close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఆ నేత కార్మికుడే... ఇప్పుడు సీఎం!

ఆ నేత కార్మికుడే... ఇప్పుడు సీఎం!

పినరాయి విజయన్‌... పేద కూలీగా, చేనేత కార్మికుడిగా జీవితాన్ని మొదలుపెట్టి ఈ మధ్యే కేరళలో ముఖ్యమంత్రిగా అత్యున్నత పీఠాన్ని అధిరోహించిన వ్యక్తి. నమ్మిన విధానాల కోసం పోలీసుల చేతిలో చావు దెబ్బలు తిన్నా, హత్యా యత్నాలకు గురైనా తన దారి మార్చుకోలేదు. అదే ప్రజల్లో, పార్టీలో విజయన్‌ను హీరోని చేసింది. సీఎం కుర్చీ వరకూ తీసుకొచ్చింది. అసలు నవ్వడమే తెలీని నేతగా పేరున్న విజయన్‌ అలా మారడానికి వెనకున్న కారణాలేంటో అతడి జీవితమే చెబుతుంది.

రాజకీయ పార్టీకైనా ప్రత్యర్థులంటే ప్రతిపక్షాలే. కానీ ఈ మధ్యే కేరళ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన పినరాయి విజయన్‌కు మాత్రం ఇద్దరు ప్రత్యర్థులు. ఒకరు ప్రతిపక్ష నేతలైతే, మరొకరు సొంత పార్టీ సభ్యులే. ఎన్నికలకు ముందు రాష్ట్రంలో లెఫ్ట్‌ డెమక్రటిక్‌ ఫ్రంట్‌ను అధికారంలోకి తేవడానికి ప్రజల చేతిలో పరీక్షలు ఎదుర్కొన్న విజయన్‌, ఎన్నికల్లో గెలిచాక సీఎం స్థానం కోసం మరో కఠిన పరీక్ష ఎదుర్కోవాల్సి వచ్చింది. సీపీఐ(ఎం) సీనియర్‌ నేత విఎస్‌.అచ్యుతానందన్‌ కూడా విజయన్‌తో పాటు ముఖ్యమంత్రి రేసులో ముందున్నారు. అభిప్రాయ సేకరణలో ప్రజలతో పాటూ పార్టీలోనూ ఎక్కువ మంది విజయన్‌ వైపే మొగ్గు చూపారు. అలా ఐదు దశాబ్దాల రాజకీయ జీవితంలో ఆయన తొలిసారి ముఖ్యమంత్రి పదవిని అందుకున్నారు. ఆయన అధికారంలోకి వచ్చాక చాలా పత్రికలు ‘రాష్ట్రానికి కొత్త సీయీవో విజయన్‌’ అంటూ రాసుకొచ్చాయి. బాధ్యతలు నిర్వహించడంలో, నిర్ణయాలు తీసుకోవడంలో ఓ సంస్థ అధినేతలా చాలా కఠినంగా వ్యవహరిస్తారని ఆయనకు పేరుంది. అందుకే ఆ పోలిక. ఆ పేరు తెచ్చుకోవడం వెనక విజయన్‌ పడ్డ కష్టాలూ, ఆయనకు తగిలిన ఎదురుదెబ్బలూ చాలా ఉన్నాయి.

ముగ్గురే బతికారు...
కేరళలోని కన్నూర్‌ జిల్లాలో పినరాయి అనే పల్లెటూళ్లొ నిరుపేద కల్లుగీత కార్మికుల ఇంట్లో విజయన్‌ పుట్టారు. అతని తల్లిదండ్రులు కొరన్‌, కల్యాణిలకు మొత్తం పద్నాలుగు మంది పిల్లలు పుడితే అందులో ముగ్గురు మాత్రమే బతికారు. మిగిలిన వాళ్లంతా చిన్న వయసులోనే రకరకాల అనారోగ్యాలతో చనిపోయారు. ఆ రోజుల్లో కేరళలో చాలా గ్రామాలు వ్యాధులకు దగ్గరగా వైద్య సదుపాయాలకు దూరంగా బతికేవి. విజయన్‌ కూడా పుట్టిన కొన్ని రోజులకే విపరీతమైన జ్వరం బారిన పడ్డాడు. మిగతా పిల్లల్లానే అతనూ చనిపోతాడేమోనని గ్రామస్థులూ, తల్లిదండ్రులూ భయపడ్డారు. కానీ వూరికి దగ్గరలోని ఓ ఆయుర్వేద వైద్యుడి పుణ్యమా అని విజయన్‌ బతికి బట్టకట్టాడు. 77ఏళ్ల కిత్రం కేరళలో కమ్యూనిస్టు పార్టీ పుట్టడానికి ముందు తొలి సమావేశం విజయన్‌ స్వగ్రామంలోనే జరిగింది. ఆ ప్రభావంతో చుట్టుపక్కల గ్రామాల్లో కమ్యూనిస్టు పార్టీ నేతలూ, సానుభూతిపరుల సంఖ్య బాగా పెరిగింది. విజయన్‌ పెద్దన్నయ్య కూడా కమ్యూనిస్టు నేతల తరఫున పనిచేసేవాడు. దాంతో విజయన్‌ కూడా తెలీకుండానే ఆ పార్టీ నీడలో పెరుగుతూ వచ్చాడు.

జీవితమంతా తెల్లచొక్కానే!
వూహ తెలిసినప్పట్నుంచీ విజయన్‌కు ఒంటి మీద తెల్ల చొక్కా వేసుకోవడమే అలవాటు. దానికి కారణం పేదరికమే. స్కూల్‌ రోజుల్లో అతని దగ్గర ఒకేఒక్క తెల్ల చొక్కా ఉండేది. దాన్నే రెండ్రోజులకోసారి ఉతుక్కుని వారమంతా వేసుకునేవాడు. స్నేహితులెవరైనా అడిగినా తనకు తెల్లచొక్కాలే ఇష్టమనీ, అందుకే అన్నీ ఆ రంగువే కొనుక్కున్నాననీ చెప్పేవాడు. అలా ఒకే రంగు చొక్కా అయితే వరసగా ఎన్ని రోజులు వేసుకున్నా ఎవరూ గుర్తుపట్టరన్నది విజయన్‌ ఆలోచన. అందుకే క్రమంగా అది అతడికి జీవిత కాలపు డ్రెస్‌కోడ్‌లా మారిపోయింది. విజయన్‌ ఇంట్లో ఒక్క కిరోసిన్‌ బుడ్డీనే ఉండేది. ఎప్పుడూ దాని ముందే కూర్చొని చదువుకునేవాడు. దాని వల్ల కిరోసిన్‌ ఎక్కువగా ఖర్చవుతోందని, ‘ఒక్కరే కూర్చుంటే దెయ్యమొచ్చి తీసుకెళ్లిపోతుంది’ అంటూ తల్లి అతడిని భయపెట్టేది. అది నిజమే అనుకొని తల్లి వంట చేసేప్పుడు ఆ కట్టెల పొయ్యి పక్కకే చేరి ఆ కొద్దిపాటి వెలుగులోనే చదువుకునేవాడు. హైస్కూల్‌కి వచ్చాకే తల్లి తనకి ఎందుకలా అబద్ధం చెప్పేదో విజయన్‌కి అర్థమైంది. ఆమెను నొప్పించడం ఇష్టం లేక తరవాత కూడా ఆ కట్టెల పొయ్యి వెలుగులోనే పుస్తకం పట్టేవాడు.

గ్రామాల్లో ఎప్పుడూ దాడులే
విజయన్‌ చిన్నతనంలో ఆ రాష్ట్రంలో కమ్యూనిస్టు పార్టీని నిషేధించారు. ఆ పార్టీ కోసం పనిచేసే ప్రతి ఒక్కరినీ పోలీసులు అరెస్టు చేసి జైల్లో వేసేవారు. కమ్యూనిస్టు గ్రామాలుగా పేరున్న వాటిపైన నిత్యం దాడులు జరుగుతూనే ఉండేవి. విజయన్‌ తల్లి కల్యాణి మాత్రం కొడుకుల్ని కమ్యూనిస్టు భావజాలంతోనే పెంచింది. కమ్యూనిస్టులంతా చెడ్డవాళ్లు కాదనీ, తమ కోసమే పోరాడుతున్నారనీ చెప్పేది. ఆ సమయంలోనే ఓ రోజు పోలీసులు వాళ్ల ఇంటిపైనా దాడిచేసి ఇంట్లోని సామాన్లన్నింటినీ బయటకు విసిరేశారు. విజయన్‌ పెద్దన్నను అక్కడే చితక్కొట్టి తమతో పాటు తీసుకెళ్లారు. ఆ సంఘటనతో పాటు నిత్యం గ్రామాల్లో పోలీసుల దాడుల గురించి వినిపించే కథలు అతడిపైన బలంగా ముద్ర వేశాయి. ఓవైపు చుట్టూ అనిశ్చితీ, పోలీసుల దాడులూ, మరోపక్క పేదరికం క్రమంగా అతడిని రాటుదేల్చాయి. పేదరికాన్ని జయించాలన్నా, సమాజంలో తమపైన చిన్న చూపు పోవాలన్నా కమ్యూనిస్టుల రాజ్యం రావాలని చుట్టుపక్కల చెప్పుకునే మాటల వల్ల క్రమంగా విజయన్‌ ఆ ఉద్యమాల వైపు ఆకర్షితుడయ్యాడు.

ఏడాదిన్నర జైల్లో
పదో తరగతి పూర్తయ్యాక విజయన్‌కు పైచదువులు చదవాలని అనిపించినా ఇంట్లో పరిస్థితి అందుకు సహకరించలేదు. ప్రభుత్వ కాలేజీలో చదివినా కనీసం పుస్తకాలూ, బట్టలకైనా డబ్బులు కావాలి. అందుకే చదువునుంచి ఏడాదికి పైగా విరామం తీసుకున్నాడు. మైసూరు వెళ్లి కొన్నాళ్లు ఓ బేకరీలో రోజు కూలీగా పనిచేశాడు. ఆ తరవాత ఓ హ్యాండ్లూమ్‌ కేంద్రంలో చేనేత కార్మికుడిగా పనిచేశాడు. బట్టలూ, పుస్తకాలకు డబ్బులు సమకూర్చుకున్నాక వెళ్లి ప్రభుత్వ కాలేజీలో ఇంటర్‌లో చేరాడు. బీఏకి వచ్చాక ‘కేరళ స్టూడెంట్‌ ఫెడరేషన్‌’లో సభ్యత్వం తీసుకొని విద్యార్థి రాజకీయాల్లోకి అడుగుపెట్టాడు. కేఎస్‌ఎఫ్‌లో విజయన్‌ చాలా చురుగ్గా పనిచేసేవాడు. విద్యార్థుల కోసం జరిగే ఉద్యమాల్లో ముందుండేవాడు. తరవాతి రోజుల్లో ఆ సంస్థ ‘స్టూడెంట్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా’గా మారి సీపీఎం విద్యార్థి విభాగంగా గుర్తింపు పొందింది. కాలేజీలో ఉండగానే విజయన్‌ నాయకుడిగా ఎదుగుతూ కేఎస్‌ఎఫ్‌ జిల్లా కార్యదర్శిగా, తరవాత రాష్ట్ర కార్యదర్శిగా మారాడు. ఆపైన సీపీఎం కన్నూర్‌ జిల్లా కమిటీ సభ్యుడిగానూ ఎంపికయ్యాడు. ఆ సమయంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాలు చేపట్టినందుకు ఏడాదిన్నరకు పైగా జైలు జీవితాన్ని అనుభవించాడు. ఆ సమయంలోనే కొందరు నాయకులు నక్సలిజానికి మద్దతు పలకడం, ఇంకొందరు పార్టీకి వ్యతిరేకంగా పనిచేయడం లాంటి కారణాల వల్ల కన్నూర్‌ సీపీఎం విభాగంలో విజయన్‌కు ప్రాధాన్యం పెరిగింది. 1970లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సీనియర్లను కాదని పార్టీ అతనికే టికెట్‌ ఇచ్చింది. కూతుపరంబా నియోజకవర్గం నుంచి అతను బరిలోకి దిగాడు. ఆ ఎన్నికల్లో సీపీఎంకి ఘోరమైన ఎదురుదెబ్బ తగిలింది. గతంలో ఎన్నడూ లేని విధంగా కేవలం 28స్థానాల్లోనే పార్టీ గెలిచింది. రాష్ట్రంలో ఆ పార్టీకి చెందిన మహామహులందరూ ఓడిపోయారు. కానీ అనూహ్యంగా విజయన్‌ని మాత్రం విజయం వరించింది. పైగా ఆ నియోజకవర్గంలో పార్టీ గెలవడం కూడా అదే తొలిసారి. అలా 26ఏళ్లకు కేరళలో అత్యంత పిన్న వయసు ఎమ్మెల్యేగా అసెంబ్లీలోకి అడుగుపెట్టాడు. ఇప్పటికీ అదే అక్కడ రికార్డు.

20ఏళ్ల తరవాత మళ్లీ
సీనియర్లంతా ఓడిపోయిన సమయంలో విజయన్‌ గెలుపు పార్టీలో అతడిని హీరోని చేసింది. ప్రజల్లో, ముఖ్యంగా విద్యార్థుల్లో అతడికున్న ఆదరణని పార్టీ పెద్దలు గుర్తించారు. క్రమంగా పార్టీలో విజయన్‌ కీలకంగా ఎదుగుతూ వచ్చాడు. ఎమర్జెన్సీ సమయంలో ప్రాథమిక హక్కులకు కాంగ్రెస్‌ ప్రభుత్వం భంగం కలిగిస్తోందని విజయన్‌ ప్రదర్శనలు నిర్వహించినందుకు పోలీసులు అతడిని అరెస్టు చేసి జైలుకు తరలించారు. అక్కడ తాను ఎమ్మెల్యేనని చెప్పినా వినకుండా చిత్రహింసలు పెట్టారు. రక్తమొచ్చేలా కొట్టారు. ఆరుగురు పోలీసులు చుట్టూ చేరి స్పృహ తప్పేవరకూ చితక బాదారని ఆయన తరచూ ప్రస్తావిస్తుంటారు. జైలు నుంచి విడుదలయ్యాక రక్తపు మరకలతో నిండిన చొక్కాను అసెంబ్లీకి తీసుకెళ్లి సభలో ఆయన చేసిన ప్రసంగం కేరళ రాజకీయాల్లో ఒక కీలక పరిణామం. ఆ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో అత్యుత్తమ ప్రసంగాల్లో అదీ ఒకటని చెబుతారు. రాష్ట్రవ్యాప్తంగా విజయన్‌ పేరు మారుమోగిపోవడానికి ఆ సంఘటన ప్రధాన కారణమైంది. ఆ తరవాత మూడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన విజయన్‌ 1996లో తొలిసారి క్యాబినెట్‌ మంత్రి పదవి అందుకున్నారు. విద్యుత్‌ శాఖ మంత్రిగా రెండున్నరేళ్లే పనిచేసినా, ఆ పాలన అధికారులతో పాటు ప్రజలపైనా బలమైన ముద్ర వేసింది. అప్పటివరకూ విద్యుత్‌ సంక్షోభాన్ని ఎదుర్కొన్న కేరళ, విజయన్‌ నిర్ణయాల వల్ల వృథాని అరికట్టి, ఉత్పత్తిని పెంచుకొని స్వయం సమృద్ధి సాధించగలిగింది. మంత్రిగా డెడ్‌లైన్ల విషయంలో ఆయన చాలా కఠినమని అధికారుల్లో పేరొచ్చింది. ఆయన హయాంలోనే కొత్తగా అక్కడ కొన్ని వందల గ్రామాలకు తొలిసారి విద్యుత్‌ వెలుగులు అందాయి. కానీ 1998లో ఆ రాష్ట్ర సీపీఐ(ఎం) సెక్రటరీ చడయాన్‌ గోవిందన్‌ మరణంతో పార్టీ అవసరాల మేరకు తన మంత్రి పదవికి రాజీనామా చేసి ఆ స్థానాన్ని విజయన్‌ భర్తీ చేశారు. అత్యధికంగా దాదాపు పదిహేడేళ్ల పాటు సీపీఐ (ఎం) రాష్ట్ర సెక్రటరీగా కొనసాగారు. ఆ సమయంలోనే ఆయన చాలా కటువుగా తయారయ్యారనీ, అరుదుగా మాత్రమే ఆయన మొహంలో చిరునవ్వు కనిపిస్తుందనీ పార్టీ సభ్యులు చెబుతారు. ఆ పదిహేడేళ్ల కాలంలో పార్టీని బలోపేతం చేసి, ప్రజల్లో నమ్మకాన్ని పెంచి తిరిగి అధికారంలోకి తేవడంలో కీలక పాత్ర పోషించారు.

విజయన్‌ ఇరవై ఏళ్ల విరామం తరవాత మళ్లీ ఈసారి ఎన్నికల బరిలో దిగారు. పార్టీలో అతడి మరో ప్రత్యర్థి, మాజీ ముఖ్యమంత్రి వీఎస్‌.అచ్యుతానందన్‌ కూడా ఎన్నికల్లో నిలబడ్డారు. ఇద్దరి మధ్యా పోటీ ఉండటంతో ఎన్నికల్లో పార్టీ గెలిచినా ముఖ్యమంత్రి ఎవరన్న విషయం మాత్రం వెంటనే తేలలేదు. గతంలో తాను మంత్రిగా పనిచేసినప్పుడు మంచి పేరు రావడం, సుదీర్ఘ కాలం కార్యదర్శిగా పనిచేయడం వల్ల పార్టీ మీదున్న పట్టు లాంటి కారణాల వల్ల సభ్యులు విజయన్‌ వైపే మొగ్గు చూపారు. అలా తొలిసారి కేరళ ముఖ్యమంత్రి పదవిని ఆయన అందుకున్నారు. ఒక్కసారి విజయన్‌ పుట్టిన కుటుంబం, పెరిగిన నేపథ్యం, చూసిన కష్టాలూ, తిన్న ఎదురుదెబ్బలను గమనిస్తే మనిషిలో కసి ఉంటే అతని ఎదుగుదలను ఆపడం ఎవరికీ సాధ్యం కాదని అర్థమవడం ఖాయం.


ఇప్పటికే అదే ఫోను!

విజయన్‌ భార్య కమల ఒకప్పుడు కేరళ విద్యార్థి సంఘంలో కార్యకర్తగా ఉండేవారు. తరవాత ప్రభుత్వ స్కూల్‌ టీచర్‌గా స్థిరపడ్డారు. ప్రభుత్వ అనుమతి లేకుండా సమ్మెలో పాల్గొన్నందుకు మూడేళ్ల క్రితం ఆమెను విధుల్లోంచి తొలగించారు. విజయన్‌ కొడుకు వివేక్‌ హెచ్‌ఎస్‌బీసీ బ్యాంకులో ఉద్యోగి. కూతురు వీణా ఓ స్టార్టప్‌ సంస్థకు యజమాని.

* పదేళ్ల క్రితంనాటి నోకియా బేసిక్‌ మోడల్‌ సెల్‌ఫోన్‌నే విజయన్‌ ఇప్పటికీ వాడతారు. ఎవరు ఎప్పుడు పోన్‌ చేసినా వెంటనే స్పందించే వ్యక్తిగా ఆయనకు పేరుంది.

* విజయన్‌ పైన చాలాసార్లు హత్యాయత్నాలు జరిగాయి. కేంద్ర ప్రభుత్వం ఆయనకు చాలా ఏళ్ల క్రితమే ప్రత్యేక భద్రతను కల్పించడానికి ముందుకొచ్చింది. కానీ తన వ్యక్తిత్వానికీ, పార్టీ కట్టుబాట్లకూ అది సరిపడదని ఆయన తిరస్కరించారు.

* చిన్నప్పుడు స్కూల్లో టీచర్లు విజయన్‌ పుట్టినరోజును మార్చి 21 అని నమోదు చేశారు. అది తప్పనీ, ఆ రోజున కార్యకర్తలు ఎలాంటి కార్యక్రమాలూ చేయొద్దనీ ఆయన చాలా సందర్భాల్లో చెప్పినా, అసలు పుట్టిన రోజు ఎప్పుడన్నది మాత్రం ఆయనెప్పుడూ బయటపెట్టలేదు. ఇటీవలే ముఖ్యమంత్రి అయ్యాక తాను పుట్టింది మే24న అని తొలిసారి బయటకు చెప్పారు.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.