close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
చందాలు వేసుకొని కారు కొనిచ్చారు!

చందాలు వేసుకొని కారు కొనిచ్చారు!

ప్రధాని మోదీ ఇటీవల విస్తరించిన మంత్రి వర్గంలో క్యాబినెట్‌ హోదా దక్కించుకున్న ఏకైక వ్యక్తి ప్రకాశ్‌ జవడేకర్‌. మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రిగా కీలక బాధ్యతలు చేపట్టిన ఆయన చాలా మామూలు స్థాయి నుంచి జీవితాన్ని ప్రారంభించారు. విద్యార్థి నాయకుడిగా, బ్యాంకు ఉద్యోగిగా, భాజపా నేతగా, ప్రజల మంత్రిగా ఒక్కో మెట్టూ ఎక్కుతూ వచ్చారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పార్టీ అధికార ప్రతినిధిగా, ఇన్‌ఛార్జ్‌గా, భాజపా విస్తరణలో ఎదుగుదలలో కీలక పాత్ర పోషించారు. మన్మోహన్‌ ప్రభుత్వానికి మసిపూసిన బొగ్గు కుంభకోణాన్నీ ఆయనే బయటకు తీశారు. ఓ సాధారణ పాత్రికేయుడి కొడుకైన ప్రకాశ్‌ ఈ స్థాయికి రావడం వెనక చాలా కథే ఉంది.

‘ఎలాంటి విషయమైనా చిరునవ్వుతో మీడియాను ఎదుర్కోగల సమర్థుడు’... ఆ పేరు జవడేకర్‌కు ఒక్క రోజులో వచ్చింది కాదు. ‘ప్రత్యర్థి ప్రధాని అయినా, తప్పుందనిపిస్తే చివరిదాకా పోరాడతాడు’... ఆ కితాబు అతడు ఒక్క పూటలో అందుకోలేదు. ఎంతో మంది సీనియర్‌ నేతలున్నా, భాజపా పన్నెండేళ్ల క్రితం జవడేకర్‌ను పార్టీ అధికార ప్రతినిధిని చేసింది. ఆ స్థాయికి చేరుకోవడం వెనక అతడి నాలుగు దశాబ్దాల కృషి ఉంది. వారసత్వంగా అందరూ ఆస్తులూ, అధికారాలూ పంచుకుంటుంటే, ప్రకాశ్‌ అభ్యుదయభావాలూ, నాయకత్వ లక్షణాలనూ అందుకున్నారు. ప్రకాశ్‌ తండ్రి కేశవ్‌ కృష్ణ పాత్రికేయుడిగా పనిచేశారు. వీర్‌ సావర్కర్‌ సన్నిహితుల్లో ఆయనా ఒకరు. తల్లి రజని స్కూలు టీచర్‌. ఆసక్తి ఉన్న వాళ్లకు ఇప్పటికీ ఉచితంగా వేద విద్యను నేర్పిస్తారామె. తల్లిదండ్రులిద్దరి ప్రభావం ప్రకాశ్‌పైన బలంగా పడింది.

విద్యార్థి నాయకుడిగా...
స్కూల్‌ రోజుల్నుంచే ప్రకాశ్‌పైన రాజకీయాల ప్రభావం మొదలైంది. అతడి తండ్రి హిందూ మహాసభకు అధ్యక్షుడిగా పనిచేసేవారు. ఆయన కోసం ఇంటికి వచ్చిపోయే వాళ్లు రకరకాల సమస్యలపైన జరిపే చర్చలు ప్రకాశ్‌ చెవిన పడేవి. డిగ్రీకి వచ్చేనాటికి అతడు కూడా సమస్యలపైన పోరాడాలన్న ఆలోచనకి వచ్చాడు. కాలేజీలో చేరగానే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్‌లో సభ్యత్వం తీసుకున్నాడు. క్రమంగా విద్యార్థులకు ఏ సమస్య వచ్చినా ప్రకాశ్‌ దగ్గరకే రావడం మొదలుపెట్టారు. అలా కొద్ది కాలంలోనే ఏబీవీపీ నాయకుడిగా ఎదిగాడు. క్లాస్‌లో కంటే విద్యార్థుల సమస్యల గురించి ఆందోళన చేస్తూ యూనివర్సిటీ వైస్‌ ఛాన్స్‌లర్‌ ఆఫీసు ముందో, కార్యాచరణ గురించి వివరిస్తూ కాలేజీ మైదానంలోనో ఎక్కువగా కనిపించేవాడు. క్రమంగా ఏబీవీపీ నుంచి భారతీయ జనతా యువమోర్చా జాతీయ కార్యదర్శిగా ఎదిగాడు.

రాజకీయ ఖైదీగా...
బీకాం పూర్తవగానే ప్రకాశ్‌కు బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్రలో ఉద్యోగం వచ్చింది. పొద్దున్న ఆఫీసులో పనిచేస్తూనే సాయంత్రం సామాజిక కార్యక్రమాల కోసం పనిచేసేవాడు. విద్యార్థి నాయకుడిగా కొనసాగుతూ వాళ్ల సమస్యల గురించి అధికారులతో పోరాడేవాడు. ఆ సమయంలోనే దేశంలో విధించిన ఎమర్జెన్సీ అతడి జీవితాన్ని కీలక మలుపు తిప్పింది. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా విద్యార్థులతో కలిసి ప్రకాశ్‌ సత్యాగ్రహం నిర్వహించాడు. పోలీసులు అతణ్ని అరెస్టు చేసి యరవాడ జైల్లో పెట్టారు. అక్కడికెళ్లాకే అతడి ఆలోచనలు ప్రజలూ, సమస్యలవైపు మళ్లాయి. జైల్లో వేర్వేరు ప్రాంతాలూ, పార్టీలకు చెందిన వ్యక్తులందర్నీ ప్రకాశ్‌ ఒక్క తాటిపైకి తీసుకొచ్చాడు. లోపలున్న వాళ్ల మానసిక ధైర్యం దెబ్బతినకుండా ‘నిర్భయ్‌’ పేరుతో కొన్ని గోడపత్రాలను స్వయంగా తయారుచేసి, గాంధీ, మండేలా లాంటి వాళ్లు జీవితంలో ఎదుర్కొన్న పరిణామాలను వాటిపైన రాసి ప్రతి బ్యారెక్‌లోనూ అంటించేవాడు. అలా జైల్లో ఉన్న కాలంలో రాజకీయ ఖైదీలకూ నాయకుడిగా మారాడు.

ప్రేమికుడిగా...
జైల్లో ఉన్న సమయంలోనే ఓసారి ప్రకాశ్‌కు గుండెనొప్పి వచ్చింది. త్వరగా ఆపరేషన్‌ చేయకపోతే ప్రాణాలకే ప్రమాదమని తెలిసినా జైలు అధికారులు అనుమతించలేదు. దాంతో ఖైదీలంతా అతడికి చికిత్స చేయించేవరకూ ఆమరణ నిరాహార దీక్ష చేస్తామని పట్టుబట్టారు. విషయం బయటికి తెలిసి రాజకీయ ఒత్తిడీ పెరగడంతో చికిత్సకు అనుమతించారు. ఆపరేషన్‌ విజయవంతమైందని తెలిసేదాకా జైల్లో ఎవరూ అన్నం ముట్టుకోలేదు. ఆపరేషన్‌ విజయవంతమై తిరిగి జైలుకొచ్చాక ప్రకాశ్‌ జీవితంలో మరో కీలక పరిణామం. రాజకీయ ఖైదీగా ఉన్నప్పుడే అతడు ప్రేమలో పడ్డాడు. అతడు ప్రేమించిన ప్రాచీ అనే అమ్మాయి కూడా సామాజిక ఉద్యమకారిణే. విద్యార్థి నాయకుడిగా ఉన్నప్పుడు ఆమె గురించి తెలిసినా ఎప్పుడూ మాట్లాడలేదు. కానీ ఎమర్జెన్సీ సమయంలో ఆమెను కూడా అరెస్టు చేసి యరవాడ జైల్లో, మహిళా బ్యారెక్‌లోనే పెట్టారని తెలిసింది. ఎలాగైనా ఆమెతో మాట్లాడాలనిపించి ఓ ఉత్తరం రాసి కానిస్టేబుల్‌ ద్వారా ఆమెకు అందేలా చేశాడు. అటు నుంచీ జవాబు వచ్చింది. క్రమంగా ఉత్తరాలూ, ఆ తరవాత మనసులూ ఇచ్చిపుచ్చుకున్నారు. ప్రేమలో ఉన్న వాళ్లకు ఎవరైనా సాయం చేస్తారంటారు... అలా వాళ్లిద్దరి ప్రేమ సందేశాలు చేరవేయడానికి స్వయంగా అక్కడి జైలర్‌ కూడా సాయం చేశాడట. జైలు నుంచి విడుదలవగానే ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అనుకున్నట్లుగానే పదహారు నెలల జైలు జీవితం తరవాత జవడేకర్‌ విడుదలవగానే ఆ జంట ఒక్కటైంది.

బ్యాంకు ఉద్యోగిగా...
జైలు నుంచి రాగానే ప్రకాశ్‌ తన ఉద్యోగం కొనసాగించారు. అతడి సామాజిక దృక్పథం నచ్చి బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర ఛైర్మన్‌, అతడి సెక్రటేరియట్‌లో ప్రకాశ్‌కు అవకాశమిచ్చారు. బ్యాంకు తరఫున థానేలో గిరిజనుల అభివృద్ధి కోసం ప్రకాశ్‌ రెండేళ్లు పనిచేశారు. తరవాత బ్యాంకు ఉపాధి కల్పన విభాగంలో కీలక అధికారిగా కొన్నేళ్లు కొనసాగారు. ఇంకోపక్క సామాజిక ఉద్యమాల్లో పాలుపంచుకుంటున్నా, పూర్తి స్థాయిలో పనిచేయట్లేదన్న అసంతృప్తి అతడిలో పెరుగుతూ వచ్చింది. దాంతో ఒకరోజు భార్య ప్రాచీ దగ్గరకు వెళ్లి ఉద్యోగానికి రాజీనామా చేసి, పూర్తి స్థాయి ఉద్యమాల్లో పాల్గొనాలని అనుకుంటున్నట్లు చెప్పారు. దానివల్ల కుటుంబ బాధ్యత ఆమెపైనే పడుతుందనీ, ఆమె జీతంతోనే ఇంటిని నడిపించాల్సి రావొచ్చనీ వివరించారు. ఆయన భార్య కూడా భర్త నిర్ణయాన్ని సంతోషంగా ఆమోదించడంతో పదేళ్లపాటు చేసిన ఉద్యోగానికి స్వస్తిపలికి పూర్తిస్థాయి రాజకీయ ఉద్యమాల్లోకి ప్రకాశ్‌ అడుగుపెట్టారు.

రాజకీయ నేతగా...
విద్యార్థి నాయకుడి దశ నుంచే ప్రకాశ్‌ పనితీరుని భాజపా గమనిస్తూ వచ్చింది. అందుకే ఉద్యోగాన్ని వదిలిపెట్టగానే అతణ్ని రాజకీయాల్లోకి ఆహ్వానించి భాజపా మహారాష్ట్ర విభాగానికి కార్యదర్శిగా నియమించింది. ఆపైన 1990లో ఎమ్మెల్సీగా తొలి రాజకీయ పదవినీ అందుకున్నారు. అప్పట్లో రాష్ట్ర పరిస్థితుల వల్ల ప్రతి రాజకీయ నేతకూ కట్టుదిట్టమైన భద్రత కల్పించేవారు. ప్రకాశ్‌ బైకు పైన వెళ్తుంటే అతడి ముందూ వెనుకా సెక్యూరిటీ గార్డులు మరో రెండు బైకులపైన వచ్చేవాళ్లు. ఆ దృశ్యం అతడి స్నేహితులకు నచ్చలేదు. ఎమ్మెల్సీ అయినా కారులేకపోవడం చూసి బాధపడ్డారు. అందుకే తన క్లాస్‌మెట్స్‌ ముప్ఫయి మంది కలిసి, తలా పదివేల రూపాయలు చందాలు వేసుకుని ఫియెట్‌ పద్మిని కారుని ప్రకాశ్‌కు బహుమతిగా ఇచ్చారు. విద్యార్థి దశలో తమకు ఎంతో చేసిన ప్రకాశ్‌కు అది చాలా చిన్న బహుమతి అంటారు వాళ్లు. ఇప్పటికీ ప్రకాశ్‌ ఆ కారుని అపురూపంగా దాచుకున్నారు. తనతో చదువుకున్న వాళ్లే తనకు ఇప్పటికీ స్నేహితులనీ, రాజకీయాల్లో పార్టీవాళ్లూ, ప్రత్యర్థులే తప్ప స్నేహితులు ఉండరనీ అంటారు ప్రకాశ్‌.

రైతు బాంధవుడిగా...
ప్రకాశ్‌ పనితీరును ప్రతి దశలో అంచనా వేస్తూ వచ్చిన పార్టీ పెద్దలు ఎమ్మెల్సీగా పనిచేస్తున్నా అతడిని భాజపా మహారాష్ట్ర విభాగానికి కార్యదర్శిగా, ఎన్నికల ప్రచార సారథిగా కొనసాగించారు. వివిధ అంశాలపైన అతడికున్న పరిజ్ఞానంతో సొంత పార్టీతో పాటూ ప్రత్యర్థులనూ ప్రకాశ్‌ ఆకర్షించారు. దానికి గుర్తింపుగా రాష్ట్ర ప్రణాళికా సంఘం కార్యనిర్వాహక అధ్యక్షుడి పదవీ లభించింది. ఓసారి స్నేహితుడితో కలిసి సరదాగా కోల్వన్‌ వ్యాలీ అనే ప్రాంతానికి వెళ్లినప్పుడు ప్రకాశ్‌ అక్కడ గ్రామస్థులు నీళ్లకోసం పడుతున్న ఇబ్బందులు చూశారు. కొండకు ఓ వైపు పెద్ద జలాశయం ఉన్నా, గ్రామంలో మంచి వర్షపాతమే నమోదవుతున్నా డిసెంబర్‌ చివరికల్లా అక్కడ కరవు పరిస్థితులు మొదలయ్యేవి. వెంటనే ప్రకాశ్‌ గ్రామస్థులకు అవగాహన కల్పించి చెక్‌డ్యాంల నిర్మాణాన్ని మొదలుపెట్టించారు. వాళ్ల దగ్గర డబ్బులు లేకపోతే, పండించబోయే వరినే ధరావతుగా చూపించి వ్యాపారుల నుంచి డబ్బులు ఇప్పించారు. అలా ప్రకాశ్‌ చూపించిన చొరవ ఇప్పుడు పదకొండు గ్రామాల్లో నీటి సమస్యను దూరం చేసింది. ఆ విజయం మీడియాతో పాటూ పార్టీనీ ఆకర్షించింది. అనతి కాలంలోనే బీజేపీ మహారాష్ట్ర అధికార ప్రతినిధిగా, తరవాత జాతీయ పార్టీ అధికార ప్రతినిధిగా, రాజ్యసభ సభ్యుడిగా ఎదిగారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో భాజపా ఇన్‌ఛార్జ్‌గా పార్టీ విస్తరణ కోసం కృషిచేశారు. తెలుగు దేశం పార్టీ భాజపాతో కలిసి ఎన్నికల్లో పోటీచేయడం, ఎన్డీయే ప్రభుత్వంలో చేరడం వెనక కీలక పాత్ర ప్రకాష్‌దే. విభజనకు ముందు తెదేపాతో పొత్తు కోసం ఆయన రచించిన వ్యూహాల కారణంగానే భాజపా తెలుగు రాష్ట్రాల్లో స్థిరత్వాన్ని చాటుకుంటోంది. కేంద్ర అటవీ, పర్యావరణ, వాతావరణ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు వాతావరణ మార్పుల పైన ప్యారిస్‌లో జరిగిన సదస్సులో, పర్యావరణ పరిరక్షణ కోసం భారత్‌ తీసుకుంటోన్న చర్యలూ, అన్ని దేశాలూ తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఆయన వివరించిన తీరు అంతర్జాతీయ సమాజం అభినందనలు అందుకుంది. పర్యావరణ మంత్రిగా కాలుష్యానికి కారణమవుతోన్న పరిశ్రమలపైన తీసుకున్న చర్యలూ, పర్యావరణ హిత పథకాలూ, పరిశ్రమలూ, కార్యక్రమాల కోసం చూపిన చొరవే పార్టీని ఆకట్టుకుంది. అదే ఆయనకు మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రిగా క్యాబినెట్‌ హోదాను అందించింది.

‘విద్యార్థి ఉద్యమాల నుంచే నా ప్రస్థానం మొదలైంది. అప్పుడు విద్యార్థిగా నాకు ఎలాంటి అవకాశాలు కావాలని కోరుకున్నానో, ఇప్పుడు మంత్రిగా అలాంటి అత్యున్నత అవకాశాల్నీ, ఉత్తమ విద్యా ప్రమాణాల్నీ యువతకీ, దేశానికీ అందించడానికి ప్రయత్నిస్తా. పేద తల్లిదండ్రులు తమ పిల్లల చదువు కోసం జీవితాల్నే ధారపోస్తారు. అలాంటి వాళ్లకు మంచి విద్యనీ, స్కాలర్‌షిప్‌ల రూపంలో మెరుగైన అవకాశాల్నీ అందుబాటులోకి తీసుకొస్తా’ అని మంత్రిగా బాధ్యతలు చేపట్టాక తన లక్ష్యాన్ని ప్రకటించారు. పట్టుదలతో శ్రమించి ఆ లక్ష్యాన్ని సాధిస్తే- అంతకంటే ఇంకేం కావాలి..!


ఇంకొంత...

రాజకీయాల్లో ఎంత బిజీగా ఉన్నా ప్రకాశ్‌ సామాజిక సేవను పక్కకు పెట్టలేదు. గ్రామీణాభివృద్ధి కోసం పనిచేసే ‘గ్రామ్‌ శక్తి’ అనే ఎన్జీవోకు అధ్యక్షుడిగా పని చేస్తున్నారు.
* ప్రకాశ్‌ భార్య ప్రాచీ ప్రముఖ విద్యావేత్త. ఇందిరా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ డైరెక్టర్‌గా పనిచేశారు. పెద్దకొడుకు అశుతోష్‌ డెంటిస్ట్‌, రెండో కుమారుడు అపూర్వ జవడేకర్‌ చార్టర్డ్‌ అకౌంటెంట్‌..
* పర్యావరణం, వాతావరణ మార్పులకు సంబంధించిన అంశాలపైన ప్రకాశ్‌కు మంచి పట్టుంది. వివిధ యూనివర్సిటీల ఆహ్వానం మేరకు ఇరవైకి పైగా దేశాల్లో పర్యావరణ సంబంధిత అంశాలపైన ప్రసంగించారు.
* బీజేపీ ఎకనమిక్‌ ఫోరమ్‌ బాధ్యుడిగా పనిచేశారు. ఖాదీ కమిషన్‌, ఇన్సూరెన్స్‌ అధికారుల సంఘం, ప్రెస్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా, ప్రజా పద్దుల సంఘం... ఇలా సుమారు పాతిక సంస్థల్లో కీలక స్థానాల్లో సేవలందించారు.
* ప్రకాశ్‌కు విహారయాత్రలంటే చాలా ఇష్టం. వంటలో చాలా వెరైటీలు అద్భుతంగా చేయగలరు. జైల్లో ఉన్నప్పుడు సహచరులతో పాటూ జైలు వంటవాళ్లకు కూడా పాకశాస్త్ర మెలకువలు నేర్పించారు. టేబుల్‌ టెన్నిస్‌ ఆడతారు. ట్రాక్టర్‌ను బాగా నడిపిస్తారు.
* గ్రామీణాభివృద్ధిలో బ్యాంకుల పాత్రపైన ఆయన ప్రచురించిన అధ్యయన పత్రానికి జాతీయ అవార్డు దక్కింది. మరాఠీలో చాలా పుస్తకాలు రాశారు. నిరుద్యోగం, గ్రామీణాభివృద్ధి, రాజకీయ అంశాలపైన పత్రికల్లో బోలెడన్ని వ్యాసాలు రాశారు.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.