు తెచ్చుకుంది. తండ్రి కోరిక ప్రకారం ఐఏఎస్‌కు సిద్ధమవుతోంది. ఇంతలో ఓ ట్విస్ట్‌... అనుకోకుండా ఆ అమ్మాయి హీరోయిన్‌గా మారింది. సెలెబ్రిటీగా ఎదిగింది. బోలెడంత మంది అభిమానుల్ని సంపాదించుకుంది. సినిమా కథలా అనిపించినా, అదే రాశీ ఖన్నా జీవితం. ‘వూహలు గుసగుసలాడే’ అంటూ సైలెంట్‌గా వచ్చి ‘బెంగాల్‌ టైగర్‌’, ‘జిల్‌’, ‘శివమ్‌’, ‘జోరు’ తాజాగా ‘సుప్రీమ్‌’ లాంటి సినిమాలతో ఒక్కో మెట్టూ ఎక్కేస్తోంది. చదువే జీవితంగా పెరిగిన అమ్మాయి ఇలా ఎలా మారిందో తెలుసా...

సినిమాలెప్పుడూ పెద్దగా చూసేదాన్ని కాదు. ఇంక తెలుగు చిత్రాల గురించి తెలుసుకోవాల్సిన అవసరమే రాలేదు. అలాంటిది ఇప్పుడు హైదరాబాద్‌ నా సొంతూరిలా మారింది. నేను పుట్టి పెరిగిన ప్రాంతంలో కూడా రానంత పేరు ఇక్కడొచ్చింది. ఇందులో నేను పడిన కష్టం కంటే నాకు దక్కిన అదృష్టమే ఎక్కువ. ఒక్కసారి నేను పెరిగిన వాతావరణం గురించి తెలిస్తే ఎవరికైనా ఆ విషయం అర్థమవుతుంది. దిల్లీలో మాదో మధ్యతరగతి కుటుంబం. నాన్న టైలూ, లెదర్‌ వస్తువులకు సంబంధించిన చిన్న వ్యాపారం చేసేవారు. ఆర్థిక సమస్యలు ఇంట్లో మామూలే కానీ అవేవీ నా వరకూ వచ్చేవి కాదు. నాన్నకు సాయంగా ఉండేందుకు అమ్మ స్కూల్లో టీచర్‌గా చేరింది. క్రమంగా ప్రిన్సిపల్‌ స్థాయికి ఎదిగింది. ఇంట్లో ఎప్పటికప్పుడు ఎదురయ్యే చిన్నచిన్న సమస్యల ప్రభావం ఎంతో కొంత నాపైనా ఉండేది. మా కుటుంబానికి పెద్దగా ఆస్తిపాస్తులూ లేవు. దాంతో చదువుకుంటేనే భవిష్యత్తు అని బాగా అర్థమైంది. దానికి తగ్గట్టే ఎప్పుడూ తరగతిలో టాప్‌ మార్కులే వచ్చేవి.

స్టేజంటే భయం
అన్నయ్యకీ నాకూ నాలుగేళ్లు తేడా. చిన్నప్పుడు తనకి కాస్త అల్లరి ఎక్కువ. నేను మాత్రం చాలా సైలెంట్‌. వీధిలో ఆటలకూ దూరంగానే ఉండేదాన్ని. ఇంట్లో ఎప్పుడూ పుస్తకాలతోనే కాలక్షేపం. చిన్నప్పట్నుంచీ నాకు స్టేజ్‌ ఫియర్‌ కూడా ఎక్కువ. స్కూల్లో సాంస్కృతిక కార్యక్రమాలకు అస్సలు పేరిచ్చేదాన్ని కాదు. ఒకసారి స్నేహితులు బలవంతం చేస్తే స్కూల్లో ‘డ్రమాటిక్‌ సొసైటీ’లో చేరడానికి ఆడిషన్‌ కోసం తలుపు వరకూ వెళ్లి, ధైర్యం చాలక వెనక్కొచ్చేశాను. కానీ స్టేజీతో సంబంధంలేని క్విజ్‌, కవితలు లాంటి పోటీల్లో మాత్రం చాలా చురుగ్గా ఉండేదాన్ని. ఆ విభాగాల్లో నాకు వచ్చిన సర్టిఫికెట్లతో ఒక ఫైలే నిండిపోయింది. చదవమనీ, క్రమశిక్షణతో ఉండమనీ నాకెవరూ చెప్పాల్సిన అవసరం వచ్చేది కాదు. ఇంట్లో ముందుగా నేనే నిద్రలేచి అందరినీ లేపేదాన్ని. స్కూల్లో డిసిప్లిన్‌ కమిటీకి హెడ్‌గా ఉన్నా. అల్లరి తక్కువ, చదువెక్కువ కావడంతో టీచర్లకెప్పుడూ నేనే ఫేవరెట్‌.

జూనియర్‌ అభిమాని...
పదకొండో తరగతికి వచ్చేసరికి మిగతా విషయాలన్నీ పక్కన పెట్టి చదువుపైనే దృష్టిపెట్టా. స్కూల్‌ రోజుల్లో నేను చాలా లావుగా ఉండేదాన్ని. దాంతో నాతో మాట్లాడటానికి అబ్బాయిలెవరూ అంతగా ఆసక్తి చూపేవారు కాదు. ఓ రకంగా చదువుకు ఇబ్బంది లేకుండా అదీ మంచిదే అనిపించేది. ప్రియాంక అని నా జూనియర్‌ ఒకమ్మాయికి నేనంటే చాలా ఇష్టం. ప్రతి పుట్టినరోజుకూ ఏవో చిన్నచిన్న బహుమతులిచ్చేది. తనకెందుకో నాలా తయారవ్వాలని ఉండేదట. అందుకే అన్ని విషయాల్లో నన్ను అనుకరించే ప్రయత్నం చేసేది. ప్రతి సంవత్సరం స్కూల్లో ‘దివాలీ గాలా’ అనే పెద్ద వేడుక జరుగుతుంది. దానికి స్కూల్‌ పూర్వ విద్యార్థులు కూడా రావొచ్చు. ఓసారి అలా వచ్చిన సీనియర్‌ ఒకమ్మాయి నేను చాలా బాగున్నాననీ మోడలింగ్‌ చేస్తే మంచి భవిష్యత్తు ఉంటుందనీ చెప్పింది. తరవాత కూడా నాతో టచ్‌లో ఉంటూ ఆమె పనిచేస్తున్న ‘ఎలైట్‌’ మోడలింగ్‌ ఏజెన్సీలో నన్నూ చేరమంది. తన బలవంతం మీద అందులో చేరాను కానీ ఒక్కసారి కూడా ఆ సంస్థ తరఫున ఎలాంటి కార్యక్రమంలో పాల్గొనలేదు.

డిగ్రీలో ధైర్యం...
పన్నెండో తరగతిలో నేను స్కూల్‌ టాపర్‌గా నిలిచా. అప్పటికే అన్నయ్య మర్చంట్‌ నేవీలో చేరాడు. నేను కూడా ఏదైనా వృత్తి విద్యలో చేరి త్వరగా జీవితంలో స్థిరపడాలనుకున్నా. కానీ మా అన్నయ్య మాత్రం డబ్బుల గురించి ఆలోచించకుండా నాకు నచ్చిన చదువును కొనసాగించమని చెప్పాడు. నాన్నకు నన్ను ఐఏఎస్‌ అధికారిగా చూడాలని ఉండేది. కష్టపడితే నేనూ ఆ లక్ష్యాన్ని అందుకోగలననుకున్నా. డిగ్రీలో లేడీ శ్రీరామ్‌ కాలేజీలో సీటొచ్చింది. దేశంలో ఎంతో మంది ప్రముఖ వ్యాపారవేత్తలూ, ప్రభుత్వ అధికారులూ అందులో చదువుకున్నవాళ్లే. ఓ పక్క నేను బీఏలో ఇంగ్లిష్‌ ఆనర్స్‌ చదువుతూనే ఐఏఎస్‌ పైనా దృష్టి పెట్టా. లేడీ శ్రీరామ్‌ కాలేజీ నా వ్యక్తిత్వాన్ని చాలా మార్చింది. మొదట్నుంచీ నలుగురిలో మాట్లాడాలంటే నాకు భయం. పన్నెండో తరగతిలో ఉన్నప్పుడు పాటల పోటీకి పేరిచ్చి కూడా చివరి నిమిషంలో ధైర్యం సరిపోక పాడలేదు. అలాంటిది డిగ్రీ క్యాంపస్‌ ఆ భయాల్ని చాలా వరకూ తగ్గించింది. కోర్సులో భాగంగా వారానికి కనీసం పదిహేను వందల పేజీల సాహిత్యం చదివేదాన్ని. గ్రీకు, హిందూ, క్రిస్టియన్‌ మైథాలజీకి సంబంధించిన చాలా పుస్తకాలు చదివా. క్రమంగా చేతిలో పుస్తకం లేకుంటే ఏమీ తోచని స్థితికి చేరుకున్నా.

ఫెమినా కవర్‌ మీదకి...
కాలేజీలో ఉన్నప్పుడు ఓసారి ఫ్రెండ్‌తో కలిసి షాపింగ్‌ మాల్‌కి వెళ్లా. అక్కడ వ్యాజ్‌లీన్‌ సంస్థకు సంబంధించిన చిన్న స్టాల్‌ పెట్టారు. అక్కడికెళ్లి లోషన్‌ను ఉపయోగించిన వాళ్ల ఫొటోలను తీసుకొని, చివరికి ఎంపికైన ఒకో ఫొటోను ‘ఫెమినా’ మ్యాగజీన్‌ కవర్‌పైన వేస్తారట. నేను దాని గురించి ఆలోచించకుండా ఉచితంగా లోషన్‌ వస్తుంది కదా అని సరదాగా వెళ్లి ఫొటోకి పోజిచ్చా. ఓ వారం తరవాత వాళ్లు ఫోన్‌ చేసి అన్ని ఫొటోల్లోకీ నాదే బావుందనీ, దాన్ని ‘ఫెమినా’ కవర్‌ మీద వాడనున్నట్లు చెప్పారు. ఆ కవర్‌ మార్కెట్లోకి వచ్చిన కొన్ని రోజులకు నాకో టీవీ ప్రకటన చేసే అవకాశం వచ్చింది. నాకెప్పుడూ మోడలింగ్‌పైన ఆసక్తి లేదు కాబట్టి ఆ ఆఫర్‌ వినగానే ఎగిరి గంతేసేంత సంతోషం కలగలేదు కానీ, ఇంట్లో వాళ్లు మాత్రం బాగా ఆనందించారు. నా మోడలింగ్‌ ఏజెన్సీ వాళ్లు కూడా కెరీర్‌ బావుంటుందని బలవంతపెట్టడంతో చదువుకుంటూనే చిన్నచిన్న టీవీ, పత్రికా ప్రకటనలకు పనిచేసేదాన్ని. పరీక్షల సమయానికి చదువుపైనే దృష్టిపెట్టా. డిగ్రీలో కూడా నేనే కాలేజ్‌ టాపర్‌ని. ఆ తరవాత ఎంఏ సైకాలజీలో చేరా.

అవకాశం వెతుక్కుంటూ...
దిల్లీలో మోడలింగ్‌కు అవకాశాలు కాస్త తక్కువే. అందుకే ముంబై వెళ్లి కొన్నాళ్లు ఆ రంగంలో ప్రయత్నిద్దామనీ, మోడలింగ్‌కు మంచి భవిష్యత్తు ఉంటుందనీ నా ఫ్రెండ్‌ వాణీ కపూర్‌ చెప్పింది. వాణీ తెలుగులో నానీతో ‘ఆహా కల్యాణం’లో నటించింది. బాలీవుడ్‌లో తనిప్పుడు బిజీ హీరోయిన్‌. తనని ఒక ఆడిషన్‌లో కలిసినప్పట్నుంచీ ఇద్దరం మంచి స్నేహితులమయ్యాం. ఇంట్లో కూడా అడ్డు చెప్పకపోవడంతో ఇద్దరం కలిసి ముంబై వెళ్లి అవకాశాల కోసం ప్రయత్నించాం. అక్కడికెళ్లిన కొన్ని రోజులకు నాకు ‘టాటా స్కై’ ప్రకటనలో అవకాశం వచ్చింది. ఆ సమయంలోనే నన్ను చూసిన బాలీవుడ్‌ క్యాస్టింగ్‌ డైరక్టర్‌ ఒకరు ‘మద్రాస్‌ కెఫే’ సినిమా ఆడిషన్‌కు రమ్మన్నారు. దానికి జాన్‌ అబ్రహం హీరో, సుజీత్‌ సర్కార్‌ దర్శకుడు. అలాంటి పెద్ద వ్యక్తుల సినిమాలో నాకెందుకు అవకాశం వస్తుందిలే అనిపించి పెద్దగా ఆశలు పెట్టుకోలేదు. ఓ చిన్న ఏడుపు సన్నివేశం ఇచ్చి అక్కడ నటించమన్నారు. గ్లిజరిన్‌ లేకుండా నేను ఏడవడం చూసి కెమెరామన్‌ కూడా కాస్త భావోద్వేగానికి గురయ్యాడు. నేనూ నటించగలనని నాకప్పుడే అర్థమైంది. దర్శకుడికీ నా నటన నచ్చడంతో ఆ సినిమాలో జాన్‌ అబ్రహం భార్య పాత్ర నాకొచ్చింది.

నేననుకున్నట్లు లేదు!
‘మద్రాస్‌ కెఫే’ విడుదలయ్యాక నిర్మాత సాయి కొర్రపాటిగారి ఆఫీసు నుంచి ఫోన్‌ వచ్చింది. ‘వూహలు గుసగుసలాడె’ ఆడిషన్‌ కోసం రమ్మని పిలిచారు. తెలుగు సినిమాలంటే కామెడీ, డాన్సులూ బాగా ఉంటాయని మాత్రమే అప్పటివరకూ తెలుసు కానీ అంతకుమించి ఇక్కడి పరిశ్రమ గురించి అవగాహన లేదు. ఎక్కడో ముంబైలో ఉన్న నన్ను గుర్తించి పిలిచారు కాబట్టి ఓసారి ప్రయత్నించి చూద్దామని వచ్చా. దర్శకుడు శ్రీనివాస్‌ అవసరాల, నిర్మాత సాయి కొర్రపాటికి నేను నచ్చడంతో ‘వూహలు గుసగుసలాడె’కి నన్ను ఎంపిక చేశారు. కథ విన్నాక చాలా హాయిగా అనిపించింది. నేను వూహించినట్టుగా అనవసరమైన డాన్సులూ, అర్థంపర్థంలేని హాస్యం అందులో లేవు. దాంతో వెంటనే ఒప్పుకున్నా. ఆ సినిమాలో నాపైన క్లోజప్‌ షాట్లు ఎక్కువగా ఉండటంతో తెలుగు తెలిసిన ఫ్రెండ్‌ సాయంతో ముందే సంభాషణల్ని సాధన చేసి సెట్‌కి వెళ్లేదాన్ని. ఆ సినిమా విజయం సాధించడంతో నెమ్మదిగా అవకాశాలొచ్చాయి. నేను తెలుగుమ్మాయినే అనుకున్న వాళ్ల సంఖ్యకైతే లెక్కేలేదు. ఆ పేరు నాకు రావడంలో చాలా వాటా నాకు డబ్బింగ్‌ చెప్పిన వాళ్లకే దక్కుతుంది.

వదులుకున్నవే ఎక్కువ...
‘వూహలు గుసగుసలాడె’ సమయంలోనే ‘మనం’ సినిమాలో నాగ చైతన్య ప్రేయసిగా చిన్న పాత్ర చేసే అవకాశం వచ్చింది. ఆ సినిమాకు పరిశ్రమలో ఎంత ప్రాధాన్యం ఉందో విడుదలయ్యాక కానీ తెలీలేదు. ఆ తరవాత ‘జోరు’లో నటించా. ఆ సినిమా టైటిల్‌ సాంగ్‌ని కూడా నేనే పాడా. ‘గోపీచంద్‌’తో జిల్‌, రవితేజతో ‘బెంగాల్‌ టైగర్‌’, రామ్‌తో ‘శివమ్‌’ లాంటి సినిమాలు చేశా. ఈమధ్యలో నేను ఒప్పుకున్న వాటికంటే నా పాత్రలకు ప్రాధాన్యం లేక వదులుకున్న అవకాశాలే ఎక్కువ. ఆ పాత్రలను చేసుంటే కేవలం డబ్బు కోసమే వాటిలో నటించానని చూసేవాళ్లకు అర్థమైపోతుంది అని నా భావన. ప్రస్తుతం ‘సుప్రీమ్‌’ విజయం మంచి కిక్‌ ఇచ్చింది. గోపీచంద్‌తో ‘ఆక్సిజన్‌’, రవితేజతో మరో సినిమాలో నటిస్తున్నా.

చిన్నప్పట్నుంచీ ఏ విషయంలోనూ ఒకరిపైన ఆధారపడటం నాకు అలవాటు లేదు. బాగా చదివినా, మోడలింగ్‌లోకి వచ్చినా, సినిమాలను ఎంపిక చేసుకుంటున్నా అవన్నీ నా మనసుకు నచ్చబట్టే చేశా. ఎప్పటికైనా అంతే... డబ్బులొచ్చే పనైనా నాకు నచ్చకపోతే చేయను. డబ్బులు రాకపోయినా అది మంచి పని అని నా మనసుకు అనిపిస్తే చేస్తాను.


వాళ్లంటే చిరాకు!

నేను సినిమాల్లోకి రావడం అందరికీ పెద్ద సర్‌ప్రైజ్‌. చిన్నప్పుడు నన్ను అంత లావుగా చూసిన స్నేహితులు నేను హీరోయిన్‌ అయ్యానని తెలిసినప్పుడు ఎంత షాకయ్యారో, ఎప్పుడూ పుస్తకాలు ముందేసుకు కూర్చొనే నేను సినిమాల్లోకి వచ్చినప్పుడు అమ్మానాన్నా అంతే ఆశ్చర్యపోయారు.

* పార్టీలు నాకు పెద్దగా నచ్చవు. ఎలాంటి గోలా లేకుండా స్నేహితులతో మాట్లాడుతూ కూర్చోవడం ఇష్టం. అందుకే డిన్నర్లకు ఇష్టంగా వెళ్తుంటా.
* ధ్యానం ఎక్కువగా చేస్తా. దానివల్ల శరీరం, మనసూ రెండూ ఆరోగ్యంగా ఉంటాయి.
* నేను చాలా తక్కువ తింటా. కానీ నా శరీర తత్వం వల్ల త్వరగా లావైపోతుంటాను. అందుకే జిమ్‌లో అందరూ గంట వ్యాయామం చేస్తే నేను రెండు గంటలు కష్టపడాల్సి వస్తుంది.
* అస్తమానం ఫోన్లు చూసుకుంటూ గడిపేవాళ్లంటే చిరాకు. దానివల్ల మానవ సంబంధాలు బాగా దెబ్బతింటున్నాయని అనిపిస్తుంది.
* అనవసరమైన వివాదాలకు దూరంగా ఉండాలనే ఉద్దేశంతో ట్విటర్‌ను ఉపయోగించడం మానేశా.
* నా కుటుంబంతో కలిసి హైదరాబాద్‌లోనే ఉంటున్నా. దాని వల్ల చాలా మంది హీరోయిన్లకు భిన్నంగా హాయిగా ఇంటి భోజనం తింటున్నా.
* దిల్లీలో ఉన్నా, విదేశాలకు వెళ్లినా చాలా మంది తెలుగువాళ్లు గుర్తుపట్టి పలకరిస్తారు. అది సంతోషంగానే అనిపించినా, ఒకబ్బాయి మాత్రం నేను ఎక్కడికెళ్లినా ఎలాగోలా తెలుసుకొని అక్కడికి వస్తుంటాడు. అది మాత్రం చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది.


 

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.