close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
రెండుసార్లు సున్నాకి పడిపోయా!

రెండుసార్లు సున్నాకి పడిపోయా!

పొట్లూరి వెంకటేశ్వరరావు... వందల కోట్ల టర్నోవర్‌ ఉన్న పెబ్స్‌ పెన్నార్‌ ఇంజినీరింగ్‌ కంపెనీకి మేనేజింగ్‌ డైరెక్టర్‌. దేశంలో ప్రీ ఇంజినీర్డ్‌ భవనాల అభివృద్ధి కోసం భారత ప్రణాళికా సంఘం, భారతీయ నిర్మాణరంగ పరిశ్రమ కలిసి ఏర్పాటు చేసిన ‘సీఐడీసీ’ ఆయన్ని ఇటీవలే హైపవర్డ్‌ గ్రూప్‌కి ఛైర్మన్‌గా నియమించింది. ఆ హోదాలో దేశంలోని ప్రీఇంజినీర్డ్‌ భవనాల భవిష్యత్తును నిర్దేశించే కీలక ముసాయిదా తయారీకి ఆయన నాయకత్వం వహిస్తున్నారు. సాధారణ ఉపాధ్యాయుడిగా కెరీర్‌ని మొదలుపెట్టి, సమస్యలతో సతమతమవుతూ ఓ దశలో ఆత్మహత్య చేసుకోవాలనుకున్న పీవీ రావు ఇప్పుడు అంత ఉన్నత స్థానానికి చేరడానికి మధ్య చేసిన ప్రయాణం, చూసిన ప్రపంచం చాలా ఉంది.

ష్టసుఖాలూ, ఎత్తుపల్లాలూ, లాభనష్టాలూ... జీవితం అందరికీ అన్నీ ఇస్తుంది. సంతోషాల కంటే సమస్యలున్నప్పుడు ఎలా స్పందించాం, చేస్తోన్న పనిలో లాభాల కంటే నష్టాలొచ్చినప్పుడు ఎలా ఎదుర్కొన్నాం అన్న దానిపైనే భవిష్యత్తు ఆధారపడుతుంది. యాభై ఏడేళ్ల జీవితంలో అలాంటి ఎన్నో అనుభవాలు నాకూ ఎదురయ్యాయి. వాటిని నేను స్వీకరించిన తీరే నన్నిక్కడిదాకా తీసుకొచ్చింది. నేను పుట్టింది ప్రకాశం జిల్లా చీరాలకు దగ్గర్లోని కేసారప్పాడులో అయినా పెరిగిందంతా విజయవాడలోనే. మా తాతయ్య పొట్లూరి కనకయ్యగారు ఎరువుల వ్యాపారం చేసేవారు. ఉమ్మడి కుటుంబం కావడంతో మా నాన్నా బాబాయి కూడా దాన్నే చూసుకునేవారు. నాకు వూహ తెలిసేనాటికి మా కుటుంబానికి సొంతిల్లూ, ముప్ఫయ్‌ ఎకరాల పొలం ఉండేది. వ్యవసాయ పనుల బాధ్యతంతా మా మేనత్త భర్త వాసిరెడ్డి రామారావుగారి పైనే ఉండేది. ఆయన కమ్యూనిస్టు నాయకుడు. అప్పటి మద్రాసు ఉమ్మడి రాష్ట్రంలో కంచికచర్ల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగానూ గెలిచారు. కొన్నాళ్లకు రాజకీయాలకు స్వస్తిపలికి వ్యవసాయానికే పరిమితమయ్యారు. మరోపక్క మా ఎరువుల వ్యాపారం ఇరవై ఏళ్ల పాటు లాభసాటిగానే సాగినా మారిన పరిస్థితులూ, పెరిగిన పోటీ తదితర కారణాల వల్ల క్రమేపీ నష్టాల్లోకి వెళ్లింది. దాంతో కొన్నాళ్లకు దాన్నుంచి తప్పుకున్నాం.

ఇల్లంతా కోలాహలమే...
మా కుటుంబంలో చాలామంది కమ్యూనిస్టు పార్టీలో ఉండటం వల్ల ఆ ఆలోచనల ప్రభావం ఇంట్లో పిల్లలపైనా పడింది. నాన్నగారు మున్సిపల్‌ కౌన్సిలర్‌గా పనిచేశారు. బాబాయి రాఘవేంద్రరావు స్టూడెంట్‌ ఫెడరేషన్‌ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారు. చాలాకాలం పాటు ఆంధ్రప్రదేశ్‌ ప్రజానాట్య మండలిలో కోశాధికారిగానూ పనిచేశారు. మా ఇంట్లో జరిగే నాట్యమండలి రిహార్సల్స్‌ కోసం గాయకుడు వందేమాతరం శ్రీనివాస్‌ తరచూ వస్తుండేవారు. సురవరం సుధాకరరెడ్డిగారు, బొల్లిముంత శివరామకృష్ణగారు, నల్లూరి వెంకటేశ్వరరావుగారు, చలసాని ప్రసాద్‌గారు లాంటి చాలామంది ప్రముఖుల రాకతో ఇల్లు నిత్యం కోలాహలంగా ఉండేది. నా ప్రాథమిక చదువంతా విజయవాడలోని మాంటిస్సోరి స్కూల్‌లో సాగింది. ఇంటర్‌ని లయోలా కాలేజీలో, సివిల్‌ ఇంజినీరింగ్‌ని కాకినాడ జేఎన్‌టీయూలో పూర్తి చేశా. కాలేజీ రోజుల్లో జిల్లాస్థాయి బ్యాడ్మింటన్‌ పోటీల్లో పాల్గొనేవాణ్ణి. యూనివర్సిటీ స్థాయి పోటీల్లో జేఎన్‌టీయూ కాకినాడ బ్యాడ్మింటన్‌ బృందానికి కెప్టెన్‌గానూ ఉన్నా.

కాలేజీలో పాఠాలు...
ఇంజినీరింగ్‌ అయిపోయాక కొన్నాళ్లు ప్రభుత్వోద్యోగం కోసం ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. ప్రైవేటు రంగంలో సరైన అవకాశాలు కనిపించలేదు. ఏం చేయాలా అని ఆలోచిస్తున్న సమయంలో మా బాబాయికి పరిచయమున్న ప్రొఫెసర్‌ తుమ్మల వేణుగోపాలరావుగారు ఓసారి మా ఇంటికొచ్చారు. విజయవాడ సిద్ధార్థ ఇంజినీరింగ్‌ కాలేజీకి మొదటి ప్రిన్సిపల్‌ ఆయనే. నన్ను చూసి, నాకు ఇష్టముంటే తమ కాలేజీలో అసిస్టెంట్‌ లెక్చరర్‌గా చేరమని అడిగారు. ఇంజినీరింగ్‌ పూర్తిచేసినా నేనేమీ టాప్‌ స్టూడెంట్‌ని కాను. దాంతో లెక్చరర్‌గా చేయలేనేమో అనుకున్నా. కానీ ప్రయత్నించి చూసి, నచ్చకపోతే మరో అవకాశం వెతుక్కోమని వేణుగోపాలరావుగారు చెప్పడంతో ఉద్యోగంలో చేరా. ఇంజినీరింగ్‌లో నా సీనియర్లు కొందరు అప్పటికే ఆ కాలేజీలో పనిచేస్తుండటంతో నాక్కాస్త వూరటగా అనిపించింది. రెండేళ్లకు పైగా అక్కడే పాఠాలు చెప్పా. కొన్నాళ్లకు వేణుగోపాలరావుగారు ఆంధ్రా యూనివర్సిటీకి మారడం, ఆ తరవాత వచ్చిన ప్రిన్సిపల్‌తో లెక్చరర్స్‌కి భేదాభిప్రాయాలు రావడంతో యాభై ఆరు మందిలో నలభై నాలుగు మంది రాజీనామా చేసి వెళ్లిపోయారు. వాళ్లలో నేనూ ఉన్నా. ఆ తరవాత ఇరవై రెండు మందిమి బాపట్ల ఇంజినీరింగ్‌ కాలేజీలో లెక్చరర్లుగా చేరాం. అక్కడ ఏడాది పనిచేశాక తెలిసిన వాళ్ల ద్వారా మధ్యప్రదేశ్‌లో సివిల్‌ ఇంజినీరింగ్‌ కాంట్రాక్టు ఒకటొస్తే వెళ్లాను. ఆ ప్రయాణమే నా జీవితానికి వూహించని మలుపు.

ఆస్తులన్నీ అమ్మేసి...
మధ్యప్రదేశ్‌లో కాంట్రాక్టుల పని ఆశించిన స్థాయిలో సాగలేదు. వ్యాపారంలో అవగాహనా, అనుభవం రెండూ లేక చాలా డబ్బు నష్టపోవాల్సి వచ్చింది. అక్కడికెళ్లిన కొన్నాళ్లకే ఉషారమణితో నా పెళ్లయింది. ఆ పైన ఏడాదికి పెద్దబ్బాయి శీతల్‌ పుట్టాడు. అప్పటికే మా అమ్మ క్యాన్సర్‌తో బాధపడుతోంది. పిల్లాడిని ఎత్తుకుని ముద్దాడిన రెండు రోజులకే ఆవిడ చనిపోయారు. ఓ పక్క వ్యాపార సమస్యలకు తోడు అమ్మ లేదన్న బాధ నుంచి బయటపడటానికి చాలా కాలమే పట్టింది. వ్యాపారంలో నష్టాలు క్రమంగా కొండంతై కూర్చున్నాయి. దాంతో రెండిళ్లూ, పొలాలూ, మామిడి తోటలూ అన్నీ అమ్మేసి అప్పులు తీర్చాం. ఆఖరికి మా మామగారు ఐ.వి.రావుగారు నా భార్యకి కానుకగా ఇచ్చిన రెండు లక్షల రూపాయలు కూడా ఆవిరైపోయాయి. మా ఆవిడ మెడలో మంగళసూత్రం తప్ప మరేమీ మిగల్లేదు. ఇంక మధ్యప్రదేశ్‌లో ఉండలేక మళ్లీ విజయవాడకు మకాం మార్చాను. అక్కడ ఏం చేయాలో దిక్కుతోచలేదు. బంధువుల్లోనూ చాలా మంది చిన్నచూపు చూడటం మొదలుపెట్టారు. రకరకాల అవమానాలూ, సవాళ్లతో సతమతమయ్యేవాణ్ణి. వ్యాపారమంటేనే అంత అని నాకు నేనే సర్దిచెప్పుకునేవాణ్ణి. ఎందుకంటే ఒకప్పుడు మా తాతగారు వ్యాపారంలో బాగా రాణించారు. కానీ మా బాబాయి మొదలుపెట్టిన క్రిమిసంహారక మందుల కంపెనీ, ఇండేన్‌ గ్యాస్‌ ఏజెన్సీ అనుకున్నంత ఫలితాన్ని ఇవ్వలేదు. మురళీమోహన్‌, జయసుధ, మోహన్‌బాబులాంటి వాళ్లతో ‘గడుసమ్మాయి’ అనే సినిమానీ ఆయన నిర్మించారు. అదీ ఆశించిన స్థాయిలో ఆడలేదు. మా చినతాత వెంకట సుబ్బారావుగారు కూడా ‘రైతు కుటుంబం’, ‘జగమేమాయ’ లాంటి సినిమాలు తీశారు. ఆ తరవాత ఆయన ఏఎన్నార్‌గారి కోరికపైన అన్నపూర్ణా స్టూడియోస్‌కి మొదటి మేనేజర్‌గా పనిచేశారు. అలా మా ఇంట్లో వాళ్లకు వ్యాపార అనుభవం బాగానే ఉన్నా కాలం మాత్రం ఎప్పుడూ కలిసి రాలేదు.

కథ మళ్లీ మొదటికి
మొదట నాకు ఉద్యోగం ఇప్పించిన ప్రొఫెసర్‌ వేణుగోపాలరావుగారే విజయవాడ తిరిగొచ్చాక రెండోసారీ ఆదుకున్నారు. నేను వెళ్లేసరికి ఆయన ఏలూరు సీఆర్‌ రెడ్డి ఇంజినీరింగ్‌ కాలేజీ ప్రిన్సిపల్‌గా చేస్తున్నారు. వట్లూరులో ఆ కాలేజీకి కొత్త భవనాలు కడుతోన్న సమయమది. వాటికి కన్‌స్ట్రక్షన్‌ ఇంజినీర్‌గా చేరమని రావుగారు ఆడిగారు. ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఒప్పుకున్నా. ఇంజినీర్‌గా నెలకు నాలుగు వేలు జీతమిచ్చేవారు. ఒకప్పటి నా సంపాదనతో పోలిస్తే అది తక్కువే. కానీ అంతకంటే మెరుగైన అవకాశం కనిపించలేదు. ఆ సమయంలో నా భార్య సహకారం ఎప్పటికీ మరచిపోలేను. బాగా డబ్బులొచ్చిన దశలో దర్జాగా బతికిన ఆమె, అంతంత మాత్రం ఆదాయమున్నప్పుడూ ఇంటిని గుట్టుగా నెట్టుకొచ్చింది. అలా రోజులు గడుస్తున్న సమయంలో నా స్నేహితుడు సురేంద్ర వ్యాపారం చేయడానికి మస్కట్‌ వెళ్తున్నాడని తెలిసి నేనూ వస్తానని చెప్పా. దాంతో విజిటర్‌ వీసాతో నన్నూ తీసుకెళ్లాడు. అక్కడ ఓ మంత్రి కొడుకుని సురేంద్ర నాకు పరిచయం చేశాడు. ఆయనకో కన్‌స్ట్రక్షన్‌ కంపెనీ ఉండేది. వాళ్లకు సివిల్‌ ఇంజినీర్‌ అవసరం ఉండటంతో నేను వెంటనే ఆ ఉద్యోగంలో చేరిపోయా. కాలం కలిసి రాకపోతే తాడే పామవుతుంది అన్నట్టు అప్పటి నుంచైనా జీవితం బాగుపడుతుందనుకున్న నాకు మళ్లీ నిరాశే ఎదురైంది. నేను చేరిన కంపెనీ నష్టాల్లోకి వెళ్లడంతో ఏడాది పనిచేస్తే మూడు నెలల జీతమే ఇచ్చారు. ఎప్పటికైనా మొత్తం జీతం అందుతుందన్న ఆశతో తెలిసినవాళ్ల దగ్గర అప్పులు చేస్తూ ఏడాదంతా గడిపాను. చివరికి ఆ కంపెనీ కూడా మూతబడింది. దాంతో నా కథ మళ్లీ మొదటికొచ్చింది. ఒకానొక దశలో నిరాశతో ఆత్మహత్య చేసుకుందామన్న ఆలోచనా వచ్చింది. కానీ నన్నే నమ్ముకున్న భార్యా, పిల్లలు గుర్తొచ్చారు. వాళ్లకోసమైనా బతికి సాధించాలని నిర్ణయించుకున్నా.

టాటాగ్రూప్‌ని వదిలి...
సాయి వరప్రసాదుగారని మా బాబాయి స్నేహితుడొకాయన మస్కట్‌లో డాక్టర్‌గా పనిచేసేవారు. ఆక్కడ ఓ పేరున్న సంస్థలో 35 ఏళ్లుగా పనిచేస్తోన్న ఎంఎస్‌ రావుగారు, ప్రసాదుగారికి బాగా పరిచయం. ఆయనకి నా గురించి చెప్పి ఏదైనా ఉద్యోగం చూడమన్నారు. ఆయన సాయంతోనే మస్కట్‌లోనే వాళ్ల గ్రూప్‌లో భాగంగా ఉన్న ఓ ప్రీఇంజినీర్డ్‌ బిల్డింగ్స్‌ కంపెనీలో ఉద్యోగం వచ్చింది. సాధారణ భవన నిర్మాణాలపైన నాకు అవగాహన ఉంది కానీ, ప్రీఇంజినీర్డ్‌ బిల్డింగుల గురించి అప్పటికి పెద్దగా తెలీదు. దాంతో ఆ రంగంపైన పట్టు తెచ్చుకోవడానికి దాదాపు ఏడాది పట్టింది. నాలుగేళ్ల పాటు అక్కడే పనిచేసి, మంచి అవకాశం రావడంతో మరో కంపెనీకి మారి అక్కడా నాలుగేళ్లు పనిచేశాను. ఆపైన హైదరాబాద్‌లో కువైట్‌కి చెందిన కిర్బీ అనే ప్రీ ఇంజినీర్డ్‌ స్టీల్‌ బిల్డింగ్స్‌ కంపెనీలో సీనియర్‌ మేనేజ్‌మెంట్‌ బృందంలో అవకాశం రావడంతో భారత్‌కి తిరిగొచ్చేశా. అన్నేళ్ల అనుభవం కిర్బీలో బాగా పనికొచ్చింది. నా నైపుణ్యం చూసి ఐదేళ్లలో మూడుసార్లు అక్కడ పదోన్నతులు కల్పించారు. ఆపైన కొన్నాళ్లకు పుణెలో టాటా బ్లూస్కోప్‌ స్టీల్స్‌కు చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌గా అద్భుతమైన స్థానం లభించింది. ఆ సమయంలో టాటా గ్రూపు ప్రీఇంజినీర్డ్‌ బిల్డింగ్స్‌ వ్యాపారంలోకి ప్రవేశించేందుకు కృషి చేశా. మూడేళ్ల తరవాత ఓసారి పెన్నార్‌ గ్రూప్‌ ఛైర్మన్‌ నృపేందర్‌రావుగారి దగ్గరి నుంచి కబురొచ్చింది. వాళ్ల అబ్బాయి ఆదిత్యారావు పుణెలో నన్ను కలిసి వాళ్లు స్థాపించబోయే ప్రీ ఇంజినీర్డ్‌ బిల్డింగ్స్‌ సంస్థకు ప్రెసిడెంట్‌గా ఉండమని అడిగారు. టాటా గ్రూప్‌ని ఉన్నఫళంగా వదిలి రావడం ఎవరికైనా కష్టమే. కానీ నృపేందర్‌రావుగారికి ఉన్న పేరు ప్రఖ్యాతుల గురించి తెలుసుకొని పెన్నార్‌లో చేరాలని నిర్ణయించుకున్నా.ఐదేళ్లలో రూ.500కోట్లు!
ఎనిమిదిన్నరేళ్ల క్రితం నేను పెన్నార్‌లో చేరే సమయానికి ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక మాంద్యం నెలకొంది. దాంతో ఎన్నో సవాళ్లను దాటుకొని మెదక్‌ జిల్లా సదాశివపేటలో పరిశ్రమను నెలకొల్పాం. గతంలో నాతో పనిచేసిన చాలామంది ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగాలు వదులుకొని నాకోసం పెన్నార్‌లో చేరారు. అలా ఆరేళ్ల క్రితం ఉత్పత్తి మొదలుపెట్టిన మా సంస్థ ఐదేళ్లలోనే ఐదు వందల కోట్ల టర్నోవర్‌ని అందుకుంది. గత రెండేళ్లలో జాతీయ స్థాయిలో మా సంస్థకు తొమ్మిది అవార్డులు దక్కాయి. తక్కువ సమయంలోనే ప్రీఇంజినీర్డ్‌ భవనాల రంగంలో రెండో స్థానానికి చేరాం. వ్యక్తిగతంగా నాకూ హైదరాబాద్‌ మేనేజ్‌మెంట్‌ అసోసియేషన్‌ నుంచి ‘మేనేజర్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ అవార్డు వచ్చింది. ప్రస్తుతం ‘హై పవర్డ్‌ గ్రూప్‌’ ఛైర్మన్‌గా దేశంలో ప్రీ ఇంజినీర్డ్‌ భవనాల అభివృద్ధి కోసం తీసుకోవాల్సిన చర్యలపైన ముసాయిదా తయారు చేసే పనిలో ఉన్నా. ఈ సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో ఎత్తుపల్లాలు చూశా. కెరీర్‌లో పాతాళానికి పడిపోయి మళ్లీ పైకి లేచా. సంపాదించినవన్నీ పోగొట్టుకొని, సున్నా నుంచి మొదలుపెట్టి ఇప్పుడీ స్థాయికొచ్చా. జీవితంలో ఎదురుదెబ్బలు సహజమే. వాటిని ఎలా స్వీకరిస్తాం అన్నదానిపైనే ఎదుగుదల ఆధారపడి ఉంటుంది. నా జీవితం నాకు నేర్పిన పాఠం, నేను మరొకరికి చెప్పే మాటా ఇదే.

డ్రైవర్‌ పిల్లల్ని చదివిస్తున్నా!

మా పెద్దబ్బాయి శీతల్‌ మద్రాస్‌ ఐఐటీలో ఎలక్ట్రానిక్స్‌లో పీహెచ్‌డీ పూర్తిచేసి ప్రస్తుతం డెన్మార్క్‌లో ఫెలోషిప్‌ చేస్తున్నాడు. చిన్నబ్బాయి ఉజ్వల్‌ అమెరికాలో ఎమ్మెస్‌ చేసి ఉద్యోగం చేస్తున్నాడు. అదృష్టం కొద్దీ, మా ఇద్దరు కోడళ్లూ ఉన్నత విలువలు కలిగిన సాధారణ కుటుంబాల నుంచి వచ్చినవారే.
* ఉన్నంతలో తోటివాళ్లకు సహాయపడటం నాకలవాటు. నా వంతుగా కొందరు పేద ఇంజినీరింగ్‌ విద్యార్థులకు ఫీజులు కడుతున్నాను. నా డ్రైవర్‌ పిల్లలను చదివిస్తున్నాను. కాకినాడ జేఎన్‌టీయూలో కలిసి చదువుకున్న కొందరు మిత్రులతో కలిసి ‘కీట్స్‌’ అనే స్వచ్ఛంద సంస్థను మొదలుపెట్టాం.
* సమకాలీన అంశాలపైన నా అనుభవంతో యువ వ్యాపారులకు ఉపయోగపడేలా వ్యాసాలు రాయడమంటే ఆసక్తి. అలా ‘ఈనాడు’ పత్రికలో దాదాపు ఎనభై వ్యాసాల దాకా ప్రచురితమయ్యాయి.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.