close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
డబ్బులు పోకపోతే చాలనుకున్నా!

డబ్బులు పోకపోతే చాలనుకున్నా!

పోగొట్టుకున్న చోటే వెతుక్కోవాలంటారు. ప్రస్తుతం సినీ పరిశ్రమలో అదే పనిచేస్తున్నారు నిర్మాత ఎస్‌.రాధాకృష్ణ. ఎప్పుడో 28 ఏళ్ల క్రితం ‘ఆత్మకథ’ అన్న సినిమా తీసి, అపజయాన్ని చవి చూసిన ఆయన మళ్లీ ఇరవై ఏళ్ల తరవాత మరోసారి తనను తాను నిరూపించుకునే ప్రయత్నం మొదలుపెట్టారు. ‘జులాయి’, ‘సన్నాఫ్‌ సత్యమూర్తి’ సినిమాలతో విజయాలు అందుకుని ఇప్పుడు ‘అఆ’తో త్రివిక్రమ్‌తో హ్యాట్రిక్‌ కొట్టేటందుకు సిద్ధమయ్యారు. ఓ ఇన్సూరెన్సు ఉద్యోగి నిర్మాతలా ఎలా మారాడో, త్రివిక్రమ్‌తోనే సినిమాలు ఎందుకు తీస్తున్నాడో... ఆయన మాటల్లోనే.
నిర్మాత అంటే డబ్బులుపెట్టాలీ, షూటింగులకు వీలైనంత దూరంగా ఉండాలీ... ఇదీ ఇప్పుడు అన్ని సినీ పరిశ్రమల్లో కనిపిస్తోన్న పద్ధతి. కానీ ఒకప్పుడు నిర్మాతకుండే విలువే వేరు. ప్రొడక్షన్‌ బాయ్‌ నుంచి పేరున్న హీరో వరకూ అందరూ చాలా ఉన్నతంగా చూసేవారు. సినిమాకి సంబంధించిన ప్రతి చిన్న విషయంలోనూ నిర్మాత ముద్ర ఎంతో కొంత కనిపించేది. నేనూ ఒకప్పుడు ఆ హోదాని చూసే నిర్మాతగా మారాలన్న ఉత్సాహంతో పరిశ్రమలోకి వచ్చా. దానికి ముందు పరిశ్రమకూ నాకూ ఉన్న అనుబంధమల్లా సినిమా, ప్రేక్షకుడి సంబంధమే. నేను పుట్టి పెరిగిందంతా తెనాలిలో. మా పూర్వీకులంతా వ్యవసాయదారులే. మా నాన్నగారు న్యాయవాదిగా పనిచేసేవారు. నేను బీకామ్‌ చదివే రోజుల్లో ఆయనే పార్ట్‌టైం లెక్చరర్‌గా మా కాలేజీలో తరగతులు చెప్పేవారు. ఎందుకో తెలీదు కానీ వీలైనంత వరకూ ఆయన తరగతులకు వెళ్లకుండా ఉండటానికే ప్రయత్నించేవాణ్ణి. నేను డిగ్రీలో ఉండగానే మా అక్క కూడా కాలేజీలో లెక్చరర్‌గా చేరింది. నాన్న న్యాయవాదైనా, అక్క లెక్చరర్‌గా మారినా అవేవీ నాపైన పెద్దగా ప్రభావం చూపించలేదు. అందుకే బీకామ్‌ అవగానే ఉద్యోగం వెతుక్కుంటూ హైదరాబాద్‌ బయల్దేరా.

‘ఆత్మకథ’ అలా మొదలు...
హైదరాబాద్‌లో రకరకాల ప్రయత్నాలు చేస్తోన్న క్రమంలో ఇన్సూరెన్స్‌ సంస్థకు దరఖాస్తు చేశా. వాళ్లు పెట్టిన పరీక్షలో అర్హత సాధించడంతో ఇరవై రెండేళ్ల వయసులోనే ఓరియంటల్‌ ఇన్సూరెన్స్‌ సంస్థలో ఉద్యోగిగా నా కెరీర్‌ ప్రారంభమైంది. మంచి ఉద్యోగం, పెద్దగా బాధ్యతలేవీ లేకపోవడంతో జీవితం హాయిగానే గడిచిపోయేది. సినిమాలు ఎక్కువగా చూసేవాణ్ణి. నాకు ఫ్రెండ్స్‌ సర్కిల్‌ కూడా చాలా ఎక్కువ. ఏ పనైనా స్నేహితులతో మాట్లాడాక చేయడమే నాకు అలవాటు. ఉద్యోగంలో ఉండగానే ఆహుతి ప్రసాద్‌ లాంటి కొందరు సినీ ప్రియులు పరిచయమయ్యారు. వాళ్లంతా అప్పుడు ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో కోర్సు చేస్తుండేవారు. నాకూ సినిమాల పైన ఆసక్తి ఉండటంతో వాటి గురించి చర్చిస్తూ ఎక్కువ సమయం వాళ్లతోనే గడిపేవాణ్ణి. ఆ క్రమంలోనే దర్శకులు విక్టరీ మధుసూదనరావుగారితో పరిచయమైంది. ఆ పరిచయం మంచి స్నేహంగా మారి తరచూ కలిసే స్థాయికి చేరింది. ఆయన సినిమాల్లోకి ఎలా వచ్చిందీ, ఎత్తుపల్లాల్ని ఎలా ఎదుర్కొందీ... ఇలా పరిశ్రమకు సంబంధించిన చాలా విషయాలు చెప్పేవారు. ఆ రోజుల్లో నిర్మాతలంటే బయట కూడా చాలా విలువుండేది. అందుకే తెలీకుండానే నాక్కూడా ఓ సినిమా నిర్మించాలనిపించింది. మధుసూదనరావుగారి లాంటి దర్శకుడి అండ ఉన్నప్పుడు అదేమీ పెద్ద కష్టమైన పని కాదనుకున్నా. నా స్నేహితులు హరిప్రసాద్‌, భాస్కర్‌, రమణ, భాస్కర్‌ రెడ్డి లాంటి కొందరి సహాయంతో రిస్కయినా ఫర్వాలేదు అనుకొని సినిమా తీయాలని నిర్ణయించుకున్నా. అలా మొదలైందే ‘ఆత్మకథ’.

అనుకున్నట్టు ఆడలేదు
హిందీలో మహేష్‌భట్‌ తీసిన ఓ చిత్రం ఆధారంగా ‘ఆత్మకథ’ సినిమా మొదలుపెట్టాం. జయసుధ, శరత్‌బాబు, ఖుష్బు, శుభలేఖ సుధాకర్‌ లాంటి చాలామంది ప్రముఖులు అందులో నటించారు. మధుసూదనరావుగారు ఉన్నారన్న మొండి ధైర్యంతో ఉండేవాణ్ణి. కానీ ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఆడలేదు. దానికోసం మా అక్క దగ్గరా, స్నేహితుల దగ్గరా కొంత డబ్బు తీసుకున్నా. నేను సంపాదించిన డబ్బులూ అందులో పెట్టా. ఆ విషయాలేవీ ఇంట్లో తెలీదు. నాన్నకి తెలిస్తే కచ్చితంగా వద్దనే వారన్నది నా నమ్మకం. అందుకే చెప్పలేదు. ఆ సినిమా ఫలితం కొంత నిరాశ పరచడంతో పూర్తిగా నా ఉద్యోగం పైనే దృష్టిపెట్టి, సినీ ప్రపంచాన్ని మరచిపోయే ప్రయత్నం చేశా. ‘వాడేమీ ఉద్యోగం మానేయలేదుగా’ అంటూ అమ్మ నాన్నకు నచ్చజెప్పింది. అప్పటికి పెళ్లి కూడా కాలేదు కాబట్టి ‘ఆత్మకథ’ తాలూకు ఇబ్బందుల నుంచి త్వరగానే కోలుకున్నా. ఆ సినిమా సమయంలో పరిచయమైన కొందరితో స్నేహం తరవాత కూడా కొనసాగింది.

ఆ సినిమాలు చూశాక...
చాలా ఏళ్ల తరవాత ‘చిరునవ్వుతో’ సినిమా చాలా నచ్చింది. అందులో ఉన్న సున్నితమైన భావోద్వేగాలూ, హాస్యం నన్ను బాగా ఆకట్టుకున్నాయి. ఆ తరవాత ‘నువ్వు నాకు నచ్చావ్‌’ చూసినప్పుడు కూడా అలాంటి భావనే కలిగిందే. ఆ రెండు సినిమాలకూ త్రివిక్రమే రచయిత. అప్పుడే ఆయనపైన కొంత అభిమానం కలిగింది. అప్పటికే నేను ఉద్యోగంలో చేరి పాతికేళ్లయింది. తొలిసినిమా తరవాత పరిశ్రమకు దూరమైనా, ఇంకొక్క సినిమా అయినా డబ్బులు పోకుండా తీస్తే బావుండూ అన్న ఆలోచన మాత్రం ఎప్పుడూ వేధిస్తూనే ఉండేది. ఆర్థికంగా కాస్త మంచి స్థితికి చేరుకున్నాక ఉద్యోగాన్ని వదిలిపెట్టి మరోసారి సినిమా రంగంవైపు రావాలనుకున్నా. అలా 2007-08 ప్రాంతంలో పాతికేళ్ల నా ఉద్యోగ జీవితాన్ని వదిలిపెట్టి సినిమాల్లో భాగమవ్వాలన్న ఆలోచనతో పరిశ్రమలోకి అడుగుపెట్టా. నిర్మాత డీవీవీ దానయ్య నాకు మంచి స్నేహితుడు. ఆయనతో ఏడాదికిపైగా ప్రయాణించి మారిన సినిమా నిర్మాణ పరిస్థితుల గురించి కొంత తెలుసుకునే ప్రయత్నం చేశా. తరవాత కాస్త నమ్మకం కుదరడంతో పవన్‌ కల్యాణ్‌ సినిమా ‘కెమరామన్‌ గంగతో రాంబాబు’లో కొంత పెట్టుబడి పెట్టా. అది మంచి విజయం సాధించింది. ఆ తరవాత రాంచరణ్‌ సినిమా ‘నాయక్‌’ నిర్మాణంలో కూడా భాగస్వామిగా మారా. అదీ మంచి ఫలితాన్నే ఇవ్వడంతో సొంతంగా నిర్మాతగా మారి విజయాన్ని అందుకోవాలన్న నా ప్రయత్నాన్ని పట్టాలెక్కించా. కుర్రాడిగా ఉన్నప్పుడు పెద్ద ఆలోచనలూ, లక్ష్యాలేవీ లేకుండానే నిర్మాతగా మారా. కానీ ఈసారి మాత్రం డబ్బులు రాకపోయినా ఫర్వాలేదు కానీ పోకూడదూ, మంచి సినిమా తీశామన్న పేరు తెచ్చుకుంటే చాలూ అనిపించుకోవాలని నిర్ణయించుకున్నా.

స్నేహితులంతా వద్దన్నారు
కేఎస్‌వీఎల్‌ నరసింహం అని నాకూ, త్రివిక్రమ్‌ గారికీ మంచి సన్నిహితుడు. తనూ నేనూ ఓరియంటల్‌ సంస్థలో ఒకేసారి ఉద్యోగంలో చేరాం. తరవాతి రోజుల్లో ఆయన సినిమా రంగంవైపు వచ్చాడు. సినిమా నిర్మించాలన్న నా ఆలోచన చెప్పినప్పుడు అతను మొదట సానుకూలంగా మాట్లాడలేదు. ప్రగతి ప్రింటర్స్‌-మహేంద్ర, కోర్‌ కార్బన్స్‌ ఎండీ హరనాథ్‌, కె.మల్లికార్జున్‌ లాంటి నా దగ్గరి స్నేహితులు కూడా సినిమా అనగానే వద్దన్నారు. అనవసరంగా రిస్కు చేసి ఎందుకు ఇబ్బందులు పడటం అని నచ్చజెప్పారు. వాళ్లంతా ఉన్నత స్థాయిలో స్థిరపడ్డవారే. వాళ్లలా నేను వ్యాపారాలు చేయలేను. కానీ నాక్కూడా ఏదో ఒక రంగంలో అలా పేరు తెచ్చుకోవాలని ఉండేది. దాంతో వాళ్లు వద్దన్నా సినిమాలవైపే మొగ్గు చూపా. నరసింహం ద్వారా త్రివిక్రమ్‌గారితో పరిచయమయ్యాక క్రమంగా ఆయనకు దగ్గరయ్యా. ఆయనతో మాట్లాడేప్పుడే సినిమాల పరంగా ఇద్దరికీ కొన్ని కామన్‌ ఇంట్రెస్ట్‌లు ఉన్నాయని అనిపించింది. ‘ఖలేజా’ సినిమా షూటింగ్‌ జరుగుతున్నన్ని రోజులూ తరచూ ఆయన్ని కలుస్తూనే ఉండేవాణ్ణి. ఆ సినిమా అయిపోయాక బన్నీ హీరోగా నా తొలి సినిమా ‘జులాయి’ మొదలైంది. డబ్బులు పోకుండా సినిమా తీయాలన్న నా కోరిక తీరాలంటే పెద్ద హీరోనే తీసుకోవాలని ముందే నిర్ణయించుకున్నా. త్రివిక్రమ్‌గారితో సినిమా చేయాలని ఎప్పట్నుంచో ఉండేది. నా తొలి సినిమాకు ఈ రెండూ కలిసొచ్చాయి.

నేను ఖర్చునే చూస్తా!

‘మా నిర్మాణ సంస్థ హారికా-హాసినీ క్రియేషన్స్‌’లో ఆ పేర్లు మా పిల్లలివే. మా పెద్దమ్మాయి హారిక తొమ్మిది, చిన్నమ్మాయి హాసిని ఐదో తరగతి చదువుతున్నారు. 
* సినిమా పరిశ్రమలో నాకు స్నేహితులు చాలా తక్కువ. చిన్నప్పుడూ, ఉద్యోగం చేసేప్పుడూ దొరికిన స్నేహితులే ఇప్పటికీ అన్ని విషయాల్లో తోడున్నారు. 
* దర్శకుడిగా త్రివిక్రమ్‌తో పనిచేయాలని ఉన్నా, ఫలానా హీరో కాంబినేషన్లో సినిమా తీయాలని ఎప్పుడూ అనుకోలేదు. బన్నీతో మాత్రం వీలైనన్ని ఎక్కువ సినిమాలు చేయాలనిపిస్తుంది.
* అన్ని భాషల సినిమాలూ చూస్తా. వాటిలో ఏదో ఒక అంశం ఆకర్షిస్తూనే ఉంటుంది. ఆ సన్నివేశాలు ఎవరికెలా కనిపించినా, నేను మాత్రం వాటిలోని ఖర్చునే గమనిస్తా. వాటిని మన సినిమాల్లో వాడుకోవచ్చో లేదో అప్పుడే అంచనాకు వచ్చేస్తా.
* నా స్నేహితుడు ప్రసాద్‌, మా అన్నయ్య కొడుకు వంశీ... వీళ్లిద్దరూ నా సినిమాలకు ఎక్కువగా కష్టపడతారు.

వరసగా త్రివిక్రమ్‌తో...
‘జులాయి’ ఫస్ట్‌ కాపీ చూసినప్పుడు నేను అనుకున్నది సాధించబోతున్నాననే సంతోషం కలిగింది. కానీ ప్రేక్షకులు ఎలా స్వీకరిస్తారో అన్న కంగారు మాత్రం విడుదలయ్యేవరకూ ఉండేది. సినిమా బయటికొచ్చాక ఆ భయమూ పోయింది. సినిమా మంచి హిట్టయింది. నా స్నేహితులు కూడా ఏమీ అనలేదు. దాంతో నిర్మాతగానే కొనసాగాలని అనుకున్నా. ‘జులాయి’ సమయంలో త్రివిక్రమ్‌గారిని చాలా దగ్గరగా గమనించే అవకాశం దొరికింది. వీలైనంత వరకూ అలాంటి అభిరుచి ఉన్న వ్యక్తితోనే సినిమాలు తీయాలని నిర్ణయించుకున్నా. అలానే తీస్తూ వచ్చా కూడా. ‘జులాయి’ తరవాత ‘సన్నాఫ్‌ సత్యమూర్తి’తో మరోసారి బన్నీతో కూడా పనిచేసే అవకాశం దొరికింది. ప్రేక్షకులతో పాటూ నిర్మాతా, దర్శకుడి అభిరుచినీ సమంగా బ్యాలెన్స్‌ చేసే కొద్ది మంది నటుల్లో బన్నీ ఒకడు. ఆ సినిమా తరవాత వేరే ప్రాజెక్టులు అనుకున్నా రకరకాల కారణాల వల్ల అవి ముందుకెళ్లలేదు. చివరికి నితిన్‌, సమంతలతో ‘అఆ’ చేయాలని నిర్ణయించుకున్నాం. నాకు తెలిసీ ‘అఆ’ కోసం పడినంత కష్టం త్రివిక్రమ్‌ గతంలో ఏ సినిమాకూ పడలేదేమో. నన్ను బాగా కదిలించిన ‘చిరునవ్వుతో’, ‘నువ్వు నాకు నచ్చావ్‌’ లాంటి సినిమాల్లో కనిపించిన త్రివిక్రమ్‌ శైలి మళ్లీ ఈ సినిమాలో కనిపిస్తుంది.

నాకు తెలిసిన త్రివిక్రమ్‌

మాటల పదునుతో నన్ను ఆకర్షించిన త్రివిక్రమ్‌, వ్యక్తిగతంగా అంతకంటే ఎక్కువ ప్రభావమే చూపించారు. నాలుగైదేళ్లుగా ఆయన్ని దగ్గరగా గమనిస్తున్నా. ఏదైనా పని నా వల్ల కాదు అనిపించిన మరుక్షణం నుంచీ నేను దాని గురించి ఆలోచించడం మానేస్తా. కానీ త్రివిక్రమ్‌గారికి కసి ఎక్కువ. ఏదైనా, ఎంత కష్టమైనా సాధించి తీరాలని ప్రయత్నిస్తారు. అతను చాలా మొహమాటస్తుడు. బయట కూడా నాతో తక్కువ మాట్లాడినా, ఎక్కువ కౌంటర్లు వేస్తుంటారు. సినిమాకు సంబంధించిన ప్రతి చిన్న అంశాన్నీ నాతో చర్చించి అభిప్రాయం తీసుకుంటారు. ఈరోజుల్లో అలాంటి దర్శకులు చాలా తక్కువమంది ఉన్నారని నా అభిప్రాయం. ఆయన కథ చెబుతున్నప్పుడే సగం మంది నటీనటులు నా మనసులో మెదుల్తారు. ఆ ఎంపికకు కూడా ఆయనెప్పుడూ అడ్డు చెప్పలేదు. త్రివిక్రమ్‌తో వీలైనన్ని గుర్తుండిపోయే చిత్రాలు తీయాలనుంది. నా తరవాతి సినిమా కూడా ఆయనతోనే ఉంటుంది.

మా అన్నయ్య కొడుకు వంశీకి సినిమాలంటే చాలా ఆసక్తి. నేను పరిశ్రమలోకి వచ్చాక, తను చేస్తోన్న సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం వదిలేసి సినిమాల వైపే వచ్చాడు. తనూ నిర్మాతగా ఎదిగే ప్రయత్నం చేస్తున్నాడు. ‘సితార ఎంటర్‌టెయిన్‌మెంట్స్‌’ పేరుతో మేం మొదలుపెట్టిన మరో నిర్మాణ సంస్థ బాధ్యతలు తనే చూసుకుంటున్నాడు. ప్రస్తుతం దాని తరఫున నాగ చైతన్యతో ‘ప్రేమమ్‌’, వెంకటేష్‌తో ‘బాబు బంగారం’ సినిమాలను నిర్మిస్తున్నాం. గతంలో వంశీ ‘లవర్స్‌’ సినిమాకూ నిర్మాతగా వ్యవహరించాడు. డబ్బు సంపాదన లక్ష్యంగా నేను సినిమాల్లోకి రాలేదు. ఎప్పటికైనా మంచి విలువలున్న సినిమాలు తీసిన నిర్మాతగా ప్రేక్షకులు నన్ను గుర్తుపెట్టుకుంటే చాలు. అలాంటి కథలు దొరుకుతున్నంత కాలం నేను సినిమాలు తీస్తూనే ఉంటా.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.